అన్నదానం
అన్నదానం
🌷🌷అన్నం పరబ్రహ్మ స్వరూపం
అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది అంటారు కదా!!
ఒకప్పుడు మన పెద్దలు ఎంతో శ్రద్ధతో, తమ తమ స్థితికి తగ్గట్టుగా, తమ వీలుని, వసతిని బట్టి అన్నదానం చేసేవారు.
కొందరు వారి శక్తి మేర ఆదరువులు తయారు చేసి, గుడి దగ్గర ఆకలితో ఉన్నవాళ్ళకి, స్వయంగా తమ చేతితో వడ్డించి, కడుపు నిండేలా అన్నదానం చేసేవారు.
బాగా సంపన్నులు అయితే, సంవత్సరంలో వచ్చే పెద్ద పండుగలకి, పుట్టిన రోజులకి,ఇతర వేడుకలకి, తమ పొలంలో పని చేసే కూలీలని, పాలేర్లని, ఇంట్లో ఉండే పనివాళ్ళని, అందరినీ ఒక దగ్గర చేర్చి అన్న సంతర్పణ చేసేవారు.
అలా తృప్తిగా అన్నదానం పొందిన ప్రతి ఒక్కరూ,
"ఆకలితో ఉన్న మాకు కడుపు నింపారు. పది కాలాలు పాటు మీరు చల్లగా ఉండాలి."
అని అంటారు.
ఆ మాట విన్నప్పుడు కలిగే సంతోషం మాటల్లో వర్ణించగలమా!! అనుభవించడం తప్ప !
మరి మన తరానికి అలాంటి సంతోషం పొందే అవకాశం ఉందా!!
ఎందుకు లేదు,
ఫలానా పుణ్యక్షేత్రం లో మా పేరున అన్నదానం చేయమని మనీ ఆర్డర్ పంపాము.
ఫలానా గుడిలో మా పేరున పది మందికి అన్నం పెట్టమని డబ్బులు ఇచ్చి వచ్చాము.
అలా చేస్తూ మేము సంతోషంగా ఉన్నాము అనొచ్చు.
నిజమే !!
మనకి అందులో ఆనందం దొరుకుతుంది, కాదు అనడం లేదు.
కానీ మన చేతితో వండి పెట్టడానికి మన తరపున వేరే ఎవరో తయారు చేసి పెట్టడానికి చాలా తేడా ఉంటుంది కదా!!
ఖచ్చితంగా చాలా వ్యత్యాసం ఉంటుంది.
మరి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అలా చేయడం సాధ్యమేనా అనే అనుమానం రావొచ్చు.
నాకు కూడా సరిగ్గా ఇలాంటి అనుమానమే వచ్చింది.
కొంచెం ప్రయత్నిస్తే,
ఏ సెలవు రోజునో, కాస్త కూర, పప్పు, అన్నము వరకు సిద్ధం చేయవచ్చు.
తరువాత వాటిని అనాధ శరణాలయానికో, వేరే ఇతర ఆశ్రమాలకో తీసుకుని వెళ్ళి పంచాలి కదా !!
కాస్త ఓపిక చేసుకోని వెళ్ళగలిగితే బానే ఉంటుంది.
కానీ ఉద్యోగరీత్యా ప్రతీ రోజూ ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించే మనకు, సెలవు రోజుల్లో కూడా మైళ్ళ దూరాలు వెళ్ళి రావాలి అంటే కొంచెం కష్టమైన విషయమే.
ఇన్ని ప్రశ్నలతో, చెయ్యాలి అన్న మనసు ఉన్నా ఎలా చేయాలో తెలియటం లేదు.
ఇలాంటి ఆలోచనలతో ఉన్న నేను,
ఓ రోజు మధ్యాహ్నం, భోజనాలు అయ్యాక, కాస్త కూర మిగిలితే, పనివాళ్ళకి ఇద్దామని మా అపార్ట్మెంట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళాను.
నే వెళ్లేసరికి హౌస్ కీపింగ్ వాళ్ళు, సెక్యూరిటీ, తోట పని చేసేవాళ్ళు, ఇస్త్రీ చేసే అబ్బాయి, ఇతర పనివాళ్ళు, దాదాపుగా ఓ పదిమంది, ఒక దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నారు.
"ఏమిటి విశేషం ?" అని అడిగాను.
వారిలో ఒక ఆమె,
"ఏమీ లేదు అక్క, మన ఐదో ఫ్లోర్లో ఉండే మేడం మా అందరికీ భోజనం తయారు చేసి ఇచ్చింది."
అని చెప్పింది.
"ఎందుకు ఇచ్చారు ?" అనడిగాను.
"ఏమో అక్క, మాకు తెలీదు. నిన్న మా అందరిని పిలిచి, రేపు ఎవ్వరూ భోజనం తెచ్చుకోకండి.
నేను మీకు వంట చేసి ఇస్తాను."
అని చెప్పింది.
"ఇందాకే ఆ సారు, మేడం వచ్చి, ఈ సంచి ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడే తినడానికి కూర్చున్నాము."
అన్నది.
ఏమి ఇచ్చారో కాస్త చూడాలి అనిపిం
చింది.
అయినా పనివాళ్ళకి కదా !!
ఏ కూరో, పప్పో చేసి, కొంత అన్నం ఇచ్చి ఉంటారు.
దాని కోసం ప్రత్యేకించి చూసేది ఏముంది అనుకుని, లిఫ్ట్ వైపు వెళ్ళసాగాను.
లిఫ్ట్ లోకి వెళ్ళబోతున్న నాకు, ఎక్కడ నుంచో కమ్మటి నెయ్యి వాసన వచ్చింది.
ఈ ఘుమఘుమలు వాళ్ళు తినబోతున్న భోజనం నుంచి కాదు కదా !!
నాలో కొంత కుతూహలం మొదలయ్యింది.
ఆ సంచిలో ఏముంది?
దగ్గరకి వెళ్ళి చూసేను.
చూడగానే ముందు ఆశ్చర్యమేసింది. తరువాత అన్నదానం పట్ల ఆ భార్యాభర్తలకి ఉన్న శ్రద్ధ చూసి తెగ ముచ్చటేసింది.
ఆ సంచిలో కొన్ని డబ్బాలు ఉన్నాయి.
ఓ పది మందికి సరిపడేట్టుగా, చింతపండు పులిహోర, వేడి వేడి అన్నము, బంగాళదుంప వేపుడు, టమాటో పప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి, చారు, వడియాలు,
పెరుగు, సేమ్యా పాయసం ఉన్నాయి.
పాయసం అయితే అచ్చంగా మనం ఇంట్లో చేసుకునేలా ఉంది. కమ్మటి నేతిలో వేయించిన సేమ్యా, జీడిపప్పు, కిస్మిస్, యాలుకుల పొడి, పాలు, పంచదారతో చేసి ఇచ్చారు.
కొన్ని ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, మంచినీళ్ళ సీసాలు కూడా ఉన్నాయి.
ఒక చిన్న కవర్లో సోంపు కూడా వేసి ఉంది.
పనివాళ్ళ కోసం ఇన్ని రకాలు వండి ఇచ్చారా !!
ఎదో అన్నదానం చేసేము అంటే చేసేము అన్నట్టు కాకుండా, భోజనానికి అవసరమైన ప్రతీ చిన్న వస్తువును గుర్తుపెట్టుకోని మరీ సర్ది ఇచ్చారు.
ఇంట్లో వాళ్ళ కోసం ఎంత శ్రధ్ధగా ఓపికగా వంట చేస్తారో, అంతే శ్రద్ధగా ఎంతో కమ్మగా ఆ పని వాళ్ళ కోసం వంట చేసిన ఆమెకి, ఇలాంటి ఆలోచనకు ఊపిరి పోసిన ఆ కుటుంబ సభ్యులకు మనసులోనే అభినందనలు చెప్పుకొని, తిరిగి ఆ పనివాళ్ళని గమనించసాగాను.
వాళ్ళ అందరి మొహంలో ఎంతో సంతోషం.
వారందరి నోటి నుంచి ఒక్కటే మాట.
"అందరూ డబ్బులు ఇచ్చి ఎదో ఒకటి కొనుక్కోమంటారు.
ఈ అమ్మ మాత్రం మన కోసం చక్కగా వంట చేసి పెట్టింది.
అమ్మగారు, అయ్యగారు పది కాలాలు చల్లగా ఉండాలి."
అన్నారు.
అప్పుడే నేను ఇంకొక విషయం గమనించాను.
కొంతసేపటి క్రితం వరకు "మేడం, మేడం" అని చెప్పిన వాళ్ళు, ఇప్పుడు "అమ్మ, అమ్మ" అన్నారు.
కడుపార అన్నం పెట్టే ఎవరైనా అమ్మతో సమానమేగా !!
అందుకే మేడం కాస్త అమ్మ అయిపోయింది.
ఇదంతా చూసేక, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అన్నదానం ఎలా చెయ్యాలి అన్న నా ప్రశ్నకి చక్కటి జవాబు దొరికింది.
ఒక్కసారిగా "మనసు ఉంటే మార్గం ఉంటుంది" అన్న సామేత గుర్తుకు వచ్చింది.
అన్నదానం అంటే,
ఏ గుడి దగ్గరో లేదా అనాధ ఆశ్రమాలలో మాత్రమే చేయగలం అనుకున్నాను తప్ప,
రోజూ మనకి దగ్గరగా, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, మూడు పూటలా సంతృప్తిగా తినలేని వారికి, కడుపునిండా అన్నం పెట్టడం కూడా అన్నదానమే అని గ్రహించలేకపోయాను.
నాకు కూడా మేడం నుంచి అమ్మగా మారాలి అన్న కోరిక కలిగింది.
వీలు చూసుకొని, కాదు కాదు, వీలు చేసుకొని
ఆ అనుభూతిని పొందే ప్రయత్నం చెయ్యాలి అనిపిస్తుంది.
అలా చేస్తే అన్నదానం చేయడంలో వచ్చే ఆనందాన్ని తృప్తిగా రుచి చూడొచ్చు.
"అన్నదాత సుఖీభవ" అని దీవెనలు అందుకోవచ్చు.
నేను ప్రయత్నిద్దాము అనుకుంటున్నాను.
మరి మీరు ??