Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Varun Ravalakollu

Romance

4.7  

Varun Ravalakollu

Romance

వన్ సైడ్ లవ్

వన్ సైడ్ లవ్

11 mins
4.3K


అలారం ఇప్పటికే ఆరోసారి మ్రోగింది. ఇంకా స్నూజ్ చేస్తూ పడుకుంటే ఆఫీసుకి లేట్ అవుతుందని ఎలాగో అలా మెల్లిగా లేచి నిల్చున్నాడు శ్రీధర్. లేవగానే తల దిమ్ముగా అనిపించింది.

‘రాత్రి కొంచెం తక్కువ తాగితే బాగుండూ’ అనుకున్నాడు.

టైం ఎనిమిది దాటింది. తొమ్మిది గంటలకల్లా ఆఫీసులో ఉండాలి. బెడ్ పక్కకు ఖాళీ సీసాలు, నమిలి పడేసిన నాన్వెజ్ ఎముకలూ చిందరవందరగా పడున్నాయి.

‘నా కొడుకులు తాగడం, వెళ్ళిపోవడం! ఇదంతా ఎవడు సర్దుతారు?’ అనుకున్నాడు.

తనకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రమే. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. శ్రీధర్ ఒక్కడే బ్యాచిలర్గా ఉన్నాడు. అందుకే వీకెండ్ రాగానే ముగ్గురూ కలిసి శ్రీధర్ రూమ్ లోనే తాగుతారు. చాలా రోజుల నుండి ఇది జరుగుతుంది. అంతా సర్దేసి హడావిడిగా రెడీ అవ్వడం మొదలు పెట్టాడు.

శ్రీధర్ కి ముప్పైమూడేళ్లు. తన ఈడు వారందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వారి పిల్లలు స్కూళ్లకు కూడా వెళ్ళిపోతున్నారని తన తల్లి అప్పుడప్పుడూ ఫోన్ చేసి బాధపడుతూ ఉండేది. తనకు పెళ్లి కాకపోవడానికి పెద్ద కారణాలేవీ లేవు. అందగాడు, మంచి ఉద్యోగం. పిలిచి మరీ పిల్లనిస్తామని చాలా సంబంధాలు వచ్చాయి. కానీ శ్రీధర్ ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు పెళ్లి గురించి శ్రీధర్ పెద్దగా ఆలోచించలేదు.

కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. వన్ సైడ్ లవ్. ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడు. తర్వాత ఆమెకి పెళ్లైపోయింది. దాని తర్వాత ఏ అమ్మాయినీ చూడలేదు. ఎవరైనా అమ్మాయి తనతో పరిచయం పెంచుకోవాలని చూసినా అవాయిడ్ చేసేవాడు. దీనితో తన జీవితంలో మరో ప్రేమ కథ లేకుండా పోయింది. ఆఫీసుకి వెళ్ళడం, ఇంటికి రావడం, టి.వి చూడటం, మొబైల్ ఫోన్ తో గడపడం, వీకెండ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యడం, నెల జీతం రాగానే సగంజీతం ఊర్లో ఉన్న అమ్మానాన్నలకి పంపడం, మిగతాది తన ఇష్టానికి ఖర్చుపెట్టుకోవడం - కొన్ని సంవత్సరాలుగా ఇదే రొటీన్ గా జరుగుతుంది. అయినా శ్రీధర్ ఎప్పుడూ బోర్ గా ఫీల్ అవ్వలేదు. నిజానికి తనకి ఈ జీవితం చాలా ఈజీగా, హాయిగా ఉంది. తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుని పడే పాట్లు చూసి నవ్వుకునేవాడు. ఎందుకో ఎన్ని సంబంధాలు చూసినా ఏ అమ్మాయీ నచ్చేది కాదు. తనకు ఎలాంటి అమ్మాయి కావాలో తనకే క్లారిటీ లేక అలాగే ఉండిపోయాడు.

ఆఫీసుకి ఇంకా ఇరవై నిమిషాలు ఉంది. బైక్ స్టార్ట్ చేసి రోడ్డు మీద పడ్డాడు. ఇంకో అరగంటలో ఆఫీసులో ఉంటాడు. బైక్ పైన వెళ్తుంటే ఏవేవో ఆలోచనలు. రోడ్డు మీద వెళ్తున్న జంటల్ని చూస్తుంటే మనసుకు బాధగా అనిపించింది. జీవితం చాలా రొటీన్ గా అనిపించింది. ఇన్నిరోజులూ బాగున్నా ఇప్పుడిప్పుడే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది. ఎన్ని రోజులు ఇలా, ఇంకేమార్పూ తన జీవితంలో రాదా అనిపించింది. ఆఫీస్, ఇల్లు - ఇల్లు, ఆఫీసు ఇంతేనా? ఎందుకో ఆఫీసుకి వెళ్ళబుద్ధి కాలేదు. వెంటనే బైక్ సైడుకి తీసుకుని హెచ్ఆర్ కి కాల్ చేసి ఆరోజు హెల్త్ బాగోలేదని లీవ్ తీసుకున్నాడు. పక్కనే ఒక చిన్న టీకొట్టు ఉంటే టీ తాగుతూ ఒక రాయి పైన కూర్చున్నాడు. ఆ టీకొట్టు ముందు ఒక డిగ్రీ కాలేజీ ఉంది. స్టూడెంట్స్ అందరూ అప్పుడే కాలేజీకి వెళ్తున్నారు. సరదాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళను చూస్తుంటే జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపించింది. తను క్లాస్ టాపర్ కావడానికి ఎప్పుడూ పుస్తకాలతో ఎలా కుస్తీపట్టేవాడో గుర్తొచ్చింది. ఎప్పుడూ పుస్తకాలే లోకం కావడంతో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. క్లాస్ ఫస్ట్ రావడమే తన చిన్నప్పటి నుండి తన ధ్యేయం. ఎప్పుడైనా రాకపోతే తల తీసేసినట్టు ఉండేది తనకు. ఇంటర్లో జిల్లాఫస్ట్ వచ్చాడు. అదే బి.టెక్ లో కూడా కంటిన్యూ అయ్యింది.

తనకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. ఎవరితోనైనా మాట్లాడినా చదువు గురించే మ్యాగ్జిమమ్ మాట్లాడేవాడు. దీంతో సబ్జెక్టులో ఏమైనా డౌట్స్ వచ్చినవాళ్ళు తప్ప ఎవ్వరూ ఎక్కువ మాట్లాడేవారు కాదు. అలాంటి టైంలోనే కీర్తనని చూసాడు. కీర్తన తనకు జూనియర్. చాలా అందంగా ఉంటుంది. అందానికి తగ్గట్టు హుందాగా ఉండేది. తెలివైంది, బాగా చదివేది కూడా. ఎంతోమంది ఆమెతో మాట్లాడడానికి తెగ ప్రయత్నించేవాళ్ళు. అందరితోనూ ఆమె మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడేది. ఆమె ముఖాన్ని చిరునవ్వు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండేది. అలా ఆమె అందరితోనూ కలుపుగోలుగా ఉండడం తనకు ఎంతో నచ్చేది. తను కూడా ఆమెలా ఉంటే ఎంత బాగుండు అనుకునేవాడు కానీ చిన్నప్పటినుండి అలావాటైన స్వభావం ఎలా మారుతుంది? బహుశా అదే ఆమెతో ప్రేమలో పడేటట్టు చేసిందేమో. ఆమె చనువును చూసి చాలామంది ప్రపోజ్ చేసారు. సున్నితంగా అందరినీ తిరస్కరించింది. చాలామందికి ఆమె ఒక డ్రీం గర్ల్.

శ్రీధర్ కూడా ఆమెతో ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకునేవాడు. చిన్నప్పటి నుండి ఇంట్రావర్ట్ గా పెరగడంతో ఎవరితోనైనా కొత్తగా పరిచయం పెంచుకోవాలంటే తనవల్ల అయ్యేది కాదు. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు శ్రీధర్ ఇంటి దగ్గరే అయినా కూడా కనీసం పేరు కూడా పరిచయం చేసుకోలేకపోయాడు, దూరంనుండి చూసి సంతోషపడడం తప్ప. తన చదువు, తన పుస్తకాలు - అదే లోకం. ప్రొఫెసర్ల చేత మాత్రం చాలా మంచివాడు అనిపించుకున్నాడు. తన క్లాస్మేట్స్ కొంతమంది ప్రేమలో మునిగి తేలుతుంటే తను కూడా ప్రేమ పొందగలిగితే ఎంత బాగుండూ అనుకునేవాడు తప్ప కనీసం తన ప్రేమ గురించి ఆమెతో చెప్పాలి అనే విషయం గ్రహించలేకపోయాడు. చెప్తే రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయం. ఇలాగే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లలో అందరికంటే ముందు తనకే జాబ్ వచ్చింది. అప్పుడు చెప్పాలనుకున్నాడు తన ప్రేమ గురించి. అప్పుడైతే ఒప్పుకునేందుకు చాన్సెస్ ఎక్కువుంటాయనుకున్నాడు. కానీ తన దురదృష్టమో ఏమో కానీ అదే టైంలో ఆ అమ్మాయికి పెళ్లైపోయింది. కొన్ని రోజులు ఆ బాధలోనే ఉండిపోయాడు. ఇంక ఆ ఏరియాలో ఉండలేక వేరే చోటికి వెళ్ళిపోయాడు.

ఆ కాలేజ్ స్టూడెంట్స్ ని చూస్తుంటే ఆ రోజుల్లో తను ఏం కోల్పోయాడో అర్ధమైంది.

‘ఇప్పుడు చూడు నా పరిస్థితి బావిలో కప్పలా తయారయ్యింది’ అని బాధపడ్డాడు.

కనీసం అందరిలా పెళ్లి చేసుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది, వచ్చే అమ్మాయి ఎలాంటిది వస్తుందో అని. ఏదైనా ఫంక్షన్ కు వెళ్ళినా పెళ్ళెప్పుడు అనే మాటలు వినలేక చుట్టాలని కలవడమే మానేసాడు. ఊరికి వెళ్ళాలంటేనే భయమేసేది. లైఫ్ అంతా ప్రశాంతంగానే ఉన్నా జీవితంలో ఏదో శూన్యం ఆవరించినట్టు అనిపించింది.

‘ఇంకా ఎన్ని రోజులు ఇలా... ఇప్పుడైనా తన జీవితంలో మార్పు రావాలి. అనవసరమైన భయాలన్నీ వదిలేయాలి’ అని నిర్ణయించుకున్నాడు.

వెంటనే ఇంటికి ఫోన్ చేసి పిల్లని చూడమని చెప్పాడు. వారం రోజుల్లోనే మంచి సంబంధం వచ్చింది.

అమ్మాయి బాగా చదువుకుంది. అందంగానే ఉంది. మంచి ఉద్యోగం కూడా చేస్తుంది. పైగా ఆమె తండ్రి చిన్నపాటి రాజకీయనాయకుడు. ఆమెతో పెళ్లి చూపుల రోజు కొంచెం ధైర్యం తెచ్చుకుని ఒక అరగంటకు పైగానే మాట్లాడాడు. ఒక అమ్మాయితో అంతసేపు మాట్లాడడం అదే ఫస్ట్ టైం. దీప్తికి నో చెప్పడానికి రీజన్ దొరకలేదు. అంతమంచి సంబంధం ఇంక దొరకదని చాలామంది చెప్పారు. ఒక నెలలో పెళ్లి ముహూర్తం వచ్చింది. నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని చాట్ చేయడం, అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడడం అన్నీ జరిగిపోతున్నాయి.

అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి తన ఆఫీసులో జాయిన్ అయ్యింది. ఆమెను చూడగానే శ్రీధర్ షాక్ అయ్యాడు. తనెవరో కాదు, బి.టెక్ లో తను లవ్ చేసిన అమ్మాయి కీర్తన. అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఆమెను దూరం నుండి చూస్తున్నాడు గానీ దగ్గరికెళ్ళి పలకరించాలంటే ఏదో మొహమాటంగా ఉంది తనకు.

ఎందుకో ఆ రోజు తనకు పని చెయ్యాలనిపించలేదు. కాఫెటేరియాలో కూర్చుని కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో కీర్తన వచ్చి తన ముందు కూర్చుంది. శ్రీధర్ అవాక్కయిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు.

“హాయ్! మీరు నన్ను గుర్తుపట్టారా?” అంది నవ్వుతూ.

“ఆ... ఆ...” అన్నాడు అయోమయంగా.

“ఐ థింక్ యూ డోంట్ రికగ్నైజ్ మీ, యాక్చువల్ గా నేను బి.టెక్ లో మీ జూనియర్ ని. ఇంకో విషయం ఏంటంటే నేను మీ పక్క వీధిలోనే ఉండేదాన్ని. చాలాసార్లు మిమ్మల్ని పలకరించాలని చూసినా మీరు నన్ను పట్టించుకోలేదు. చదువులో మీరు టాపర్ కదా ఏమైనా డౌట్స్ వస్తే అడుగుదామని ట్రై చేసాను. కానీ మీరు ఎప్పుడూ బిజీగా కనిపించేవారు. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యలేదు” చెప్పుకుంటూ పోతుంది కీర్తన.

శ్రీధర్ కి అది కలో నిజమో అర్ధం కావట్లేదు.

‘ఛా... అప్పుడే ఆమెతో పరిచయం అయ్యుంటే తన లైఫ్ వేరేలా ఉండేదేమో..., అయినా అమ్మాయి పలకరించినా పట్టించుకోనంత ఏం వెలగబెట్టాను ఆ టైంలో?’ అని తనను తానే తిట్టుకున్నాడు.

“ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా? నాకు మాత్రం మిమ్మల్ని ఇక్కడ చూడగానే సర్ప్రైజ్ గా అనిపించింది. అందులోనూ మన టీమ్ కి లీడ్ మీరే అంటగా. అందుకే కొంచెం పరిచయం చేసుకుందామని ఇలా...” కీర్తన కొంచెం ఎక్సైటింగ్ గా అంది.

“ఆ.. గుర్తుపట్టాను. నా టీం అని తెలిసి నేనే మిమ్మల్ని పలకరిద్దాం అనుకున్నాను” అన్నాడు శ్రీధర్ చిన్నగా.

“హమ్మయ్య ఇంక నాకు ఏ డోకా ఉండదు. అసలే కొత్త కదా, ఈ ఎన్విరాన్మెంట్ కి ఎలా అడ్జస్ట్ అవుతానో అనుకున్నా. పైగా మీరే టీమ్ లీడ్ కాబట్టి వర్క్ ప్రెజర్ కూడా ఉంటుందనుకోను. అఫ్కోర్స్ ఐ యామ్ ఏ హార్డ్ వర్కర్. మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టనులెండి. ఇంకా..., ఎలా ఉన్నారు?”

కీర్తన అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోయాడు. అప్పటికీ ఇప్పటికీ ఆమె మొఖంలో చిన్న మార్పు కూడా లేదు. అదే ఎనర్జీ, అదే ఉత్సాహం, అదే చిరునవ్వు.

“ఏంటో ఆలోచిస్తున్నట్టున్నారు..., మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేసానా?” అంది కీర్తన.

“ఆ..., అదేం లేదు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసి... కాఫీ?” నసిగాడు శ్రీధర్.

“హ్మ్.. కోల్డ్ కాఫీ”

శ్రీధర్ వెళ్లి కాఫీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు. తను కాఫీ సిప్ చేస్తూ ఉంది.

“హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ..., ఐ మీన్ యువర్ హజ్బెండ్, చిల్డ్రన్...” శ్రీధర్ మెల్లిగా అడిగాడు.

ఆ ప్రశ్న అడగగానే కీర్తన ముఖం డల్ గా అయిపొయింది. కొంచెంసేపు మౌనం తర్వాత అంది, “ఐ యాం డివోర్స్డ్, పిల్లలు లేరు”

అంతసేపూ ఉరకలేస్తున్న గోదారిలా ఉన్న ఆమె ఒక్కసారిగా గంభీరంగా ఉన్న సముద్రంలా మారిపోవడం చూసి శ్రీధర్ కి ఏం అనాలో అర్ధం కాలేదు. ఇంతలో దీప్తి నుండి కాల్ వచ్చింది. ఎందుకో ఫోన్ లిఫ్ట్ చెయ్యాలనిపించలేదు. కానీ పొద్దున్న చాట్ చేస్తూ లంచ్ టైంకి కాల్ చేస్తా అన్నాడు. లిఫ్ట్ చెయ్యకపోతే బాగోదని లిఫ్ట్ చేసి కీర్తననని ఎక్స్క్యూజ్ అడిగి కొంచెం పక్కకెళ్ళి దీప్తితో ఏదో హడావిడిగా నాలుగు మాటలు మాట్లాడి తిరిగి వచ్చి చూసాడు. కీర్తన అప్పటికే అక్కడినుండి వెళ్ళిపోయింది. శ్రీధర్ మూడ్ మొత్తం పాడైపోయింది.

ఆరోజు ఆఫీసులో మొత్తం కీర్తన గురించే తన ఆలోచనలు సాగాయి. మరుసటిరోజు మీటింగ్ ఉండటం, ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల కీర్తన కనిపించినా పెద్దగా మాట్లాడలేకపోయాడు. ఆరోజు సాయంత్రం లేట్ అయ్యింది. పార్కింగ్ లాట్ కి వెళ్లి బైక్ స్టార్ట్ చెయ్యడానికి ప్రయత్నించాడు. ఎంతకీ స్టార్ట్ కాలేదు. అలాగే దానితో తంటాలు పడుతూ కొద్దిసేపు ఉన్నాడు. ఇంక లాభం లేదనుకుని క్యాబ్ బుక్ చేద్దామనుకుని మొబైల్ బయటికి తీసాడు. ఇంతలో వెనకనుండి కీర్తన వచ్చి, “ఎనీ ప్రాబ్లం?” అంది.

“అవునండీ..., బైక్ స్టార్ట్ కావడం లేదు. ఈ మధ్య ట్రబుల్ ఇస్తోంది. మెకానిక్ కి చూపిద్దాం అనుకుంటే టైం దొరకట్లేదు” అన్నాడు శ్రీధర్.

“పోనీ నా స్కూటీ మీద వస్తారా? మీ ఇల్లు నేను వెళ్ళే దారిలోనే కదా..., అంటే..., నిన్న చూసాను”

“అంటే క్యాబ్ బుక్ చేద్దామనుకుంటున్నా..., మీకెందుకు అనవసరంగా శ్రమ”

“నాకేం శ్రమ లేదు. దారిలోనే కదా. మీకు ఇబ్బంది లేకపోతేనే”

“నాకేం ఇబ్బంది లేదు. మీకే ఇబ్బందేమో అని”

“నాకలాంటి అనవసర ఇబ్బందులేం లెవ్వులెండి”

“అయితే పదండి” అప్రయత్నంగా అన్నాడు శ్రీధర్.

చల్లని గాలిలో ఒక అమ్మాయి బైక్ పైన అలా వెళ్తుంటే శ్రీధర్ మనసు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. కీర్తన పెర్ఫ్యూమ్ వాసన ఆ ఫీలింగ్ ని ఇంకా ఎక్కువ చేస్తుంది. కానీ - నీకు పెళ్లి ఫిక్స్ అయ్యింది ఇలాంటివి కుదరవు - అన్న వార్నింగ్ ఇచ్చినట్టు దీప్తి నుండి వాట్సప్ మెస్సేజ్ వచ్చింది.

“వేర్ ఆర్ యూ?”

“ఆన్ ది వే టు హోమ్” రిప్లై ఇచ్చాడు.

“వై లేట్?”

“హెవీ ఆఫీస్ వర్క్”

“ఆర్ యూ నాట్ డ్రైవింగ్?”

“యా మై బైక్ గాట్ ట్రబుల్”

“ఓహ్! ఇన్ క్యాబ్ ఆ?”

శ్రీధర్ కి ఇంక చాట్ చెయ్యాలనిపించలేదు.

“యా... మై మొబైల్ బ్యాటరీ ఈజ్ వెరీ లో, కాల్ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమ్” అని ఆ చాటింగ్ అక్కడితో ఆపేసాడు.

కీర్తనతో ఏదైనా మాట్లాడాలి అనిపించింది కానీ ఎలా మొదలు పెట్టాలో అర్ధం కాలేదు.

“ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టున్నారు?” అంది కీర్తన.

“ఆ... ఫ్రెండుతో”

“ఓహ్! అవునూ, మీ ఆవిడను నాకెప్పుడు పరిచయం చేస్తారు? ఈ ఏరియాకి కొత్త కదా, మీ ఆవిడని పరిచయం చేస్తే మేమిద్దరం ఫ్రెండ్స్ అవుతాం. ఎవరూ పరిచయం లేక ఒకటే బోర్ కొడుతుంది” అంది కీర్తన.

“అంటే..., నాకింకా పెళ్లి కాలేదు” నసిగాడు శ్రీధర్.

“వాట్ ఇంకా పెళ్లి కాలేదా?”

“అదేంటండీ ఏదో తప్పు చేసాను అన్నట్లు అలా అన్నారు?”

“ఓహ్! సారీ జెనరల్గా ఈ ఏజ్ వరకూ అందరికీ పెళ్లై పిల్లలు కూడా ఉంటారు కదా. అందుకే అలా అన్నా”

“అంటే చేసుకోవాలి అనిపించలేదు అందుకే”

“మరెప్పుడు చేసుకుంటారు?”

“ఆల్రెడీ పెళ్లి సంబంధం కుదిరింది. నెక్స్ట్ మంత్ నా పెళ్లి”

“హే! కంగ్రాట్స్ అయితే మీ భార్యని నీ పెళ్ళికి ముందే పరిచయం చెయ్యాలి”

“ఆ.. అలాగే”

“నాకు ఎవరితోనూ మాట్లాడకుండా గమ్మున ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను. చిన్నప్పటి నుండి ఇలా అలవాటయిపోయింది లెండి. మీకు కాబోయే ఆవిడని పరిచయం చేస్తే కొంచెం రిలీఫ్ అవ్వొచ్చు”

శ్రీధర్ స్కూటీ మిర్రర్లో కీర్తన ముఖం చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు. ఇంత మంచి అమ్మాయి విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అనుకున్నాడు. అడగాలా వద్దా అని కొంచెం సంశయించి, “నువ్వేం అనుకోనంటే నేనొక విషయం అడగొచ్చా?” అన్నాడు.

“ఆ....”

“మీరు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా? మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పండి” మొహమాటపడుతూ అన్నాడు.

“..... ఇబ్బందేం లేదులే. ఈపాటికి చాలా మందికే చెప్పాన్లే, అలవాటైపోయింది. రేపైనా మీకు చెప్పాల్సిందే కదా. నాకు పిల్లలు కారు. నా గర్భసంచిలో ప్రాబ్లం ఉండి తీసేసారు. అందుకే నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మా అత్తామామలు కూడా ఆయనకే సపోర్ట్ చేసారు ఇంకేం చేస్తాం”

“అదేం నాకు పెద్ద ప్రాబ్లంగా అనిపించట్లేదే..., పిల్లల కోసం చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి కదా?”

“పెద్ద ప్రాబ్లం కాదా!? ఇవాళా రేపు ఎంత సిల్లీ రీజన్స్ కి విడాకులు తీసుకుంటున్నారో తెలుసా? వాటితో పోలిస్తే నాది పెద్ద ప్రాబ్లమే”

“అయినా మీ హజ్బెండ్ కి మీ మీద లవ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాకపోయుండేది”

“లవ్వా...” నవ్వింది.

“ఏమైంది?”

“లవ్ అంటే నవ్వొచ్చింది. నాకు చాలామంది లవ్ ప్రపోజ్ చేసారు. నేను ఎవ్వరినీ యాక్సెప్ట్ చెయ్యలేదు. కాలేజీలో ఉండగానే మంచి సంబంధం అని నాకు పెళ్లి చేసేసారు. ఆయనకి బిజినెస్, ఫ్రెండ్స్ తప్ప ఏమీ పట్టేది కాదు. ఇంట్లో ఫ్రిడ్జ్, టి.వి, ఏసి లాగ నేను కూడా ఒక వస్తువునే తనకి” బైక్ వేగం పెంచింది తను.

‘ఒక అపురూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఆమె విలువ తెలుసుకోలేకపోయాడు వెధవ’ అనుకున్నాడు మనసులో. ‘ఎంతోమంది కలల రాణిని, ఇంట్లో పెట్టుకుని ఒక వస్తువుగా చూస్తాడా? ప్రేమించే హృదయం అందరికీ ఉండదు కదా. దేవుడికి ఎవరికి ఏం ఇవ్వాలో తెలియదు’ ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు.

ఇంతలోనే శ్రీధర్ ఇల్లు వచ్చేసింది.

శ్రీధర్ ఈ లోకంలోకి వచ్చి, “ఇక్కడ సైడుకి ఆపండి” అన్నాడు.

బైక్ దిగి థాంక్స్ చెప్పాడు.

“సారీ నా పర్సనల్ విషయాలు చెప్పి బోర్ కొట్టించాననుకుంటా?” నవ్వుతూ అంది కీర్తన.

“అదేం లేదు” అన్నాడు ఆమె నుదురు మీద చిరు చెమటను చూస్తూ.

స్ట్రీట్ లైట్ వెలుతురులో మెరుస్తున్న ఆ చెమట బిందువులు ముత్యాల్లా అనిపించాయి తనకు.

“ఓకే బై, గుడ్ నైట్” బైక్ రివర్స్ చేస్తూ అంది తను.

“గుడ్ నైట్” కీర్తన వెళ్లిపోతుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు.

రాత్రంతా శ్రీధర్ కి నిద్ర పట్టలేదు. దీప్తి ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యలేదు.

‘ఇదేంటి తను కీర్తనతో మళ్ళీ ప్రేమలో పడిపోతున్నాడా? ఈ టైంలో ఇది కరక్టేనా? అందరూ ఏం అనుకుంటారు? అందరి గురించి వదిలేసినా, దీప్తికి తెలిస్తే తన గురించి ఏం అనుకుంటుంది?’ ఇలా రకరకాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు.

రోజులు గడుస్తున్నకొద్దీ శ్రీధర్ కి భయం పెరగడం మొదలైంది. కీర్తన తన జీవితంలోకి రాకపోతే దీప్తినే పెళ్లి చేసుకునేవాడిని కదా అని సర్దిచెప్పుకుందాం అనుకున్నా దేవుడే తన కోసం కీర్తనని తన ఆఫీసుకి పంపాడని మనసు మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఇంక ఏదో ఒకటి తేల్చుకోకపోతే జీవితాంతం బాధ పడాల్సివస్తుందని నిర్ణయించుకున్నాడు.

***

ఆ రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు శ్రీధర్. అప్పుడప్పుడు పిచ్చుకలు శబ్ధం చేస్తుండడంతో అటువైపు చూస్తున్నాడు. రెండు పిచ్చుకలు గోడమీద కూర్చుని సరదాగా సరసాలు ఆడుకుంటున్నాయి. వాటినే కొద్దిసేపు చూసి పేపర్ పక్కన పడేసి ఇంట్లోకి వెళ్ళాడు. ఆమె వంట గదిలో కూరగాయలు తరుగుతూ ఉంది. నుదిటి పై చెమట వస్తోంటే ముంగుర్లని వెనక్కి సరిచేసుకుంటూ ఉంది. ఆ టైంలో ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు ఎంతో శ్రద్ధతో వేసిన పెయింటింగ్ లా కనిపించింది. ఆ దృశ్యం అదృశ్యం కావొద్దు అనుకుని వెంటనే మొబైల్ ఫోన్ తీసుకుని ఆమెను దూరం నుండే ఫోటో తీసాడు.

కీర్తన అతని వైపు చూసి, “ఏం చేస్తున్నావ్?” అంది.

“ఏం లేదు నా ఏంజెల్ ని ఫోటో తీస్తున్నా” అన్నాడు శ్రీధర్.

“అబ్బో...” అంది తను టమాటాలు తరుగుతూ.

వెంటనే వెళ్లి ఆమెను వెనక నుండి వాటేసుకున్నాడు.

“ఏంటండీ ఇదీ...” అంది ఆమె ఇబ్బంది పడుతూ.

“ఏం నా భార్యను నేను వాటేసుకుంటే తప్పా?” అంటూ ఇంకా బలంగా హత్తుకున్నాడు.

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.

“ముందు ఎవరొచ్చారో చూసి రండి” అని కీర్తన అనడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేసాడు. ఎదురుగా దీప్తి నిల్చుని ఉంది.

“లోపలికి రావొచ్చా...” అంది దీప్తి. ఆమె వెనకాలే ఇంకో అబ్బాయి ఉన్నాడు.

“ప్లీజ్ కమిన్” అంటూ లోపలికి ఆహ్వానించాడు శ్రీధర్.

కీర్తన కూడా వారిని చూసి హాల్లోకి వచ్చి దీప్తిని విష్ చేసి కూర్చోబెట్టింది.

“తిను సురేష్. నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్ ఉంది. మీరిద్దరూ తప్పకుండా రావాలి” అంటూ పెళ్లి పత్రిక తీసి వారి చేతిలో పెట్టింది దీప్తి.

“ఓహ్! కంగ్రాట్స్ తప్పకుండా వస్తాం” అంది కీర్తన. కొద్దిసేపు మాట్లాడాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.

“దీప్తి చాలా మంచమ్మాయి కదండీ..., నా వల్ల తన పెళ్లి ఆగిపోయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా తన పెళ్ళికి ఇన్విటేషన్ తెచ్చి ఇచ్చింది” అంది కీర్తన.

“అవును” అన్నాడు శ్రీధర్ ఆ రోజు కాఫీ షాపులో జరిగింది గుర్తుతెచ్చుకుంటూ.

***

పెళ్లి పదిరోజులు ఉందనగా దీప్తిని ఒక కాఫీ షాపులో కలిసి కీర్తన గురించి చెప్పాడు శ్రీధర్. తను కాలేజీ రోజుల్లో ఎంతగా ఆమెను ఆరాధించాడో, ఆమె జ్ఞాపకాల్లో వేరే అమ్మాయిని ఎందుకు తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడో, ఇప్పుడేం జరుగుతుందో అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. వేరే అమ్మాయైతే ఎంత రచ్చ చేసేదో తెలీదు కానీ దీప్తి మాత్రం శ్రీధర్లో ఉన్న నిజాయితీని చూసి అతన్ని అర్ధం చేసుకుంది. నెలకో అమ్మాయిని ప్రేమించే ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలు ఒకే అమ్మాయిని తలుచుకుని ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది తనకు.

ఆ టైంలో తనకు గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి సురేష్. సురేష్ గుర్తుకు రాకపోయుంటే బరస్ట్ అయిపోయి వేరేలా ప్రవర్తించేదేమో. సురేష్ కూడా ఆరు సంవత్సరాల నుండి తనకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు. సురేష్ ఇల్లు వాళ్ళ వీధి చివర్లో ఉండేది. మొదట్లో ఆటో నడుపుకునేవాడు. అక్కడే తనతో పరిచయం అయ్యింది. తర్వాత కారు కొనుక్కుని క్యాబ్ నడిపాడు. ఇప్పుడు సొంతంగా నాలుగైదు కార్లవరకూ కొని క్యాబ్ లకు రెంటుకు ఇస్తున్నాడు. కష్టపడే తత్వం కలవాడు, పైగా ఏ చెడు అలవాట్లూ లేవు. నీ ఇన్స్పిరేషన్ తోనే జీవితంలో పైకి రావాలని నిర్ణయించుకున్నానని ఎప్పుడూ చెబుతుండేవాడు. దీప్తి ఐఐఎంలో ఎంబిఎ చేసింది. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది. దాంతో సురేష్ ఎప్పుడూ తన స్టేటస్ కి సరిపోడేమో అని దూరం పెట్టేది. అయినా ఈ ప్రేమలు దోమలు వేరే బెటర్ చాయిస్ దొరికేవరకే అన్న అపోహలో ఉండేది తను. ఇప్పుడతని ప్రేమలో నిజాయితీ తెలుస్తుంది ఆమెకి. సిన్సియర్గా ప్రేమించేవాళ్ళు ఈ జెనరేషన్లో కూడా ఉంటారని అర్ధమైంది తనకు. ఆమె మనసు కొంచెం తేలికైనట్టు అనిపించింది.

“ఇంతకీ ఆమెకు ఈ విషయం చెప్పావా లేదా?” అంది శ్రీధర్ వైపు చూస్తూ దీప్తి.

“లేదు” అన్నాడు శ్రీధర్.

“ఆమెకి చెప్పకుండానే నాతో పెళ్లిని క్యాన్సిల్ చెయ్యాలనుకుంటున్నారా?”

“ఆమెను మనసులో పెట్టుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది”

“ఆమె ఒప్పుకోకపోతే?”

“అదంతా నేను ఆలోచించలేదు” ఎటో చూస్తూ అన్నాడు శ్రీధర్.

“అయితే ఫోన్ చేసి వెంటనే ఆమెను ఇక్కడికి రమ్మను” అంది దీప్తి కొంచెం గట్టిగా.

శ్రీధర్ భయంతో, “ఎందుకు?” అన్నాడు.

“ఎందుకో తర్వాత చెప్తా..., ఏం భయపడకండి, ముందు ఫోన్ చెయ్యండి. అట్లీస్ట్ ఆమెను నాకు పరిచయం చెయ్యరా?” అనడంతో తప్పక కీర్తనకి ఫోన్ చేసి ఆ కాఫీ షాపుకి రమ్మన్నాడు.

అరగంట తర్వాత వచ్చింది కీర్తన. దీప్తి తనను తాను పరిచయం చేసుకుని, ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ శ్రీధర్ కీర్తనని ప్రేమిస్తున్న విషయం మెల్లిగా చెప్పింది. కీర్తన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తర్వాత దీప్తీనే కాలేజీ రోజులనుంచి జరిగిందంతా కీర్తనకి అర్ధమయ్యేలా చెప్పింది. శ్రీధర్ టెన్షన్ పడుతూ కూర్చున్నాడు.

“ఒక అమ్మాయికి అంతగా ప్రేమించే మగాడు దొరకడం కన్నా ఇంకా ఏం అదృష్టం ఉంటుంది?” అంది దీప్తి.

“కానీ నాకు పిల్లలు కారు, ఆ విషయం తెలుసుగా” అంది కీర్తన బాధ పడుతూ.

“పిల్లలు కాకపొతే ఏం? నిన్నే చిన్న పిల్లలా చూసుకుంటాడు. అంతగా కావాలంటే దత్తత తీసుకోండి. లేదా వేరే విధంగా ట్రై చెయ్యండి తప్పేం లేదు” అంది దీప్తి కీర్తన చెయ్యి పట్టుకుని.

కీర్తన కళ్ళలో నీళ్ళు నిండిపోయాయి. తన మనసులోని మాటను దీప్తి చెప్తుంటే ఆశ్చర్యపోయాడు శ్రీధర్.

“నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా?” అంటూ శ్రీధర్ వైపు తిరిగింది దీప్తి.

కొంచెంసేపు మౌనం తర్వాత శ్రీధర్ ధైర్యం తెచ్చుకుని, “కీర్తనా..., నిన్ను నా ఇంట్లో వస్తువులా కాదు, నా జీవితంలో వెలుగులా చూసుకుంటా. నిన్ను బాగా చూసుకుంటానన్న నమ్మకం నాకుంది. అదే నమ్మకం నీక్కూడా కలిగేలా చూసుకుంటా” అప్రయత్నంగా మాట్లాడేసాడు.


దీప్తి కీర్తన వైపు తిరిగి, “ఒక ఆడదాని మనసు ఆడదే అర్ధం చేసుకుంటుంది అంటారు. కానీ మగాడి మనసు కూడా ఆడది అర్ధం చేసుకుంటే ఆమె జీవితం ఇంకా బాగుంటుంది. నా పెళ్లి గురించి ఆలోచించకు. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఆయన్ని కన్విన్స్ చెయ్యడం నాకు పెద్ద విషయం కాదు. శ్రీధర్ నీకు మంచి మ్యాచ్. ఆలోచించుకో” అంటూ లేచి “ఆల్ ద బెస్ట్” అంటూ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది.

కొన్ని రోజులకి కీర్తన శ్రీధర్ తో పెళ్ళికి ఓకే చెప్పింది. అదంతా గుర్తుకుతెచ్చుకున్న శ్రీధర్ దీప్తిలాంటి మంచి అమ్మాయిలకి అంతా మంచే జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, “ఇందాక ఎక్కడో ఆపాం” అంటూ కీర్తనని వాటేసుకున్నాడు.

***


Rate this content
Log in

More telugu story from Varun Ravalakollu

Similar telugu story from Romance