శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

బామ్మ

బామ్మ

2 mins
471


              బామ్మ

              -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


  "చదువుకి వయసుతో పని ఏముంది?"అన్నది బామ్మ.

  

   భర్త పోయాక, చదువుకుంటున్న అరవయ్యేళ్ళ పార్వతి గారిని తక్కువ చేసి మాట్లాడానని...ఆవిడకే వంత పాడింది బామ్మ.


   నువ్వెన్నైనా చెప్పు బామ్మా..! ఈ వయసులో ఆవిడ చదువుకునే కంటే...వాళ్ళ పిల్లలకు ఆస్థులన్నీ అప్పచెప్పేసి కృష్ణారామా అంటూ ఒకచోట కూర్చోవచ్చు కదా. లేదంటే మనుమలతో హాయిగా కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకోవచ్చు." అన్నాను ఆవిడ గురించి బాగా తెలిసిన దాన్నవ్వడంతో.


   "అసలు పార్వతి గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు. మనుషులు పైకి కనిపిస్తున్నంత మాత్రాన్న ఆనందంగా ఉన్నారని అనుకోకూడదు. పిల్లలకు పెళ్లిళ్లు చేసాకనే వస్తాయి ఆవయసులో ఇబ్బందులన్నీ. ఆవిడ భర్తే బ్రతికుంటే పరిస్థితులు ఏ విధంగా వుండేవో గానీ... అతను లేకపోవడం వల్లా...ఆవిడ ఎక్కువ చదుకోకపోవడం వల్లా...ఆ ఇంట్లో జరుగుతున్న రాజకీయాలు అర్థం కాకుండా పోతున్నాయంట." అంది బామ్మ.


  " అదేంటి బామ్మా...? ఇప్పుడు పార్వతి గారికొచ్చిన లోటేమిట?" ఇంట్లో కూడా రాజకీయాలుంటాయా?" బామ్మ చెప్పే రహస్యాలు ఏమై ఉంటాయా అని ఆరా తీసాను.


  "ఏం చెప్పమంటావే తల్లీ! నలుగురి పిల్లల్ని కన్నదే గానీ...ఎవరి మట్టుకు వాళ్లే స్వార్థంగా ఆలోచిస్తారు. వాళ్ళయన పోతూ పోతూ మొత్తం ఆస్తి అంతా ఆవిడ పేరునే రాసిపోయారంట. పెద్ద కొడుకు మాత్రమే ఆవిడతో కలిసుంటాడన్న విషయం నీకు తెలుసు కదా. చిన్న కొడుకు ఎక్కడో దూరంగా ఉంటూ అప్పుడప్పుడొచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. కూతుళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపేసినా తల్లి దగ్గర నుంచి ఇంకా ఏదో వస్తే బావుండునని ఆశిస్తూ వుంటారు. సరే కదాని తన పుట్టింటి వారిచ్చిన నాలుగెకరాల పొలాన్ని కూతుళ్ళకి ఇద్దామనుకుంది. తీరా ఆపొలాల దస్తావేజులు పెద్దకొడుకు పేరు మీద మారిపోయివున్నాయి. 


   అదేంటి మేమంతా లేమా...పొలం అంతా పెదకొడుక్కి రాసేసావని చిన్నకొడుకు, కూతుళ్లు తల్లిని పట్టుకుని నిలదీశారు. పెద్దకొడుకు రెండు మూడుసార్లు తన దగ్గర ఎందుకు సంతకాలు పెట్టించుకుంటున్నాడో తెలీకపోయినా...సంతకం చేసేసిన విషయం గుర్తొచ్చి... కొడుకు తనను మోసం చేశాడని తెలిసొచ్చింది...ఆ విషయాన్ని బయటపెట్టి కొడుకుని అవమానించాలని అనుకోలేదు. మిగిలిన పిల్లలకు ఏదో సర్దిచెప్పి దోషిగా నిలబడింది పార్వతి.

    

   ఇకపైనన్నా ఆ కాగితాల్లో ఏంటి రాసుందో తెలుసుకోడానికైనా తను చదువుకోవాలనే నిర్ణయం తీసుకుంది. ఆడదానికి సంతకం వస్తే చాలనుకుంటే... కడుపున పుట్టిన కూడా ఈవిధంగానే ఎవరికివాళ్ళు స్వార్థంతో ఆలోచిస్తారు." అని చెప్పింది బామ్మ.


  బామ్మ చెప్పింది విన్నాకా...పార్వతమ్మ గారికి ఇంట్లోనే జరిగిన మోసానికి ఆవిడ తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపించించి. 


   "సరే బామ్మా! చదువుకోడానికి వయసుతో సంబంధం లేదని ఒప్పుకుంటాను. ఆవిడతో పాటూ నువ్వూ చదువుకోవచ్చు . నువ్వు కూడా పెద్దగా ఏమీ చదువుకోలేదు కదా!" అన్నాను.


   "అదేంటే... నువ్వు మరీనూ!" ఈవయసులో నాకు చదువేంటి...? జిత్తులమారితనంతో నా ఆస్తులు కాజేయడానికి సంతకం పెట్టించుకోడానికి కూడా నా దగ్గర దమ్మిడీ ఆస్తి కూడా లేదుగా" అంటూ పకపకా నవ్వడం మొదలెట్టింది మా బోసినోరు బామ్మ.


  బామ్మా మాటలు విన్నాకా నేను నోరావలించాను...!!


   

    

    

    

    

    

   

   




   

    

    

   


Rate this content
Log in

Similar telugu story from Inspirational