Hitesh Kollipara

Inspirational

3.9  

Hitesh Kollipara

Inspirational

శరీర భాగాల కథ

శరీర భాగాల కథ

4 mins
686


  రాజు అని ఒక పిల్లాడు ఉన్నాడు. చాలా చలాకీ పిల్లాడు. ఏడవ తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలానే ఆరోజు కూడా ఉదయం నవ్వుతూ స్కూల్ కి వెళ్ళిన రాజు సాయంత్రం మాత్రం ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. రాజు వాళ్ళ అమ్మ కారణం అడిగింది.

         “నా వలన ఈరోజు మా క్రికెట్ టీమ్ ఓడిపోయింది. సుశాంత్ కొట్టిన లాస్ట్ బాల్ నేను కాచ్ పట్టకపోవటంతో మా టీమ్ ఓడిపోయింది. నా స్నేహితులు అందరూ నన్ను తిట్టారు” ఏడుస్తూ చెప్పాడు రాజు.

         “ఓసీ..., దానికి ఎవరైనా ఏడుస్తారా? ఈరోజు కాకపోతే రేపు కాచ్ పట్టుకుంటావు. మీ టీమ్ ని గెలిపిస్తావు. అప్పుడు ఈరోజు తిట్టిన మీ ఫ్రెండ్సే రేపు నిన్ను పొగుడుతారు. వెళ్ళి స్నానం చేసి రా, స్నాక్స్ పెడతాను” ఓదార్చింది వాళ్ళ అమ్మ.

         రాజు స్నానం చేసేసి అమ్మ పెట్టిన స్నాక్స్ తిని ఆరోజు హోమ్ వర్క్ కూడా చేసేసి తన రూమ్ కి వెళ్ళి పడుకుండిపోయాడు. నిద్రలోకి జారిపోయాడు. కానీ రాజు ‘జుట్టు’ నిద్రపోలేదు. ఆలోచిస్తూ ఉంది. రాత్రి రెండు గంటలు అయింది.

         “ఈరోజు రాజు తిట్లు తినటానికి మనలో ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి” అప్పటిదాకా మౌనంగా ఉన్న రాజు ‘జుట్టు’ మాట్లాడింది.

         వెంటనే రాజు మిగిలిన ‘శరీర భాగాలు’ అన్నీ నిద్ర మేల్కొన్నాయి.

         “నాకు తెలిసి రాజు ‘కళ్ల’ కారణంగానే ఈరోజు రాజు కాచ్ పట్టలేకపోయాడు. అదే కళ్ళు సరిగ్గా ‘చూసుంటే’ రాజు తేలికగా బంతిని పట్టుకునేవాడు. కాబట్టి కళ్ళదే తప్పు” మళ్ళీ అంది జుట్టు.

         “ఏం మాట్లాడుతున్నావ్? నేను సరిగ్గా బాల్ ని చూడకపోవటానికి అసలు కారణమే నువ్వు. నువ్వు వచ్చి మాకు అడ్డం పడ్డావు. మాకు ఇంక బాల్ కనిపించలేదు” కళ్ళు గట్టిగా అన్నాయి.

         “ఆ..., అంటే..., అప్పుడు ‘గాలి’ బాగా వీచింది. అందుకే నేను కుదురుగా ఉండలేక వచ్చి నీకు అడ్డం పడ్డాను. తప్పు గాలిది” స్వరం తగ్గించి అంది జుట్టు.

         “అలా ఐతే నేను సరిగ్గా చూడలేకపోవటానికి కారణం ‘సూర్యుడు’. కాచ్ పట్టటానికి రాజు ‘తల’ పైకి ఎత్తగానే ‘సూర్యుడి కిరణాలు’ నేరుగా వచ్చి నాలో పడ్డాయి. అందుకే మాకు చూపు కుదరలేదు” అన్నాయి కళ్ళు.

         “అసలు తప్పు ‘నుదురు’ది అనుకుంటా. మీ ఇద్దరిదీ కాదు” మధ్యలో అంది ‘నోరు’.

         “మధ్యలో నేనేం చేశాను?” అరిచింది నుదురు.

         “అంటే నీ మీద వ్రాసి ఉండే రాత సరిగ్గా లేదనుకుంటా. నీ రాత, అదే రాజు ‘నుదుటి రాత’ సరిగ్గా ఉండి ఉంటే రాజు ఈరోజు కాచ్ పట్టేవాడు”

         “అప్పుడు తప్పు నా మీద రాత సరిగ్గా వ్రాయని ‘బ్రహ్మదేవుడు’ది అవుతుంది గాని నాది కాదు. నిజం చెప్పాలంటే అసలు తప్పు అంతా ‘చెవులు’ది”

         “ఓయ్..., ఏంటి మధ్యలో మమ్మల్ని లాగున్నావ్?” చెవులు అరిచాయి.

         “మరి!?..., అప్పటికీ రాజు స్నేహితుడు మోహిత్ అరుస్తూనే ఉన్నాడు కాచ్ పట్టుకోమని. మీరే సరిగ్గా వినలేదు. మీ పని మీరు సరిగ్గా చేసుంటే పాపం రాజు తిట్లు తినేవాడు కాదు”

         “అక్కడ గ్రౌండ్ లో చాలా మంది అరుస్తున్నారు. ఎవరి మాటని వినేది? నిజానికి అసలు తప్పు అంతా ‘కాళ్ళ’ది” తప్పుని కాళ్ళ మీదకి తోసేస్తూ అన్నాయి చెవులు.

         ఉలిక్కిపడ్డాయి కాళ్ళు. “ఏంటి మమ్మల్ని అంటున్నారు?” అన్నాయి.

         “నిజమేగా!..., మీరు ఇంకాస్త వేగంగా ‘పరిగెత్తి’ ఉంటే రాజు ముందే పొజిషన్ చేరుకుని తేలికగా కాచ్ పట్టేవాడు” సమాధానంగా అన్నాయి చేతులు.

         “అబ్బో..., అలాయితే అసలు తప్పంతా మీది. మీరు సరిగ్గా పట్టుకుని ఉంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు” కాళ్ళు ఎదురన్నాయి.

         “అంటే... అప్పుడు మాకు ‘అరచేతులు’ సహకరించలేదు. బాల్ డ్రాప్ చేశాయి”

         “అంటే..., అప్పుడు మాకు చెమట్లు పట్టాయి. పైగా ‘వేళ్ళు’ సహకరించలేదు. అందుకే గ్రిప్ కుదరలేదు” అరచేతులు అన్నాయి.

         “అంటే..., అప్పుడు కాళ్ళు ‘ఊగాయి’. అందుకే మాకు గ్రిప్ కుదరలేదు” వేళ్ళు అన్నాయి.

         “అంటే..., అప్పుడు ‘తొడలు’ ‘వణికాయి’. అందుకే మేము స్టిఫ్ గా ఉండలేకపోయాము” కాళ్ళు తొడల మీదికి తప్పుని తోసేస్తూ అన్నాయి.

         “కాదు మీదే తప్పు” – తొడలు.

         “కాదు మీదే తప్పు” – కాళ్ళు.

         ఇక పంచాయితీ మొదలైంది. శరీర భాగాలు అన్నీ తప్పు నీదంటే నీదని ఒకళ్లని ఒకళ్లు తిట్టుకోసాగాయి. ఈ గొడవలోకి పాదాలు, పొట్ట, పెదాలు, ముక్కు మిగతా భాగాలు కూడా వచ్చి చేరాయి. అంతకంతకూ గొడవ పెద్దదైంది గాని తగ్గలేదు. తెల్లారిపోయింది. రాజు నిద్ర లేచాడు.

         టిఫిన్ తింటుంటే రాజు మనసుకి ఏదోలా అనిపించింది. కానీ అదేమీ పట్టించుకోకుండా టిఫిన్ తినేసి స్కూల్ కి వెళ్తుంటే అమ్మ వచ్చి చిన్న బాక్స్ ఇచ్చింది. బాక్స్ ఇస్తూ, “రాజు..., ఇందులో తాయత్తు పెట్టాను. మంత్రించిన తాయత్తు. దీని కారణంగా నువ్వు ఈరోజు మ్యాచ్ బాగా ఆడతావు. కానీ మ్యాచ్ అయ్యేవరకు బాక్స్ తెరవద్దు” అని అంది.

         రాజు స్కూల్ కి వెళ్ళాడు. మ్యాచ్ మొదలయింది. లాస్ట్ బాల్ సిక్స్ రన్స్ కొట్టాలి. రాజు స్ట్రైకింగ్. అపోసిట్ ప్లేయర్ బాల్ పట్టుకుని పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. రాజు దూరంగా బెంచ్ మీద పెట్టిన బాక్స్ కేసి చూశాడు. తరువాత బౌలర్ ని చూశాడు. బౌలర్ వచ్చేస్తున్నాడు. రాజు పొజిషన్ తీసుకున్నాడు. కాళ్లని స్టిఫ్ చేశాడు. రాజు ‘అరచేతుల్లో’ బ్యాట్ హ్యాండిల్ ని గట్టిగా పట్టుకున్నాడు. బౌలర్ నాన్-స్ట్రైకింగ్ ఎండ్ కి వచ్చేశాడు. రాజు తన కళ్లని ఇంకాస్త ‘తీక్షణం’ చేశాడు. బౌలర్ బాల్ విసిరాడు. బాల్ దూసుకు వస్తుంది. రాజు పిడికిలి ‘బిగిసింది’. బిగించిన పిడికిలితో బ్యాట్ ని పైకి ఎత్తాడు. ఒక్కటే షాట్..., బాల్ అంతెత్తు గాల్లోకి లేచింది. అందరూ ఉత్కంఠగా చూస్తుండగానే అది బౌండ్రీ దాటిపడింది. సిక్స్! రాజు టీమ్ గెలిచింది.

         రాజు వెంటనే పరిగెత్తుకువెళ్ళి బాక్స్ తెరిచాడు. కానీ అందులో అతడికి ఏ తాయత్తూ కనిపించలేదు. రాజు వెంటనే ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే అమ్మకి జరిగింది చెప్పి తాయత్తు గురించి అడిగాడు.

         “అమ్మా..., ఇందులో ఎలాంటి తాయత్తూ లేదు?”

         “అవును లేదు”

         “మరి ఉంది అన్నావ్?” అన్నాడు.

         రాజు వాళ్ళ అమ్మ నవ్వింది. నవ్వుతూ ఇలా అంది, “చూడు రాజు..., నేను బాక్స్ లో ఎలాంటి తాయత్తూ పెట్టలేదు. కానీ పెట్టానని అబద్దం చెప్పాను. ఎందుకో తెలుసా?..., నిన్న నువ్వు కాచ్ పట్టకపోవటానికి కారణం నీ మీద నీకు నమ్మకం లేకపోవటం. అందుకే నీ శరీరం నీకు సహకరించలేదు. ఇప్పుడు నువ్వు సిక్స్ కొట్టటానికి కారణం తాయత్తు రూపంలో నీకు దొరికిన నమ్మకం. అందుకే నీ శరీరం నీకు సహకరించింది. కానీ నిజానికి ఏ తాయత్తూ లేదు. కానీ నమ్మకం ఉంది. అది నీ ‘మనసు’లో ఉంది. నమ్మకం ఉంటే నువ్వు దేన్నైనా నీకు అనుకూలంగా మలచుకోగలవు. విజయం సాధించగలవు. గుర్తుపెట్టుకో” అంది.

         రాజుకి అర్దమైంది.

         ‘అతడి’ మనసు తేలికపడింది.

-     హితేష్ కొల్లిపర



Rate this content
Log in

Similar telugu story from Inspirational