మాలోమేము
మాలోమేము


మాలో మేము
(గే)
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
ఉదయాన్నే...పొలం గట్టుకువచ్చిన నాగన్నకు ఆసమయంలో కొడుకునక్కడ చూసి ఏమీ అర్థం కాలేదు. పొలం కాడ ఓ చెట్టుకింద దిగాలుగా కూర్చుని వున్నాడు భద్రం.
చేతిలోని కర్రని అక్కడే పడేసి...కొడుకు దగ్గరగా వెళ్ళాడు. ఏంటిరా...ఈ యాలప్పుడు ఇక్కడకొచ్చి కూకున్నావ్. బడికి పోవా... యేటి...? తండ్రి ప్రేమగా చెప్పినా...కసిరినట్టే అనిపించింది భద్రానికి.
తండ్రి పలకరింపుతో...తుళ్ళిపడ్డాడు. తండ్రిని బెదురుగా చూసాడు. భయంతో వెనకెనక్కి జరిగాడు.
కొడుకు వాలకం చూస్తుంటే...వాడేదో తప్పు చేసాడనిపించింది నాగన్నకు. ఏంట్రా..ఏమయ్యింది...? ఎందుకంత భయపడుతున్నావ్...? అనునయంగా అడిగాడు. భద్రం ఏమీ చెప్పకుండా ...మరింతగా ముఖాన్ని కాళ్ళమధ్య దాచేశాడు.
నాగన్నకు కొడుకు పరిస్థితి అర్థం కాలేదు. ఏమైందిరా..? నువ్వు చెప్పకుంటే నేనేటి చేసేది సెప్పు...? సెప్తేనే గదా...నీ బాధేటో నాకు తెలిసేది...అంటూ బతిమలాడాడు కొడుకుని.
భద్రం కళ్ళు తుడుచుకున్నాడు. తండ్రి వైపు బేలగా చూసాడు ..తాను చెప్పింది విన్నాకా ఏమంటాడో అనే భయంతో.
చెప్పకపోతే...ఇక తన తండ్రి గట్టిగా అరుస్తాడని తెలుసు. అందుకే...చెప్పేయాలని పెదవివిప్పి చెప్పేసాడు పదేళ్ల భద్రం....!
*** *** ***
తనకున్న ఒక్కగానొక్క కొడుకు రాజేంద్రని తీసుకుని పట్నంలో మకాం పెట్టాడు తులసీరాం. మంచి హైస్కూల్లో వేసి చదివిద్దామనే నెపంతో.
తమ పల్లెటూరులోని పొలాన్ని కౌలుకి తీసుకున్న నాగన్న ... తన కొడుకు భద్రంతో పాటూ అంత హడావిడిగా ఎందుకొచ్చాడో అర్థంకాలేదు తులసీరాంకి.
వారం దినాలబట్టి తోటకూర కాడలా ముఖం వేలాడేసుకుని దిగాలుగా కూర్చుని ఉంటున్న కొడుకు విషయం చెప్పి...అతని ఎదుట చేతులు కట్టుకుని నుంచున్నాడు నాగన్న.
భద్రంని చూడగానే...లోపల నుంచి పరిగెత్తుకుని వచ్చి వాటేసుకున్నాడు రాజేంద్ర. అప్పటికి గానీ.. భద్రం ముఖం వెలగలేదు. వారిద్దరినీ చూస్తూ కాసేపు అలా ఉండిపోయారు.
" సరేరా నాగన్నా...! వీళ్ళని చిన్నప్పప్పటి నుంచి చూస్తున్నాం కదా...ఒక్క నిమిషం కూడా వదలకుండా పెరిగారు. ఊహ వచ్చాక ...ఇలా ఇద్దరూ విడిపోవడం ఇదే మొదటిసారవ్వడంతో...వారి మనసులెంతగా కలత చెందాయో చూశాం కదా. వీరిద్దరూ ఒకర్ని విడిచి ఒకరు వుండలేరని ఇక్కడకు వచ్చాకా... మా వాడిని కూడా చూసాకా అర్థమయ్యింది. ఇంచుమించు నా కొడుకు కూడా నీకొడుకులాగే ఏదో పోగొట్టుకున్నట్టుగా వున్నాడు వారం రోజుల నుంచీ. అదిగో చూసావా...అప్పుడే ఇద్దరూ దూరంగా వెళ్ళిపోయి ఎన్నెన్ని కబుర్లు చెప్పేసుకుంటున్నారో....? స్నేహం అంటే అలా ఉండాలి". అన్నాడు తులసీరాం.
"అవును బాబుగారూ....మీ అబ్బాయిని చూసాకే మావాడి ముఖంలోనూ వెలుగొచ్చింది"...ఆ పిల్లల్ని చూస్తూ ఆనందంగా అన్నాడు నాగన్న.
"ఒక పనిచేద్దాం నాగన్నా... వాళ్ళిద్దర్నీ చూస్తుంటే నాకూ ముచ్చటగానే ఉంది. మాకు ఎలాగూ ఒక్కడే సంతానం. వాడికి తోడుగా మీవాడు కూడా ఇక్కడే మాతో పాటూ ఉండి కలిసి చదువుకుంటాడు"...అని చెప్పి...భార్య వైపు చూస్తూ "ఏమంటావు లక్ష్మీ" అంటూ అనుమతి కోసం అడిగాడు.
"మీ ఇష్టమే నా ఇష్టమండీ. పిల్లలు కలిసి చదువుకుంటే అంతకంటే ఆనందం ఏముంటుంది...? నాగన్న కూడా ఏమంటాడో చెప్పాలిగా" అంది చిన్నగా నవ్వుతూ.
"అయ్యో...మీలాంటి పెద్దవారు నాలాంటి పేదోడి కొడుక్కి ఆశ్రయమిస్తాను అంటే ఎలా కాదనగలనమ్మా"...ఆనందంతో మనసు నిండిపోవడంతో చేతులెత్తి దణ్ణం పెట్టాడు నాగన్న.
"ఇక్కడ పేద గొప్ప కాదు నాగన్నా...అభం శుభం తెలియని మనపిల్లల స్నేహానికి విలువిద్దాం. వారి భవిష్యత్తుకి పునాది వేద్దాం" అన్నాడు మనసున్న మానవత్వంతో తులసీరాం.
*** *** ***
భద్రం...రాజేంద్ర చూస్తుండగానే..ఎదిగిపోయారు. ఇంటర్ తర్వాత ఇద్దరికీ ఒక రూమ్ తీసి...కావలసిన వస్తువులు అమర్చి... తులసీరాం భార్యతో వ్యవసాయం చూసుకోడానికి మళ్లీ తమ ఊరెళ్లి పోయాడు.
పెద్దవాళ్ళు దగ్గరలేకపోవడం...వీరి స్నేహానికి హద్దూ ఆపూ లేకుండా పోయింది. డిగ్రీలో జాయినైనప్పటినుంచీ...ఒకపక్క చదువుకుంటూనే...భద్రం వంటచేయడం...ఇంటిపనులు చేస్తుంటే...రాజేంద్ర బయటపనులు చేసుకుని రావడం చేసేవాడు. రాను రాను అదే దినచర్యగా మారిపోయింది. సమయం చిక్కితే సినిమాలకి వెళ్తూ ఉండటం..గ్రంధాలయం కెళ్ళి బుక్స్ చదవడం అలవాటు చేసుకున్నారు. భద్రానికి సాహిత్యం పై మంచి అభిలాషతో ఎప్పుడైనా కథలు రాసేవాడు. రాజేంద్రకి నటనలపై అభిలాషతో నాటకాలు వేస్తూ దర్శకత్వం చేసేవాడు. వీటిపై కూడా మంచి చర్చ జరిగేది ఇద్దరికీ. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలు కావడంతో...ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువిచ్చి...ఒకే మార్గంలో పయనిస్తున్నారు. చివరికి వారిద్దరూ అర్థం చేసుకున్నదేమిటంటే... తమని ఎవరూ విడదీయలేరని... ఎప్పటికీ విడిపోమని.
"ఒరేయ్...సాహిత్యమన్నా...కళలన్నా మనకెంతో ఇష్టం కదరా. నీవెన్నో కథలు రాస్తున్నావు. ఒక మంచి కథ ఆలోచించి ఆ పాత్రలకు తగ్గ మాటలు రాసావంటే....నా నాటకాల పిచ్చితో సినిమాలకు దర్శకత్వం వహించాలనుంది. నీవేమంటావు " అన్నాడు రాజేంద్ర - భద్రంతో.
స్నేహితుడి కోరికను కాదంటాడా...? తానే తన సర్వస్వమూ...తానే తన జీవితమూ అయినప్పుడు. సంతోషంగా ఒప్పుకున్నాడు భద్రం.
"తప్పకుండారా...నువ్వు చూస్తూ ఉండు. నువ్వు దర్శకత్వం వహిస్తానంటే అంతకన్నానా...? ఓమంచి కథ రాసి నీ చేతిలో పెడతానురా" అని చెప్పడంతో ...మనసారా స్నేహితులిద్దరూ ఒకరికొకరు హత్తుకున్నారు.
భద్రం కథల్లోకి వెళ్తే.... ఓ ఆడపాత్రని ఏం చక్కగా వర్ణిస్తాడని...? ఒక స్త్రీ మూర్తిలో వుండే లావణ్యాన్నంతా కళ్ళకు కట్టినట్టు కూర్చి రాస్తాడు. ఆసొగసుకు తగ్గ వర్ణనతో కూడిన మాటలు ఏ మగనికైనా మతిపోగొట్టేవే....!
కథను చదువుతున్నప్పుడే... రాజేంద్రకి పాత్రలతో ఎలా నటింపచేస్తూ దర్శకత్వం వహించాలనే ఆలోచన తళుక్కున మెరిసింది. చిలిపి చిలిపి సయ్యాటలతో...హీరో హీరోయిన్స్ తెరమీద నటిస్తుంటే....భార్యా భర్తలంటే...ఇలా వుండాలనిపించే సన్నివేశాలున్న చిత్రాలెన్నో వీరికి మాత్రమే సొంతమయ్యాయి.
నిర్మాతలకు వీరిరువురి కాల్ షీట్లు దొరకడమే కష్టమైపోయేది. ఒకదాని తర్వాత ఒకటి విజయాలతో తారాస్థాయికి చేరిపోయారు. వీరిరువురూ ఒకరిపై ఒకరు ఆధారపడకుండా ఏ సినిమా హిట్టు కాదేమో. ఆవిధంగా జోడీగా ఇద్దరూ శ్రమిస్తేనే... ఆసినిమా చూడముచ్చటగా ఉండేది. సకుటుంబంగా సినిమా చూసామన్న ఆనందం ప్రేక్షకుల్లో మనసుల్లో పదికాలాలు నిండిపోయేది.
*** *** ***
కొన్ని సంవత్సరాల తర్వాత...వృద్ధాప్యం కూడా చేరువయ్యింది...
అలాంటి ఇద్దరి అనుబంధంలోనూ...విషాదం చోటుచేసుకుంది....
నిద్రలో ఉండగా గుండెనొప్పి రావడంతో.. భద్రం కన్నుమూశాడు.
తన ప్రాణానికి ప్రాణమైన స్నేహితుని మరణం రాజేంద్రని తీరని శోకానికి గురిచేసింది. ప్రకృతి స్తంభించి పోయినట్లు... మనసులోకి ఓఉవ్వెత్తు కెరటం దూసుకొచ్చినట్లు...స్తబ్దుగా ఉండిపోయాడు.
బెంగ...మనిషినే కాదు మనసునీ పిప్పిచేసేస్తుంది. జీవితంలో ఇక కోలుకోలేని స్థాయికి దిగజారిపోయాడు. భద్రం వెళ్లిన చోటకే తానూ వెళ్లిపోవాలనే ప్రయత్నం ఫలించడానికి ఎన్నాళ్ళో పట్టలేదు రాజేంద్రకు.
సినీ పరిశ్రమ మంచి స్నేహితులైన వ్యక్తుల్ని కోల్పోయామన్న బాధ అందరి మనసుల్నీ ముసిరేసింది.
రాజేంద్ర...చనిపోయేముందు రాసిపెట్టిన ఉత్తరం... అందరినీ ఆశ్చర్యానికి లోనుచేసింది...వారిరువురి నడుమా ఉన్న సంబంధానికి , అన్యోన్యతకూ చలించిపోయారంతా.
ఆ ఉత్తరంలో....
రక్త సంబంధీకులకు, యావత్ తెలుగు రాష్ట్రాల అభిమానులకూ, నేను చెప్పుకునేది ఒక్కటే. నా స్నేహితుని మరణం నన్నెంతో కృంగదీసింది. వాడు లేని నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. వాడిలోనే నేను...నాలోనే వాడు అన్నట్టు ప్రాణం పోసుకుని కలిసి బ్రతికాము. నాకూ వాడి దగ్గరికి వెళ్లిపోవాలనుంది.
చిన్నప్పటినుంచీ...మేమిద్దరం ఒకరంటే ఒకరు పడి చచ్చేవాళ్ళం. ఒకే కంచం...ఒకే మంచంతో ప్రేమగా అల్లుకుపోయేవాళ్ళం. యుక్తవయసు దాటిపోతున్నా... పెళ్లిమీద దృష్టి పోలేదు. మాకు అమ్మాయిలను చూస్తామని మా పెద్దలు చెప్పి చెప్పి విసుగెత్తిపోయారు. ఇద్దరం ఒకే త్రాటిపై నడవాలనుకున్నాం. మీరిద్దరూ భార్యాభర్తల్లా ఒకరు విడిచి ఒకరుండలేరా అంటూ అందరూ వేళాకోళం చేస్తుంటే.... భద్రం ఎంతగా మురిసిపోయేవాడో...! అలాంటి కామెంట్స్ ని తలచుకుంటూ నన్ను ముద్దులతోనూ... హగ్స్ తోనూ ముంచేసేవాడు. నేను వాడిమీద చెయ్యేస్తే చాలు...వాడు ఏదో పరవశానికి లోనయ్యేవాడు. వాడు నన్ను పెనిమిటి స్థానంలో ఊహిస్తూ... తానొక భార్యగా అనుకునేవాడు. అందుకేనేమో... కథల్లో స్త్రీ పాత్రలకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ రాసేవాడు. అప్పుడప్పుడు నాతో అంటూ ఉండేవాడు...నువ్వు నాస్నేహితుడివి కాదురా...నిజంగా నా పెనిమిటివే అంటూ. వాడు అలా అంటుంటే...నాకెంతో గర్వంగా ఉండేది. మనసులో ఏదో తెలియని తన్మయత్వం. అది చెప్పినా మీకర్థం కాదు. నాకిప్పుడు వాడు దూరమయ్యాకా బాగా తెలుస్తుంది. వాడు లేని ఈ ఒంటరి జీవితాన్ని ఎలా సాగించగలను...? నిజంగా మాది భార్యాభర్తల సంబంధమేనని నాఅంతరాత్మ గట్టిగా చెప్తుంది. మాగురించి మీ అందరికీ అర్ధమయ్యే పరిభాషలో చెప్పాలంటే....'గే' అనే ఇద్దరి మగాళ్ల మధ్య సాగిన మానసిక సంబంధంతో దగ్గరవ్వడమే మామధ్య సాగిన సంబంధం కూడా.
ఈ విషయం బ్రతికుండగా చెప్పుకోలేకపోయినా...చచ్చాక అయినా ...మా గురించి మేము ఎలా అన్యోన్యతగా బ్రతికామన్నది మీ అందరికీ తెలియచేయాలనిపించింది. సినిమాల్లో మేమిచ్చిన సందేశాలే కాకుండా...మానవ జీవితాల్లో మాలో మేమున్నట్టుగా మాలాంటి 'గే' లు ఎందరో ఉంటారని మా ఇద్దరి తరుపునా నేవిన్నవించుకున్న నా ఆఖరి సందేశము కూడా ఇదే. భద్రం, రాజేంద్ర అనే మాఇద్దరి జీవితం ఇలా ముగిసిపోయినా... మరో జన్మలోనైనా ఒకరు ఆడ, ఒకరు మగగా పుట్టి భార్యాభర్తలమవుతాము.
- మీ
రాజేంద్ర.
ఆ ఉత్తరం వెలుగులోకి వచ్చాక ...ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుంది....మానవ జీవితాల్లో ఇలాంటివారెందరో రహస్యంగా బ్రతుకునీడ్చేవాళ్ళున్నారని...! సృష్టిలో మనిషి అవయవాలు సక్రమంగానే వున్నా...వారి కోర్కెలు, ఆలోచనల్ని లింగ బేధం లేకుండా మనసుని అలా మార్చేస్తాయేమో...? సమాజానికి చాటుగా ఉంటూ...వారిలో వారే మానసిక రుగ్మతకు లోనయ్యే ఇలాంటి 'గే' లు తెరచాటు బ్రతుకునే ఆశ్రయిస్తారని మనలో ఎంతమందికో తెలియని నగ్నసత్యమిది...!!*
***** ****** *******