RAMYA UPPULURI

Children Stories Fantasy Inspirational

4.5  

RAMYA UPPULURI

Children Stories Fantasy Inspirational

పట్టణంలో పల్లెటూరు

పట్టణంలో పల్లెటూరు

7 mins
533ఒకరోజు  పేపర్లో, కొత్తగా కట్టిన గేటెడ్ కమ్యూనిటీ గురించి ఒక ప్రకటన వచ్చింది.


వివరాలు ఆసక్తిగా కనిపించేసరికి, పూర్తిగా చదవడం మొదలుపెట్టాము. చాలా వరకు ఫ్లాట్ బుకింగ్స్ జరగడంతో, అక్కడ ఉన్నవాళ్ళు కొందరు వాళ్ళ అనుభవాలు కూడా ఆ ప్రకటనలో వ్యక్తపరిచారు.

ఆ ప్రకటన మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. బడ్జెట్ మాకు అనుకూలంగా ఉండటంతో, ఒకసారి చూసి వద్దాము అనుకున్నాము.


పట్టణంలో ఎక్కువ మంది గేటెడ్ కమ్యూనిటీలో ఉండటానికే ఇష్టపడతారు. ఎందుకంటే, ఇక్కడ ఉండే ట్రాఫిక్ సమస్య వల్ల, ప్రతీ పనికి ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.


అందుకని, అన్ని వసతులూ, ఒకే దగ్గర ఉండే గేటెడ్ కమ్యూనిటీ అయితే సౌకర్యంగా ఉంటుందన్న ఆలోచనతో బయలుదేరాము.


ఓ గంట ప్రయాణం చేసి, అక్కడికి చేరుకున్నాము.


కారు దిగగానే మాతో ఫోన్లో సంభాషించిన మేనేజర్  ఎదురు పడ్డారు.


లోపలకి వెళ్ళే ముందు మా కారుని పార్క్ చేయమని, బయట ఉన్న ఒక అపార్టుమెంట్ ని చూపించారు.


కార్లు, క్యాబ్ లు, ఆటోలు, ఏవయినా అక్కడే పార్కింగ్ చేసి రావాలిట!! లోపలకి అనుమతి లేదని చెప్పారు. సరే అని మా కార్ ని,వాళ్ళు చూపించిన పార్కింగ్లో పెట్టి, లోపలకి వెళ్ళాము.


లోనికి  వెళ్తూండగానే,


కుడి వైపు ఒక దేవాలయం కనిపించింది. గుడిలో నుంచి భజనలు, కీర్తనలు వినిపిస్తున్నాయి.

మందిరం లోపలకి వెళ్ళగానే, సకల దేవతమూర్తులు అందంగా కొలువై కనపడ్డారు. ఒక్కొక్క మూర్తిని తృప్తిగా దర్శించుకొని, తీర్థప్రసాదాలు తీసుకొని, కొద్దిసేపు కోవెల ప్రాంగణంలో కూర్చున్నాము.

అలా దేవాలయం నుంచి చక్కటి ఆధ్యాత్మిక అనుభూతితో బయటకు వచ్చిన మాకు,

పచ్చటి పొలాలు స్వాగతం పలికాయి.


వెంటనే వాటి దగ్గరకు వెళ్ళి చూడాలి అన్న ఆసక్తి కలిగింది. మాములు గేటెడ్ కమ్యూనిటీలలో అయితే, ఒక కార్లో కూర్చో పెట్టి కమ్యూనిటి అంతా తిప్పి చూపిస్తారు. మరి ఇక్కడ ఒక్క కారు కూడా కనపడలేదు !!


మా ఆలోచనని పసిగట్టిన అక్కడి మేనేజర్,


"మీకు నచ్చిన వాహనాల్లో అక్కడికి వెళ్ళొచ్చు సార్ !!" అని, ప్రక్కనే ఉన్న ఎడ్లబండి, సైకిళ్ళు, రిక్షాలు చూపించారు.


ఒక్కసారిగా ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది.


అమ్మ కనపడగానే, పరుగెత్తుకొచ్చే చంటి పిల్లాడిలా, వెంటనే వెళ్ళి ఎడ్లబండి ఎక్కేసాము.


ఓ ఇరవై నిమిషాలలో పొలాల దగ్గరకు చేరాము.

రోజువారీ ఇంట్లోకి అవసరమయ్యే అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పూల మొక్కలతో పాటు,

ఔషధ గణాలు కలిగిన వేప, తులసి, అరటి లాంటి చెట్లని కూడా అక్కడ పెంచుతున్నారు.


అవన్నీ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న మా దగ్గరకి, పంట సాగు చేసేవాళ్ళు వచ్చి,


"మన ఇళ్ళల్లో ఉండే వాళ్ళందరూ, ఇక్కడ నుంచే కూరలు, పండ్లు తీసుకెళ్తారు సార్ !! మీరు కూడా రుచి చూడండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు." 


అంటూ కొన్ని పండ్లు మా చేతిలో పెట్టారు.


నవనవలాడుతున్న ఆ పండ్లు చూడగానే నొరూరేసరికి, వెంటనే చెరొక పండు నోట్లో వేసుకున్నాము. ఎన్నోసార్లు బయట పండ్లు కొన్నాము కానీ, ఇంత రుచిగా ఏనాడూ లేవు.


ఎంత అయినా ఇంటి పంట రుచే వేరు !!


ఇలా ఆ పండ్ల రుచిని ఆస్వాదిస్తున్న మమ్మల్ని, లేత ఆకుకూరలతో పాటు, రోజువారీ వంటలో వినియోగించే కూరగాయలు పలకరించసాగాయి.


అలా మేము అవన్నీ చూస్తుండగానే, ఓ కుటుంబం వచ్చి, వారికి నచ్చిన కూరలు, కోసి తీసుకెళ్తున్నారు. పెద్దలు పూజకి కావలసిన పూలు కోసి, పూలసజ్జలో వేసుకుంటున్నారు.


చిన్న పిల్లలు అటూ ఇటూ గెంతుతూ, పెద్దలకి నచ్చినవి కోసి బుట్టలో వేస్తున్నారు. అలా నచ్చిన పంట కోస్తూ, పెద్దలకి సహాయం చేస్తున్న, ఆ చిన్నారుల మొహంలోని సంతోషం చూడటానికి నా రెండు కళ్ళు చాలలేదు.


ఇలా ఆ పిల్లల్ని చూస్తూ మురిసిపోతున్న మా చేతిలో, రెండు లేత కొబ్బరిబోండాలు పెట్టి,


"మన తోటలోవేనండి, తాగి చూడండి !!" అన్నాడు అక్కడి తోటమాలి.


"కొబ్బరి నీళ్ళు కమ్మగా ఉన్నాయి, ఇంకొక బొండాము ఇస్తారా !!" అని అడిగే లోపు, ఓ పెద్దావిడ వచ్చి,


"ఇదిగో అమ్మా గోరింటాకు, మన తోటలోది. ఇంటికి వెళ్ళి చక్కగా రుబ్బి పెట్టుకో, ఎర్రగా పండుతుంది." 


అని నవ్వుతూ, ఓ కవర్లో గోరింటాకు ఇచ్చింది.


ఇవన్నీ చూస్తున్న మాకు, ఒక్క క్షణం మేము పట్టణంలో ఉన్నామో లేక పల్లెటూరిలో ఉన్నామో అస్సలు అర్థమే కాలేదు.


ఆ సందిగ్ధంతో ఇంకాస్త ముందుకు వెళ్ళగానే, చక్కటి గోశాల కనిపించింది.


"అపార్ట్మెంట్లోని వారందరూ ఈ గోవుల పాలే తాగుతారు కదా !!" అన్నాను మేనేజర్ తో….


"అవును మేడం. ఈ పాలేర్లే, రోజు పాలు పితికి, అందరి ఇళ్ళకి వెళ్ళి పాలు పోసి వస్తారు." అన్నారు.


ఎప్పటికప్పుడు చిక్కటి పాలు అందిస్తూ, అందరి ఆరోగ్యం కాపాడుతున్న, ఆ గోమాతలకు మనసులోనే నమస్కరించుకోని ముందుకు వెళ్తున్న మాకు, రిక్షాలు, సైకిళ్ళు కనిపించాయి.


అక్కడ నుంచి సైకిల్ మీద కానీ, రిక్షాలో కానీ వెళ్ళాలి అని మేనేజర్ చెప్పడంతో, చటుక్కున వెళ్ళి రిక్షాలో కూర్చున్నాము.


ఈ మధ్య కాలంలో ఎక్కడా రిక్షానే చూడని మాకు, ఒక్కసారిగా రిక్షా చూసేసరికి ఏదో తెలియని సంతోషం కలిగింది.


అలా వెళ్తున్న మాకు, ఒక ఫంక్షన్ హాలు కనిపించింది. లోపల అంతా పల్లెటూరి వాతావరణంలా ఉంది. పుట్టినరోజు వేడుకలు, చిన్న చిన్న పార్టీలు, అక్కడ చేసుకుంటారుట !!


"పండుగ కోసం పల్లెటూరు వెళ్ళనే అక్కర్లేదు అమ్మా, పండుగ నెల రోజులూ ఇక్కడ వాతావరణం అంతా పల్లెటూరిలా మారిపోతుంది. అన్ని పండుగలూ ఈ హాలులోనే అద్భుతంగా చేస్తారు."


అని అక్కడ వాళ్ళు చెప్పారు.


ఇంకాస్త ముందుకు వెళ్ళగానే, ఓ వైద్యశాల, ప్రక్కనే ఒక మందుల షాపు కనిపించాయి.


అక్కడ కేవలం పురాతన పద్ధతుల్లో మాత్రమే వైద్య సేవలు అందిస్తారట !! ఆధునీకరణ అన్న మాటకి చోటే ఉండదు. అక్కడ ప్రతీ విషయం మమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి లోను చేసింది.


అలా అశ్చర్యంగా ముందుకు వెళ్ళిన మాకు, ఓ పార్కు కనిపించింది. రిక్షా దిగి పార్క్ లోకి వెళ్ళాము. 


లోపల కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న పిల్లలు, అటూ ఇటూ వాకింగ్ చేస్తున్న పెద్దలు కనిపించారు. కొందరు పార్క్ బెంచీల మీద కూర్చోని కబుర్లు చెప్పుకుంటున్నారు.


అలా వాళ్ళని గమనిస్తూ వచ్చిన విషయం మర్చిపోయి, ఏదో తెలియని లోకంలోకి వెళ్ళిపోయాము.


"ఇక్కడ నుంచి ఇక సైకిల్ మీద వెళ్ళాలి !!" అన్న మేనేజర్ మాటలతో తిరిగి ఈ లోకంలోకి వచ్చాము.

మనసు పార్కుని వదిలి రాను అంటున్నా, వచ్చిన పని గుర్తొచ్చి, బయటకి వచ్చి సైకిల్ మీద వెళ్ళసాగాము.


అలా వెళ్తున్న మాకు, ఓ వైపు పచారీ కొట్టు, ఇంకొక వైపు ఫ్యాన్సీ కొట్టు కనిపించాయి. ఇంటి నుండి ఫోన్ చేసి, కావలసిన సరుకులు చెప్తే, వాళ్ళే ఫ్లాట్ కి తెచ్చి ఇస్తారట !!


ఇంకాస్త ముందుకు వెళ్తూ ఉండగా, మేనేజర్ మాతో,


"ఈ హోటల్ చాలా ప్రత్యేకం అండి. పల్లెటూరి రుచులతో అందరికీ చక్కటి స్వాగతం పలుకుతుంది. టిఫిన్, భోజనం అన్నీ లభిస్తాయి. ఒక్కసారి రుచి చూస్తే, మళ్ళీ మళ్ళీ ఇక్కడికే రావాలి అనిపిస్తుంది. ఒక్కసారి లోపలకి వెళ్ళి వారి ఆతిథ్యం స్వీకరించండి." 


అంటూ ఎదురుగా ఉన్న హోటల్ లోకి తీసుకువెళ్ళారు. అక్కడి సర్వర్లు ఆప్యాయంగా పలకరిస్తూ, చిన్న రాగి చెంబుతో, చల్లటి కుండ నీరు అందించారు.


ఫ్రిడ్జ్ నీళ్ళకు అలవాటు పడిన ప్రాణం, ఒక్కసారిగా కుండ నీరు రుచి చూడగానే, ఎన్నో పాత అనుభూతులను నెమరు వేసుకోసాగింది.


తరువాత వారు, అరిటాకులో అందించిన వేడి వేడి బజ్జీలు, పునుగులు తిని, ఫిల్టర్ కాఫీ తాగుతూ ఆ ప్రకృతిని, ప్రశాంతతను ఆస్వాదిస్తున్న మాకు,


కాస్తంత దూరంలో, చక్కటి ఈత కొలను కనిపించింది. పిల్లలు, పెద్దలు సరదాగా అక్కడ ఈత కొడుతున్నారు.


ఇంకాస్త ముందుకు వెళ్ళగానే, పది అంతస్తుల అపారట్మెంట్లు మాకు స్వాగతం పలికాయి.


ఫ్లాట్ లోకి వెళ్తున్న మమ్మల్ని, వాకిలి గుమ్మం ఎంతగానో ఆకర్షించింది. పేరుకు ఫ్లాట్ అయినా పూర్తిగా పల్లెటూరి పెంకుటిల్లులా నిర్మించారు.


ప్రతి గదిలోనూ ఏదో ప్రత్యేకత ఉంది. చక్కటి ప్రణాళికా నైపుణ్యంతో నిర్మించారని ఇట్టే తెలుస్తోంది.


బయట అరుగుల మీద పెద్దవాళ్ళు అష్టా చెమ్మా ఆడుకుంటున్నారు. ఇంకొందరు సన్నజాజుల మాల కట్టుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. కొందరు తల్లులు, పిల్లలకు గోరింటాకు పెడుతున్నారు. తాతగారు పిల్లలకు కథలు చెప్తున్నారు. ఆడపిల్లలు ఇళ్ళను రంగవల్లులతో అలంకరిస్తున్నారు.


ఇవన్నీ చూస్తూ, సంతోషంతో ఏదో మాయలో విహరిస్తున్న నేను,


"ఏమిటి రమ్యా, ఇక్కడ ఫ్లాట్ కొనడానికి వచ్చారా !!"


అన్న మాటతో తిరిగి మళ్ళా ఈ లోకంలో వచ్చాను.


ఎదురుగా నా చిన్ననాటి స్నేహితురాలు వసుంధర కనపడగానే, వెంటనే సంతోషంతో తనను హత్తుకొని,


"ఎన్నాళ్ళయింది వసూ నిన్ను చూసి, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ?"


అనడిగాను.


"ఈ గేటెడ్ కమ్యూనిటీ మాదే రమ్యా, పెద్ద పెద్ద ఉద్యోగాల చేస్తూ పట్టణంలో స్థిర పడ్డ వారు పల్లె వాతావరానికి దూరంగా ఉంటారు కదా !! 


అటువంటి అందరినీ దృష్టిలో పెట్టుకొని, ఇలా మన పట్టణంలో ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీ నిర్మించాము.


ఇపుడు మీరు లోపలికి వెళ్ళగానే, ఓ చక్కటి పల్లెటూరులోకి వెళ్ళిన అనుభూతి కలిగింది కదా !! 


పచ్చని పొలాలు, గుళ్ళు, గోవులు, ఒకటేమిటి ఇలా పూర్తిగా పల్లెటూరేనా అన్నట్టుగా అనిపించింది కదా !! ఆ భావన కలిగించడానికి మా ఈ ప్రయత్నం అంతా !!"


అన్నది వసుంధర నవ్వుతూ.


"అంటే ఇంట్లో ఉన్నంతసేపు పల్లె జీవితం, ఉద్యోగానికి బయటకు రాగానే పట్టణ జీవితం అన్నమాట. మంచి ఆలోచన చేశారు వసూ మీ దంపతులు.


ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే, ఒకే సమయంలో రెండు చక్కటి అనుభూతులను సొంతం చేసుకోవచ్చు. 


ఎలాగూ పట్టణంలోనే ఉంటున్నాము కనుక, చక్కటి ఉద్యోగ అవకాశాలతో జీవితంలో ఎదగవచ్చు. అదే సమయంలో, మన గేటెడ్ కమ్యూనిటీ, అదే మన ఇల్లు పల్లెటూరిలా నిర్మించబడింది కనుక, పల్లె జీవితాన్ని కూడా సంతోషంగా అనుభవించవచ్చు.


అంతే కదా వసూ !!"


అన్నాను ఆనందంగా.


అవునన్నట్టు తలూపింది వసుంధర.


ఇన్ని అందమైన అనుభూతులను అందిస్తున్న ఈ పల్లెటూరులో, అదే పట్టణంలోని ఈ పల్లెటూరులో తప్పకుండా ఒక ఫ్లాట్ కొనాలి అని నా మనసు తహతహలాడింది.


"ఇవాళ మంచి రోజు కదా !! ఇప్పుడే కొనేద్దాము." అని చెప్పబోతున్న నాతో,


మా వారు,


"టైం ఎనిమిది అయ్యింది. మళ్ళీ పట్టణంలో పల్లెటూరు గురించి కల కంటున్నావా !! 


లే నిద్ర లే !!"


అన్నారు.


నిద్ర నుంచి మేలుకొన్న నేను,


"ఓ, ఇది అంతా కలనా !! ఈ కల నిజమైతే ఎంత బావుండు."


అనుకున్నాను.


నిర్మలమైన మనస్సుతో స్వచ్ఛమైన కోరిక కోరుకుంటే అది నిజమవుతుంది అని పెద్దలు అంటారు కదా !!


అలా, ఏదో ఒక రోజుకి పట్టణంలో పల్లెటూరు చూడగలము ఏమో !!


మాలా పల్లెని ప్రేమించే ప్రతి ఒక్కరికి కోసం, మా ఈ కథ !!Rate this content
Log in