శ్రీనివాస్ మంత్రిప్రగడ

Drama Classics Thriller

4.7  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Drama Classics Thriller

జారుడు మెట్లు

జారుడు మెట్లు

19 mins
598


విశాఖపట్నం లోని ఒక నక్షత్రాల హోటల్ లో ఏడో అంతస్తులో ఉన్న బార్లో ఒక మూలగా ఉన్న టేబుల్ మీద కూర్చుని ఉన్నారు వీర్రాజూ అతని బాల్య స్నేహితుడి వాసు.

వెనకనున్న పెద్ద అద్దంలోంచి దూరంగా లైట్ల వరసలు కనిపిస్తూ బాల్యాన్ని గుర్తు చేస్తున్నాయి...తన చిన్నప్పుడు రైల్వే క్వార్టర్స్ లో మేడ మీద నుంచి చుస్తే కనిపించే దృశ్యం ఇక్కడనుంచి కనిపిస్తోంటే అతనికి బాల్యం లోకి వెళ్లి పోయినట్టనిపించింది...

ఇద్దరు కొద్ది కొద్దిగా ద్రవ సేవనం ప్రారంభించారు…

 అంతలో వీర్రాజు దృష్టి తనకు ఐ మూలగా ఆ హాలుకు అవతల చివర కూర్చున్న జంట మీద పడింది...ఆలా వేరే టేబుల్ వైపుకి చూడడం అంత సభ్యత కాక పోయినా కొంచం పరికించి చూసాడు...

ఆ జంట లో మగవాడు తనకు పరిచయమున్నవాడిలా అనిపించింది...ఈ బార్లలో లైట్లు దిమ్ము గా పెడతారెందుకో...తన చుట్టూ ఉన్న ప్రపంచం చిన్నదవుతున్న కొద్దీ మనిషిలో ధైర్యం పెరుగుతుందంటారు కొందరు మానసిక శాస్త్రవేత్తలు...అదే కారణమేమో... అందరి ముందు తాగడానికి ధైర్యం లేని వాళ్ళు కూడా ఆ దిమ్ముగా ఉన్న దీపాల వెలుగులో తాగే ప్రయత్నం చేస్తారేమో...

ఒక నిముషం పరికించి చూసి గతుక్కు మన్నాడు...ఆ జంటలో మగవాడు తన బాల్య స్నేహితుడు మాధవ్...

వాడి మంచితనం, వాళ్ళ కుటుంబ గౌరవం లాంటివి చూసి వాడికి తన చిన్నాన్న కూతురు శశిని ఇచ్చి చేసి బావను చేసుకున్నాడు...

వాడు బార్లో కనిపించడం అది కూడా వేరే ఆడదానితో...ఆ విషయం జీర్ణించు కోవడం కష్టమైంది వీర్రాజుకి...తన ముందున్న గ్లాస్ గబా గబా ఖాళీ చేసాడు ...

అతడు చాలా కాలం విదేశాల్లో నివసించి వృద్ధాప్యంలో ఉన్న తల్లి తండ్రులను చూసుకోవడానికి వెనక్కి వచ్చేసాడు...ఇంకా తన బంధువులనీ, స్నేహితులనీ కలిసి వాళ్ళ వివరాలు తెలుసుకోలేదు...తనకు తెలియకుండా తన బాల్య స్నేహితుడూ, బావా అయినా మాధవ్ ఇంతగా దిగజారి పోయాడా?

తను విదేశాల్లో ఉన్నప్పుడు కూడా తరచుగా వాళ్లతో మాట్లాడుతూనే ఉండేవాడు...అన్నీ మామూలు విషయాలూ, సినిమాలూ, పుస్తకాలూ అన్ని రకాలూ మాట్లాడుకునేవారు...ఇంత దౌర్భాగ్యమైన పని చేస్తూ కూడా ఈ మాధవ్ గాడు ఏమీ జరగనట్టు ఎంత బాగా నటించాడు…ఈ విషయం తాను ఫోన్ చేసినప్పుడు శశి కూడా చెప్పలేదు...తనకు తెలిసుండదా...

వీర్రాజు మనసులో భావాలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి...

వీర్రాజు మోహంలో మారుతున్న రంగులూ, వ్యక్తమౌతున్న భావాలూ చూస్తున్న వాసుకి ఏమి అర్ధం కాలేదు...వీడికి పూనకం గాని వచ్చిందా అనే అనుమానం వేసింది...

"ఒరే...బానే ఉన్నావా? ఏమైంది" అనడిగాడు వీర్రాజుని...

"ఒక్కసారి నా పక్క కుర్చీలో కూర్చో...నేనొకటి చూపించాలి...అదిచూసి చప్పుడు చెయ్యకు" అన్నాడు వీర్రాజు

కొంచం విసుగేసింది వాసుకి...కానీ స్నేహితుడి మీద ప్రేమతో అటు వెళ్లి కూర్చున్నాడు..

"ఏం చూడమంటావు?" అనడిగాడు

"అక్కడ ఐ మూలగా ఉన్న టేబుల్ మీద కూర్చున్న జంటను చూడు" అన్నాడు వీర్రాజు గుసగుసలాడుతూ

"నీకేమైంది రా నువ్వు చాలా సంస్కార వంతుడివనుకునేవాడిని…ఇప్పుడేమయ్యింది" అన్నాడు వాసు కొంచం కోపంగా…

"ఉష్...ఇందులో బూతేమి లేదు...జస్ట్ చూడు" అన్నాడు వీర్రాజు…

తప్పనిసరై చూసాడు "వాడు మాధవ్ కదా...అదేమిటి పక్కన శశి ఉండాల్సింది పోయి వేరే అమ్మాయి...వాళ్లిద్దరూ కూర్చున్న పధ్ధతి..చేస్తున్న విన్యాసాలు అంత గౌరవ నీయంగా లేవు" అన్నాడు వాసు షాక్ అయి…

"అదే కదా...ఇదేమిటి వాడు చాలా మంచివాడనీ...సి ఏ అని వాడిని నా బావను చేసుకున్నాను ...ఇప్పుడు నేను చిన్నాన్నకు, శశి కి మొహం ఎలా చూపించను...సరే ఈ జిడ్డు మొహమే చూపిస్తాను కానీ శశికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలా ఆపడం" అంటూ విలవిలలాడాడు వీర్రాజు…

ఇద్దరూ మాట్లాడకుండా తాగుతూ జీడిపప్పు తింటూ చాలాసేపు గడిపారు...ఆ సమయం అంతా మాధవ్ ని గమనిస్తూనే ఉన్నారు...పేట్రేగిపోతున్నాడు వెధవ అనుకున్నారిద్దరూ... మాధవ్ ని కోపంగా చూస్తూ…

టైం చూసాడు వాసు...పదకొండు...ఈ మాధవ్ గాడి గొడవలో పడి సాయంత్రం వాళ్ళు అనుకున్నట్టు ఎంజాయ్ చెయ్యలేక పోయారు...కొంచం నిరాశ పడ్డారు...

"సరేరా నేను బయల్దేరతాను...ఈ మాధవ్ గాడి పని పొద్దున్నే పడదాం" అని లేచాడు వాసు…

"సరే...నువ్వు బయల్దేరు...సంధ్యకు నా తరపున క్షమాపణలు చెప్పు" అన్నాడు వీర్రాజు…

వాసు వెళ్లిన తరువాత కూడా వీర్రాజు అక్కడే కూర్చొన్నాడు...తాగడం ముగించి భోజనం ఆర్డర్ చేసి తిన్నాడు…

బిల్లు కట్టేసి కూర్చొన్నాడు...హోటల్ గెస్ట్ కావడం తో, పైగా బారు మెల్లిగా ఖాళీ అవుతుండడం తో ఎవ్వరూ వీర్రాజుని లేవమనలేదు... 

మాధవ్ అతని తో ఉన్న ఆమే ఇద్దరు బిల్లు కట్టి లేచారు...వాళ్ళు కొంచం ముందు కెళ్ళేవరకు చూసి బయల్దేరాడు వీర్రాజు...

వాళ్ళు లిఫ్ట్ ఎక్కకుండా మెట్లమీద నుంచి వెడుతున్నారు...

షెర్లాక్ హోమ్స్ లా ఫీలై పోతూ మోహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా మెల్లిగా వాళ్ళను అనుసరించాడు…వాళ్ళు కూడా వీర్రాజులాగానే అదే హోటల్ లో ఆరో అంతస్తులో ఉన్నట్టున్నారు...

చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా వాళ్ళను గమనిస్తున్నాడు వీర్రాజు... వాళ్ళకిదేమీ పట్టినట్టు లేదు...తమ ధోరణిలో వెడుతున్నారు…

అతని గదికి రెండు గదులవతల ఉన్న గదిలోకి మాధవ్ వెళ్ళాడు...దానికి ఎదురు గా ఉన్న గది లోనికి ఆమె వెళ్ళింది…

అమ్మయ్య అనుకున్నాడు వీర్రాజు...ఇది తను అనుకున్నంత ప్రమాద కరమైన విషయం

కానట్టే ఉంది... ఏమైతేనేం మాధవ్ గాడి గురించిన నా భయాలు ఉత్తివే అనిపిస్తోంది…కానీ బార్లో వాళ్ళు అంత గౌరవనీయంగా ఏమీ ప్రవర్తించలేదు...అది ఆలోచించాల్సిన విషయమే…

కొంతలో కొంత నయమే అనుకుని కొంచం స్థిమిత పడ్డాడు...

కుదుటబడ్డ మనసు తీపి కలలు కంటది అని ఆత్రేయగారు అననే అన్నారు కదా... వీర్రాజు మనసు కూడా పైకెళ్ళి హోటల్ వారు సమకూర్చిన మిఠాయి కిళ్ళీ తెచ్చుకోవాలని ముచ్చట పడింది...ఓపిగ్గా మళ్ళీ పైకి వెళ్ళాడు

కసకసా కిళ్ళీ నములుతూ దిగి వచ్చేటప్పడికి కనిపించిన దృశ్యం చూసి మ్రాన్పడిపోయాడు... ఆమె మాధవ్ గది ముందు నిలబడి తలుపు కొడుతోంది...

మాధవ్ తలుపు తీసాడు ఆవిడ లోపలి వెళ్ళింది...

అంతకు ముందు ఇద్దరూ చెరో గదిలోకి వెళ్లడం తో ఇది చిన్న సమస్య లే అని స్థిమిత పడిన వీర్రాజుకి గుండె జారి పోయింది…

నిశ్శబ్దం గా తన గది లోకి వెళ్లి కూర్చున్నాడు...

మనసులో ఏదో తెలియని బాధ...రాత్రంతా అలాగే మధన పడుతూ గడిపాడు వీర్రాజు...

తను సరిగ్గా అర్ధం చేసుకోక శశి గొంతు కోశాడా?

శశి తన కజిన్స్ అందరి లోకి చిన్నది... ఆ పిల్లంటే అందరికీ ముద్దే... ఆ పిల్ల జీవితం లో ఇలాంటి సమస్యా... అదికూడా తాను కుదిర్చి పెళ్లి చేసిన మాధవ్ గాడి వల్ల...

జీర్ణించుకోవడం కష్టం గా ఉంది వీర్రాజుకి...ఆలా బాధ పడుతూ దొర్లుతూ ఎప్పటికో నిద్ర పోయాడు...

పొద్దున్న లేచే టప్పడికి ఏడయ్యింది...తల నొప్పిగానూ గుండె భారం గానూ ఉంది...

లేవాలనిపించలేదు…

తప్పని సరై లేచి రెడీ అయ్యి తన అలవాటు ప్రకారం కాసిని సూర్యనమస్కారాలు చేసి కూర్చున్నాడు...

బయట కారిడార్ లో ఎవరో నడుస్తున్న చప్పుడు...వాళ్లేనా అని ద్వారానికి ఉన్న రంధ్రం గుండా చూసాడు...ఎవరో...

ఒక కాఫీ తెప్పించుకుని తాగాడు...

శశికి ఇదంతా తెలుసా? తనకసలే తొందరెక్కువ... చక్కటి ఉత్సాహమూ, కల్లా కపటమూ తెలియని అమాయకత్వం వల్ల శశిని మిస్సమ్మలో సావిత్రి అనే వాళ్ళం కజిన్స్ అందరమూ...

తనకి ఇంత భయంకరమైన సమస్య వస్తే తట్టుకోగలదా...వీర్రాజు మనసు పరి పరి విధాల పోసాగింది...ఇంక ఉండ బట్టలేక శశికి ఫోన్ చేసాడు...

"ఏరా అన్నయ్య...ఇంత పొద్దున్నే నేను గుర్తుకొచ్చాను...హైదరాబాద్ గాని వస్తున్నావా" అనడిగింది…

"లేదురా...ఒక విషయం చెప్పు...మాధవ్ గాడున్నాడా" అనడిగాడు…

"లేడు ...ఆడిట్ కోసం వైజాగ్ వెళ్ళాడు...రెండు రోజులయ్యింది...ఏమిటి విషయం ఫ్రెండ్ మీద అంత మనసు పోయింది...తనకే చెయ్యక పోయావా?" అనడిగింది శశి

తను దేశానికి తిరిగి వచ్చి మూడు నెలలైనా చూడడానికి రానందుకు కోపంగా ఉంది కాబోలు అనుకున్నాడు…

శశి పంధా పట్టించుకోకుండా "ఇంతకీ లైఫ్ బానే ఉందా " అనడిగాడు వీలైనంత యధాలాపంగా ధ్వనించే ప్రయత్నం చేస్తూ…

"ఏం బాగు రా...నీ ఫ్రెండ్ చాలామంచివాడు అని తీసుకొచ్చావు ...నీ మీద నమ్మకం తో చేసుకున్నాను...చస్తున్నానిప్పుడు " అంది శశి

బిత్తర పోయాడు వీర్రాజు...అంటే శశికి అంతా తెలుసా?

కాసేపు మౌనంగా ఉంది పోయాడు "ఏరా ఉన్నావా?" అని శశి అరిచిన అరుపు తో స్పృహలోకి వచ్చి "ఉన్నా...ఇంతకీ మాధవ్ గాడు నిన్నెలాంటి బాధలు పెడుతున్నాడే" అనడిగాడు…

"ఒక్కటైతే చెప్పగలను...నరకం చూపిస్తున్నాడు" అంది శశి…

ఓరి దుర్మార్గుడా...నువ్విలా తయారయ్యావా అనుకున్నాడు కొంచం మాధవ్ గురించి కోపంగా…

అయినా కొంచం సంభాళించుకుని తన సంభాషణ కొనసాగించాడు…

"అంటే...తాగుతాడా?" అనడిగాడు…

"సరేలే...రెండిళ్ళవతల నుంచి వాసనొస్తేనే డొక్కుంటాడు తనా తాగడం" అంది శశి కొంచం వేళాకోళంగా…

"మరి సిగరెట్లా" అంటుండగానే "లేదు అలాంటిదేమి లేదు" అంది శశి…

"మరి వేరే ఆడవాళ్ళతో పోతున్నాడా" అనడిగాడు మనసు చిక్కపట్టుకుని...ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న...దీనితో శశికి విషయమంతా తెలుసో లేదో తేల్చుకోవచ్చు...

"నన్ను మేనేజ్ చెయ్యడానికే సతమతమౌతాడు...వేరే ఆడవాళ్లు కూడానా" అని నవ్వింది శశి

"మరి? వాడు గట్టిగ అరవడం తిట్టడం లాంటివి చెయ్యలేడు...ఇంకెలా ఇబ్బంది పెడుతున్నాడు" అనడిగాడు వీర్రాజు

"ఏమైంది రా నీకు ఈ యక్ష ప్రశ్నలు" అంది శశి విసుగ్గా…

"నువ్వు చిక్కు ముళ్ళు వేస్తున్నావు అందుకని నేను యక్ష ప్రశ్నలడగాల్సి వచ్చింది" అన్నాడు వీర్రాజు...

ఈ తంతు గురించి శశి కి ఏమి తెలియదని అర్ధమయ్యాక కొంచం కుదుట పడ్డాడు…

"సరిపోయింది...నువ్వు మారి పోయావు రా...చిన్నప్పుడెంత గంభీరంగా ఉండేవాడివి... చాలా బుద్ధిమంతుడని పేరు నీకు...నువ్వు నన్ను ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావ్" అంది శశి…

"లేదురా కన్నా...నువ్వు కొంచం పెద్ద పదాలు వాడావు కదా చావడం నరకం అంటూ...కొంచం కంగారు పడ్డాను...ఇంతకీ మాధవ్ గాడు పెడుతున్న హింస ఏమిటో చెప్పలేదు " అన్నాడు వీర్రాజు…

"నువ్వు పెళ్లి చేసి విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసావు...ఇక్కడ నా నరకం ఏమిటో కనీసం అడగను కూడా లేదు" అంది శశి కంప్లైంట్ చేస్తూ…

"అదేమిట్రా...మీతో నెలా రెండునెల్లలకి ఒకసారైనా మాట్లాడుతూనే ఉండేవాడిని కదా...ప్రతిసారీ మీ క్షేమసమాచారాలు అడిగే వాడిని...మీరేం చెప్పలేదు" అన్నాడు వీర్రాజు చిన్నబుచ్చుకుని

"నిజమే కానీ ఇవన్నీ ఫోనుల్లో మాట్లాడుకునే విషయాలుట్రా...దానికి తోడు ఒక విషయమైతే చెప్పొచ్చు...ఇదో అంతులేని కథ" అంది శశి

"విషయం చెప్పవోయ్" అన్నాడు వీర్రాజు కొంచం చిరాగ్గా…

"చెప్పడానికేముంటుంది...అతనొట్టి దద్దమ్మ...ఏ పనులూ చేతకావు...ఎప్పుడు ఒక మూల పడుంటాడు…చుట్టుపక్కల వాళ్ళని కలవడు...మాట్లాడడు...అందరు తనకి పొగరనుకుంటున్నారు" అంది శశి

"వాడు కొంచం రిజర్వుడ్ మనిషి...తొందరగా కలవడు...అది మనకు ముందే తెలుసు కదా...

మేం చదువుకునేటప్పడు వాడే మా గురువు...సి ఏ మొదటి దఫాలోనే పాస్ అయ్యాడు, వాడికి మంచి రాంక్ కూడా వచ్చింది తెలుసా... అలాంటి వాడిప్పుడు దద్దమ్మ ఎలా అయిపోయాడు" అనడిగాడు వీర్రాజు కొంచం ఉద్వేగంగా…

"అదే గోల... ఈ పెద్ద చదువులు ఒక రకమైన పొగరు ఇస్తాయి...జీవితానికి అవసరమైన పనులు నేర్పవు" అంది శశి…

ఈ పిల్ల పడికట్టు మాటలు మాట్లాడుతోందా లేక నిజంగానే చాలా పరిణతి తో విశ్లేషిస్తోందా అర్ధం కాలేదు...

ఒకపక్కన ఇంటి పనులు చేసే పద్ధతిని ఆధారంగా గా తీసుకుని మాధవ్ గాడి దక్షతను విమర్శిస్తోంది ఇంకో పక్కన మనిషి పర్సనాలిటీ ని అనలైజ్ చేస్తోంది...ఆడవాళ్లను అర్ధం చేసుకోవడం కష్ఠం అంటే ఇదేనేమో అనుకున్నాడు వీర్రాజు…

" చాలా మంచి మాటన్నావ్...ఇంత తెలిసిన దానివి వాడినెందుకు దారిలో పెట్టలేకపోయావు?" అనడిగాడు...

"చాలా ప్రయత్నించాను...ఈ విషయమై ఎప్పుడు సంభాషణ ప్రారంభించినా అది అరుపులూ కేకలతో ముగిసేది...దాని వల్ల పిల్లలు దెబ్బ తింటున్నారని ఆ విషయం వదిలేసాను...

దానికి తోడు మా అత్తగారు మగాడికి ఆ పనులు రాకపోతేనేం అంటూ తనని వెనకేసుకు రావడం... అసలు ఆ విషయాలు ఆలోచించాలంటేనే చిరాకు గా ఉంది" అంది శశి విసురుగా…

"ఇప్పుడేం చేద్దాం రా కన్నా" కొంచం మార్దవం గా అడిగాడు…

అటువైపునించి మాట రాలేదు...ఒక క్షణం తరువాత వెక్కిళ్లు వినపడ్డాయి..ఇంత ధైర్యంగా మాట్లాడిన శశి ఏడుస్తోందా...వీర్రాజుకి ఏమి అర్ధం కాలేదు...

నిన్నటి వరకు చాల సింపుల్ గా ఉన్న జీవితం ఒక్కసారిగా ఇలా పజిల్ లాగ మారిపోయిందేమిటి?...కొద్దిగా తలనొప్పి మొదలైంది వీర్రాజుకి…

"శశీ...ఏడుస్తున్నావా...ఏమైంది...నువ్విలా బేలవవుతావని నేనెప్పుడూ అనుకోలేదు" అన్నాడు వీర్రాజు...అతని గొంతులో బాధా ఆందోళనా స్పష్టంగా ధ్వనిస్తున్నాయి

శశి సంభాళించుకుని "సర్లేవోయ్ మాయాబజార్ కృష్ణుడా" అని నవ్వు తెచ్చుకుంది...తరువాత నెమ్మదిగా "సారీ రా అన్నయ్యా..చాలాకాలం తరువాత నాతో ఇంత ఓర్పుతో మాట్లాడాడే వాళ్ళు దొరికేసరికి ఆపుకోలేకపోయాను" అంది

"అదేమిటి చిన్నాన్న కీ, పిన్నమ్మ కీ విషయం తెలియదా" అనడిగాడు వీర్రాజు…

"వాళ్లతో ఎప్పుడు మాట్లాడినా ఆ సంభాషణ ముందుకు సాగదు...వాళ్ళు మాధవ్ నే వెనకేసుకొస్తారు...అతనెంతో నెమ్మదస్తుడని నేనే పిచ్చి కొయ్యనని గొడవ మొదలెడతారు...అది కేకల తో అంతమౌతుంది" అంది శశి…

ఇంత మంది ఉండి కూడా మనుషులు ఎలా ఒంటరై పోతారో అర్ధమైంది వీర్రాజుకి... జాలేసింది…

"అయ్యో...ఇదసలు ఊహించని విషయం...కానీ నువ్వు కోప్పడనంటే ఒక విషయం అడుగుతాను " అన్నాడు జంకుతూ…

"అదేమిట్రా నువ్వు భయపడుతున్నావు...ఏదైనా అడిగే హక్కు అన్నగా నీకుంది...ఏమిటి నీ ప్రశ్న" అనడిగింది శశి

"ఇంతకీ ఏం చేస్తే మాధవ్ గాడి వల్ల నువ్వు సుఖపడతావో అర్ధం కాలేదు...విడిపోతే" అని మధ్యలోనే ఆపేసాడు

"సరేలే...ఇప్పుడింక విడిపోవడాలు అవీ కుదరవు...ఇద్దరు పిల్లల్ని ఈ ప్రపంచం లోకి దింపాక వాళ్లకు అన్యాయం చెయ్యలేము కదా...అయినా విడిపోయేంత పెద్ద సమస్యలేమీ కాదు లే" అంది శశి కొంచం దిగులుగా

"కానీ నీ కంప్లైంట్స్ వింటుంటే మీరిద్దరూ బోనులో సింహాల్లా కొట్టుకుంటున్నట్టున్నారు అదే నా బాధ" అన్నాడు వీర్రాజు

"నాకు మాట తొందరెక్కువ కదా నోటికెంత మాటొస్తే అంతా అనేస్తాను...బయట ఎంతో పెద్దమనిషి గా చెలామణి అవుతున్న మాధవ్ ఇగో ఆ మాటల్తో కదుల్తుంది...తనో నాలుగంటాడు, దానివల్ల ఇబ్బందులొస్తున్నాయనుకో" అంది శశి

"ఒరే తల్లిగాడూ అన్ని తెలిసి నువ్వు ఇలా దారి తెన్నూ లేకుండా కొట్టుమిట్టాలాడటం నేను చూడలేను రా...మనం ఏదైనా చెయ్యాలి" అన్నాడు వీర్రాజు

"భరించడం తప్ప ఏమీ చెయ్యలేము...ఆ మనిషి లో మార్పు రాదు" అంది శశి…

"ఎలాంటి మార్పు కావాలంటావ్" అనడిగాడు వీర్రాజు...విషయమేమి అర్ధం కాక, ముందు రోజు చుసిన దృశ్యాల వలన అతడు చాల వ్యధకు లోనవు తున్నాడు…

"ఇవేవీ చాల పెద్ద సమస్యలు కాదురా...కానీ పట్టించుకోకుండా...చెప్పినా నేర్చుకోకుండా ఉంటే భరించలేక నేను గొడవ చేస్తాను...అది పెద్దదవుతుంది... నేనే కొంచం భరించడం, నెమ్మదిగా ఉండడం అలవాటు చేసుకోవాలి" అంది శశి

"నువ్వొక విషయం గుర్తించాలి...ఏమనిషైనా...ఆడయినా, మొగయినా...ప్రపంచం తో వ్యహరించే టప్పుడు ఒక ముసుగు తగిలించుకుంటారు...అది వాళ్ళ చదువూ, ప్రపంచ విషయాల పట్ల వాళ్ళు చూపించే దక్షతా లాంటి విషయాల వాళ్ళ ప్రపంచం వాళ్లకు తగిలించినది...కానీ ఇంటికొచ్చి తన భర్త లేదా భార్య దగ్గర ఆ ముసుగు తీసేస్తారు...ప్రపంచానికి ఎంత గొప్ప వాళ్ళయినా వాళ్ళు కూడా మనుషులే కదా...ఆ మాత్రం చేత వాళ్ళు ప్రపంచాన్ని మోసం చేయటం లేదు...ఆ ముసుగు వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తి...అది గుర్తించకుండా వేరే ఏవో విషయాల్లో ప్రావీణ్యం లేదు కాబట్టి ఎందుకు పనికిరాని వాళ్ళ కింద కట్టేసి వాళ్ళని వేధించ కూడదు...మీ ఇద్దరు ఒకరి తో మరొకరు అలాగే వ్యవహరిస్తున్నారు" అన్నాడు వీర్రాజు…

అంగీకరిస్తున్నట్టు "అవునురా" అంది శశి నెమ్మదిగా...అప్పడికి సంభాషణ ముగించారిద్దరూ...

రాత్రి జరిగిన విషయాలకే చాల కలత పడి ఉన్న వీర్రాజు ఈ సంభాషణ వల్ల మరింత బాధ పడ సాగేడు...

వీళ్ళిద్దరూ నిజంగానే చిన్న విషయాలని పెద్దవి చేసుకుని గొడవలు పడుతున్నారా...లేక తనకు చెప్పని లేదా అర్ధం కాని సమస్యలేమైనా ఉన్నాయా...వీళ్ళ జీవితాన్ని దార్లో పెట్టక పొతే పిల్లల్లో దూకుడు పెరిగే అవకాశం ఎక్కువ...

అదీగాక ఈ మాధవ్ గాడు గీత దాటేశాడు కదా...వీర్రాజు తలనొప్పి ఎక్కువైంది...

స్నానం చేసి కిందకు వెళ్లి ఫలహారం చేసి బయటకు వచ్చాడు...తన విమానం సాయంత్రం నాలుగు గంటలకి...ఈ లోగా ఏం చెయ్యడం...హోటల్ వారినడిగి ఒక టాక్సీ తీసుకుని సింహాచలం వెళ్ళాడు...అక్కడి ప్రశాంత వాతావరణంలో కొంచం తేరుకున్నాడు...కుదురుగా ఆలోచించాడు...

తనలో తాను మధన పడడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకదు...ఎదో ఒకటి చెయ్యాలనుకున్నాడు...

మాధవ్ తో మాట్లాడటం అన్నింటి కన్నా మంచి పధ్ధతి అనిపించింది...వెంటనే మాధవ్ కు ఫోన్ చేసాడు...

"ఏరా బావా...అకస్మాత్తుగా గుర్తుకొచ్చాను...ఎలావున్నావ్" అంటూ ఉత్సాహంగా పలకరించాడు మాధవ్...అవున్లే అన్ని సుఖాలూ పొందుతూ కూడా ఏడుస్తూ ఎందుకుంటాడు...

"అంతా బానే ఉంది...నీ సంగతేమిటి" అనడిగాడు...డైరెక్ట్ గా విషయం లోకి వెళ్ళడానికి కొంచం మొహమాటం అనిపించింది…

"రెండు రోజుల నుంచి విశాఖపట్నం లో ఉన్నాను...ఇక్కడ ఆడిట్ జరుగుతోంది...చాలా హడావుడి గా ఉంది...రేపు సాయంత్రం బయలుదేరుతున్నాను...నువ్వొక వేళ హైదరాబాద్ వచ్చే ప్లాన్ ఉంటే ఒక రెండు రోజుల తరువాత పెట్టుకో" అన్నాడు మాధవ్

"ఇవాళ సాయంత్రం నన్ను కలవ గలవా?" అనడిగాడు వీర్రాజు…

మాధవ్ కు ఏమీ అర్ధం కాలేదు "కొంప దీసి నువ్వు కూడా విశాఖపట్నం లో ఉన్నావా?" అనడిగాడు...వాడి గొంతులో ఏమాత్రం భయం గాని తటపటాయింపు గాని లేవు...

బరితెగించాడు వెధవ అనుకున్నాడు వీర్రాజు…

 "అవును...సాయంత్రం నీ ఆడిట్ అయిపోయి హోటల్ కి వచ్చాక నాకు ఫోన్ చెయ్యి...ఎక్కడ కలుద్దామో ప్లాన్ చేసుకుందాం" అన్నాడు వీర్రాజు…

 "సరే...ఇంతకీ నువ్వెక్కడున్నావ్...ఎందుకొచ్చావ్" అంటూ ప్రశ్నలు గుప్పించాడు మాధవ్...ఏమీ సమాధానం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసాడు వీర్రాజు...

తన చిన్ననాటి హీరో...ఎంతో ప్రియమైన స్నేహితుడు...ముచ్చట పడి బావను చేసుకున్న మాధవ్ తో ఆలా మాట్లాడటం అతనికెంతో బాధ కలిగిస్తోంది...ఇదంతా నిజమేనా అనే అనుమానం మాటి మాటికీ కలుగుతోంది...

తన విమానం టికెట్ తరువాత రోజు పొద్దున్నకు మార్చుకున్నాడు...హోటల్ రోజంతా బుక్ అయి ఉంది కాబట్టి కంగారేమీ లేదు...తన భార్యకు ఫోన్ చేసి ఎదో పని వల్ల ప్రయాణం వాయిదా పడింది అని చెప్పాడు...

వాసుకి ఫోన్ చేసి తన ఆలోచన చెప్పాడు "అదే మంచిది రా...మాధవ్ గాడు చెడ్డవాడు కాదు...కొంచం సున్నితం గా మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించడం మంచి పనే" అన్నాడు వాసు...

తన ఆలోచన ను తన స్నేహితుడు కూడా బలపరచడం తో ఎంతో సంతృప్తి కలిగింది వీర్రాజుకి…

పడుకుని నిద్ర పోయాడు...మెలకువ వచ్చేటప్పడికి మధ్యాహ్నం నాలుగయింది...కొంత కార్యాచరణ నిర్ణయమవడం తో తలనొప్పి తగ్గింది...కొంచం బడలిక కూడా తీరింది...కాఫీ తాగి కూర్చున్నాడు...

ఇంతలో వాసు దగ్గర నుంచి ఫోన్ "బాబూ...రమ్మంటావా...కాసేపు కూర్చుని వెడతాను" అని

"ఒక పని చెయ్యి...నువ్వు దసపల్లా హోటల్ కి రా...అక్కడొక కాఫీ తాగి కబుర్లు చెప్పుకుందాం" అన్నాడు వీర్రాజు

"సరేలే" అని ఫోన్ పెట్టేసాడు వాసు...

బయటకు వచ్చి దసపల్లా హోటల్ కి నడుస్తుండగా మాధవ్ నుంచి ఫోన్ వచ్చింది "బావా... నా పనైపోయింది...హోటల్ కి వచ్చి స్నానం చేసి రెడీ అయ్యేటప్పడికి ఏడవుతుంది...పరవాలేదా" అనడిగాడు…

"అవును రా నీ పనయిపోయింది" అనుకుంటూ "సరే...డాల్ఫిన్ హోటల్ లో ఏడో అంతస్తులోని బార్ లో కూర్చో...నేనొస్తాను" అన్నాడు …

"ఎక్కడ నుంచి వస్తావు" అనడిగాడు మాధవ్...ఏమీ చెప్పకుండా ఫోన్ పెట్టేసాడు వీర్రాజు...

దసపల్లా హోటల్ లో కాఫీ తాగుతూ వీర్రాజు తను మాధవ్ తో ముఖ ముఖీ ఎలా మాట్లాడ దల్చుకున్నాడో వాసుకి చెప్పాడు…

"బానే ఉంది...నేనుకూడా వద్దామనుకున్నాను...కానీ మీ ఇద్దరూ స్నేహితులే కాదు బంధువులు కూడా కదా...మీ సంభాషణలో నేను కలగజేసుకోవడం బావుండదు...అదీగాక మీ ఇద్దరి మధ్య ఏమైనా చెడితే మూడో వ్యక్తి గా సమస్యను పరిష్కరించేందుకు ఒకడు కావాలి కదా" అన్నాడు వాసు…

"మంచి మాటన్నావ్...ఇప్పుడనిపిస్తోంది నువ్వు కూడా ఉంటే బాగుండునని...కానీ ఈ మాధవ్ గాడు విశాఖపట్నం వచ్చి కూడా నీకు చెప్పలేదు...అందుకనే కొంచం తటపటాయించాను" అన్నాడు వీర్రాజు…

"అది పెద్ద విషయం కాదులే...వాడి సంగతి మనకి తెలుసుగా...ఎప్పుడూ ఏదో ప్రపంచం లో ఉంటాడు...నువ్వు మాత్రం ఏమాత్రం భావోద్వేగాలకు గురవ కుండా వీలైనంత నిర్లిప్తం గా మాట్లాడు...నా అనుమానం మాధవ్ గాడు దారి తప్పలేదని...వాడు చాలా సున్నితమైన వాడు కదా...ఇంట్లో ఏదో గొడవ జరగడం తో హతాశుడై వర్తమానం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఈ వ్యవహారంలో చిక్కున్నాడేమో" అన్నాడు వాసు…

"నాకు కూడా అలాగే అనిపిస్తోంది...పొద్దున్న శశి తో మాట్లాడాను...తను మాధవ్ గాడి మీద వంద చదివింది...ఆ కంప్లయింట్లన్నీ చాలా హాస్యాస్పదమైనవి...వాటిని కష్టపడి పెద్దవి చేస్తోంది తను ... బహుశా మాధవ్ గాడి ఈ పనులకు అదో కారణమేమో అనే అనుమానం నాక్కూడా కలిగింది" అన్నాడు వీర్రాజు…

"అలాంటిదే ఎదో ఉండాలి...కేవలం సెక్స్ కోసం దారి తప్పే మనిషి కాదు వాడు...నీకు గుర్తుందా... మనం చిన్నప్పుడు అమ్మాయిల బొమ్మలు చూసేటప్పుడు వాడు అటువైపుకి కూడా వచ్చే వాడు కాదు...మన క్లాస్ లో చదివిన సుకన్య వాడు ప్రేమించక పొతే చచ్చిపోతా అని బెదిరిస్తే వారం రోజులు సెలవు పెట్టి కూచున్నాడు...వాడిప్పుడిలా మారి పోయాడంటే నమ్మడం కష్టం" అన్నాడు వాసు…

తలాడించాడు వీర్రాజు... కాఫీ తో బాటు సంభాషణ కూడా ముగించి బయటకొచ్చారిద్దరూ...

వాసుని సాగనంపి తన హోటల్ వైపుకి నడక సాగించాడు వీర్రాజు...

కార్పొరేట్ మీటింగులు చెయ్యడం లో బాగా చెయ్యతిరిగిన బాపతు కాబట్టి అదే పంధా ఇక్కడ కూడా తీసుకున్నాడు...ఎటువంటి ముందస్తు నిర్ణయాలూ చేసుకోలేదు...పూర్తిగా తెరిచిన మనసుతో నిదానం గా ఉన్నాడతడు...మధ్యాహ్నం నిద్రా...చిన్నగా నడక...వాసుతో మంచి అర్ధవంత మైన సంభాషణ అన్నీ అతని మీద మంచి ప్రభావం చూపించాయి...

తిన్నగా తన గదిలోకి వెళ్లి స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకుని ఏడో అంతస్తులోని బార్ కి వెళ్ళాడు...

ముందు రోజు కూర్చున్న మూలే కూర్చున్నాడు... పది నిముషాల తరువాత వచ్చాడు మాధవ్... తన తో బాటు ఆమె కూడా వచ్చింది...ఆశ్చర్య పోయాడు వీర్రాజు... సిగ్గులేదు వెధవకు అనుకున్నాడు…

బార్ ఖాళీగానే ఉండడంతో వీర్రాజుని గుర్తించి ఆ టేబుల్ దగ్గరకొచ్చాడు మాధవ్ "ఏరా బావా...నిన్నిలా చూడడం చాలా సంతోషం గా ఉంది రా...నువ్వెంటిక్కడ...పొద్దుట్నించి నా మాటలకూ సగం సమాధానాలే చెప్పటం లేదు...నా మీద కోపమా?" అనడిగాడు… 

"అలాంటిదేమి లేదు...రా కూర్చో" అన్నాడు వీర్రాజు కొంచం ముభావంగా…

"ఈవిడ మా ఆడిట్ ఫర్మ్ లో ముఖ్యమైన ఆడిట్ ఆఫీసర్... నాతో బాటు ఆడిట్ చెయ్యడానికొచ్చింది" అన్నాడు మాధవ్

ఓరి దుర్మార్గుడా...నీ కంపెనీ లో పనిచేసే అమ్మాయితోనే నా ఇవన్నీ అనుకున్నాడు వీర్రాజు...

మాట్లాడ కుండా నమస్కారం చేసి కుర్చీ చూపించాడు...

"ఇప్పుడు చెప్పరా...ఎప్పుడొచ్చావు, ఎక్కడుంటున్నావు, విషయాలేంటి?" అనడిగాడు మాధవ్...

వాడి ధైర్యం, పంధా చూసి వీడు మన అమాయకమైన సింపుల్ మాధవ్ కాదిప్పుడు...దుర్మరుడు అనుకున్నాడు...

 కానీ ఏమీ అనడానికి లేదు...ఆమెను కూడా తనతో తీసుకొచ్చాడు...ఆవిడ మొహం మీదే విషయం ఎలా అడగడం ?

వీర్రాజు తటపటాయింపు గమనించి ఆమె లేచి "సార్ నేను రూమ్ కి వెడతాను...డిన్నర్ అక్కడే తినేస్తాను...మీరిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యండి" అని బయలుదేరింది…

 "సరే" అన్నాడు మాధవ్ ఆమెతో...తరువాత వీర్రాజు వైపు తిరిగి "ఇప్పుడైనా చెబుతావా?" అనడిగాడు…

 "నువ్వు ఇంత ధూర్తుడివనుకోలేదు రా...అమాయకుడివనుకున్నాను కానీ గుండెలు తీసిన బంటువి " అన్నాడు వీర్రాజు

"గుండెలు తీసిన బంటు అంటే అర్ధం ఏమిట్రా?" అనడిగాడు మాధవ్ వేళాకోళంగా…

" నీలాగే ఎలాంటి పనైనా చెయ్యగల సమర్ధుడు అని అర్ధం...అయినా ఒరే ఇది వేళాకోళం కాదు...నేను కూడా ఇదే హోటల్ లో ఉంటున్నాను...మీరున్న ఆరో ఫ్లోర్ లోనే...నిన్న నీ తతంగమంతా చూసాను" అన్నాడు వీర్రాజు…

గతుక్కు మన్నాడు మాధవ్...తన విషయం బయట పడుతుందని...తన చిన్ననాటి స్నేహితుడు తనను ఇలా మొహం మీదే నిలదీస్తాడని అనుకోలేదు…

కాసేపు తలదించుకుని కూర్చున్నాడు...తరువాత తలఎత్తి "చూసావా" అన్నాడు నెమ్మదిగా...

"సుబ్బరంగా...ముందు మీరు ఆ మూల టేబుల్ మీద చేసిన విన్యాసాలూ తరువాత ఇద్దరు ఒకే రూమ్ లోకి దూరడం...ఛీ ఛీ ...ఏం పనులురా ఇవి" అనడిగాడు వీర్రాజు కోపం తో ఊగి పోతూ...

నిశ్చేస్తుడైన మాధవ్ కొంత సేపు తల దించుకుని కూర్చున్నాడు...కాసేపు ఇద్దరి మద్య మౌనం రాజ్యమేలింది…

కొంచం తేరుకుని టేబుల్ మీద గ్లాస్ అందుకుని గడ గడా తాగేశాడు... "ఏమిటో ఆలా జరిగిపోయింది...ఇదేమీ కావాలని చేసింది కాదు" అన్నాడు నెమ్మదిగా…

 "ఎలా జరిగినా అది ముమ్మాటికీ తప్పే" అన్నాడు వీర్రాజు కోపంగా…

 "నేనేమీ కాదనటం లేదు వీరా...కానీ నువ్వు మొత్తం విషయం వినకుండా మాట్లాడేస్తున్నావ్" అన్నాడు మాధవ్ సంజాయిషీ చెప్తున్నట్టు…

 "ఒరే...నువ్వు తప్పొప్పుకో, లెంపలేసుకో...ఈ విషయం ఇక్కడ తో వదిలి మామూలు గా ఉందాం" అన్నాడు వీర్రాజు…

 "ఇది నిజంగా తప్పేనంటావా? ఎంతో పరిణతితో ఆలోచించే నువ్వే నీ చెల్లెలి కాపురం అనేటప్పటిడికి తొందర పాటు చూబిస్తున్నావ్... అసలు సమస్యేమిటో తెలుసా? నువ్వు అనే ఈ పనివల్ల ఆ సమస్య తీరి పోతుందా? ఎప్పుడూ అమ్మాయిల బొమ్మల పుస్తకాలూ కూడా చూడని నేను ఇప్పుడు కేవలం సెక్స్ కోసం ఒక ఆడదాని వెంట పడతానా? ఏమిటనుకుంటున్నావ్?" అనడిగాడు మాధవ్ కోపం తో ఊగి పోతూ…

 ఖంగు తిన్నాడు వీర్రాజు...ముందు నెమ్మది గా మొదలు పెట్టడం తో తను తొందరగా విషయం ముగించేయాలనుకున్నాడు...కానీ ఇది సింపుల్ గా దారి తప్పిన స్నేహితుడి కథ కాదు...దీని వెనక పెద్ద విషయమే ఉంది అనుకున్నాడు…

పొద్దున్న శశి తో తన సంభాషణ గుర్తుకు వచ్చింది...పుట్టి నప్పటి నుంచి తెలిసిన నన్నే ఉక్కిరి బిక్కిరి చేసేసింది శశి...వీడిని ఏం హింస పెడుతోందో...వీడిలా దారి తప్పడానికీ శశి ప్రవర్తనలో వచ్చిన మార్పుకి ఎదో గట్టి సంబంధమే ఉందేమో అనుకున్నాడు…

"సారీరా మాధవ్, నేను ఆ మాట అనటం లేదు...నాకెంతో ఇష్టమైన స్నేహితుడివి...అందులోనూ చిన్నప్పటి నుంచి మా అందరికి గురువు లాంటి నువ్వు దారి తప్పడం ఊహాతీతమైన విషయం...దాంతో నేను కొంచం ఎక్కువే మాట్లాడాను...ఇంతకీ విషయం ఏమిటి? ఈవిడ నీకెలా దగ్గరయింది?" అనడిగాడు వీర్రాజు కొంచం అనునయంగా…

మాధవ్ కాసేపు ఏమి మాట్లాడ లేదు...తన గ్లాస్ ఖాళీ అవడంతో హోటల్ సిబ్బందిని పిలిచి మళ్ళీ నింపమన్నాడు...

వీర్రాజుకి ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి...తాము చదువుకునేటప్పుడు ఎప్పుడైనా డబ్బులు జమ చేసి బీర్ తాగుదాం అంటే మాధవ్ తన వంతు డబ్బులు ఇచ్చేసేవాడు కానీ తాగే వాడు కాదు అలాంటిది ఇప్పుడు ఎంతో అలవాటైన మనిషి లా ఆర్డర్ చేస్తున్నాడు...గ్లాస్ తరువాత గ్లాస్ తాగేస్తున్నాడు...

కొంచం బాధ వేసింది...

మాట్లాడ కుండా కూర్చున్న మాధవ్ చేతి మీద చెయ్య వేసి ఒత్తాడు..."ఒరే బావా... విషయమేమిట్రా?" అనడిగాడు మళ్ళీ…

"మిడిల్ ఏజ్ క్రైసిస్ రా...శశి ఒక్కసారిగా మారిపోయింది...మా పెళ్లి టైముకి తను నన్నో దేముడి లా చూసుకునేది...నేనేమి చేసినా గొప్పే...కానీ గత రెండేళ్లగా చాలా మారిపోయింది...ఇంట్లో చిన్న చిన్న పనులు నాకు చెయ్యడం రాదనీ, నాకేమీ ఫామిలీ విషయాలు పట్టవనీ తినేస్తోంది...అక్కడ తో ఆగకుండా నన్ను సరిగా పెంచలేదని మా అమ్మ మీద విసుర్లు కూడాను...మొదట్లో ఇవన్నీ చిన్న విషయాలే అని వదిలేసే వాడిని...కానీ రాను రాను ఇవే జీవితమై పోయాయి...వంకాయలు కొనడం రాదు ఇలాగె ఉద్యోగం చేస్తున్నావా అంటూ వేళాకోళం చెయ్యడం మొదలయ్యింది...నేను ఒక పేరు పొందిన సిఏ ను కూరల కోసం అలాంటి మాటలు పడడం కష్టమే కదా" అని ఆపాడు

వీర్రాజుకు తన ఆలోచనలు తప్పేమి కాదని అనిపించింది...మాధవ్ గాడిలా తయారవడానికి శశి చాలానే శ్రమ చేసినట్టుంది

"మా బాబాయ్ వాళ్లతో మాట్లాడక పోయావా? నాకు ఫోన్ చేసినా బాగుండేది కదా" అన్నాడు…

"నీ మొహం...మీ బాబాయ్ వాళ్ళు ఇవన్నీ చిన్న విషయాలు అన్నీళ్ళల్లోనూ ఉండేవే...చూసి చూడనట్టు పో అన్నారు" అన్నాడు మాధవ్ చిరాగ్గా…

"మీ అమ్మ నాన్న ఏమంటారు?" అనడిగాడు వీర్రాజు…

 "నాన్న కలగ జేసుకోడు...మా అమ్మ దీనికి బాగానే కంట్రిబ్యూట్ చేస్తోంది" అన్నాడు మాధవ్…

 "అంటే?" అనడిగాడు వీర్రాజు…

 "శశి మా అమ్మ పెంపకాన్ని కామెంటు చేస్తే మా అమ్మ శశి పద్ధతులను తూర్పార బడుతుంది. ఇద్దరు పొద్దున్నే టిఫిన్లు అవీ తిని చిరుతిళ్ళు పక్కనే పెట్టుకుని పూర్వం సినిమాల్లో అభిమన్యుడు ఘటోత్కహచుడు కబుర్లు చెప్పుకుంటూ యుద్ధం చేస్తున్నట్టు మాటల బాణాలు వేసుకుంటారు...దాదాపు రోజులో సగం అలాగే గడిచి పోతుంది" అన్నాడు మాధవ్…

 "అంత ఖాళీ ఎలా దొరికింది?" అనడిగాడు వీర్రాజు…

 "పిల్లవాడు స్కూల్ కి వెడుతున్నాడు...వాడు నాలాగే కొంచం నెమ్మది...దాంతో ఇటు శశికి గాని అటు మా అమ్మకు గాని పెద్ద ముఖ్యమైన పనులు ఏమీ లేవు...కుదిరినంత సేపు బాణాలు వేసుకోవడం... తినడం పడుకోవడం పుస్తకాలూ చదువు కోవడం...ఇల్లు నరక ప్రాయమై పోయింది" అన్నాడు మాధవ్…

 "ఇవన్నీ నువ్వు ఆఫీసు లో ఉన్నప్పుడు కదా జరిగేది? టీవీ సీరియల్ లాగ వాళ్ళ యుద్ధాలు సాగినా నువ్వొచ్చేటప్పడికి శాంతిస్తాయి కదా" అనడిగాడు వీర్రాజు…

 "నేనొచ్చాక పద్దతి మారుతుంది...ఇద్దరు టైం షేరింగ్ లో చెరో చెవిలోను వాళ్ళెంత గొప్ప వాళ్ళో..ఎన్ని కష్ఠాలు పడుతున్నారో..రెండో పార్టీ వాళ్ళెంత బాధ్యత రాహిత్యం తో వ్యవహరిస్తున్నారో ఏకరువు పెడతారు...

నేను స్పందించక పొతే వాళ్ళ కోపం ఇంకా పెరిగి పోతుంది...రెండు వైపులనుంచి నా చేతకాని తనం ఎత్తి చూపబడుతుంది...ఇంటికెళ్తే నా ఆలోచనలు సాగనివ్వరు...పిల్లవాడితో ఆడుకోనివ్వరు...నాకు తిక్కోస్తుంది...చేతిలో ఉన్న వస్తువు విసిరికొట్టి బయటకు నడుస్తాను...నాలుగైదు రోజులు మాటలుండవు...గత రెండేళ్లగా ఇదే తంతు" అన్నాడు మాధవ్…

"నేను అర్ధం చేసుకో గలను...ఇవాళ పొద్దున్న శశి తో జనరల్ గా మాట్లాడాను...ఇంతకీ, ఈవిడ తో బంధం ఎలా ఏర్పడింది" అనడిగాడు వీర్రాజు…

"ఈవిడ నేను ప్రాక్టీస్ ప్రారంభించినప్పడినుంచి నా తోనే పని చేస్తోంది. చాలా నెమ్మదస్తురాలు, తెలివైనది ...ఆడిట్ అంతా తన చేతిమీద నడిపించేస్తుంది...తన జీవితం లో సమస్యలున్నాయి... పిల్లలు లేరు...కారణం నువ్వంటే నువ్వని ఇద్దరూ కొట్టుకుంటూ చాలా ఏళ్ళు గడిపారు...చివరికి ఈ కారణం చూపించి వాళ్ళాయన ఒక అమ్మాయి తో ఉండడం ప్రారంభించాడు...ఈవిడ ఒంటరిగా పోరాడుతూ గడిపింది...వయసు వస్తున్నగొద్దీ ఆవిడలో నిరాశ ఎక్కువైపోయింది...ఆ టైములో నాకు మనసులో మాట చెప్పుకునేందుకు తోడు అవసరమైంది...

ముందులో మేము జస్ట్ సమస్యలు మాట్లాడుకోవడం, ఒకళ్ళనొకళ్ళు ధైర్యం చెప్పుకోవడం మాత్రమే చేసే వాళ్ళం...ఒక సందర్భం లో ఇద్దరమూ భౌతికం గా దగ్గరయ్యాము" అని ఆపాడు మాధవ్…

"ఈ విషయం శశికి తెలియ కుండా ఎలా మేనేజ్ చేసావు?" అనడిగాడు వీర్రాజు…

"హైదరాబాద్ లో మేము జస్ట్ మాట్లాడు కోవడమే చేస్తాము...ఇవన్నీ ఊరు దాటితేనే...మా ఇద్దరికీ సెక్స్ పిచ్చి ఏమీ లేదు...ఆలా జరుగుతోంది...కానిస్తున్నాం..కానీ మాకు ఇదో వ్యసనం కాలేదు... అయితే ఈ బంధం మా జీవితాలని నాశనం చేస్తుందేమో అని ఇప్పుడిప్పుడే భయపడుతున్నాం" అన్నాడు మాధవ్…

వీర్రాజేమీ మాట్లాడ లేదు...తన చేతిలో ఉన్న గ్లాస్ ని తిప్పుతూ అందులో ఉన్న బంగారు రంగు ద్రవాన్ని చూస్తూ ఆలోచిస్తున్నాడు...

మాధవ్ కూడా ఆలోచనలో పడ్డాడు...

"ఇలాంటి సమస్యలు రకరకాలుగా డీల్ చెయ్యొచ్చు...మన మోహన్ గాడికి కూడా ఇలాంటి సమస్య వచ్చింది...వాడు కొన్నాళ్ళు ఇంటర్నెట్ స్నేహం చేసాడు...తనకొక అమ్మాయి దొరికింది...ఇద్దరూ దాదాపు రెండేళ్లు ఆలా చాట్ చేసుకుంటూ గడిపేశారు...తరువాత వాడికి రెండో బిడ్డ పుట్టడం తో ఇవన్నీ మూతపడ్డాయి...నువ్వు కూడా అలాంటిదేమైనా చెయ్యాల్సింది" అన్నాడు వీర్రాజు

"నాకు నీలాగా పదిమంది తో పరిచయాలు లేవు... తొందరగా కొత్తవాళ్లతో కలవ లేను…ఇది అనుకోకుండా జరిగిపోయింది...నేను కూడా సాగనిచ్చాను" అన్నాడు మాధవ్ ఆలోచిస్తూ…

ఒక అరగంట అలాగే గడిచింది...పెద్దగా నిట్టూర్చి వీర్రాజు "సరే, జరిగినదేదో జరిగింది... ఇంక ఇది ముందుకు సాగకుండా చూద్దాం" అన్నాడు…

"ఒక పని చేస్తాను...తనను కూడా పిలుస్తాను" అన్నాడు మాధవ్…

"సరే, ముగ్గురం కలిసి ఒక పరిష్కారం చూద్దాం...రమ్మను" అన్నాడు వీర్రాజు…కాసేపట్లో తను వచ్చింది…

"వీడు మా బావ వీర్రాజు...శశి వాళ్ల అన్నయ్య" అని పరిచయం చేసాడు…

"చెప్పారు సార్" అంది తను కొంచం భయంగా…

"భయ పడొద్దు...వీడు నా బాల్య స్నేహితుడు...తరువాత వాళ్ల చెల్లెలిని నాకిచ్చారు...మా ఇద్దరి మధ్య దాపరికలేమి ఉండవు" అన్నాడు మాధవ్…

"ఇది కావాలని చేసినది కాదండీ...ఆలా జరిగి పోయింది" అంది తాను సంజాయిషీ చెపుతున్నట్టు…

"పరవాలేదు...ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు" అనడిగాడు వీర్రాజు…

"మా అయన మీద కోపం తో నేను నా మీద వత్తిడి పెంచుకున్నానే గాని పరిష్కారం వెతుక్కోలేదు... అయన చాలా సింపుల్ గా తన దారి చూసుకున్నాడు...నేను కూడా అలాగే చెయ్య కుండా సెల్ఫ్ పీటీ తో నన్ను నేను హింసించుకుని, దాని నుంచి బయటకు రావడానికి మాధవ్ గారి స్నేహాన్ని వాడుకున్నాను...అది తప్పని ఇప్పుడనిపిస్తోంది" అంది తను…

"మా ఇద్దరికీ కూడా ఈ బంధం వల్ల కొన్ని మెట్లు దిగి మా జీవితాల స్థాయిని దిగజార్చేస్తున్నాం అనిపిస్తోంది" అన్నాడు మాధవ్…

అవునన్నట్టు తలాడించింది అతని స్నేహితురాలు…

"మీరు ఇంతవరకు మామూలు మెట్లు మాత్రమే దిగారు...ఇక్కడ నుంచి జారుడు మెట్లు మొదలవుతాయి...మీ అందరి నిరాశలు ఒక స్థాయి కి చేరితే ఊహాతీతమైన నిర్ణయాలు తీసుకుని అందరి జీవితాలు నాశనం చేసుకుంటారు" అన్నాడు వీర్రాజు…

"నిజమే నండీ... ఇది అనుకోకుండా దిగిన ఒక రొంపి మాత్రమే... మాకు కొంచం ఉపశమనం కలిగిన మాట నిజం కానీ అది పెయిన్ కిల్లర్ లాంటిది...నేను నా జీవితం లో ఉన్న నిజాలను అంగీకరించి ముందుకు వెళ్ళాలి...మోసపోయానని నా మీద నేనే జాలి పడడం తగ్గించుకోవాలని అనుకుంటున్నాను" అంది ఆవిడ. 

"మన జీవితాల్లో ఎన్నో మంచి పనులు మనం ఎంతో లోతు గా ఇబ్బందిలో ఉన్నప్పుడు లేదా అసంతృప్తి గా ఉన్నప్పుడు లేదా మన కోరిక ఏదైనా నెరవేరనప్పుడు జరుగుతాయి...ఇప్పుడు మీ ఇద్దరూ ఈ బంధం లోని ఇబ్బందిని గుర్తించి అసంతృప్తి గా ఉన్నారు. ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకోగలరు...కంగారు పడకండి" అన్నాడు వీర్రాజు 

అవునన్నట్టు తలాడించారు మాధవ్ అతని స్నేహితురాలూ

"మనం మన తప్పులనొప్పుకోవడానికి సిద్ధం కాక పొతే ఆ తప్పులకి కారణం బయట ప్రపంచం లో వెతుక్కుంటూ సమయం వ్యర్దం చేస్తాం...కానీ ఒక్కసారి మనం ఓడిపోవడానికి సిద్ధమైతే మన జీవితం లో జరిగే తప్పులకు కారణం తెలుస్తుంది...అదే మనకు దారి చూపిస్తుంది అంటారు స్కాట్ పెక్...మీరిద్దరూ మంచివాళ్ళు, సంస్కారవంతులు...అందువల్ల ఈ బంధం అందరినీ కాల్చేసే లోగానే మీరు బయటపడాలనుకుంటున్నారు" అన్నాడు వీర్రాజు  

"ఈ బంధం పెంచుకోవడం ఎంత తప్పో అర్ధమైంది...అనవసరంగా మాధవ్ సార్ ని కూడా ఇబ్బంది పెట్టాను" అందా అమ్మాయి

"తప్పేమీ లేదు...ఆడవాళ్లు జీవితాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు అందుకే వాళ్ల బంధాలు గట్టిగా ఉంటాయి...అంత సులభం గా తెగిపోవు...ఇప్పుడు మీరు ఒక దారిలోకి వెళ్లే స్థితప్రజ్ఞత సాధించారు...ఇకపైన మీ కార్యాచరణ ఏమిటి " అనడిగాడు వీర్రాజు

"విడాకులు తీసుకుంటాను...ఒక బిడ్డను పెంచుకుంటాను...ఆ రకంగా నా నిరాశనుంచి బయట పడటానికి ఒక మంచి దారి దొరుకుతుంది...అనవసరమైన స్వీయ జాలి తగ్గుతుంది అని నాకనిపిస్తోంది" అంది తను…

"మంచి నిర్ణయం...ఈ జరిగిన విషయాన్ని ఒక కలలా మర్చిపోండి...మీ ఉద్యోగం అలాగే సాగించండి... ఇక నుంచి మీ ఇద్దరు మీకున్న జీవిత సమస్యలు ఒకళ్లతో ఒకరు పంచుకోకండి... మీరు మీ అమ్మగారితోనో, అక్కతోనో మాట్లాడుకొండి...మాధవ్ గాడు శశి తో మాట్లాడే ఏర్పాటు వాడు చేసుకుంటాడు" అన్నాడు వీర్రాజు…

అక్కడితో సంభాషణ ముగిసింది... అందరూ కొంత సేపు నిశ్శబ్దం గా వాళ్ళ వాళ్ళ ఆలోచనల్లో దిగబడి కూర్చున్నారు...

తరువాత ఆ అమ్మాయి తన గదిలోకి వెళ్లి పోయింది...తన మొహంలో ఈ సమస్య కు పరిష్కారం కనిపించినందుకు సంతోషం కనిపిస్తోంది...

వీర్రాజు తన గదిలోకి వెడుతూ మాధవ్ ని కూడా రమ్మన్నాడు "ఆవిడ సమస్య సులభంగానే తీరిపోయింది...మీ ఇద్దరి దీ మూర్ఖమైన మోహం కాదు కాబట్టి విడిపోవడం కష్టం కాదు...ఇక మన సమస్య గురించి ఆలోచించాలి" అన్నాడు…

"ఏం చేద్దాం? అసలు శశి తో సంభాషణ ఎలా ప్రారంభించాలో అర్ధం కావటం లేదు...తను చాలా తెలివైనది...వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి తగిలించి సంభాషణ ముందుకు సాగ నివ్వదు...నేను చిరాకుపడి ఆ సంభాషణ నుంచి దూరం అయిపోతాను" అన్నాడు మాధవ్…

"అంటే ఇప్పుడు నువ్వు శశి దగ్గరకి వెళ్లి జరిగినదంతా చెప్పి తప్పై పోయింది అంటావా?" అనడిగాడు వీర్రాజు

"మరేం చెయ్యడం? అనడిగాడు మాధవ్…

"ఈ జరిగిన విషయం ఇప్పుడే శశికి చెప్పడం మంచి విషయం కాదు...తను ఇంకా నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది...కొచం ఆగుదాం" అన్నాడు వీర్రాజు…

"మరేం చేద్దాం...తను చాల దక్షత గల మనిషి...తనకో వ్యాసంగం కల్పించాలి" అన్నాడు మాధవ్

"ఇప్పుడు మా గురువనిపించావ్...అదే చెయ్యాలి" అన్నాడు వీర్రాజు ఉత్సాహంగా…

"తను ఇంట్లో కూర్చుని టైము గడపలేదు...తను టైము వాడుకోవడానికి ఎన్నో రకాల పనులు కల్పించుకునేది...రకరకాల వంటలు చెయ్యడం, యోగ క్లాసులు ఇలా ఎన్నో చేసేది... ఇప్పుడవేవి తనకు ఉత్సాహం కలిగించటం లేదు" అన్నాడు మాధవ్…

"తనేమైనా ఉద్యోగం చేస్తానని అందా" అనడిగాడు వీర్రాజు…

"ఉద్యోగం అనలేదు కానీ ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసులు పెడతానంటోంది… అవుననడానికి నేనే ఆలోచిస్తున్నాను" అన్నాడు మాధవ్

"అందులో సమస్య ఏమిటి?" అనడిగాడు వీర్రాజు…

"అదేమిటో కూడా నాకు అర్ధం కాలేదు...అందులో ఏం సంపాదిస్తుందో అర్ధం కాలేదు...మళ్ళీ ఆ పనులు సరిగా నడవటం లేదని గొడవ మొదలెడితే...ఉన్నదానితోనే సతమతమౌతున్నాం...ఈ తెలియని కొత్త సమస్య ఎందుకని" అన్నాడు మాధవ్

"నీ సిఏ బుర్రకి అవే తడతాయి...ప్రస్తుతానికి నువ్వు ఆ విషయమై ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు... తనకి ఏదో ఒక వ్యాపకం కలిగించే విషయం గురించి ఆలోచించు" అన్నాడు వీర్రాజు

"సరే అనమంటావా" అనడిగాడు మాధవ్…

"ఇప్పుడు కాదు...తనతో ఈ విషయాలు ఏమీ మాట్లాడకు...మామూలు గా ఉండు...శశి, మీ అమ్మ సంధించే అస్త్రాలు నీ ఓర్పు తో నిర్వీర్యం చేస్తూండు...నేనొక వారం లో వస్తాను అప్పుడీ విషయం నేనే కదలిస్తాను" అన్నాడు వీర్రాజు…

తనకి అప్పటికా సంభాషణ ముగిసింది...

ఈ విషయాలు కొంచం దార్లో పడుతున్నట్టు కనిపించడం తో వీర్రాజు లో అలజడి తగ్గింది... కానీ ఎప్పడికైనా ఈ విషయం తెలిస్తే శశి చేసే గొడవ గురించి కొంచం దిగులు గానే ఉంది...

మర్నాడు పొద్దున్న విమానం లో బెంగళూరు చేరిన వీర్రాజు ఆన్లైన్ ట్రైనింగ్ గురించి తన పరిచయస్తులతో వాకబు చేసాడు... అమెరికాలో తన స్నేహితులని కూడా కదిలించి చూసాడు...నాణ్యత గల ట్రైనింగ్ తయారు చెయ్యగలిగితే, ఆన్లైన్ క్లాసులు, ఇంకా రికార్డెడ్ ట్రైనింగులు చాలా బాగా నడుస్తాయని తేలింది…

అమెరికాలోని తన స్నేహితురాలైన మార్గరెట్, ఒక స్నేహితుడు క్లాడియో ఆ వ్యాపారం లో భాగస్వామ్యులవడానికి ముందుకొచ్చారు...

అదంతా మాధవ్ కి ఫోన్ లో వివరించాడు... అప్పటికే మాధవ్ ఇంటర్నెట్ లో కొంత పరిశోధన చేసాడు...సిఏ కాబట్టి ఆ వ్యాపారం గురించి తొందరగానే అర్ధంచేసుకున్నాడు...

ఇంక ఈ సమస్య మీద ఆఖరి మేకు దింపాలి అనుకున్నాడు వీర్రాజు ఒక పాత ఆంగ్ల సామెత గుర్తు తెచ్చుకుని...హైదరాబాద్ బయలు దేరాడు...

రైలు దిగి శశి ఇంటికి చేరగానే నవ్వుతూ ఎదురొచ్చింది శశి "ఎన్నాళ్ళయింది రా నిన్ను చూసి... వదిన్ని కూడా తీసుకు రాక పోయావా" అంది...

శశి మోహం ఏంతో తేటగా ఉంది...చక్కగా నవ్వుతోంది...ఇదేదో మంచి శకునమే అనుకున్నాడు వీర్రాజు…

ఏరా వీరా...నువ్వు మ్లేచ్చుల లో కలిసిపోయవనుకున్నాం...వెనక్కొచ్చి మంచి పని చేసావ్" అంది మాధవ్ తల్లి

ఇవేవి తానూహించిన ఘట్టాలు కావు...

శశి కాఫీ తేవడానికి వెళ్ళినప్పుడు ఈ మార్పుకి కారణం ఏమిటని మాధవ్ ని అడిగాడు...

"ఏమోరా... ఎలాగైనా మంచి విషయమే కదా అని మెదలకుండా ఉన్నాను" అన్నాడు…

స్నానం చేసి టిఫిన్ తింటూ "ఒరే తల్లిగాడూ, ఏమిటి సంగతులు...అనడిగాడు" వీర్రాజు…

"నేను ఆన్లైన్ ట్రైనింగ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను...మాధవ్ కి ఇష్టం లేదు...అంటే సరైన కారణమే చెప్పాడు...పిల్లవాడు నిర్లక్ష్యం అయి పోతాడేమో అని...ఈ వయసులో వాడిని అత్తగారి మీద వదలలేను కదా" అంది శశి…

"ఆలా ఏమీ అవదు, ఆన్లైన్ ట్రైనింగ్ కదా, మీ మేడ మీద గదిని ఆఫీసు రూమ్ గా మార్చు, నువ్విచ్చే ట్రైనింగ్ వాడి స్కూల్ టైం కి తగినట్టుగా ఏర్పాటు చేసుకో...ఎప్పుడైనా సమస్యలొస్తే మీ అత్తగారితో చర్చించు" అన్నాడు వీర్రాజు…

"నేను కూడా అదే అనుకుంటున్నాను...మేనేజ్ చేసుకో గలనని నమ్మకం ఉంది, మాధవ్ కొంచం సాయం చేస్తే సరిపోతుంది" అంది శశి...

"సాయం చెయ్యడానికి నాకేమీ అభ్యంతరం లేదు...కానీ నీ నాణ్యతా ప్రమాణాలు చాలా ఎక్కువ...నామీద నీ అంచనాలు తగ్గించు కోవాలి...నాకు చిన్నప్పటి నుంచీ ఇంట్లో పనులు అలవాటు అవలేదు...ఇప్పుడు చేసుకుంటే కొన్ని తప్పులు జరగొచ్చు...ఆ విషయమై మనం గొడవ పడాల్సి రావొచ్చు...అదంత మంచి విషయమేమి కాదు కదా" అన్నాడు మాధవ్…

"ముందు మీ ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఎలా ఉన్నవాళ్లను ఆలా అంగీకరించాలి...మాధవ్ గాడు నెమ్మదస్తుడు...భావుకుడు...వర్షం - కాఫీ - రొమాంటిక్ పాటలూ అది వాడి పర్సనాలిటీ...నువ్వు దూకుడు పిల్లవు...లాంగ్ డ్రైవ్ లో వెళ్తూ కిషోర్ కుమార్ పాటలు వినడం నీ పర్సనాలిటీ. ఈ పంధాలూ ఒకరి మీద మొరొకరు రుద్దకుండా అంగీకరించి కొంచం కొంచం గా సద్దుకుంటుంటే మంచింది...లేకపొతే ఇలాగే దూరాలు పెరుగుతాయి" అన్నాడు వీర్రాజు…

"సరేలేరా...విషయం అర్ధం అయ్యింది మొర్రో అంటున్నా లెక్చర్ లు దంచుతావేం...నీకీమధ్య గురుకాంక్ష పెరిగి పోయింది" అని వీర్రాజుతో అని మాధవ్ వైపుకి తిరిగి నేను కొంచం సద్దుకోవడం అలవాటు చేసుకుంటాను...నువ్వు కూడా కొంచం మెరుగ్గా పనులు చేసే ప్రయత్నం చెయ్యి" అంది శశి…

"సరే" అన్నాడు మాధవ్…

"ఒరేయ్ అన్నయ్యా నా బిజినెస్ లో నువ్వు పార్టనర్ గా ఉండాలి రా" అంది శశి…

"తప్పకుండా, నాతో బాటు ఒక ఇద్దరు అమెరికన్ మిత్రులను కూడా చేరుస్తాను, మనకి అమెరికా వ్యాపారం కూడా దొరుకుతుంది" అన్నాడు వీర్రాజు…

నెల తిరగ కుండా కంపెనీ మొదలు పెట్టేసింది శశి...కొన్ని ముఖ్యమైన కోర్సులు గుర్తించి, వాటి కోసం తయారవడం,రికార్డింగ్లు చేసుకోవడం, అమెరికా పార్టనర్లతో మాట్లాడడం తో హడావుడి గా గడుస్తోంది ఆమె సమయం...

యిప్పుడు ఇంట్లో పనుల్లో నాణ్యత మీద కన్నా పని అయిపోవడం మీద శ్రద్ధ పెరిగింది...అవి కేవలం మనుగడ కోసం మాత్రమే గాని జీవన్మరణ సమస్యలేమీ కాదని గుర్తించినట్టు అనిపిస్తోంది...

అత్తగారితో వాదన వల్ల కాలయాపనే గాని ఏమీ లాభం లేదని అర్ధం చేసుకున్న శశి ఎలాంటి వాదనకు తావియ్య కుండా పనులు చేసుకెళ్లి పోతోంది...

ఆరు నెలలు గడిచాయి...వ్యాపారం మెల్లిగా దారి లో పడుతోంది...

తన ప్రవర్తన చూసి వాళ్ళ అత్తగారు కూడా చాలా సంతోషిస్తున్నారు...ఒకసారి వీర్రాజుకి ఫోన్ చేసి "ఒరే వీరా, నువ్వొచ్చి వెళ్ళాక మీ చెల్లెల్లో చాలా మార్పు వచ్చింది...మళ్ళీ ముందర శశి మాకు దొరికింది...చాలా సంతోషం నాయనా" అంది…

వీర్రాజు కూడా చాలా సంతోషించాడు...తన వ్యాపారం హడావుడి లో పడిపోయాడు...

ఓక రోజు పొద్దున్నే శశి దగ్గర నుంచి కాల్ వచ్చింది "ఒరేయ్ అన్నయ్యా, నా సమస్యని పచ్చి పుండు చెయ్యకుండా సున్నితం గా పరిష్కరించావు…ఎలా సంభాళించాలో తెలియక సతమతమయ్యాను...నీతో మాట్లాడక నాకొక దారి దొరికింది...మాధవ్ ని చాలా ఇబ్బంది పెట్టాను, నేను కూడా ఇబ్బంది పడ్డాను...దాని వల్ల ఎవ్వరికీ లాభం లేదు అని అర్ధమయ్యేలా చేసావు...చాలా థాంక్స్ రా" అంది

"ఓరి గడుగ్గాయి...నీకు జరిగిన వ్యహారమంతా తెలుసా?" అనడిగాడు వీర్రాజు

 "ఏ వ్యవహారం? నాకేం తెలుసు" అని ఫోన్ పెట్టేసింది శశి...గడుసు పిల్లే అనుకున్నాడు వీర్రాజు మురిపెంగా నవ్వుకుంటూ 

 

  



Rate this content
Log in

Similar telugu story from Drama