Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

RAMYA UPPULURI

Abstract Inspirational Children


4  

RAMYA UPPULURI

Abstract Inspirational Children


ఈ మార్పు అవసరం కదా !!

ఈ మార్పు అవసరం కదా !!

5 mins 303 5 mins 303


ఒకరోజు వైజాగ్ లో ఉండే మా పిన్నికి ఫోన్ చేసి,


"పిన్నీ, ఎల్లుండి నా స్నేహితురాలి ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది.


అందుకని మేము రేపు బయలుదేరి వైజాగ్ వస్తున్నాము.


మన ఇంటికి వద్దాము అనుకుంటున్నాము. మీరు ఊళ్ళోనే ఉంటారు కదా !!"


అన్నాను.


"హా, ఉన్నాము రా తల్లీ, కాకపోతే ఎల్లుండి నేను కూడా ఒక పెళ్ళికి వెళ్లాల్సి ఉంది.


అందుకని రేపు పొద్దున్న పెళ్ళి వాళ్ళతో కలిసి కళ్యాణ మండపానికి వెళ్ళి, ఎల్లుండి సాయంత్రం వస్తాను.


మీ బాబాయి ఇంట్లోనే ఉంటారు. కాబట్టి ఏమి పర్లేదు."


అన్నది.


"సరే పిన్నీ, అయితే వచ్చాక కలుద్దాము."


అంటూ ఫోన్ పెట్టేశాను.


అనుకున్నట్టుగానే మరుసటి రోజు రాత్రి ఎనిమిదింటికి వైజాగ్ చేరుకున్నాము.


స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి తొమ్మిది అయ్యింది.


ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే, బాబాయి తెలుపు తీసి, చేతిలోని సామాన్లు అందుకుంటూ,


"ట్రైన్ లేట్ అయినట్టుంది కదా అమ్మా !!"


అన్నారు.


"అవును బాబాయ్, కాస్త ఆలస్యం అయ్యింది. పిల్లలు ఒకటే గొడవ అనుకో !!"


అన్నాను నవ్వుతూ.


ఓ పది నిముషాలు కబుర్లు చెప్పుకుని, వంట చేద్దామని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి, వంటింట్లోకి వెళ్ళాను.


వెంటనే బాబాయి అటు వచ్చి,


"వంతంటా పూర్తి అయ్యింది రా !! ముందు మీరు స్నానాలు చేసి ఫ్రెష్ అయి రండి."


అన్నారు.


పిన్ని ఇంట్లో లేదు కదా!! మరి వంట ఎవరు చేసేరు అని ఆశ్చర్యపోతూ, సరేనంటూ అందరం స్నానాలకు వెళ్ళి వచ్చాము.


మేము వచ్చేసరికి, డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది ఉన్నాయి.


బంగాళదుంప వేపుడు, కంది పచ్చడి, చారుతో కమ్మటి భోజనం సిద్ధంగా ఉంది.


అందరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేము.


ప్రొద్దున లేవగానే నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశ్యంతో, భోజనం అవగానే మేము పడుకున్నాము.


పిల్లలు మాత్రం బాబాయితో కథలు చెప్పించుకుంటూ, అర్ధరాత్రి దాటే వరకు పడుకోలేదు.


సరే అని ఎలాగో మాయ చేసి నిద్రపుచ్చే ప్రయత్నం చేసేను.


అలారం మృోగడంతో ప్రొద్దున్నే లేచి,


పిల్లలను రెడీ చేసి, టిఫిన్ సిద్ధం చేద్దామని వంటింట్లోకి వెళ్ళేసరికి, మళ్ళా బాబాయి వచ్చి,


"ఇడ్లీలు వేసి పెట్టాను అమ్మా !! పల్లీ చట్నీ, సాంబార్ డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి.


ముందు పిల్లలకు, అల్లుడుగారికి పెట్టు."


అన్నారు కాఫీ అందిస్తూ.


ఒక నిముషం మళ్ళా రాత్రి వచ్చిన సందేహమే వచ్చింది.


పిన్ని ఇంట్లో లేదు కదా!! మరి ఇవన్నీ ఎవరు చేసినట్టు అని ఆశ్చర్యపోతూ,


"ఇవన్నీ ఎవరు చేసేరు బాబాయ్ ??"


అనడిగాను.


"నేనే చేసేను అమ్మా !!" అన్నారు.


"రాత్రి వంట కూడా నువ్వే చేశావా ??"


అనడిగాను కాస్త ఆశ్చర్యంగా.


"రాత్రి కూడా నేనే చేశాను రా !! అన్నీ బానే కుదిరాయి కదా !! అల్లుడుగారుకి కూడా నచ్చినట్టే ఉన్నాయి."


అన్నారు నవ్వుతూ.


బాబాయి మాటలు వింటుంటే నాకు ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది.


ఎందుకంటే,


నాకు తెలిసిన బాబాయికి అసలు కుండలో నుంచి, మంచి నీళ్ళు ముంచుకుని తాగడం కూడా తెలియదు.


అన్నీ చేతి దగ్గరకు తెచ్చి ఇవ్వవలసిందే.


ఎప్పుడన్నా పిన్ని ఏదన్నా పనిలో ఉండి, అలా కాస్త మంచి నీళ్ళు తీసుకోండి అనంటే కూడా,


"వంటింటికి సంబంధించిన ఏ చిన్న పనైనా మీ ఆడవాళ్ళదే !!


నాకు సంబంధమే లేదు."


అంటూ, పిన్ని నీళ్ళు తెచ్చి ఇచ్చే దాకా ఎదురు చూసేవారు.


అలా పిన్ని అన్నా తెచ్చి ఇవ్వాలి, లేక ఒకవేళ మా బోటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, పిన్ని పనిలో ఉందని గమనించి మేమన్నా మంచినీళ్ళు తెచ్చి ఇవ్వాలి తప్ప,


తనంతట తాను తెచ్చుకునే ప్రయత్నం ఏమాత్రం చేసేవారు కాదు.


అటువంటి బాబాయి, ఇపుడు ఏకంగా వంట చేయడం, అదీ ఇంత కమ్మగా, రుచిగా చేయడం నేర్చుకున్నారు అంటే, నాకు అస్సలు నమ్మ బుద్ధి కాలేదు.


అందుకని కాస్త అశ్చర్యంగా,


"ఇదంతా ఎప్పుడు నేర్చుకున్నావు బాబాయ్ ??"


అనడిగాను.


"నేర్చుకోలేదురా తల్లీ, నేర్చుకోవాల్సి వచ్చింది."


అన్నారు నవ్వుతూ.


ఆ మాటలకు నేను,


"అదేమిటి బాబాయ్, మన్మధుడు సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగ్ లాగా, ముందు తను ప్రేమించింది తరువాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టు,


నువ్వు నేర్చుకోవల్సి వచ్చింది అని అంటున్నావు."


అనడిగాను కాఫీ తాగుతూ.


దానికి బాబాయ్,


"ఏమి లేదమ్మా !! ఆ మధ్య ఒక రెండు మూడు సార్లు, చిన్న చిన్న పనులు మీద మీ పిన్ని వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది.


ఆ సమయంలో, నాకు అన్నీ సమకూర్చమని ఎదురు ఫ్లాట్ వాళ్ళకి చెప్పి వెళ్ళేది.


వాళ్ళు కూడా మంచి వాళ్ళు అవడంతో, ప్రతీరోజూ ప్రొద్దున కాఫీ దగ్గర నుంచి, అల్పాహారం, భోజనం, టీ, టిఫిన్, ఇలా ప్రతీదీ చక్కగా సమయానికి అందించేవారు.


కాబట్టి మీ పిన్ని ఊరు వెళ్ళినా, నాకు ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు.


కానీ ఒకసారి, మీ పిన్ని ఊరు వెళ్ళిన రెండు రోజులకే, వాళ్ళు కూడా ఊరు వెళ్ళారు.


అప్పుడు చూడాలి నా అవస్థ !! ప్రొద్దున కాఫీ దగ్గర నుంచి రాత్రి టిఫిన్ వరకు, ఆరేడుసార్లు హోటల్ కు వెళ్ళి వచ్చేసరికి నా పని అయిపోయేది అనుకో !!


పైగా ప్రతీ రోజూ, హోటల్ లో ఒకే రకమైన భోజనం చేయడం కూడా ఇబ్బందిగా మారింది.


అందులోనూ మీ పిన్ని చేతి వంటకు అలవాటుపడ్డ ప్రాణం కదా !!


(మా పిన్ని వంట రుచి చూసిన వారెవ్వరూ, ఇంకొకరి వంటను మెచ్చుకొలేరు. అంత అద్భుతంగా వంట చేస్తుంది తను.)


ఇక ఇలా లాభం లేదని, వంట నేర్చుకోవలసిందే అని నిర్ణయించుకున్నాను.


అప్పటి నుంచీ, ప్రతీరోజూ మీ పిన్ని చేసే అన్నీ పనులనూ ఒక నెల పాటు గమనించాను.


మొదట్లో మీ పిన్నికి సహాయం చేయసాగేను.


ఆ తరువాత, మీ పిన్నితో కలిసి వంట చేయడం మొదలు పెట్టాను.


ఇప్పుడు నేనే వంట చేస్తున్నాను."


అన్నారు గర్వంగా.


ఇదంతా మాట్లాడుతున్నది నిజంగా బాబాయేనా లేక ఇంకవరన్నానా అని నేను ఆశ్చర్యంగా చూడసాగాను.


నా అనుమానాన్ని గమనించిన బాబాయి, అదేదో నా మైండ్ వాయిస్ చదివినట్టుగా,


"నీతో మాట్లాడుతోంది మీ బాబాయే రా తల్లీ !!


ఒకప్పుడు వంట చేయడం అనేది కేవలం ఆడవాళ్ళకు మాత్రమే సంబంధించిన పని అని మూర్ఖంగా వాదించిన నేను,


ఇప్పుడు అది కుటుంబంలో అందరికీ సంబంధించిన పని అని గ్రహించుకున్నాను.


పరిస్థితులు నేర్పిన పాఠం కదా !! అందుకే ఇంత బాగా గుర్తుంది.


అందుకే మీ తరానికి నేను ఇచ్చే సలహా ఏమిటి అంటే,


మీరు మీ భర్తలతో పాటు, మీ పిల్లలకు కూడా వంట చేయడం నేర్పించండి.


చదువుకోవడం, ఆడుకోవడం, మొక్కలకు నీళ్ళు పోయడంతో పాటు, వంట చేయడం కూడా అందరూ తెలుసుకోవాలి అన్న విషయాన్ని పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పండి.


ఆ విషయంలో కూడా, ఆడపిల్ల మగపిల్లాడు అన్న తేడా చూపకుండా ఇద్దరికీ నేర్పండి."


అన్నారు.


బాబాయి మాటలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి.


కారణాలు ఏమైనా, పరిస్థితులు మా బాబాయిలో తెచ్చిన మార్పు నాకు ఎంతగానో నచ్చింది.


ఏదయినా ఇటువంటి మార్పు చాలా అవసరం అని నాకు అనిపించింది.


మరి మీరేమంటారు ??Rate this content
Log in

More telugu story from RAMYA UPPULURI

Similar telugu story from Abstract