శ్రీనివాస్ మంత్రిప్రగడ

Drama Classics Inspirational

4.8  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Drama Classics Inspirational

మారిన మనిషి

మారిన మనిషి

14 mins
596


తూర్పు తెలతెల వారుతుండగా మెలకువ వచ్చింది కోటేశ్వర రావు కు…కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అమ్మవారి పటానికి నమస్కరించి లేచాడు...తలుపు తీసుకుని వెనక డాబా మీదకు నడిచాడు...గలగలా పారుతున్న గోదావరి పాయ కనువిందు చేస్తోంది...

కార్తీక మాసం...పొద్దు పొడుస్తోంది...ఆకాశం నారింజ రంగునుంచి విడివడుతున్నందుకేమో తెల్లబోతూ నిస్సహాయంగా చూస్తోంది...దట్టంగా అలుముకున్న మంచు చిక్కటి గోదావరి నీళ్ళమీద నుంచీ, అప్పుడప్పుడే పాలు పోసుకుంటున్న పచ్చటి పొలాలమీద నుంచీ నెమ్మదిగా వీస్తున్న గాలి తెమ్మెరల తాకిడికి నాట్యం చేస్తోంది....ఆ విన్యాసాలు చూస్తూ హర్షధ్వానాలు చేస్తున్నట్టుగా చుట్టూ ఉన్న చెట్లూ పొలాల్లోని మొక్కలూ తలలాడిస్తున్నాయి…

పక్కవీధి శివాలయం లోంచి లింగాష్టకం బాలు గారి అమర గాత్రం లో వినిపిస్తూ కార్తీక మాసపు పవిత్రతను పెంచుతోంది...అయన శివైక్యం చెందినా అయన పూయించిన స్వర పుష్పాలు ఇప్పటికీ భగవంతుని సేవలో తరించి పోతున్నాయి...మహానుభావుడు కారణజన్ముడు అనుకున్నాడు కోటేశ్వర రావు...

పక్క వీధిలోని శాంతమ్మ గారింట్లోంచి సంగీతం నేర్చుకుంటున్న పిల్లలు పాడుతున్న కళ్యాణి రాగం లోని గీతం “కమల జాదళ విమల సునయన...కరివరద కరుణాంబుధే...కరుణ శరధే కమాలా కాంతా”... అంటూ శృతిశుద్ధంగా వినిపిస్తోంది...

ఇళ్లముందు ఇల్లాళ్లు చల్లుతున్న కళ్ళాపి శబ్దాలు కూడా శృతి తప్పకుండా ఆ ఉదయపు శోభను ద్విగుణీకృతం చేస్తున్నాయి...

మధ్య మధ్యలో వివిధ రకాల పక్షులు పక్షుల కిలకిలారావాలు సృష్టి సంగీతాన్ని పరిపుష్టం చేస్తున్నాయి…

కాల కృత్యాలు తీర్చుకుని డాబా మీద కుర్చీలో కూర్చున్నాడు కోటేశ్వర రావు...

వడి వడి గా ప్రవహిస్తున్న గోదావరి అతనకి తన జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చింది...చాలా కాలం తను కూడా ఆ ప్రవాహంలో కొట్టుకు పోతున్న చెక్కముక్కలా జీవితాన్ని నియంత్రించకుండా కొట్టుకు పోయాడు...ఇప్పుడు ఒడ్డున పొడిగా నిశ్శబ్దంగా పడి ఉంది ఆ జీవన గమనాన్ని తనది కాదన్నట్టు చూసే అవకాశం దొరికింది అనుకున్నాడు...

ఇంతలో గుమ్మంలో చప్పుడైంది...పనిమనిషి రంగి వచ్చి కప్పులో కాఫీ ఇచ్చింది...

"వచ్చావా రంగీ" అంటూ పలకరించాడు కోటేశ్వర రావు"ఆయ్...మీరు పొద్దున్నే లేస్తారు గదండి, కాఫీ అవసరపడుద్దని తెచ్చాను" అంది రంగి నవ్వుతూ

"ఏ జన్మలోనో నువ్వు మా అమ్మవైయుంటావే" అన్నాడు కోటేశ్వర రావు కూడా నవ్వుతూ...

"అయ్యో పిచ్చిమారాజా...ఇంతోటి కాఫీకి అంత మాటలనాలా...మీ పూజకు పువ్వులు కోసుకొచ్చాను...లోపల బల్ల మీద పెట్టాను...చూసుకోండి"అంది రంగి ఏ భావము చూపించకుండా

తన బాల్యం యవ్వనం జ్ఞాపకం వచ్చాయి కోటేశ్వర రావు కి...చిన్నప్పుడే తల్లి తండ్రులు పోయారు....మేనమామ పిల్లల్తో బాటు కలిసిమెలిసి పెరిగాడు...మామయ్య రెండో కూతురు అను అంటే తనకి ప్రత్యేకమైన ఇష్టం ఉండేది....అను అలాంటిది మరి...మనసులో మాట చెప్పకుండానే గ్రహించేసేది...తను రాసిన కవితలని శ్రద్ధగా వినేది...ఇద్దరూ సాహిత్యం గురించీ, సంగీతం గురించీ, సినిమాల గురించీ గంటలు గంటలు మాట్లాడుకునేవారు... రాత్రిళ్ళు మేడ మీద కూర్చుని ట్రాన్సిస్టర్ లో పాత హిందీ సినిమా పాటలు వింటుండేవారు...ఆ రోజులే వేరు...గట్టిగా నిట్టూర్చాడు

"అయ్యగారూ, నా పని అయిపొయింది...అన్నం వండేసాను...కూర పప్పు కూడా పడేసాను... వెళ్తున్నాను" అంది రంగి లోపలనుంచి

"శుభం...వెళ్ళిరా...నీ కొడుకు నేనిచ్చిన పుస్తకం చదివాడా?" అన్నాడు కోటేశ్వర రావు…

"లేదయ్యా...నిన్న రోజంతా టీవీ ముందే...ఇవాళ మీదగ్గరకు వస్తానన్నాడు...పుస్తకం అర్ధం కావడం లేదంట" అంది రంగి

"సరే రానీ...వాడికి శ్రద్ధ తగ్గిపోతోంది...నేను ఇచ్చిన పుస్తకం లోని కథ చెప్పేస్తాను...అప్పుడు చదవడం సులభమౌతుంది" అన్నాడు కోటేశ్వర రావు

రంగి వెళ్లి పోయాక పాతకాలం ఆలోచనలు ముసురుకోవడం ప్రారంభించాయి...అను దూరమవడం...కళ్యాణి తో తన వివాహం...కొడుకు చంద్ర పుట్టడం...అమెరికా జీవితం...కళ్యాణి మరణం అన్ని సినిమా రీల్ లాగ తిరిగాయి...

మనిషికి భౌతికమైన తోడు దొరుకుతుంది...ఈ ఊళ్ళో ఈ రంగీ, ఆవిడ కొడుకూ, ఉరి పెద్దలూ అందరూ తనకు బంధువులే కానీ తన మనసులో మాట చెప్పుకోవడానికి ఒక్కరూ లేరు...ఈ ఒంటరితనం కష్టమే అనుకున్నాడు...

అయినా ఈ మానసిక ఒంటరితనం అను దూరమైనప్పడి నుంచి తనకు అనుభవమే...కళ్యాణి చాలా మంచిది కానీ తనలా భావుకురాలు కాదు...చాల ప్రాక్టికల్...తన మనసులో వచ్చిన గొప్ప భావనలను కొట్టి పడేసేది...ఆలా ఎన్ని గంటలు అవే విషయాలు మాట్లాడతావు...నీ పనికి సంబంధం లేని పుస్తకాలు చదువుతూ ఉంటావు ఎందుకు అనడిగేది... నవ్వుకున్నాడు...

స్నానం చేసి పూజకు కూర్చున్నాడు...శివుడికి సంబంధించి తనకు జ్ఞాపకమున్న స్తోత్రాలన్నీ చదువుకున్నాడు...మనసు తేలిక పడలేదు...ఈ అర్ధం లేని జీవితం అవసరమా? పొద్దున్నే లేస్తే ఎందుకోసం లేచామో అర్ధం కాదు...ఏదైనా పని చెయ్యాలంటే ఎందుకో తెలియదు...ఇలా గాలికి కొట్టుకు పోతూ ఎన్నాళ్ళు? అనుకున్నాడు...

 తన గోడు ఎంత చెప్పుకున్నా శివుడికేమి పట్టదు...ఆయనకు ఇలాంటి ఆపన్నులెందరో... అయినా అయన శక్తికి అది కష్టమేమి కాదు...నాలోనే ఎదో లోపం ఉందా? ఇంకా శివానుగ్రహానికి సరిపోయే పరిస్థితులు రాలేదా? క్రితం జన్మ రుణాలు ఇంకా తీరా లేదా? కోటేశ్వర రావు మనసు పరి పరి విధాల పోతోంది...

ఆ ఆదిభిక్షువును మనం ఏమీ అడగకూడదు...ఆయనే ఎప్పుడో ఒకప్పుడు సమయం చూసి అనుగ్రహిస్తాడు అనుకున్నాడు...

బట్టలు వేసుకుని రోజూలాగే గుడివైపుకి నడిచాడు...పొద్దుటినుంచి కొంచం నిరాశాజనకమైన ఆలోచనల తో సతమతమౌతున్న కోటేశ్వరరావు కొంచం మార్పు దొరికితే బాగుండును అనుకున్నాడు...ఇలాంటి పరిస్థితి లో అను తన దగ్గరుంటే?...తనతో బాటు గా మంచి సినిమాలు చూస్తూ...వాటి గురించీ వాటిలోని పాటలను గురించీ చర్చించు కుంటూ అద్భుతం గా గడిపే వాళ్ళం...

రాత్రి సినిమాలో పాటలు వింటూ ఆ సాహిత్యం కలిగించిన పారవశ్యం పంచుకోవడానికి ఎవరూ లేక ఎంతో బాధ పడడం గుర్తుకు వచ్చింది...

గుడికి చేరాడు...

శివుడ్ని దర్శించుకుని తన చేత్తో కాస్త జలాభిషేకం చేసి ప్రదక్షణ చెయ్యడం ప్రారంభించాడు... భారత దేశంలో మనం సవ్య దిశలో ప్రదక్షిణ చేస్తాం...ఎందుకంటే మనం ఈ భూమిలోని ఉత్తరార్ధ గోళం లో ఉన్నాం కదా...దక్షణార్ధ గోళం లో ఉన్న దేశాల్లో అపసవ్యంగా ప్రదక్షణ చేయాలట…

ఈ దిశలూ...నమస్కారాలూ...అభిషేకాలూ ఇవన్నీ మనుషుల సంతృప్తి కోసమా లేక నిజం గా దేవుడు అవన్నీ గమనించి మనుషుల్నిఉద్ధరిస్తాడా? ఏమో...మానసిక సంతృప్తి అన్నిటి కంటే ముఖ్యమైన అవసరం అనుకున్నాడు...

ప్రదక్షణలు చెయ్యడం ప్రారంభించాడు...

కార్తీకమాసం కావడం తో గుడి నిండా మనుషులే...కోటేశ్వరరావు చేస్తున్న ప్రదక్షిణలకు అడుగడుగునా ఎవరో ఒకరు అడ్డు తగులుతూనే ఉన్నారు...దాని వల్ల అతనికి విసుగేమీ కలగలేదు...మనుషులు రకరకాల స్థాయిల్లో ఉంటారు...కుదిరితే వాళ్ళని పైకి తీసుకెళ్లాలి...లేకపోతే వాళ్ళ దారిన వాళ్లనే పరిణామం చెందనివ్వాలి...వాళ్ళని మన అద్దాల్లోంచి చూసి నిర్ధారించేస్తూ పొతే ఇంక దానికి అంతెక్కడా లేదు అనేది అతని తత్త్వం…

ఆలోచిస్తూ తిరుగుతున్నాడు...మూడో ఆవృతం చేస్తున్నప్పుడు ఒక పక్కగా కూర్చున్న ఒక పెద్దావిడ ఎక్కడో తెలిసినట్టనిపించింది...ప్రదక్షిణ పూర్తిచేసుకుని గట్టుమీద కూర్చుని ఈ ఊళ్ళో తనకు తెలిసినట్టుండే వాళ్లెవరుంటారో అని ఆలోచించ సాగాడు...

అంతలోనే ఆ తెలిస్తినట్టున్నావిడ అటుగా వచ్చింది...ఆ విగ్రహం...నడక చూసి ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు...ఆవిడ అను...

"అనూ" అంటూ పిలిచాడు...

అను కూడా ఆశ్చర్య పోయింది...తనకస్సలు పరిచయం లేని ఈ ఉరికి రావడం ఇదే మొదలు... ఇక్కడ తనను తన చిన్నతనం లో పిలిచే పేరుతొ ఎవరు పిలుస్తున్నారు?

తల తిప్పి చూసింది...నెరిసిన జుట్టు, కొద్దిగా తెలుపు నలుపుగా ఉన్న గడ్డం...జుట్టు రాలిపోవడం వల్ల వైశాల్యం పెరుగుతున్న నుదురు...అతన్ని గుర్తు పట్టలేక పోయింది...

"నేను అనూ...కోటేశ్వరరావు ను...గుర్తుపట్టలే?" అన్నాడు నవ్వుతూ…

గతుక్కు మంది అను...ఈ ఊహించని కలయిక తనకు సంతొషాన్నిచ్చిందో లేదో ఆవిడ మోహంలో కనిపిస్తున్న భావనలను బట్టి చెప్పలేం...కొద్దిగా సంభాళించుకుని "బావా...నువ్వా? ఇక్కడేమిటి? నువ్వు అమెరికాలోనే ఉండిపోయావని విన్నాను" అంది...

" అవును చాలా కాలం అమెరికా లో ఉండిపోయాను...కళ్యాణి మరణం తరువాత ఇంక అక్కడ ఉండలేక పోయాను...ఈ ఊళ్ళో నా చిరకాల మిత్రుడు ఉన్నాడు...అతని సహాయంతో ఒక ఇల్లు కొనుక్కుని ఇక్కడ ఉంటున్నాను" అన్నాడు కోటేశ్వరరావు...ఈ అనుకోని అనూ సాక్షాత్కారం వల్ల అతను ఊహించలేనంత సంతోషంగా ఉన్నాడు...ఇద్దరూ గుడి బయటకు నడిచారు...

"ఇక్కడకెలా వచ్చావు అనూ? ఇప్పుడెక్కడికి వెడతావు?" అనడిగాడు

"నేను హైదరాబాద్ లోనే ఉంటున్నాను బావా...ఈ పక్క ఊళ్ళో తెలిసినవాళ్ళ అమ్మాయి పెళ్లి అంటే వచ్చాను...అక్కడెలాగూ ఒంటరి జీవితమే కదా" అంది ఏ భావమూ చూపించకుండా…

"అదేమిటి? మీ ఆయనేరి? నీకిద్దరు కూతుళ్లు కదా? వాళ్ళెక్కడున్నారు?" అనడిగాడు కంగారుగా…

"అయన పోయి ఆరేళ్ళయింది బావా...పెద్దమ్మాయి ఆస్ట్రేలియా లో ఉంటోంది...రెండోది ఈ మధ్యనే అమెరికానుంచి వచ్చేసింది...వాళ్ళు బెంగళూరులో ఉంటున్నారు ...కూతురింటికి వెళ్లి ఉండలేను కదా...అందుకని నా ఇంటిలో నేను" అంది...

"అయ్యో...ఇంత అన్యాయం జరిగిందా… నేను నా ప్రపంచం లో కూరుకు పోయి బతికాను... ఇవేవీ నాకు తెలియదు "అన్నాడు బాధగా...

"ఇవి న్యాయాన్యాల విషయాలు కాదు బావా...యోగాలు" అంది అను…

"చాలా బాగా చెప్పావు...ఇప్పుడు అర్జెంటు గా చేసే పని ఏమీ లేకపోతే మా ఇంటికి రా...భోజనం చేసి వెడుదువు గాని ...నేను నిన్ను పక్క ఊర్లో దిగబెడతాను" అన్నాడు కోటేశ్వరరావు…

అను తనతో వచ్చిన ఇద్దరు ఆడవాళ్లకు ఈ విషయం చెప్పి వాళ్ళను పంపించేసి కోటేశ్వరరావు తో బయలుదేరింది...

ఊరి సంగతులు...ఆమధ్య వచ్చిన వరదలు లాంటి విషయాలు ఒకదానికొకటి పొంతన లేకుండా చెప్తూ ఇంటికి దారి తీసాడు కోటేశ్వరావు...

దార్లో కనిపించిన ఒక కుర్రవాడిని పిలిచి "ఒరే...నువ్వు పరుగెత్తుకుంటూ వెళ్లి రంగిని నేను రమ్మన్నానని చెప్పి పిల్చుకురా" అన్నాడు..."అలాగే అయ్యా" అంటూ తుర్రు మన్నాడు కుర్రాడు…

"రంగి ఎవరు బావా? నీ కలల రాణి జమునా?"నవ్వుతు అడిగింది అను పాతకాలం సినిమా నవరంగ్ ని గుర్తు చేస్తూ… 

"రంగి మా అమ్మ పునర్జన్మ" అన్నాడు కోటేశ్వరరావు కూడా నవ్వుతూ…

"నువ్వేం మారలేదు బావా...ఏ విషయమైనా భయంకరమైన మెలోడ్రామా లేకుండా ఉహించుకోలేవు" అంది అను... 

నవ్వాడు కోటేశ్వరరావు..."ఈ జీవితానికి బలం అదే అనూ" అంటూ ఇంటి మెట్లు ఎక్కసాగాడు...

"నువ్వుండేది పైనా...కింద ఇంట్లో ఉండొచ్చు కదా బావా...ఈ వయసులో మెట్లు ఎక్కడం అవసరమా?" అంది అను

"ఈ వయసు అంటే? నాకు ఇంకా అరవైఏళ్ళే...ఇంకా ముసలివాడిని కాలేదు" అన్నాడు కోటేశ్వరరావు

నవ్వుతూ పైకొచ్చింది అను...

తాళం తీసి లోపలి వెళ్లి వెనుక గుమ్మం తెరిచాడు కోటేశ్వరరావు...అక్కడ కుర్చీలో కూర్చుని కొంచం దూరంలో వేగంగా పారుతున్న గోదావరిని చూస్తూ "చాలా బావుంది బావా...మంచి ఏర్పాట్లు చేసుకున్నావు" అంది

అంతలో రంగి వచ్చింది "అయ్యగారూ...మీ అనుఅమ్మగారొచ్చారా" అంటూ నవ్వుతూ లోపలకి వచ్చింది

"అవును రంగీ...అనుని మళ్ళీ కలుస్తానని, నా ఈ ఇంట్లో కి తీసుకొస్తానని అస్సలనుకోలేదు" అన్నాడు కోటేశ్వరరావు ఆనందంగా

"ఈవిడేనా మా అత్తయ్య"అంది అను నవ్వుతూ…  

"పొండమ్మా మీరు కూడాను...ఆ పిచ్చిమారాజు ఎదో అంటూ ఉంటాడు...బంధాలు కలపకుండా అయన ఎవ్వరితోను మాట్లాడలేడు...ఎదో నాలుగు మెతుకులు ఉడకేసి పడేస్తాను దానికే ఎంతో సంతోషపడిపోతాడీయన" అంది రంగి…

"అయితే రంగీ చెప్పకుండానే నన్నెలా గుర్తుపట్టావు" అడిగింది అను…

"మీగురించి తలుచుకోని రోజే లేదమ్మా...నాకు తెలిసిన ఈ మూడేళ్ళలో అయన భార్యగారి గురించి గాని, అబ్బాయి గురించి గాని ఏమీ మాట్లాడ లేదు కానీ రోజూ మీ గురించే...అను ఆలా అనేది...అను ఇలా చేసేది...మేమందరము మీరు ఆకాశంలో ఒక దేవత అనుకునేటంతగా మాట్లాడాడు ఈయన" అంది రంగి కోటేశ్వరరావు వైపుకి చూస్తూ…

నెమ్మదిగా నవ్వింది అను...ఏమీ అనలేదు…

"రంగీ, అనుకిష్టమైన కూర వండవే...ఇవాళ మనం మంచి భోజనం పెట్టాలి" అన్నాడు కోటేశ్వరరావు

"ఇంట్లో కూరలు లేవయ్యా...ఒక్కనిముషం టైమిస్తే నేను తెచ్చేస్తాను" అంది రంగి

"ఒద్దు, నువ్వు అన్నం, పప్పూ చేస్తూండు...నాకోసం వండినవి తక్కువవుతాయి...నేను కూరలు తెస్తాను" అంటూ బయల్దేరాడు కోటేశ్వరరావు

"ఒక్క క్షణం కూర్చోండమ్మా" అంటూ వంటపనిలో పడింది రంగి

లోపలగదిలోకి వచ్చి అటూ ఇటూ చూడసాగింది అను...చాలానే పుస్తకాలూ పోగేసాడు...తెలుగు, ఇంగ్లీషు పాత సాహిత్యం...పాటల సీడీలు చూసింది...తలత్, హేమంత్ కుమార్, ఘంటసాల, ఎస్పీబీ, పిబిస్...

తను కోటేశ్వరరావు నుంచి దూరమై దాదాపు ముప్పైఅయిదేళ్ళు కావొస్తోంది...ఈ కాలంలో తన వివాహం, ఇద్దరు కూతుళ్లు, భర్త మరణం...తన మీద ఎంతో ప్రభావాన్ని చూపించాయి...జీవితం యొక్క లోతులు తెలిసివచ్చాయి...

ఈ బావగాడు మాత్రం అక్కడే ఆగిపోయినట్టుంది...కొత్త జీవితం, మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులు ఇవేవీ అతనికి పట్టినట్టు లేదు...అదృష్టవంతుడు అనుకుని నవ్వుకుంది అను...

రంగి వండిన భోజనం చాల బాగుంది...

భోజనాలు చేసి ఇద్దరూ డాబా మీద మడత మంచాలేసుకుని నడుములు వాల్చారు...

 శీతాకాలమేమో ఎండ పోకడ తెలియట్లేదు...ఇంటి పక్కనే ఎత్తుగా పెరిగిన కొబ్బరి చెట్లు నీడనిస్తున్నాయి...మధ్య మధ్యలో ఆ కొబ్బరి చెట్ల మీదనుంచి పిందెలు రాలిపడుతున్నాయి...

పారుతున్న పంట కాలువలో గోదావరి గల గల శబ్దాలు శృతి శుద్ధం గా ఉండడమే కాకుండా ...ఏదో లోకాలకు తీసుకెళ్లే నేపధ్య సంగీతంలా అనిపిస్తోంది...

"అనూ, నువ్వు రావడం ఒక కల లాగా ఉంది...నీ జీవితం ఇలా అయిపోయిందేమిటి? మీ అయన డాక్టర్ కదా, అతను అర్ధాంతరం గా పోవడం ఏమిటి? అతను పోయాక ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసేవు...మాకెవరికైనా తెలిసినా సాయం వచ్చే వాళ్ళం కదా" అన్నాడు కోటేశ్వరరావు...

"జీవితం కల కంటే విచిత్రం గా ఉంటుందని నువ్వే అనేవాడివి కదా బావా...నీ జీవితం మాత్రం ఏం బాగుందని? ఒక్కడివి ఇక్కడ ఈ తెలియని ఊళ్ళో పడున్నావు" అంది అను బాధగా

"నిజమే అనూ, నాకొక్కడే కొడుకు...అమెరికాలో ఉండిపోయాడు...అక్కడే పెళ్లి చేసుకున్నాడు... వాళ్ళ జీవితం ఎంతో వేగవంతం గా ఉంటుంది...మన నెమ్మది జీవితం వాళ్లకు ఇబ్బంది" అన్నాడు కోటేశ్వరరావు

"మనది సరళమైన జీవితం బావా...ఇప్పడి పిల్లలిది సంక్లిష్టమైన జీవితం...ఆ రెండింటిని ఒక్క గాటికి కట్టెయ్యలేము...మనం వేగంగా వెళ్లాల్సిన రోడ్డులో నెమ్మదిగా వెళ్లే రకం...మనం వాళ్ల కాళ్లకు చేతులకు అడ్డం పడుతుంటాము...వాళ్ళ హడావుడి లో మన సమస్యలని గుర్తించి ఆగి ఆలోచించాలనుకోవడం ఒక రకంగా మన స్వార్ధమే" అంది అను

"దాని పైన మనకు ఇతర సమస్యలు లేకపోవడం ఒక పెద్ద సమస్యగా తయారయింది" అన్నాడు కోటేశ్వరరావు

"అదేమిటి బావా...నువ్వు మాట్లాడుతున్నది తెలుగేనా" అంది అను నవ్వుతూ... 

"అంటే, మనకు డబ్బు సమస్య లేదు...దాంతో రేప్పొద్దున ఎలా అనే సమస్య లేదు...ఒక గమ్యం లేని జీవితం...అదీ ఒక సమస్యే కదా" అన్నాడు కోటేశ్వరరావు కూడా నవ్వుతూ...

"మన జీవితంలో మూడింతలు అలాగే బతికాము కదా బావా...అది గతించిపోయిన గతం... ఇప్పుడు మనం ఈ వయసులో మన జీవితాలకు అర్ధం ఏమిటో కనుక్కోవాలి...మనం నేర్చుకున్న జీవిత పాఠాలను ఇప్పడి కాలం పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం చెయ్యడం ఒక దారి" అంది అను

ఒక్కక్షణం నివ్వెర పోయాడు...అను ఏమి మారలేదు...చిన్న చిన్న మాటలతో అనంతార్ధం వచ్చే సందేశాలివ్వగలిగే తన పధ్ధతి అలాగే ఉంది...చాలా సంతోషించాడు...

"నిజమే అనూ...నేను నీటి ప్రవాహంలో కొట్టుకు పోతున్న కట్టెలా బతుకుతున్నాను ...కానీ ఆ విషయం గమనించకుండా నేను ఒడ్డున కూర్చుని జీవితాన్ని చూస్తున్నానని సద్ది చెప్పుకుంటున్నాను...నా జీవితంలోని నిరాశకు అదొక ప్రముఖ కారణమని ఇప్పుడనిపిస్తోంది... నువ్వు ఎప్పటిలాగే ఇప్పుడు కూడా మంచి స్ఫూర్తి దాయకమైన మాటలు మాట్లాడతావు" అన్నాడు కోటేశ్వరరావు

నవ్వి ఊరుకుంది అను...

సాయంత్రం అనుని పెళ్లి ఇంట్లో దింపి వచ్చిన కోటేశ్వరావు కు మనసు మనసులో లేదు...రాత్రి నిద్ర పట్టలేదు...ఆలోచనలన్నీ తన చిన్నతం, పెరుగుతున్న వయసులోని ఆశ నిరాశలు... తనను అనునయిస్తూ అను మాట్లాడిన మాటలూ అన్నీ మాటి మాటి కి గుర్తుకొచ్చాయి...

మర్నాడు ఉదయం రంగి వస్తూనే "అను అమ్మ వెళ్లిపోయిందా అయ్యా" అనడిగింది...

"అవునే...పక్క ఊళ్ళో పెళ్ళికి వచ్చింది... పెళ్లి అవగానే వెళ్ళిపోయింది" అన్నాడు కోటేశ్వరరావు

అతని గొంతులో కొంచం విషాదం ధ్వనించింది...

అది పసిగట్టిన రంగి "ఒక రెండు మూడు రోజులుండమనక పోయారా బాబూ...ఆమెది కూడా ఒంటరి జీవితమే కదా" అంది

"అనుకున్నానే...కానీ తను ఏమి ఉత్సాహం చూపించ లేదు...నాకు అడగడానికి ధైర్యం చాల లేదు" అన్నాడు కోటేశ్వరరావు

"చాల్లే బాబూ...మీరేమైనా చిన్న పిల్లలా...జీవితపు చివరి అంకంలోకి వచ్చేసారు...ఇద్దరూ ఒంటరి వాళ్ళయిపోయారు...ఒకరి ఒకరు తోడుగా ఒక రెండు మూడు రోజులు గడిపితే తప్పేమిటంటా" అనడిగింది రంగి

ఏమనాలో అర్ధం కాలేదు కోటేశ్వరరావు కి "సరేలే" అంటూ నిట్టూర్చి స్నానానికి లేచాడు...

తరువాతి రెండు రోజులు అన్యమనస్కంగా గడిపాడు కోటేశ్వరరావు...రంగి అంతా గమనిస్తూనే ఉంది...

మూడోరోజు వస్తూనే "బాబూ...నేనొక్కమాటంటాను ఏమి అనుకోరు కదా" అంది...

"నువ్వు మా అమ్మవే...ఏమన్నా నాకోసమే చెప్తావు...చెప్పు"అన్నాడు కోటేశ్వరరావు

"మీరూ ఒంటరి వారైపోయారు...అను అమ్మ కూడా ఒంటరే...మీ ఇద్దరూ పెళ్లి చేసుకోకూడదూ" అనడిగింది...

అకస్మాత్తుగా అంత సూటి ప్రశ్నను ఊహించని కోటేశ్వరరావు అవాక్కయ్యాడు...ఏమీ అనలేదు... ఆలోచనలో పడ్డాడు...అను వచ్చి వెళ్ళినప్పడినుంచి తనలోని నిరాశ నిస్పృహ సూచించేది ఇదేనా? ఈ వయసులో ఇది అవసరమా?...ఆందోళనలో పడిన కోటేశ్వరరావు మనసు పరిపరి విధాల పోతోంది...

"ఏమిటే నువ్వనేది...అది జరిగే పనేనా? అనుకి నేను ఇవ్వగలిగే ధైర్యం, సంతృప్తి ఏమీ ఉండవు... నాకు మాత్రం తనవల్ల మనశ్శాంతి దక్కొచ్చు...అలాంటి పరిస్థితి లో నేను అనుని చేసుకోవడం స్వార్ధం అవుతుంది కదా" అన్నాడు

"ఎందుకవుతుంది బాబూ? ఆవిడ గడుసుది...మనసులో మాట బయట పడనివ్వలేదు...కానీ ఒంటరి జీవితం మీకెంత కష్టమో ఆవిడగారికి కూడా అంతే కష్టం...మీరూ చాలా మంచి వారు... అందరి మంచి చెడ్డలు కనిపెట్టి ఉంటారు అలాంటిది మీరు ఎంతో ప్రేమించిన అను అమ్మకు మంచి చేయలేరా" అనడిగింది రంగి

"సరేలే...నేను కొంచం ఆలోచించుకోనీ...అందాకా ఈ మాట ఎక్కడ అనకు" అన్నాడు కోటేశ్వరరావు సంభాషణకు ముగింపు పలుకుతూ...

"సరే నాకేం పట్టింది...నేనేమీ మాట్లాడను" అంది రంగి ముసిముసి నవ్వులు నవ్వుతూ…

తరువాతి రెండు రోజులూ కోటేశ్వరావు కు ఒంటిమీద స్పృహ లేదు...ఎప్పుడూ అను గురించిన ఆలోచనలే...ఒక్కోసారి తన పరిస్థితికి తనకే ఆశ్చర్యం వేసేది... మరోసారి అనుని పెళ్లి చేసుకోవడం మంచి ఆలోచనే వెంటనే వెళ్లి మాట్లాడాలి అనిపించేది... ఇంకోసారి అకస్మాత్తుగా ఒక పెద్ద శక్తి తనను ఆవరించినట్టు అను ఆవరించేది...తను యువకుడి గా అనుని ప్రేమించినప్పుడు కూడా ఇలాంటి భావనలు కలగలేదు...తన పరిస్థితి తనకే అగమ్యగోచరంగా అనిపించింది...

పరస్పర విరుద్ధమైన ఆలోచనలో కొట్టుమిట్టాడుతున్న కోటేశ్వరరావు ను చూసి జాలి పడిన రంగి "బాబూ...ఎంతకాలం ఆలోచించినా మీరు ఈ విషయాన్నీ తేల్చుకోలేరు...ఒక పని చెయ్యండి... పుజారయ్యగారు మీ స్నేహితుడే కదా...అయన సలహా తీసుకోండి...మిమ్మల్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని అయన కూడా ఇంతకు ముందు చాలాసార్లు అన్నారు...అంచేత ఈ విషయం ఆయనకు సంతోషాన్నిస్తుంది గాని ఎబ్బెట్టుగా అనిపించదు" అంది

"మంచి మాటన్నావే రంగీ"అన్నాడు కోటేశ్వరరావు…

స్నానం చేసి గుడికి వెళ్ళాడు...పూజలన్నీ ముగిసి గుడి మూసే వరకు అక్కడే ఉన్నాడు...

"ఏమయ్యా కోటేశ్వరరావు...పొద్దుట్నించి గుడిని పట్టుకుని వదలటల్లేదు...ఏమైనా వ్రతమా?" అనడిగారు పూజారి గారు కోటేశ్వరావు ని చూసి

"లేదు స్వామి...మీతో ఒక విషయం మాట్లాడాలి" అన్నాడు కోటేశ్వరరావు

"చెప్పు బాబూ...ఎందుకంత సందేహిస్తున్నావు? పెళ్లి గురించి గాని ఆలోచిస్తున్నావా?" అనడిగారు పూజారి గారు నవ్వుతూ

"అవును స్వామి...మొన్న మా మేనమామ గారి అమ్మాయి మన గుళ్లో కలిసింది...తను కూడా నా లాగే ఒంటరిదైపోయింది...మేమిద్దరం ఒకటైతే బాగుంటుందని అనిపిస్తోంది...మా ఒంటరితనాలు దూరం చేసుకోవడానికి ఇదొక మంచి మార్గం అనిపిస్తోంది" అన్నాడు…

"మంచి మాట చెప్పావు...నన్ను మాట్లాడ మంటావా" అనడిగారు పూజారిగారు…

"అది తరువాత విషయం...అసలు ఇది మంచి మాటేనా? అను ఏమనుకుంటుందో...వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారో...మా అబ్బాయి ఏమనుకుంటాడో...ఏమీ అర్ధం కావట్లేదు...అది తేలినతరువాతే మాట్లాడటం" అన్నాడు కోటేశ్వరరావు చింతాక్రాంతుడై...

"నువ్వు తలపెట్టినది చాలా మంచి పని...మీ ఇద్దరికీ తోడు కావాలి...మీరూ ఒకరికొకరు చాలా బాగా తెలుసు అందుకనే అర్ధం చేసుకుని ప్రశాంతమైన సహజీవనం సాగించ గలరు...శుభస్య శీఘ్రం... ముందుకెళ్ళండి" అన్నారు పూజారి గారు

"కానీ..."అంటూ నాన్చాడు కోటేశ్వరరావు

"బాబూ...మీ అబ్బాయి తో నేను మాట్లాడతాను...వాడు చాలా బుద్ధిమంతుడు...నీకన్నా రెండింతలు పరిణతి చెందినవాడు...మిగతా కథ వాడే నడుపుతాడు" అన్నారు పూజారి గారు…

ఆ రాత్రే ఆయన కోటేశ్వరావు గారి అబ్బాయి తో మాట్లాడారు...

అదీ జరిగిన రెండు రోజుల వరకు అబ్బాయి నుంచి ఎంటువంటి ఫోనూ రాలేదు...

ఏమనుకోవాలో అర్ధం కాలేదు కోటేశ్వరరావు కు...కోడలేమైనా అభ్యంతరం చెప్పుంటుందా...లేక అబ్బాయికే ఎబ్బెట్టుగా అనిపించుంటుందా? ఆలోచనలు తెగక ఎంతో మధన పడ్డాడు…

రెండో రోజు రాత్రి ఫోన్ వచ్చింది...అటువైపు కోడలు "మామయ్యా...మీ అబ్బాయి విషయం అంతా చెప్పారు...మేమందరం ఎంతో సంతోషించాము...మీకు ఒక తోడు కావాలి అని మేము ఎప్పుడూ అంటూనే ఉన్నాము...మీరు దాన్ని వృద్ధాశ్రమం గురించిన మాట అనుకుని బాధపడ్డారు...మా ఉద్దేశ్యం ఇదే...కానీ మీ కంటే చిన్నవాళ్ళం మిమ్మల్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎలా అడగగలం? ఇది చాలా మంచి నిర్ణయం...మీరు అను అత్తయ్య తో మాట్లాడి చెప్పండి...మేము బయలుదేరడానికి సిద్ధం గా ఉన్నాం" అంది

కోడలు అంత సులభంగా...సూటిగా మాట్లాడటం కోటేశ్వరరావు కు చాలా నచ్చింది...

విషయమంతా కోడలి చేత మాట్లాడించి తన అనుమానాలన్నిటికి ఒక్కటే సమాధానం ఇచ్చాడు కొడుకు...అందుకే కాబోలు పూజారిగారు వాడు తనకంటే ఎక్కువ పరిణతి చెందాడని అన్నారు అనుకున్నాడు...

తరువాత కార్యక్రమాలు వేగం గా జరిగిపోయాయి...కోటేశ్వరావు కొడుకు అను కూతుళ్ళకు ఫోన్ చేసి వివరంగా మాటాడాడు...పిల్లలందరూ ఈ ఆలోచనను సంతోషంగా అంగీకరించారు...

పిల్లల సమక్షం లో తాను ఉంటున్న ఊరి గుడిలో అనుని వివాహం చేసుకున్నాడు కోటేశ్వరరావు... 

ఒకే పనితో ఇద్దరు పెద్దవాళ్లకు ఒంటరితనం సమస్య పరిష్కారమైనందుకు పిల్లలూ, ఊరి వాళ్ళూ చాలా సంతోషించారు...

అను హైదరాబాద్ నుంచి కోటేశ్వరరావు ఉంటున్న ఊరికి వచ్చేసింది...మొదటి వారం కలలలో ఉన్నట్టు నడిచింది కోటేశ్వరరావు కి...పొద్దున్న లేస్తూనే భక్తి గీతాలు, టిఫిన్ తింటూ మన్నా, తలత్ లాంటి వారి మధుర గీతాలు...పాత సాహిత్యం గురించిన సంభాషణలు...పాత సినిమాలు... ఈ జీవితానికింక ఏంకావాలి అనుకున్నాడు...

ఒక రోజు పొద్దున్న లేచేటప్పడికి కొంచం తల తిరుగుతున్నట్టు అనిపించింది కోటేశ్వరరావు కు... అను చాల కంగారు పడింది...ఊళ్ళో డాక్టర్ చూసి బీపీ పెరిగింది...షుగర్ కూడా ఎక్కువై ఉంటుంది...పక్క ఊరిలోని ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించ మన్నాడు...

"ఇలా అప్పుడప్పుడు అవుతూనే ఉంటుంది అనూ, నువ్వేం కంగారు పడకు...రెండు రోజుల్లో అదే సద్దుకుంటుంది" అన్నాడు కోటేశ్వరరావు

"ఆలా ఎలా సద్దుకుంటుంది బావా? పరీక్షలు చేయిద్దాం" అంటూ ముందుకి తోసింది అను

అన్ని పరీక్షలు అయ్యాక చూసి గుప్పెడు మందులు ఇచ్చాడు డాక్టర్...

అవేవీ వేసుకోలేదు కోటేశ్వరరావు...గుడి పూజారి గారి దగ్గరకు వెళ్ళాడు...అయన ఆయుర్వేదం మందులు కూడా ఇస్తారు...

పూజారి గారిచ్చిన మాత్రలు చూసి కోప్పడింది అను "ఇదేమిటి బావా...నీకు అనారోగ్యంగా ఉంది... ముందు ఆరోగ్యం చక్కబడ్డాక ఆయుర్వేదం వాడవచ్చు మరో సమస్య రాకుండా... వచ్చిన రోగానికి మందు వాడకపోతే ఎలా" అంది కోపంగా

"ఆయుర్వేదం అంటే సంపూర్ణ శరీర శాస్త్రం...దీనివల్ల ఉన్న రోగాలు కుదురుతాయి...కొత్తవి రావు" అన్నాడు కోటేశ్వరరావు

అనుకి ఆ మాట నచ్చలేదు...దాని విషయమై కొంచం వాగ్వివాదం జరిగాక...డాక్టర్ గారిచ్చిన మందులు ఒక వారం వేసుకుటట్టు తరువాత ఆయుర్వేదం వాడేటట్లు ఒప్పందం జరిగింది...

ఆ వారమూ పాటలు, టీవీ అన్నీ తగ్గించి విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేసింది అను...

చాలా కాలంగా ఎలాంటి నియంత్రణకు లోబడకుండా జీవించిన కోటేశ్వరరావు కు ఇది కొంచం కష్టమైనా తన కోసం అను తీసుకునే శ్రద్ధ అతనికి చాలా నచ్చింది...కొంచెం సద్దుకుంటే తప్పేమిటిలే అనుకున్నాడు...

రోజులు గడుస్తున్నాయి...

అను నిర్వచించే పద్ధతులు నెమ్మదిగా కోటేశ్వరరావు జీవితాన్ని ఆక్రమించేస్తున్నట్టు అనిపించడం ప్రారంభమైంది...

రాత్రి పది తరువాత ప్రపంచమంతా నిశ్శబ్దంగా బలాన్ని కూడదీసుకుంటున్నప్పుడు చిక్కగా పారుతున్న గోదావరి నీటి శబ్దాల నేపధ్యం లో పాత సినిమా పాటలు వినడం కోటేశ్వరరావు జీవితానందాల్లో ఒకటి...ఇప్పుడు అను వచ్చాక అది కుదరటంలేదు... ఏడు గంటలకు భోజనం...తొమ్మిది గంటలకు నిద్ర అను పెట్టిన నియమాలు...

కనీసం పౌర్ణమి రోజున రాత్రి పాటలు వినే అవకాశం కలిగించమని బతిమాలుకున్నాడు...

"బావా...ఈ వయసులో మనకు కొంచం క్రమశిక్షణ కావాలి...మనం కష్టపడి చేసుకునే అలవాట్లను ఒకసారి తప్పితే మళ్ళీ గాడిలో పడడం చాల కష్టం...పొద్దున్నే లేచి పాటలు విను...అది ఆరోగ్యానికి మంచిది...ఈ వయసులో మన మెటబాలిజం నెమ్మదిస్తుంది...అందువల్ల మనం ఒక పధ్ధతి ప్రకారం భోజనం నిద్ర అలవాటు చేసుకుంటే దాని వల్ల వచ్చే సమస్యలు అధిగమించ వచ్చు" అంటూ దీర్ఘ ఉపన్యాసం దంచింది అను...

ఇంతకు ముందులాగ రంగిని వంటగదిలోకి రానివ్వడం మానేసింది...రంగికి గాని, తన కొడుకుకు గాని డబ్బులివ్వనీయటం లేదు...ప్రతి పనికి ఒక పధ్ధతి, లెక్క మొదలైపోయాయి...

అను ఇలా ఎందుకు మారిపోయింది? ఇప్పుడీ ఆఖరి కాలంలో జీవితాన్ని సంతోషంగా గడపకుండా ఈ మిలిటరీ పద్ధతులేమిటి? కోటేశ్వరరావు కు ఏమీ అర్ధం కావటంలేదు...

"ఇప్పుడీ జీవితాన్ని పొడిగించి మనం సాధించేది ఏమిటి అనూ, మనకేది సుఖంగా ఉంటే అదే చెయ్యడం మంచిది కదా" అన్నాడు కోటేశ్వరరావు ఒకరోజు ఉండబట్టలేక

"ఆమాత్రం దానికి మనం కలిసి బతకడం ఎందుకు బావా...నీ దారిన నీవు, నా దారిన నేను ఉంటే సరిపోయేది కదా...కానీ కలిసినడుద్దాం అనుకున్నప్పుడు మనం ఒకరికొకరు బలం కావాలి కానీ సమస్య కాకూడదు...మనం ఆరోగ్యం పాడిచేసుకుని మంచాన పడితే దారేమిటి? అలాంటి సమస్యలు రాకూడదనే నేను ఈ పద్ధతులు పెడుతున్నది" అంది అను.

నిజమే కదా అనిపించింది కోటేశ్వరరావు కి… 

కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అతని అసంతృప్తి పెరుగుతూ వస్తోంది...

అనవసరంగా ఈ కొత్త బంధాన్ని తలకెత్తుకున్నానా? ఇది మరింత లోతుకి వెళ్ళేలోగా ఈ బంధాన్ని ముగించడం మంచిదా? అను అన్నట్టు ఎవరి దారిన వారు బతకడమే మంచి పద్ధతా? కోటేశ్వరరావు మనసులో కల్లోలం మొదలయ్యింది…

ఒకసారి పూజారిగారికి తన మనసులో కలుగుతున్న ఈ భావనల గురించి చెప్పుకుని బాధపడ్డాడు...ఈ జీవితానికి ఇంతకు ముందు ఉన్న అర్ధంకూడా లేకుండా పోయిందా అనే భయం వ్యక్తం చేసాడు...

"కోటీ, ఇంతకాలం నీ జీవితం గాలికి కొట్టుకుపోయే గాలి పటం లాగ గడిచింది...నీ పద్ధతులు

 ఎవరి కోసమూ మార్చుకోకుండా నీకు నచ్చినట్టు బతికావు...ఇప్పుడు నీకొక బంధం ఏర్పడింది... జీవిత గమనానికి ఒక పధ్ధతి కుదిరింది...అవన్నీ అలవాటులేని నువ్వు ఒక చట్రంలో పడిన జీవిలా కొట్టుకుంటున్నావు... ఈ బంధం ఒక ముఖ్యమైన ప్రయోజనం కోసం ఏర్పడింది....దాన్ని అంత సులభంగా ముగించడం గురించి ఆలోచించ వద్దు…

నన్నడిగితే నువ్వు జీవితాన్ని ఎలా వస్తే ఆలా తీసుకోవడం నేర్చుకోవాలి...దానిమీద నీ నియంత్రణ ఉండాలని కోరుకోవడం మంచిది కాదు...జీవితం ఎలా గడవాలి అనే విషయమై నువ్వేమీ కోరికలు పెట్టుకోకు...అదే ఈ సమస్యకు పరిష్కారం" అన్నారు పూజారిగారు

రోజులు గడుస్తున్న కొద్దీ కోటేశ్వరరావు మానసిక శాంతి కరువైపోయింది... ఎదో తెలియని వ్యధ అతన్ని తినేస్తోంది...

రోజు జరిగే మాములు విషయాలు కూడా అతనికి విచిత్రంగా కనిపించడం ప్రారంభమైంది...

అను తన జీవితానికి ఒక తోడులా కాక ఒక బలమైన సంకెళ్ళ బంధం లా అనిపించసాగింది...

ఒక్కోసారి ఆలోచిస్తే అను పధ్ధతి తప్పేమి కాదని పించేది... ఇద్దరూ కలిసి బతకాలనుకున్నప్పుడు ఒకరి ఆలోచనలకొకరు గౌరవం ఇచ్చుకోవాలి కదా...తను ఇంతకుముందు అలవాటైన పద్ధతులే ఉండాలని ఆలోచించడం ఒకరకంగా తన సంకుచిత మనస్తత్వాన్ని చూపిస్తోందా?...ఏమీ అర్ధం కావటంలేదు

మళ్ళీ పూజారిగారితో మాట్లాడాడు కోటేశ్వరరావు...

“నువ్వు తొందరపాటు మనిషివి కోటేశ్వరరావు...అంతే కాదు నువ్వు నీ కోణంలోంచి తప్ప జీవితాన్ని చూడలేకపోతున్నావు…నువ్వు మగవాడివి...నీ బాధ్యతలు ఎప్పుడూ సాంఘికమే ...ఎవరికైనా ఏది మంచిదని నీకనిపిస్తుందో అదే చేసావు...వాళ్ళకేది ఇష్టం లేదా వాళ్ళకేది అవసరం అనేది నీకు పట్టదు...

అను అలాకాదు...తాను ఇప్పుడు నీ యవ్వనంలో నువ్వు ప్రేమించిన అమ్మాయి కాదు...ఒక ఇల్లాలు...ఇద్దరు ఆడపిల్లల తల్లి... జీవితం ఒడిడుకులు చూసిన ఒక బాధ్యత గల మహిళ...తను నీకేది మంచో అది చేస్తుంది...ఆ పద్ధతులు నీకు సంకెళ్ళల అనిపించొచ్చు... ఈ వివాహం వల్ల మీ ఇద్దరికీ మంచి జరగాలంటే నువ్వు నీ మనసుని తెరుచుకోవాలి" అని ఆపాడు

"ఈ నియంత్రణలు కొంతవరకు పరవాలేదు స్వామీ కానీ అవి రోజువారీ మాములు పనులను కూడా నియంత్రించేస్తున్నాయి...అది అవసరమా?" అనడిగాడు

"నిజమే...మీ ఇద్దరూ స్నేహితుల్లా కలిసుంటే నువ్వున్నట్టు ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్లుండడం జరిగేదేమో... కానీ మీరు వివాహ బంధం లో పడ్డారు... ఇప్పుడు మీరు ఒకరి గురించి మరొకరు శ్రద్ధ తీసుకోవడం మాత్రమే కాదు...కొంత భవిష్యత్తు ఆలోచనలు కూడా వస్తాయి...

నువ్వు భావుకుడివి...జీవితం అంతా సంగీతం సాహిత్యం తో గడిచిపోతుందని అనుకుంటావు..అది తప్పు...నువ్వు నీ బాధ్యత గుర్తించాలి...లేక పొతే అనుని అర్ధం చేసుకో లేవు" అన్నారు పూజారి గారు

"నాక్కావలసినది ఆ తోడే స్వామీ, నేను యవ్వనంలోనే భవిష్యత్తు గురించి ఏ ఆలోచనలు చేసే వాడిని కాదు...నా భార్య కళ్యాణి తన ఏర్పాట్లు తను చేసుకునేది...అలాంటిది ఇప్పుడు నేను అవన్నీ ఆలోచించ లేను...నాకు సంబంధించినంత వరకు జీవితం ఒక ప్రవాహం...అదలా సాగుతూనే ఉండాలి" అన్నాడు కోటేశ్వరరావు

“అది అన్యాయం కదా...నువ్వు నీ సంతృప్తి కోసం ఒక యంత్రాన్ని తీసుకురాలేదు...అను ఒక పరిపూర్ణమైన మనిషి...ఆవిడా ఒక జీవితం చూసింది...తన జీవితం నేర్పిన పాఠాలు నుంచి తను కొన్ని దార్లు వేసుకుంటుంది...అది కాదనే అధికారం నీకు లేదు కదా" అన్నారు పూజారిగారు

"అను అలా ఉండేది కాదు స్వామీ...తను కూడా నాలాంటిదే...మేమిద్దరం చిన్నప్పుడు ఒకేలా ఆలోచించేవాళ్ళం" అన్నాడు కోటేశ్వరరావు 

"గతం ఒక ఫోటో ఫ్రేమ్ లాంటిది నాయనా...అది మారదు...మనలో వచ్చే మార్పులవలన మనం ఆ గతానికి మంచి మంచి రంగులు అద్ది దాని అసలు కంటే ఎంతో విలువైన విషయంగా మార్చేస్తాం...అది నిజానికి ఒక కల్పన...నిజ జీవితాన్ని దాంతో పోల్చలేం...మనుషులు జీవితంతో బాటు పరిణతి చెందాలి కానీ గడిచిపోయిన విషయాలను పట్టుకుని అవే మళ్ళీ కావాలని కోరుకోకూడదు" అన్నారు పూజారిగారు       

"అది నిజమే స్వామీ...కానీ ఈ జీవితం చాలా దుర్భరమై పోతోంది...ఏం చెయ్యాలో అర్ధం కావటల్లేదు...మీరొక చాలా మంచి మాట అన్నారు...ఈ జీవితం అనుది కూడా తనతో ఈ విషయం మాట్లాడతాను" అని బయల్దేరాడు కోటేశ్వరరావు  

ఇంటికి చేరాడు...అతని మనసంతా చిందరవందరగా ఉంది...అను తన పనుల్లో ఉంది...డాబా మీద కుర్చీలో కూలబడ్డాడు... ఏమీ పాలుపోవటం లేదు

తన పనులు పూర్తయ్యాక డాబా మీద చింతాక్రాంతుడై కూర్చున్న కోటేశ్వరరావు దగ్గరకు వచ్చి కూర్చుని అతని చేతి మీద చెయ్య వేసి మెల్లగా నొక్కింది అను 

"ఏం బావా, పూజారి గారి మాటలు నీకు రుచించ లేదు కదా" అంది అను మృదువుగా

"నీకెలా తెలుసు" అనడిగాడు కోటేశ్వరరావు కొంచం కంగారు పడి

"నాకన్నీ తెలుసు బావా...ఒక్క విషయం చెప్పు...మనం వివాహం చేసుకున్నాక మన ఇద్దరి వ్యక్తిగత జీవితాలు కలిసి మన జీవితం అయింది...ఇందులో ఇద్దరికీ భాగం ఉంది...కానీ నువ్వు నీవొక్కడి జీవితం మాత్రమే ఉందని నేను అందులోకి ఒక ఆభరణంలా వచ్చానని అనుకుంటున్నావు...అన్యాయం కదా" అంది అను

నివ్వెరపోయాడు కోటేశ్వరరావు...నిజమే కదా...తను అనుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు తన జీవితాన్ని స్థిరీకరించేసుకున్నాడు...అను వచ్చి తను జీవితం లో వదిలివేసిన ఖాళీలను పూడుస్తుందనుకున్నాడు...కానీ ఆమె మరొక మనిషి...ఆవిడకు ఒక జీవితం ఉంది...అందులో కూడా ఖాళీలు ఉండే ఉంటాయి...తను అవేవీ తెలుసుకునే ప్రయత్నం చెయ్యట్లేదు...

ఏమనాలో తెలియక నీళ్లు నిండిన కళ్ళతో అనువైపుకి చూసాడు కోటేశ్వరరావు

“బావా, నిన్ను గుడిలో కలిసి మీ ఇంటికి వచ్చాక నాకు నీ సంగతి అర్ధం అయింది... ఈ విషయమై నేను కొంచం భయపడిన మాట కూడా నిజం...

కానీ నీ మనస్తత్వం నాకు తెలుసు... నీలో ఒక చిన్నపిల్లాడితో బాటు ఒక పరిణతి చెందిన తాత్వికుడు ఉన్నాడు...ఈ ఒంటరితనం లో ఆ తాత్విక భావనలు తగ్గి నీ భావుకత పెరగడం ప్రారంభించింది... రెండూ కలగాపులగం అయిపోయాయి...

పక్క మనిషి జీవితాన్ని గురించి ఎంతో విపులం గానూ, దూరదృష్టి తోనూ ఆలోచించ గలిగే నువ్వు నీ విషయం వచ్చేటప్పడికి దృష్టి దోషానికి గురవుతున్నావు…   

సరైన సమయం వచ్చినప్పుడు నువ్వు ఈ విషయాన్నీ అర్ధం చేసుకోగలవనుకున్నాను... అందుకనే నేను ఈ వివాహానికి ఒప్పుకున్నాను...

తరువాత మన జీవితాలు మారతాయని నాకు తెలుసు...ఆ దారిలోకి రావడానికి నీకు కొంచం సమయం పడుతుందని కూడా ఊహించాను...తొందరలోనే మనం ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాం అంటే అదొక మంచి పరిణామం...

ఈ కొత్త జీవితం కొన్ని మార్పులు కోరుతుంది బావా...మనం కొన్ని విషయాలలో రాజీ పడి నడవాలి.. నీకర్ధం అవుతుందనుకుంటాను"అంది

ఆమాట నిజమే అన్నట్టు తలాడించాడు కోటేశ్వరరావు

ఎక్కడో దూరంగా రేడియోలో మానససంచరరే బ్రాహ్మణి అనే సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన లీలగా వినిపిస్తోంది...


Rate this content
Log in

Similar telugu story from Drama