STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

గతంగతః

గతంగతః

2 mins
605


            గతం గతః

         -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

         

   రాహుల్ మళ్లీ మాజీవితంలోకి రావడంతో...అతన్ని చూస్తూనే వణికిపోయారు అమ్మా నాన్నా! 


   ఇంట్లోకి సరాసరి లోనికొచ్చి కుర్చీలో కూలబడ్డాడు రాహుల్. 

   

  "ఏదీ మీ అమ్మాయిని పిలుస్తారా? చేసిందంతా చేసేసి అలా గుడ్లప్పగించి చూస్తారేంటి? మర్యాదగా రాధను పిలవండి."  లోనికి గట్టిగా వినిపించేలా రచ్చ చేస్తున్నాడు రాహుల్.


   ఆ పక్కగదిలోనే ఉన్న నాకు నామాటలు చెవిన పడగానే వచ్చింది ఎవరో పోల్చుకోగలిగాను. ఒక్కసారిగా భయంతో నా ఒళ్ళు ఝల్లుమంది. పక్కనే ఉన్న నాభర్త చెవిలో ఎక్కడ పడ్డాయో ఆమాటలని బెదురుగా చూసాను ఆయన వైపు. 


  కళ్ళు మూసుకుని పడుకుని వున్నారు. నిద్రపోయుంటారని ధీమా వచ్చింది నామనసులో. రాహుల్ మళ్లీ మాజీవితంలోకి ఎందుకొచ్చినట్లు? నా సంసారం కూలగొట్టడానికేనా? అదే జరిగితే నాపరిస్థితి ఏంటి? దేవుడా...నువ్వే నాకు దిక్కు. ఎలాగైనా ఈ పరిస్థితిని గట్టెక్కించు. దేవుడిని ప్రార్థించుకోవడం తప్పించి ఏమీ చేయలేకపోయాను. ఆక్షణంలో ఎన్నో భయానిక ఆలోచనలతో ఒళ్ళంతా చమటలు పట్టేసాయి. 


   హాల్లో...రాహుల్ కి ఏదో నచ్చజెప్పుతున్నారు నాన్న. పెద్దగా గొడవ చేయొద్దని బ్రతిమలాడుకుంటున్నారు. వారి మాటలేమీ పట్టినట్టు లేవు.


  " ఏయ్ రాధా...బయటకు రా!" అంటూ గట్టిగా పిలుస్తుంటే...నాభర్త తుళ్ళిపడి లేచారు. నేను మరింతగా ముడుచుకుపోవడంతో... 

   

   "రాధా! ఏమయ్యింది? ఎందుకలా అయిపోతున్నావు? ఎవరు నిన్ను పిలుస్తున్నారు?" అంటూ మంచంపై లేచి నా చేయి పట్టుకుని హాల్లోకి నడిచారు. 


   హాల్లో ఉన్న ఆ అపరిచిత వ్యక్తిని చూసి..."ఎవరు మీరు?" అంటూ అడిగారు మావారు.


  "నేను ఎవరో మీపక్కనున్న మీ ఆవిడను అడగండి చెప్తుంది" అన్నాడు చాలా పొగరుగా.


  బాబూ...ఇతను చెప్పేదేమీ నమ్మకండి. మా అమ్మాయి బంగారం" అన్నారు నాన్న. ఎంతైనా నాన్న కంగారు నాన్నది. పచ్చని మా కాపురంలో నిప్పులు పోసేలా ఉన్నాడనే భయంతో. 


  ఇంతవరకూ వచ్చాకా ...జరిగిన విషయం చెప్పేద్దామనిపించింది నాకు. "ఇతను రాహుల్ అని..."  పెదవి విప్పి చెప్పబోతుంటే...నన్ను మాట్లాడనీయలేదు నాభర్త.


  "నువ్వుండు రాధా! ఇతను వచ్చిన విషయం ఎందుకో అతని నోటితోనే చెప్పనీయి" అంటూ నన్ను అడ్డుకున్నారు. 


  రాహుల్ విలన్ ఫోజిచ్చి..."అయితే నేను వచ్చిన వ

ిషయం నానోటితోనే చెప్తాను. నేను రాధా ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నాను. ఈలోపు నీతో పెళ్లికానిచ్చేశారు. నన్ను కాదని మీతో సంసారం ఏవిధంగా చేస్తుందో చూడాలనీ, మాప్రేమ విషయం మీకు తెలిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసిపోదామని వచ్చాను" అన్నాడు.


   రాహుల్ మాటలను విన్న నాభర్త ముఖంలో ఎలాంటి రంగులూ మారలేదు. చాలా కూల్ గా వున్నారు.


  "మీరు చెప్పింది నిజమే అయితే...రాధకు అభ్యంతరం లేకపోతే మీరు నాభార్యను తీసుకెళ్లిపోయి పెళ్లిచేసుకోవచ్చు" అంటూ రాహుల్ తో నాభర్త చెప్పిన ఆమాటకు నేనూ, నాతల్లిదండ్రులూ తుళ్ళిపడ్డాము.


   అంతే...మరునిమిషం రాహుల్ అక్కడ కనిపించలేదు.


   "ఇడియట్..." అనుకుంటూ వీధి గుమ్మం తలుపు భళ్ళున వేసేసారు నాభర్త.


   వెక్కివెక్కి ఏడుస్తూ నాభర్త కాళ్లపై పడ్డాను. అమ్మా నాన్నా అల్లుడికి దణ్ణం పెడుతున్నారు. 


   నన్ను లేవదీస్తూ... అక్కున చేర్చుకున్నారు. నాతల్లి దండ్రులకు "చిన్నవాడిని దణ్ణం పెట్టొద్దు" అంటూ వారించారు. 


   "గతం గతః. మీమధ్య ఏమి జరిగిందన్నది నాకు చెప్పకండి. నేను కూడా ఎప్పుడూ మిమ్మల్ని అడగను. కానీ నేను ఒక్కటి అర్థం చేసుకోగలను. రాహుల్ రాధది నిజమైన ప్రేమే అయితే నన్ను పెళ్లిచేసుకోడానికి రాధ ఒప్పుకునేది కాదు. ఒకవేళ నాతో బలవంతంగా చేసివుంటే...ఇంత అన్యోన్యంగా నాతో కాపురం చేసివుండేది కాదు." 


   "ఇక రాహుల్ నిజమైన ప్రేమికుడే అయ్యుంటే...పెళ్లై పోయిన రాధ జీవితం సుఖంగా సాగిపోవాలని ఆశిస్తాడే గానీ...దంపతుల మధ్యకొచ్చి విడదీయాలని కోరుకోడు. పోనీ మీరిద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకోండి అని నాఅనుమతి ఇచ్చినా... భయపడి పారిపోయాడు. బహుశా రాధ ఇప్పుడు వివాహిత కావడం వల్లే. అతనిలో హీరో లక్షణాల కంటే విలన్ లక్షణాలే ఎక్కువున్నాయి. అలాంటి వాడు నీ జీవితంలోకి రాకపోవడమే మంచిదయ్యింది. మీమధ్య నడిచింది నిజమైన ప్రేమ కాదు. తెలిసీ తెలియని వయసులో పడే ఆకర్షణ మాత్రమే. ఏ తప్పూ చేయనంత వరకూ యుక్తవయసులో ఇది సహజం. మీరంతా ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోండి. రాధ నాకు ప్రాణసమానమైన భార్యని మీ అందరికీ మాటిస్తున్నాను. ఎన్ని ఒడిదుడికలు ఎదురైనా మా కాపురం పచ్చగానే ఉంటుంది"  అంటూ చెప్పి నాభర్త మా అందరి మనసుల్నీ దోచేసుకున్నారు.


   నాకాపురం కూలిపోకుండా నిలిచినందుకు అమ్మైతే నన్ను దగ్గరకు తీసుకుంటూ ఎంతగా సంతోషించిందో!!


   


    

    

    


   

   


   

   

   



Rate this content
Log in

Similar telugu story from Inspirational