లవ్ ఇన్ అమెరికా – 10
లవ్ ఇన్ అమెరికా – 10


#అమావాస్య_రాత్రి
ఆశకీ, భయానికీ మధ్య కొట్టుకునేదే జీవితం. నాకది ఇప్పుడు ప్రత్యక్ష అనుభవంలో ఉంది.
ఆల్బర్ట్ చెప్పేది వినటం కోసం ఇరవైనాలుగు గంటలు కూడా తిరక్కముందే అతడి ఇంటి ముందు నించున్నాను. కాలింగ్ బెల్ నొక్కి రెండు నిమిషాలవుతున్నా ఇంకా ఎవరూ తలుపు తీయలేదు. తలుపు తడితే ఓపెన్ చేసే ఉంది వెంటనే తెరుచుకుంది.
లోపలికి అడుగుపెట్టాను. నిన్నటిలా కింద కార్పెట్ పరిచి లేదు. ఇంట్లో ఎవరైనా ఉన్న అలికిడి కూడా లేదు.
“ఆల్బర్ట్?...” పిలిచాను.
స్పందనలేదు.
“మేరీ ఆంటీ?” అరిచాను.
శూన్యం!
పైకెళ్లి ఆల్బర్ట్ రూమ్ లో చూస్తే అక్కడ కూడా ఖాళీ రూమే దర్శనమిచ్చింది. ఫోన్ చేద్దామని చూస్తే రింగ్ అవుతుంది గాని ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. ఆలోచిస్తూ కిందకి వచ్చేశాను. మరోసారి ఆల్బర్ట్ అని అరిచినా ఫలితం లేకపోయింది. బయటికొచ్చి చెప్పులు వేసుకుంటుంటే అప్పుడు గమనించాను అక్కడ ఉన్న మరోజత చెప్పులని.
మార్గరేట్ చెప్పులు ఇక్కడ!?... న్యూయార్క్ పెళ్ళిలో చూశాను. ఆమె వేసుకొచ్చింది ఆమె ఈ చెప్పులనే!
కారణం తెలీదు, ఎవరో రమ్మన్నట్టు వెంటనే సెకండ్ ఫ్లోర్ లోని ‘ఫ్యామిలి హైరార్కి’ రూమ్ కేసి పరిగెత్తాను. నా అంచనా తప్పలేదు, వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. ఫోటోస్ వైపు తిరిగి నించుని ఉన్నారు.
“నేను వెళ్తాను ఆల్బర్ట్... మళ్ళీ మేఘన్ రావచ్చు...” మార్గరేట్ అంటుంది.
నేను లోపలికి వెళ్తున్నదాన్నల్లా బయటే ఆగిపోయాను.
“తను అప్పుడే రాదు. 24 హవర్స్ అని చెప్పా. ఇంకా టైమ్ ఉంది” ఆల్బర్ట్ సమాధానం.
“నిన్న నా గురించి అడిగినప్పుడు ఏం చెప్పావ్?” ఆమె మరో ప్రశ్న.
“లాల్..., అసలు నిన్న నీ టాపిక్కే రాలేదు. మగ్ పిచ్చిది. నేను కొంచెం ప్రేమని చూపిస్తే చాలు ప్రపంచాన్ని మర్చిపోయి నాకు వశం అయిపోతుంది. నిన్న కూడా నాకు వశం అయిపోయింది” అతడి బదులు.
నేను వాళ్ళకి కనిపించకుండా తలుపు చాటుకి నక్కాను.
“మరి ఈరోజు అడిగితే ఏం చెప్తావ్?”
“హ... హ... తను అడగదు. నేను ఎప్పుడు ఐ లవ్ యు చెప్తానా అని కాచుకుని ఉంది. ఒకవేళ అడిగినా..., చెప్పాగా.., తను పిచ్చిదని. ఏం చెప్పినా నమ్మేసిద్ది”
గుండె కుంచించుకుపోతున్న భావన నా లోపల. కన్నీళ్లు జలజలా రాలుతున్నాయి. ఏడుపు వస్తుంది. ఏడుపు వినిపించకూడదని చేత్తో నోరుని నొక్కి పట్టాను. నా ఇంద్రియాలే నాకు వ్యతిరేకంగా పని చేస్తున్న అనుభూతి.
“తనంటే ఎందుకు నీకంత పగ?”
“పగా?... పగేముంది ఇందులో?! తన మీద నాకు పగ, ప్రేమ రెండూ లేవు”
“మరెందుకు ఇదంతా చేస్తున్నావు?”
“చెప్పగా తను పిచ్చిదని... ఐ జస్ట్ లవ్ హర్ ఆబ్సెషన్ ఫర్ మి. అండ్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్ ఈజ్ మై వర్ట్యు, ఐ బిలీవ్”
“శాడిస్ట్!”
“హ... హ... మేబీ మోర్ థాన్ దట్?...”
“కానీ...” ఆమె ఏదో అనబోతున్నా, “అబ్బా..., ఫర్గెట్ ఎబౌట్ హర్ బేబీ…, చెప్పు ఈ సెల్ఫిని ఫ్రేమ్ కట్టించి పెడితే అక్కడ బానే ఉంటుందిగా?” మార్గరేట్ మాటని మధ్యలోనే తుంచేశాడు ఆల్బర్ట్.
ఇక నేను ఆగలేకపోయా...
“కానీ మార్గరేట్ చీరలో ఉంటే బాగుంటుంది కదా ఆల్బర్ట్..., నీకు చీర అంటే చాలా ఇష్టం కదా?” వాళ్ళ ముందుకు వెళ్తూ అన్నాను.
వాళ్ళు నావైపుకి తిరిగారు.
“మగ్..., నువ్వా?” ఆల్బర్ట్ లో ఆశ్చర్యం.
“షాక్ అయ్యావా?”
“నీ గురించే మగ్... మేము... జస్ట్ ఇప్పుడే... మాట్లాడుతున్నాం...” ఆల్బర్ట్ గొంతులో తడబాటు.
“నేను అంతా విన్నాను ఆల్బర్ట్”
“అది కాదు మేఘన్... అది...” మార్గరేట్ ఏదో అనబోయింది. నేను, “యు…, మార్గరేట్… యు జస్ట్ షట్ అప్. ఇది నాకూ, ఆల్బర్ట్ కీ మధ్యది. మీరు చెప్పండి సార్...” అమెనాపేసి ఆల్బర్ట్ కేసి అన్నాను.
“హ... హ... చూశావుగా మార్గరేట్..., మగ్ పిచ్చిది అంటే నమ్మావు కాదు?! చూడు మనం ఆడిన ఫ్రాంక్ ని ఎలా నమ్మేసిందో?” అన్నాడు.
“ఇక నాటకాలు చాలు ఆల్బర్ట్!...” అరిచాను.
ఆల్బర్ట్ సైలెంటైపోయాడు. రెండు క్షణాల తరువాత, “అవును, నాకూ బోర్ కొట్టేసింది. ఇక నాటకాలు చాలు” అన్నాడు.
“ఎందుకు ఇదంతా చేశావ్?”
“అంతా విన్నా అన్నావ్ కదా మగ్..., చెప్పాగా..., నా మీద నీకు ఉన్న పిచ్చి అంటే నాకు పిచ్చి. దాంతో ఆడుకోవటం నా సరదా”
“నువ్వు ఇంత నీచుడివని అనుకోలేదు ఆల్బర్ట్”
“నీచుడిని కాదు కాబట్టే నిన్ను ఎక్స్ప్లాయిట్ చేయలేదు”
“అలా చేసినా మగాడివని అని సరిపెట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వు నా దృష్టిలో నపుంసకుడివి...”
“ఓహో..., ఆదా నీ బాధ... సరేరా ఐతే.. పది నిమిషాల్లో నీ బాధ తీరుస్తా...” అన్నాడు.
చాచిపెట్టి చెంప చెళ్లుమనిపించా. ఆల్బర్ట్ విస్తుపోయాడు. మార్గరేట్ ఐతే స్థాణువే అయిపోయింది.
“గుర్తుపెట్టుకో ఆల్బర్ట్..., ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోతున్నా. కానీ నాకు చేసినదానికి నువ్వు ఖశ్చితంగా అనుభవిస్తావ్... నావల్లే అనుభవిస్తావ్... ఐ కర్స్ యు టు డెత్... చచ్చిపో పో” అన్నాను.
“నీకేమైనా పిచ్చి పట్టిందా ఆల్బర్ట్ ని కొడతావ్?... అసలు...” తేరుకున్న మార్గరేట్ అరిచింది.
“వదిలేయ్ మార్గరేట్..., నేను తన మనసు మీద కొట్టిన దెబ్బకన్నా తను నా చెంప మీద కొట్టింది చిన్నదేలే... వదిలేయ్. పాపం పూర్ గర్ల్!” వెటకారంగా అన్నాడు ఆల్బర్ట్.
నాకింక ఒక్కక్షణం అక్కడ ఉండబుద్ది కాలేదు. “ఛీ!...” అని పరిగెత్తుకుంటూ కిందకొచ్చేశాను.
అప్పుడే ఆంటీ మేరీ బయటనించి లోపలికొస్తూ ఉంది. “హేయ్ చైల్డ్... వెళ్లిపోతున్నావే?.. ఆల్బర్ట్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాడు?” అంది.
నేను ఆమెని పట్టించుకోకుండా బయటికి పరిగెత్తాను.
******
“నేను ఇండియా వెళ్లిపోతున్నాను” ఇంటికి రాగానే రూమ్ లోకి పరిగెత్తి బ్యాగ్ సర్దుతూ అమ్మతో అన్నాను.
ఇంట్లో నాన్న కూడా ఉన్నారు.
“ఏం మాట్లాడుతున్నావు?” – అమ్మ.
“ఈ సాయంత్రమే ఇండియాకి ఫ్లయిట్ ఉంది. దానికే వెళ్తున్నా”
“మరి చదువు?” – నాన్న.
“ఇండియాకి మైగ్రేషన్ పెట్టుకుంటా”
“ఏం పిచ్చిపిచ్చిగా ఉందా?” – అమ్మ.
“అవును. నేను పిచ్చిదాన్నే. అందుకే ఇదంతా”
“ఏం జరిగింది?”
“నీకు చెప్పాల్సిన అవసరం లేదు”
చెంప చెళ్లుమనిపించింది అమ్మ. నిర్ఘాతపోయియాను
.
“చెప్పు ఏం జరిగిందో?” అంది.
ఇక నిలబడలేకపోయాను. నేలమీదే కుప్పకూలాను. వలవలా ఏడ్చాను. గుండెలవిసేలా ఏడ్చాను. భారమంతా దిగేదాకా ఏడ్చాను. ఏడుస్తూనే మొత్తం చెప్పాను.
“ప్లీజ్ నాన్న..., నన్ను ఇండియా వెళ్లిపోవటానికి ఒప్పుకోండి నాన్న. నేనింక ఒక్కక్షణం కూడా ఇక్కడ ఉండలేను. ప్లీజ్ నాన్న...” ఏడుస్తూనే అన్నాను.
అమ్మ నాన్న వంక చూసింది. నాన్న నా వంక చూశారు.
******
‘The flight scheduled to leave for India has been delayed by two hours due to bad weather conditions. All passengers are requested to go for dinner’
మైక్ లో అనోన్స్ మెంట్ వినిపించింది. నేను, అమ్మవాళ్ళు, తమ్ముడు ఎయిర్పోర్టు లాంజ్ లో కూర్చుని ఉన్నాం.
“నేను వెళ్ళి తినటానికి ఏమన్నా తీసుకొస్తా” నాన్న లేస్తూ అన్నారు.
“ఇండియా వెళ్లిపోతున్నావా చైల్డ్?” వెనుక నుంచి స్వరం వినిపిస్తే తల తిప్పాను.
“ఆల్బర్ట్ కి దూరంగా వెళ్లిపోతున్నావా?” ఆంటీ మేరీ మావైపు వస్తూ అంది.
లేచి నించున్నాను. నాతోపాటే అమ్మ కూడా లేచింది.
“ఎవరు?” అంది అమ్మ.
“ఆంటీ మేరీ..., ఆల్బర్ట్ ఇంట్లో కుక్”
“ఆల్బర్ట్ హాస్పిటల్ లో ఉన్నాడు మై చైల్డ్” నాముందుకొచ్చి అంది.
“వాట్?...”
“అవును చైల్డ్. అతడు ఇప్పుడు చావుబ్రతుకుల్లో హాస్పిటల్ లో ఉన్నాడు. నిన్నే కలవరిస్తున్నాడు”
“ఇప్పుడు ఇది ఇంకో నాటకమా?”
“లేదు మై చైల్డ్. కావాలంటే చూడు...” అంటూ సెల్ ఫోన్ లో వీడియో ఓపెన్ చేసింది.
అందులో ఆల్బర్ట్ బెడ్ మీద అపస్మారకస్థితిలో ఉన్నాడు. ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంది. అటండ్ చేస్తూ చుట్టూ డాక్టర్లు ఉన్నారు. పక్కనే మార్గరేట్ కూడా ఉంది. ఇందాకటిదాకా బానే ఉన్నాడు సడన్ గా ఏమైంది?... అర్ధంకాలేదు.
“ఆల్బర్ట్ కి ఏమైంది?’’ అదే అన్నాను.
“ఇప్పుడు అదంతా ఎక్స్ ప్లయిన్ చేసే టైమ్ లేదు. నువ్వు నాతో రావాలి”
నాకు అర్ధంకాలేదు. “కానీ నాకు ఇంకో రెండుగంటల్లో ఇండియాకి ఫ్లయిట్ ఉంది” అన్నాను.
“అంత సమయం లేదు మై చైల్డ్. అతడు ఇప్పుడు చావుబ్రతుకుల్లో ఉన్నాడు. నిన్నే కలవరిస్తున్నాడు”
నేను అయోమయంగా నాన్న వంక చూశాను. నాన్న అమ్మ వంక చూశారు. అమ్మ నా వంక చూసింది.
“నీ మనసు చెప్పింది చేయ్” అంది.
నేను కళ్ళు మూశాను.
******
“నేను ఆల్బర్ట్ కార్ వేసుకొచ్చాను. హాస్పిటల్ అనకోస్టియా ఫ్రీవే లోపలికి. నేను కార్ స్పీడ్ గా నడపలేను. పైగా బయట క్లైమేట్ కూడా బాల్లేదు. తుఫాను వచ్చేలా ఉంది. నువ్వు డ్రైవ్ చెయ్ మై చైల్డ్” అంది ఆంటీ మేరీ.
నేను డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాను. తను వచ్చి నా పక్కన కూర్చుంది. నేను అనకోస్టియా ఫ్రీవే వైపు కార్ పోనించాను.
“ఆల్బర్ట్ కి ఏమైంది?” మళ్ళీ అడిగాను.
“నీకు చేసినదానికి అనుభవిస్తున్నాడు. నీ శాపం ఫలించింది” అంతకుమించి మాట్లాడలేదు ఆంటీ మేరీ.
మా కార్ అనకోస్టియా ఫ్రీవే మీదకి వచ్చింది. ఫ్రీవే మీద స్ట్రీట్ లైట్స్ వెలిగి లేవు. కారణం కోసం లోకల్ రేడియో ఆన్ చేస్తే పవర్ స్టేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని అని, కుదిరితే ఆ రూట్ అవైడ్ చేయమనీ చెప్తుంది. తుఫాను గాలి కారణంగా వాతావరణం కూడా అల్లకల్లోలంగా ఉంది. నేను మాత్రం అలానే కార్ ని పోనిస్తూ ఉన్నాను. ఐతే గోరుచుట్టు మీద రోకలిపోటు అన్నట్టు కుదుపుకు లోనై ఒక్కసారిగా ఆగిపోయింది మా కార్.
“ఏమైంది?” అంది ఆంటీ మేరీ.
దిగి చూస్తే కార్ బ్రేక్ డౌన్.
“ఇప్పుడు ఏం చేద్దాం?” ఆంటీ మేరీ.
నేను సెల్ తీశాను క్యాబ్ ఏమన్నా బుక్ చేద్దామా అని.
“కానీ..., గాడ్..., ఇప్పుడు బ్యాటరీ డౌనా!?...”
చీకట్లో రోడ్ చూస్తే ఫ్రీవే మీద అప్పుడో కార్, అప్పుడో కార్ వెళ్తుందిగాని ఎవరూ లిఫ్ట్ ఇచ్చేలా అనిపించటంలేదు.
ఇంతలో నేను ఊహించనివిధంగా, “చైల్డ్... పారిపో...” వెనుక నుంచి ఆంటీ మేరీ అరుపు.
వెంటనే వెనక్కి తిరిగి చూశాను.
అప్పటికే ఆంటీ మేరీ కిందకి వాలిపోతూ ఉంది. “జీసెస్!...” అవే ఆమె ఆఖరి మాటలు.
అప్పుడే ఆకాశంలో మెరుపు మెరిసింది.
ఆ మెరుపులో కనిపించింది అతడి ఆకారం... బలిష్టంగా... మంకీ కాప్ లో... చేతిలో యాక్స్ తో.
వాడు కొట్టటం కారణంగానే ఆంటీ మేరీ అలా కింద పడిపోతుందని అర్ధమవటానికి నాకు క్షణం కూడా పట్టలేదు.
“గాట్ యు చిక్!” నన్ను చూస్తూన్న అతడి కంఠం.
‘అనకోస్టియా ఫ్రీవే పరిసరాల్లో తిరుగుతున్న సీరియల్ రేపిస్ట్’ – ఎవరో అన్నది గుర్తుకొచ్చింది.
వెంటనే పరుగందుకున్నాను.
అప్పుడే తుప్పర మొదలైంది. పక్కనే తుప్పల్లోకి పరిగెత్తాను. ఆ ఆకారం కూడా నన్ను తరుముతూ వస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూసే ధైర్యం కూడా చేయలేదు నేను. పరిగెడుతూనే ఉన్నాను. ఐదు నిమిషాలు అయింది. అలానే పరిగెడుతూనే ఉన్నాను. దూరంగా ఏదో చెక్క ఇల్లు లాంటిది కనిపించింది. అందులోకి వెళ్దామని అటువైపుకి తిరిగాను. కానీ వెళ్ళటం కాదు కదా కనీసం ఒక్క అడుగు కూడా వేయలేకపోయాను. వెనుక తలకి ఏదో బలంగా తగిలి ముందుకి బొక్కబోర్లా పడ్డాను.
అలా నేను పడటానికి కారణం ఆ రేపిస్ట్ విసిరిన యాక్స్ అనీ, అది దూసుకువచ్చి నా తల వెనుక భాగంలో తగలటం కారణమనీ నాతోపాటే నా పక్కన పడ్డ యాక్స్ ద్వారా తెలిసింది..
నాకు స్పృహ ఐతే పోలేదు గాని శరీరం మాత్రం స్పర్శ జ్ఞానం కోల్పోయినట్టు ఉంది, కదల్లేకపోయాను. రేపిస్ట్ పరిగెట్టుకుంటూ వచ్చి అలుపు తీర్చుకుంటున్నట్టు వగరుస్తున్నాడు.
“డూ యు థింక్ యు కన్ ఎస్కేప్ ఫ్రమ్ మీ బిట్చ్…, హా!?”
ఆ రేపిస్ట్ నన్ను కాలితో వెల్లికిల తిరిగేలా తన్నాడు. తుప్పర కాస్తా పెద్దపెద్ద చినుకులుగా రూపాంతరం చెందింది.
“హొ లుక్స్ లైక్ ఆసియన్ చిక్. డెలీషియస్...”
వాడు మంకీ కాప్ తీసేశాడు. మెరుపు వెలుగులో నాకు వాడి ముఖం కనిపించింది. నా మీదకి వాలాడు.
పెద్ద చినుకులు కాస్తా పెద్ద వర్షంగా మారిపోయింది.
“డోంట్ క్రై బేబీ..., పని అయిపోయాక నిన్ను చంపేసి ఈ పాపపు లోకం నుంచి విముక్తురాల్ని చేస్తాగా?”
నా మీద పడ్డ ఆ మానవ మృగం తన పని తాను చేసుకుపోసాగింది. తల వెనుక బలంగా తాకిన దెబ్బ వలన జరుగుతుంది తెలుస్తూ ఉన్నా చిటికెన వేలు కూడా కదల్చలేని పరిస్తితి. ఉదయం ఏవో మాటల్లో అమ్మ ఈరోజు అమావాస్య అని చెప్పినట్టు గుర్తు. కానీ నిజానికి అమావాస్య నా జీవితంలో అని ఇప్పుడే తెలుస్తుంది.
ఇప్పుడు గుర్తుకొచ్చింది ఫ్రీవేలో రేపిస్ట్ తిరుగుతుంది అన్నది ఎవరో కాదు ఆల్బర్టే అని! అవును..., అప్పుడు కల వచ్చిన రోజు ఆల్బర్ట్ అన్నాడు.
కను కొనకుల్లో నీరు కారుతండగా కళ్ళు మూసేశాను.