RAMYA UPPULURI

Abstract Drama Tragedy

4  

RAMYA UPPULURI

Abstract Drama Tragedy

ఈ రెండిట్లో నా ఇల్లు ఏది ?

ఈ రెండిట్లో నా ఇల్లు ఏది ?

4 mins
470



"నీ బొమ్మలు ఇంకా ఇక్కడ ఎన్నాళ్ళు ఉంచుతావు ? మీ ఇంటికి తీసుకెళ్ళు !! ఈ చీరలు కూడా !! ఇక్కడ ఉంచి ఏమి ఉపయోగం ?"


అన్నది వసుంధర తల్లి.


"నీకు తెలుసు కదా అమ్మా, నేను ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నాను. అక్కడ అన్ని గదులలోనూ, మా అత్తగారు, మా ఆడపడుచు వారి వస్తువులు సర్దుకున్నారు.


మా గదిలో కూడా ఒక అల్మారా, మా అడపడుచు వాడుకుంటుంది. మరి అలాంటప్పుడు, ఇవన్నీ తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టుకోనమ్మా !!"


అన్నది వసుంధర.


"పెళ్ళి అయ్యాక అత్తగారి ఇల్లే నీ ఇల్లు, ఎలగోలాగా సర్ది పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి.


ఎన్నాళ్ళని నీ వస్తువులు అన్నీ ఇక్కడే ఉంచుతావు. ఒకటొకటిగా తీసుకువెళ్ళు.


ఏవండీ, ఆ అటక మీదున్న పుస్తకాలు కూడా దించండి. ఈ సారి పుస్తకాలు కూడా పట్టుకెళ్ళు."


అంటూ వంటింట్లోకి వెళ్ళింది తల్లి.


"పనిలో పనిగా, తన గోల్డ్ మెడల్స్ కూడా పట్టుకెళ్ళమను అమ్మా, ఇక్కడ ఊరికే అరలు నింపడం తప్ప, వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు."


అన్నది వసుంధర చెల్లెలు.


మనసులో మెదులుతున్న క్రొత్త సందేహాలను బయటకు చెప్పలేక, పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, దిగులుగా తండ్రి వంక చూసింది వసుంధర.


తాను ఏమీ చేయలేను అన్నట్టుగా, చూసి చూడనట్టుగా, అటక మీద నుంచి పుస్తకాలు దించసాగాడు వసుంధర తండ్రి.


వసుంధర మనసు పరి పరి విధాల ఆలోచించ సాగింది.


"అమ్మ ఏమిటి, మా ఇల్లూ, మీ ఇల్లూ అంటూ నన్ను వేరు చేసి మాట్లాడుతుంది ? అయినా అమ్మా వాళ్ళది సొంత ఇల్లే కదా !! నా వస్తువులు ఇక్కడ ఉంటే, వాళ్ళకి ఏమి అడ్డము, ఎందుకు వచ్చినప్పుడల్లా, అవి తీసుకెళ్ళు, ఇవి తీసుకెళ్ళు అంటుంది !!


చెల్లి, నాన్న కూడా అదే మాట అంటున్నారు. పెళ్ళి అయితే, ఇక ఇది నా ఇల్లు కాదా !! "


అని ఆలోచిస్తూ, అమ్మ చెప్పినవి అన్నీ ఒకటొకటిగా సర్దుకొని, తన అత్త వారింటికి వెళ్ళింది.


అత్తగారి ఇంట్లో సామాన్లు సర్దుతూ,


"ఏవండీ, మన గదిలోని ఈ అల్మారా కాస్త ఖాళీ చేసి, అందులోని మీ చెల్లెలు సామాన్లను తన గదిలో పెట్టుకోమని చెప్పరూ !! అప్పుడు నేను మా ఇంటి నుంచి తెచ్చినవి సర్దుకుంటాను."


అనడిగింది.


"అదేదో నువ్వే చెప్పు !!"


అన్నాడు మోహన్.


అటుగా వెళ్తూ, ఈ మాటలు విన్న వసుంధర అత్తగారు,


"మా అమ్మాయికి పెళ్ళి అయినా, పుట్టింట్లోనే ఎందుకు ఉంటుంది అన్న సందేహాన్ని ఇలా వ్యక్తపరుస్తున్నావా ?"


అనడిగారు కోపంగా.


"అయ్యో అదేమీ లేదు అత్తయ్యా, అల్మారా గురించి చెప్పాను అంతే !!"


అన్నది వసుంధర.


ఇంతలో వసుంధర ఆడపడుచు అందుకుంటూ,


"మాదీ ఈ ఊరే కనుక, అడపాదడపా వచ్చి అమ్మానాన్నలను చూసి పోతూ ఉంటాను. ఈ మాత్రానికే ఇంత చర్చ చేయాలా ?"


అన్నది విసుగ్గా మొహం పెడుతూ.


"అడపాదడపా అంటూ, ఎప్పుడూ ఇక్కడే ఉంటున్నావు. నువ్వు ఉండటం కోసం నన్ను ఉండనివ్వట్లేదు.


పొమ్మనకుండా పొగ పెడుతున్నావు !!"


అని అనబోతూ, మళ్ళా తనకు తాను తమాయించుకొని,


"అలా నేను అనలేదు, ఇది నీ పుట్టిల్లు, ఎప్పుడయినా వచ్చి ఉండే హక్కు నీకు ఉంటుంది.


కాకపోతే, మా గదిలో ఉన్నదే మూడు అల్మారాలు. అందులో కూడా ఒకటి నువ్వే వాడుతుంటే, నా వస్తువులకు చోటు చాలడం లేదు.


ఇవాళ మా ఇంటి నుంచి, నా బొమ్మలు , చీరలు, పుస్తకాలు తెచ్చుకున్నాను. అవి సర్దుకోవడం కోసం, ఆ అల్మారా కావాలని అడిగాను, అంతే !!"


అన్నది వసుంధర.


"నా కూతురు వస్తువులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏవో కొన్ని మాత్రమే అత్తగారు ఇంటికి పట్టుకెళ్ళింది. నువ్వూ అలాగే చేయి. అన్నీ మీ పుట్టింట్లో ఉంచుకొని, అవసరమైనవే తెచ్చుకో !! అప్పుడు రెండు కూడా అక్కర్లేదు. ఎంచక్కా ఒక్క అల్మారాలోనే అన్నీ సర్దుకోవచ్చు !!"


అన్నారు అత్తగారు.


సరే అంటూ తలూపింది వసుంధర.


తల ఊపిందే కానీ, మనసులో ఏవో ఆలోచనలు, మనసంతా భారంగా ఉంది. బరువు దించుకోవాలి అంటే డైరీ వ్రాయాలి అనిపించి,


ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తరువాత, తన డైరీలో ఇలా వ్రాసుకుంది.....


"ఇప్పటి వరకూ నాకు రెండిళ్ళు ఉన్నాయని ఎంతో సంబర పడ్డాను. రెండు చోట్లా నాకు హక్కు ఉంది అనుకున్నాను. రెండు కుటుంబాల ప్రేమను ఆస్వాదించే అదృష్టం నాకు మాత్రమే దక్కింది అని మురిసిపోయాను. నేను ఏమి చేసినా చెల్లుతుంది అనుకున్నాను. ఏదయినా స్వతంత్రంగా అగడవచ్చు అనుకున్నాను.


కానీ, ఇవాళే తెలిసింది. నా ఇంట్లో నా వస్తువును పెట్టుకోడానికి కూడా నాకు స్వతంత్రం లేదు అని !!


పేరుకు నాకు రెండిళ్ళు ఉన్నా, ఈ రెండిట్లో ఏ ఒక్కటీ నాది కాదు !!


మరి నా ఇల్లు ఏది ? నా బొమ్మలు ఎక్కడ పెట్టుకోవాలి ? నా పుస్తకాలకు చోటేది ??


ఇన్నాళ్ళు, మనం మనం అని విని, ఇప్పుడు నువ్వు మేము, మీరు మేము అని వింటూ ఉంటే కొత్తగా ఉంది.


నాకంటూ ఒక ఇల్లు ఉంటే బావుండు అని ఆశగా ఉంది.


ఎందుకొస్తున్నాయి ఈ కన్నీళ్ళు.....


ఆగవా !!"


అని రాస్తూ, మెల్లగా కుర్చీలో వెనక్కు వాలింది, కన్నీళ్ళను తుడుచుకుంటూ......



Rate this content
Log in

Similar telugu story from Abstract