RAMYA UPPULURI

Children Stories Inspirational Children

4.0  

RAMYA UPPULURI

Children Stories Inspirational Children

తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటే

తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటే

4 mins
348


"టైం అయిదు అవుతోంది. ఇంకా ముసుగు తన్ని అలా పడుకున్నావు ఏమిటి ? తొందరగా లే, ఇప్పటికే అందరూ లేచి బ్రష్ చేసుకుంటున్నారు. కానివ్వు చక చకా వెళ్ళు !!"


"బ్రష్ చేసుకుని వచ్చి, మళ్ళీ నిద్ర పోతున్నావా ? దుప్పటి మడత పెట్టి, నీ బెడ్ సర్దుకో, ప్రతీరోజూ చెప్పాలి, ఎప్పుడు తెలుసుకుంటావో ఏమో !!"


"అసలే ఫిజిక్స్ లో ఇప్పటికే చాలా వెనుక పడ్డావు. ఒక అరగంట చదివి, తరువాత వెళ్ళి పాలు తాగు."


"ఏమిటి అలా చూస్తున్నావు ? వెళ్ళి పాలు తాగు, నీ గ్లాసు తెచ్చుకో, ఇది ఇల్లు కాదు, హాస్టల్ !! ఎవరూ చేతికి తెచ్చి ఇవ్వరు."


"బాత్రూమ్ డోరు మీద టవల్ పెట్టు. లేదంటే వేరే ఎవరన్నా స్నానానికి దూరిపోతారు. అప్పుడు నీ స్నానం ఆలస్యం అవుతుంది."


"పుస్తకాలు, పెన్లు అన్నీ పెట్టుకున్నావా ? ఒకసారి క్లాసులోకి వెళ్ళిన తరువాత, మళ్ళీ రూముకు రావడం కుదరదు. అవసరం అయినవి అన్నీ చూసి సర్దుకో !!"


"హలో హలో, ఈ బట్టల సంగతి మరచిపోయావు. ఉతికి ఇలా బకెట్లోనే ఉంచితే ఎలా ? సాయంత్రానికి చీకిపోతాయాయి. ఆరేసి వెళ్ళు."


"అదిగో అదిగో వార్డెన్ విజిల్ వేస్తున్నారు. వేసుకున్న జడ చాలు. దారిలో రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు. చక చక పరిగెత్తు. గేట్లు క్లోజ్ చేస్తారు.


మళ్ళీ చున్నీ కనపడట్లేదా !! ఈ డ్రెస్ చున్నీ తరువాత వెతకవచ్చు. ఇవాళ్టికీ ఆ దండెం మీద ఉన్న చున్నీ వేసుకెళ్ళు. కాస్త మ్యాచ్ అయ్యేలానే ఉందిలే !! అయినా ఎవరు పట్టించుకుంటారు, ఏమి పర్లేదు లే, ఇది వేసుకొని పరిగెత్తు !!"


"సంస్కృతం క్లాసు అంటే నీకు ఇష్టమేగా !! మరి హుషారుగా ఉండు. అదిగో ఆ ప్రశ్నకు జవాబు నీకు తెలుసుగా, నేను చెప్తాను అని చెప్పు."


"చూడు ఎంత చక్కగా జవాబు చెప్పావో !! అందరూ మెచ్చుకోలుగా నీ వంక చూస్తున్నారు. ఇష్టంగా చదివితే, ఇటువంటి అందమైన గుర్తింపు పొందవచ్చు. అర్థమయిందా !!"


"కెమిస్ట్రీ క్లాసు మొదలవుతోంది, జాగర్తగా విను, ఇందులో నీకు ఎక్కువ మార్కులు వస్తేనే, మంచి ర్యాంక్ వస్తుంది. ఏమిటా మొద్దు నిద్రా !! సార్ చెప్పేది విను, సరిగ్గా నోట్ చేసుకో !!


ఇదేమి ఇల్లు కాదు, అర్థం కాకపోతే, నాన్ననో అమ్మనో కూర్చో బెట్టి చెప్పడానికి !! నీకు నువ్వు నేర్చుకోవాలి. మనసు లగ్నం చేసి విను."


"అందరూ టిఫిన్ కు వెళ్తున్నారు, నువ్వు వెళ్ళవు ఏమిటి? ఓ....ఇందాక వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఇవాళ ఉప్మా అని చెప్పారా!! అందుకని వెళ్ళట్లేదా ? ఇదేమి ఇల్లు కాదు, పెసరట్టు ఉప్మా చేస్తేనే తింటాను అనడానికి, హాస్టల్ !! వాళ్ళు పెట్టింది తినాలి అంతే."


"చక చకా నీ కంచం గ్లాసు తీసుకొని వెళ్ళు, నీ తోటి అమ్మాయిలు అందరూ ఇప్పటికే వెళ్ళారు."


"లెక్కల మాష్టారు ఇచ్చిన వర్క్ చేయలేదుగా, ఇపుడు ఏమి చెప్తావు, సరే జ్వరంగా ఉంది, కాస్త రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి, సిక్ రూమ్ కి వెళ్ళు.


నీరసంగా మొహం పెట్టు, లేదంటే పడుకోనివ్వరు !!"


"లెక్కల పీరియడ్ అయింది లే, ఇపుడు ఇంగ్లీష్ క్లాస్. ఆ ఇంగ్లీష్ టీచర్ కు నువ్వు అంటే ఎంతో ఇష్టం. టీచర్ వచ్చే లోపు క్లాసులోకి దూరిపో !!


హే...జాగర్త జాగర్త, ఇటు వైపు వెళ్ళకు, ఇప్పుడే లెక్కల మాష్టారు బయటకు వస్తున్నారు, నువ్వు కానీ ఆయన కంటపడ్డావు అంటే, క్లాసుకు రాలేదు ఏమి అని కోప్పడతారు, అందుకే అటు నుంచి వెళ్ళు."


"ఇంగ్లీష్ క్లాసు అంటే నీకు ఎక్కడ లేని ఉత్సాహం అంతా వస్తుంది కదా !! మీ టీచర్ మెప్పు పొందే అవకాశం వచ్చింది, వదులుకోకు, నీ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ తో నీ పుస్తకాన్ని అందంగా ముస్తాబు చేయి."


"లంచ్ టైం అయింది, పద పదా బయలుదేరు !! ఎంత తినగలవో అంతే పెట్టించుకో, ఏదన్నా నచ్చలేదనో, సహించలేదు అనో, ఎక్కువయింది అనో పడేస్తే, వార్డెన్ ఒప్పుకోరు, మళ్ళా కూర్చోపెట్టి మరీ తినిపిస్తారు. అందుకని పెట్టించుకునేటప్పుడే జాగర్తగా పెట్టించుకో !!


ఏమిటీ కూర నచ్చిందా !! అయితే ఇంకాస్త అడుగు. మొహమాట పడకు. ఎవరూ ఏమీ అనుకోరు. నచ్చిందే ఇంకాస్త వేసుకొని, ఓ రెండు ముద్దలు ఎక్కువ తిను. నీరసం రాకుండా ఉంటుంది."


"నిద్ర వస్తున్నట్టు ఉంది కదా !! వెళ్ళి కాస్త మొహం కడుక్కొని రా !!


ఈ రెండు పీరియడ్స్ అయితే, ఇక స్నాక్స్ బ్రేక్ ఇస్తారు లే, అప్పుడు ఏదన్నా తింటూ, అటూ ఇటూ తిరుగొచ్చు."


"వార్డెన్ పిలుస్తున్నారు, వెళ్ళి మాట్లాడు. నువ్వు అంటే ఇక్కడ అందరికీ ఎంతో ఇష్టం కదా !! ప్రిన్సిపాల్ తో సహా అందరూ చాలా ప్రేమగా, అభిమానంగా ఉంటారు నీతో !! అది నీ అదృష్టం. నువ్వు కూడా అది అర్ధం చేసుకొని, వేరే విషయాలు వదిలేసి, చక్కగా చదువు మీద ధ్యాస పెడుతూ అన్నీ నేర్చుకో !! ఎంతో మందికి రాని చక్కటి అవకాశం నీకు లభించింది. అది గుర్తు పెట్టుకో !!"


"ఈ లెక్క అర్థం కావడం లేదా !! అదుగో ఆ సార్ ను అడుగు. చక్కగా చెప్తారు."


"అర్థమయ్యింది కదా !! ఇలానే అన్నీ లెక్కలూ చేయాలి. చేసే విధానాన్ని ఒకసారి పుస్తకంలో నోట్ చేసి పెట్టుకో. సరే స్నాక్స్ బ్రేక్ ఇచ్చారు, వెళ్ళు."


"ఏమిటీ స్నాక్స్ నచ్చలేదా !! సరే వెళ్ళి రూంలో కూర్చో, బట్టలు అరినట్టు ఉన్నాయి, తెచ్చి మడత పెట్టుకో, ఓ పని అయినట్టు ఉంటుంది.


హే....మర్చిపోయా, ఏమన్నా కోనుక్కోమని నీకు డబ్బులు ఇచ్చారుగా, ఆ స్నాక్స్ షాపు దాకా వెళ్ళి నచ్చింది కొనుక్కొని తిను. బట్టలు రాత్రికి మడత పెట్టుకోవచ్చు."


"అబ్బా.....కాస్త ముందే రావొచ్చు కదా, ఇపుడు చూడు, టైం అయిపోయింది అని, ఇంక స్నాక్స్ అమ్మము అనంటున్నారు. సర్లే, రాత్రికి వేడి వేడిగా అన్నం తిందువు కానీ, వెళ్ళి స్టడీ అవర్లో కూర్చో !!"


"అలా ఏడుపు మొహం పెట్టకూ, ప్రతీ రోజూ స్నాక్స్ తినాలి అని రూలు ఏమీ లేదు కదా !! ఈ దఫా ఇంటి నుంచి వచ్చేటప్పుడు, కారప్పూస, కజ్జికాయలు తెచ్చుకుందువు కానీ లే, సరే నా, ఏది నవ్వు....నవ్వమంటుంటే !!


హా అలా నవ్వుతూ ఉండాలి, బంగారు తల్లిలా !!


ముందు చదువుకో, ఇంత ఫీజు కట్టి, వాళ్ళ కష్టార్జితం మొత్తం నీ కోసం ఖర్చు పెడుతూ, ఇలా నిన్ను వేరే ఊరు తీసుకొచ్చి హాస్టల్లో చేర్చింది ఎందుకు ? బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకుంటావు, తద్వారా నీ భవిష్యత్తు బావుంటుంది అనే కదా !!


ముందు ఆ విషయం మీద దృష్టి పెట్టు."


"ఆ ప్రక్కన అమ్మాయితో ఎంత సేపు ముచ్చట్లు పెడతావు ? ఈ సంవత్సరం దాటితే తను ఎవరో, నువ్వు ఎవరో ? వచ్చిన పని మర్చిపోయి ఈ కబుర్లు ఏమిటి ? తలకాయ పుస్తకంలో పెట్టు, చదువు చదువూ !!"


"డిన్నర్ టైం అయింది, పద పదా, ఇవాళ సాంబార్ అట, ఇందాక వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే విన్నాను. నీకు చాలా ఇష్టం కదా !! కమ్మగా నెయ్యి వేసుకొని ఓ పట్టు పడుదువు కానీ !! ప్లేట్ తెచ్చుకో.


ఏమిటి ఇంత కారంగా ఉంది సాంబార్, రుచిగానే ఉంది కానీ, బాగా ఘాటుగా ఉంది. నువ్వు ఇంత ఘాటు తట్టుకోలేవు. సర్లే, పెరుగు వేసుకొని తినేసేయ్యి ఈ పూటకి !!"


"ఏమిటీ, వాళ్ళు నిన్ను చూసి కూడా చూడనట్లు వెళ్తున్నారు అని బాధ పడుతున్నావా ?


"అవును వాళ్ళు మీ ఊరి వాళ్ళే !! నీ చిన్ననాటి స్నేహితులే, కాదు అనడం లేదు.


కానీ ఇప్పుడు వారికి ఇక్కడ కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. నిన్ను మర్చిపోయారు. ఎవరి ఇష్టం వాళ్ళది. నీతోనే స్నేహం చేయాలి అని రూలు ఏమీ లేదు కదా !!


ఓయ్ పిల్లా, ఏడుస్తున్నావా !! ఏది ఇటు చూడు, ఊరుకో పిచ్చి పిల్లా, ఓ రెండు ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఇంటికి వెళ్ళిపోతావు. ఈ మాత్రానికే ఏడుస్తారా చెప్పు ?"


"వెళ్ళి పడుకో ఇంక, మళ్ళా ప్రొద్దున్నే అయిదింటికి లేవాలి. నిద్ర రావట్లేదా !! అమ్మా నాన్న గుర్తు వస్తున్నారా !! దిగులు వేస్తోందా ? ఏమీ అర్ధం కావట్లేదు కదా !! ఒంటరిగా అనిపిస్తోందా ?


నిజం చెప్పనా ? నాకూ అలానే ఉంది. ఏడుపు వస్తోంది. కానీ నేను కూడా ఏడిస్తే, నీకు ధైర్యం ఎవరు చెప్తారు చెప్పు !!


నీకు నేను, నాకు నువ్వు, అంతే కదా !! బాధ పడకు, నీకు ఇష్టమైన సినిమా పాట గుర్తు తెచ్చుకుంటూ నిద్రపో !!"


అంటూ ప్రొద్దుటి నుంచీ తనతో కబుర్లు చెప్తూ అలసిపోయిన, తన అంతరాత్మ కూడా కన్నీళ్ళు తుడుచుకుంటూ, మెల్లగా నిద్రలోకి జారుకుంది.



Rate this content
Log in