Sudheer Kaspa

Drama

4.5  

Sudheer Kaspa

Drama

నిజమైన గురువు

నిజమైన గురువు

7 mins
348


కూతురి చేతిలో పదునైన ఆ కత్తి .......

కన్ను మూసి తెరిచేలోగా చేతి మణికట్టుని చీల్చేసింది......

తెగిన రక్త నాళాలనుండి జివ్వు జివ్వున ఎగసి పడుతున్న రక్తం ........

కళ్ళ ముందే కూతురు నేలకొరిగిపోతుంది...........

తన చేతి లోంచి జారి చీకటి అగాధం లోకి పడిపోతోంది.......పడిపోతోంది............ .


టంగ్.... టంగ్..... టంగ్...... గోడ గడియారం 3 సార్లు కొట్టింది......

హా...ఉలిక్కి పడి లేచింది లత....కూతురు పక్కనే ఉందా లేదా అని తడిమి చూసింది .....

ప్రశాంతంగా నిదురిస్తున్న కూతురి మొఖాన్ని ప్రేమగా నిమిరింది...రాత్రి కూతురు చేసిన పనికి చాలా సేపు నిద్ర పట్టలేదు లతకి ..ఇప్పుడేమో ఈ భయంకరమైన కల......అదాటున లేచింది.... వంట గదిలోకి వెళ్లి చాకులు,కత్తిపీట అన్నీ ఒక అట్టడబ్బాలో వేసి అటక పైకి లోపలగా దాచిపెట్టేసింది...ఫోర్క్లు,ఆయన గారి షేవింగ్ బ్లేడ్లు తో సహా పదునైన వస్తువేదీ లేకుండా దాచేసింది.చీరలు, చున్నీలు,తాడ్లు అన్నీ పెట్టెలో పెట్టి తాళం వేసింది....ఇంకేం ఉన్నాయ్ ..ఇంకేం ఉన్నాయ్ ..పిచ్చి దానిలా వెతుకుతూ ఉంది ....

రాత్రి 3గంటలకి వంటగదిలో జరుగుతున్న హడావిడికి, హాల్లో సోఫా పై పడుకున్న సత్యం లేచాడు.....భార్య పడుతున్న వేదన,ఆత్రం అతడిని కలిచివేసింది....ఆ తర్వాత ఇద్దరికీ నిద్ర పట్టలేదు....ఉదయం 6 గంటలకే సత్యం తన ఫ్రెండు, సైకియాట్రిస్ట్ ఐన డాక్టర్.ప్రవీణ్ కి ఫోన్ చేసాడు...

”ఆడపిల్ల కదా ... నీ క్లినిక్ కి తీసుకొస్తే నలుగురూ నాలుగు విధాలుగా అనుకుంటారు ..కాబట్టి .....వీలు చూస్కొని ఓ సారి మా ఇంటికి రా ప్లేజ్...”

చిన్న నాటి ఫ్రెండు కావటం వలన సత్యం మాట కాదనలేక ఒక్క అరగంట లోనే వాళ్ళ ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు డాక్టర్. ప్రవీణ్..


“మా అమ్మాయి కృతి .....చిన్నప్పటి నుండి అన్నిటిలోనూ ఫస్టే...రెండవ ర్యాంక్ అనే ప్రశ్నే లేదు...అది పుట్టిన తర్వాతే ఆయనకి వ్యాపారం లో కలిసి వచ్చింది..నాకు ఉద్యోగం వచ్చింది ...మా పాప మా వరాలమూట మా అదృష్టదేవత ...ఏనాడు ఏదీ కాదు,వద్దు అనకుండా పెంచాం..ఇంటర్ వరకు అంతా బాగానే ఉంది. ఏమైందో తెలీదు.. IIT ఎంట్రన్స్ పోయింది...అప్పటి నుంచి ఇలా..సరిగా తినదు...మాట్లాడదు...లక్ష ఇంజనీరీంగ్ కాలేజిలు ఉన్నాయి..ఏదో మంచి దాంట్లోనే చేర్పిస్తాం అంటే ..”నో!”....సరే లాంగ్ టర్మ్ కోచింగ్ తీస్కో ఐ.ఐ.టి కోసం అంటే .”.నో!..”.ఇంట్లోనే చదువుకో పోనీ .....”నో!“ నో....నో......నో ఇది తప్ప వేరే ఏం మాట్లాడదు. ఇంకా గట్ట్టిగా అడిగితె “లీవ్ మీ అలోన్” అంటాది.............పుస్తకాలు చూస్తే ఏదో భయం...... కారణం లేకుండా ఏడుస్తుంది...నేనెందుకూ పనికిరాని దానిని అంటుంది ....ఏ పని చెయ్యదు ..ఒక మూల కూర్చుంటుంది....... అందరికి మంచి బట్టలున్నాయి నాకే లేవు అని ఏడుపు...అప్పటికి నెలకో కొత్త డ్రెస్ కొంటున్నా..బైటకి రాదు..ఏదో కోల్పోయినట్లు ఉంటుంది ..గట్టిగా మందలిస్తే నిన్న సాయంత్రం చాకు పట్టుకొని చచ్చిపోతా అని గట్టి గట్టిగా అరుపులు కేకలు ..కోసుకున్నంత పని చేసింది. నాకైతే ఆ వణుకు ఇంకా తగ్గలేదు..ఆ షాక్ నుంచి మేం ఇంకా తేరుకోలేదు.” మొత్తం ప్రవీణ్ కి వివరించింది లత,నిద్రపోతున్న కూతురికి వినిపించనంత చిన్న స్వరంతో.

నిద్ర లేచిన కృతితో తను ఒక డాక్టర్ అని చెప్పకుండా,ఇంటికి వచ్చిన అతిథిలా మాట్లాడుతూ,మాట్లాడిస్తూ మెల్లగా వివరం కనుక్కునే ప్రయత్నం చేసాడు ప్రవీణ్. రెండు గంటలు వారి ఇంట్లో ఉన్నాక,సత్యం ను పక్కకు పిలిచి..

“ఈ రోజుల్లో చాలా మంది పిల్లలను వేధిస్తున్న జబ్బే ఇది....ముదిరితే ఆత్మహత్యల వరకూ దారి తీస్తుంది. ఈ జబ్బు పేరే “అతి గారాబం”.మీరు మా హాస్పిటల్ కి పేషెంట్ గా వస్తే దీనికి నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మరియు డిప్రెషన్ అని ఏవేవో పేర్లు పెడతాను అనుకో!, అది వేరే విషయం. జీవితంలో దారుణమైన వైఫల్యాలు చూసిన వారిలో కనిపించేది ఈ డిప్రెషన్. ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయానికి యువత దీని బారిన పడుతున్నారు.దీనికి కారణం, వారికీ ఓటమి,వ్యతిరేకత అనే విషయాలు తెలియకపోవడం, అడిగిందే తడవుగా అడుగులకు మడుగులోత్తే పేరెంట్స్.......రేసులో పిల్లలు పరిగెడితే మురిసిపోతాం,కేవలం మొదటి స్థానమే రావాలని కోరుకుంటాం కానీ ఒక్కసారి ఓటమి ఎదురై కింద పడితే మళ్ళి లేచి పరుగెత్తే శక్తి వారికి మనం ఇవ్వము...మీ అమ్మాయి విషయంలో అదే జరిగింది.గాబరా పడాల్సినది ఏం లేదు, ఆందోళన తగ్గటానికి మందులు ఇస్తాను ..ఈ ట్రీట్మెంట్ మాత్రం కేవలం మీ చేతుల్లోనే ఉంది.ఆలోచించండి ఆమెతో ఎక్కువ మాట్లాడండి,ఎక్కువ సమయం గడపండి త్వరలోనే సర్దుకుంటుంది” అని చెప్పి సెలవు తీస్కున్నాడు ప్రవీణ్.

ప్రవీణ్ మాటలకు సత్యం సంతృప్తి చెందలేదు.”పిల్లను ముద్దుగా పెంచుకోమా??ఏం పక్కింటి పిల్లలు అందరూ ఇలానే ఉన్నారా?? వారి పేరెంట్స్ ముద్దుగా చూడలేదా??ఇది కచ్చితంగా ఏదో దిష్టి ఫలితమే..ఇంటి వాస్తు కూడా ఓ సారి చూపించాలి.అసలు గృహప్రవేశం చేసిన ముహూర్తం వల్లే ఇదంతా జరిగింది.పక్క ఊరిలో ఒక గురువు గారు ఉన్నారట, గొప్ప మహత్యం కలవారని విన్నాను. ఒక సారి ఆయనని సలహా అడగటం మంచిది అనిపిస్తుంది.రేపు సాయంత్రం వెళదాం ఇది డాక్టర్లుతో తేలే వ్యవహారం కాదు”అన్న సత్యం మాటలకి ఊ కొట్టడం తప్ప ఇంకేం చేయలేకపోయింది లత.

ఆయన గారి ఆలోచన సైన్సు టీచర్ ఐన లతకు పెద్దగా రుచించలేదు.అయినా కూడా పిల్లల విషయంలో రిస్క్ తీస్కోలేముగా ఏదో ఒకటి చెయ్యాలి అని తీవ్ర ఆలోచనలో పడింది.రేపటి నుండి మళ్ళీ స్కూల్ తెరిచేస్తారు.దసరా సెలవులు ఐపోయాయి.కృతిని ఒక్కదానినే ఇంట్లో వదిలి స్కూలుకి వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడు.మెల్లగా ఎలాగోలా ఒప్పించగలిగింది తనతో పాటు స్కూల్ కి రావటానికి.


****


యధాప్రకారం ఉదయమే 5 గంటలకి లేచి ఉరుకులు,పరుగులు మీద వంట చేసి క్యారేజి డబ్బా సర్దుకొని,పూజ పునస్కారం అవీ చేస్కొని,అందరికి టిఫిన్లు చేసి పెట్టి,గబగబా రెండు ఇడ్లి ముక్కలు నోట్లో వేస్కొని, రెడీ అయ్యి, బయల్దేరే సరికి 8 అయ్యింది.సాధారణంగా ఐతే ఈ పరుగు మొత్తంలో కూతురు కనీసం సాయం చెయ్యదు అనే చిన్న విసుగు కనిపించేది ఆమెలో.ఈరోజు ఏదో ఒకటి,అది బ్రతికుంటే చాలు అనుకుంటూ పరుగెడుతుంది. కృతిని తీస్కోని,ఇద్దరికీ లంచ్ డబ్బాలు,ఒక వాటర్ బాటిల్, పేద్ద గోతం లాంటి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని బయల్దేరింది. అక్కడ నుండి 40 నిమిషాల ప్రయాణం ఆమె పని చేసే సర్కారు వారి బడికి.కిక్కిరిసిన ఆ బస్సులో సీటు కూడా దొరకలేదు.కృతికి ఒళ్ళు మండిపోతుంది.ఏంటిది గలీజ్ గా....ఒక కార్ అయినా కొనొచ్చుగా అంత లేని వాళ్లమేం కాదుగా....అని మనసులోనే తిట్టుకుంటుంది.ప్రయాణం సమయం మొత్తం రుసరుస లాడుతూనే ఉంది కృతి.మొత్తానికి హమ్మయ్య వచ్చేసాం అనుకుంటే...... ఇంకో 2 కిలోమీటర్లు నడకా!!?? ...ఆ స్కూల్ వైపు ఆటోలు కూడా ఉండవట.....రుసరుసలు,భగభగలుగా మారాయి.ఇద్దరూ కలిసి నడుస్తున్నారు అన్న మాటే గానీ మాటలు లేవు. 40 ఏళ్ళు పైబడిన లత,పేద్ద హ్యాండ్ బ్యాగ్ తో చకచకా నడిచి పోతుంటే 17 కూడా నిండని కృతి ఆమెతో సమానంగా నడవలేక తూలిపోతుంది..ముక్కుతూ మూల్గుతూ మొత్తానికి స్కూలు చేరేసరికి హమ్మయ్య అనుకుంది.

“మేడం గారూ మీ అమ్మాయా అండి??” అంటూ ఓ 10 మంది అమ్మాయిలు చుట్టూ చేరారు..అబ్బ ఎంత అందంగా ఉందో అని ఒకామె అంటే, హీరోయిన్ లా ఉంది అని ఒకామె......సమంతా.... అని వెనుక నుండి మరో పిల్ల .....కృతి చుట్టూ చేరి హడావిడి చేసారు. ఎందుకో కృతికి అది బాగా నచ్చింది.ఒక ప్రత్యేక గుర్తింపు....బైటకి తెలియనివ్వకుండా లోలోపలే మురిసిపోయింది.


****


సెలవుల తర్వాతి రోజు అంటే సాధారణంగా పిల్లలు ఎవరూ రారు పెద్దగా....30 మంది ఉన్న క్లాసు లో 12 మందే వచ్చారు ఆ రోజు.సరాసరి పాఠంలోకి వెళ్తే సెలవుల మూడ్లో నుంచి ఇంకా బయటకు రాని పిల్లవెధవలు ఎక్కడ వింటారు??దారిలో పడే వరకు కాస్త మాట్లాడితే బెటర్.సాధారణంగా ఆమెకు పిల్లల బాగోగుల వివరాలు కూడా అడిగి తెలుసుకుంటూ ఉండటం అలవాటు.అదే విధంగా ఆ రొజూ అడగటం ప్రారంభించింది..

“ఎలా అయ్యిందర్రా పండగ?ఏమేం చేసారు?? ఏమేం తిన్నారు???ఒకొక్కరూ చెప్పండీ.....”

“మా అమమ్మ పూరీ చేసింది మేడం...అమ్మ నాన్న అందరూ కలిసి గుడికి వెళ్ళాం”అంది ఒక అమ్మాయి.

క్లాసులో ఒక మూల కూర్చొని వీళ్ళ సంభాషణ వింటూ కూర్చుంది కృతి ..

“పూరీ కూడా ఒక పండగ స్పెషలేనా” నవ్వుకుంది మనసులో......

“మా అమమ్మ ఇంటికి వెళ్ళామండి........గారెలు,బూరెలు,పరమాన్నం,పులిహోర,కోడి ఇగురు,బిరియాని,సేమ్యా.............”చెప్తూనే ఉన్నాడు ఓ బుడతడు ....

“ఏంటి ఈ పొట్టోడు గొప్పలు చెప్పేసుకున్తున్నాడు” అని కనుబొమ్మలు పైకి లేపి చూస్తుంది కృతి.

“ఇన్ని వంటలు ఎలా చేసిందిరా మీ అమమ్మ??”ఆశ్చర్యం మరియు అనుమానంతో అడిగింది లత.

ఆ బుడతడు.. ..”వండలేదండి....దండుకొని తెచ్చింది” అని మెలికలు తిరుగుతూ చెప్పాడు.క్లాసు మొత్తం గొల్లుమని నవ్వింది.

కృతి గతుక్కుమంది ...”అమమ్మ ఒక బిచ్చగత్తె...క్లాసులో ఇంత మంది వాడికేసి నవ్వుతూ ఉన్నా, వాడు చిరు నవ్వులు చిందిస్తున్నాడే!!!”కాస్త ఆశ్చర్యంగానే ఉంది తనకి.

“నేనెక్కడికీ వెళ్ళలేదండి.....నాకు పండగే లేదు.. రోజు లాగే చేపల కూర తిన్నాను” అన్నాడు మరో కుర్రాడు....

“అర్జునుడు చేతిలో బాణం వీడి చేతిలో గేలం” అని అరిచాడు వెనుక నుంచి ఒకడు..మళ్ళీ క్లాసు మొత్తం నవ్వులు..

“గేలం ఏంట్రా..చదువుకోకుండా చేపలు పడుతున్నావా?”గద్దిస్తున్నట్టు అడిగింది లత..

“మరేటి సేత్తామండి?? పొలం గట్లు దగ్గర తగవులో, కొట్లాట జరిగి చిన్నాన్నే మా అమ్మ,అయ్యని కొడవలితో నరికీసేడు...పోలీసు కేసులకి భయపడి మిగతా చుట్టాలు కూడా నన్ను దగ్గరికి సేరనివ్వలేదు. అప్పటి నుండి తాత దగ్గిరే.ఆయనే రిక్షా లాగి తిండి పెట్టేవాడు.ఇపుడు అతడు కూడా ముసలైపేడు కదా మంచం పట్టిసేడు.అన్నంకి రేషను బియ్యం ఉంది, కూర కావాలి కదండీ అందుకే అలా ఏరు పక్కన గేలం వేస్తె చిన్న చితక చేపలు పడతాయి. పెనం మీద వేపేసి,ఉప్పు కారం ఏసీ, తాత నేను కలిపి తినేత్తాం..తాత మందులకి డబ్బు లేదండి...నూడుల్స్ బండి నడిపే అన్న, సాయంకాలం ప్లేట్లు కడిగితే రోజుకి 30 రూపాయలు ఇత్తానన్నాడు నెలకి తొమ్మిది వందలు.....సరిపోతయిలెండి..పండగలు చేస్కొడానికి మాత్రం సాలవండి..”అని చెప్పి కూర్చున్నాడు.

నిండా పన్నెండు ఏళ్ళు లేని పిల్లోడు తిండి కోసం, తాత కోసం పడుతున్న పాట్లు చూసి కృతి తో పాటు లతకి కూడా ఆశ్చర్యం వేసింది.

ఇప్పటి వరకు వెటకారంగా వారి మాటలు వింటున్న కృతి మొఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది...

తరువాత పిల్లలు ఏం చెప్తారో అని ఆసక్తిగా చూస్తుంది.

ఇంకొక అమ్మాయి లేచింది ...”నా పండగ వచ్చే సంవత్సరమే..మేడం గారూ...”

“ఏమ్మా ఈ సంవత్సరం చేస్కోలేదా....??”

“లేదండి... అమ్మ లేదు కదండీ .....(కొన్ని సెకెన్ల నిశ్శబ్దం.............)

.

.

.

నాన్న మందు తాగి,తాగి సచ్చిపోయాక ..పక్క ఊరి ప్రెసిడెంటు గారు “పిల్లల్ని ఎక్కడో వదిలేసి వచ్చేయ్యవే నేను చూస్కుంటాను అన్నీ...” అన్నాడండి అమ్మతో .....తమ్ముడు బాగుంటాడు కదండీ తొందరగా చెల్లిపోయాడు.పిల్లలు లేని వాళ్ళు ఎవరో పట్నం వాళ్ళు తీస్కున్నారండి...నాకు బుర్ర జబ్బు(మూర్చ రోగం) అని ఊరంతా తెలుసు కదండీ...నన్ను ఎవరూ తీస్కోవట్లేదండి....మా అమ్మ చూసిచూసి మా అమమ్మ దగ్గర నన్ను వదిలేసి వెళిపోయింది. నాలుగు రోజుల్లో వచ్చేస్తానంది 6 నెలలు ఐంది రాలేదండి .....వచ్చే సంవత్సరం అయినా మంచి అమ్మ నాన్న దొరుకుతారేమో....అని చూస్తున్నా”.

ఆ చిన్నారి కళ్ళలో కన్నీటి తెరలు లేవు....కానీ బిగపట్టిన పెదవుల వెనుక పొంగుకొస్తున్న దుఖం మాత్రం కనిపిస్తుంది.

ఒక్కసారిగా ఆ పాపను హత్తుకుంది లత...

“నేను ఏడవట్లేదండి.....ఒట్టు మేడం గారూ ....” అంటూనే గుక్క పట్టి ఏడ్చేసింది..

బిక్క మొహాలు వేసుకుంటూ పిల్లలందరూ ఆ చిన్నారిని ఓదారుస్తున్నారు....ఒక మూలగా కూర్చున్న కృతి ఇలాంటి అమ్మలు కూడా ఉంటారా అని మౌనంగా రోదించింది.

ఆ రోజంతా కృతి ఎవరితోనూ మాట్లాడలేదు.ప్రతి ఒక్కరిని చూస్తూ కూర్చుంది. అన్నీ నవ్వు మొఖాలు....అమాయకపు పసి మొగ్గలు..చిలిపి చేష్టలు....... ఈ చిన్ని తరగతి గదిలో ఇంత ఉత్సాహం,ఇన్ని కేరింతల వెనుక ఇన్ని కన్నీళ్లు,కష్టాలు ఉన్నాయా.....!!!!ఈ పసి హృదయాలకు ఇన్ని గాయాలా!! ఎన్నో ఆలోచనలలో రోజంతా గడిపేసింది.

టింగ్ టింగ్ టింగ్ టింగ్ టింగ్ టింగ్ ..........లాంగ్ బెల్ మోగేసింది....

మళ్ళీ 2 కిలోమీటర్లు నడక....

రోజు ఉదయాన్నే లేచి,ఇన్ని పనులు చేసి,ఇంత దూరం నడిచి తన కోసం ఇంత కష్టపడుతున్న అమ్మ తొలిసారిగా ఆమె కళ్ళకి కనిపించింది.తాను సరైన బట్టలు వేస్కున్నా లేకపోయినా రోజంతా షాప్ లో కష్టపడి, అడిగింది కొనిచ్చే నాన్న కనిపించాడు తొలిసారిగా.

”అమ్మా...ఆ బ్యాగ్ ఇవ్వు నేను పట్టుకుంటా”

కాస్త ఆశ్చర్యంగా ఏమైంది ఈ పిల్లకి అనుకుంటూనే కూతురికి బ్యాగ్ అందించింది లత.

ఈ సారి కృతి అడుగులు లతతో సమాన వేగంతోనే పడుతున్నాయి....

“అమ్మా.... పూరీ ఏమైనా పండగ స్పెషల్ వంటకమా?”అడిగింది కృతి, మదిలో మెదులుతున్న సవాలక్ష ప్రశ్నలను ఎలా అడగాలో తెలీక.

“వారానికి 10 రకాల టిఫిన్లు చేస్కునే మనకి పూరీ మాములే కావొచ్చు...చద్దన్నం తప్ప వేరేవి తినలేని,కొనలేని వారు కూడా ఉంటారమ్మా.....మనం ఈరోజు అతి సాధారణంగా వాడే వస్తువులు,అనుభవించే సదుపాయాలు, చాలా మందికి అవి జీవిత ఆశయాలు కొంత మందికి తీరని కోరికలు కూడానూ...మనం ఒక రోజు సినిమాకు పెట్టే ఖర్చు ఒక పిల్లాడి నెల జీతం..ఒక తాత జీవితం..చూసావుగా ”

“అమ్మా...వీళ్ళకి.... అందరూ నవ్వుతారనే ఫీలింగ్ లేదేంటి?”

“కడుపు నిండిన వాడికే రకరకాలైన ఫీలింగ్స్ ఉంటాయమ్మా....కడుపు కాలే వాడికి ఒకటే ఫీలింగ్......... ఆకలి”

“అమ్మా..ఇన్ని కష్టాలలో వీళ్ళేం చదువుతారమ్మా?”

“ఔనమ్మా..మా బడిలో పదో తరగతితో చదువు ఆపేసే పిల్లలే ఎక్కువ..ఆ విషయం వాళ్లకి కూడా తెలుసు ఐనా ప్రాణం పెట్టి చదివే వాళ్ళు ఉంటారు. పరిస్థితుల వల్ల చదువు ఆగిపోయినా, వారి పోరాటం మాత్రం ఆగదు.చిన్న చిన్న వ్యాపారాలు,కరెంటు పనులు,కుల వృత్తులు దేనిలోనో ఒక దానిలో దూరి బతుకు పోరాటం సాగిస్తూనే ఉంటారు.చిన్న పనులు చేస్తూ కూడా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళున్నారు. IAS, IPS, డాక్టర్స్ అయ్యే మాణిక్యాలు కూడా దొరుకుతాయి ఈ మట్టిలోనే...”

ఇంకేం మాట్లాడలేదు కృతి....బస్సు లో సీటు దొరికింది ఈసారి .ఉదయం గలీజ్ ఫెలోస్ లా కనిపించిన జనమే.... బతుకు పోరాటం లో ఒక విజయవంతమైన రోజుని పూర్తి చేస్కొని ఇంటికి వెళ్తున్న సైనికుల్లా కనిపించారు.


****


సాయంత్రం ఇంటికి వస్తూనే సత్యం ”లతా ...రెడీ అవ్వండి గురువు గారి ప్రత్యేక దర్శనంకి అపాయింట్మెంట్ దొరికింది....”అన్నాడు హడావిడిగా

“అక్కర్లేదు....నిజమైన గురువు గారి ఉపదేశం లభించింది అలా చూడండి” అని గది లో ఉన్న కూతురిని చూపించింది.

చాలా కాలం తర్వాత పుస్తకాలు ముందేసుకొని కూర్చుంది కృతి... ఆమె మొఖంలో ఒక కొత్త మెరుపు కనిపిస్తుంది.తండ్రిని చూడగానే...”నాన్నా! వచ్చేసారా?? మంచి నీళ్ళు తాగుతారా?” అని ఫ్రిజ్ లోంచి బాటిల్ తీసి ఇచ్చిన కూతురిని చూసి,” ఏంటి ఇంత మార్పు ఒక్కరోజులో??” అని అవాక్కయ్యాడు. ఏరోజూ ఆమె ఇలా లేదు.

లతను పక్కకి తీస్కెళ్ళి గుసగుస గా “ఎవరే ఆ గురువు గారు????”అన్నాడు.

ఇంకెవరు నిజమైన గురువు గారు ....ఆయన పేరే “జీవితం”


Rate this content
Log in

Similar telugu story from Drama