Sudheer Kaspa

Drama

4.3  

Sudheer Kaspa

Drama

మనసు తలుపులు తెరిచి చూడు

మనసు తలుపులు తెరిచి చూడు

7 mins
843


“ప్లీజ్ హెల్ప్ .......అమమ్మ గారూ.........రమా ఆంటీ...... ప్లీజ్ రండి ఎవరైనా ...ప్లీజ్ హెల్ప్ .... జానకి ఆంటీ.....అమ్మమ్మ గారూ....ప్లీజ్ హెల్ప్.......”.

ధడేల్.... ధడేల్.....తలుపులు బాదుతున్న శబ్ధం.....

“ఒసేయ్ సమీరా.....దివ్యా..... తియ్యండే తలుపులు...ఎవడికి తెలీదు మీ గురించి ...పేద్ద పతివ్రతల్లాగా .... ఎవడెవడో వస్తాడు ...నేనొస్తే తప్పా …తియ్యండే తలుపులు......”.

ధడేల్..... ధడేల్.....

“హెల్ప్ ....హెల్ప్ .....మర్యాదగా పో ఇక్కడ నుండి లేదంటే పోలీస్ కంప్లయింట్ ఇస్తా..”భయం,కోపం,నిస్సహాయత కలిసిన గొంతు తో పెద్దగా అరుపులు అటువైపు నుంచి ....

ధడేల్..... ధడేల్....”ఒసేయ్.....************ తలుపు తియ్యండే”...


కిటికీ లోంచి పక్కింటి పై పోర్షన్ వైపు చూస్తూ “అమ్మా ఎదురింటి ప్రకాశ రావు మళ్ళీ తాగొచ్చాడు.. పాపం సమీరా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు వెళ్దామా?”అడిగింది కావ్య ఆందోళనగా....

“ఆ వినిపిస్తుందిలే ..ఆ పనికిమాలిన వెధవకిది మామూలే..నువ్వు తిను త్వరగా”....

“అమ్మా..దే ఆర్ ఇన్ ట్రబుల్ .....డాడీ వెళ్ళి చూడండి ఓ సారి “

“నోర్మూస్కోని మింగవే...పేద్ద బయల్దేరింది ..మీరు కదిలారంటే నేను ఊరుకోను చెప్తున్నా...”గర్జించింది రమ.

“ఏంటమ్మా టూ మచ్ చేస్తున్నావ్ ..గయ్యాళి లాగా చేస్తున్నావ్ ఈ మధ్య..”

“ టైం 7 అయింది....నీకు ట్రైన్ టైం ఔతుంది నువ్ రెడీ అవ్వురా బంగారం ...ఇవన్నీ మామూలే ..ఆ నలుగురు పిల్లలేం తక్కువోళ్లు కాదు.అబ్బాయిలతో స్నేహాలు,అర్ధరాత్రి అపరాత్రి వరకు బయట తిరగడాలు ... రాత్రి ఒంటి గంట రెండు వరకు మాటలు వినిపిస్తూనే ఉంటాయి అక్కడ నుండి....చిన్న చిన్న గుడ్డలేస్కోని తిరుగుతారు ఇంట్లో... ఒక పధ్ధతి పాడూ లేకుండా..... ఆ ప్రకాశ రావు చూపు ఎపుడూ అటువైపే......”

“అమ్మా.......!! వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా వేస్కుంటారు ..ఈ వెధవని తన్నకుండా వాళ్ళని అంటావేంటి?సమీరా నాకు తెలుసు.. మంచి అమ్మాయే”

“చూడు బంగారం 3 నెలల్లో పెళ్లి పెట్టుకుని ఎందుకే ఈ గొడవలు నీకు.నువ్వు అడిగావని ఈ గ్యాప్ లో జాబ్ కంటిన్యు చెయ్యడానికి ఒప్పుకున్నాం.చక్కగా హైదరాబాద్ వెళ్లి నీ పని నువ్వు చూస్కోవడమే..ఇలాంటి వాటిలో దూరకు.పెళ్లి ఆలోచనల్లోనే ఉండు.షాపింగ్లు,పార్లర్లు అవీ చేస్కో. బాబా గారి దయ వాల్ల అంతా సరిగా జరిగితే అదే చాలు ఈ జన్మకి ...అంతే...అయినా,ఆ అమ్మాయిలపై మంచి అభిప్రాయం లేదు వీధిలో.జానకి ఆంటీ కూడా పలకలేదు చూసావా...ఆ మామ్మ గారు అనవసరంగా అద్దెకి ఇచ్చారు వాళ్లకి.కాలేజి అమ్మాయిలకి వద్దండీ.... అంటే వింటేగా!!......ఆవిడ ఒంటరిది కదా!! వీళ్ళని చూస్కొని తెగ మురిసిపోతది. “మా డాక్టరమ్మలు” అని..వీళ్ళ వేషాలు ఆమెకి ఏం తెలుసు.అప్పటికి జానకి చెప్పింది ఆమెకి. వింటేగా....మా అమ్మాయిల గురించి నాకు తెలుసు అని వెనకేసుకొస్తాది...ఆవిడ లేదు ఇప్పుడు ఇంట్లో ... రామేశ్వరం వెళ్ళింది... అందుకే ఈ వెధవ ఇక్కడ గోల మొదలెట్టాడు.ఎంత మెడికోలు అయినా అర్ధరాత్రి వరకు తిరిగితే ప్రతి వాడికి లోకువే. పైగా ఇక్కడే బైక్లు ఆపి రోడ్ పై నిలబడి గంటల తరబడి అబ్బాయిలతో మాటలు. ఎవరేం అనుకుంటారో అని కూడా లేదు.ఒక గెడ్డం వాడు వస్తాడు వాడొక సేవకుడు వీళ్ళకి. అన్నీ తెచ్చి పెడుతుంటాడు వీళ్ళకి ...”జిత్తు” నో, గిత్తు నో ఉంది వాడి పేరు.ఎక్కువ వినిపిస్తుంటుంది పైనుంచి.నేను అందుకే వాళ్లతో మాట్లాడను పెద్దగా.ఇలా ఉంటె ఎవడు మాత్రం హెల్ప్ కి వెళ్తారు.నువ్వు రెడీ అవ్వు త్వరగా, టైం అయ్యింది.”

కావ్య చూపు మాత్రం అటువైపే ఉంది.కాసేపట్లో నలుగురు అబ్బాయిలు రావటం,నాలుగు తగిలించి ఆ ప్రకాశ రావుని ఈడ్చుకుని వెళ్ళటం క్షణాల్లో జరిగిపోయాయ్.”హమ్మయ్య!! పోన్లే....అయినా ఇంత గొడవ జరుగుతుంటే వీధిలో వాళ్ళు ఎవరికీ చీమ కుట్టినట్టు లేదేంటి??అమ్మ కూడా ఏంటి ఇలా........ అమ్మ చెప్పిన ఆ గెడ్డం వాడు కుడా ఉన్నట్టున్నాడు ఆ నలుగురిలో.....సర్లే ఇక నేను ప్రశాంతంగా వెళ్ళొచ్చు “ అనుకొని లేచింది కావ్య.

*********


“జానకీ....మా ఆయన ఆఫీసు పని మీద ఒరిస్సా వెళ్తున్నారు.ఏదో మారుమూల ప్రాంతం... ఈ రెండు రోజులు మా ఇంట్లో ఉండవే..ఒక్కదాన్ని ఏముంటాను”అడిగింది రమ.

“ఓ! సరే, దానిదేముంది అక్కా చక్కగా రాత్రి టివి లో బిగ్ బాస్ చూసుకుంటూ బోల్డు కబుర్లు చెప్పుకుందాం.అన్నట్టు.......... రేపు నీ బర్త్ డే కదూ!!..ఒరేయ్ ఆనంద్...రమా పెద్దమ్మ పుట్టినరోజు రేపు ..ఒక కేకు తీస్కుని రారా రాత్రి...” కొడుక్కి ఆర్డరు వేసింది జానకి.

రమ, జానకి పక్క పక్క ఇళ్ళలో 10 సంవత్సరాలుగా ఉండటం వల్ల మంచి స్నేహం కుదిరింది.కావ్య, రమ కూతురే అయినా జానకితో మంచి అనుబంధం ఉండేది.ఎపుడూ జానకితోనే తిరుగుతూ ఉండేది.ఆనంద్,కావ్య కంటే రెండేళ్ళు చిన్నవాడు.కాస్త ముభావంగా ఉండే రకం..ఏవో సబ్జెక్ట్ లో డౌట్లు చెప్పించుకోవడానికి కావ్య దగ్గరికి వచ్చేవాడు తప్ప పెద్దగా మాట్లాడేవాడు కాదు.తన పని ఎదో తను చూసుకునే రకం.

సమయం రాత్రి 8గం. ........

“ఏంటో! ఇంకా పెళ్ళికి 40 రోజులే ఉంది.ఒక్కగానొక్క పిల్ల.”జాబ్ మానేసి వచ్చేయ్యవే!, పెళ్లి ఐతే ఢిల్లీ వెళ్లిపోతావ్ ..రాకపోక అన్నీ కష్టమే”,, అంటే వినదే...ఢిల్లీ ఏమైనా అంగారక గ్రహం లో ఉందా ..ఫ్లైట్ ఎక్కితే రెండున్నర గంటలలో వైజాగ్ లో దిగుతా ..అని ఎగతాళి ఒకటి.....పెళ్ళికి 10 రోజుల ముందు రిజైన్ చేస్తాదట...”అంటూ కూతురు పురాణం మొదలెట్టింది రమ.

ఏమిటీ ఈ ఆనంద్ గాడు ఇంకా రాలేదు అని విసుగ్గా గేటు వైపు చూస్తుంది జానకి ..

“సాయి శరణం బాబా శరణం శరణం...సాయి చరణం గంగా యమున సంగమ సమానం” రమ ఫోన్ రింగ్ టోన్ ......ఖంగున మోగింది.........ఎవరో కొత్త నెంబర్..

హలో !!...ఎవరండి???...

“నేను వైజాగ్ 2 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్,ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కి ఒక యాక్సిడెంట్ కేసు వచ్చిందమ్మా ..మీ అమ్మాయి అనుకుంటా ఫోన్ లో లాస్ట్ కాల్ మీదే ఉంది ..”

“యాక్సిడెంటా..మా అమ్మాయి ఇక్కడ లేదు మా అమ్మాయి కాదు”అంది ఖంగారుగా....

“అమ్మా ఈ అమ్మాయి పేరు కావ్య..మీ అమ్మాయేగా??.... ఇక్కడ కొందరు మెడికోలు కూడా మీ అమ్మాయి ని గుర్తు పట్టేరు ఆల్రెడీ ట్రీట్మెంట్ మొదలు పెట్టారు తనతో పాటు ఉన్న వేరే అబ్బాయి కి కుడా దెబ్బలు తగిలాయి.మీరు త్వరగా రావాల్సి ఉంది.”అని పెట్టేసాడు.

రమ కి కాళ్ళు చేతులు ఆడలేదు “ఈ పిల్ల వైజాగ్ ఎపుడోచ్చిందే నాకు చెప్పకుండా!!??యాక్సిడెంటు అంటున్నారే!!”..అని గగ్గోలు పెట్టింది....జానకి కి పరిస్థితి అర్ధమైంది ..భర్తని పిలుచుకొచ్చింది ..ఈ ఆనంద్ ఎక్కడికి పోయాడు ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి పోయాడు అని కొడుకుని తిట్టుకుంటూ జానకి ఆటో పిలుచుకొచ్చింది. ఆదరా బాదరా గా బయల్దేరారు ముగ్గురూ...


*****

సమయం రాత్రి 11.00 గం. ......

ఏడుస్తూ కూలబడి,3 గంటల మానసిక క్షోభ తరువాత, కావ్య పరిస్థితి కాస్త పర్వాలేదు అని డాక్టరు చెప్పేసరికి ,కాస్త ఊపిరి పీల్చుకుంది.

కూతురు అలా చెప్పకుండా రావటం, ఒక అబ్బాయి బైక్ పై రాత్రి తిరగటం,అది కాక ఒక పబ్ ముందు యాక్సిడెంట్ అయి పడిపోవటం తట్టుకోలేకపోతుంది రమ. ఆ అబ్బాయి ఆనంద్ అవటం ఇంకా మింగుడు పడటం లేదు.ఏంటి అంత రహస్యం గా వీళ్ళు పబ్ వైపు వెళ్ళాల్సిన అవసరం? ఆనంద్ ని అక్కడ చూడగానే ఆ మొగుడు పెళ్ళాలు తనని వదిలేసి కొడుకుని తీస్కోని ప్రైవేటు హాస్పిటల్ కి పరిగెట్టడం పుండు మీద కారం చల్లినట్లు ఐంది ఆమెకి.చేతిలో డబ్బు లేదు ఆయనేమో ఊర్లో లేడు చేసేదేమీ లేక అలా కూలబడిపోయింది. 3 గంటల తర్వాత కూతురు పరిస్థితి పర్వాలేదు అని తెలిసాక కాస్త కుదుట పడిందేమో ఆకలి గుర్తొచ్చింది.

”ఈ టైం లో ఏం దొరుకుతాయి??ఎవరినైనా అడుగుదామా??ఎలాగో ఇంకో 3 గంటల వరకు కావ్య ని చూడనివ్వరు... బయట చూసొద్దాం..”అని మెట్లు దిగుతుంది...

“ఏంటి ఈరోజు ఈ కుర్ర డాక్టర్ల హడావిడి....ఇంత మంది ఉన్నారు??”ఓ ముసలాయన అడిగాడు అక్కడ ఉన్న మరో వ్యక్తిని.

ఆ... ఏదో యాక్సిడెంట్ అంట వీళ్ళ ఫ్రెండ్సుకి..ఒక అమ్మాయి ఒక అబ్బాయి... ఆ పబ్ దగ్గర పడ్డారంట.. వెనక అమ్మాయి ఉంటే, ఒళ్ళు తెలీదుగా కుర్రాళ్ళకి......పైగా పబ్ దగ్గరట! ఫుల్లుగా తాగి వచ్చుంటారు ఇద్దరూ ...గట్టిగానే తగిలాయి ఆ అమ్మాయికి ..వాడికి ఏం ఐనట్టు లేదు వాడి అమ్మా బాబు తీసుకెళ్ళిపోయారు ...వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా అమ్మా నాన్నకి తప్పదుగా....ఆ యాక్సిడెంట్ వీడియో కుడా వచ్చేసింది యూట్యూబ్ లో చూసావా??.వైజాగ్ పబ్ లవర్స్ యాక్సిడెంట్ అని కొట్టు..” అని ఆ దారిన పోయే వాళ్ళ మాటలకి గుండెలో కత్తులు దింపుతున్నట్టు అనిపించింది రమకి.

మెల్లగా వెళ్లి ఇన్ పేషెంట్ వార్డు తలుపు దగ్గర నిలబడింది ....

ఒక 100 పడకలు ఉన్నాయి..ఆ రాత్రి వేళలో కూడా గోల గోల గా ఉంది లోపల...అంత మంది కి ఇంజెక్షన్లు వేస్తూ దూరంగా సమీరా...ఒకసారి రమ వైపు చూసి..ప్లీజ్.. ఒక్క 5 నిముషాలు...వచ్చేస్తా అన్నట్టు చేత్తో సైగ చేసింది రమ వైపు......

సరే అని అక్కడ బెంచి పై కూర్చుంది రమ ....మనసులో వెయ్యి ఆలోచనలు ....

“ఈ రోజు ఈ సమీరా లేకపోయుంటే నా పరిస్థితి ఏంటి..నాకేం తెల్సు ఇక్కడ...ఆ డాక్టర్ జితేంద్ర ...మంచి సర్జన్ అంట ఇన్నాళ్ళు జిత్తు జిత్తు అని అంటుంటే ..ఆయన గెడ్డం, ఆ వాలకం అదీ చూసి ఎంత తప్పుగా అనుకున్నా....నా బిడ్డ కోసం ఇంత రాత్రి నలుగురు కుర్రాళ్ళు రక్తం ఇవ్వడానికి వచ్చారు,సమీరా క్లాస్మేట్స్ అంట.జితేంద్ర మాట పై హాస్పిటల్ యంత్రాంగం మొత్తం కదిలింది.ఒక గవర్నమెంటు హాస్పిటల్ లో కార్పొరేట్ కి మించిన వైద్య సేవలు దొరికాయి.అందరూ కలిసి నా బిడ్డకి ప్రాణం పోసారు ... ఇదంతా సమీరా కి కావ్య తో ఉన్న ముఖపరిచయానికే .....ఎంతైనా ఈ కాలం పిల్లలు స్నేహం కి చాలా విలువిస్తారు..నాకూ ఉంది ...ఫ్రెండు ... ఆ జానకి ....కొడుకుని తీస్కోని కార్పొరేట్ హాస్పిటల్ కి పరిగెత్తింది..ఇక్కడ నా పరిస్థితి ఏంటో కనీసం పట్టలేదు మొగుడు పెళ్ళాలకి....ఐనా ఈ కావ్య పిల్ల చెప్పా పెట్టకుండా ఎందుకొచ్చింది..అక్కా అక్కా అని తిరిగే వాడు దాని చుట్టూ.. పనికిమాలిన వెధవ..వాడితో నాకు చెప్పకుండా ఏం పని దీనికి. పైగా ఏదో వీడియో అంటున్నారు.లేని పోని కథలు అల్లుతారు వెధవ జనం. అభం శుభం ఎరుగని పిల్లపై రకరకాల మాటలు అంటారు.పెళ్లి వాళ్ళకి తెలిస్తే ఏమైనా ఉందా...."కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఆమెకు.

అలా సమీరా వైపు చూసింది ..పెద్ద కళ్ళు,పెద్ద జడ.. చూడ ముచ్చట గా ఉంది. పైగా ఇంత అలసటలో కూడా ఆమె మొఖం పై చెరగని చిరునవ్వు రమను కట్టిపడేసాయి.చిన్న పిల్లలను లాలిస్తూ, మాట్లాడిస్తూ ఇంజక్షన్ చేస్తున్న సమీరాను, తన బాధ,ఆకలి అన్నీ మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయింది రమ. “ఎంత ఓపిక ఈ పిల్లకి. లక్షణం గా ఉంది కూడాను ..ఇన్నాళ్ళు నేను తప్పుగా చూసానా ఈమెని??”

సమీరా, 5 నిముషాలు అని చెప్పి అరగంట దాటింది.

సమయం 11.40.........

“సారీ ఆంటి..చాలా వర్క్ ఉంది ఈరోజు ..సరే తిన్నారా మీరు పదండి బైటకి వెళ్దాం,చాలా ఆకలేస్తుంది ”అంది సమీరా

“నువ్వు తినలేదా ఇంకా??”ఆశ్చర్యంగా అడిగింది రమ.

“ఎక్కడ ఆంటి!! ...మధ్యాహ్నం కూడా లేదు తిండి.మాములుగా నా డ్యూటీ మద్యాహ్నం 2 కి అయిపోతుంది.లంచ్ కి వెళ్ళే లోపు సడెన్ గా నా ఫ్రెండ్ కి హెల్త్ పాడైంది. సో ..తన డ్యూటీ కూడా నేనే తీస్కున్నా. .ఈవెనింగ్ ఫ్రూట్ జూస్ తాగేను అంతే, పదండి ఆకలేస్తుంది ” అని బైక్ తీసి రమ ని ఎక్కించుకొని రోడ్ పైన ఒక బండి దగ్గర ఆపింది.

“భయ్యా రెండు దోశలు ......ఈ టైం లో ఇక్కడ తప్ప ఎక్కడా ఏం దొరకవు ఆంటీ...ఏం అనుకోకండి..మాకు తప్పవులే ఇవన్నీ ...ఆ హాస్టల్ లో ఉందామంటే ఆ మెస్ వాడు భోజనం ఉంచుతాడు పాపం...ఐనా అక్కడ 7 కి వండుతాడు ..మా టైమింగ్స్ కి వాడికి సెట్ కాదు..ఆ చల్లారిన చప్పిడి తిండి కంటే ఇది బెటర్ .. ..అయినా ఇంకా చాల ప్రొబ్లెమ్స్ ఉన్నాయిలే హాస్టల్ లో ..అందుకే బైట ఉంటున్నాం..బైట చూస్తే ఇంకోలాంటి ప్రొబ్లెమ్స్..ఇంట్లో చెప్తే భయపడతారు. ఏమి చెయ్యగలం? భరిస్తూ ఉండటమే........ఈ చదువులన్నీ మానేసి ఎక్కడికో దూరంగా పారిపోవాలని ఉంటుంది కొన్నిసార్లు....అయినా ఒక పేషెంట్ కి క్యూర్ చేసి వాళ్ళ ఆనందం చూస్తే ఇవన్ని మర్చిపోతాం”అంటూ దోశ తింటూ మాట్లాడుతూనే ఉంది సమీరా.

సమయం 12.00.........

సడెన్ గా 4 బైక్లు వచ్చి ఆగాయి.నలుగురు కుర్రాళ్ళు నలుగురు అమ్మాయిలు దిగారు “హ్యాపీ బర్త్ డే ఆంటి.......”అని గట్టిగా అరుస్తూ....సమీరా కూడా వాళ్లతో గొంతు కలిపింది...అక్కడున్న స్టూల్ పై కేకు పెట్టి 50 అని ఉన్న కాండిల్ వెలిగించారు.హ్యాపీ బర్త్ డే రమా ఆంటీ.......పుట్టిన రోజూ జేజేలు చిట్టి పాపాయి..... ..అంటూ పాట అందుకున్నాడు ఒకడు .....కేరింతలు..నవ్వులూ ...పాటలు......అంత ఉత్సాహం మధ్య ఎపుడూ పుట్టిన రోజు జరుపుకోలేదు ఆమె. పిల్లలలో చిన్న పిల్ల ఐపోయింది.ఆనందంలో మురిసింది.తన బాధ ,దిగులు అన్నీ మరచిపోయింది. అర్ధరాత్రి 12 దాటింది ,అదికూడా నడిరోడ్డులో వారి కేరింతలు ఆమెకి తప్పు గా అనిపించలేదు ఈసారి.

కేకు కట్ చేసి సమీరాకి పెట్టబోయింది ..”నో నో ఫస్ట్ పీస్ ..ఈరోజు హీరో ..డాక్టర్ జితేంద్ర ..మై స్వీట్ అన్నయ్య ..మై ఇన్స్పిరేషన్ జిత్తుకే పెట్టాలి ....అని జిత్తుకి అందించింది సమీరా.

సమీర ని గట్టిగా హత్తుకొని "అసలు నా పుట్టిన రోజు నీకెలా తెలుసమ్మా"అంది రమ.

“మీ అమ్మాయి చెప్పింది ఆంటి ..మీ 50 వ పుట్టిన రోజు ని గ్రాండ్ గా చేద్దాం అనుకుంది.సర్ప్రైజ్ చేద్దాం అనుకుంది మీకు చెప్పకుండా. పక్కింటి ఆనంద్ ని హెల్ప్ అడిగింది. ఆ పనులలోనే బయటకి వెళ్ళినపుడు ఇలా జరిగింది. హాస్పిటల్ కి తెచ్చినప్పుడు స్పృహలోనే ఉంది.నాతో మాట్లాడింది. ఎందుకో తన కోరిక తీర్చాలి అనిపించింది.అందుకే ఇలా” అని రమ ని హత్తుకుంది సమీరా..

“50 ఏళ్ళు ...... ఏం లాభం....ఒక చక్కటి అమ్మాయిని చెడుగా అనుకున్నా,ఒక గొప్ప డాక్టర్ని అందులోకి ఆ అమ్మాయి అన్నయ్యని తప్పుగా అర్ధం చేస్కున్నా, ఆఖరికి చిన్నప్పటి నుండి అక్క,తమ్ముడిలా పెరిగిన ఆనంద్,కావ్య గురించి కూడా అనుమానించా...నేనే ఇలా ఉంటె ఇక జనం అనే మాటలు పెద్ద ఎక్కువేం కాదులే..అంటే అన్నయ్య, తమ్ముడు అని ఏదో ఒక వరస ఉంటే తప్ప సరిగా ఆలోచించలేమా ఇద్దరు వ్యక్తుల గురించి. కిటికీ సందుల నుంచి పక్క వాళ్ళ జీవితాల్లో చూసి అంచనా వేసే వారి ఆలోచనలు ఇంత కంటే గొప్పగా ఉండవేమో .....ప్రాణాలు కాపాడే పనిలో వాళ్లు ఉంటే మురికి ఆలోచనల్లో నేనున్నా..మనసు తలుపులు తెరిచి చూద్దాం అంతా మంచే కనిపిస్తుంది” అని పశ్చాత్తాపం తో సమీరా,జిత్తు చేతులు పట్టుకుని కళ్ళతోనే క్షమాపణ చెప్పి మనసు తలుపులు తెరిచింది, సరికొత్త వ్యక్తిగా కదిలింది.


****


“ఏమండీ చూసారా మీరు లేకపోయినా నా కూతురిని కాపాడుకున్నా....నాకు ఇంత మంది పిల్లల బలం ఉంది ఇక్కడ తెలుసా ...ఉదయం మీరు ట్రైన్ దిగేసరికి కావ్య లేచి కూర్చుంటుంది చూడండి ... ఇక కావ్య పెళ్లి. అంటారా ??వాళ్ళకి జరిగింది చెప్పి చూస్తా ...నమ్మకంతో అర్ధం చేసుకుంటే మంచిది .లేకపోతె మరీ మంచిది”..

***మన హృదయపు ఇరుకు సందుల నుండి చూస్తూ మనుషులపై ఒక ముద్ర వేసి ప్రచారం చేసే దురలవాటుని మాని,మనసు తలుపులు తెరిచి చూద్దాం అంతా మంచే కనిపిస్తుంది.***
Rate this content
Log in

Similar telugu story from Drama