ఆభరణం
ఆభరణం


ఆభరణం
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
"తన వ్యక్తిత్వమే తన ఆభరణం" అన్నది విశాల.
"నువ్వేంటమ్మా! ఆభరణాల మాటెత్తితే వ్యక్తిత్వంతో పోలుస్తావేంటి? నీకేమైనా అర్థమవుతుందా... శారదను తమ్ముడు పెళ్ళికి ఎందుకు తీసుకురావద్దంటున్నానో? అంది మరింత చిరాగ్గా తల్లితో మాధవి.
"ఛీ... నువ్వు అలా ఆలోచించడం అసలు బాగాలేదు. శారద ఎవరనుకుంటున్నావు...? మా పిన్ని కూతురు. నాకు చెల్లెలు కాబట్టి నీకు పిన్ని వరుస అవుతుంది. అలాంటి విశాలను పెళ్లికి తీసుకురావద్దనడం ఏమీ బాగోలేదు. అది మనతో పాటూ ఈపెళ్ళికి తీసుకెళ్తున్నాం అంతే." మరింత ఖరాఖండిగా చెప్పింది కూతురుతో విశాల.
"హ్మ్మ్...చాలా బాగుందమ్మా! ఈ కరోనాలో పెళ్ళెందుకు, కొన్నిరోజులు ఆగి చేద్దాంలే అంటే...నువ్వు వినిపించుకోలేదు. ఇప్పటికే మూడుపదుల నిండిపోయి కొడుకు ముదిరిపోయాడంటూ ముహూర్తాలు పెట్టించేశావు. అసలే పల్చపాటి మందితో జరగబోయే పెళ్ళిది. అటు ఇరవై మంది, ఇటు ఇరవై మంది మాత్రమే ఉండి జరుపుకోబోతున్నాం. పెళ్లికూతురు బంధువుల దగ్గర మనం కట్టే బట్టా, నగలు ఒకరికొకరం మించిపోవాలి. సరైన చీరా, నగా కూడా లేని శారదను తీసుకొచ్చి నీ చెల్లెలని చెప్పుకుంటావా ఏంటీ...? మనకు అవమానంగా ఉండదూ...?" అవహేళనగా మాట్లాడింది మాధవి.
"చాల్లేవే మాట్లాడింది చాలిక. నువ్విలా ఆలోచించడం ఏమీ బాగోలేదు. ఎవరి స్థోమతుకు తగ్గట్టు వాళ్ళుంటారు. అంతమాత్రాన్న ఇలా కించపరుస్తూ చిన్నతనంగా వేరుచేయకూడదు." కూతురు మాటలు ఒకపట్టాన్న నచ్చలేదు విశాలకు.
"సరే
అమ్మా...నీఇష్టం. నువ్వు తీసుకొస్తే తీసుకొచ్చావు గానీ, నీ పట్టు చీరల్లో చీరొకటిచ్చి, ఏదైనా బంగారం గొలుసు, జత గాజులూ ఇవ్వు. చేతికున్న ఆమట్టిగాజులు తీసేసి సరిగా తయారై రమ్మను. ఎంతోమందిని పిల్చుకుని ఆర్భాటంగా పిల్చుకునే పెళ్ళైతే గుంపులో గోవిందా అని ఏ మూలో కూర్చుని ఉండేది. అప్పుడెవరూ పట్టించుకునేవారే కాదు. అసలే పల్చపాటి మందితో జరిపించే ఈపెళ్లిలో ఒంటిమీద ఏ ఆభరణమూ లేకుంటే దిష్టిబొమ్మలా ఉంటుంది. ఈరోజుల్లో పనిమనుషులు కూడా ఎంతో కొంత నగలు వేసుకుంటున్నారు" శారదపై దయతలచి చెప్పినట్టు సలహా ఇచ్చింది తల్లికి మాధవి.
కూతురుతో వాదించడం కూడా చిరాకేసింది విశాలకు.
శారద అంటే తనకు ప్రాణం. సొంత చెల్లెలు కంటే, ఆ పిన్ని కూతురే తనకెంతో సహాయంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికంగా చితికిపోయి ఇప్పుడు పేదరికం ఆవహించినా... ఎప్పుడూ కుమిలిపోలేదు. ఏనాడైనా మళ్లీ పుంజుకోవచ్చనే నమ్మకంతోనే వున్నారు. డబ్బున్నప్పుడూ లేనప్పుడూ కూడా దాని వ్యక్తిత్వం ఒకేలా ఉంది. పిలిస్తే చాలు...ఎలాంటి సహాయానికైనా వాలిపోతూ ఉంటుంది. ఈ కరోనా సమయంలో పనివాళ్లను , వంట మనుషుల్ని పెట్టుకోలేక , క్యాటరింగ్ కి ఆర్డర్ ఇచ్చుకోలేక విశాల ఒక్కతే అవస్థలు పడుతుంటే...తనంతట తానుగా వచ్చి అన్నిపనుల్లోనూ అక్కకు తోడుగా నిలిచింది.
తన వ్యక్తిత్వమే తనకు ఆభరణమై ఎంతో విలువను చూపిస్తుంటే... తాను అరువుగా ఇచ్చే నగలు...ఆమె వ్యక్తిత్వం ముందు గిల్టుగానే కనిపిస్తాయి...! తనలోతానే అనుకుంది విశాల.
కూతురు మాటలు శారదకు ఎక్కడ వినిపిస్తాయోనని అప్పటివరకూ తలుపులు దగ్గరకు జారేసిన విశాల తలుపులు తెరుచుకుని...వంటగదిలో ఉన్న శారద దగ్గరకు వెళ్ళింది..!!*