శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

పంచామృతం

పంచామృతం

2 mins
451


            పంచామృతం

          -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


    "ఎన్నాళ్ళయింది ఇంత కమ్మటి భోజనం తిని" మనసులో అనుకున్న మాటే పైకి అనేశాడు కృష్ణ.


   "అదేంటిరా! మీ ఆవిడ వండిపెట్టడం లేదా ఏంటి? ఈ వంకాయ కూరే నీకు కమ్మటి భోజనం అయిపోతే ఎలా? నువ్వు వస్తున్నట్టు ముందుగా తెలిస్తే...మరో రెండు రకాల కూరలు వండేదాన్ని." తనను తాను నొచ్చుకుంది. తమ ఊరునుంచి వచ్చిన తమ్ముడికి సరైన భోజనం పెట్టలేకపోయానని. తమ్ముడు కాకినాడ నుంచి వచ్చేసరికి భోజనాల సమయం అయిపోవడంతో... ఆరోజు వండిన వంకాయ కూర, రసం, మజ్జిగ పులుసు, కొబ్బరి పచ్చడితో భోజనం వడ్డించేసాను. కడుపు నిండా ఎంతో తృప్తిగా తిన్న తమ్ముడుని ప్రేమగా చూసుకుంది రత్నం.


   "అదేం లేదక్కా! మా ఆవిడ నాకు వండిపెట్టదని కాదు. పెట్టిపోతల్లో ఎవరు వచ్చినా బానే పెడుతుంది. కంచం నిండుగా అన్నం వడ్డించేసి రెండు రకాల కూరలు వేస్తుంది. కానీ ఆ అన్నం చిమిడిపోయినట్టుగా అయినా ఉంటుంది లేదంటే గట్టిగా అయినా వండి పడేస్తుంది. ఆ కూరలేమో రుచీ పచీ ఉండవు. అప్పటికే బలవంతంగా తిని చస్తుంటే ఇంకా కొంచెం వేసుకోమని అడక్కుండానే బలవంతంగా మరికాస్త కూరలు వేసేస్తాది. నేనైతే యే పాట్లో పడి తింటాను. ఇంటికి వచ్చిన చుట్టాలైతే భోజనం మాట ఎత్తేసరికి భయపడుపోతున్నారు. తన సంగతి నీకు తెలియంది ఏముంది అక్కా" అన్నాడు బ్రేవ్ మని తెలుస్తూ. 


   "చూడు ఇప్పుడు తిన్నానో లేదో అప్పుడే అరుగుదలకు వచ్చింది. ఎంతైనా నీ చేతి వంట అమ్మ చేసినట్టుగా ఉంది. ఇలాంటి వంకాయ కూర తిని ఎంతకాలమయ్యిందో? ఇదే కూర మా ఆవిడ వండితే పల్చగా పేస్ట్ లా వండుతుంది.వంకాయ ముక్క ఎక్కడా కనిపించదు. దాంతో రుచీపచీ లేని చప్పిడి కూరలా ఉంటుంది. మా అమ్మ వండినట్టు ఎందుకు వండలేవని అడిగితే...'నేను మా అమ్మ దగ్గర పెరిగాను కాబట్టి అలాగే వండుతాను. నాకైతే మా అమ్మ వంటలే నచ్చుతాయి' అంటూ గీర జవాబొకటి చెప్తుంది. అంతేగానీ మీకు నచ్చినట్టుగా నేర్చుకుని వండుతానండీ అని ఒక్కసారి కూడా సరదాకు అన్న మాట లేదు" అంటూ తన బాధంతా అక్కతో చెప్పుకున్నాడు కృష్ణ.


  తమ్ముడు చెప్పిన మాటలకు ఫక్కున నవ్వింది రత్నం.


   అక్కా! నన్ను చూస్తే నీకు జాలేయకుండా నవ్వెలా వచ్చిందే?  అమాయకంగా అడిగాడు .


   "పోరా తమ్ముడూ! నువ్వు పడుతున్న అవస్థలకి అయ్యో పాపం అని అనిపించినా...మీ ఆవిడ చెప్పిందీ నిజమేగా. నేను అమ్మ దగ్గర పెరిగాను కాబట్టి, అమ్మ వండినట్టే నేనూ వందాను కాబట్టి నా కూరల్లో మళ్లీ నీకు అమ్మ కనిపించింది. 

తనూ అంతే మరి...వాళ్ళమ్మ చేసినట్టుగా తనకు అలవాటయ్యాయి. అక్కడ అమ్మ రుచులు రమ్మంటే ఎలా వస్తాయి?" అంది మరదలిని కూడా వెనకేసుకొస్తూ రత్నం.


  ఓహో...అదా సంగతి? అయితే మా ఆవిడని తీసుకొచ్చి నీదగ్గర ఓ వారం రోజుల పాటూ ఉంచుతాను. ఈ వంకాయకూర, దోసకాయ పచ్చడి,కొబ్బరి పచ్చడి, చేపల పులుసు, అరటికాయ పులుసు అంటూ వాళ్ళమ్మ చేసే కొన్ని కూరల పేర్లు చెప్పి అవన్నీ నేర్పించమన్నాడు.


   అలాగే లేరా! మీరు మాత్రం ఎప్పుడైనా ఆ ఊరు నుంచి కదుల్తారా ఏంటీ? ఎప్పుడూ ఇల్లెవరో దొంగలు ఎత్తుకుపోతారన్నట్టు అక్కడే కాచుక్కూర్చుంటారు కదా. ఈసారైనా వచ్చి వారం రోజులుండండి. నీకు నచ్చినవన్నీ అయినా వండిపెడతాను" అంది తమ్ముడితో ఎంతో ప్రేమగా రత్నం.


  ఆ సంభాషణంతా వింటున్న రత్నం భర్త కామేశం వారి మాటలకు అడ్డొస్తూ...బామ్మర్ధీ! మీ అక్క మీ అమ్మగారి వంటలనే కాదు, మా అమ్మ వండే వంటలు కూడా నేర్చుకుని బ్రహ్మాండంగా చేసి పెడుతుంది. ఈసారి వచ్చినప్పుడు ఆ వంటలు కూడా నేర్చుకుని వెళ్లమను మీ ఆవిడను. ఇక ప్రతిరోజూ నీకు విందు భోజనంలాగే ఉంటుంది అంటూ హాస్యమాడాడు.


  కామేశం మాటలకు ముగ్గురూ కలిసి హాయిగా నవ్వుకున్నారు.


   నిజమే కదూ...ఎవరికైనా వారి తల్లి వండిన వంటలే పంచామృతాలుగా మనసును తడుముతూ ఉంటాయి...!!* 


   


   


Rate this content
Log in

Similar telugu story from Inspirational