RAMYA UPPULURI

Children Stories Inspirational Children

4  

RAMYA UPPULURI

Children Stories Inspirational Children

నేను ఇలా నేనే అలా కూడా

నేను ఇలా నేనే అలా కూడా

2 mins
147


ఒకరోజు వంట చేస్తుండగా, నా స్నేహితురాలు వసుంధర ఫోన్ చేసి,


"రమ్యా, నేను నిజంగా మంచి అమ్మాయినేనా ??"

అనడిగింది.


"ఏమిటోయ్, ఉన్నట్టుండి ఇవాళ ఏదో కొత్త ప్రశ్న వేసేవు?అసలు నీకెందుకు వచ్చింది ఆ సందేహం??"


అనడిగాను.


దానికి తను,


"ఏమి లేదే, ఈ మధ్య నన్ను నేను గమనించుకుంటే, నాకు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది.


* నేను ఎవరికన్నా సహాయం చేశాక, వారు నన్ను గుర్తించకపోతే, ఎంతో నొచ్చుకుంటున్నాను. కానీ, నేను మాత్రం ఇతరులు నాకు చేసిన సహాయాన్ని ఇట్టే మర్చిపోతున్నాను.


* నేను తప్పు చేస్తే, క్షమాపణలు చెప్పడానికి కాస్త జంకుతున్నాను. కానీ, ఇతరులు తప్పు చేస్తే మాత్రం, వారి నుంచి వెంటనే క్షమాపణలు ఆశిస్తున్నాను.


* డబ్బు పొదుపు చేయడం ఎలా అని పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తున్నాను. కానీ నేను మాత్రం డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు పెడుతున్నాను.


* ఇంటికి వచ్చిన వారికి నాసిరకం బట్టలు పెడుతున్నాను. అవే నాసిరకం బట్టలు నాకు ఎవరన్నా పెడితే మాత్రం, వారిని సందర్భం వచ్చినప్పుడల్లా దెప్పి పొడుస్తున్నాను.


* ఒకరి అభివృద్ధి చూసి పైకి పొగుడుతున్న నేను, మనసులో మాత్రం వారు వృద్ధిలోకి రావడాన్ని ఎంత మాత్రం ఓర్చుకోలేకపోతున్నాను.


* నాలోని మంచిని నలుగురూ గుర్తించాలి అని కోరుకుంటున్నాను. కానీ, నేను కూడా ఇతరుల మంచిని గుర్తించాలి అన్న విషయాన్ని మర్చిపోయాను.


* అందరికీ నీతులు చెప్పే నేను, చెప్పడంతో పాటు ఆచరించాలి అన్న నీతిని మాత్రం గుర్తు పెట్టుకొలేకపోయాను.


* అంతెందుకు, చిన్న ఉదాహరణ చెప్తాను. రైలు ప్రయాణంలో నాకు కిటికీ ప్రక్కన ఉన్న క్రింది బెర్త్ లభించింది అనుకో, నేను వెంటనే, ఒకవేళ ఎవరన్నా వచ్చి వాళ్ళ అవసరం కోసం క్రింది బెర్త్ ఇవ్వమని అడిగితే, వాళ్ళకు కుదరదు అని చెప్పడానికి ముందే రకరకాల కారణాలు ఆలోచించి పెట్టుకుంటాను.


అదే, ఒకవేళ నాకు క్రింది బెర్త్ లభించకపోతే, ఆ బెర్త్ లో ఉన్నవారిని ఏదో విధంగా ఒప్పించి, ఆ బెర్త్ ను నేను తీసుకునే ప్రయత్నం చేస్తాను.


ఇలా ఒకటి కాదు, ఎన్నో విషయాలలో నా అవసరాన్ని బట్టి మారిపోతున్న నా ఆలోచనా విధానం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


నాలోని ఈ సంఘర్షణను ఏమంటారు రమ్యా??"


అనడిగింది.


"మనకే తెలియని మనలోని మరో కోణం వసూ !!


కానీ, నువ్వు మంచిదానివి కాబట్టే, త్వరగా మేల్కొని ఇలా నీలోని రెండు కోణాలను చక్కగా విశ్లేషించుకోగలిగావు.


ఇదే నీకు మారడానికి సరైన అవకాశం. నిదానంగా ఆలోచించి మారే ప్రయత్నం చేయి. మార్పు అనేది ఒక్కరోజులో సాధ్యం కాదు. కానీ ప్రయత్నిస్తూ ఉండు. ఏదో ఒకరోజు ఆశించిన మార్పు తప్పకుండా లభిస్తుంది."


అన్నాను.


"తప్పకుండా ప్రయత్నిస్తాను రమ్యా, నీతో నా ఈ సంఘర్షణను పంచుకున్న తరువాత మనసెంతో తేలికపడింది."


అన్నది నవ్వుతూ.


వసూ లానే ప్రతీ ఒక్కరూ తమలోని నాణానికి మరోవైపు ఉన్న ఆలోచనలను గమనించి, అన్నిసార్లు కాకపోయినా, అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆలోచించి మారగలిగితే జీవితం ఎంతో బావుంటుంది కదా !!



Rate this content
Log in