శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

కోడలి గుణపాఠం

కోడలి గుణపాఠం

2 mins
764


            కోడలి గుణపాఠం

          -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


   "పిల్లలు కాకపోతే పెద్దలు చేస్తారటోయ్ అల్లరి" నాపిల్లలు చేస్తున్న అల్లరిని ఆపుతూ కేకలేశానని తన మనుమల్ని వెనకేసుకొస్తూ నాతో అన్నారు అత్తగారు.


   "ఇది మరీ బావుంది అత్తయ్యా...! వాళ్ళు చేసే అల్లరేమైనా బాగుందా...? సోఫాలు ఎక్కి తొక్కుతూ కోతులల్లే దూకుతున్నారు. తోకలోకటే తక్కువ" అన్నాను.


   "ఇదిగో కామాక్షీ! ఇప్పుడే చెప్తున్నా...మళ్లీ నా మనుమల్ని కోతులూ కొండముచ్చులూ అంటే ఊరుకునేది లేదు" అన్నారు నన్ను రెచ్చగొడుతూ.


   "ఊరుకోండి అత్తయ్యా...! వీళ్ళు వేసే గెంతులకు కింద ఫ్లాట్ వాళ్ళు ఒకటే గోల. మేముండాలా వద్దా అంటూ. వాళ్ళకి మీరే సమాధానం చెప్పండి అయితే." అన్నాను వంటగదిలో వంటచేసుకుంటూ.


    నేను గట్టిగా అనేసరికి ఏమనుకున్నారో ఏమో...? "రండిరా... నాగదిలోకి పోదాం" అన్నారు.


    అబ్బే వాళ్ళు మాటెక్కడ వింటారు...? వంశీకి పదేళ్లు నిండినా కుదురు రాలేదు. వాడికంటే రెండేళ్లు చిన్నవాడైన అఖిల్ తో సమానంగా అల్లరిచేస్తాడు. ఈలోపు చెక్క సోఫా మీద నుంచి దబ్బున పడ్డాడు చిన్నోడు. అలా పడ్డంతో...వాడి తలకు

దెబ్బతగలడంతో పాటూ...సోఫా ఒరిగిపోయి దాని కాలు కూడా విరిగింది. దెబ్బతగలడంతో వాడు ఒక్కటే ఏడుపు. గదిలోకి దూరిన మా అత్తగారు పరుగున బయటకు వచ్చారు. 


   "అయ్యయ్యో...! బంగారం లాంటి కుర్చీ విరిగిపోయిందే. ఇది మా పుట్టింటివాళ్ళు నా పెళ్ళికి సారెగా ఇచ్చిన సోఫా సెట్" అంటూ...విరిగిపోయిన కుర్చీని చూసుకుంటున్నారు. 

   

   నా పిల్లాడికి దెబ్బ ఎక్కడ తగిలిందోనని తలరుద్దుతూ నేను చూసుకుంటున్నాను. అనుకున్నట్టే దెబ్బ తగిలిన చోట బొప్పి కట్టడం చేతికి తగిలింది. అదృష్టం కొద్దీ కన్నం పడలేదు. గబగబా ఫ్రిడ్జ్ లోంచి ఐసు ముక్క తీసి వాడి తలపై పెట్టాను. 

   

   అప్పుడు చూసారావిడ...మనుమడికి గట్టి దెబ్బే తగిలినట్టు. వాడిని ఊరుకోబెట్టడానికన్నట్టు...

    

  " అరెరే...! నీకు దెబ్బ తగలలేదురా. తగిలింది నా సోఫాకి. చూడు...దాని కాలు ఎలా విరిగిపోయిందో" అంటూ నానమ్మ అనేసరికి పకపకా నవ్వేశారు పిల్లలిద్దరూ.


   మా ఆదుర్దాలో మేముండగా కిందనున్న ఫ్లాట్ ఓనర్స్ రానే వచ్చారు. "మీ పిల్లలు చేసే అల్లరికి అనారోగ్యంతో ఉన్న మా మావగారి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఒకసారి మీరొచ్చి వినండి...దబ్బు దబ్బున్న ఎలా శబ్దాలు వస్తాయో" అంటూ గట్టిగా కేకలేశారు. 


   నేను వాళ్ళకి క్షమాపణ చెప్పుకుని ఇకపై పిల్లల్ని అదుపు చేస్తానని చెప్పి పంపేసరికి...ముగ్గురికి ముగ్గురూ గదిలోకి దూరిపోయారు. అదేంటో గానీ...కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికి మనుమలతో పాటూ చిన్నపిల్లలైపోతారు ఈ నానమ్మా, అమ్మమ్మలు అనుకున్నాను.


  తలుపు గడియపెట్టి వచ్చి...వారున్న గదిలోకి వెళ్ళాను. ముగ్గురికి ముగ్గురూ పిల్లుల్లా వున్నారు. 


  "చూసారు కదా...పిచ్చి అల్లరి చేస్తే ఇలాంటి దెబ్బలే తగులుతాయి. నానమ్మ సోఫా కూడా విరిగిపోయింది. కింద ఇంటివాళ్ళ వార్నింగ్ కూడా వచ్చింది. ఇవన్నీ కోరి తెచ్చుకోవడమే."


   "అత్తయ్యా! ఈకరోనా కాలంలో స్కూళ్ళు లేక, బయటకెళ్లి ఆడుకోలేక ఇంట్లోనే ఉండిపోవడం వల్ల పిచ్చి అల్లరి చేయడం నేర్చుకున్నారు. స్కూళ్ళు తీసేవరకూ అయినా...వీళ్ళ అల్లరికి కంట్రోల్ చేయకపోతే కష్టం. వాళ్ళని మీరు వెనకేసుకొస్తూ ఉండక...భగవద్గీత శ్లోకాలు, రామాయణం, మహాభారతం, నీతి కథల్లాంటివి మీలాంటి పెద్దవాళ్ళు చెప్తూ చేయాల్సిన పని. అంతగా అయితే కింద కూర్చోబెట్టి...వాళ్ళతోపాటూ యే వైకుంటపాళీ ఆటో, లూడూ , చదరంగం లాంటి ఆటలు ఆడించండి. వాళ్ళ అల్లరిని మాత్రం సపోర్ట్ చేసి మాట్లాడకండి" అన్నాను.


   "అలాగేలేవే! ఇకనుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను గానీ...మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆ చెక్క సోఫా కాలుని వెంటనే రిపేరు చేయించి పెట్టు. నీకు పుణ్యముంటుంది" అన్నారు.


  అత్తగారు అలా అంటుంటే...ఆవిడను చూసి జాలేసింది.

 ఎంతైనా...పుట్టింటి వారిచ్చిన వస్తువులపై ఎవరికైనా ప్రాణమే కదాని...!!*

    

   Rate this content
Log in

Similar telugu story from Inspirational