Hitesh Kollipara

Drama Romance

4  

Hitesh Kollipara

Drama Romance

లవ్ ఇన్ అమెరికా – 11

లవ్ ఇన్ అమెరికా – 11

7 mins
1.6K


#ఫైనల్_లెటర్


ప్రస్తుతం:

ఎవరు కాపాడారో, ఎలా వచ్చానో తెలీదు. ఒక్కసారిగా స్పృహ వచ్చి మంచం మీద లేచి కూర్చున్నాను. ఐ‌సి‌యూ రూమ్ లో ఉన్నాను. రెండు చేతులకి అక్కడక్కడా రక్కినట్టు ఎర్రటి గాట్లు, మచ్చలు తేలి ఉన్నాయి. కాళ్ళకి కూడా. ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఆక్సిజన్ మాస్క్ తీసి బెడ్ పక్కన పెట్టాను. రొప్పుతూనే నెమ్మదిగా నడుచుకుంటూ డోర్ ని చేరాను.

ఇక డోర్ ని తెరవబోతుంటే కనిపించింది టేబుల్ మీద ఉన్న పూల బొకేల మధ్యలో ఉన్న ఫోల్డ్ చేసిన లెటర్. ఆల్బర్ట్ లెటర్.

అప్రయత్నంగా అటువైపు నడిచాను. ఆల్బర్ట్ నుంచి లెటర్ ఏంటో అని ఆశ్చర్యంగా ఉన్నా దాన్ని అందుకుని తెరిచాను. నా కళ్ళు సూలాల్లా అతడు వ్రాసిన వాఖ్యాలకేసి పరుగులు పెట్టాయి.

******                                                    

హాయి మగ్,

ఆశ్చర్యంగా ఉంది కదా నా నుంచి లెటర్ ఏంటా అని?... నాకూ అలానే ఉంది. నాకు తెలుసు ఇప్పుడు నీ దృష్టిలో నేను ఒక ఛీటర్ని అని, ఎమోషన్స్ తో ఆడుకునే ఒక నీచుడిని అని. నీ తప్పేం లేదు మగ్. ఇదంతా నా స్వయంకృపారాదమే. మరి ఈ లెటర్ ఏంటి అంటావా?... విధి బలీయమైంది మగ్. అదే నన్ను ఈ లెటర్ రాయించేలా చేసింది.

మగ్..., మనం రోజూ ఎంతోమందిని కలుసుకుంటాం. వాళ్ళలో చాలామంది ఆరోజువరకే పరిమితం అవుతారు. కొంతమంది మాత్రం కొంతకాలం పాటూ మనతో నడుస్తారు. చాలాకొద్ది మాత్రం జీవితం మీద ఘనమైన ముద్ర వేస్తారు. నాకు నువ్వు ఈ మూడో కేటగిరికి చెందిన వ్యక్తివి. అందుకే ఎలా మొదలుపెట్టాలో, ఎక్కడ మొదలుపెట్టాలో అర్ధం కావటం లేదు. సరే, మొదట్నించీ మొదలుపెడతా.

నీకు గుర్తుందా మగ్?... మొదటిసారి నువ్వు నన్ను రోడ్ మీద వెళ్తుండగా చూసావు. అప్పుడు నేను వేరే అమ్మాయిని కిస్ చేస్తూ ఉన్నాను. వెంటనే నువ్వు తల తిప్పేసావు. కానీ సందు దాటుతూ మళ్ళీ చూసావు. ఐతే అప్పుడు గమనించావోలేదో తెలీదుగాని నేను కిస్ చేస్తున్న అమ్మాయి అప్పుడు అక్కడ ఉండదు. ఎందుకు ఉంటుంది పంపించేస్తే!? ఎందుకు పంపేశానో తెలుసా?... ఎందుకంటే ఎదురుగా దీపం కనిపించినప్పుడు మిణుగురుల వెలుగు కోసం పరితపించే మూర్ఖుడ్ని కాదు కాబట్టి.

అవును మగ్...., నావరకు నాకు నువ్వు దీపానివి. చీకటిని పారద్రోలే దీపానివి. ఐతే చీకటి ఎవరో తెలుసా?... నేనే!! ఎంతటి చీకటినీ అంటే ఇతరుల జీవితాన్నే కాదు, నా జీవితాన్ని కూడా మింగేసేటంతటి చీకటిని.

తరువాత ఇద్దరం ఒకే యూనివర్సిటీ. పరిచయం కుదిరింది. నాకు అమ్మాయిల్ని ఆకర్షించటం బాగా తెలుసు మగ్. అలానే నిన్ను కూడా ఈజిగానే ఆకర్షించగలిగాను. కాకపోతే నీకు తెలియంది ఏంటంటే అప్పటికే నేను నీ ఆకర్షణలో ఉన్నానని.

అవును మగ్.., మొదట నువ్వు నన్ను ప్రేమించలేదు. నేనే నిన్ను ప్రేమించా!!

 ఇద్దరి మధ్యా స్నేహం పెరిగింది. పెరిగేలా చేశాను అంటే కరెక్టేమో?!... ఇక అప్పట్నించీ నువ్వే సర్వస్వంలా ఉన్నాను. నా గురించి అన్నీ చెప్పాను - అమ్మాయిలతో తిరిగింది సహా! కానీ నువ్వడగచ్చు నేనే నీ సర్వస్వం అయినప్పుడు వేరే అమ్మాయిలతో తిరగటాలు ఏంటి?... అని. లేదు మగ్. నేను ఏ అమ్మాయితోనూ తిరగలేదు. చెప్పాగా..., దీపం ఎదురుగా ఉన్నప్పుడు మిణుగురుల వెంటపడే మూర్ఖుడ్ని కాదని. కానీ నేను నీతో చెప్పిన ప్రతి మాటా నిజమే. కాకపోతే అవన్నీ నిన్ను చూడకముందు, నీతో పరిచయం కాకముందు చేసినవి. ఎందుకు చెప్పానో తెలుసా?.., ఎందుకంటే నేను భవిష్యత్తును పంచుకోవాలనే అమ్మాయికి నా గతం గురించి తెలియాలి కాబట్టి.

అవును మగ్.., నేను నీతో భవిష్యత్తుని పంచుకుందాం అనుకున్నా!!..

కానీ అందుకు నువ్వు నమ్మే దేవుడు ఒప్పుకోలేదు మగ్! నీతో పరిచయమై రెండు సంవత్సరాలు అవుతుంది. నువ్వూ నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం అర్ధమైంది. కానీ మొదట నేనే ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నా. ఆ సాయంత్రం వస్తున్నట్టు నీకు ఫోన్ కూడా చేశా. కానీ అప్పుడే కళ్ళు తిరిగి పడిపోయా. హాస్పిటల్ కి వెళ్తే తెలిసింది నాకు ప్రాణం తీసే జబ్బు ఉన్న విషయం. పేరేందుకులే మగ్..., చెప్పాగా టంగ్ ట్విస్టర్ లా ఉంటుంది అని. మా పూర్వీకురాలుకి వచ్చిన జబ్బే నాకూ వచ్చింది. రెండుమూడు నెలలే అన్నారు. నాకు నా గురించి బాధ లేదు మగ్. నా భయమంతా నీ గురించే. నేను చనిపోతున్నా అని తెలిస్తే నువ్వు ఏమైపోతావనే భయం.

అప్పుడే రెండు నిర్ణయించుకున్నా.... ఒకటి, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పకూడదు అని. రెండు, నా మీద నీ ప్రేమని చంపేయాలి అని.

కానీ జబ్బు ఉందని తెలిసిన రాత్రి మాత్రం నరకం అనుభవించా మగ్. అన్నీ నీ గురించిన ఆలోచనలే. నిద్ర పట్టలేదు. పట్టిన ఆ నిద్రలో కూడా నీ గురించిన కలలే. ఆ కలలో నువ్వూ, నేనూ... అనకోస్టియా ఫ్రీవేలో... ఆనందంగా... ప్రపంచం పట్టని జంటలా... అద్భుతం మగ్ ఆ కల. ఐతే నిన్ను ముద్దు పెట్టుకోబోతున్నా అనగా ఎందుకో మెలకువ వచ్చేసింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నీకు ఐ లవ్ యు చెప్పేయాలనిపించింది. ఐతే వెంటనే రియాలిటీ ఈడ్చి మొహం మీద తన్నింది. ఉత్సాహం, నిస్సత్తువ, భయం ఒకేసారి కలిగాయి. చివరికి భయమే స్థిరపడింది. నా మీద నీ ప్రేమని చంపటం అటుంచు, అసలు నీ మీద నా ప్రేమని ఎలా అణుచుకోవటం?... అర్ధంకాలేదు. నాకు తెలిసింది నువ్వు ఒక్కదానివే మగ్. అందుకే నిన్నే సహాయం అడుగుదామని ‘ఎమర్జెన్సీ సిట్యుయేషన్’ అంటూ పరిగెత్తుకు వచ్చాను.

కానీ మగ్..., ఆరోజు షార్ట్స్ లో, లూజ్ హెయిర్ తో అప్పుడే నిద్రలేచిన నిన్ను చూస్తే నాకు ఏమనిపించిందో తెలుసా?... అమాంతం నిన్ను గోడకి నొక్కిపట్టి గట్టిగా ముద్దు పెట్టుకోవాలనిపించింది. బట్ నో మగ్... నాకా అదృష్టం లేదు. తరువాత తెలిసింది నువ్వు కూడా నేను కన్న కలే కన్నావని. అంటే మన నాలుగు కళ్ళూ ఒకే స్వప్నాన్ని కన్నాయి. కాకపోతే వాటిలో రెండు కళ్లకే తెలుసు ఆ స్వప్నం ఎప్పటికీ నిజం కాదని. అయినప్పటికీ పట్టిపట్టి అడిగాను నీ లవర్ పేరేంటో చెప్పమని. మనసు కోతి కదా మగ్..., నీ నోటివెంట నా పేరు వినాలనిపించింది అప్పుడు. బట్ వెంటనే స్పృహ వచ్చింది. ఏం చేయాలో తోచలేదు. అందుకే వెంటనే నాకు సోల్ మేట్ ని వెతకమని నిన్ను కోరాను. నా కోరిక వినగానే నువ్వెంత క్షోభ అనుభవించి ఉంటావో నేను ఊహించగలను మగ్. ఐతే నువ్వు ఊహించలేవు అలా అడుగుతున్నప్పుడు నేనెంత క్షోభ అనుభవించానో!!...

ఐతే ఒక్కటి మగ్..., నీవల్ల అలజడి కలగాలంటే నిన్ను నగ్నంగానే చూడక్కర్లేదు. నీ ఊహ చాలు నా మదిలో అలజడి రేగుతుంది!!...

తరువాత రోజు షాపింగ్ మాల్ కి వెళ్దామంటూ తీసుకెళ్లావ్. అర్ధమైంది. నేను ప్రేమించిన అమ్మాయి నాకే సోల్ మేట్ ని వెతకటమా?.. నువ్వెలా వెతకాలి అనుకున్నావో తెలీదు గాని నేను మాత్రం తట్టుకోలేకపోయాను. అందుకే వెంటనే మార్గరేట్ ని రమ్మని పింగ్ చేశాను. అసలు మార్గరేట్ ఎవరో తెలుసా మగ్..., మార్గరేట్ నా కజిన్ మగ్! అంతేకాదు ఆమె డాక్టర్ కూడా. నా జబ్బుని తగ్గించాలని పాపం పిచ్చి ప్రయత్నాలు ఏవో చేస్తుంది. ఇక తననే నా సోల్ మేట్ గా ఫిక్స్ అయ్యా అని చెప్పా. తను నీతో గొడవపడటం అంతా మా ప్లానే మగ్. ఆ మిషతోనే నిన్ను మాల్ నుంచి వెళ్లిపోమన్నా. కానీ నువ్వు వెళ్లకుండా రెండుగంటలు పాటు మమ్మల్నే గమనిస్తూ ఉన్నావు. నిన్ను ఎలా పంపించేయాలి?... ఎలా నీ మనసు విరిచేయాలి?... అందుకే మార్గరేట్ తో ట్రైల్ రూమ్ లోకి వెళ్లా. నో మగ్.. లోపల మేము ఏం చేయలేదు. చెప్పగా నిన్ను చూసిన క్షణమే నిర్ణయించుకున్నా అని.., ఇకమీదట నా పెదాలు ఐతే నీ పెదాల్నే ముద్దాడాలి, నా చేతులు నీ శరీరాన్నే తాకాలి. లేకపోతే లేదు అంతే!!..

అనుకున్నట్టుగానే నువ్వు ఏడ్చుకుంటూ వెళ్లిపోయావు.

ఐతే తరువాతేమైందో తెలీదు నువ్వు మళ్ళీ నన్ను వెడ్డింగ్ కి ఆహ్వానించావు. నన్ను నేను కంట్రోల్ లో పెట్టుకోవటానికే మార్గరేట్ ని తీసుకొచ్చాను. కానీ తనకి అర్జెంట్ కేస్ వచ్చి వెళ్లిపోవాల్సి వచ్చింది. లేదు మగ్, తను నువ్వన్న మాటలకి ఫీల్ అయ్యి వెళ్లలేదు. నువ్వు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ తను అలా వెళ్లిపోవటం మంచికే అయింది మగ్..., నిన్ను శారీలో చూడటం... మనం ఆ రాత్రి వాటర్ ఫాల్స్ కి వెళ్ళటం... అవి నా జీవితంలో అత్యంత మధురక్షణాలు మగ్.

ఐతే నువ్వు అక్కడ నా ముద్దు కోసం కళ్ళు మూసుకుని నాముందుకొచ్చి నించున్నావు. నా దేవతని అలా చూసిన క్షణం నాకేమనిపించిందో తెలుసా మగ్?... నా శరీరంలో అనువణువూ నీ శరీరాన్ని స్పృశించేలా గట్టిగా వాటేసుకుని... ఊపిరి ఆడనంత తీక్షణంగా ముద్దాడి... నువ్వు ఆ అలుపులో ఉన్నప్పుడు నీ ముందు మోకాళ్ళ మీద ఒంగి ఐ లవ్ యు చెప్పాలనిపించింది. బట్ నో మగ్..., ఐ కుడింట్ డూ దట్. అందుకే మార్గరేట్ నా ప్రేమకి ఒప్పుకుందని నీ మనసు విరిచేశాను.

నాకు తెలుసు మగ్.., ఆ క్షణంలో నీ కింద భూమి చీలిపోయినట్టు నువ్వు ఫీల్ అయ్యావని. కానీ నీకు తెలియంది ఏంటంటే నేను కూడా అదే ఫీల్ అయ్యానని!!..

ఇద్దరం గెస్ట్ హౌస్ కి తిరిగొచ్చేశామ్. ఐతే ఆ రాత్రంతా నా మస్తిష్కంలో నీ రూపమే... నా ముద్దు కోసం నువ్వు కళ్ళు మూసుకుని ఆహ్వానిస్తున్న దృశ్యం నన్ను రాత్రంతా వేపుకుతింది. నేను ప్రేమిస్తున్న అమ్మాయి చిన్న సరదా కూడా తీర్చలేని నా బ్రతుకు వ్యర్ధమనిపించింది. అందుకే పొద్దున్నే హోలీ మిషతో నిన్ను ముద్దుపెట్టుకుందామని దూసుకువచ్చాను. కానీ కుదర్లేదు. నువ్వు తప్పుకున్నావు. ఐతే అనూహ్యంగా నువ్వు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయావు. నేను బ్లాంక్ అయిపోయా.

మెసేజ్ చేశా రిప్లై లేదు. ఫోన్ చేశా లిఫ్ట్ చేయలేదు. ఆ వారం రోజులూ నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా అనుభవించా. చచ్చిపోయేలోపు నిన్ను దూరం పెడుతూనే నీతో ఆనందంగా ఉందామనుకున్నా. కానీ నన్ను దూరం పెట్టేశావు. రెండునెలలు అన్నారుగానీ రెండురోజుల్లోనే చావు అంచుల దాకా వెళ్లిపోయా. పేషెంట్ అయిపోయా. కానీ ఏదైతేనేం అని ఆ సాయంత్రం నిన్ను పక్కకి లాక్కెళ్లి కారణం అడిగా. నువ్వేమ్మన్నావ్ మగ్?... డబుల్ గేమ్ ఆడుతున్నా అని కదా!?...

ఎలా అనగలిగావ్ మగ్ అలా?... ఇంతేనా నువ్వు నన్ను అర్ధం చేసుకుంది?... నిజం చెప్పనా... ఆ మాటకి అక్కడే, అప్పుడే చచ్చిపోయా. నీ మీద కోపం కన్నా నా మీద నాకు జాలే ఎక్కువ కలిగింది. అందుకే నిర్ణయించుకున్నా మగ్... నా ప్రేమ ఎలా ఉంటదో నీకు చూపించాలని నిర్ణయించుకున్నా. నిన్ను ఇంటికి రమ్మన్నా.

నిజం చెప్తున్నా మగ్... మనం కలిసి ఉంటే నేను రోజూ నిన్ను అలానే చూసుకునేవాడిని. అది జస్ట్ సాంపులే మగ్... ఇంకా బాగా చూసుకునేవాడిని. కానీ అంత అదృష్టం లేదు మగ్.

ప్రేమని చూపించాక మళ్ళీ తుంచేయాలిగా... నా మీద ద్వేషం కలగాలిగా... అందుకే తరువాత రోజు రమ్మన్నా. వచ్చావ్.. మార్గరేట్ తో నా మాటలు విన్నావ్... కొట్టావ్... వెళ్లిపోయావ్. నేను అనుకున్నట్టుగానే మన బంధం పూర్తిగా తెగిపోయింది. ఇక అంతే మగ్..., నువ్వెళ్లిన మరుక్షణం కుప్పకూలిపోయా. హాస్పిటల్ లో పడ్డా.

కానీ చెప్పాగా మగ్ విధి బలీయమైందని. అదే నన్ను నీకు ఈ లెటర్ రాయించేలా చేసింది. నేను అస్సలు ఊహించలేదు మగ్, ఆంట్ మేరీ నిన్ను నాకోసం తీసుకొస్తుందని. అలా వచ్చే క్రమంలోనే నీ మీద అటెంప్ట్ జరుగుతుందని. ఐ యామ్ రియల్లీ సారీ మగ్. నువ్వు ఈ స్థితిలో ఉండటానికి పరోక్షంగా కారణం నేనే. నేను నీకు ఏ దశలోనూ సంతోషాన్ని ఇవ్వలేకపోయాను గాని ప్రతి దశలోనూ దుఃఖాన్ని మాత్రం ఇచ్చాను. కానీ దీనికి మాత్రం కారణం నేను కాదు మగ్. నా ప్లాన్ అంతకన్నా కాదు. నన్ను క్షమిస్తావ్ కదూ!?...

ఇప్పుడు అర్ధమైందా మగ్..., ఇది ప్రేమ ఉత్తరం కాదు క్షమాపణ ఉత్తరం అని. కానీ ఇంత చెప్పాక ఇక చెప్పకుండా ఉండటం నావల్ల కావటం లేదు మగ్. అందుకే చెప్పేస్తున్నా... ఆరోజు నువ్వు వినాలనుకుందీ, నేను చెప్పాలనుకుందీ...

“ఐ లవ్ యు మగ్... ఐ లవ్ యు…” - కానీ నాకా అదృష్టం లేదు.

బహుశా నువ్వు స్పృహలోకి వచ్చేలోపు నేను ప్రాణాలతో ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా నువ్వు నాకోసం రాకు మగ్. ఒకవేళ వచ్చినా ఐ లవ్ యు అని మాత్రం చెప్పకు మగ్. నేను తట్టుకోలేను.

నువ్వు నన్ను మర్చిపో మగ్. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితం గడుపు.

మళ్ళీ చెప్తున్నా మగ్..., ఈ లెటర్ మాత్రం అబద్దం కాదు నిజం. నాటకం అంతకన్నా కాదు.

ఇట్లు

నీ ప్రేమికుడిగా మారే అదృష్టం లేని స్నేహితుడు,

ఆల్బర్ట్.

 

*******

లెటర్ చదుతున్నంతసేపూ నా చెంపల మీద నిలిచి ఉన్న కన్నీళ్లు చదవటం పూర్తయ్యాక ఇక మావల్ల కాదన్నట్టు ఆత్మహత్య కోసమని నేల మీదకి దూకాయి. మళ్ళీమళ్ళీ లెటర్ ని చదివాను. నాకు నేను బ్రతికి ఉన్న శవం అయిపోయిన అనుభూతి.

ఉన్నట్టుండి ఊపిరి ఆడని ఫీలింగ్. శ్వాస అందటం లేదు. మంచం పక్కన ఆక్సిజన్ మాస్క్ కేసి చూశాను. నేను ఓడిపోకూడదు. బ్రతకాలి. చివరిగా ఆల్బర్ట్ తో ఒకసారి మాట్లాడాలి. అదే నిశ్చయంతో నేల మీదే మంచం కేసి పాకటానికి ప్రయత్నించా.

కానీ నా ప్రయత్నం ఫలించలేదు. ఐతే చేతిలోని ఆల్బర్ట్ లెటర్ ని మాత్రం ఫ్యాన్ గాలికి ఎగిరిపోకుండా అలానే పట్టి ఉంచాను. పూర్తిగా స్పృహ కోల్పోయాను.

నేను ఆల్బర్ట్ ని కడసారి చూడగలనా?... అతడితో మాట్లాడగలనా??

 Rate this content
Log in

Similar telugu story from Drama