Parimala Pari

Children Stories Classics Inspirational

4  

Parimala Pari

Children Stories Classics Inspirational

సుసాధ్యం

సుసాధ్యం

2 mins
397



"బామ్మా నేనూ పాలు పితుకుతానే !" అన్నాడు నాల్గవ తరగతి చదివే సుహాస్ బామ్మ తో పాటు పొలం గట్టు మీద కూర్చుని ఆవుని చూస్తూ.

"నీకెందుకు సువాస్ బాబు ఈ కట్టం, నువ్వు సక్కా సదూకుని పట్టమెల్లి ఉద్దేగం సెయ్యాల, అదే రా నా ఆస" అంది రత్తమ్మ.

"బామ్మా అలా కాదు నా పేరు సుహాస్, సువాసు కాదు, ఎన్ని సార్లు చెప్పాలి నీకు?" అడిగాడు రత్తమ్మ మాటలకు.

"మరి పల్లెటూరి దాన్ని నా బాస ఇంతే, నాకు నోరు తిరగదు నీలా మాట్టాడాలంటే. అందుకే నిన్ను సక్కా సదువుకోమని సెప్పేది. మంచిగా సదుకుని మీ అయ్య పేరు నిలవెట్టాల!" అంది రత్తమ్మ.

"బామ్మా నేను మంచిగానే చదువుతున్నానే, బాగా చదివి మన పొలంలో మంచి పంటలు వేసి మంచిగా డబ్బు సంపాదిస్తాను. అప్పుడు మన కష్టాలు అన్నీ తీరిపోతాయి లే బామ్మ" అన్నాడు.

ఆ మాటకు ఖంగుతిన్న రత్తమ్మ "ఆర్ని నువ్వు కూడా మీ నాయన లెక్క చదివి, మల్ల యవసాయం సేత్తానంటివా? మీ నాయన కూడా అంతే, పట్టం పోరా అంటే ఇక్కడ్నే ఉంటా, ఎదో కొత్త రకం పంటలు అంటా వేసేడు. కానీ తుపాను వల్ల అయాన్ని కొట్టుకుపోనాయి. అప్పులే మిగిలెనయి. అప్పులు తీర్సలేక మీ నాయనా మీ అమ్మ దగ్గరకి పోయిండు. అప్పటిసంది నీ మీదనే నా పానాలు ఎట్టుకుని బతుకుంతుండా, నువ్వు మీ అయ్య లెక్కనే అంతవేంట్ర? నువ్వైనా పట్టం పోయి పెద్ద ఉద్దేగాం సూసుకోరా బాబు" అంది బాధగా.

బామ్మని ఓదార్చటానికి "బామ్మా, ఇటు చూడు రైతులు-పంటలు అని మా టెస్ట్బుక్ లో ఉంది. పెద్దయ్యాక నేనూ ఇలానే చేస్తా చూడు" అంటూ తన చేతిలో ఉన్న పుస్తకంలో పాఠాన్ని బామ్మకి చూపించాడు.

సర్లే పెద్దయ్యాక చూద్దాం అనుకుంది రత్తమ్మ. కానీ పెరిగేకొద్దీ అదే మాట ప్రకారం సుహాస్ చేస్తూ ఉండటం చూసి ఆశ్చర్యం బాధ కలిగాయి రత్తమ్మకి.

"బామ్మా నువ్వేం బాధపడకు. నేనున్నా కదా, ఏది ఏమైనా నేను నాన్న లాగా చనిపోయేంత పిరికివాణ్ణి మాత్రం కాదు. కొన్నాళ్ళు ఎదురు చూస్తు ఉండు, అంతా నీకే తెలుస్తుంది." అన్నాడు.

******

కాలక్రమంలో సుహాస్ పెద్దయ్యి ఆర్గానిక్ ఫార్మింగ్ లో డిగ్రీ చేసాడు. పురుగుల మందులు చల్లకుండా కూరగాయల్ని పండించి, చుట్టుపక్కల వాళ్ళతో కూడా అదే పని చేయించాడు.

అంతేకాకుండా వాళ్ళ పంటల్ని సిటీ మార్కెట్లో అమ్మటం కూడా తనే చూసుకుంటున్నాడు. రైతులందరితో మీటింగ్ పెట్టి, సుహాస్ గొప్పతనం గురించి స్టేజీ మీద ఊరి పెద్దలు పొగుడుతూ ఉంటే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైయ్యింది రత్తమ్మ.

తర్వాత సుహాస్ మాట్లాడుతూ, "నేను ఈ స్థాయికి రావటానికి ముఖ్య కారణం మా బామ్మ! ఆవిడే నన్ను చిన్నప్పటి నుంచీ పెంచి పెద్దచేసి ఇప్పుడు నన్ను ఇలా మీ అందరిముందు నిలబెట్టింది. ఆవిడే లేకపోతే నేను లేను. ఈ సన్మానం మా బామ్మకే జరగాలి. బామ్మా ఇలా రా!" అంటూ స్టేజికి ఒక మూలగా కూర్చుని కళ్లోత్తుకుంటున్న రత్తమ్మని చూపించాడు అందరికీ.

అందరూ రత్తమ్మ, బామ్మా అని అరవటం మొదలుపెట్టారు. సుహాస్ తనే బామ్మని స్టేజి ఎక్కించి, తనకి చెయ్యాల్సిన సన్మానాన్ని బామ్మకి చేయించాడు.

ఆ మాటలకి, అతను చేసిన పనికి కళ్ళలో ఆనందభాష్పాలు రాలాయి రత్తమ్మకి.

సమాప్తం...


Rate this content
Log in