"Tirumalasree" PVV Satyanarayana

Inspirational

5.0  

"Tirumalasree" PVV Satyanarayana

Inspirational

ఉత్తరం

ఉత్తరం

6 mins
34.9K*** 

     ఆ రోజు ఆర్మీ డే…ఆ సందర్భంగా ‘సిటిజెన్స్ సొసైటీ’ టౌన్ హాల్లో సభ ఏర్పాటుచేసింది. ఆ ఊరికి చెందిన ఆర్మ్ డ్ ఫోర్సెస్ లో పనిచేస్తూన్నవారి కుటుంబసభ్యులను ఆ సభకు ఆహ్వానించి సన్మానం చేయడం జరుగుతుంది. చాలా కాలంగా ఆ పద్ధతి ఓ ఆచారంగా మారింది ఆ టౌన్ కి. అటువంటి కుటుంబాలు ఆ ఊళ్ళో డజనుకు పైగా ఉండడం విశేషం. వారిలో నేనూ ఒకతెను. వేదికపైన ఆసీనులమయ్యాము మేమంతా.

     పురప్రముఖులు తమ ప్రసంగాలలో ఆర్మీ జవాన్ల వీరోచితాన్నీ, దేశభక్తినీ, త్యాగనిరతినీ కొనియాడారు. కష్టనిష్ఠురాలకు ఓర్చి కఠినాతి కఠినమైన సరిహద్దు ప్రాంతాలలో మన జవాన్లు అప్రమత్తతతో పహరా కాయడంవల్లనే దేశప్రజలు సుఖసంతోషాలతో మనగలుగుతున్నారనీ, ప్రశాంతంగా నిద్రించగలుగుతున్నారనీ శ్లాఘించారు. నిస్వార్ధచిత్తంతో తమవారిని దేశరక్షణకోసం పంపించిన కుటుంబాల దేశభక్తిని ప్రశంసించి అభినందించారు. అనంతరం ఆయా కుటుంబ పెద్దలను సత్కరించే కార్యక్రమం ఆరంభమయింది. ఒక్కొక్కరి గురించీ వివరిస్తూ శాలువాలతోను, పుష్పగుచ్ఛాలతోను వారిని సత్కరించసాగారు – సభికుల కరతాళధ్వనుల నడుమ.

     నా వంతు వచ్చింది. “ధరణిగారు దేశంకోసం అసువుల నర్పించిన ఓ అమరవీరుడి ధర్మపత్ని. భర్తను కోల్పోయినా చెదరక బెదరక ఏకైక సంతానమైన కొడుకును సైతం దేశరక్షణలో భాగం చేసిన ఓ ధీరమాత…” – మైకులో చెబుతుంటే నా ఒడలు పులకరించింది. హృదయం గర్వంతో నిండిపోయింది. ఐతే, గుండెలలో ఏ మూలో చిన్న దిగులు. ఎందుకంటే, పదిహేనేళ్ళ క్రితం పాక్ టెర్రరిస్టుల తుపాకి గుళ్ళకు రోహిత్ బలయిపోయింది – ఆర్మీ డే రోజునే!

     సభ ముగిసాక ఇంటికి చేరుకున్న నేను, నిస్సత్తువగా సోఫాలో చతికిలపడిపోయాను. ఎదురుగా గోడపైన చెమ్కీదండతో ఉన్న ఫొటోలో మిలిటరీ దుస్తులలో, దరహాసమధురిమలను వెదజల్లుతున్నాడు రోహిత్. ఆ ఫొటో వంకే తదేకంగా వీక్షిస్తూ వుండిపోయాను నేను.

     అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు, డోర్ బెల్ మ్రోగడంతో లేచి వెళ్ళి తలుపు తెరచాను.

     ఎదురుగా ఆర్మీ జవాను!

     హఠాత్తుగా నా కుడికన్ను అదరింది.

     “మేడమ్! ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుండి మీకు ఉత్తరం వచ్చింది” అంటూ, సీలు వేసియున్న ఓ కవరు నా చేతిలో పెట్టి, శాల్యూట్ చేసి వెళ్ళిపోయాడు అతను.

     కవరు అందుకుంటుంటే నా చేతులు ఒణికాయి. జీపు వెళ్ళిపోయేంతవరకు అటే చూస్తూ ఉండిపోయాను. తరువాత తలుపు మూసి వెళ్ళి మళ్ళీ సోఫాలో చతికిలబడ్డాను. ఆ కవర్ వంక చూస్తుంటే నా తలపులు గతం యొక్క తలుపులను తట్టాయి…..

     రోహిత్ తో నా పరిచయం చిత్రంగా జరిగింది…డిగ్రీ పూర్తి అయ్యాక ఓ పబ్లిక్ స్కూల్లో టీచర్ గా చేరాను నేను. ఓసారి గోదావరి పుష్కరాలకు అంతర్వేదికి వెళ్ళాము అంతా. నా స్నేహితురాళ్ళుకూడా వచ్చారు. అందరూ స్నానాలు చేసే ఘాట్ దగ్గర కాకుండా, కాస్త దూరంగా ఉన్న రేవుకు వెళ్ళాం నేను, నా స్నేహితురాళ్ళూను. నీటిలో దిగి ఒకరిపైనొకరం నీళ్ళు చల్లుకుంటూ అల్లరి చేస్తూ స్నానం చేయసాగాము.

     ఆ సందడిలో చూసుకోకుండా బ్యారికేడ్ ని దాటి ముందుకు పోయాను నేను. అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో కాళ్ళకు నేల అందడంలేదు. ఆ విషయం గ్రహించేలోపునే మునిగిపోనారంభించాను. నాకు ఈత రాదు. ‘హెల్ప్! హెల్ప్!’ అంటూ అరచాను. నా స్నేహితురాళ్ళు భయంతో కేకలు పెట్టారు.

     అదే సమయంలో ఓ యువకుడు చటుక్కున నీటిలోకి దుమికి నా వైపు ఈదుకుంటూ రావడం కనిపించింది. అప్పటికే నీళ్ళు త్రాగేసిన నేను, నీటిలో మునకలు వేస్తూ, తెలివితప్పిపోయాను.

     నేను మళ్ళీ కళ్ళు తెరచేసరికి ఒడ్డున ఇసుకలో పడుకునివున్నాను. అమ్మ, నాన్న, నా స్నేహితురాళ్ళు చుట్టూ గుమిగూడివున్నారు. ఆ యువకుడు నా దగ్గర కూర్చుని నాచేత నీళ్ళు కక్కించుతూ, వేడి పుట్టడం కోసమని నా చేతులు, కాళ్ళు మర్దనా చేయసాగాడు.

     నేను కళ్ళు తెరవడంతో, ‘భయపడకండి. మీకేమీ పరవాలేదు’ అన్నాడు చిరునవ్వుతో.

     కృతజ్ఞతతో అతని వంక చూసాను నేను…

     ఆ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత ఆ యువకుణ్ణి మా బడి దగ్గర చూసి విస్తుపోయాను నేను. ముందుగా అతనే గుర్తుపట్టాడు. ‘హలో! బాగున్నారా?’ అంటూ పలుకరించాడు. తన అక్క కూతుర్ని బడికి తీసుకు వచ్చాడట.

     ఇరవయ్ ఎనిమిదేళ్ళు ఉంటాయి అతనికి. పొడవుగా, సన్నగా ఉన్నాడు. దృఢమైన శరీరం. అందగాడు కాకపోయినా ముఖంలో కళ, కళ్ళలో వెలుగు, పెదవులపైన చెదరని చిరునవ్వు.

     తన పేరు రోహిత్ అనీ, ఆర్మీలో పనిచేస్తున్నాననీ చెప్పాడు. చెల్లెలి పెళ్ళికోసం వారం క్రితం సెలవులో వచ్చాడట. వాళ్ళు ఉండేది మా పక్క వీధిలోనేనని తెలిసి మరింత ఆశ్చర్యపోయాను. తానింకా అవివాహితుడే. ‘మిలిటరీవాడికి పిల్లను ఎవరు ఇస్తారండీ?’ అంటూ నవ్వేసాడు. సరదా మనిషిలా కనిపించాడు.

     ఆ తరువాత మరోసారి కనిపించాడు అతను. బడి దగ్గర కాదు, గుడి దగ్గర. అప్పుడప్పుడు సాయంకాలం మా ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్ళి, అచ్చటి ప్రశాంత వాతావరణంలో కాసేపు గడిపి రావడం అలవాటు నాకు. ఓసారి అతనూ చెల్లెలితో కలసి గుడికి వచ్చాడు. ఆ విధంగా రెండు మూడు సార్లు కలవడంతో మా మధ్య పరిచయం పెరిగింది. రోజూ శివాలయంలో కలుసుకుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం…ఆ కొద్ది రోజుల్లోనే మా పరిచయం ప్రేమగా పుష్పించడంతో అతనే నా జీవితభాగస్వామి అని నిర్ణయించేసుకున్నాను నేను.

     నా నిర్ణయం విని, ‘చచ్చినా నా కూతుర్ని మిలిటరీవాడికి ఇవ్వను’ అంటూ మండిపడింది అమ్మ. సాధారణంగా నా ఇష్టాయిష్టాలను కాదనని నాన్న సైతం, ‘సైనికుడి ప్రాణాలు అనిశ్చితాలమ్మా! రేపు అతనికి ఏమైనా ఐతే…ఈ వయసులో మేము తట్టుకోలేము.. నీ ప్రాణాలు కాపాడినందుకు నువ్వు అతనిపట్ల కృతజ్ఞత చూపడం వేరు, అతనితో జీవితం పంచుకోవాలనుకోవడం వేరూను’ అంటూ నచ్చజెప్పడానికి ప్రయత్నించారు.

     ‘మన జీవితాలకు భరోసా ఉన్నదంటారా, నాన్నా? గుమ్మం దాటి బైటకు వెళితే, సురక్షితంగా తిరిగి వస్తామని ఖచ్చితంగా చెప్పగలమా? మనిషి యొక్క ఆయుఃప్రమాణం భగవంతుడి నిర్ణయంతో ముడిపడివుంటుంది. చేసే ఉద్యోగంతోను, వృత్తితోను కాదు. అంతా మీలాగే ఆలోచిస్తే సైన్యంలో చేరిన వారెవరికీ పెళ్ళిళ్ళే కావు’ దృఢంగా పలికాను నేను. ‘మీరు నన్ను కని పెంచారు కనుక నేను మీ మాట కాదనను. కాని, జీవితాంతమూ కన్యగానే ఉండిపోవాలనే నా నిర్ణయాన్ని మాత్రం మీరు మార్చలేరు’.

     దాంతో మావాళ్ళు దిగిరాక తప్పలేదు. రోహిత్ కుటుంబానికి కూడా మా సంబంధం నచ్చడంతో, రోహిత్ చెల్లెలి పెళ్ళితోపాటే మా పెళ్ళీ అయిపోయింది…సెలవు ముగియగానే డ్యూటీలో జాయిన్ అవడానికి ఢిల్లీ వెళ్ళిపోయాడు రోహిత్. విడవలేక విడవలేక విడిపోయాం మేము. నేను కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటే, గుండెలకు హత్తుకుని ఓదార్చాడు…

     పెళ్ళైన మరుసటి సంవత్సరమే కపిల్ పుట్టాడు. వాడు పుట్టిన ఏడాదికిగాని రోహిత్ వాణ్ణి చూడ్డానికి రాలేకపోయాడు. ఉన్నన్నాళ్ళూ ఒక క్షణం కూడా కపిల్ ని విడచి ఉండలేదు. కొడుకంటే అంత ప్రేమ తనకు.

     రోహిత్ ని కెప్టెన్ గా ప్రమోట్ చేసి పాకిస్తాన్ బోర్డర్లో పోస్ట్ చేసారు. అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేవాడు రోహిత్. అవి ఆర్మీ పోస్టాఫీసు ద్వారా లోకల్ ఆర్మీ ఆఫీసుకు వస్తే, వాటిని ఓ కవర్లో పెట్టి సీల్ చేసి డెలివర్ చేసేవారు. రోహిత్ ఉత్తరాలను అపురూపంగా దాచుకుని మళ్ళీ మళ్ళీ చదువుకునేదాన్ని నేను.

     కపిల్ ఐదవ తరగతి చదువుతూండగా ఓ సారి షార్ట్ లీవ్ లో ఇంటికి వచ్చి వెళ్ళాడు రోహిత్. ఆ తరువాత నెల్లాళ్ళకే ‘ఆర్మీ డే’ వచ్చింది. ఆ రోజున టౌన్ హాల్లో ఫంక్షన్ కి హాజరయి ఇంటికి తిరిగి వచ్చిన నాకు, ఆర్మీ ఆఫీసునుండి ఉత్తరం వచ్చింది.

     సంబరంగా విప్పి చదివిన నాకు గొప్ప షాక్ తగిలింది. అది రోహిత్ రాసిన ఉత్తరం కాదు. డిల్లీలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుండి వచ్చినది - ‘ఉగ్రవాదులను భారత భూభాగంలోకి చొరబడచేసే ప్రక్రియలో భారత దళాల పైన హఠాత్తుగా కాల్పులు జరిపింది పాకిస్తాన్ సైన్యం. ఆ ఎన్ కౌంటర్లో వీరోచితంగా తన యూనిట్ ని ముందుండి నడపించిన కెప్టెన్ రోహిత్, తీవ్రంగా గాయపడినా లెక్కచేయకుండా, ముగ్గురు శత్రువులను హతమార్చిమరీ తుదిశ్వాస విడిచాడు!’ ఆ విషయాని తెలియబరుస్తూ, కుటుంబానికి తమ తీవ్ర సంతాపాన్ని తెలియబరచింది ఆర్మీ. రోహిత్ భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో పంపిస్తున్నారట’.      కుప్పకూలిపోయాను నేను. షాకుతో నా కళ్ళవెంట నీరు కూడా రాలేదు. కొయ్యబొమ్మలా ఉండిపోయాను…

     నా భర్త దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుడు. అటువంటి వీరుడికి భార్యనయినందుకు గర్వించడానికి బదులుగా, ఏడిస్తే అతని ఆత్మకు శాంతి కలుగదు. గుండె రాయి చేసుకున్నాను నేను. పట్టుదలతో కపిల్ ని పెంచి పెద్ద చేసాను… డిగ్రీ పూర్తిచేయగానే, ఆర్మీలో చేరతానన్నాడు కపిల్. నేను అడ్డు చెప్పనూలేదు, ప్రోత్సహించనూ లేదు. రోహిత్ ని పొగొట్టుకున్న గాయం నా మదిలో ఇంకా పచ్చిగా ఉండడమే అందుకు కారణం….

     కపిల్ ఆర్మీలో చేరి మూడేళ్ళయిపోయిందిమొదట్లో అంబాలా కంటోన్మెంటులో పోస్టింగు. వారానికోసారైనా ఫోన్ చేసి నా యోగక్షేమాలను గూర్చి విచారించేవాడు. ఏడాది క్రితం కాశ్మీరులోని ఫుల్వారా జిల్లాలో పోస్టింగు అయింది….

       కపిల్ ఫోన్ చేసి సుమారు నెల రోజులు అయింది. కారణం తెలియదు. నేను చేద్దామని ప్రయత్నిస్తే కనెక్ట్ కావడంలేదు. మనసులో ఏదో గుబులు, ఆందోళనాను. అదిగో, అట్టి సమయంలోనే వచ్చింది ఆ ఉత్తరం. అదీ, ఆర్మీ డే రోజున! హిస్టరీ రిపీట్ అవుతోందా!?

      ఆర్మీనుంచి ఉత్తరమంటే, ఏ కవర్లో ఏ కబురు ఉంటుందో తెలియదు!... తెరవడానికి భయం వేసింది నాకు. మనసంతా గుబులుతో నిండిపోయింది….కపిల్ నుండి ఫోన్ కాల్స్ ఎందుకు ఆగిపోయాయి? నా కాల్స్ ఎందుకు వెళ్ళడంలేదు? ఆ మధ్య తరచుగా ఐ.ఎస్.ఐ. పంపించిన పాకిస్తాన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల బెడద కాశ్మీర్ కి అధికమయిపోయింది. నిత్యమూ ఏదో ఒకచోట ఉగ్రవాదుల ముట్టడి, సెక్యూరిటీ ఫోర్సెస్ తో ఎన్ కౌంటర్సూ గురించీ వార్తలు అందుతున్నాయి.

     కపిల్ ఫోన్ చేయడమే తప్ప ఉత్తరాలు రాయడు. అంటే, అది ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుండి వచ్చిందా!? ఏదైనా చెడు వార్తా? నా కపిల్ ఎలా ఉన్నాడు??

    ఆ కవరును తెరవడానికి ధైర్యం చాల్లేదు నాకు. దాన్ని గుండెలపైన పెట్టుకుని కళ్ళు మూసుకుని సోఫాలో వాలిపోయాను. నా మనసు పరిపరి విధాలుగా పోతోంది. కపిల్ కి ఏమైనా అయిందా? టెర్రరిస్టులతో ఎన్ కౌంటర్లో గాయపడ్డాడా? లేక…?? ఆ ఊహే నా గుండెను గుభేలుమనిపించింది. భగవాన్! కపిల్ ఇంకా పసివాడు. వాడికి ఏమీ కాకూడదు. నా బిడ్డ క్షేమంగా ఉండాలి!

     ఎటువంటి సమాచారం ఆలకించవలసివస్తుందోనన్న భీతితో టీవీని ఆన్ చేయడం మానేసాను నేను. ఫోన్ ని కూడా స్విచాఫ్ చేసేసాను. ఆకలిదప్పులు చచ్చిపోయాయి. సోఫాలోనే పడి నిద్రలోకి ఒరిగిపోయాను. అన్నీ పీడకలలే!

     మర్నాడు ఏ క్షణంలో డోర్ బెల్ మ్రోగుతుందో, ఎటువంటి సంఘటన ఎదురవుతుందోనన్న భయంతో అనుక్షణం గడిపాను. రోజంతా ఇంట్లోంచి బైటకు రాలేదు… నేను పిరికిదాన్ని కాను. ఓ వీరసైనికుడి భార్యను. మరో సైనికుడి తల్లిని. ఎటువంటి పరిస్థితికైనా సిద్ధపడినదాన్ని. కాని, నాది తల్లి మనసు! కపిల్ ని గురించిన దుర్వార్తను ఆలకించి తట్టుకునే మానసిక శక్తి నాకిక లేదు… నా చూపులు టీపాయ్ మీదున్న కవర్ మీదే ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా దాన్ని తెరచే మానసిక స్థైర్యం మాత్రం చేకూరడంలేదు…

     అది మూడో రోజు…ఆ ఉత్తరంలో ఏముంది? ఏమయింది నా చిట్టితండ్రికి??... గంట గంటకూ నాలో ఆందోళన అధికమవుతోంది. నా మదికి నెమ్మదిలేకుండాపోయింది. టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నాను… ఇక ఆగలేకపోయాను. ఏమైతే అవుతుందని గుండె రాయి చేసుకున్నాను. టీపాయ్ మీంచి నావంక తేరిపారజూస్తున్న ఆ కవర్ని వణికే చేతులతో, అదిరే గుండెతో అందుకున్నాను.

     కవర్ని చింపుతుంటే, డోర్ బెల్ మ్రోగింది. త్రుళ్ళిపడ్డాను నేను. గుండె గతుక్కుమంది. భయభ్రాంతులతో తలుపు వంక చూసాను.

     బెల్ మళ్ళీ మ్రోగడంతో గుండె రాయి చేసుకుని, శరీరం సన్నగా కంపిస్తుంటే, వెళ్ళి తలుపు తెరచాను.

     గుమ్మంలో – ఆర్మీ ఔట్ ఫిట్ లో - కపిల్…!!

     “హాయ్, మామ్!” అంటూ వచ్చి కౌగలించుకున్నాడు.

     మ్రాన్పడిపోయాను నేను. ఆ ప్లెజంట్ సర్ప్రైజ్ తో - గత మూడు రోజులుగా అనుభవించిన ఆందోళన, పడ్డ టెన్షనూ ఆ క్షణంలో మంత్రం వేసినట్టు మాయమయిపోయాయి. “నాన్నా! కపిల్!” అంటూ అక్కున చేర్చుకుని భోరున ఏడ్చేసాను. కపిల్ కంగారుపడ్డాడు.

“ఏమయింది, మమ్మీ? ఎందుకు ఏడుస్తున్నావ్?” అనడిగాడు ఆందోళనగా.

     జరిగిందంతా దాచకుండా చెప్పాను. మొదట ఆశ్చర్యంతో చూసాడు. తరువాత పకపక నవ్వేసాడు, నా గుండె భారం దిగిపోయేలా. “వాట్, మమ్మీ? నువ్వే అంతగా భయపడ్డావంటే నమ్మలేకపోతున్నాను నేను. నేను ఉన్న ప్రాంతంలో కారణాంతరాలవల్ల ఫోన్ సౌకర్యాన్ని రద్దుచేయడం జరిగింది. అందుకే నేను వస్తున్నట్టు ఉత్తరం రాసి పోస్టులో పంపించాను” అన్నాడు.

     గబగబా ఉత్తరం చింపి చదివాను. వాడు చెప్పింది అక్షరాలా నిజం. ‘తాను సెలవులో వస్తున్నట్లూ, ఫలానా రోజున ఇంటికి చేరుకుంటాడనీ…ఫోన్లు పనిచేయడంలేనందున ఉత్తరం రాస్తున్నట్లూ…’ ఉంది అందులో.

     కపిల్ ఇంకా నవ్వుతూంటే కించిత్తు సిగ్గుగా అనిపించింది నాకు. ఫోటోలోంచి రోహిత్ కూడా నన్ను చూసి నవ్వుతున్నట్లనిపించింది. ఐతేనేం, గుండెలపైనుంచి పెద్ద బరువును దింపినట్టయింది. ప్రేమతో కపిల్ ముఖమంతా ముద్దులు పెట్టేసాను.

                                                       ***


Rate this content
Log in

Similar telugu story from Inspirational