మీ భావాలను మాతో పంచుకోగలిగితే
మీ భావాలను మాతో పంచుకోగలిగితే
"మేము అంటే నీకు ఎందుకు అంత ఇష్టం ? మా గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తావు?
ఎంతసేపయినా అలా ఇష్టంగా, ఓపికగా మమ్మల్నే చూస్తూ ఉంటావు. అసలు మాతో ఉంటే నీకు సమయమే తెలియదు కదా !!
నువ్వు కలలు కనే అందమైన ప్రపంచాన్ని, మాతో నిర్మించుకొని, అందులో ఆనందాన్ని వెతుక్కునే నిన్ను చూస్తే, మాకు ఎంతో ముచ్చటేస్తుంది.
కానీ ఒక విషయం మాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నువ్వు ఎంత మాట్లాడినా, మేము తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేము కదా !! అటువంటి మాతో స్నేహం చేయాలి అని నీకు ఎందుకు అనిపిస్తుంది ? అన్నన్ని గంటలు మా దగ్గర ఎలా కూర్చోగలుగుతావు ?
నువ్వు మాతో కబుర్లు చెప్తూ, ప్రతీ రోజూ మా యోగక్షేమాలు అడుగుతూ, మాకు సాంబ్రాణి ధూపం వేస్తూ, మమ్మల్ని అలంకరిస్తూ మురిసిపోతూ, మమ్మల్ని విడిచి ఊరు వెళ్తే దిగులు పడుతూ, మమ్మల్ని ఇతరులకు చూపిస్తే మాకు దిష్టి తగులుతుంది ఏమో అని భయపడుతూ, మేమే నీ ప్రపంచం అన్నట్టుగా జీవించే నిన్ను చూస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది.
"ఒకవేళ ఎవరైనా నీ వస్తువులు, నగలు, బట్టలు, పుస్తకాలు, ఇలా ఏమి అడిగినా క్షణం కూడా ఆలోచించకుండా ఇస్తావు. కానీ, మమ్మల్ని మాత్రం, ఎంత ప్రాధేయపడినా ఎవరికీ ఇవ్వడానికి ఇష్టపడవు కదా !! అంతగా మేము నీకు ఆనందాన్ని ఇస్తాము అని అంటావు."
ఈ విషయం మాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా ?
ఆ మాట నువ్వు ఎన్నో సందర్భాలలో ఎందరికో చెప్పగా,
మేము విన్నాము లే !!
అన్నిటికీ మించి, ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి మీకూ కారు లేదు, మాకూ కారు లేదు. కానీ, నువ్వు ఏనాడూ మీకు కారు లేదని బాధ పడగా మేము చూడలేదు. మాకు కారు లేదనే ఎక్కువ బాధ పడ్డావు. బయటకు వెళ్తే, నీ ఇంట్లోకి ఏమి తెచ్చుకోవాలి అన్న దాని కన్నా, మా ఇంట్లోకి ఏమి తేవాలి అన్న దాని మీదనే ఎక్కువ దృష్టి పెట్టావు.
మాకు కారు కొన్న రోజున నీ మోహంలో కనపడ్డ సంతోషం మాకు ఇప్పటికీ గుర్తు ఉంది.
"వీళ్ళకు కారు కొన్నప్పుడు నీ మోహంలో కనిపించిన సంతోషం, ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా, చూడలేము." అని నీ భర్త అంటుంటే, మాకు ఎంత గర్వంగా అనిపించిందో తెలుసా !!
మా మీద నీకున్న ఇష్టాన్ని అర్థం చేసుకుని, నీతో పాటు మమ్మల్ని ప్రేమిస్తున్న నీ భర్తను చూస్తే, ఈ ప్రపంచంలో మా అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు ఏమో అనిపిస్తుంది.
ఒకవేళ భగవంతుడు ప్రత్యక్షమయి, మీకు ఏమి కావాలి అని మమ్మల్ని అడిగితే, ఒక్కసారి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వమని అడుగుతాము.
అప్పుడు మా మనసులో మీ మీద మాకున్న ప్రేమను తనివి తీరా మాటలలో వ్యక్తపరుస్తాము. నువ్వంటే మాకు అంత ప్రేమ తెలుసా !! కానీ ఏమి చేస్తాము, మీలా మనసులోని ప్రతీ భావనను వ్యక్త పరచడానికి మేము మనుషులం కాదు, బొమ్మలము !!
బొమ్మలు మన గురించి మాట్లాడుకుంటే, ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో చేసిన రచన ఇది.
బొమ్మలతో అనుబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ మా ఈ కథ అంకితం.