శ్రీనివాస్ మంత్రిప్రగడ

Action Fantasy Inspirational

4.8  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Action Fantasy Inspirational

ఆత్మ కధలు

ఆత్మ కధలు

13 mins
285


పొద్దు వాలుతోంది ...అరుణుడు సూర్యదేవుణ్ణి మానవ లోకం నుంచి తీసుకు పోవడం ప్రారంభించాడు ...ఆకాశం అంతా దట్టంగా ఉన్ననారింజ పండు అలికినట్టుంది...

సగం కరిగిపోయిన చంద్రుడు ఒక మూలగా బిక్కు బిక్కు మంటూ చూస్తూ పైకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు...అక్కడక్కడా మబ్బు తునకలు కాఫీలో తొరకల్లా తెలియాడుతున్నాయి...

కోవిడ్ భయంతో జన సంచారం ఎలాగైనా పలచగానే ఉంది...సాయంత్రమయ్యేసరికి అది మరింత పలచబడింది...అప్పుడప్పుడు చప్పుడు చేసుకుంటూ వెళ్లే కొద్దిపాటి వాహనాలు మాత్రమే కనిపిస్తున్నాయి...

రోడ్డు పక్కన పళ్ళు, కూరలు అమ్ముకునే దుకాణాలవాళ్ళు, గుడి దగ్గర పువ్వులు అరటిపళ్ళు అమ్మే వాళ్ళు మెల్లిగా సద్దుకుని ఆ రోజుకి ఇంటికి బయలుదేరుతున్నారు 

రోజంతా భయం భయంగా తమ పనులు చేసుకుంటున్న మనుషులు మెల్లిగా ఈ కొత్త జీవన విధానానికి అలవాటు పడుతున్నారు… 

కొంతమంది కళాపోషకులమనుకునే వాళ్ళు ఆ నారింజ సూన్యంలోకి చూస్తూ దిగులు పడుతున్నారు...

కొందరు రొమాంటిక్ గా ఫీల్ అవుతూ "ఖోయా ఖోయా చాంద్" లాంటి హిందీ పాటలో "సడిసేయకో గాలి" “మధురమధురమీ” లాంటి అద్భుత తెలుగు పాటలో వింటూ పరవశిస్తున్నారు…

ఒంటరి ప్రేమికులు "నీ కోసమే నే జీవించునది" లాంటి విరహ గీతాలు వింటూ బెంగ పెట్టుకుంటున్నారు

వ్యాయామాలు చేసుకునేవాళ్ళు యోగా చాపలు తెచ్చుకుంటున్నారు...

రకరాల వంటల ప్రయోగాలు చేద్దామనుకునేవాళ్ళు ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు....

ఆరోగ్య సూత్రాలమీద ఉపన్యాసాలు దంచాలనుకున్నవాళ్ళు ఎవరితో మట్లాడడమా అని ఫోన్లు చూస్తూ నంబర్లు వెతుక్కుంటున్నారు…

టీవీల ముందు కూచున్నవాళ్ళు కోవిడ్ లెక్కలు చూస్తూ ఈ సమస్య చాపకింద నీరులా వ్యాపిస్తుండడం గురించి ఆలోచిస్తూదిగులు పడుతున్నారు ....

మానవ ప్రపంచం రకరకాల కార్యక్రమాలతో తమ స్వీయ కేంద్రీకృత ఆలోచల్నికప్పుకునే ప్రయత్నం చేస్తూ హడావుడి తగ్గించుకుని నెమ్మదిస్తోంది... 

అదేసమయంలో ఇటు భూమికి అటు ఆకాశానికి మధ్యలోనున్న ఆత్మలోకంలో హడావుడి మొదలవుతోంది

సహజ కారణాల వల్లో లేక ఎవ్వరూ నియంత్రించలేని ప్రమాదకర కారణాలవల్లో ఈ ప్రపంచం వదిలిన జీవులు తమ తమ ప్రారబ్ద కర్మలననుసరించి జన్మరాహిత్యం పొందడమో లేక మరో జన్మకు సిద్ధపడడమో జరుగుతుంటుంది...

జీవులన్నిటిలోను వివేకం ఆలోచన బలం కలిగిన మానవుడు వివేకం మసిబారినప్పుడు లేదా ఆలోచనలు వికటించినప్పుడు తమ మీద తామే వత్తిడి పెంచుకుంటారు...

ఆ వత్తిడికి లోనైనప్పుడు తమ జీవితాగమనాన్ని అంగీకరించలేక పోవడం లేదా చెప్పుకోలేని కారణాలను తమ మనసు లోతుల్లో దాచుకో లేకపోవడం జరుగుతుంటుంది...

ఆ పరిస్థితుల్లో కలిగిన ఆవేశ కావేశాల వల్లో లేక సకారణ అకారణ నిరాశా నిస్పృహల వల్లో బలవంతగా ఈ ప్రపంచాన్ని వదిలేసే ప్రయత్నం చేస్తుంటారు...

అది ఒక క్షమార్హం కాని పొరపాటు...ఆ రకంగా హత్యకు గురైన ఆత్మలు ఇటు భూమి మీద మళ్ళీ పుట్టకుండా ఆలా అని ఊర్ధ్వ లోకాలు చేయకుండా మధ్యలో ఆత్మలోకంలో వెళ్లాడాల్సివస్తుంది…అక్కడ్నించి విముక్తి ఎప్పుడో ఎలాగో ఎవ్వరికీ తెలియదు!!!

అలంటి ఒక లోకాన్ని విశ్వామిత్ర మహర్షి వల్ల పొందిన అయోధ్యకు రాజైన త్రిశంకుడు ఏమైనా సంతోషించాడేమో గాని, ఆత్మ లోకంలో ఆత్మలు విలవిలా కొట్టుకుంటూ...అక్కడ నుంచి బయట పడే అవకాశంకోసం ఎదురు చూస్తుంటాయి...

మానవ లోకంలో రోజు అంతమయ్యేటప్పుడు, సూర్య భగవానుడు చీకటి దుప్పటి కప్పుకుని విశ్రమించగానే ఆత్మ లోకంలో అలజడి ప్రారంభమైయింది...

"జరగవయ్యా ఇంకొకడొస్తున్నాడు" అన్నాడో హడావిడి ఆత్మ మెట్ల మీద గుంపు గా కూర్చున్న సాటి ఆత్మలతో

"ఒళ్ళు చచ్చినా పులుపు చావలేదురా అబ్బాయ్, ఇప్పటికీ అదే హడావిడి" అన్నాడో పెద్దరికపు ఆత్మ తాపీగా మెట్ల రైలింగ్ మీద కాళ్ళు చాపుక్కూచుని చుట్ట వెలిగిస్తూ

"నీ డైలాగు బాపు గారి కార్టూన్ కాపీ అయినా బావుండలేదురా...కొత్త వాడొస్తే ఎక్కడ కూర్చుంటాడు? మన బంగళా ఆఫీస్ టైములో మెట్రో స్టేషన్లా తయారైంది..కాలు పెట్టే చోటు లేదు" అన్నాడు మెట్ల మీద ఇరుక్కుని కూర్చున్న ఒక అసహన ఆత్మ

"ఆలా అంటే ఎలాగా? సద్దుకోవాలి ...మనకి మేకలమంద పధ్ధతి అలవాటు కదా...మన దార్లో చాల మేకలొస్తాయి" అన్నాడు పెద్దరికపు సినిమా ఏక్టర్ ప్రకాష్ రాజ్ గొంతుకతో

"బాబాయ్ నీకింకా భ్రమలు పోలేదు...మనిషిగా నేర్చుకున్న విద్యలేవీ ఈ ప్రపంచానికి తెఛ్చి కలుషితం చెయ్య కూడదు...రేపాయన వస్తే నీ మీద టీవీ ప్రోగ్రాం పెడతాడు" అన్నాడు హడావిడి

"మేకల మందంటున్నావ్ అదేమిటి బాబాయ్?" అడిగాడు అసహన

"అదేరా, ఒకడొక దారి చూపిస్తాడు... ఆ దారి మంచిదా కాదా అనే విషయం తెలిసే లోగానే మరికొందరు వరస కట్టి బయల్దేరతారు....

ఇది కూడా అలాంటిదే ...కొందరు మనలాంటి తొందరపాటు జీవులు జీవితం తో సమాధాన పడలేక...అలాని పోరాడలేక మనుష్య ప్రపంచం వదిలేస్తుంటారు...

దాన్ని చూసిన కొందరు వాళ్ళ మానసిక పరిస్థితి ని బట్టి అది ఒక మంచి దారి అని అనుకునే అవకాశం ఉంది...అదే పెద్ద సమస్య" అన్నాడు పెద్దరికపు 

"ఇక్కడకొస్తే గాని ఇదెంత దరిద్రపు లోకమో తెలియదంటావు" ఫెళ్ళున నవ్వాడు హడావిడి

"ఒరే హడావిడీ కాస్త సున్నితంగా..." మందలించాడు పెద్దరికపు...హడావిడి తల దించుకున్నాడు...నవ్వాపుకుంటున్నట్టు చప్పుడవుతోంది

"నిజంగా అంత తొందరపడేవాళ్లు ఎక్కువయ్యారంటారా? అదే నిజమైతే ఈపాటికి చాలామందే మన ప్రపంచంలో చేరే వాళ్ళు...అదేం కావటం లేదుగా...

దోషభూయిష్టమైన మానవ సమాజం వదిలి మన ప్రపంచానికి రావాలనుకోవడం ఒక గొప్ప నిర్ణయం...

మాములు మనుష్యులతో బాటు అద్భుతమైన రచయితలూ...కళాకారులూ... మహాభక్తులూ... ప్రపంచాన్ని త్యాగం చేసిన స్వామిజీలూ... కొన్నిసార్లు దైవాంశ సంభూతుల బంధువులూ కూడా మన ప్రపంచానికి వచ్చిన దాఖలాలు ఉన్నాయిట... దానికేమంటారు" అన్నాడో ఓ హేతువాది ఆత్మ

"మనిషి జన్మ ఎత్తాక అందరు మనుషులే ...వాళ్ళు మనలాంటి సామాన్యుల కంటే మాన్యులు అయ్యుండొచ్చు కానీ మనుషులే కదా... వాళ్ళు కూడా అప్పుడప్పుడు మానసిక దౌర్బల్యాలకి లోనై ఉండవచ్చు...ఆ ప్రభావం లో మనదారి పట్టి ఉండవచ్చు....నీ హేతువాద వాదన కి మన ప్రపంచంలో తావు లేదు..కాసేపు ఉరుకో" కసిరేడు పెద్దరికపు

"నిజం చెప్తే నేరమా" గొణిగాడు హేతువాది

"మన లోకంలోకి రావడమనేది ఒక తొందరపాటు చర్య...ఆ దారిలోకి వచ్చిన వాళ్ళు తమ తమ స్థాయి లేదా ఇహలోక విజయాలు లాంటి విషయాలు పరిగణన లోకి తీసుకోరు...వెలుగు కి వ్యతిరేక దిశలో కూర్చుని ఆలోచిస్తారు...అందువల్ల హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకో లేకపోతారు" హేతువాది వైపుకు కోపంగా చూస్తూ అన్నాడు పెద్దరికపు

"అది నిజమే...ఆమధ్య మా స్నేహితుడొకడు అమెరికా ఆత్మ లోకం నించి వచ్చాడు...వాడు చెప్పాడు ఒక చాలా మంచి నటుడు...జ్జ్యూమాంజి లాంటి సినిమాల్లో నటించినవాడు వచ్చి చేరాడుట వాళ్ళ లోకంలో" ఒప్పుకున్నాడు హేతువాది

"అంతెందుకు మన స్వామీజీ కూడా అప్పుడప్పుడు అలాగే చింతిస్తుంటారు... అయన నడుపుతున్నకారు గుద్ది ఒక కుర్రాడు మరణించాడని మనస్తాపానికి గురై అయన మనలోకంలోకి వచ్చేసారు" అన్నాడు అసహన

"దీనికంతకీ కారణం అపరిపక్వత...మూర్ఖత్వం...స్వామీజీలు మన లోకానికి రావటం ఏమిటి అర్ధంలేకుండా " అన్నాడు హేతువాది కొంచం వక్రంగా నవ్వుతూ

"మనుషులు మనీషులగా పరిణమించాలంటే ఎంతో పరిపక్వత కావాలి...ఆ దార్లో చాలా వత్తిడి ఉంటుంది...ఆ పరిస్థితుల్లో గురువు గారిని నమ్ముకుని ఓర్పుతో ముందుకు సాగాలి...ఆలా కాక పొతే ఇలాగే తొందరపాటు చర్యలు చేప్పట్టడం...తద్వారా మనలోకానికి రావడం జరుగుతుంది" అన్నాడు పెద్దరికపు

హేళనగా నవ్వాడు హేతువాది

"అయితే హేతూ నువ్వు జ్ఞానివి కదా... నువ్వెందుకు ఈ లోకానికి వచ్చావు?" ఆసక్తిగా అడిగాడు ఓ కుర్ర ఆత్మ

"అది చెప్పుకోడానికే సిగ్గేసే విషయంలే...మా ఆవిడతో పోట్లాట మధ్యలో నేను ఎక్కువ ఉత్సాహం చూపించాను" అన్నాడు హేతువాది 

"నే హేతుబద్ధమైన వాదనలు పనికిరాలేదా?" అడిగాడు కుర్రాడు

"నా భార్య నాకంటా పెద్ద హేతువాది...ఆవిడతో వాదనలో నేను నెగ్గలేను" ఒప్పుకున్నాడు హేతువాది

"సరిపోయింది" నవ్వాడు పెద్దరికపు

"అయితే ఇక్కడకెలా వచ్చావు...మీ ఆవిడే నిన్ను పంపించిందా" వ్యంగం గా అడిగాడు అసహన

“లేదు...నా భార్యతో తరచుగా గొడవలు జరిగేవి.. ఒకసారి మా గొడవ ఎంతకీ తేలక పోగా విపరీత ధోరణుల లోకి పోయింది...ఆ వత్తిడి భరించలేక నేను ఆ జీవితాన్ని వదిలేసి ఇక్కడకొచ్చాను" అన్నాడు హేతువాది తల దించుకుని

"నువ్వెంతో హేతుబద్ధం గా ఆలోచిస్తావు అని మా అందరికి చాలా గౌరవం ఉండేది ...అలంటి నువ్వే మానసిక దౌర్బల్యానికి లోనయ్యావా?" అనడిగాడు అసహన కొంచెం నొచ్ఛుకుంటున్నట్టు

"నేను ఒక పొరపాటు చేశాను...నా భార్య ని అశ్రద్ధ చేశాను...దానివల్ల మా బంధం చాలా చెడిపోయింది....నాకు కావలసిన మనశాంతి కోసం నేను వేరొక మహిళతో స్నేహం చేశాను...అది బయట పడి నా భార్యతో చాలా పెద్ద యుద్ధం జరిగింది... అదే నా మీద పెరిగిన వత్తిడికి కారణం" అన్నాడు హేతువాది నెమ్మదిగా

పగలబడి నవ్వాయి ఆత్మలన్నీ  

ఇంతలో ఒక నడివయసు ఆడ ఆత్మ నెమ్మదిగా నడుస్తూ వచ్చి ఒక పక్కన కూలబడింది...ఆవిడ మోహంలో ఉత్సాహం ఏమాత్రం గోచరించట్లేదు

"చక్కగా ఖాళీగా సుఖంగా ఉండే జీవితం...మన ఈ పాత బంగ్లా, ఈ మర్రి చెట్టూ అంతా ఖాళీగా ఉండేవి...సుఖంగా తిరిగేవాళ్ళం... ఇంతమంది కూడా మన ప్రపంచంలోకి వచ్చే వాళ్ళు కాదు...

అందరికి అందరం తెలుసు... ఈ ప్రపంచంలోకి ఎక్కువ శాతం రెండే రకాల వాళ్ళు వచ్చేవాళ్ళు...ప్రేమ విఫలంగాళ్ళు... మానసిక రోగులు...

ఇప్పట్లా ఊహాతీతమైన కారణాలతో మనలోకంలోకి వచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు" అంటూ నిట్టూర్చింది నడివయసు కూర్చున్నచోటే కొద్దిగా వెనక్కి వాలుతూ

"అయితే అత్తా నీ ప్రేమ కూడా? ...."కొంటెగా నవ్వాడు కుర్రాడు

"ఛీ వెధవా!!! మా ఆయనతో పోట్లాట వచ్చింది ...నా వాదం లో పస లేదనిపించి బెదిరిద్దామని నూతిలోకి దూకా….మా అయన గుర్తించి బయటికి తీసేలోగానే ఇక్కడికి బదిలీ అయిపోయా " విచారంగా అంది నడివయసు

"బంధాలకు విలువ లేకుండా పోయింది ఒకళ్లనొకళ్ళు సాధించుకోవడమే" అన్నాడు పెద్దరికపు సాలోచనగా…

"అయితే బాబాయ్ నువ్వెలా వచ్చావు? మనిషిగా చాలా జీవితం చూసినట్టున్నావ్?" అడిగాడు హడావిడి

"నా రిటైర్మెంట్ తరువాత కొన్నాళ్ళు బానే వుంది...నా భార్య సడన్ గా పోయింది...నేను నా కొడుకులకి బరువైయాను...వాళ్ళ తిరస్కారాలు ఎదుర్కోలేక...వృద్ధ ఆశ్రమాల్లో చేరలేక ఇక్కడొకొచ్చాను" విచారంగా అన్నాడు పెద్దరికపు

"బంధాలూ,విలువలూ అన్నీ కూడా డబ్బు తోనూ, వెసులుబాట్ల తోనూ ముడిపడ్డాయి...కొంచం అసౌకర్యం కూడా భరించలేని విధం గా తయారవుతున్నారు ఇప్పటి వాళ్ళు " అన్నాడు హడావిడి

అవున్నన్నట్టు తలాడించింది నడివయసు

"అది ఒక పార్శ్వం మాత్రమే...నిజానికి మన దేశంలో ఇప్పటికీ బంధాల విలువ పోలేదు" నెమ్మదిగా అన్నాడో తలపాగా ఆత్మ సంభాషణలో కలగజేసుకుంటూ

"ఇదుగో ఈ పక్కన కూర్చున్నవాడు మా తమ్ముడే...ఇద్దరం కలిసే వుండే వాళ్ళం...కలిసే వచ్చాము" అన్నాడు భారంగా

తమ్ముడు ఆత్మ విచారంగా తలొంచుకున్నాడు

"ఇదేమన్నా 14 ఏళ్ల అరణ్యవాసమా...ఆయనకూడా రావడానికి" నవ్వాడు హడావిడి 

“మానవజన్మ నుంచి బయటపడిన అక్కడి బంధాలు పట్టుకుని వెళ్ళాడుతున్నావు అది మన ఆత్మ న్యాయానికి వ్యతిరేకం కదా" అన్నాడు ఒక్క నిముషం ఆలోచించి 

"చెస్ నోర్ముయెస్...మన ప్రపంచంలో మనం బంధ విముక్తమవకే వేళ్ళాడేది" కొంచం కఠినంగా అన్నాడు పెద్దరికపు తీక్షణంగా హడావిడిని చూస్తూ

తలొంచుకున్నాడు హడావిడి

"ఒకళ్ళ కొకళ్ళు ఉన్నారు కదయ్యా...మీ తమ్ముడ్ని నువ్వు గాని నిన్ను అయన గాని అడగలేదా నాక్కొంచెం నమ్మకమివ్వు అని?" తలపాగా వైపుకి తిరిగి అడిగాడు పెద్దరికపు... గొంతు కొంచం వణికింది

"వాడిచ్చ్చిన నమ్మకం లేకపోతే పదేళ్ల క్రితమే ఇక్కడికొచ్చావాడిని" అన్నాడు తలపాగా "నాకొచ్చిన విద్యని అభివృద్ధి కొట్టేసింది, నేను ఒక చేనేత కళాకారుడిని" భారంగా అన్నాడు

"నేను నేసే బట్టలకన్నా తక్కువ టైములో తక్కువ ఖర్చులో బట్టల తయారీ వచ్చేసింది...మాకు పనిలేకుండా పోయింది ... ఆవిద్య కాకుండా నాకింకోటి రాదు" పొడిగించాడు

"మీ ప్రాంతాల్లో అలాంటి బట్టల మిల్లులు పెట్టి మీకు ట్రైనింగ్ ఇవ్వొచ్చు కదా?" అడిగాడు కుర్రాడు

"మాకు సాయం చేసేవాళ్లంతా మమ్మల్ని భిక్షగాళ్లగా జమ కట్టేసారు....మేము కళాకారులం... జన్మతః వ్యాపారస్తులం...కానీ మాకు విలువే ఇవ్వలేదు...

గౌరవనీయంగా మా జీవితాలు నడిపేందుకు దారి చూపించడానికి బదులుగా డబ్బులు పారేయటం మొదలు పెట్టారు...ఆ సొమ్ములు మాకు ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సరిపోవు...ఏ నెలకానెల బతకడానికి మాత్రమే సరిపోతాయి...

అవి కూడా పాలకులు చెప్పినంతగా మా వరకు రాదు...ఎందుకులే అవన్నీ ఇప్పుడు" భారంగా నిట్టూర్చాడు తలపాగా

"నీ సంగతీ అంతేనా?" అడిగాడు పెద్దరికపు తలపాగా తమ్ముడ్ని చూస్తూ

"నా విషయం వేరు... నేను పప్పు ధాన్యాలు పండించే రైతును...ఆరేడేళ్ల నించి మాకు గిట్టుబాటు ధర రావటంలేదు...మొన్న రెండేళ్ళనించి నా ఖర్చు కన్నా మార్కెట్ రేటింకా తక్కువైంది" అన్నాడు తలపాగా తమ్ముడు

"అవును నేను పేపర్లో చదివాను...అదంతా ఏదో మంత్రి గారి ప్రతిభన్నట్టు రాసారు...ధరలు తగ్గించిన మంత్రి అంటూ డబ్బాలు కొట్టారు" అన్నాడు అసహన

"ఎలా తగ్గించాడో ఎక్కడా రాయలేదు...కొత్త విత్తన రకలొచ్చాయా ...భూసారం పెరిగిందా...కొత్త వ్యవసాయ పద్ధతులొచ్చాయా? " కోపంగా అన్నాడు తలపాగా తమ్ముడు

"ఎం చేసారు?" క్యూరియస్ గా అడిగాడు కుర్రాడు

"కొన్ని దేశాలనించి పప్పులు చవగ్గా దిగుమతి చేసుకున్నాం ...అవి మనం ఆదేశాలికి ఇచ్చే డబ్బుల సాయానికి ప్రతిఫలం...అవి మార్కెట్లో చవగ్గా అమ్ముడు పోతున్నాయి" అన్నాడు తలపాగా తమ్ముడు

"ఇక్కడా అదే తంతు...రైతులకి సాయం అంటే డబ్బులు ఇవ్వడం ...భిక్ష..."కోపంగా అన్నాడు తలపాగా "మాకు మార్కెట్ కావాలి...అవకాశాలు కావాలి...పని కావాలి ....భిక్ష అక్కర్లేదు" పిడికిలి బిగించాడు

"నీ బాధ అర్ధం చేసుకోగలను...స్థిమిత పడు...నువ్విప్పుడు మనిషివి కాదు" నెమ్మదిగా అన్నాడు పెద్దరికపు

"ఆ పప్పులు తింటే మన ప్రజల ఆరోగ్యాలేం కాను ...వాటిలోని జన్యు నిర్మాణాన్ని మన శరీరాలు గుర్తించలేవు ...అవి జన్యు మార్పులు పొందిన పంటలైతే ఇంకా ప్రమాదం" అన్నాడో స్వప్రకటిత డై టి షియన్

"సరిపోయింది" విసుక్కున్నాడు పెద్దరికపు

ఇంతలో అటుగా ఎవరో వస్తున్నచప్పుడైంది ..."అదిగో కొత్త వాడు" ఉత్సాహంగా అరిచాడు హడావుడి

కొత్త ఆత్మ తలవొంచుకుని వచ్చి ఒక మూల ముడుచుక్కూచున్నాడు ...ఎవ్వరి వైపు చూట్టంలేదు ...మాట్లాడటం లేదు

"ఏమయ్యా నీ కధ ఏంటి? ఈప్రపంచానికి రావాలని అంత ఆత్రుత ఏమిటి? అడిగాడు పెద్దరికపు కొత్త వాడి భుజం మీద చెయ్య వేసి

"నేనొక ప్రభుత్వ ఆఫీసర్ ని" ప్రారంభిచాడు కొత్తవాడు. మాటలో కొంచం అభిజాత్యం తొంగిచూస్తోంది  

"అది నువ్వు మనిషిగా వున్నప్పుడులే …ఇక్కడంతా ఒకటే" అన్నాడు అసహన

"కొంత మంది రాజకీయ నాయకులూ వాళ్ళని సమర్ధించే వ్యాపారస్తుల ఒత్తిడికి తలొగ్గి తప్పు చేశా...అది కాస్తా బయట పడి పోయింది ...పెద్దవాళ్ళందరూ తప్పుకున్నారు ...నేను ఇరుక్కున్నాను...మొత్తం చెడ్డ పేరు నాకే వచ్చింది ...ఇక భరించలేక పోయా" అన్నాడు కొత్త వాడు 

"ఇదే మొదటి తప్పా?" అడిగాడు పెద్దరికపు

"కాదు... కానీ నా పనులు ఎప్పుడూ ఇంతలా బహిర్గతం కాలేదు..నా వెనక మాట్లాడుకునే వాళ్ళు ...ఇప్పుడు నామొహం మీదనే అరుస్తున్నారు... టీవీల్లో …సామజిక మాధ్యమాల్లో కూడా విరుచుకు పడుతున్నారు" అన్నాడు కొత్త వాడు

"అద్గదీ సంగతి...అత్త తిట్టినందుక్కాదూ తోడికోడలు నవ్వినందుకు..." అంటూ నవ్వింది నడివయసు

 "ఓస్, దీనికే ఇక్కడికి రావడం దేనికి? ఇంత విశాల ప్రపంచంలో నువ్వెవరు? నీ చరిత్రేంటి అని అడక్కుండా నిన్ను అంగీకరించేవాళ్లే లేరా?" అడిగాడు అసహనం

"ఆ క్షణంలో అందరు నావైపే గుచ్చిగుచ్చి చూస్తున్నట్లనిపించింది ...నాకు జీవితంలో ఓడిపోవడం అలవాటు లేదు" అన్నాడు కొత్త వాడు

"ఓటమి భయం మనుష్యుల్ని అచేతనం చేస్తుంది అని విన్నాను గాని ఇలా మన ప్రపంచానికి తీసుకొస్తుందని తెలీదు " అన్నాడు స్వప్రకటిత డై టి షియన్

"నీకు తెలియని విద్య లేదా గురూ?" వెటకారంగా అడిగాడు అసహన స్వప్రకటిత డై టి షియన్నీ 

ఇంతలో ఒకమ్మాయి ఆత్మ భారంగా అడుగులేస్తూ వచ్చి నడివయసు పక్కనే కూలబడింది "ఏవమ్మా నువ్వు ఇప్పుడే వస్తున్నావా?" అడిగింది నడివయసు. అవున్నన్నట్టు తలాడించింది అమ్మాయి

"ఏవిటీ విషయం? ప్రేమ విఫలమా పెళ్లి విఫలమా " అడిగింది నడివయసు

"రెండు కాదు...మా ఆయనకు నేనంటే చాలా ప్రేమ" అంది అమ్మాయి

"మరి?" అర్ధంగాక తలగోక్కుంది నడివయసు ...ఘొల్లున నవ్వారు చుట్టుపక్కలున్న మిగతా ఆత్మలు

"పరిస్థితుల ప్రభావం వలన ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది...అది భరించలేక ఆ ప్రపంచాన్ని వదిలేసాను...ఇక్కడ కొంచం ప్రశాంతం గా ఉందనుకుంటే ఇక్కడకూడా అవమానాలేనా " ఉక్రోషంగా అంది అమ్మాయి

"నువ్వు మరీ సున్నితం అమ్మాయీ...ఈ ప్రపంచంలో అవమానాలు ఉండవు...మనకి విడిగా గుర్తింపు ఏమీ ఉండదు...అందరు ఒకటే ఇక్కడ.. నెమ్మదించు ...ఇప్పుడేగా వచ్చావు " అనునయంగా అంది నడివయసు

"అయితే ఏదీ విఫలం కానప్పుడు అవమానాలెందుకు...అవి భరించలేక దీపం లాంటి పిల్లవి ఇక్కడికెందుకొచ్చావ్?" అడిగింది

"మా ఆయన లంచం తీసుకుంటూ దొరికి పోయి జైల్లో ఉన్నాడు ... తలెత్తుకోలేని పరిస్థితి" వాపోయింది అమ్మాయి

"నీకు ఇదే తెలియడమా?" అడిగాడు పెద్దరికపు

"లేదు ...నాకు తెలుసు...దొరికిపోవడం ఇదే మొదలు" అంది అమ్మాయి

"సరిపోయింది ...నీకు తెలిసే ఆయన్ని ప్రోత్సహించావు కదా అంటే ఆ విషయంలో నువ్వు కూడా సమాన భాగస్వామివే...ఆయనకు మద్దతుగా నిలబడాల్సినది పోయి ఆయనొక్కడ్నే మనుష్యుల ప్రపంచంలో సమస్యలు ఎదుర్కోమని వదిలేసి వచ్చావా? అది అన్యాయం " అన్నాడు అసహనం

"ఆలా వదిలేసి రావడం చాలా తప్పు...నాక్కూడా ఇక్కడకు వచ్చాకనే ఆ విషయం అర్ధం అయ్యింది.....నీకూ త్వరలోనే తెలుస్తుందిలే" అన్నాడు కొంచం దూరంగా కూర్చున్న ఒక విలాసవంతంగా కనిపించే ఆత్మ

"అంటే?" అడిగింది అమ్మాయి

"నీలాగే నేనూ అవమానం భరించలేక వచ్చాను...నేనో డాక్టర్ని ..నా భార్య ఒక పెద్ద ప్రభుత్వ అధికారి ...ఆవిడ్ని పోరు పెట్టి పై సంపాదన అలవాటు చేశాను...

కిందటినెల్లో ఆవిడ పట్టుబడిపోయింది ...అది ఘోరమైన అవమానం కదా అని ఉరేసుకుని ఇక్కడకొచ్చేసాను ...

ఇప్పుడు చుస్తే నా భార్య అసమస్యని ఒంటరిగా ఎదుర్కొంటూంది…

నేను ఆవిడతోనే ఉండి ఆ జీవితం నుంచి బయట పడి ప్రక్షాళన చేసుకునేందుకు సహాయం చేసి ఉండాల్సింది...చాలా తొందర పడ్డాను" అన్నాడు విలాసవంతపు

" అలాంటి సమస్యలొస్తే సంస్కరించుకునే అవకాశం ఇచ్చి సాయం చెయ్యాలి లేదా విడిపోవాలి అంతేగాని ఇక్కడికి రావడం ఎందుకు? ఈమధ్య అమెరికా లో ఓ పోలీసాయన భార్య ఆయన ఒక అమాయకుడిని వర్ణ వివక్ష చూపించి చంపినందుకు విడాకులిచ్చిందిటగా ...మీ ఇద్దరు ఆలా చేస్తే సరిపోయేది" అంది నడివయసు

"కాస్త ఆగి అలోచించి ఉంటే మార్గాలు దొరికేవి ...ఆ క్షణంలో ఏదోకటి చేసెయ్యాలన్న తొందర పాటు వల్ల ఇక్కడకొచ్చా...ఇప్పుడీ బాధ ఒంటరిగా అనుభవించడం కష్టంగా ఉంది" నిట్టూర్చాడు విలాసవంతపు

“మానవ ప్రపంచంలో తొందరపాటు ఎక్కువయింది ... కొంచం ఆగడం…అవసరమైతే కొంచం ఇబ్బంది భరించడం లాంటి అలవాట్లు పూర్తిగా పోయాయి" అంది నడివయసు 

"నా విషయంలో పూర్తిగా అదే జరిగింది...తొందరపాటు ఎక్కువై ఇబ్బంది భరించడానికి సిద్ధపడలేదు" అన్నాడు ఒక మూల ముడుచుక్కూచున్న ఆత్మ దీనంగా

"ఏం జరిగింది?" అడిగింది నడివయసు

"నాకు కోవిడ్ వైరస్ తగిలింది … అందుకని గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉండాలని అన్నారు ...తీరా అక్కడకి వెళ్తే నన్ను పట్టించుకునే వాళ్ళెవరూ లేరు...నర్సులు రోజుకొకసారి మాత్రమే కనిపించేవారు...డాక్టర్లు ఎప్పుడైనా వచ్చేవారు

అందరూ భయంతోనూ అలసటవల్లా చాలా విసుగ్గా ఉన్నారు ... అసలే తెలియని రోగం దాని పైన వీళ్ళ వ్యవహారం...నా పై ప్రాణాలు పైనే పోయాయి ...ఆసుపత్రి నుంచి పారిపోయాను.. రోడ్డు మీద కొచ్చాక మరింత భయం వేసింది ...

ఆ టెన్షన్ భరించలేక ఐదో అంతస్తు నుంచి దూకి ఇలా వచ్చేసాను ... ఇక్కడికొచ్చాక అనిపిస్తోంది నేను ఎంత బాధ్యతరహితం గా వ్యవహరించానో" అన్నాడు దీన ఆత్మ

"ఎందుకలా అనుకుంటున్నావు?" అడిగింది అమ్మాయి

"నేను కొందరికి ఆదర్శం అయితే ప్రమాదం కదా.... ఈ పరిస్థితిని ఎదిరించి గట్టిగా నిలబడి ఉంటే కొందరికైనా ధైర్యం ఇచ్చే వాడిని...ఇప్పుడెవరైనా నా దారి మంచిదనీ, ఈ దార్లో వెళ్లడం వల్ల వత్తిడిల నుంచి విముక్తి పొందవచ్చునని అనుకుంటే ఇబ్బంది" అన్నాడు దీన ఆత్మ

"మనిషి మనసుని ఉత్తేజితం చేసుకోవడం బాగా అలవాటు చేసాడు ... అలాంటి ఉత్తేజ పడినవాడో …వేరే కారణాల వల్ల నిరాశగా ఉన్నవాడో వీడిగురించి తెలుసుకుంటే ప్రేరణ పొందే అవకాశం ఎక్కువగా ఉంది కదా" కొంచం ఆందోళణ గా అన్నాడు పెద్దరికపు

"అది నిజం...ఆమాటకొస్తే మనమందరం అలాంటి తప్పులే చేసాం... ఈ విషయాలు ఇంతకూ ముందులా ప్రజల ద్వారా ప్రాచుర్యం పొందక్కర లేదు...చాలా మాధ్యమాలు ఏర్పడ్డాయి...వాటి వల్ల మాములు విషయం కూడా చాలా ప్రముఖమైన విషయమై పోతుంది...అందరి కళ్ళల్లో పడుతుంది" అన్నాడు అసహన

"ఇవాళ ఉన్న మాధ్యమాల ముఖ్యోద్దేశం ఎక్కువ మంది చదవడం మాత్రమే...అవి ఎలాంటి ప్రోద్భలం కలిగిస్తాయి దానివల్ల వచ్చే సమస్యలేంటి లాంటి విషయాలు ఆ మాధ్యమాల ద్వారా వార్తలు ప్రచురించే వాళ్లకు ముఖ్యం కాదు" అన్నాడు పెద్దరికపు

"సాంఘిక మాధ్యమాలు పెరగడం...అందరి దగ్గర ఫోన్లో వార్తలు చదివే అవకాశం ఉండడం ఈ పరిస్థితి ని ఇంకా ప్రమాదకరం చేసేస్తోంది" అన్నాడు అసహన

ఇదంతా ఒప్పుకుంటున్నట్టు తలాడిస్తూ నిట్టూర్చాడు దీన ఆత్మ

"మనుషుల మీద సాటి మనుషులకి నమ్మకం పోయింది...మనసులో మాట చెప్పుకునే తోడు లేని వాళ్ళు ఎక్కువయ్యారు" అన్నాడు పెద్దరికపు నెమ్మదిగా 

"కోవిడ్ గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ అయినా వైద్య సిబ్బంది ధైర్యంగా ఎదుర్కొంటున్నారు ...

వాళ్ళు మనతో ఎలాప్రవర్తించాలి అనేదానికంటే మనం వాళ్ళ మానసికతను ఎలా అర్ధం చేసుకుంటాము అనేది ఎక్కువ విలువైనది ...

వాళ్ళు మనకీ ...మనం వాళ్ళకీ సాయం చేసుకోక పొతే ఈ అయోమయపు కాలంలో చాల కష్టం...నాకు అది ఇక్కడకొచ్చాక కానీ అర్ధం కాలేదు" అన్నాడు దీన ఆత్మ

"అందరికి నమ్మకమిచేవాళ్ళు అవసరం అన్నాడో ఓ పెద్దాయన... ఇంతకుముందులా సమూహాలుగా ఉండేటప్పుడుమనసులో మాటలు పంచుకునే వాళ్ళు దొరికే వాళ్ళు..

ఇప్పుడు మన భావాలు పంచుకోవడానికి ప్రముఖంగా సామజిక మాధ్యమాలు వాడుతున్నాం...

 …సామజిక మాధ్యమాలంటేనే ఒంటరితనం....ఏ ఇద్దరికీ మధ్య మానసిక బంధం ఏర్పడదు ...నీ కష్టం రాసుకుంటే వాళ్లకు తోచినది వాళ్ళు రాస్తారు..కొన్ని చిన్న మాటలతో వ్యక్తీకరించ వచ్చు,.. కొందరు కవితాత్మకంగా రాయొచ్చు ..ఇవి మన మనసులని తాకడానికి అవసరమైన జీవశక్తి కలిగి ఉండవు" వ్యాఖ్యానించాడు హడావిడి

"ఒంటరి తనం ఇవాళ సామజిక మాధ్యమాల వల్ల వచ్చిందేమీ కాదు లే... మనిషి ఎప్పుడు ఒంటరే ...

భార్యాభర్తల మధ్యా లేక సోదరవర్గం మధ్య కూడా వైరుధ్యాలు ఉంటాయి ...

మనిషి తాను లోనయ్యే అనుభవాల వల్ల మారుతుంటాడు ...పెరుగుతుండొచ్చు...లేదా కుంచించుకు పోవచ్చు...అది సామజిక కార్యక్రమం కాదు...

పెద్ద పెద్ద రచయితలూ, కళాకారులూ, నటులూ వగైరాలు ఏం పోయిందని మన లోకానికి వస్తారు? హెమ్మింగ్వే , మయకోవ్స్కీ , శైలేంద్ర లాంటి వాళ్ళు తక్కువ సాధించారా తక్కువ పెరిగారా?" అడిగాడు అసహన

"అలాంటి కళాకారులు నిరంతరం మామూలు మనుషులకన్నా ఎక్కువగా పరిణమిస్తుంటారు... అందుచేత వాళ్లెప్పుడూ వాళ్లెప్పుడూ ఒంటర్లే ..

అదీకాక వాళ్ళు కొత్త విషయాల్ని సృష్టిస్తుంటారు…వాళ్ళకి ఎక్కడా పోల్చుకోవడానికి ఏ విధమైన ఉదాహరణలూ ఉండవు....వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండడం అవసరం " అన్నాడు పెద్ద రికపు

“ఈ రోజుల్లో నాక్కొంచెం నమ్మకమివ్వు అని ఎంత మొత్తుకున్నా ఎవరి దగ్గర టైమూ, ఇంట్రెస్టు ఉన్నాయి? ఎవరి జీవిత గమనం వాళ్లకు ముఖ్యం అది వదిలి వేరే జీవితాలను గురించి ఆలోచించడం మానేశారు” అన్నాడు హడావిడి

"ఆశ పెరిగిపోయింది బాబాయ్...పూర్వం బంధాల్ని మార్చలేమేమో అన్న భయంతో బంధ విముక్తులయ్యే వాళ్ళు ఇప్పుడు బంధాల్ని కొనలేమేమో అని..."నసిగాడు అసహన

"అది కొంచం సభ్యత లేని కరుకు మాటరా ...మనం ఈ ప్రపంచంలో ఏదైనా కోరుకొంటే ఈ ప్రపంచపు పద్ధతిలోనే కోరుకోవాలి ... కొందరు మనవాళ్ళు అనీ కొందరు బయటవాళ్ళు అనీ అనుకోవడం అర్ధంలేని విషయం..." అన్నాడు పెద్దరికపు

"అంటే బంధుప్రీతి వల్ల మనల్ని తొక్కేస్తున్నారు అని నిరాశ పడడం అర్ధంలేని విషయం అంటావా?" అడిగాడు కుర్రాడు

"శుద్ధ అనవసరం, మన ప్రతిభని చూసి ఎవ్వరూ దూరం పెట్టరు.... మనవల్ల వాళ్ళకు ఇబ్బంది కలుగుతుందంటే దూరం పెడతారు అన్నాడు పెద్దరికపు

"అంటే ఈ మధ్య కాలం లో మన దారి పట్టిన ఒక సినిమా నటుడి ఆలోచనలు తప్పంటారా? " అడిగాడు కుర్రాడు

"ఆ నటుడి ఆలోచనలేమిటో మనకింకా తెలియదు...ఇంకా మన ప్రపంచం లోకి రాలేదు...ఎక్కడ వెళ్ళాడుతున్నాడో" అన్నాడు పెద్దరికపు

ఇంతలో అటుగా వస్తున్న సాములోరిని చూసి అన్నీ ఆత్మలూ నేల మీద పడి దణ్ణాలు పెట్టారు

"ఈయనేనా మీరు చెప్పిన స్వామి? నేను బతికుండగా చెప్పిందెవరికీ అర్ధం కాలేదు ...స్వాములూ బాబాలూ బూటకాలు..."ఉత్సాహంగా ప్రారంభించేడు హేతువాది

"ఒరే హేతూ నువ్వు నోరు ముయ్యక పొతే మేమందరం కలిసి తంత్రం చేసి నిన్ను మళ్లీ భూలోకానికి పంపిస్తాం " బెదిరించాడు పెద్దరికపు

"ఒద్దు ఒద్దు...పాత వాసనలు పోక కాస్త నోరుచేసుకున్నాను...వదిలేయండి" అన్నాడు హేతువాది

"ఇది ప్రారబ్ద కర్మ నాయనా!!! మనుషులకి ఈ జీవితం నుంచి ఏం ఆశించాలో తెలియని అయోమయం ఏర్పడింది...కోరికలు ఉండాలి కానీ అవి సాపేక్షం కాకూడదు

...నా కోరిక పక్క వాడి జీవితం మీద ఆధార పడితే …నేను ఒక అస్థిరమయిన భావాన్ని జీవితాంతం భరిస్తుండాలి…

"మన దేశంలో 90 వ దశకం నించి పెద్దవాళ్ళు వాళ్ళ ఆశలని పిల్లలమీద రుద్దడం ప్రారంభించారు... అది తప్పు అని వాళ్లకు తెలియదు ... వాళ్ళు పడిన కష్ఠాలు పిల్లలు పడకూడదు అన్నదే వాళ్ళ కోరిక” " అన్నారు స్వామిజీ

“ఒక లక్ష్యం ఉండడం తప్పు కాదు కానీ దాని నుంచి మన మొత్తం జీవితానికి సంబందించిన గౌరవం సాధించే ప్రయత్నం చెయ్యడం వల్ల ఎంతో వత్తిడి కలుగుతుంది …

ఈ ఆలోచనలు ఎంతగా పిల్లల్ని ప్రభావితం చేసాయంటే అవి వాళ్ళ ఉపచేతన లో చేరి పోయాయి ...ఇప్పుడు ఎవరైనా సంతృప్తి కరమైన జీవితం గడుపు అంటే ...నా లక్ష్యం నేను సాధించినప్పుడే సంతృప్తి అనే స్థితి కి వచ్చాము ..." పొడిగించారు స్వామిజీ

"అవును నా చిన్నప్పుడు మా నాన్న రోజూ నా చదువు గురించీ, గెలుపు గురించీ, నేను చెయ్యబోయే పెద్ద ఉద్యోగం గురించీ మాట్లాడుతుండే వాడు...తన ఎదుగుదలా, సంతృప్తీ గురించి అసలు ఆలోచించే వాడు కాదు" అన్నాడు అసహన

"నేనైతే అమెరికాలోని 50 స్టేట్స్ పేరులు వాటి రాజధానిలు అవ్వన్నీ బట్టీ కొట్టేసాను… నేను ఎక్కడ సెటిల్ అయితే ఏం లాభం అని వచ్చిన వాళ్లందరితోను చర్చించే వాళ్ళం " అన్నాడు హడావిడి ]

“అందులో తప్పేం లేదు...అందరికి లక్ష్యాలు ఉండాలి.. ఒకవేళ అవి ఎందువల్లయినా కుదరక పోతే మరో దారి వెతుక్కోవాలి... నిరాశపడకూడదు”స్వామిజీ చిరునవ్వు నవ్వి కొనసాగించారు

"ఈ గవర్నమెంట్ అధికారీ ఇంకా అమ్మాయి వీళ్లంతా అలాంటి స్థితి లోకే చేరారు...వాళ్ళ లక్ష్యం గొప్పగా విలాసవంతంగా బతకాలని...అదేం తప్పు కాదు...కానీ వాళ్ళు ఎన్నుకున్న దార్లో అది సులభం కాదు...అందుకనే అడ్డదారి పట్టారు .... అలాంటి వాళ్ళకి మనో ధైర్యం కలగదు" అన్నారు స్వామిజీ

"మరిఅందరికీ దారి చూపించి, ఉత్సాహం నింపి కొత్త దార్లలో వెళ్లేందుకు ప్రేరేపించే కళాకారులు ఎందుకు స్వామీ ఇక్కడకొచ్చ్చారు?" అడిగాడు కుర్రాడు

"ఆ కళాకారులకు కూడా కొంచం అలాంటి పరిస్థితే వచ్చింది... కళారాధన ఒక్క కళ కోసమే కాకుండా వాణిజ్య విలువలు కూడా వచ్చి చేరిపోయాయి…మన కళని ఇష్టపడటం అంటే మనకి వాణిజ్య పరంగా పెద్ద విజయం రావటమే అనే భావన పెరిగింది”

“అది తప్పు కాదు, కానీ వాణిజ్య పరమైన విజయం రావాలంటే మనం ప్రజల్లో ఎదో ఒక ముఖ్యమైన పార్శ్వాన్ని స్పృశించాలి...

ప్రజలలో ప్రతి వారికి కూడా ఒక జీవితం ఉంటుంది ఆ జీవితం ఇచ్చే అనుభవం వల్ల వాళ్ళు ఒక కళా రూపాన్ని ఇష్టపడొచ్చు… లేదా ఇష్టపడక పోవొచ్చు

ఆ విషయాన్నీ అర్ధం చేసుకుని అంగీకరించలేకపోతే కళాకారులకి ఇలాంటి నిరాశే కలుగుతుంది” అన్నారు స్వామిజీ

వేసిన దారిలోనే విజయం సాధించాలంటే అది రద్దీగా ఉంటుంది ... ఆ దారి ఎన్నుకున్నపుడు మన ప్రయాణం ఏ అడ్డంకీ లేకుండా సాగుంతుందని అనుకోకూడదు ....

మనో బలం కోల్పోకుండా ముందుకు సాగాలి ...

లేకపోతే కొత్త దారి మనమే వెయ్యాలి ....మనందరిలోను కొత్త విషయాలు సృష్టించే శక్తి ఉంటుంది... మనో బలమే ఉండదు"" వివరించారు 

"దీనికి పరిష్కారం లేదా స్వామీ?" అడిగాడు పెద్దరికపు

"మన జీవితాన్ని ఎలా ఉంటే ఆలా అంగీకరించడమే దారి...

కోరికలు ఉండడం, అవి తీర్చుకోవాలనుకోవడం తప్పు కాదు... కానీ దార్లో కొన్ని అడ్డంకులు వస్తున్నాయని నిరాశపడడం అనవసరం….

మన జీవితాలనుంచి చాలా ఎక్కువ ఆశించడం మాని...జీవితం విలువ జీవితమేనని దానికి వాణిజ్య విలువ కట్టలేమని అర్ధం చేసుకోవడమే దారి..

మానవ జన్మ ఒక వరం... దాన్ని చిన్నచిన్న విషయాల కోసం వదలడం అవివేకం." ముగించారు స్వామీజీ 

తూర్పున తెల్లవారుతోంది ... అరుణుడు తిరిగి నారింజ రంగు పులమడం ఆరంభించాడు ... ఆత్మ లోకం నిశ్శబ్దమయింది ...

ఆత్మలు రకరాల భంగిమల్లో కునికి పట్లు పడసాగాయి...

ఇవేవీ పట్టనట్టు మానవ ప్రపంచం తమ సమస్యల గురించి ఆలోచిస్తూ ...దిగులు పడుతూ ...దారిదొరుకుందేమో అనే చిరు ఆశల తో ఉత్సాహ పడుతూ రోజు ప్రారంభించడానికి సిద్ధమౌతోంది



Rate this content
Log in

Similar telugu story from Action