Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Ram Babu Vavilapalli

Drama Inspirational


5.0  

Ram Babu Vavilapalli

Drama Inspirational


తెలియక పోతే తప్పా!!

తెలియక పోతే తప్పా!!

8 mins 397 8 mins 397

ఈ మధ్యనే మా ఆఫీస్ సూపరింటెండెంట్ వెంకట్రావు పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళాను. కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఇంతలో పక్కనే కూర్చున్నవెంకట్రావు, "సార్ నేను 39 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత సడన్ గా రేపట్నుంచి ఆఫీస్ కు రావాల్సిన అవసరం లేదు అంటే ఎదో వెలితిగా ఉంది", అంటూ గుసగుసలాడాడు.


"అదేంటయ్యా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఉద్యోగం బోర్ కొట్టలేదా?" అని కాస్త వెటకారమాడాను. 


"సార్ నిజానికి నాకిప్పుడు 65", వెంకట్రావు నిజం కక్కేసాడు.

"అదెలా?" అంటూ అమాయకపు ముఖం పెట్టాను.

"ఒక 6 సంవత్సరాలు తక్కువ రాయించుకున్నాను సార్"

"అదేంటి, డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ వగైరా....." అని పూర్తి చేసే లోపే, 

"పుట్టిన తేదీ తో పనేముంది సార్" అంటూ ఆ రోజుల్లో ఉన్న వెసులుబాటును గుర్తు చేసాడు. 


కార్యక్రమం ముగిసింది. నా కారు కదిలింది. మా డ్రైవర్ సహజంగానే చాలా జోరుగా పోనిస్తాడు. అంత కంటే జోరుగా నా ఆలోచనలు కదులుతున్నాయి. "పుట్టిన తేదీ తో పనేముంది సార్" అన్న వెంకట్రావు మాటలు నా గుండె లోతుల్లో దాగి ఉన్న స్వీయ అనుభవాన్ని తట్టి లేపాయి. 


అవి తొమ్మిదో తరగతి తరువాత వచ్చిన వేసవి సెలవలు. ఒక రోజు గడపలో ఉన్న తిరగలి పై అమ్మ పప్పు విసురుతోంది. పక్కనే అన్నం తింటున్న నేను, "అమ్మా, ఇంతకీ నేనెప్పుడు పుట్టాను?", అని ఒక విచిత్రమైన ప్రశ్న సంధించాను. 


"ఇదేం ప్రశ్న రా?", అని అమ్మ చిరాకు పడింది.


"అంటే, నిన్న నాన్న బోను పెట్టెలోని దస్తావేజులు తీసినప్పుడు ఒక కాగితం కనపడింది. అందులో వాళ్ళ ముగ్గురవి పుట్టిన తేదీలు రాసి ఉన్నాయ్. కానీ నాదే లేదు", అంటూ కాస్త గొనిగాను.

"అయితే?", అమ్మ మళ్ళీ విసుక్కుంది. 

"పైగా నా ఫ్రెండ్స్ అందరికి పుట్టిన తేదీలు తిథులతో సహా ఉన్నాయి?"

"నీకూ ఉంది కదా! నీకు తెలియదా?"

"ఆ..ఉందిలే. అది కరెక్ట్ అని ఎప్పడూ అనిపించలేదు. పైగా నిన్న ఆ కాగితం చూసిన తర్వాత ఉన్న కాస్త నమ్మకం కూడా పోయింది. కనీసం నువ్వన్నా చెప్పమ్మా", నేను మారాం చేశాను.


వీడు వదిలేలా లేడని అమ్మకు అర్థం అయ్యింది. సుమారు పద్నాలుగు సంవత్సరాల గతాన్ని నెమరు వేసుకొంటూ, "నువ్వు పోలాల అమావాస్యకు రెండు రోజులు ముందు పుట్టావురా" అంది. 


ఆ సమాధానం తో, వరల్డ్ కప్ ఫైనల్ లో చివరి బాల్ కి సిక్సర్ కొడితే ఎగిరి గంతెద్దామని చూస్తున్నప్పుడు క్లీన్ బౌల్డ్ అయితే వచ్చే నైరాశ్యం నన్ను ఆవహించింది. అయినా నా ఉత్సుకత చావలేదు. 


"కనీసం ఏ సంవత్సరం లో పుట్టానో చెప్పమ్మా", అని చిగురాశతో అడిగాను.


"గుర్తుందా, ఒక సంవత్సరం మన ఊరు మొత్తం కాలిపోయింది, మన పెంకుటిల్లు తప్ప. అయినా ముందింటి గుగ్గిలం దూలాలు కాలి పోయాయి. అప్పుడే మీ తాత గారు ఈ డాబాను కట్టించారు. ఆ ప్రమాదం జరిగిన అయిదు సంవత్సరాలకు నువ్వు పుట్టావు", అని ముగించింది. 


అది విన్న తర్వాత గుడ్ది కంటే మెల్ల నయం అనిపించింది. అప్పుడు కొత్త ప్రశ్నలు మొలకెత్తాయి. ఊరు ఎప్పుడు కాలిపోయింది? ఆ విషయం ఎవరికి తెలుస్తుంది? 


వెంటనే ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఉన్నఫలంగా వాకిట్లోకి పరిగెత్తాను. మా డాబా డూమ్ వైపు చూసాను. మా తాత గారు చేసిన ఒక మంచి పనేంటంటే ఇల్లు కట్టించిన సంవత్సరాన్ని ఇంటి డూమ్ పైన రాయించారు. ఒక్కసారిగా 'యూరేఖ!!' అన్న ఫీలింగ్ కలిగింది. 


ఈ క్రమంలో ప్రస్నోత్తర పరంపర కొనసాగింది. అయినా అమ్మ నాన్నలకి తెలియక పోవడమేంటి? సరే అక్షర జ్ఞానం లేని వాళ్ళు. పుట్టిన రోజులు జరుపుకుంటారని తెలియని వాళ్ళు. అయినా ఎన్నని గుర్తు పెట్టుకుంటారులే. ఆరుగుర్ని కన్నారు. ఇద్దరు కాలం చేయగా నలుగురం మిగిలాం. సరే, నా ఒక్కడికే ఇలా ఎందుకు జరిగింది? 


అది సరే, పేరు పెట్టిన పంతులు ఏం చేసాడు? మామూలుగా బారసాలకు ముందు తేదీ, తిధి, నక్షత్రం అన్నీ ఒక పసుపు రాసిన కాగితం మీద రాసి ఇస్తాడు కదా? చాంతాడంత పూజ సామాగ్రి రాసిన కాగితం మీద ఎదో మూల నా పుట్టిన తేదీ వివరాలు రాసేసి ఉంటాడు. బారసాల కోలాహలం లో 'గాలికెగిరి పోతోంది మొర్రో' అని నేను రాని భాషలో ఏడ్చి గీ పెట్టిన పట్టించుకోకుండా కార్యక్రమం ముగించేసి ఉంటారు. దారం తెగిన గాలి పటంలాగా ఆ కాగితం ఎక్కడుందో? 


దీని అవసరం పడ్డ మనుషులు ఇంకెవరు ఉంటారు? అలా సాగుతున్న నా ఆలోచన స్రవంతి లో తారస పడ్డాడు మా 'చుట్టల మాస్టారు'. ఈయన గారు మా ఊరి బడి పంతులు. మహా పిసినారి. రైతులిచ్చిన కూరగాయలతో సంచి నిండనిదే బడి చివరి గంట మోగదు. ఈయన ధూమపాన శిరోమణి. మనిషి శ్వాస క్రియ ఎంత నిర్విరామమో ఇతని ధూమ పాన యజ్ఞం అంత నిర్విఘ్నం. పెదాల మధ్య ఆహుతౌతున్నా చుట్ట పీలికతో చేతిలో ఉన్న మరో చుట్టను ఆయన వెలిగించడం ఒలింపిక్ జ్యోతి ని తలపిస్తుంది. 


ఒక రోజు అక్షరాభ్యాసం కోసం నన్ను బడికి తీసుకొచ్చారు. కొత్త బట్టలు తో పాటు ఒక పలక, బలపం, ఒక గొనె సంచి - ఇవీ నా జ్ఞాన సముపార్జన యజ్ఞానికి మొదటి పనిముట్లు. మీ డౌట్ నాకు అర్ధమయ్యింది, 'ఆ గొనె సంచి ఎందుకనేగా?' అక్కడకే వస్తున్నా. మాది పేరుకే బడి కానీ నిజానికది పశువుల శాల. వాటి ఆరుబయట మేత సమయం లో మాకు పాఠశాల. ఆ గొనె సంచే మా మాయా చాప. మొత్తానికి మొదటి రోజు ముగిసింది. ఓనమాలు దిద్దించారు. కానీ ఇంకా రిజిస్టర్ లో నా పేరు పుట్టిన తేదీ ఎక్కించలేదు. 


ఆరోజు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు మాస్టారు చురకలు ఏవిదంగా పెడతారో కళ్ళకు కట్టినట్టు కొందరు ముదురు బుడతలు చెప్పారు. దాంతో భయం మొదలైంది. తెల్లవారింది. చురకలే గుర్తొచ్చాయి. బడి మొదలవడం, నేను పొలానికి పారిపోవడం, చుట్టల మాస్టారు నా కోసం ఇంటికి రావటం - ఇలా చాలా రోజులు, నెలలుగా దాగుడు మూతలు కొనసాగాయి. నేను బాగా ఆడాను. మాస్టారు అలిసిపోయి ఆశ వదులుకొన్నారు. 


వేసవి సెలవలు కూడా అయి పోయాయి. అందరూ మళ్ళీ బడికి వెళ్లడం మొదలు పెట్టారు. నాకూ బోర్ కొట్టింది. నేనూ బడికి వెళ్ళాను. మళ్ళీ అదే పలక, బలపం, గొనె సంచి. 

"ఏం చేస్తాం, తప్పలేదు!" అన్న ఫీలింగ్ లో నేను.

"వచ్చావుగా! ఎక్కడికి పోతావ్. నీ సంగతి చూస్తాలే!" అన్న ఫీలింగ్ లో మాస్టారు. 

మొత్తానికి పశువులు కనికరిస్తే అక్షరానికి ఆశ్రయం దొరికిన ఆ "శాల" లో నేను, మాస్టారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. 


నేనెటూ పోనని ఆయనకు నమ్మకం కుదిరినట్టుంది. ఈసారి రిజిస్టర్ లో నా పేరు చేర్చాడు. దాంతోపాటే పుట్టిన తేదీ కూడా పాళీ పెన్నుతో బర బరా గీకేసాడు. అసలు మా అమ్మ నాన్నలను అడిగాడో లేదో! జనన మరణాలు నమోదు చేసే కరణం గారినైనా సంప్రదించాడో లేదో తెలియదు కానీ, ఒక జన్మ కు సరిపడా ప్రతీకారం మాత్రం తీర్చుకున్నాడు. పశువులు పోగానే రావడం, గంట కొట్టగానే పోవడం తప్ప ఏమి తెలియని నాకు నా జన్మ రహస్యం ఈసారి సిరాపాలైందని అప్పుడు తెలియరాలేదు. 


అలా సంవత్సరాలు గడిచి పోయాయి. పదవ తరగతి పాస్ అయ్యాను. స్కూల్ సెకండ్ వచ్చింది. మొట్ట మొదటి సారిగా ఒక సర్టిఫికెట్ చేతికి వచ్చింది. అందులో నా మార్కులు కంటే ఆసక్తిగా నా డేట్ అఫ్ బర్త్ ను వెతికాను. 'జనవరి 1 ' ఎక్కిరిస్తూ కాగితం మీద కూర్చుంది. ఇంతకాలం పల్లెటూళ్ళో గడిపిన నాకు, ఎన్నో పండగలు తెలుసు, పుట్టిన రోజు పండగ తప్ప! అలా 'పెట్టిన' పుట్టిన రోజు కాగితం పైనే మూగబోయింది. 


ఇక దుంపల బడి చదువు ముగిసింది. కాలేజీకి వెళ్ళాను. కొత్త పరిచయాలు మొదలయ్యాయి. కొందరు నాలా ఊరు వాళ్ళైతే మరి కొందరు సిటీ కుర్రోళ్ళు. సెలెబ్రేట్ చేసుకోవడానికి కారణాలు వెతికేవాళ్ళం. క్యాలెండర్లోని పండగలు సరిపోయేవి కాదు. అదే ఊపులో 'న్యూ ఇయర్' కూడా మా లిస్ట్ లో చేరింది. మా ఫ్రెండ్స్ అందరికి నా పుట్టిన రోజు ముచ్చటేసింది. కేక్ కటింగ్ లు మొదలయ్యాయి. అలా కాగితానికే పరిమితమైన నా 'జనవరి 1 ' కొవ్వొత్తి వెలుగులో సుతిమెత్తని కేక్ పైకెక్కింది. కేక్ తింటూ, "ఇది అసలుదా, సర్టిఫికెట్ దా? అని అడిగే వాళ్ళు, అలాగే నిజం చెబితే పట్టించుకోని వాళ్ళూ ఉన్నారు. అందరికీ ఒకటే సందర్భం - 'న్యూ'తన సంవత్సరం. మందు, చిందు, విందు అన్నింటికీ ఒకే వేదిక - నాది కానీ నా పుట్టిన రోజు వేడుక. 


అలా చాల క్యాలెండర్లు మారాయి. 17 వ ఏటనే చదువుకి కామా పెట్టి ఉద్యోగం వేట మొదలు పెట్టాను. 

ఒక ఇంటర్వ్యూ లో, "ఇది నీ అసలు పుట్టిన రోజా?" అని అడిగారు. 

'నాకున్నది ఇదొక్కటే!" అని వాపోవడం నా వంతైంది.

ఇంకోసారి, తన సుతిమెత్తని చేతులతో నా బయో డేటా ని పట్టుకొని, "ఇలాంటి బర్త్ డే నాకుంటే ఎంత బాగున్నో!", అని ముచ్చట పడింది నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న HR మేనేజర్.

ఇలా ఇంటర్వ్యూలు చేసేవాళ్లకు కూడా నా పుట్టిన తేదీ మీద ఆసక్తి, సందేహం, అసూయ ఒకేసారి కలిగేవి. 


ఒక రోజు నేను నా ఫ్రెండ్స్ విస్సు, బాలు కలిసి ఇంకొక ఫ్రెండ్ శ్రీను గాడి ఊరు వెళ్ళాం. శ్రీను గాడు, వాడి బావ మాకు చక్కటి మర్యాదలు చేసారు. శ్రీను గాడి బావ టెన్షన్ అంతా శ్రీను గాడి పెళ్లి గురించే. ఒక జ్యోతిష్యుడ్ని కూడా తీసుకొచ్చాడు. ఆయన శ్రీను గాడి జాతకం చూసి పెళ్లి శుభ యోగం తేల్చి చెప్పేసాడు. 


ఇక కొసరుగా మిగిలింది మేం ముగ్గురమే. ఇలాంటి విషయాల్లో ముందుండే బాలు, ఆయన అడక్కుండానే తేదీ, తిధి, నక్షత్రం వగైరా గుక్క తీయకుండా చెప్పడంతో పాటు హస్త రేఖ ప్రదర్శన కూడా చేసాడు. "నీకు మహారాజ యోగం ఉంది నాయన!", అని అనడంతో బాలు గాడికి కిరీటంతో సింహాసనం మీద కూర్చున్నట్టనిపించింది. 


తర్వాత విస్సు గాడు కాస్త మొహమాటం గానే చెయ్యి చూపించాడు. "నీకు త్వరలోనే సింగపూర్ విమాన యానం ఉంది బాబు!", అనగానే విస్సు గాడు పాస్పోర్ట్ ఆలోచనల్లో పడ్డాడు. 


ఇక అందరు కలిపి ఒక్కసారిగా నా వైపు చూసే సరికి, నేను జాతకాలాయన ముఖం చూసాను. "నా పుట్టిన తేదీ తెలియదు, నక్షత్రం కరెక్టో కాదో తెలియదు, మీరు పెద్దగా చేసేదేమి ఉండదు", అనేసరికి పాపం గురువు గారి అహం దెబ్బ తింది. "ఎంత మాట. ఫర్వాలేదు, నీ చెయ్యి చూపించు", అన్నాడు. గ్రాఫ్ పేపర్ లా కన్పించిన నా చెయ్యి చూసి, "ఈ రేఖలేంటి నాయన, ఇన్ని శాఖలుగా ఉన్నాయి. వీటి ముడి విప్పడం, నీ భవిత కధ చెప్పడం నా వల్ల కాదు", అని సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోయాడు.


అలా ఇంటర్వ్యూ ల కెళ్ళడం, ఉద్యోగాలు మారడం, ఫ్రెండ్స్ తో పార్టీలు, సినిమాలు, షికార్లు తో నా టైం నాలుగో గేర్ లో వెళుతోంది. కానీ నా మనసు మాత్రం, "ఇది కాదు నాకు కావాల్సింది", అంటూ ఒకటే నస పెట్టడం మొదలెట్టింది. దాంతో ఆలోచనలో పడ్డాను. 


ఇంతలో నేను రాసి, 'Competition Success Review (CSR )' magazine కు పంపిన ఒక ఇంగ్లీష్ వ్యాసానికి ఫస్ట్ ప్రైజ్ రావడమే కాకుండా నా ఫోటో తో పాటుగా ప్రింట్ అయ్యింది. ఆ రోజు, నా ఫ్రెండ్ విస్సు, "నీకు మంచి విచక్షణ, విశ్లేషణ శక్తి ఉన్నాయి. నువ్వు ఏదైనా మంచి ఉద్యోగం ట్రై చెయ్యొచ్చు అన్నాడు". అదే యావ లో ఉన్న నా మనసుకి ఆ మాటలు గులాబ్ జామ్ కంటే తియ్యగా అనిపించాయి. అలా మొదలైంది 'సివిల్ సర్వీసెస్' కోసం నా ప్రయత్నం. 


ఉద్యోగం, IAS Exam కి ప్రిపరేషన్ సమాంతరంగా సాగేవి. ఐఏఎస్ మత్తులో ఉండే చాల మంది పరిచయమయ్యారు. వాళ్ళని వీక్ ఎండ్స్ లో కలిసే వాడ్ని.


"భయ్యా అందరూ దేవుడు చేసిన మనుషులే కదా, మరెందుకు ఇన్ని అసమానతలు", ప్రిపరేషన్ లో బాగా విసిగి పోయిన ఒక మిత్రుడు నిట్టూర్చాడు.


"కానీ, మనుషులు చేసిన దేవుడు అని నేను నమ్ముతాను", అనే సరికి, నా వైపు ఒక్క సారి చూసాడు.


"అదెట్లా భయ్యా?"


"మనిషికి తెలియనిది చాలా ఉంది. రేపు అనేది ఒక భ్రమ. ప్రకృతి ముందు మనిషి మరగుజ్జు. తెలిసిన నిజాలు తక్కువ. అపోహలు ఎక్కువ. మరు క్షణం మనిషి అధీనం లో లేదు..”


"అయితే!"


"మనిషి తెలిసిన దాని పైన పూర్తి ఆధిపత్యం సాధించినా, తెలియని ఆ చీకటి కోణం అంటే విపరీతమైన భయం. ఆ భయాన్ని ఎలాగైనా జయంచాలి అన్న ఆలోచనలో నుంచి పుట్టిన స్వరూపమే 'శక్తి '. మనసుకు మాత్రమే కనిపించే ఆ శక్తి కి ముద్దుగా పెట్టుకున్న పేరే 'దేవుడు’..”


"ఇంకా.."


"ఆలా భయం నుంచి ఉపశమనం కోసం సృష్టించుకున్న దేవుడికి పేరు, ఊరు (శివుడిది కైలాసం!), రంగు(నీల మేఘ శ్యాముడు!!) , రూపు , కూడు(నైవేద్యం), గూడు (చర్చి, మసీదు!) అన్నీ మనిషే కల్పించాడు. ఇలా సృష్టి కర్తనే ప్రతిసృష్టి చేయగల టాలెంట్ ఉన్న మనిషికి అసమానతలు సృష్టించడం పిజ్జా తో పెట్టిన విద్య!".


"ఏదో అనుకున్నా, నీలో చాలా విషయం ఉంది భయ్యా. నీ రివెర్స్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ను బట్టి చూస్తే నువ్వు హేతువాదానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావే! ఈ తర్కం నీకెలా తగులుకుంది భయ్యా?"


"సింపుల్. నాకు నా పుట్టిన రోజు తెలియదు కాబట్టి!"


"అర్థం కాలేదు భయ్యా! కొంచెం తెలుగు లో చెప్తావా"


"ఓకే. నీకు నీ పుట్టిన తేదీ, తిథి, నక్షత్రం వగైరా తెలుసు కదా. వాటితో నీ కథ మొదలైంది. గుడిలో (అర్చన, వ్రతాలు, పూజలు వగైరా), బడిలో (అక్షరాభ్యాసం దగ్గర నుంచి!), ఒడిలో (బారసాల కావచ్చు, శోభనం కావచ్చు), మడిలో (నిష్ఠ నియమాలు!), సుడిలో (జాతక రాయళ్లతో!) ఎక్కడైనా వీటితోనే మొదటి పలకరింపులు. అమృత ఘడియలు, వర్జ్యాలు, యమ గండాలు, రాశి ఫలాలు, జాతకాలు, జాతరలు...ఇలా నువ్వొక జీవితమనే గాజు జాడీ లో ఉండిపోతావు. దాని మూత తీసుకోవాలని మర్చిపోయేంతగా ఇరుక్కుంటావు. గానుగెద్దు గుర్తుందిగా..దానికి మనకి పెద్ద తేడా ఉండదు. నువ్వు గాలి పటంలా ఎత్తు లో ఉన్నానని అనుకుంటావు. కానీ దారం ఎవరి చేతిలో ఉందో తెలుసుకోవు."


"అదేంటి భయ్యా, మరి సంప్రదాయం, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు లేకుండా అరాచకాలు జరిగిపోవూ?"


"కరెక్ట్ భయ్యా. సామాజిక నియమాలన్నీ సదుద్దేశం తో పెట్టుకున్నవే. ఎక్కు పెట్టిన బాణాన్ని ఎంత లాగాలో అంతే లాగాలి. ఎక్కువ లాగితే, విల్లు విరుగుతుంది. మనం ఎక్కువ లాగేసాం భయ్యా. అన్నింటికీ పెడర్థాలూ, విపరీత అర్థాలూ తీసి చట్టానికి కూడా లోబడని ఒక కొత్త చట్రాన్నితయారు చేసుకున్నాం." 


"అంటే, అందరూ అలాగే ఉన్నారా?"


"లేదు భయ్యా. కానీ ఎక్కువ మంది అలాగే ఉన్నారు"

 

"అర్థమయ్యింది భయ్యా. మరి ఈ తతంగం నుంచి నువ్వెలా తప్పించు కున్నావు?"


"నేను తప్పించుకోలేదు. పరిమితులు పెట్టుకున్నానంతే. ఎప్పుడైతే పుట్టిన తేదీ తెలియదో, ఇవన్నీ అప్రస్తుతమై పోయాయి. నా గాజు జాడీ మూతను తీసుకునే అవకాశం నాకొచ్చింది. విచిత్రమేంటంటే గాజు జాడీ లోపల నుంచి అంతా కనిపిస్తుంది కానీ ఆస్వాదించలేవు. ఒక్కసారి బయటకి వచ్చి చూడు నీకే అర్థమవుతుంది."


వాదనలు, సంభాషణలు, ఇంటర్వ్యూ ల తో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కొనసాగేది. ఒక రోజు నా ఫ్రెండ్ సురేష్ ఫోన్ చేసి, "ఈ సారి లిస్ట్ లో నీ పేరుంది", అని చెప్పాడు. ర్యాంకు వచ్చింది. సర్వీస్ జాయిన్ అయ్యాను. ట్రైనింగ్ అయింది. మొదటి పోస్టింగ్ తో కర్మ యోగం మొదలైంది. 


తరచూ ట్రాన్స్ఫర్లు, వేరే రాష్ట్రాల్లో పోస్టింగులు ఉన్నా సాఫీగా సాగిపోతున్న జీవితానికి మరొక శుభవార్త అందింది. అది చెప్పటానికే మా అమ్మకు ఫోన్ చేశాను.


"అమ్మా, మాకు బాబు పుట్టాడు."

"సంతోషం. ఎప్పుడు?"

"అంటే?"

"అదే, ఎన్ని గంటలకు? నక్షత్రం, తిథి అన్నీ మంచివేనా?"


ఒకప్పుడు నేను మా అమ్మకు సంధించిన ప్రశ్నలే తిరుగు ప్రయాణంలో నన్ను చేరేసరికి నాకు నవ్వు వచ్చింది. ఇంకా ఆలోచనల్లో ఉండగానే, మా ఇల్లు వచ్చింది. కారు ఆగింది. నేను దిగుతుండగా, రెండేళ్ల మా బాబు 'డాడీ' అనుకుంటూ చేతులు చాచాడు. 


"మీ వాడు, గాజు జాడీ మూత తీస్తాడంటావా?", అని నా మనసు అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. బహుశా, జెనెటిక్ సైంటిస్టులు దగ్గర ఉండొచ్చు. 


Rate this content
Log in

More telugu story from Ram Babu Vavilapalli

Similar telugu story from Drama