పున్నమి రాత్రి
పున్నమి రాత్రి
రాత్రి పదిగంటలు అవుతుంది.
పున్నమిరేయి కావడంతో వెన్నెల పిండారబోసినట్లుంది. వరంగల్ నగరం వెన్నెలమడుగులో నిశ్శబ్దంగా జలకాలాడుతోంది.
పాడుబడ్డ ఓరుగల్లు కోటకు వెళ్ళే మార్గంలో…పచ్చికబయలు పైన పడుకుని ఆకాశంలోకి వీక్షిస్తూ…ఫక్కుమంటూన్న పూర్ణచంద్రుని నవ్వుల జిలుగులలో తడిచి ముద్దవుతోంది ఓ యువజంట.
వారు అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు, చేరువలో ఎవరివో అడుగుల సవ్వడి వినిపించడంతో లేవబోయాడు ఆ యువకుడు.
“అప్పుడేనా, రాజా?” అంటూ అతని ఛాతీ పైన తల పెట్టుకుని పడుకున్న యువతి అతన్ని లేవకుండా ఆపబోయింది.
“ఎవరో వస్తున్నట్టున్నారు, రాణీ! చూద్దాం పద,” అంటూ లేచి, ఆమెకు చేయి అందించి పైకి లేపాడు అతను. చేతులు పెనవేసుకుని రోడ్ వైపు నడచారు ఇద్దరూ.
చెట్టాపట్టాలు వేసుకుని అటే వస్తూన్న మరో యువజంట వారి కంటపడింది.
వారికి ఎదురు వెళ్ళాడు అతను. ఆమె అనుసరించింది.
“హాయ్!” అంటూ ఆగంతకులను పలుకరించాడు. “మీరు టూరిస్టులా?” అనడిగాడు.
ఔనన్నట్లు తలలు ఊపారు వాళ్ళు…ఆ యువకుడికి ఇరవయ్యేళ్ళుంటాయి. మీడియం హైటూ, చామనచాయ రంగూను…తెల్లగా, స్లిమ్ గా ఉన్న ఆ యువతి వయసు పద్దెనిమిదికి మించదు. ..వారి రూపాలు, వస్త్రధారణ చూస్తే సంపన్నులు లాగ ఉన్నారు.
“మై నేమ్ ఈజ్ రాజా. టూరిస్ట్ గైడ్ ని,” తనను తాను పరిచయం చేసుకున్నాడు రాజా. “షి – మై గర్ల్ ఫ్రెండ్. నా హృదయరాణి. పేరు ఝాన్సీరాణి”.
వెన్నెల్లో వాహ్యాళికి బయలుదేరినట్టు చెప్పారు వాళ్ళు. రాజా అడిగిన ప్రశ్నకు, తామింకా ఓరుగల్లు కోటను చూళ్ళేదని చెప్పారు.
“తాజ్ మహల్ ని అందరూ చూస్తారు. కానీ, దాని అందాలను వెన్నెల్లో చూసినప్పుడే జన్మ ధన్యమవుతుంది. అలాగే ఓరుగల్లు కోట, రామప్ప దేవాలయం, శివలింగం, వేయి స్థంభాల మంటపం…ఒవన్నీ పగటిపూట కంటె, పున్నమి రాత్రినాడు చూస్తే పరవశించిపోతాం” చెప్పాడు రాజా.
ఆ జంట ముఖాలు చూసుకుంది.
“మీరు చూస్తానంటే, ఇప్పుడే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళగలను నేను. వెన్నెలమడుగులో కనువిందు చేసే ఆ శిల్పకుడ్యాలన్నిటినీ చూపించి వాటి చరిత్రను వివరిస్తాను. నా ఫీజు ఎక్కువేమీ కాదు. జస్ట్ వన్ థౌజండ్ రుపీస్. కేవలం వేయి రూపాయలే”” అన్నాడు రాజా వారి ముఖకవళికలను గమనిస్తూ.
మళ్ళీ ముఖాలు చూసుకుంది ఆ జంట.
అది గమనించి, “ఐ నో! ఇప్పుడు మనీ దగ్గర లేదనేగా మీ సంశయం?” నవ్వాడు రాజా. “డోంట్ వర్రీ. తిరిగి వచ్చాక మీ హోటల్ రూమ్ కి వచ్చి తీసుకుంటాను”.
వారు మాట్లాడకపోయేసరికి, మౌనం అర్థాంగీకారంగా తీసుకుని హుషారుగా ఈల వేసాడు రాజా.
“ఎంత వెన్నెల అయితే మాత్రం, వాహనమేదీ లేకుండా ఇప్పుడు అంత దూరం ఎలా వెళతాం, రాజా?” మెల్లగా అంది అతని గాళ్ ఫ్రెండ్.
“అలా రోడ్ పైకి వెళ్తే క్యాబ్ ఏదైనా కనిపిస్తుందేమో చూస్తాను” అన్నాడు.
ఆ జంటతో, “జస్ట్ ఎ మినిట్ సార్! ఐ గెట్ టాక్సీ” అంటూ, రాణిని అక్కడ ఉండమని చెప్పి వెళ్ళాడు.
నాలుగు అడుగులు వేసాడో లేదో, వెదుకబోయిన తీగ కాలికి తగిలినట్టు, కారు ఒకటి ఎదురువచ్చింది అతనికి. అడ్డుగా వెళ్ళి ఆపాడు.
లోపల డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. నల్లగా, ఎత్తుగా, దృఢంగా ఉన్నాడు అతను. ముఖం వికృతంగా, చూపులు కోరగా ఉన్నాయి…కారు చూస్తే, ఇక్ష్వాకుల కాలంనాటిదిలా ఉంది.
డ్రైవర్ రూపం చూసి కించిత్తి జడుసుకున్నా, అతనితో మాట్లాడి బేరం కుదుర్చుకున్నాడు రాజా…టూరిస్ట్ జంట వెనుక సీట్లో కూర్చుంటే, రాజా-రాణీలు ముందు సీట్లో డ్రైవర్ పక్కను సర్దుకుని కూర్చున్నారు.
ప్రస్తుతం వరంగల్ గా రూపొందిన ఓరుగల్లు యొక్క చారిత్రాత్మక ప్రాశస్త్యం…శతాబ్దాల వాతావరణ కాలుష్యానికి, పాలకుల నిర్లక్ష్యానికీ గురైన ఆ బృహత్ కట్టడాలు పాడుబడడమూ…చెక్కుచెదరని రమణీయతతో విలసిల్లే ఆ శిల్పకళా చాతుర్యం గురించీ…దారి పొడవునా వివరిస్తూనే ఉన్నాడు రాజా.
“అసలు దానికి ఓరిగల్లు అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా? తమిళంలో ‘ఒరు కల్లు’ అంటే ‘ఒక రాయి’ అని అర్థం. ఒంటిరాతితో నిర్మింపబడ్డ కట్టడం కనుక ‘ఒరు కల్లు’ అని పిలిచేవారు దాన్ని. కాలక్రమాన అది ‘ఓరుగల్లు’ గా పరిణామం చెందింది” చెప్పాడు.
తన ప్రియుడి వాగ్ధాటికి లోలోపలే మురిసిపోతోంది రాణి.
అంతవరకు మౌనంగా డ్రైవ్ చేస్తూన్న డ్రైవర్ హఠాత్తుగా అన్నాడు, “కోటకు అయిదు క్రోశుల దూరంలో పాడుబడ్డ జమీందారు భవంతి కూడా ఉంది”.
రాజా, రాణి చిన్నగా ఉలికిపడ్డారు. డ్రైవర్ వంక అనుమానంగా చూసాడు రాజా.
“నిన్ను ఈ ప్రాంతాలలో ఎప్పుడూ చూసినట్టులేదు. ఈ వేళప్పుడు హఠాత్తుగా ఎక్కడినుండి ఊడిపడ్డావ్?” అనడిగాడు. డ్రైవర్ నవ్వే సమాధానం చేసాడు.
కారులో కాసేపు మౌనం అలముకుంది.
ఒకప్పటి ఓరుగల్లు కోట ప్రాంతానికి చేరుకునేంత వరకు ఎవరూ మాట్లాడలేదు.
కారు దిగారు అంతా.
ఒకప్పుడు అత్యంత ప్రాభవంతో వెలుగొందిన కాకతీయ రాజుల స్మృతికి చిహ్నంగా కేవలం శిథిల కుడ్యాలు, ముఖద్వారాలూ, ఆర్చ్ లూ స్వాగతం పలికాయి. కాలక్రమంలో జీర్ణించుకుపోయిన రామప్ప దేవాలయం దర్శనమిచ్చింది. శివలింగం, మంటప ప్రాంగణం, వేయి స్థంభాల మండపం వగైరాలు అలనాటి ప్రాశస్థ్యాన్ని చాటుతూంటే…వెన్నెల్లో తడిసి ముద్దవుతూన్న ఆ కట్టడాల రమణీయత, నాటి శిల్పుల శిల్పకళా నైపుణ్యం చూపరులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఆ యువతీ యువకులు ఆ కుడ్యాల నడుమ తిరుగాడుతూంటే, “ఆలకించే ఆసక్తి ఉండాలే కానీ, ఈ శిథిలాలు కథలు చెబుతాయి. శిల్పాలు చతుర్లు పలుకుతాయి” అంటూ ఒక్కో కట్టడం గురించీ వివరిస్తూ, వాటి వెనుకనున్న చరిత్రను వివరించసాగాడు రాజా.
గుడి శిథిలాల లోపల, ఇతర హర్మ్యాల నడుమ త్రవ్వబడ్డ గోతులను చూపిస్తూ, “ఇవి ప్రజల అత్యాసకు, ప్రభుత్వాల అలక్ష్యానికీ ప్రత్యక్ష చిహ్నాలు. కాకతీయ ప్రభువులు తమ నిధినిక్షేపాలను భూమిలో దాచిపెట్టుంటారన్న అపోహతో ఓ శిథిలాలను శకలాలు చేయడానికి పూనుకున్నారు కొందరు దుండగులు” అన్నాడు, మదిలోని బాధ గొంతులో తొంగిచూస్తూంటే.
డ్రైవర్ వేయి స్థంభాల మంటపం మీద కూర్చుని మౌనంగా ఎటో చూస్తున్నాడు.
కాసేపటి తరువాత మళ్ళీ కారులో కూర్చున్నారంతా.
“కారును వెనక్కి పోనీ” అన్నాడు రాజా, డ్రైవరుతో.
“మరి రాజుగారి భవంతో?” అన్నాడు డ్రైవర్ అదోలా నవ్వుతూ.
“పాడుబడ్డ భవనం. అక్కడ చూడ్డానికి ఏముంది?” అన్నాడు రాజు అయిష్టంగా.
“చాలా ఉంది. పూర్వం మహారాజు తన రాణులలో ఒకరి కోసం కట్టించిన అద్భుతమైన భవంతి అది. తరువాత అది జమీందారుల నివాసమయింది. చూసితీరవలసిన కట్టడం,” అన్నాడు డ్రైవర్.
రాజా ఏదో అనబోతే, “అక్కడికే పోనియ్” అన్నాడు వెనుక సీటు
లోని యువకుడు.
కారు స్టార్ట్ చేస్తూ, “ఆ భవంతికి ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది,” అన్నాడు డ్రైవర్.
“ఇప్పుడు అదంతా వీళ్ళకు చెప్పడం అవసరమా?” షార్ప్ గా అన్నాడు రాజా.
“పరవాలేదు, చెప్పనీ” అని వెనుకనుంచి ఆ యువకుడు మెల్లగా అనడంతో, చెప్పుకుపోయాడు డ్రైవర్ –
‘కాకతీయ రాజవంశీయుల అనంతరం ఎవరెవరికో ఆ భవంతి ఆవాసమయింది. చివరగా రవీంద్రరెడ్డి అనే ఓ జమీందారు నివసించేవాడు అందులో. కొడుకు, కోడలు, మనవరాలితో ఉండేవాడు అతను. ఎల్లప్పుడూ పలువురు నౌఖర్లు చాకర్లతో కళకళలాడుతూండేది ఆ భవంతి… రవీంద్రరెడ్డి మనవరాలు జగదకు పద్దెనిమిదేళ్ళు. విశ్వం అనే ఓ సామాన్య టూరిస్ట్ గైడ్ ని ప్రేమించింది ఆమె…’
డ్రైవర్ వంక చురుగ్గా చూసాడు రాజు.
అదేమీ గమనించనట్టు చెప్పుకుపోయాడు అతను –
‘వారి ప్రేమ పెద్దలకు ఆమోదయోగ్యం కాలేదు. విశ్వాన్ని మరచిపొమ్మని జగదను హెచ్చరించారు. వినిపించుకోలేదామె. విశ్వంతో వివాహం జరిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది…దాంతో స్ట్రాటజీని మార్చిన రవీంద్రరెడ్డి వారి ప్రేమను అంగీకరిస్తున్నట్టు నటించాడు. త్వరలోనే వారి వివాహం జరిపిస్తానంటూ మనవరాలిని నమ్మించి, విశ్వాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు…నెల్లాళ్ళ తరువాత ఓ రోజున వారిని రామప్ప గుడికి వెళ్ళిరమ్మని చెప్పి కారులో పంపించాడు…
పెద్దాయన ఆదేశాల మేరకు త్రోవలో కారును కొండకు గ్రుద్దించి, తాను బైటకు ఉరికేసాడు డ్రైవర్. ఆ యువజంట అక్కడికక్కడే మరణించింది. ఐతే డ్రైవర్ కూడా బతకలేదు. బైటకు దుమికినప్పుడు తల ఓ బండరాతిని ఢీకొనడంతో చనిపోయాడు…జమీందారు కుటుంబానికి చెందిన ఆడపిల్ల ఓ సామాన్యుడితో ప్రేమలో పడడం సహించలేక, పరువు కోసం వారిని చంపించాడు రవీంద్రరెడ్డి…’
ఆగాడు డ్రైవర్. ఓ క్షణం కారులో భయంకర నిశ్శబ్దం అలముకుంది.
మళ్ళీ కొనసాగించాడు అతను – ‘ఆ తరువాత ఆర్నెల్లు తిరక్కుండానే రవీంద్రరెడ్డి కొడుకు, కోడలు ఏదో వింత జబ్బుతో మరణించడం జరిగింది. అందుకు బలవంతపు చావుకు గురైన ఆ యువజంట ఆత్మలే కారణమని జ్యోతిష్కుడు చెప్పడంతో, బతికుండగా వారు కలసి తీయించుకున్న ఫొటోని పెద్దగా చేసి పటం కట్టించి హాల్లో ఆవిష్కరించాడు జమీందారు, ఆ విధంగానైనా కొంతైనా ఉపశమనం కలుగుతుందన్న ఆలోచనతో. కానీ, మరో ఆర్నెల్లకు అదే వ్యాధితో అతనూ కాలంచేసాడు…అనంతరం ఆ భవంతిలో అడుగు పెట్టడానికి ఎవరూ సాహసించలేదు. అప్పట్నుంచీ అది అలాగే ఉండిపోయి పాడుబడిపోయింది…అదంతా జరిగి ముప్పయ్ ఏళ్ళు అయిపోయింది…’ ఎవరూ నోరు మెదపలేదు.
“అంతేకాదు, ఆ డ్రైవర్ దయ్యమై అదే కారును నడుపుతూ అప్పుడప్పుడు ఈ ప్రాంతాలలో కనిపిస్తుంటాడని చెబుతుంటారు” అన్నాడు అతను. “”లేత ఎరుపురంగు అంబాసడర్ కారు అది”.
ఉలికిపాటును కప్పిపుచ్చుకున్నాడు రాజా. ప్రస్తుతం వారు ప్రయాణిస్తున్న కారు లేత ఎరుపురంగు అంబాసడర్!
డ్రైవర్ వంక కోపంగా చూసాడు. “ఇలాంటి కథలు చెప్పి వాళ్ళను బెదరగొట్టి నా బేరం చెడగొట్టకురా, మగడా! జి.ఎస్.టి. పుణ్యమా అంటూ, అసలే ఈ మధ్య టూరిస్ట్ ట్రాఫిక్ ఘోరంగా పడిపోయింది” “ అన్నాడు. “కారు వెనక్కి తిప్పు, వెళ్ళిపోదాం”.
అతని పలుకులు చెవిలో పడినట్టున్నాయి, “ముందుకే పోనియ్” అన్నాడు వెనుక సీటులోని యువకుడు. చిన్నగా నుదురు బాదుకున్నాడు రాజా.
కొద్ది క్షణాలు ఆగి మళ్ళీ అన్నాడు డ్రైవర్ – “ఇంకో విషయం తెలుసా? ప్రతి పున్నమినాడూ విశ్వం, జగదల ఆత్మలు మానవరూపాలు ధరించి పచ్చిక బయళ్ళ పైన దొర్లుతూ, వెన్నెల్లో చెట్టాపట్టాలు వేసుకుని ఈ ప్రాంతాలలో తిరుగుతుంటాయట!”
అప్రయత్నంగా రాజా కళ్ళలోకి చూసింది రాణి. విరిసీ విరియని చిరునవ్వు లీలగా వెలసింది అతని పెదవుల మీద.
వెనుక కూర్చున్న జంట ఉలికిపడింది. ఆ యువతి, యువకుడి పైకి జరిగి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె భుజం చుట్టూ చేయి వేసాడు అతను.
అంతలోనే, “అదిగో - భవంతి!” అన్నాడు డ్రైవర్.
దూరంలో – వెన్నెల్లో ఒంటరిచెట్టులా నిలచియున్న పాడుబడ్డ భవంతి ఒకటి దర్శనమిచ్చింది.
కారు భవనాన్ని సమీపించగానే, “చూసాంగా, ఇక వెనక్కి పోదాం” అన్నాడు రాజా, కారులోంచి దిగకుండానే.
“లోపలికి వెళ్ళకుండానే?” అన్నాడు డ్రైవర్.
వెనుక కూర్చున్న జంట కారు దిగింది.
“లోపల చీకటిగా ఉంటుంది” అన్నాడు రాజా, వారినిఉ డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నిస్తూ.
“నా దగ్గర ల్యాంప్ ఉంది” అంటూ, మూడు ట్యూబ్స్ తో కూడిన ఎమెర్జెన్సీ ల్యాంప్ ను బైటకు తీసాడు డ్రైవర్. అతను లైట్ చూపుతూంటే ముందుకు నడచారంతా.
భవంతికి పెద్ద తాళంకప్ప ఉంది.
“అటుపక్క కిటికీ ఉండాలి. చూద్దాం పదండి” అన్నాడు డ్రైవర్.
అటువైపు వెళ్ళారంతా… పెద్ద కిటికీ అది. తలుపు మూసియుందే తప్ప లోపల గెడ పెట్టబడలేదు. తెరుస్తూంటే వింత శబ్దం చేసింది.
ఆ కిటికీ గుండా జాగ్రత్తగా లోపల ప్రవేశించారు. వారి వెనుకే మళ్ళీ కిటికీ తలుపు మూసేసాడు డ్రైవర్.
లోపల అడుగిడగానే దుర్గంధం గుప్పుమంది…ఎమెర్జెన్సీ ల్యాంప్ వెలుతురులో పరిశీలనగా చూసారంతా.
సువిశాలమైన హాలు, కొన్ని గదులూను…దుమ్ముకొట్టుకుపోయిన ఖరీదైన ఫర్నిచర్…గోడలకు బూజులతో కప్పబడియున్న తైలవర్ణ చిత్రాలు, ఫొటోలు. మేడపైకి మెట్లు ఉన్నాయి…హఠాత్తుగా వెలుగు కనిపించడంతో గబ్బిలాలు అలజడిచెంది గడబిడగా ఎగురుతున్నాయి.
గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గదులు – కిచెన్, డైనింగ్, గెస్ట్ రూమ్స్ ని – దర్శించారు. అనంతరం మేడపైకి వెళ్ళాడానికని మెట్ల వైపు దారితీసారు.
డ్రైవర్ నిల్చుండిపోయి, “ఆ ప్రేమజంట ఫొటో ఇదేననుకుంటాను. చూద్దాం, ఉండండి” అంటూ గోడ దగ్గరకు వెళ్ళాడు. గోడపైన బూజులతో కప్పబడియున్న పెద్ద ఫొటోగ్రాఫ్ ఒకదానిని అందుకోబోయాడు. చేతికి అందలేదు అది. బరువుగా ఉన్న టీపాయ్ ఒకటి మోసుకువస్తూంటే, “అంత కష్టపడి దాన్ని చూడనవసరంలేదు కానీ, వదిలెయ్” అన్నాడు రాజా.
డ్రైవర్ జవాబు ఇవ్వకుండా, గోడ దగ్గరగా టీపాయ్ వేసి దాని పైకి ఎక్కి చేతులతో ఫొటో మీది బూజులను తొలగించాడు. ఈసారి ఫొటో స్పష్టంగా కనిపిస్తోంది.
దాని వంక చూసిన రాజా, రాణీ త్రుళ్ళిపడ్డారు. అప్రయత్నంగా తమ పక్కకు చూసారు.
‘టూరిస్ట్ జంట’ అక్కడ లేదు. అంతవరకు వారి పక్కనే నిలుచునివున్న ఆ యువజంట అదృశ్యమయిపోయింది…!!
ఫొటోలోని వ్యక్తుల్ని చూసిన డ్రైవర్ కొయ్యబారిపోయాడు.
దబ్బుమన్న శబ్దానికి తేరుకుని తిరిగి చూసాడు.
రాజా, రాణీలు నేలపైన స్పృహతప్పి పడున్నారు.
తమతో వచ్చిన యువజంట జాడలేదు.
తాము ప్రవేశించిన కిటికీతో సహా మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి…!?
భయంతో నిలుచున్న చోటనే బిగుసుకుపోయాడు అతను…..