Ram Babu Vavilapalli

Drama Romance Inspirational

4.6  

Ram Babu Vavilapalli

Drama Romance Inspirational

ది మిల్క్ మాన్

ది మిల్క్ మాన్

10 mins
956


లక్ష్మీపురం అనేది ఒక చిన్న పల్లెటూరు. పట్నం మింగేయగా మిగిలిన గ్రామాల్లో ఒకటి. ఆ ఊరిలో లింగయ్య అనే రైతు ఓపికతో పది ఆవుల్ని పెంచుకొని నిజాయితీగా పాల వ్యాపారం చేస్తుండేవాడు. టీ తాగనిదే రోజు మొదలవ్వని చాలా మందికి మొదట అవసరమయ్యేదే పాలు! పాలు రావడం ఆలస్యమైతే ప్రాణం పోయేలా ఫీల్ అయ్యే వాళ్ళు లేక పోలేదు! పాలివ్వడానికి ఆవులుంటే సరిపోవు పితికిన పాలను జనానికి సమయానికి చేరవేయడానికి ఒకడు కావాలి. అలాంటి మహత్తర కార్యం చక్కబెట్టడానికి లింగయ్య ఎంచుకొన్న చాకు లాంటి సన్నాసే మన నవీన్. 


"ఏరా, ఇంకా నువ్వు బయలు దేర లేదా?", అన్నాడు లింగయ్య.

 "సైకిల్ చైన్ కాస్త తప్పిపోతేనూ.... ఎక్కించేసా... ఇదిగో బయలు దేరుతున్నా", అంటూ కారణం చెప్పే ప్రయత్నం చేసాడు నవీన్. 

"నువ్వు ఇలా రారా.. రోజూ ఎదో ఒక సాకు చెప్పి లేట్ చేస్తున్నావ్. మన వ్యాపారానికి కావాల్సిందేంటో నీకు తెలుసా? టైం. సమయానికి నువ్వు వెళ్లక పోతే వాళ్ళు వేరే వాడ్ని చూసుకుంటారు. లేచిన దగ్గర్నుండి ప్రతి నిమిషమూ లెక్క పెడతారు. సరే, తొందరగా పోయిరా", అని లింగయ్య కాస్త చీవాట్లు పెట్టాడు.


దాంతో కాస్త చిరాగ్గానే సైకిల్ స్టాండ్ తీసి బయలు దేరాడు నవీన్. ఇంకా సరిగా తెలవారనే లేదు. సైకిల్ వెనుక కేరేజ్ కి చెరో వైపు కట్టిన రెండు పెద్ద స్టీల్ క్యాన్లు. ముందు హేండిల్ కి తగిలించిన రెండు చిన్న క్యాన్లు. తెగి వేలాడుతున్న ముందు లైటు, స్క్రూలు ఊడిపోయిన మడ్ గేరు, లూజయిపోయిన చైను, అరిగిన బ్రేకులు...దానికి తోడు గతకల రోడ్డు. అబ్బా..మంటలార్పడానికి వెళ్తున్న గంటల బండి లాగా రోడ్డు పక్కన మరుగుకు కూర్చున్న వాళ్ళకి మేలుకొలుపు లాగా ఉంది. ఆలస్యం అవడం తో నవీన్ కాస్త స్పీడ్ పెంచాడు. 


"ఒరేయ్ నవీను, కాస్త స్లో గా వెళ్ళరా! పాలన్నీ రోడ్డు పాలైపోగలవు రా అబ్బాయ్!", చెంబు చేత పట్టుకొన్న ఒక పెద్దాయన అరిచాడు.

"నువ్వు పని చూసుకో తాత", అని నవీన్ ముందుకు సాగాడు.

గంటలో పట్నం చేరు కున్నాడు. 


కళ్యాణపురి రెండో వీధి మూడో ఇంటి దగ్గర ఆగాడు. 

కాలింగ్ బెల్ కొట్టాడు...

"మేడం, పాలు"

"సరే, టేబుల్ మీద ఉన్న గిన్నె లో పోసేయ్ బాబు"

"ఓకే మేడం. ఈ నెల నుంచి లీటర్ కి ఒక రూపాయి పెరిగిందని మా సారు చెప్పమన్నారు"

"అదేంటి బాబు, ఈ మధ్యనే కదా పెంచారు"

"పెంచి సంవత్సరం అయింది మేడం. అందరూ ఆర్నెల్లు క్రితమే పెంచారు. మా సారు మాత్రమే ఇప్పుడు పెంచారు"

"సరేలే. అందర్నీ సార్ అని పిలివడం ఒక ఫాషన్ అయిపొయింది", అంటూ గొణిగింది ఆ ఇంటావిడ. 


స్వామి భక్తి పరాయణుడైన మన నవీన్ గాడు అది తట్టుకోలేక పోయాడు.


"అదేంటి మేడం! సిగరెట్టులు తయారు చేసినోడ్ని, మందు తయారు చేసినోడ్ని, చివరకి చావమని విషం తయారు చేసినోడ్ని కూడా సార్ అంటారు. మరి పాడి ఆవుల్ని పెంచి పాలు అందించే రైతును అంటే తప్పేంటి?'

"సరేలే. తెలివితేటలకేం తక్కువలేదు. వెళ్ళిరా!"


అక్కడి నుండి కాస్త చిరాగ్గానే కదిలాడు నవీన్. అలా పద్దెనిమిది ఇల్లు రెండు గంటల్లో వాయు వేగంతో చుట్టి వచ్చాడు. ఇంటికి చేరుకొనే సరికి ఎనిమిదిన్నర అయ్యింది.

"ఇంత ఆలస్యం అయ్యింది కదరా బడికెప్పుడు ఎల్తావ్?", పొయ్యి ఊదుతూ అమ్మ అనేసరికి.

"ఏం చేయమంటావ్. పొద్దున్న సాయంత్రం ఈ పాలు గొడవ తోనే సరిపోతుంది."

"సరే. సద్దన్నం పెట్టాను. తినకుండా పారిపోకు"

"అలాగేలే"


స్నానం, బట్టలేసుకోవడం, అన్నం తినడం అన్నీ అరగంటలో జరిగిపోయాయి. మళ్ళీ సైకిలెక్కాడు. మెడలో సంచి..వెనక్కి భోజనం క్యారేజీ..అలా వీధి మలుపు తిరిగాడు..


"ఒరేయ్ నవీను! నువ్వింకా ఇక్కడే ఉన్నావా! రవి ఎప్పుడో ఎల్లిపోయాడు", పక్కింటి బాబాయి అడిగాడు.

"సరేలే బాబాయ్. ఎంత సేపు. స్కూల్ టైం కి వెళ్ళిపోతాలే!", అని అన్నాడే గాని వెళ్లాల్సిన దూరం గుర్తొచ్చింది. ఒకటా రెండా..ఎనిమిది కిలోమీటర్లు. పైగా అందులో నాలుగు కిలోమీటర్లు పేరుకే రోడ్డు. నిట్టూర్చుతూనే వేగం పెంచాడు. 


స్కూల్ చేరే సరికి ప్రార్ధన ముగించి అందరూ క్లాసులకు వెళ్లిపోయారు. సైకిల్ స్టాండ్లో పెట్టి వెళ్లే సరికి ఫస్ట్ క్లాస్ మొదలైంది. 

"సార్ కు ఇప్పుడు తెల్లవారింది. బెడ్ కాఫీ ఏమైనా కావాలా సార్?", అని గుమ్మం దగ్గర ఉన్న నవీన్ ను చూసి లెక్కల మాస్టరు వెటకారం చేసారు.

"సార్….అదీ....."

"చాల్లే ఆపు..ఎనిమిదో తరగతికి వచ్చావ్. ఇంకా స్కూల్ కి టైం కి రావాలని ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా!"


మౌనాన్ని మించిన సమాధానం నవీన్ దగ్గర లేదు. ఆత్మాభిమానం ఆహుతౌతోంది కానీ అసహాయత చేతుల్ని కట్టేసింది. 


'సరే వెళ్లి సైన్స్ ల్యాబ్ కు ఎదురుగా ఉన్న చెత్తను ఏరేసి రా. అదే నీకు పనిష్మెంట్. "

ఆ రోజు కాస్త భారంగానే గడిచింది. స్కూలు అయిపోయింది. పిల్లల సైకిళ్ళు కదిలాయి. 

రోడ్ అంతా వాళ్లదే అన్నట్టు, ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని తొక్కడం మొదలు పెట్టారు. నవీన్ కు సాయంత్రం పాల డ్యూటీ గుర్తుకొచ్చింది. 


"రివర్స్ హేండిల్ పట్టుకుని ఎవరు స్పీడ్ గా తొక్కుతారో?", అని మిగతా వారిని ఉసిగొల్పాడు.

ఏముంది. పందెం మొదలైంది. అందరికి ఈ పందెం ఒక సరదా. నవీన్ కు అవసరం. 

ఊరు చేరేసరికి రెండో వాడు నవీన్ కు కిలోమీటర్ దూరం లో ఉన్నాడు. 


"చూడు నవీన్, అప్పారావు టీ కొట్టులో ఒక లీటర్ ఎక్కువంట పొయ్యు. అలాగే సంతోష్ విలాస్ సన్యాసి రావు ఐదు వేలిస్తాడు తీసుకురా" అని లింగయ్య అనడం తో మళ్ళీ చక్రాలు కదిలాయ్. ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి ఎనిమిదయ్యింది. 


చూసారుగా ఇదీ నవీన్ గాడి దినచర్య. తండ్రి లింగయ్య దగ్గర కూలి పని చేస్తుండేవాడు. నవీన్ కు ఆరు సంవత్సరాలప్పుడే పోయాడు. తల్లి కూలి పనులు చేసుకుంటూ ఒక్కగానొక్క కొడుకును చదివించాలన్నది కోరిక. 


నవీన్ కు చిన్నప్పటినుంచి తిరిగే చక్రమంటే ఏదో తెలియని ఆసక్తి. గంటలకొద్దీ టైరు బండితో ఊరి పొలిమేరలంతా తిరిగేవాడు. తాటికాయలతో గుడబళ్లు చేసి పిల్లలకు పోటీలు పెట్టేవాడు. పోస్ట్ మాన్ ఊరొస్తే, "పద బాబాయ్, నేనూ వస్తా", అంటూ ఆయన సైకిల్ మీద ఊరంతా తిరిగేవాడు. ఆలా సైకిల్ మీద మోజు పెరిగింది. అద్దె సైకిల్ తీసుకొని పక్క ఊరి ఫ్రెండ్స్ ఇళ్లకు, పట్నానికి తిరిగేవాడు. ఈ అత్యుత్సాహాన్ని చూసే లింగయ్య తన పాల వ్యాపారంలో పెట్టుకొని సైకిలిచ్చాడు. 


ఒక రోజు సర్పంచి గారి పందెం కోడి లింగయ్య పశువుల శాల అటకెక్కింది. సర్పంచి వెంటపెట్టుకొచ్చిన పనిమనిషి దాన్ని పట్టుకోవడానికి అటకెక్కాడు. పుంజును పట్టుకొనే ప్రయత్నం లో ఒక పెద్ద బుట్ట కింద పడింది. పడీ పడగానే అందులోని బొమ్మలన్నీ బయట పడ్డాయి.


"ఈ బొమ్మలన్నీ ఏంటి లింగయ్యా? అరే! కొన్ని మట్టివి, కొన్ని చెక్కవి ఉన్నాయి. భలే ముచ్చటగా ఉన్నాయి. అన్నీ సైకిళ్లే. రక రకాలుగా ఉన్నాయి", సర్పంచి ఆసక్తిగా చూస్తూ అడిగాడు.


"అవి మా నవీను గాడివి అయ్యుంటాయి సర్పంచి గారు" అని లింగయ్య అనగానే,

"అవునయ్యా, అవి నావే", అక్కడే ఉన్న నవీన్ వాటిని ఏరటం మొదలు పెట్టాడు.


"మా నవీను కి సైకిల్లంటే మహా పిచ్చి. ఎప్పడూ వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వీడి పిచ్చి వల్ల ఇప్పటికే మూడు సైకిళ్ళు మార్చాను. ఒకసారి అట్లాస్ అన్నాడు. ఇంకోసారి ర్యాలీ అన్నాడు. కొత్తగా హీరో కూడా కొనిపించాడు. పాత సైకిళ్ళు కొనడానికి మన అప్పన్న షాప్ ఉంది కాబట్టి సరిపోయింది. ఏమంటే, టైర్లు, రిమ్ము, క్రాంకు అన్నీటి గురించి చెప్పి ఏది బాగా స్పీడ్ వెళ్తాదో చెప్పేస్తాడు" అని లింగయ్య నవీన్ గురించి ఏకరువు పెట్టాడు.


"ఇలాంటి పిచ్చి ఉన్నోళ్లు ఎప్పుడుకైనా గొప్పోళ్ళవుతారు లింగయ్య. నువ్వు చూస్తూ ఉండు"

"ఏమౌతారో ఏమో..", అంటూ లింగయ్య పని మీద వెళ్ళిపోయాడు.


సర్పంచి మాటలు నవీన్ కు రోజులు గడిచినా గుర్తుకొస్తున్నాయి. స్కూల్ లో పెట్టిన సైకిల్ పోటీల్లో ప్రతి సంవత్సరం తనే గెలవడం, రోడ్ల మీద స్కూటర్లు, కార్ల తో పోటీ పడడం, సైకిల్ స్పీడ్ ను ప్రభావం చేసే అంశాలన్నీ చక్కగా అర్థమవుతూ ఉండడం...ఏదో తెలియని ఒక ఆత్మ విశ్వాసం. కానీ ఏం చెయ్యాలో ఏం కావాలో తెలియదు. చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు. 


పదో తరగతి చదువుతున్నప్పుడు ఒక రోజు, జలవిహార్ నగర్ మూడో లైన్లో కెప్టెన్ కాంతారావు గారింటి గేట్ తీసుకొని లోపలి వెళ్ళాడు నవీన్. ఆ కాలనీ లో పొద్దున్నే లేచే అతికొద్ది మందిలో టామీ ఒకటి. సడన్ గా నవీన్ కు 'గుర్ర్.." మని శబ్దం వెనుక నుండి వినిపించింది. తిరిగి చూస్తే గుండె ఆగినంత పనైంది. ఆగదు మరి..అదేమన్నా ఊర కుక్కా...రెండు అడుగులు ఎత్తు మూడు అడుగులు పొడవున్న నికార్సైన మేలు జాతి కుక్క. ఎర్రగా బారెడు నాలుక కోరల మధ్యనుంచి వేలాడదీసేసరికి నవీన్ నోరు మూగబోయింది. టామీ లాంగ్ జంప్ చేసే లోపే ఒక్క ఉదుటున పరుగు లగించి బిగ్గరగా అరుస్తూ పోర్టికో లోని పరదా వెనుక దాక్కున్నాడు.


"టామీ..! కమ్ బ్యాక్!", అంటూ మాధురి బయటకొచ్చింది. 

"ఎవరూ?"

"నేనండీ, పాలబ్బాయిని"

"ఎక్కడున్నావ్?"

"ఇక్కడే పరదా వెనుక!"

"బయటకు రా. భయం లేదు. టామీ ఏం చేయదులే"


నవీన్ బయటికొచ్చి చూసాడు. భయం ఆవిరైపోయింది. కాసేపు అలాగే మాధురిని చూస్తూ ఉండిపోయాడు. మాధురి, "హలో..!", అనేసరికి,

"మీ కుక్కేంటండి బాబు అంత పెద్దగుంది", అంటూ కవర్ చేసాడు.

"అదా...జర్మన్ షెఫర్డ్ మేల్. నాన్నగారు ఢిల్లీ నుంచి తెచ్చారు", అంటూ పోర్టికో లో ఉన్న సైకిల్ మీద పరదా తీసింది మాధురి.

ఈసారి నవీన్ కు మాధురిని మించిన సర్ప్రైజ్. 

"అయ్య బాబోయ్!! కొండ సైకిలూ..!"

"కొండా సైకిలా..? దీన్ని మౌంటెన్ బైక్ అంటారు..హై స్పీడ్ సైకిల్. దీనికి గేర్స్ కూడా ఉన్నాయి", అని మాధురి అంటూనే వుంది..


నవీన్ మాత్రం సైకిల్ ను తాకుతూ..తన్మయత్వం లోకి వెళ్ళిపోయాడు. 


మాధురి ఒక్క చిటిక వేసి, "నీకు సైకిల్ అంటే అంత ఇష్టమా?" అని అడిగింది.

"కాదు...పిచ్చి."

"ఇంతకీ నీ పేరేంటి?"

"నవీన్"

"సరే..నాకు మార్నింగ్ సైక్లింగ్ కు టైమైంది. నేను వెళ్తున్నా."

"సరే అండీ"

"భగవంతుడా..కండ మిగిలింది" అంటూ కట్టేసి ఉన్న టామీ వైపు ఒక లుక్కేసి అక్కడి నుండి జారుకున్నాడు. నవీన్ కు అది డబల్ ధమాకా!! 


ఏముంది రోజూ ఇళ్లన్నీ అయిపోగానే, కెప్టెన్ గారింటికి వెళ్లడం గేర్ సైకిల్ ని ముచ్చటదీరా చూడడం, పనిలో పనిగా మాధురిని పలకరించడం పనిగా పెట్టుకున్నాడు నవీన్. 

రోజూ అమ్మాయితో కాలక్షేపం పెడితే అమ్మగారికి అర్ధం కాదూ! తరువాత వారం రోజులు మాధురి కన్పించలేదు. 


ఇక ఇంటిదగ్గర జరిగే యవ్వారం కాదని కుర్రోడికి అర్ధమయ్యింది. ఆరాటం మొదలైంది. ఈసారి గాంధీ పార్క్ సైకిల్ ట్రాక్ మీద ప్రత్యక్షమయ్యాడు. కొద్దీ దూరంలో ఫస్ట్ లవ్వు, దాని మీద సెకండ్ లవ్వు. మెలికలు తిరుగుతూ కాస్త మొహమాటంగానే చెయ్యూపాడు. 

"హాయ్ నవీన్! హౌ ఆర్ యు?"

"బాగానే ఉన్నాను"

"నువ్వెలా ఉన్నావ్"


రోజూ పని ముగించుకుని గాంధీ పార్క్ లో వాలి పోయేవాడు. మౌంటైన్ బైక్ తొక్కడమూ మొదలు పెట్టాడు. కొన్ని సార్లు ఫ్రెండ్స్ తో పోటీకి కూడా తీసుకెళ్లాడు. సైక్లింగ్ మీద ఆసక్తి ఉన్న మాధురి మెళుకువలు కూడా చెప్పేది. కాలేజీ కబుర్లతో పాటు సైక్లింగ్ లో జరిగే జాతీయ అంతర్జాతీయ పోటీల గురించి చెప్పేది. పదో తరగతి ముగిసింది. కాలేజీ కి వెళ్ళాడు. 


కాలేజీ అయిపోయాక ఒక రోజు సిటీ నుండి తిరిగి వస్తున్నాడు. పెద్ద కానా రింపు దగ్గర నవీన్ ను ఒక పెద్ద కారు సడన్ గా ఓవర్టేక్ చేసింది. కుర్రోడికి మండింది. సీటు మీద నుంచి కొద్దిగా లేచి పెడల్ మీద బలం పెంచాడు. నవీన్ కసిని గాలి కూడా నిలువరించ లేకపోయింది. కాసేపటికి కారులోని పెద్దాయనకు పిల్లోడి పట్టుదలేంటో అర్థమైంది. ముచ్చటేసి స్పీడు ను 60 నుంచి 40 కి తగ్గించాడు. అలా రెండు కిలోమీటర్లు పోటీ పడ్డాడు. 


ఇంతలో ఫ్లై ఓవర్ రావడంతో పెద్దాయన ఆలోచిస్తున్నాడు పైనుంచి వెళ్లాలా కింది నుంచా అని. పైనుంచైతే అంత ఎలివేషన్ పిల్లోడికి కష్టమౌతుంది అని దిగువ రోడ్ మీద వెళ్లాలని నిర్ణయించుకునే లోపే, నవీన్ ఫ్లై ఓవర్ ఎక్కేసాడు. పెద్దాయన గమనిస్తూ ఉన్నాడు. ఒక వెలోడ్రోం (Velodrome ) లో కృత్రిమంగా చేసిన ఎలివేషన్ (elevation) కంటే ఎక్కువున్న ఆ ఫ్లై ఓవర్ పై నవీన్ స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా షార్ప్ కర్వేచర్ (అతి పెద్ద మలుపు) ని కూడా ఎంతో తెలివిగా అధిగమించాడు. 


ఇంకో రెండు కిలోమీటర్ల తరువాత బాగా విరబూసిన ఒక తురాయి చెట్టు కింద కారు ఆపి, పెద్దాయన పిల్లోడికి సైగ చేసి రమ్మన్నాడు.

"నీ పేరేంటి బాబూ?"

"నవీన్"

"కాళ్ళు పీకుతున్నాయా?"

"అదేం లేదు సార్"

"నువ్వు ఎంత వేగంతో వచ్చావో తెలుసా నవీన్?"

"ఎంత సార్?"

"సుమారు గంటకి 35 కిలో మీటర్లు"

"అవునా..నేనెప్పుడూ చెక్ చేసుకోలేదు సార్"

"సైకిల్ తొక్కడమంటే అంత ఇష్టమా?"

"కాదు సార్..పిచ్చి!"

"ఏమౌదామనుకుంటున్నావ్?"

"ఏమో సార్ తెలియదు. మా సర్పంచి గారు నేను గొప్ప వాడినౌతానని అన్నారు. ఎలాగో తెలియదు"

"నాకు తెలుసు"

నవీన్ కు ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. 


"నా పేరు కృష్ణ మూర్తి. నేను ఒక పెద్ద కంపెనీ కి ఓనర్ ని. అలాగే 'సైక్లింగ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా' కు మన రాష్ట్ర ప్రతినిధి ని కూడా."


కాస్త ఆనందం, కాస్త బెరుకు గొంతుతో, "నమస్కారం సార్!", అంటూ దాదాపుగా సెల్యూట్ కొట్టినంత పని చేసాడు నవీన్.


"నీకు తెలియట్లేదు కానీ. నీలో ఒక ఛాంపియన్ ఉన్నాడు."


నవీన్ లో ఎదో తెలియని సంతోషం తో కూడిన గర్వం..


"నువ్వు సైకిల్ తొక్కుతున్నప్పుడు చూసాను. నీ ఏరోడైనమిక్ బ్యాలెన్సింగ్ (గాలి ఒత్తిడులను ఎదుర్కొనే విధానం), ఎలివేషన్ (ఎత్తు) ను సునాయాసంగా ఎదుర్కోవడం, కర్వేచర్ (మలుపు) ను ఎటాక్ చేసే పద్దతి నిజంగా అద్భుతం. ఒక ప్రొఫెషనల్ సైక్లిస్ట్ కు ఉన్న క్వాలిటీస్ నీలో ఉన్నాయ్"


నవీన్ కు ఆ మాటలు కాస్త టెక్నికల్ గా అనిపించినా, వాటి తాత్పర్యం అర్థమయ్యింది. గాల్లో తేలుతున్నట్టు అనిపించింది..


"నాతో వస్తావా? నువ్వేం చెయ్యాలో, నీ లక్ష్యం ఏంటో నేను చెప్తాను", అని కృష్ణమూర్తి గారు అనేసరికి నవీన్ కు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ఏదో ఒక కొత్త ప్రపంచపు స్పర్శ తెలుస్తోంది. ఊహలు గుర్రాల్లా పరిగెడుతున్నాయి. ఇందులో ఏమైనా మోసం ఉందేమో అన్న చిన్న సంశయం కూడా లేకపోలేదు. 


"ఏమో సార్. మా అమ్మ పంపించదు. అయినా లింగయ్య సార్ కూడా ఒప్పుకోడు", అని నవీన్ అన్నాడు.


"సరే నేను ఒప్పిస్తాను", అన్న కృష్ణ మూర్తికి వాళ్ళందిరిని ఒప్పించడం పెద్దగా సమయం పట్టలేదు. కృష్ణ మూర్తి గారు చెప్పిన మాటలకు ఆందోళన, సంతోషం, సందేహం, గర్వం అన్నీ కలగలిపిన మనసులతో అందరూ ఒప్పుకున్నారు. 


తరువాత రోజు గాంధీ పార్కుకెళ్ళాడు నవీన్. కళ్ళు మాధురిని వెతుకుతున్నాయి. కన్పించలేదు. తన ఇంటికెళ్ళాడు. ఈసారి చుట్టూ చూసాడు. టామీ కన్పించలేదు. ధైర్యంగా కాల్ బెల్ కొట్టాడు. కెప్టెన్ గారు ప్రత్యక్షమయ్యారు..

"ఆ..ఏంటి బాబు?"

"సార్..ఏం లేదు....మాధురి ఉందా?" 

"లేదు. వాళ్ళక్క దగ్గరికి ఢిల్లీ వెళ్ళింది."

"అవునా!...ఎప్పుడొస్తుంది?"

"అయినా..నీకెందుకూ?"


మాధురిని చూడాలి కలవాలి అనే ఆరాటమైతే ఉంది గాని "ఎందుకు?" "ఏంటి?" లాంటి ప్రశ్నలకు నవీన్ దగ్గర సమాధానం లేదు. 


"సరేలే సార్..", అని భారంగా అక్కడనుండి వెనుదిరిగాడు. 


వారం రోజుల తర్వాత కృష్ణ మూర్తి గారు ఇచ్చిన అడ్రస్ పట్టుకొని ఢిల్లీ కి బయలుదేరాడు నవీన్. ట్రైన్ ఎక్కగానే కొత్త ప్రపంచం పలకరించింది. ఢిల్లీ లో దిగగానే ఎవరో స్టేషన్ కు వచ్చి తీసుకెళ్లారు. మంచి హాస్టల్..కొత్త భోజనం..కొత్త వాతావరణం..కొత్త ముఖాలు..కొత్త ఆలోచనలు..కొత్త పద్ధతులు..ఒక్క ఆత్మ విశ్వాసమే పాతది. 


తరువాత రోజు నేషనల్ సైక్లింగ్ అకాడమీ లో అడుగు పెట్టాడు. కోచ్ మంజీత్ సింగ్ ట్రైనింగ్ మొదలు పెట్టారు. ఏదో కావాలన్న ఆరాటంతో నవీన్ పోరాటం మొదలైంది. కృష్ణ మూర్తి గారు చెప్పినప్పుడు ఊహల్లో తేలిపోయాడు, కానీ ఇక్కడ అంతా కొత్తగా ఉంది. మిగతా సైక్లిస్టుల్ని చూసాడు. వాళ్ళ భాష వేరు..ఫిట్నెస్ లెవెల్స్ వేరు..టెక్నిక్స్ వేరు..వాళ్ళ కుటుంబ నేపథ్యం వేరు..తనకూ వాళ్లకూ ఎలాంటి పొంతన లేదు. తానేంటో అర్ధమయ్యి నైరాశ్యానికి గురయ్యాడు. తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని అనిపించేది. అమ్మ గుర్తొచ్చేది. అలా మూడు నెలలు గడిచి పోయాయి. 


ఒక రోజు కాంటీన్ లో కూర్చొని దీర్ఘాలోచనలో పడ్డాడు. ముఖం లో ఎలాంటి ఉత్సాహం లేదు..చుట్టూ ఉన్న కోలాహలం తో ఎలాంటి సంబంధం లేకుండా పూర్తి ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్నాడు..


"క్యా చోటే..క్యా సోచ్ రహే హో?" అని కోచ్ మంజీత్ అన్నప్పుడు కూడా 

నవీన్ లో ఎలాంటి చలనం లేదు..

 "క్యా తుమ్ ఇదర్ హో?", అని చిటిక వేస్తె..

"నమస్తే సార్!", అంటూ ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు..


అప్పుడప్పుడే నేర్చుకుంటున్న హిందీ లో తన బాధనంతా కోచ్ తో ఏకరువు పెట్టాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. మంజీత్ సింగ్ నైపుణ్యమే కాదు మంచి మనసున్న కోచ్. కృష్ణ మూర్తి గారు అప్పటికే నవీన్ నేపథ్యం గురించి మంజీత్ కు చెప్పడం జరిగింది. ఇప్పుడు మంజీత్ కు ఏం చెయ్యాలో అర్ధమయ్యింది. ఆ రోజు మంజీత్ చెప్పిన మాటలతో తిరుగు లేని నమ్మకం కుదిరింది. తనే ఇక నాకు అన్నీ అని గట్టిగా ఫిక్సయిపోయాడు. 


మనసుకి వైద్యం జరిగిన తరువాత ఇప్పుడు అసలు ట్రైనింగ్ మొదలైంది. అలా మూడు నెలలు గడిచి పోయాయి. ఆసక్తి పెరిగింది. ఉత్సాహం రెట్టింపయ్యింది. కొద్ది నెలల్లోనే నవీన్ అంటే ఎవరో అకాడమీ లో అందరికీ అర్ధమయ్యింది. మంజీత్ సింగ్ కైతే ఒక ఎదురులేని మిస్సైల్ దొరికినంత ఆనందం కలిగింది. 


పోటీలు మొదలయ్యాయి. జూనియర్స్ లెవెల్ లో నవీన్ తో జాతీయ స్థాయిలో ఎవరూ పోటీ పడలేక పోయారు. కొన్ని సంవత్సరాల తరవాత సీనియర్స్ స్థాయి లోనూ ఎలాంటి పోటీ లేదు. Individual pursuit , స్ప్రింట్, స్క్రాచ్ రేస్, cyclathons , మౌంటెన్ బైకింగ్, ట్రాక్ సైక్లింగ్, రోడ్ సైక్లింగ్ ఇలా ఏ ఈవెంట్ లోనూ నవీన్ కు ఎవరూ దీటు రాలేదు. పతకాల వెల్లువ కొనసాగింది. 


ఆసియన్ గేమ్స్ కోసం ట్రైనింగ్ మొదలైంది. బాగా ప్రాక్టీస్ చేసిన తరవాత ఒకరోజు రిసెప్షన్ పక్కన లౌంజ్ లో పేపర్ చదువుతూ కూర్చున్నాడు నవీన్. అక్కడే కాస్త దూరం లో వేరే సోఫా లో ఒక అమ్మాయిని సైడ్ నుండి చూసాక మనసు గతుక్కుమంది. మాధురి ఏమో అని అనిపించింది. తన సైక్లింగ్ యావలో ఉన్న కిక్కు మాధురి ని పూర్తిగా మర్చిపోయేలా చేసింది. ఒక రకమైన అపరాధ భావానికి లోనయ్యాడు. అమ్మాయి లేచి నిలబడేసరికి అనుకున్నది నిజమయ్యింది. ఒక్క ఉదుటున దగ్గరికి వెళ్ళాడు.


"మాధురి..నువ్వెంటి ఇక్కడ?" ఆశ్చర్యంతో నవీన్,

"హాయ్ నవీన్..హౌ ఆర్ యు?"

"బాగున్నాలే కానీ..ఇక్కడ...నువ్వు..."

"అంతేలే బాబు..నిన్ను పేపర్లో చూడటమే కానీ..సారు ఎక్కడ కనిపించరు"

"మాధురి ..అదీ.."

"సరే..నేను అర్ధం చేసుకోగలను.."

"థాంక్స్ మాధురి.."


మనవాడి కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు భాష కూడా మారింది..


"నేను సైక్లింగ్ ట్రైనర్ గా ట్రైనింగ్ కోసం వచ్చాను."

"ఓకే. గ్రేట్. ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ మాధురి"

"నువ్వు చాల మారావు నవీన్!"

అలా మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. ఆ అనుబంధం ఆప్యాయత మారలేదు. 


ఆసియన్ గేమ్స్ రానే వచ్చాయి. నవీన్ ఒక ఛాంపియన్ గా బరిలోకి దిగాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ...పోటీ పడ్డ అన్ని ఈవెంట్ల లోనూ గోల్డ్ మెడల్ గెలిచాడు. తర్వాత ఒలింపిక్ గేమ్స్ కు కూడా క్వాలిఫై అయ్యాడు. ఈ లోగ అర్జున అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు. 


అది నిర్విరామంగా సాగిన ఒక ప్రస్థానం. శ్రమే పెట్టుబడి ఆత్మవిశ్వాసమే ఇంధనంగా సాగిన ఒక సుదీర్ఘ ప్రయాణం. ఒక రోజు లాన్ లో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు..ఆ రోజు 'ది హిందూ' దిన పత్రిక "The Rise of a Milk Man " అని ఒక వ్యాసం ప్రచురించింది. అది చదువుతూ గతం లోకి వెళ్ళిపోయాడు..


"హాయ్ నవీన్! ఎలా ఉన్నావ్?', ఆ గొంతు లోని ఆప్యాయత గుండె కి తగిలింది. 

వెంటనే తల పైకెత్తి చూసాడు. ఎదుట కృష్ణమూర్తి గారు, అయన తో పాటుగా కోచ్ మంజీత్ సింగ్..

"సార్..!", అంటూ వంగి ఆశీర్వాదం తీసుకున్నాడు..లేచి నిలబడేసరికి కళ్ళలో నీళ్లు..

"ఏంటి నవీన్.. చిన్న పిల్లాడిలా .!", 

"లేదు సార్...నేనెప్పుడూ కలలో కూడా ఊహించని ఒక ప్రయాణం నా జీవితం. మట్టిలో మాణిక్యాన్ని మీరు తవ్వి తీశారు. దానికి మంజీత్ సార్ పదును పెట్టారు. నాకిప్పుడు అర్థమవుతుంది సరైన సమయంలో దిశా నిర్దేశం ఎంత అవసరమో.", అని నవీన్ తన అంతరంగాన్ని వారి ముందుంచాడు.

"చూడు నవీన్. అంతా యాదృచ్చికంగా ఎప్పుడూ జరగదు. మనిషిలో ఉండే తపన అవకాశాల్ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఆ తపన లేనోడికి అవకాశం ద్వారాలు కనిపించవు." అని కృష్ణమూర్తి గారు తత్వాన్ని చెప్పారు.


"సరే నవీన్. రైల్వే లో లేదా ఆర్మీ లో మంచి ఉద్యోగం ఇస్తారు. ప్రయత్నం ఎందుకు చెయ్యకూడదు", అని మంజీత్ అనే సరికి.

"సార్. నాకు సైక్లింగ్ ఒక పిచ్చి. దానికి గవర్నమెంట్ జాబ్ లో మందు లేదు." 

"ఓకే. మరేం చేస్తావు?"

"ఇప్పుడు నా రెక్కలకు బలముంది. ఇంకొంత మంది కి కూడు నీడ ఇచ్చి వాళ్ళు కూడా ఎగిరేలా చేద్దామనుకుంటున్నా!"

"అంటే?"

"ఇప్పుడు ప్రపంచం మారింది సార్. పేదోడి సైకిల్ కాస్త పెద్దోడికి కూడా అవసరమయ్యింది. సైకిల్ తయారీ లో స్టార్ట్ అప్ పెడదామనుకొంటున్నా!"


నవీన్ తపనే పెట్టుబడిగా..మరో ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. కసి ఉన్నోడిని ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు..


Rate this content
Log in

Similar telugu story from Drama