SATYA PAVAN GANDHAM

Abstract Classics Thriller

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Thriller

"ప్రేమ లేఖ - 7"

"ప్రేమ లేఖ - 7"

6 mins
465


"ప్రేమ లేఖ - 6" కి

కొనసాగింపు...

"ప్రేమ లేఖ - 7"

అలా కావ్య, కీర్తన ...

ప్రేమ్ కి మరొక లెటర్ రాయడం ప్రారంభించారు, అతన్ని కలసి అసలు నిజం చెప్పాలనే ఉద్దేశ్యంతో...

ఆ లేఖ సారాంశం...

     

                            ❤️@@@@@❤️

ప్రియమైన ప్రేమ్ గారికి...

మీరచట కుశలమని నా భావన. నాదొక చిన్న విన్నపం. అది మీకు తెలియపరచాలని కొన్నాళ్లుగా నా మనసు తహతహలాడుతుంది. భయం వల్లనో... లేక, సిగ్గు వల్లనో మరి ఎందుకో అది మీకు తెలపలేకున్నా...

కానీ, ఇప్పటికీ దాన్ని దాచుకుంటూ పైకి మీకు చెప్పకుండా ఇలా కాలం వెళ్ళదీయడం కూడా నా మనసు అంగీకరించడం లేదు. అందుకే ఈ క్షణం దాన్ని బయట పెట్టాలని నా భావన. మీరు తప్పుగా భావించకుండా తప్పక దాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.

నిజానికి ఈ విషయాలలో అబ్బాయిలే బయట పడతారని అనుకున్నా...

కానీ, మీ నుండి అది నేను ఆశించలేకపోతున్నాను. అందుకే నా మనసు విప్పి మీ ముందు పెడుతున్నాను..

ప్రతిరోజూ

నన్ను మేల్కొల్పుతున్న ఆ వేకువ కిరణాలు....

నన్ను పలకరించే మా ఇంటి పెరట్లో వాలే పక్షులు...

చల్లగా తాకే సాయంత్రపు సంధ్యా పవనాలు...

నిశీధిలో చక్కగా నిద్రపుచ్చే ఆ వెన్నెల వెలుగులు...

వాటితో పాటు

మీకందిస్తున్న నా ప్రతి లేఖలోని అక్షరాలు, పదాలు, వాక్యాలు ఇలా ప్రతీది నన్ను అడుగుతున్నాయి...

ఈ చిన దాని మనసు దోచిన ఆ చిన్నవాడు, అదే నీ చెలికాడి రూపాన్ని ఒకసారి దర్శించాలని.

వాటి కోరికకు సిగ్గుతో మొహం చాటేస్తూ...

వాటిని దాటుకుంటూ ఇప్పటివరకూ నెట్టుకురాగలగిగాను కానీ, ఇక ఇప్పుడు వాటికి సమాధానం చెప్పాలనుంది.

కారణం అదొక్కటే కాదు...,

పెళ్లీడు వచ్చిన నా లాంటి ఆడపిల్లను ఒక ఇంటి దాన్ని పంపించాలని బాధ్యత ప్రతి ఇంట్లో ఉండే తంతే. దానికి మా ఇల్లు ఏం ప్రత్యేకం కాదు. మీ గురించి ఇంట్లో చెప్పాలని ఉన్నా... ఇన్నాళ్లు లేఖలతో మాత్రమే మన ప్రేమ ప్రయాణం సాగింది అంటే, అర్థం చేసుకునేంత ఒదార్యం వీళ్ళకి లేకపోవచ్చు.

అందుకే, ఒక్కసారి మిమ్మల్ని కలవాలని, నా మనసులో ఇన్నాళ్ళుగా మోస్తున్న నా ఈ ప్రేమ భావాన్ని ... నేను అంతగా ప్రేమించిన ప్రేమ్ తో నేరుగా పంచుకోవాలని ఉంది. తద్వారా మీ అభిప్రాయాలని, అభిరుచులను ఒకరికొకరు తెలుసుకోవడం మంచిదనిపిస్తుంది.

నా ఈ రాతలో ప్రతి వాక్యం, పదం, అక్షరాలలో ఇమిడి ఉన్న నా అంతరంగంలోని భావన మీకు అర్ధమయ్యి ఉంటుందని ఆశిస్తున్నాను. మీకిది ఇష్టం అయితే ముందుకు వెళ్లగలము.

మా వూరి పక్కనే ఉన్న చిన్న టౌన్ (రాజమండ్రి) రైల్వే స్టేషన్ లో గల ఫ్లాట్ ఫామ్ నంబర్ 3 చివర్లో... ఈ నెల 10 వ తారీకున అనగా మళ్ళీ ఆదివారం, అంటే సరిగ్గా ఈ రోజు నుండి వారం అన్న మాట!

ఆకుపచ్చని లంగా వోణితో చేతిలో ఒక బోకే పట్టుకుని మీకోసం వేచి ఉంటాను. అలాగే మిమ్మల్ని గుర్తుపట్టడానికి కూడా ఏవైనా గుర్తులు చెప్పగలరు.

మీ తదుపరి సమాధానంతో కూడిన ఆ లేఖ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. దానితో పాటు ఇన్నాళ్ళుగా ఒకరికొకరం ఎదురుపడకుండా పొందుతున్న ఈ ప్రేమనే అనుభూతిని ఈ సారి నేరుగా పంచుకునే క్షణం కోసం ఎదురుచూస్తున్నాను.

ఇట్లు...

ప్రేమ్ కి ప్రేమతో...

మీ లేఖ

                             ❤️@@@@@❤️

అంటూ రాశారు ఒక లేఖను వాళ్లు ( కీర్తన, కావ్య) లేఖ రాసినట్టుగా...

ఎప్పుడెప్పుడు తన నుండి రిప్లై వస్తుందా అని కావ్య.. కీర్తన తో పాటు.. కావ్య వాళ్ళమ్మ గారు కూడా ఎదురుచూస్తున్నారు. అసలు కావ్య అంతకుముందు పంపిన లేఖకే ఇంకా రిప్లై రాలేదు. మళ్ళీ ఇంకో లేఖ పంపించారు తనని కలవాలంటూ...

అసలు ఒక అమ్మాయి ఇలా బయటపడితే అసలే సున్నిత మనస్తత్వం కల ప్రేమ్ ఏమైనా అనుకున్నాడా ?

అందుకే తన ప్రతిస్పందనలో ఇంత ఆలస్యం అవుతుందా? అన్న సందేహాలు లేకపోలేదు వాళ్ళకి.

కానీ, సరిగ్గా వాళ్ళు ఆ లెటర్ పంపిన రెండు రోజులు తర్వాత, వాళ్ల సందేహాలు అన్ని పటాపంచలు చేస్తూ ప్రేమ్ దగ్గర నుండి ప్రతి స్పందన రానే వచ్చింది వాళ్ళకి.

ఆ లేఖను ఆశగా ఆతృతగా తెరిచి చూసిన వాళ్ళకి(కీర్తన, కావ్య, మరియు వాళ్ళమ్మ గారికి)

దాని సారాంశం ఇలా ఉంది.

                              ❤️@@@@@❤️

"ప్రియమైన లేఖ గారికి...

ఇక్కడ నేను కుశలమే...

ఇప్పటివరకూ నీ రూపాన్ని ఎరుగని నేను

ఆ చందమామలో అది గుర్తించాను...!

ఇప్పటివరకు నీ నవ్వులను చూడని నేను

పూసే పువ్వుల్లో అది చూసాను...!

ఇప్పటివరకూ నీ పలుకులను వినని నేను

నక్షత్రాల శబ్దాలలో అది విన్నాను...!

మొత్తంగా నీ ప్రేమనుభూతికి నోచుకోని నేను

కనిపించే నా కలలో అది పొందాను...!

తెరిచిన నా యద తలుపులు

నీరాకకై ఎదురు చూస్తున్నాయి.

కదిలిన నా మది అలలు

నీ పాదపు తాకిడికై ప్రయత్నిస్తున్నాయి.

విరిసిన నా కలల కాంతులు

నువ్వొచ్చే దారికై వెలుగులు నింపుతున్నాయి.

కరములు చాచిన ఈ హృదయపు

లోగిలిలో నువు వాలేదెన్నడు..

జోలలు పాడే నీ ఒడి పాన్పులో...

ఆశగా నే నిదురించేదెన్నడు..."

అంటూ నా ఆలోచనలు చుట్టూ ముట్టి ఇన్నాళ్లు నన్నొక్కటే ఇబ్బంది పెడుతున్నాయి.

ఒక అబ్బాయిగా ఈ ప్రేమను బయటపడనివ్వకుండా అనుభవించడం నాకు కొంచెం కస్టమ్ గానే ఉంది. అలాంటిది ఒక అమ్మాయిగా మీరు ఇంకెంత ఇబ్బంది కి గురి అవుతున్నారో నేను ఊహించగలను. 

కానీ, బయట పడితే మీరేం అనుకుంటారోనని ఒక చిన్న భయం! వీటిని ఇప్పటివరకూ నాలోనే దాచుంచింది. కానీ, ఒక అమ్మాయిగా మీరే ఈ రోజు బయట పడిన వేళ, నా మనసు కూడా ఇక ఆగలేక మిమ్మల్ని కలిసే ఆ క్షణం కోసం ఉవ్వీల్లురుతుంది. మీరు చెప్పిన చిరునామాకు, మీరు చెప్పిన తేదీన మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను.

లేత పచ్చరంగు ఫార్మల్ షర్ట్ విత్ డార్క్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ లో నేనోస్తాను. నన్ను గుర్తించగలరు.

అప్పటివరకూ మిమ్మలని కలిసే ఆ ప్రతి క్షణం కోసం ఎదురుచూస్తూ...

ఇట్లు...

నా లేఖ రాసిన లేఖకు నా ఈ ప్రతి లేఖ

ప్రేమతో మీ ప్రేమ్...

                           ❤️@@@@@❤️

అంటూ రాశాడు ప్రేమ్.

జరుగుతున్న విషయాలన్నీ చివరికి కావ్య వాళ్ల నాన్న గారికి కూడా తెలిసింది. చేసే పని ఒక మంచి కార్యక్రమమునకే అని భావించి ఆయన కూడా కావ్య చేస్తున్న పనికి అడ్డు చెప్పలేదు. పైగా తన పూర్తి మద్దతును కూడా ఇచ్చారు.

ఇక అందరూ కావ్య ప్రేమ్ ని కలిసే ఆ రోజు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అలా ఆ రోజు రానే వచ్చింది.

కావ్య...

కీర్తన...

ఇద్దరూ చెప్పిన అడ్రస్ కి వెళ్ళారు (అదే ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి). కొంతసేపటికి అక్కడికి లేత పచ్చ రంగు షర్ట్, బ్లు కలర్ జీన్స్ ప్యాంటు ధరించి అక్కడికి ఒక అబ్బాయి వాళ్ళని తదేకంగా చూస్తూ... అలానే వాళ్ల దగ్గరికి వస్తున్నాడు.

ఇంతలో అది గమనించిన కావ్య, అతని ఫేస్ చూసి ఒక్కసారిగా ఖంగుతింది.

ఎందుకంటే...

అతను ఎవరో కాదు, తన స్కూల్ మేట్ పవన్.

అతన్ని అలా అక్కడ చూసి ఆశ్చర్యపోయిన కావ్య

"నువ్వు పవన్ కదూ....!" అంటూ అతన్ని ప్రశ్నించసాగింది. దానికి బదులుగా అవునని ఆ వ్యక్తి తలాడిస్తూనే...

"నువ్వు కావ్య ..!" అంటూ కావ్య వైపు తన వేలిని చూపిస్తూ తనని కూడా అడగసాగాడు పవన్ అదే ఆశ్చర్యం కలిగిన ముఖ కవలికలతో.

తను చెప్పిన డ్రెస్ కావ్య వేసుకొచ్చినప్పటికి, చెప్పినట్టుగానే బొకే కూడా తీసుకొచ్చినప్పటికీ...

పక్కనున్న కీర్తన వైపు తన వేలిని చూపిస్తూ ...

"మీరేనా లేఖ !" నా అంటూ తనని అడగసాగాడు ఆ పవన్.

(అక్కడున్న ది వాళ్లిద్దరే, అందులో ఒకరు తన క్లాస్మేట్ అని తేలిపోయింది కాబట్టి... ఇక మిగిలిన ఆమ్మాయి(కీర్తనను) లేఖ అనుకుంటున్నాడు ఆ పవన్)

"అది సరే కానీ,

నువ్వు ఈ డ్రెస్ లో ఉన్నావేంటి..?

అయినా ఇక్కడున్నావేంటి..?

అసలు ప్రేమ్ ఎక్కడ ?"

అంటూ కావ్య... పవన్ అడుగుతున్న వాటిని లెక్కచేయకుండా తన సందేహాన్ని బయట పెట్టింది.

పవన్ కూడా ఏం తగ్గకుండా..

"ముందు నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు !

ఈ డ్రెస్ లేఖ కదా వేసుకుని వస్తాను అని చెప్పింది. మరి నువ్వు వేసుకుని వచ్చావ్ ఏంటి..?

అసలు తను ఎక్కడ ?" అంటూ కావ్యని అడుగుతాడు.

"నీకు బుర్రుందా..?

నేను అడుగుతున్నదేమిటి ?

నువు చెప్తున్నదేమిటి ?

నేను అర్జెంట్ గా ప్రేమ్ నీ కలవాలి...

తనకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ...

ముందు తను ఎక్కడున్నాడో చెప్పు..!" అంటూ కొంచెం సీరియస్ గా మాట్లాడుతుంది కావ్య..!

నేను అదే అంటున్నా

నీకసలు బుర్రుందా..?

నేను అడుగుతున్నదేమిటి ?

నువు చెప్తున్నదేమిటి ?

నేను అర్జెంట్ గా లేఖ నీ కలవాలి...

తనకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ...

ముందు తను ఎక్కడుందో చెప్పు..!

అయినా నువ్వింకా అలానే ఉన్నావ్..!

అప్పటికి ఇప్పటికీ అసలు నువ్వేం మారలేదు! " అంటూ అంతే సీరియస్ గా బదులిచ్చాడు పవన్

"హేయ్..

పవన్ ...!

హోల్డ్ యువర్ టంగ్...!

బీ ఇన్ యువర్ లిమిట్స్ ...!

నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నేనేం నీ దాన్ని కాదు..!" అంటూ ఇంకొంచెం ఆగ్రహంతో ఊగిపోయింది కావ్య పవన్ పై..

"మరి నాకు చెప్పడానికి అసలు నువ్వెవరే..?

నువ్వు కూడా నీ నోరు కొంచెం అదుపులో పెట్టుకో..!" అంటూ పవన్ కావ్య కి కౌంటర్ వేస్తుంటే,

"ఏంటి బెదిరిస్తున్నావా..?" అంటూ పవన్ పై పై కి వెళ్తున్న కావ్యను ఆపింది కీర్తన.

ఇంకా గొడవ పెద్దది అయ్యేట్టు ఉందనే ఉద్దేశ్యంతో...

"ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే అన్ని అవే సర్దుకుంటాయి, ఎందుకీ ఈ గొడవలు!

పైగా మీరిద్దరూ క్లాస్మేట్స్ అని అర్థమవుతుంది..

ఇన్నాళ్ళ తర్వాత కలిసి ఎవరైనా ఇలా పొట్లాడుకుంటారా?" అంటూ మరొక పక్క పవన్ ని కూడా కంట్రోల్ చేసింది కీర్తన..!

కాసేపు వాళ్ల ముగ్గురి మధ్య నిశబ్ధం ఆవహించింది. ఇంతలో పక్కనే ఉన్న కాఫీ కేఫ్ లో కాఫీ తీసుకుని సన్నగా వివరాలు లాగడం మొదలుపెట్టింది కీర్తన పవన్ దగ్గర నుండి...

"అసలు ఎందుకు మీ ఇద్దరి ఒకరంటే ఒకటికి పడడం లేదు!

అంటూ కీర్తన అంటుంటే...

పవన్.. కావ్య... ఇద్దరూ ఒకటి మొహాలు ఒకరు మరింత కోపంగా చూసుకోసాగారు.

అసలు ప్రేమ్ , లేఖ ల కథలోకి ఈ పవన్ , కావ్య ల గొడవ ఏంటి..?

అసలు పవన్ కి కావ్యకి గతంలో ఏం జరిగింది..?

వాళ్ళిద్దరికీ మధ్య సంబంధం ఏమిటి..?

పవన్ కి ప్రేమ్ ఎలా తెలుసు..?

వాళ్లిద్దర మధ్య సంబంధం ఏమిటి..?

అసలు ప్రేమ్ ఏమైనట్టు..?

ప్రేమ్ కి లేఖ ఇక లేదన్న విషయం తెలుస్తుందా..?

తెలిస్తే అది ఎవరి ద్వారా తెలుస్తుంది..?

కథలో జరుగుతున్న కొత్త మలుపుల గురించి తెలుసుకోవడానికి "ప్రేమ లేఖ - 8" వరకూ కాస్త ఓపిక పట్టండి.


అంతవరకూ ...

పాఠకులందరూ...

కొంచెం ఓపిక పట్టి,

మీ విలువైన అభిప్రాయాలను సమీక్షల ద్వారా తెలపండి. అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, నా ఈ కథకు నూతనొత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు

రచన: సత్య పవన్ ✍️✍️✍️


Rate this content
Log in

Similar telugu story from Abstract