Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

Parimala Pari

Abstract Drama Tragedy


4.7  

Parimala Pari

Abstract Drama Tragedy


జ్ఞాపకాల అలలు

జ్ఞాపకాల అలలు

4 mins 306 4 mins 306

ప్రేమ అంటే అందరికీ అందేది కాదు, కొందరికి తీపి జ్ఞాపకాన్ని ఇస్తే మరికొందరికి చేదు జ్ఞాపకాలను మిగుల్చుతుంది. నా తొలి ప్రేమ గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను.


జ్ఞాపకం అంటే జరిగిపోయిన సంఘటనలు గుర్తు తెచ్చుకోవటం. కాలాన్ని వెనుకకి మళ్లించలేము కాబట్టి గతాల ఆనవళ్ళలో మనం వాటిని వెతుక్కుంటూ ఉంటాము. కొన్ని సంఘటనలు, వ్యక్తులు, పరిచయాలు, ప్రదేశాలు చాలా ఉంటాయి మన గత జ్ఞాపకాలలో. కొన్ని తీపి జ్ఞాపకాలు అయితే మరి కొన్ని చేదు అనుభవాలు.


బాల్యం లో ప్రతిదీ ఒక తీపి జ్ఞాపకమే. యవ్వనం లో తెలిసి తెలియని వయసులో ఎదురయిన సంఘటనలు, పరిచయం అయిన వ్యక్తులు, వాటి పరిణామాలు ఒక్కోసారి మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి.


నా పేరు వేద. నేను బిటెక్ చదువుతున్న రోజులు అవి. మా పక్క ఊర్లో ఉంది మా కాలేజ్, రోజు బస్ లో వెళ్లి వచ్చేదాన్ని.. మా పక్కింట్లో ఉండేవారు మా ఆంటీ వాళ్ళు (దూరం బంధువులే కానీ వరసకి అత్త). వాళ్ళ అబ్బాయి నితిన్, తను బిటెక్ పూర్తి చేసి ఏవో ఎంట్రన్స్ టెస్ట్ లు రాస్తూ ఇంటి దగ్గరే ఉన్నాడు. అప్పటివరకు నితిన్ వేరే ఊర్లో చదివి అప్పుడే వచ్చాడు మా ఊరికి.


వరస అవ్వటం వల్లన మా ఇద్దరికీ కొన్నాళ్లకే చనువు బాగా పెరిగింది. నేను బిటెక్, తను బిటెక్ కాబట్టి తను నాకు చదువులో హెల్ప్ చేస్తూ ఉండేవాడు. సెకండ్ ఇయర్ లోనే మిని ప్రాజెక్ట్ కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్నాను బావ దగ్గర.


రోజు ఏదో ఒక వంకతో వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని. అలా మా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. తను కూడా నాతో ఎంతో చనువుగా ఉండేవాడు. మేము ఇద్దరం ఒకే రూం లో మాట్లాడుకుంటూ ఉన్నా, మా పెద్ద వాళ్ళు కూడా పట్టించుకునే వారు కాదు.ఒక్కోసారి కాలేజ్ కి అని చెప్పి వెళ్లి, కాలేజి మానేసి బావతో షికార్లు వెళ్లే దానిని. బావ కాలేజ్ కి కొంచం దూరంలో నాకోసం బయట వెయిట్ చేసేవాడు, నేను ప్రిన్సి కి ఏదో సాకు చెప్పి బయటకి వచ్చేసేదాన్ని. అలా మేము ఇద్దరం సినిమాలకి కూడా వెళ్లే వాళ్ళం.కొన్నాళ్ళు బావ ఏదో ప్రాజెక్ట్ మీద చెన్నై వెళ్ళాడు. తను లేని ఆ రోజులు నాకు నరకంలా అనిపించేవి. చుట్టు అందరూ ఉన్నా, ఏదో వెలితిగా ఉండేది. రోజు నైట్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు, ఒక్కరోజు తన మాట్లాడకపోయినా నాకు నిద్ర పట్టేది కాదు.అప్పుడు నాకు తెలిసింది, మా ఇద్దరిమధ్య ఉన్న బంధం స్నేహం మాత్రమే కాదు అని, అది ప్రేమ అని.

బావ ఊరినుంచి రాగానే ఈ విషయం తనతో చెప్పాలి అనుకున్నాను. అనుకున్నట్టు గానే బావ చెన్నై నుంచి రాగానే మావయ్య వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గరకి తీసుకు వెళ్ళాడు. అక్కడే నా ప్రేమ విషయం బావకి చెప్పాను.


"బావా! నువ్వంటే నాకు పిచ్చి. మనం పెళ్ళి చేసుకుందామా?" అన్నాను.


"ఇప్పుడే పెళ్ళెంటే, ఇంకా నేను సెటిల్ అవ్వాలి, నీ చదువు అవ్వాలి, నువ్వు జాబ్ చేయాలి. అప్పుడు ఆలోచిద్దాం కానీ, నీ చదువుని అశ్రద్ధ చేయకు" అని చెప్పాడు.


"ఈలోగా ఒక తీపి జ్ఞాపకం గా ముద్దు కావాలి" అని అడిగాడు. కాదన్నాను నేను. పెళ్ళి చేసుకుంటే అప్పుడు అన్ని ఇస్తా అన్నాను.


ప్లీజ్ వేద అని బ్రతిమాలాడు. ఒప్పుకోలేదు నేను. తనకి కోపం వచ్చింది. పోవే కొంచమ్ కూడా సరదా లేదు అన్నాడు. అప్పుడు రెండు రోజులు నాతో మాట్లాడలేదు. ఆ తర్వాత మళ్ళీ మాములే .అలాగ నా స్టడీస్ అయిపోయేవరకు మళ్లీ మా ఇద్దరు మధ్య ఆ ప్రస్తావన రాలేదు. బావ తన బిజినెస్ ప్లాన్, ప్రాజెక్ట్స్, కోర్సు లు అంటూ తిరుగుతూ ఉండేవాడు. తర్వాత హైదరాబాద్ లో ఏదో ప్రోజెక్ట్ చేస్తున్నాడు బావ.


అదే టైమ్ లో నేను ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ బావ నీ కలవాలని చాలా ట్రై చేశాను. కానీ తను హైదరాబాద్ వెళ్ళినప్పటి నుంచీ నాతో సరిగ్గా మాట్లాడటం మానేశాడు. ఒకసారి వాళ్ళ ఇన్స్టిట్యూట్ కి నేనే వెళ్ళాను. అక్కడకి వెళ్లి తనని బయటకి రమ్మని కాల్ చేసి, నేను బయట నించున్నాను. ఎలాగైనా తనని కలవాలి అని ఎందుకు నాతో మాట్లాడటం లేదు అని అడగాలని అనుకున్నాను.ఈలోగా బావ బయటకి వచ్చి "ఎందుకు వచ్చావ్?" అని అడిగాడు. ఆ క్షణం నా కన్నీళ్లు ఆగలేదు.


"అదేంటి బావా అలా అంటావు, మనం ప్రేమించుకుంటున్నాం కదా, నిన్ను కలవాలి అనుకోవటం తప్పా?" అని అడిగాను.


"చూడు వేద, ఇప్పుడు కాదు అవన్నీ మాట్లాడేది, నువ్వు ముందు రూమ్ కి వెళ్ళిపో, రేపు సండే కలుద్దాం అప్పుడు మాట్లాడుకుందాం" అన్నాడు.


సరే కలిశాడు కదా అన్న ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను. సండే టాంక్ బండ్ దగ్గరకి తీసుకు వెళ్ళాడు. బుద్ధుడి విగ్రహం వరకు బోట్ లో వెళ్లి, అక్కడ కూర్చున్నాం.."ఎందుకు అలా మాటిమాటికీ ఫోన్ చేసి విసిగిస్తావు, ఎంటి నీ బాధ?" అని అడిగాడు బావ. ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు.


"ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఉండలేను" అన్నాను.


"ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు, నాకు చాలా బాధ గా ఉంది తెలుసా?" అని అడిగాను, ఏడ్చాను.


"వేద నీకొక విషయం చెప్పాలి" అని నెమ్మదిగా మొదలు పెట్టాడు. అప్పుడు చెప్పాడు తను హైదరాబాద్ వచ్చి ఏదో పార్ట్-టైం జాబ్ చేస్తూ ఉండగా వాళ్ళ కొలీగ్ చెల్లి శ్రావ్య నీ కలిశాడట. శ్రావ్య తనని ప్రేమిస్తున్నాను అని చెప్పిందట. మెల్లగా బావ కూడా శ్రావ్య నీ ప్రేమించటం మొదలు పెట్టాడట.


శ్రావ్య వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు ఇంకా మన ఇంట్లో వాళ్ళని ఒప్పించటమే, నాన్నగారు, బామ్మ నేను ఏం చెప్పిన వింటారు కాదనరు. అంటూ ఏవేవో చెప్తున్నాడు ఇంకా.


"ఒక్కసారి ఆపు బావా, మరి నా సంగతేంటి?" అని అడిగాను.


"నువ్వు వేరే ఎవరినైనా చేసుకో, నీకు మంచి సంబంధం నేను చూస్తాను" అన్నాడు.


"ఏమీ అవసరం లేదు" అని ఏడుస్తూ కూర్చున్నాను. ఎంత ట్రై చేసిన కన్నీళ్లు ఆగట్లేదు.


కాసేపటికి "అందరూ చూస్తున్నారు, పద వెళ్దాం!" అన్నాడు.


తప్పక అక్కడి నుంచి బయటకి రావటానికి బావతో వచ్చాను. వెంటనే నన్ను రూం దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపో అన్నాను సీరియస్ గా. సరే అని హాస్టల్ దగ్గర దించి ఏదో చెప్పాలని చూసాడు."సారీ రా, ఎందుకో తెలియదు అది అలా జరిగిపోయింది. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు శ్రావ్య అంటే నాకు ప్రాణం. తను నన్ను విడిచి ఉండలేదు" అన్నాడు.


"ఒకప్పుడు నేను కూడా ఇదే మాట చెప్పాను బావ నీకు" అన్నాను నేను. తన దగ్గర ఏం సమాధానం లేదు. మౌనంగా వెళ్ళిపోయాడు.నేను దూరంగా ఉన్నాను కాబట్టి శ్రావ్య తనకి దగ్గర అయ్యింది. అలా మనసు మార్చుకునే వాడు దగ్గర అవ్వకపోవటమే మంచిది అనిపించింది నాకు. ఆ తర్వాత తను ఎన్ని సార్లు కలిసి మాట్లాడిన నేను ఏమి మాట్లాడలేదు. కానీ వరసకి బావ కదా వాళ్ళ ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు అన్ని నేనే చూసుకున్నాను.తనకి పెళ్ళి అవుతూ ఉంటే పెళ్ళి మంటపానికి దూరం గా కూర్చొని నా బాధ ఎవరికి కనిపించకుండా నాలో నేనే ఏడ్చాను. ఆ తర్వాత కూడా ఏడ్చి ఏడ్చి అలసిపోయాను.కాలం గాయాన్ని మాన్పుతుంది అంటారు కదా, అలా కొన్నాళ్ళకి అంతా నెమ్మదిగా మారుతూ వచ్చింది. ఆ ఆలోచనల నుంచి బయట పడ్డాను. ఇప్పుడు నాకు పెళ్లి అయ్యి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మా వారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అలాంటి వ్యక్తి దొరకటం నా అదృష్టం. మా వారితో కలవటం కోసమే నేమో దేవుడు మా బావని నాకు దూరం చేశాడు అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ అప్పుడప్పుడు ఆ జ్ఞాపకాల అలలు నన్ను తాకుతూ, తడిపేస్తూ ఉంటాయి...


Rate this content
Log in

More telugu story from Parimala Pari

Similar telugu story from Abstract