నా ప్రేమకథ
నా ప్రేమకథ
ఏడేడు జన్మల బంధం
పెళ్లితో రెండు జీవితాలను ముడివేసిన
ప్రేమ అనే అను బంధం
**********
జాబ్ చేస్తూ హాస్టల్ లో ఉంటున్న నేను మా రూమ్ మెట్స్ అందరికీ లవర్స్ ఉండటం చూసి నాకు ఎవరు లేరు అని బాధ పడేదాన్ని.
కానీ అందులో ఉన్న రిస్క్ ఎంటో తెలిసి ఊరుకున్నాను. కారణం మా ఇంట్లో ఒప్పుకోరు. కాకపోతే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుణ్ణు అని అనుకునే దాన్ని. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ ఉంటే సినిమాలకి షికార్లకి, బీచ్ లకి పార్క్ లకి బైక్ మీద, చెట్టాపట్టాలేసుకుని తిరగ వచ్చు అని.
నా రూమెట్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళిన ప్రతి సారి అదే అనుకునేదాన్ని. కానీ ఇంట్లో ఒప్పుకోరు అన్న మాట గుర్తు వచ్చి వెంటనే నన్ను నేను కంట్రోల్ చేసుకునే దానిని.
నాకు వచ్చేవాడు నన్ను కూడా అందరి బొయ్ ఫ్రెండ్స్ లాగానే ఎంతో బాగా, ప్రేమగా చూసుకోవాలి అని కలలు కనే దాన్ని. కనీసం పెళ్లి ముందు ఇద్దరం బాగా మాట్లాడుకోవాలి అని, పెళ్లి అయ్యాక అయినా ప్రేమికులు లాగా ఉండాలి అని అనుకునే దాన్ని.
అలా ఉండగా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది వెంటనే ఊరికి రమ్మని. అంతే మర్నాడు రాత్రికే బయలు దేరి ఊరికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్లేసరికి ఇల్లంతా అందంగా అలంకరించి ఉంది.ఏమైనా పండగా అంతే ఏమి లేదు. మరి ఎందుకబ్బా ఇలా చేశారు, పోనీ ఏదైనా ఫంక్షన్ ఏమో అనుకుంటే నాకు చెప్తారు కదా, మరి ఏది కాకుండా ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాను.
గుమ్మంలో అడుగు పెట్టగానే ఎలా ఉన్నావు, ఏంటి అంటూ ప్రశ్నోత్తరాల కార్యక్రమం పూర్తి అయ్యాక, ఫ్రెష్ అయ్యి తొందరగా తయారు అయ్యి రమ్మని అన్నారు.
ఎవరైనా వస్తారేమో బంధువులు అనుకోని నేను మాట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టు తయారు అయ్యి వచ్చాను. ఇప్పుడు ఈ పట్టు చీర, ఈ నెక్లెస్ ఎందుకు పెట్టుకోమని చెప్పారు అనుకుంటూ అలాగే తయారు అయ్యి కూర్చున్నాను.
ఈలోగా అమ్మ, పిన్ని, అత్తయ్యా వచ్చి నన్ను తీసుకుని వచ్చి హల్ లో అందరి మధ్యన కూర్చోపెట్టారు. అక్కడ ఉన్న అందరినీ ఒకసారి చూసాను, అంతా ఏదో తేడాగా అనిపించింది. అప్పుడు కానీ అర్థం అవ్వలేదు నాకు పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు అని.
అబ్బాయి తరపు వాళ్ళు, నన్ను నీ పేరేంటి, ఏం చేస్తున్నావు, ఎంత వస్తుంది, ఎక్కడ ఉంటావు, ఇలా ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ విసిగిస్తూ ఉన్నారు.అంతే కాకుండా పెళ్లి అయితే ఉద్యోగం మనేస్తావా అని కూడా అడిగారు.
ఆప్పుడే అనుకున్నాను పెళ్లికి ఉద్యోగానికి సంబంధం ఎంటి అని, ఈ సంబంధం వద్దు అని చెప్పాలని అనిపించింది.
అబ్బాయి చూడటానికి బాగానే ఉన్నాడు కాని వాళ్ళ అమ్మా నాన్న ఎంత చెప్తే అంత లా ఉన్నాడు.
అబ్బాయిని అడిగారు అమ్మాయి నచ్చిందా అని, వాళ్ళ అమ్మ, నాన్న వైపు చూసి మీ ఇష్టం అన్నాడు చిన్నగా నవ్వుతూ..
ఇంకేం అబ్బాయి బాగున్నాడు, మంచి ఉద్యోగం అంటూ అమ్మ వాళ్ళు, అందరూ పెళ్లికి ఒప్పేసుకున్నారు నా అభిప్రాయం అడగకుండానే. ఒక్కసారి తనతో మాట్లాడాలి అనుకునే లోపే, పంతులు గారు
శుభస్య శీఘ్రం అనేసరికి, తాంబూలాలు మర్చేసుకున్నారు ఇద్దరూ...
ఇంకేముంది పది రోజుల్లో మంచి ముహూర్తం కూడా పెట్టేశారు. నాకైతే చాలా కోపం వచ్చింది. నా అభిప్రాయం తో ఎవరికి పని లేదా అని నా పెళ్లి నా అంగీకారం లేకుండా ఎలా చేస్తారు అని బాగా అరిచాను.
కానీ ఎవరు పట్టించుకోలేదు నా మాట.
అబ్బాయి ఫోన్ నంబర్ కూడా తెలియదు పోనీ కనీసం ఫోన్ చేసి మాట్లాడడానికి. అది కాకుండా పది రోజుల్లోనే పెళ్లి అనేసరికి అన్ని పనులు ఒకేసారి నెత్తి మీద వచ్చి పడ్డట్లు అయ్యింది.
షాపింగ్ బట్టలు, బంగారం నగలు కొనటం ఇవే సరిపోయాయి. కార్డ్ లు వేయించటం అయ్యాక ఒక కార్డ్ తీసుకుని వచ్చి చూపించారు నాన్న. ఆ కార్డ్ లో చూసాను అతని పేరు వంశీ. అప్పటివరకు తన పేరు కూడా తెలియ లేదు.
అలా అతనితో ఏమి మాట్లాడకుండానే మా పెళ్లి జరిగిపోయింది. నాకైతే బాగా కోపం గా ఉండేది కనీసం తను కూడా నా ఇష్టం తెలుసుకోలేదు అని. అయిష్టం గానే కొన్నాళ్ళు గడిచింది.
పెళ్లికి ముందు ఊహించుకున్న జీవితం వేరు, ఇప్పుడు ఉన్న జీవితం వేరు. దేవుడా! ఎందుకు నాకిలా చేశావు, నేనేం పాపం చేశాను. నేను అడిగింది ఏమిటి,నువ్వు ఇచ్చింది ఏమిటి అని దేవుడిని మొర పెట్టుకునే దాన్ని.
మా పెళ్లి అయిన రెండు నెలలకే నా పుట్టిన రోజు వచ్చింది. అప్పుడు నా కోసం ఒక డైమండ్ రింగ్ కొని గిఫ్ట్ గా ఇచ్చారు. అప్పుడే తెలిసింది నేనంటే తనకి అంత ఇష్టం ఉంది అని. ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి కానీ ఎప్పుడూ నేనే విసుక్కునే దాన్ని కానీ పాపం ఒక్కసారి కూడా తను నన్ను ఏమి అనలేదు కానీ, నేను ఏమన్నా పెద్దగా పట్టించుకునే వారు కాదు.
ఆరోజు ఆ ఉంగరం నా చేతికి తొడుగుతూ I Love you అని, పెళ్లి చూపుల్లోనే తనకి నేను నచ్చేసాను అని చెప్పారు. ఆరోజే తెలిసింది తన మనసులో ఉన్న ప్రేమ... అప్పుడే నా మనసులో ఏదో మూల దాక్కుని ఉన్న ప్రేమ కూడా బయటకి వచ్చింది. Love you too అని చెప్పేశాను నేను కూడా.
అప్పటి నుంచి నేను ఎలా ఉండాలి అనుకున్నానో నా జీవితం అలాగే ఉంది. సరదాగ అలా సినిమాకి, షికార్లకు వెళ్ళటం, ఎంజాయ్ చేయటం. పెళ్లి అయిన తర్వాత భర్తతో అలా మొదటి సారిగా వెళ్తే ఆ ఆనందమే వేరు అనిపించింది.
ఇక అప్పుడు మొదలైన మా ప్రేమ ప్రయాణం అయిదేళ్లుగా ఇలా కొనసాగుతూనే ఉంది. మా ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా...
ఇది నా ప్రేమకథ..