శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

ఇరుకెక్కడ?

ఇరుకెక్కడ?

2 mins
542


              ఇరుకెక్కడ...?

              -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

              

   "ఈసారి వచ్చినప్పుడు ఓ నాలుగు రోజులు ఉండేలా రండి అన్నయ్యా!" విజయవాడ నుంచి వచ్చి తిరిగి వెళ్లిపోతున్న వియ్యంకుడిని సాగనంపుతూ చెప్పింది అరుణ.


   "అలాగేమ్మా . బావగారిని జాగ్రత్తగా చూసుకోండి" అని చెప్పేసి హడావిడిగా రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి ఆటో ఎక్కేసాడు మూర్తి.


   ఆ ఆటో ఇంటి ముందు నుంచి కదిలి ముందుకెళ్లిపోయాక లోపలకు వచ్చింది అరుణ. 

   

  తన భర్త బండి మీద నుంచి పడిపోవడంతో కాలు విరిగి చిన్న సర్జరీ చేయడంతో విజయవాడలో వుంటున్న కొడుకు మావగారు విశాఖపట్టణానికి చూడటానికి వచ్చారు. ఉదయం గోదావరికి ఎక్స్ ప్రెస్ వచ్చి మళ్లీ సాయంత్రం అదే బండికి బయలుదేరిపోయారు.


   "మిమ్మల్ని చూడ్డం కోసమే పాపం అంత దూరం నుంచి శ్రమ తీసుకుని వచ్చారు. వచ్చినాయన రెండు రోజులుండుంటే ఆయన చూడాలనుకుంటున్న సింహాచలం,అరసువిల్లి, శ్రీకూర్మం దేవాలయాలు కూడా చూడ్డం అయిపోయేవి. చూడకుండా వెళ్లిపోతున్నారనే ఈసారి వచ్చినప్పుడు వాటితో పాటూ చుట్టుపక్కల చూసేవి చాలా ఉన్నాయి. వాటన్నిట్టినీ కూడా చూద్దురుగానని చెప్పి నాలుగు రోజులుండేలా రమ్మని చెప్పాను" అంది భర్తకు పళ్ళ రసం అందిస్తూ అరుణ.


  "నీపిచ్చిగానీ...వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవాళ్లే గానీ మనకున్న ఈ ఇరుకింట్లోకి వచ్చి నాలుగురోజులు కూడా ఉంటారా...?" అనుకున్నాడు భార్య అమాయకత్వానికి నవ్వుకుంటూ ఈశ్వర్.


           ***     ***     ***


    గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి కూర్చున్నాడు మూర్తి... తానొచ్చిన పని అయిపోవడంతో. ఊరు రావడానికి ఉదయం అనగా లేచిపోవడంతో చాలా అలసటగా వున్నాడు. రాత్రికి విజయవాడ వెళ్ళిపోయాక హాయిగా నిద్రపోవాలనుకున్నాడు.


    ఇంత దూరం వచ్చినందుకు అరసువిల్లి, శ్రీకూర్మం కాకపోయినా కనీసం సింహాచలం అయినా వెళ్లి అప్పన్ననైనా దర్శించుకోలేకపోయినందుకు లెంపలేసుకున్నాడు. తన కూడా భార్య లేకపోవడం వల్లే...ఆ దైవ దర్శనాల్ని వాయిదా వేసుకుని వెనుతిరిగాడు. 


  ట్రైన్ కాదులుతూంటే... అలసటగా కళ్ళు మూసుకున్నాడు గానీ...నిన్న రాత్రి భార్యతో జరిగిన సంభాషణ గుర్తుకొస్తుంది మూర్తికి.


   అల్లుడి తండ్రికి కాలు విరిగింది కదా...వెళ్లి చూసేసి అటునుంచి అటు మనం చూడాలనుకుంటున్న పుణ్యక్షేత్రాల్ని కూడా చూసేద్దాం . నువ్వూ బయలుదేరకూడదా అన్నాడు భార్యతో.


   "మీరు వెళ్తే వెళ్లి చూసొచ్చేయండి గానీ...నేను మాత్రం ఆ ఇరుకింట్లోకి వెళ్లి ఐదు నిమిషాలు వున్నా నాకు ఊపిరాడదు. ఆ క్షేత్రాల్ని కూడా దర్శించుకోండి. నేనెప్పుడైనా చూస్తాను. ఏదో అల్లుడు ఉద్యోగం ఢిల్లీలో కదాని ఈ సంబంధం చేసాం గానీ...కూతురు అత్తారింటికి వెళ్లి ఒకరోజు కూడా ఉండలేకపోతుంది పాపం" అంది వియ్యాలవారిని తక్కువచేసి మాట్లాడుతూ భార్య.


  ఈ సంబంధం చేయడం కాదు గానీ వాళ్ళని అడుగడుగునా చిన్నచూపుగానే చూస్తుంది భార్య. ఆమధ్య మనుమడు బారసాలకని వచ్చిన అల్లుడి తల్లిదండ్రుల్ని కనీసం ఒకరోజు ఉండి వెళ్లండన్న ముక్క కూడా భార్య తన నోటంపట అనలేదు. మనకున్న ఇల్లు ఎంత విశాలమైతే ఏం లాభం...మనసులు ఇరుకైనప్పుడు అనుకున్నాడు.


    వీళ్ళు మాత్రం ఎంత మర్యాద చేశారో కదా. ఒంట్లో బాగోలేదని చూడ్డానికి వచ్చినా కూడా శ్రమ అనుకోకుండా నాలుగు రకాల కూరలతో కమ్మగా వండిపెట్టింది వియ్యపురాలు. వాళ్ళ ఇల్లు ఇరుకైనా సరే... చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు చూడ్డానికి ఈసారైనా నాలుగు రోజులు ఉండేలా రమ్మని ఆహ్వానించిన ఆమె హృదయం ఇరుకుకాదని భార్య తెలుసుకునే రోజు రావాలి అనుకున్నాడు మనసులో...!!*

   

   

     

     


Rate this content
Log in

Similar telugu story from Inspirational