అలా 2017 లోకి
అలా 2017 లోకి
ఈ మధ్య చూసిన సినిమాలలో, సరిలేరు నీకెవ్వరు నాకు ఎంతగానో నచ్చింది.
సరిలేరు నీకెవ్వరు రూపంలో 2020 కి చక్కటి హిట్ లభించింది అనిపించింది. అలాగే, 2019 అనగానే, రైతుల గొప్పతనం గురించి అందంగా అర్థమయ్యేలా చెప్పిన మహర్షి గుర్తు వస్తుంది. కాస్త వెనకకు వెళ్ళి 2018 అంటే, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, గీత గోవిందం గుర్తు వచ్చింది.
ఇలా అలోచిస్తున్న నాకు, ఎందుకో ఒక్కసారి 2017 లోకి వెళ్ళాలి అనిపించింది.
ఆ సంవత్సరంలో ప్రతీ నెల, ప్రతీ పండుగ బాగా గుర్తు ఉండిపోయేలా, ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి.
ఇప్పటికీ ఆ అనుభూతులు నా మదిలో మెదులుతూనే ఉంటాయి.
మరి ఒక్కసారి అలా 2017 లోకి వెళ్ళి వద్దామా !!
ముందుగా,
సంక్రాంతి నెల మొదలవుతూనే, బాక్స్ ఆఫీసు దగ్గర 3 సినిమాలు బోలెడంత సందడి చేసేయి.
ముందు ఏ సినిమాకి వెళ్ళాలో కూడా ప్రేక్షకులు తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు అంటేనే, ఆ
చిత్రాలు ఎంత ప్రత్యేకమైనవో తెలుస్తోంది.
వాటిలో మొదటగా,
చిరంజీవి అభిమానుల ఎన్నో ఏళ్ళ నిరీక్షణకు తెర తీస్తూ వచ్చిన చిత్రం,
ఖైదీ 150
మన మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు అన్నిటినీ తిరగ రాసి, సంక్రాంతి పండగ అంతా తనదే అన్నట్టుగా సందడి చేసింది.
ఆరు నెలల పసి పిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ళ పెద్దలు దాకా, అందరూ చిరంజీవి మాయలో పడిపోయారు అంటే, అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు.
డాన్సులు, ఫైట్లు, కామెడీ, యాక్షన్, పంచ్ డైలాగులు,
ఇలా ప్రతీ దాంట్లో తనదయిన స్టైల్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
ఎన్నో ఏళ్ళ తరువాత, ఈలలు, గోలలు, కేరింతలు, చప్పట్లు మధ్య మెగాస్టార్ సినిమా చూసిన ఆనందం, ఇవాళ, ఇపుడు తలచుకున్నా, ఒక్కసారి హాలులో ఉండి సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
సంక్రాంతి పండుగ అంతా, చిరంజీవిదేనా అన్నట్టుగా, రికార్డుల మోత మోగింది.
సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ ముక్త కంఠంతో చెప్పిన ఒక్కటే మాట,
"Boss is back, get ready."
అని.
అలా "అమ్మడు Let's do కుమ్ముడు"
అంటూ చిరు మేనియాలో ఉన్న ప్రేక్షకుల ముందుకు,
భారతదేశంలో, శాతవాహన శకాన్ని ఆరంభించిన శాతకర్ణి చరిత్రను ఆవిష్కరిస్తూ వచ్చిన చిత్రం,
గౌతమీపుత్ర శాతకర్ణి
తెలుగు జాతి గర్వించ దగ్గ "శాతకర్ణి" చరిత్రను, నేటి తరానికి తెలిసేలా, దర్శకుడు క్రిష్ ఎంతో అందంగా తెర పై ఆవిష్కరించారు. మరచిపోతున్న చరిత్రను తిరిగి మళ్ళీ గుర్తు చేశారు.
చరిత్ర తెలియని వారి అందరికీ అతడి గొప్పదనాన్ని పరిచయం చేశారు.
బాలకృష్ణ గారి అభిమానిగా థియేటర్లకు వెళ్ళినా కూడా,
ఒక్కసారి షో మొదలయితే,
మనకి గౌతమీ పుత్రుడైన శాతకర్ణుడు మాత్రమే కనిపిస్తాడు తప్ప, ఎక్కడా బాలయ్య కనపడరు.
అంతగా, నందమూరి నటసింహం ఆ పాత్రలో ఒదిగిపోయారు.
"దొరికినవాడిని తురుముదాం.....దొరకని వాడిని తరుముదాం......ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం''
వంటి అద్భుతమైన డైలాగులు బాలయ్య నోటి నుంచి వస్తూంటే అభిమానుల సంతోషానికి అవధుల్లేవు.
ఇలా శాతకర్ణి చరిత్రను ఇంకా ఇంకా తెలుసుకోవాలి అని, మళ్ళీ మళ్ళీ ఆ చిత్రం చూస్తున్న ప్రేక్షకుల ముందుకు,
పల్లెటూరి ఆప్యాయతలు, సంక్రాంతి సంబరాలు, మోసుకొచ్చిన చిత్రం,
శతమానంభవతి
సంక్రాంతికి, కుటుంబమంతా కలిసి చూసేలా చక్కటి చిత్రాన్ని అందించారు దిల్ రాజు గారు.
సంక్రాంతి అనగానే వెంటనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గుర్తు వస్తుంది.
ఆ చిత్రంలో కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతలను చక్కగా చూపించారు.
మళ్ళా అటువంటి పల్లెటూరి వాతావరణాన్ని గుర్తు చేస్తూ, చక్కటి ఫ్యామిలీ ఏమోషన్స్ తో, మంచి కామెడీతో, సందర్భానికి తగ్గట్టుగా వచ్చే పాటలతో, పచ్చని పల్లెటూరి లోగిళ్లతో, ప్రేక్షకులను ఆద్యంతం అలరించేలా తీసిన చిత్రం శతమానంభవతి.
వీటితో పాటు, బంధాలు అనుబంధాలు గురించి చిన్న మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసేరు.
విదేశాలలో స్థిరపడి కూడా తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటున్న ఎందరో మన చుట్టూ ఉన్నారు. అలాంటి వారిని చూసి కూడా నేర్చుకోకుండా,
సొంతూరిని, తల్లిదండ్రులను మర్చిపోయి విదేశాల్లో స్థిరపడి, కుటుంబ విలువలను పూర్తిగా మర్చిపోతున్న ఆ కొందరికి మాత్రమే, సున్నితంగా వాటి ప్రాముఖ్యతను తెలియజెప్పే ప్రయత్నం చేసేరు.
చిత్రంలోని ప్రతీ సన్నివేశం అద్భుతంగా అందంగా తీసేరు. ముఖ్యంగా క్లైమాక్స్ లో కుటుంబ విలువల గురించి చెప్పే సన్నివేశాలు అన్నీ, ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
మిక్కీ జే మేయర్ అందించిన,
"మెల్లగా తెల్లారిందో ఇలా....."
"శతమానంభవతి......"
వంటి పాటలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
ఇలా ఆత్రేయపురం లో సంక్రాంతి జరుపుకుంటున్న ప్రేక్షకుల ముందుకు,
BA పాస్ అయినా....అరె MA పాస్ అయినా.....
Btech పాస్ అయినా....మరి Mtech పాస్ అయినా.....
కంగ్రాట్స్ అనో సూపర్ భయ్యో అనడం మానేసి,
మనకే తెలియని future గురించి
ఫూలిష్ ప్రశ్న ఎంటి.......
నెక్స్ట్ ఎంటి.....అంటూ ఈ గోల ఎంటి....
అంటూ వచ్చిన చిత్రం,
నేను లోకల్
నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది.
సినిమా మొత్తం సరదా సన్నివేశాలతో, చక్కటి పాటలతో, చిన్న చిన్న ట్విస్ట్ లతో, ఎక్కడా బోర్ కొట్టకుండా సాఫీగా సాగిపోయింది.
దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, సినిమాకి మంచి హైలైట్ గా నిలిచాయి.
అలా ఆ పాటలు వింటూ,
"side side side please.....we are the local....."
అని పాడుకుంటున్న సమయంలో,
హాథి రామ్ బాబా అనే భక్తుని చరిత్రతో మన ముందుకు వచ్చేసింది,
ఓం నమో వేంకటేశాయ
ఏడు పదుల వయసులో కూడా, నేటి తరం దర్శకులకు ఏ మాత్రం తగ్గకుండా, తన స్టైల్ ని
ఎక్కడా వదలకుండా,
మళ్ళా అన్నమయ్య, శ్రీరామదాసు, సినిమాలు గుర్తుకు వచ్చేలా,
ఓం నమో వేంకటేశాయ చిత్రాన్ని తీసిన, మన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారికి, ముందుగా హాట్స్ ఆఫ్ చెప్పాలి అనిపిస్తుంది.
ఎన్ని భక్తి రస చిత్రాలు వచ్చినా, ఎందరు భక్తులుగా నటించినా కూడా, భక్తుడు అనగానే మన నాగార్జున గారు మాత్రమే గుర్తుకు వస్తారు.
అన్నమయ్య, శ్రీరామదాసు, చూస్తున్నపుడు ఎలా అయితే మనకు నాగార్జున గారు కనపడలేదో,
అలాగే ఈ చిత్రంలో కూడా హాథి రామ్ బాబా తప్ప ఎక్కడా నాగార్జున గారు కనపడరు. అంతగా ఆ భక్తుడి పాత్రలో ఒదిగిపోయారు మన యువసామ్రాట్.
మరచిపోయిన హాథి రామ్ బాబా చరిత్రను మళ్ళీ తిరిగి గుర్తు చేసేరు. తెలియని వారి అందరికీ ఆ భక్తుడి గొప్పదనాన్ని పరిచయం చేసేరు.
కీరవాణి గారి సంగీతం ఎప్పటిలానే శ్రోతలను చక్కగా అలరించింది.
కలియుగ వైకుంఠపురి సిరి గల వేంకట గిరి.....
అనే పాట ద్వారా, తిరుమల చరిత్రను తెలియ చేసేరు.
వేయి నామాల వాడ వేంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా.....
అనే పాట ద్వారా శ్రీనివాసుని నామాల ప్రత్యేకతతో పాటు,
సుప్రభాతం, నిజపాద దర్శనం వంటి స్వామి సేవల యొక్క ప్రాముఖ్యత కూడా తెలియచేసేరు.
కమనీయం కడు రమణీయం శ్రీ వేంకటేశ్వర కళ్యాణం.....
అనే పాట ద్వారా, స్వామి కళ్యణోత్సవం గురించి తెలియచేసేరు.
ఇలా భక్తి సాగరంలో లీనమై ఉన్న ప్రేక్షకుల ముందుకు,
బాక్సింగ్ కోచ్ గా వచ్చేసాడు మన,
గురు
Boxer గా తను సాధించలేని విజయాలను తన శిష్యురాలు సాధించాలి అని కలలు కనే, ఓ గురువు కథే ఈ గురు.
ఈ చిత్రంలో గురువు, శిష్యురాలి మధ్య ఉండే ఎమోషన్స్ ని, చాలా చక్కగా చూపించారు.
గురువుగా వెంకటేష్ గారు, శిష్యురాలిగా రితికా సింగ్, తమ తమ పాత్రల లో చక్కగా జీవించారు.
ముఖ్యంగా,
"జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి......"
అంటూ వెంకీ పాడిన పాట ప్రేక్షకులను బాగా అలరించింది.
అయిదు పదుల వయసులో బాడీ బిల్డింగ్ చేసి ఇంత పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వెంకీని అభినందిస్తున్న ప్రేక్షకుల ముందుకు,
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకు జవాబుతో వచ్చేసేడు, మన
బాహుబలి
బాహుబలి The Beginning విడుదలై రెండేళ్ళు అయినా,
''కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు''
అనే విషయం పట్ల ఆసక్తితో, ప్రేక్షకులు రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నారంటే
,
దానికి కారణం దర్శకుడు రాజమౌళి గారు అనే చెప్పాలి.
ఇప్పటికీ మనం, ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క అనే బదులు,
బాహుబలి, భల్లాలదేవ, శివగామి, దేవసేన,
అని గుర్తు చేసుకుంటున్నాము అంటేనే, వారు ఎంతగా ఆ పాత్రలకు ప్రాణం పోశారో అర్థమవుతుంది.
అందుకే, సినిమా వచ్చి ఇన్నేళ్ళు అయినా కూడా, వీరి పాత్రలు మనకి అంతలా గుర్తుండి పోయాయి.
అద్భుతమైన కథతో, అదిరిపోయే మలుపులతో, అందమైన సందర్భోచితమైన పాటలతో, ఊహకందని ట్విస్టులతో, అబ్బురపరిచే
యుద్ధ సన్నివేశాలతో, ప్రేక్షకులను కట్టిపడేయటంలో, చిత్ర యూనిట్ నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అయ్యింది.
తన విజువల్ ఎఫెక్ట్స్‌తో, ప్రేక్షకుల్ని మరో లోకానికి, కాదు కాదు, అద్భుతమైన ఊహా లోకానికి తీసకెళ్ళాడు దర్శకుడు రాజమౌళి.
కీరవాణి గారి సంగీతం ఎప్పటిలానే శ్రోతలను చక్కగా అలరించింది. పాటలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి.
రాజమౌళి గారి విజన్ ను తెరపై, అద్భుతంగా చూపించడంలో, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తన పనికి పూర్తి న్యాయం చేశాడు.
ఇలా మళ్ళీ మళ్ళీ ఆ విజువల్ వండర్ ని చూస్తూ,
హాయయిన హంస నావలో తేలుతున్న ప్రేక్షకుల ముందుకు,
ఇంగువ లేకుండా పులిహోర ఎలా చేస్తారు అంటూ వచ్చేసేడు.
DJ దువ్వాడ జగన్నాథం
దువ్వాడ జగన్నాథం శాస్త్రి అనే క్యాటేరింగ్ చేసుకునే ఓ బ్రాహ్మణ యువకుడిలా, మరో పక్క అన్యాయాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించే DJ లా, ఈ చిత్రంలో అల్లు అర్జున్ చక్కగా నటించారు.
సినిమా అంతా, పంచ్ డైలాగులు, కామెడీ, చక్కటి యాక్షన్ సీన్స్ తో, చిన్న చిన్న ట్విస్ట్ లతో ఇంట్రెస్ట్ గా సాగిపోతుంది.
బ్రాహ్మణ యాసలో తన మాటలతో బన్నీ అందరినీ మెప్పించారు.
ముఖ్యంగా,
"ఇంగువ లేకుండా పులిహోర చేస్తూ, సభ్య సమాజానికి మనమేం మెసేజ్ ఇస్తున్నట్టు ?"
వంటి డైలాగులు ప్రేక్షకులను చక్కగా అలరించాయి.
ఇలా, DJ శరణం భజే భజే, సీటీమార్ సీటీమార్ వంటి, దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు వింటూ, ఎంజాయ్ చేస్తున్న మన ముందుకు,
ఓ కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం,
నిన్ను కోరి
రొటీన్ లవ్ స్టొరీలకు భిన్నంగా, కాస్త కొత్తగా వచ్చిన చిత్రం నిన్ను కోరి.
హీరో నాని, సెకండ్ హీరో ఆది, హీరోయిన్ నివేత, తమ తమ పాత్రలకి చక్కటి న్యాయం చేసేరు.
ప్రేమించి పెళ్ళి చేసుకోవడం కుదరకపోతే, పెళ్ళి చేసుకొని కూడా ప్రేమించవచ్చు అన్న సున్నితమైన విషయాన్ని, నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పడంలో చిత్ర యూనిట్ పూర్తిగా సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి.
ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా, చక్కటి కామెడీతో, సందర్భానికి తగినట్లుగా వచ్చే పాటలతో, ఎమోషన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ, సినిమాని అందంగా ప్రెజెంట్ చేశారు.
ఇలాంటి బ్యాలెన్స్ అండ్ మెట్యుర్డ్ లవ్ స్టొరీని ఎంజాయ్ చేస్తున్న మన ముందుకు,
Love Hate Love అంటూ వచ్చింది,
ఫిదా
ట్రైలర్ చూడగానే ఫిదా, పాటలు వినగానే ఫిదా !!
ఎక్కడ విన్నా ,
వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే.....అన్న పాటే !!
ఇక సినిమా చూడగానే పూర్తిగా ఫిదా !!
సినిమాలో హీరో వరుణ్ తేజ్ ఒక సందర్భంలో,
"ఏమి పిల్ల రా బాబు !! అస్సలు మైండ్ లో నుంచి వెళ్ళట్లేడు. ఫుల్ ఫిదా !!"
అని అంటాడు.
అలాగే సినిమా చూసిన ప్రేక్షకులు కూడా,
"ఏమి సినిమా రా బాబు, అస్సలు మైండ్ లో నుంచి వెళ్ళట్లేదు, ఫుల్ ఫిదా అన్నారు."
ఎందుకంటే, భానుమతి లాగా ఫిదా కూడా ఒక్కటే piece, hybrid piece.
మిక్కీ జే మేయర్ అందించిన,
వచ్చిండే పిల్ల మెల్లగ వచ్చిండే....
ఊసుపోదు ఊరుకోదు.....
వంటి పాటలు వింటూ, అలా ఫిదా మాయలో ఉండగానే, దసరా పండుగ వచ్చేసింది.
తనతో పాటు, అందమైన అన్నదమ్ముల కథను తీసుకొచ్చేసింది, అదే,
జై లవకుశ
Young Tiger NTR, మూడు విభిన్న పాత్రలలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
మంచితనం తప్ప ఇంకేమీ తెలియని లవుడిలా,
కొంటెతనం చిలిపితనం టక్కరితనం మాత్రమే తెలిసిన కుసుడిలా,
ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే ఉంటూ, పరిస్థితుల ప్రభావం వల్ల రాక్షసుడులా మారిన రావణుడిలా,
ఇలా మూడు భిన్న కోణాలలో ఉన్న పాత్రలను, NTR అద్భుతంగా ప్రెజెంట్ చేసేరు.
కాదు కాదు, ఒదిగిపోయారు.
NTR త్రిపాత్రాభినయం చేస్తున్నారు అని తెలిసే థియేటర్లకు వెళ్ళినా, సినిమా చూస్తున్నంత సేపూ మాత్రం, జై, లవ, కుశ మాత్రమే కనిపిస్తారు తప్ప, ఎక్కడా కూడా NTR కనపడరు.
లవుడు మంచితనం, అమాయకత్వం చూసి మురిసిపోతూ, కుసిడి కొంటెతనం చూసి నవ్వుకుంటూ, జై క్రూరత్వం చూసి భయపడుతూ,
ఇలా భిన్నమయిన అనుభూతులకు లోనవుతున్న ప్రేక్షకులకు, ఒక్కసారిగా క్లైమాక్స్ లో, జై లో ఉన్న మంచితనాన్ని, ప్రేమని, హీరోయిజంను పరిచయం చేస్తూ, అప్పటి దాకా, విలన్ గా ఉన్న జై ఇమేజ్ కి హీరోయిజంను జోడించి, ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిల్లేలా చేసేరు.
"అందమయిన లోకం, అక్కడో ఆకాశం, ఎగురుతున్న పక్షులే మూడు....."
అనే పాటతో పాటు,
"ట్రింగ్ ట్రింగ్ ట్రడాంగ్ ట్రింగ్ ట్రింగ్"
వంటి ఫాస్ట్ బీట్ సాంగ్స్ ని కూడా అందించిన,
దేవి శ్రీ ప్రసాద్ ని మెచ్చుకుంటూ, పదే పదే ఆ పాటలు వింటున్న ప్రేక్షకుల ముందుకు,
"రాజా రాజా రాజా ది గ్రేటురా!! నువ్వు తళ తళ టు థౌజండ్ నోటురా....."
అంటూ వచ్చాడు,
రాజా ది గ్రేట్
ఒక్క మాటలో చెప్పాలి అంటే, దీపావళి సందడి అంతా మాస్ మహారాజాదే అనిపించింది.
ఎన్నో రోజుల నుంచి సరయిన హిట్ కోసం ఎదురుచూస్తున్న, రవితేజ గారు ఈ చిత్రంతో, చక్కటి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
ఇందులో, రవితేజ అంధుడిగా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
యాక్షన్, కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్, పంచ్ డైలాగులు, ఫైట్లు, డాన్స్, టైమింగ్, ఒకటేమిటి,
ఇలా ప్రతీ దాంట్లో తనదయిన విభిన్నమయన స్టైల్ తో ప్రేక్షకులను చక్కగా అలరించారు.
థియేటర్లో ఆయన చేసిన కామెడీని ప్రేక్షకులు చాలా చాలా ఎంజాయ్ చేసారు.
ఆ రోజు నుంచీ ఈ రోజు వరకూ, చక్కగా నవ్వుకునే సందర్భం వేస్తే చాలు,
"It's laughing time.....Hu Hu Hoo Hu....Hu Hu Hu Hoo Hoo....."
అనడం అలవాటుగా మారిపోయింది అంటే, ఆ క్రెడిట్ పూర్తిగా దర్శకుడు, హీరో లకే దక్కుతుంది అని చెప్పాలి.
దానితో పాటు, రోజువారీ దినచర్యలో, సందర్భోచితంగా,
"బుజ్జీ....ప్రేక్షకుల ముఖ చిత్రాలు ఏమిటో !!"
అంటూ మాట్లాడుకుంటున్న మన ముందుకు,
తన మిడిల్ క్లాస్ జీవితాన్ని పరిచయం చేస్తూ వచ్చేసాడు,
MCA
అదే, మిడిల్ క్లాస్ అబ్బాయి
ఈ చిత్రంలో, నాని సాయి పల్లవి చక్కగా నటించి అలరించారు.
DSP చక్కటి బాణీలు సమకూర్చారు.
It's a family party అనే పాట, ప్రేక్షకులను బాగా అలరించింది.
ఇలా MCA తో 2017 కు అందమైన ముగింపు వచ్చింది అనిపించింది.
ఇన్ని Big screen అద్భుతాలతో పాటు, ఓ small screen అద్భుతాన్ని కూడా, 2017 మనకి అందించింది.
అదే మన Young Tiger NTR హాస్ట్ చేసిన
Big boss
వారం మొత్తం Bigboss చూడని వాళ్ళు కూడా, శని ఆదివారాల్లో మాత్రం, కేవలం Jr NTR హోస్టింగ్ చూడటానికి, టీవీ ముందు చేరే వారు అంటే, అది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
ఇప్పటికి, ఇవాళ్టికి కూడా, నెట్ లో వెతికి మరీ, అప్పటి Jr NTR Bigboss ప్రోమోలు, ఎపిసోడ్లు చూస్తున్నారు అంటే, ఆ క్రెడిట్ మొత్తం Jr NTR కే దక్కుతుంది.
NTR, ఎంత జనరంజకంగా show ని నడిపారో చెప్పడానికి, ఆయన జర్నీ గురించి చెప్పే, ఏడు నిముషాల AV ఒక్కటి చాలు.
అలా 2017 అంటే, ప్రతీ నెల, ప్రతీ వారం, ప్రతీ పండుగ, హౌస్ ఫుల్ బోర్డ్లు తో థియేటర్లూ,
టికెట్ల వేటలో ప్రేక్షకులూ, ఎంతో సంతోషంగా సంబరంగా గడిపారు.
ఒక వారం టిక్కెట్లు దొరకకుంటే, ఇంకో వారానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం,
అలాగే, ఒకవేళ వెంట వెంటనే, రెండు మూడు చక్కటి చిత్రాలు వస్తే, ఏది ముందు చూడాలో అర్థం కాక, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో, ఒక్కటి కూడా మిస్ కాకుండా, అన్ని సినిమాలూ చూడటం,
ఏదన్నా సినిమా బాగా నచ్చితే, దానిని మళ్ళీ మళ్ళీ థియేటర్లకు వెళ్ళి చూసి రావడం,
వీకెండ్ వస్తే Bigboss లో Jr NTR కోసం ఎదురు చూడడం,
ఇలా 2017 ని, ఎప్పుడు తలచుకున్నా అప్రయత్నంగానే, మనసులో చిన్న చిరునవ్వు వస్తుంది.
అందుకే, వీలు కుదిరనప్పుడల్లా, అలా 2017 లోకి వెళ్ళి వస్తూ ఉంటాము.