Varanasi Ramabrahmam

Tragedy Inspirational

4  

Varanasi Ramabrahmam

Tragedy Inspirational

మందాకిని

మందాకిని

5 mins
379


మందాకిని


మందాకిని నా స్నేహితురాలు. ఆమె అందగత్తె. శరత్కాల పూర్ణ చంద్రుని పోలే ముఖం ఆమెది. ఆమె హృదయ సౌందర్యం శారీరిక సౌందర్యాన్ని మించినది. ఆమె మనసు సున్నితమైనది. రమ్యమైన కవితలల్లడం ఆమె ప్రవృత్తి. ఆమె కవితల మనోజ్ఞధార. కావ్య లహరి కూడ.


ఒక వనితా మాసపత్రికకు ఆమె ఉప సంపాదకురాలు. ఆ పత్రికకు వచ్చే సారస్వత, సాహితీ రచనల పరిశీలన ఆమె నిత్య కృత్యము. సాంఘిక సమస్యల గురించి ఆమె ఎన్నో రచనలు చేసింది. మందాకిని నాకు అత్యంత ప్రియమైనది. నాకు కాబోయే భార్య కూడాను.


నేను సారస్వత ప్రేమికుణ్ణి. కథలు, కవితలు, నవలలు చదవడమంటే నాకు ఎంతో ఇష్టం. నాకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచి భాషలు తెలుసు. ఆయా భాషల్లో ఉన్న సాహిత్యాన్ని చదువుతూంటాను. విమర్శనాత్మక దృష్టితో ఆయా రచనలను పరిశీలిస్తూంటాను.


అన్నిరకాల సారస్వతాల గురించి, సాహిత్యాల గురించీ మందాకిని, నేను చర్చిస్తూంటాము. కవులూ, రచయితలు, వారి కవితా, సాహితీ సృష్టులు, రచనా సమయంలో, వారి, వారి, మానసిక దృష్టి, స్థితుల గురించి మాట్లాడుకుంటూంటాము. ఇలాంటి చర్చలతో సమయం గడపడమే మా ఇద్దరి మధ్య మైత్రిని పెంచింది. ఇలా పెరిగిన మా స్నేహమే మమ్మల్ని భావి దంపతులను చేస్తోంది.


ఒకరోజు నేను మందాకినీ వాళ్ళింటికి వెళుతున్నాను. ఆ రోజు పౌర్ణమి. నిండు చంద్రుడు తన వెన్నెలతో సమస్త జగతిని ఆహ్లాదపరుస్తున్నాడు. ఆ ఆహ్లాదతరంగాలు నన్ను తాకి, నాలో మాధుర్యాన్ని నింపుతున్నాయి. “ఈ ఆహ్లాదాన్ని నా ప్రణయిని మందాకిని సమక్షంలో పండించుకోవాలి. తనతో మధురాలాపాలతో పరవశిచాలి” అనుకుంటూ మందాకిని వాళళింటి వైపు వడిగా అడుగులు వేశాను. 


మందాకిని ఇంట్లోనే ఉంది. ఆమె నిరుత్సాహంగా కనిపించింది. ముఖం చిన్నబోయి ఉంది. ఏదో ఆమె మనసును తీవ్రంగా కలచివేసిదని నా మనసు చెప్పింది. ప్రతిసారీ చిరునవ్వుతో పలకరించి నన్ను ఉత్సాహంగా ఆహ్వానించే తను మౌనంగా, ఉదాసీనంగా కుర్చీ చూపించి కూర్చోమంది. ప్రియసఖి మందాకినిని ఆ స్థతిలో చూసి ఎంతో ఆందోళన చెందాను. ఆమెను అనునయంగా చూస్తూ, స్నేహభరిత స్వరంతో సంభాషణ మెదలు పెట్టాను.


“సఖీ! మందాకినీ!  ఏమిటీ దేనికో ఆందోళన చెందుతున్నావు, ఏమిటది? ఎందుకని?”

కళ్ళలోంచి ఉబికి వస్తున్న అశ్రుకణములను చేత్తో తుడుచుకుంటూ అంది.

“ఈ వేళ నేను సుప్రసిధ్ధ కవి శ్రీహర్ష గారిని మా పత్రిక కోసం ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ స్నేహపూర్వక వాతావరణంలో ఆహ్లాదంగా జరిగింది. శ్రీహర్ష నా ప్రశ్నలకు చాల చక్కగా సమాధానాలిచ్చారు. చివరలో నేనొక ప్రశ్న వేశాను. దానికి ఆయనిచ్చిన సమాధానం నన్ను ఎంతో కలచి వేసింది.

“నువ్వు వేసిన ఆ ప్రశ్న ఏమిటి?”

“అదే విపులంగా చెబుతాను విను.”

*      *         *           *  

ఇంటర్వ్యూలో నేను అడిగాను.

“శ్రీహర్ష గారు! అతి పిన్న వయసులోనే ప్రసిధ్ధ కవిగా పేరు తెచ్చుకున్నారు.  మీ కవితలు మనోజ్ఞములు. రసభరితములు. మానసికోల్లాసాన్నిస్తాయి. అలా మీలా కవితలల్లగలిగే వాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు. అటువంటి వారిలో మీరు అగ్రగణ్యులు. దీనికి మీరేమంటారు?”

“ మైత్రి నిండిన మీ మాటలు నన్ను ఎంతో సంతోషపరిచాయి. నా మనసు పూర్తిగా స్పందించినప్పుడే నేను కవితాసృష్టి చేస్తాను. మరొక విధంగా, మరొకప్పుడు రాయలేను. మనసే మనసు గతులు, సంగతులు గ్రహిస్తుంది. అనుకంపన గల మీరు రసహృదయులు. రసాస్వాదకులు. అంచేతే నా కవితలు మిమ్మల్ని రంజింపచేస్తున్నాయి. పాఠకుల సంతృప్తే కవికి కావలసినది. అప్పుడు కవి ధన్యతనొందినట్టే”.

మరికొన్ని ప్రశ్నలడిగి చివరలో ఇలా ప్రశ్నించాను. 

“కవి గారూ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను.

మీరు అన్ని విషయాలనూ వస్తువుగా తీసికొని కవితలల్లారు. కాని మాతృ ప్రేమను వస్తువుగా తీసికొని ఒక్క కవితా వెలయించలేదు. మాతృ దేవత అనురాగం గురించి మీ ఏ కవితా స్పృశించలేదు.

మాతృమూర్తి మనని తన గర్భంలో వహించి, నెలలు నిండాక ప్రసవిస్తుంది. జన్మనిస్తుంది. పుట్టిన క్షణం నుంచీ మన లాలన, పాలన, పోషణలు చూస్తూ, అన్ని సేవలూ చేస్తూ పెంచుతుంది.

నడక, నడత నేర్పుతుంది.

తల్లి తన సంతానం కోసం ఎంతో చేస్తుంది. సంతానం నుంచి ప్రేమ, ఆపేక్షలని తప్ప మరేమీ ఆశిచదు. తన జీవితాంతం అమ్మ మనకోసమే జీవిస్తుంది. ఒక్క క్షణమైనా మనలని మరువదు.

ఇంతటి అమ్మను గురించి మీరు ఒక్క కవితా వెలయించలేదు. అమ్మ వాత్సల్యాన్ని, అనురాగాన్ని ప్రకటించే ఏ కవితా మీరు రాయలేదు. ఎందుచేత?”


నేను వేసిన ఈ ప్రశ్నను విన్న శ్రీహర్ష ముఖంలో ప్రసన్నత మాయమైంది. అనురాగ రహితమైన భావం గోచరించింది.

“మీ పరిశీలనాశక్తి అపూర్వము. అవును, నేను మాతృప్రేమను గురించి, మాతృత్వ మాధుర్యాలు నిండిన

వాత్సల్యానురాగాల గురించి ఏమీ రాయలేదు. దానికి కారణం ఉంది. నాకు తల్లి చూపించే ప్రేమ గురించి తెలియదు. తల్లి అందించే అనురాగం నాకు అందలేదు.

తల్లి ఉండి కూడ అనాథలా పెరిగాను. నా పాలనా, పోషణా నా కన్నతల్లి చెయ్యలేదు. తల్ల పాలను కూడా నేను తాగలేదు. ఒక సంపన్న కుటుంబంలో పుట్టాను నేను. నన్ను పెంచడానికి, అసలు నాతో గడపడానికే నా తల్లికి ఖాళీ ఉండేది కాదు. ఆమె ఒక “హై సొసైటీ లేడీ”. ఆయాయే నన్ను పెంచింది. ఆయా “ లాలనలు” మాత్రమే తెలుసు నాకు. అమ్మ వాత్సల్యానురాగములు తెలియవు నాకు.

తల్లి లాలనలకు, పాలనకు నోచుకోక నేను పసితనాన్ని, బాల్యాన్ని విచారగ్రస్తంగా గడిపాను. నన్ను తీర్చి దిద్దినది మా శకుంతలా టీచర్. ఆవిడ మలిచిన శిల్పాన్ని నేను.

తల్లి వాత్సల్యం, ప్రేమ, మృదుత్వం, మార్దవం నాకు ఎండమావులు. నా మనసు తల్లి అనుకంపనని చవి చూడలేదు. నా హృదయం అమ్మ ఆప్యాయతని ఆస్వాదించలేదు. పొందని అనుభూతిని ఎలా ప్రకటించగలం?

శుష్కించిన హృదయంలో కరుణార్ద్రతా గోదావరులు ఎలా ప్రవహిస్తాయి? స్పందన కలిగించబడకపోవడం వల్ల మాతృప్రేమపై నాలో కవితలు పొంగలేదు.

పగలు ప్రకాశించనని సూర్యుడు

వెన్నెలలను చిందించనని చంద్రుడు

మధర జలములను వహించమని నదీమతల్లులు

మధుర ఫలముల అందించమని తరువులు

నిజసంతానాన్ని సాకమని,  తమకు ముఖ్యమైన

పనులు వేరని తల్లులు ప్రకటించిన; ప్రకృతిని

కలుగు వికృతుల నెవరాపగలరు? వీరి సహజ

గుణములు నిండుకొనిన ఎవరు దిక్కు జగతికి

సూర్య చంద్రాదులలో సహజ ప్రకృతులు లోపించిన సృష్టిలో కలుగు గందరగోళానికి ఏది ఉపశమనం? తల్లులందరూ నా తల్లిలా కాక, సంతానాన్ని తాకితే నాలాగ చిత్తక్షోభ పడే అవసరం ఏ పసికందుకూ ఉండదు.

మీ పత్రికను విద్యావతులైన స్త్రీలందరూ చదువుతారు. వారందరికీ నాదొక విన్నపం. “తల్లులారా! మీ వివిధ వ్యవహారాల్లో మీ ప్రగతికి మీ శిశువులు అడ్డు వస్తారు అనిపిస్తే, వారిని సాకడానికి మీకు సమయం ఉండదనిపిస్తే పిల్లల్నే కనకండి. పనిమనుషులచే పెంచబడే దుర్గతి మీ పిల్లలకు పట్టనీయకండి.”.

“మీ అంతరంగంలో రగులుతున్న భావానలాన్ని నేను అర్థం చేసికోగలను. మీ మనసుని నిస్సంకోచంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శలవు తీసికంటాను శ్రీహర్ష గారూ.”

“నమస్కారం! మళ్ళీ కలుద్దాం మందాకిని గారూ!”

#   #    #

 “ ఇలా జరిగింది ఇంటర్వ్యూ. అగ్రగణ్యుడైన కవికి బాల్యం ఒక అనాథలా గడిచింది అనీ, తల్లి వాత్సల్య స్పర్శ అతని మనసుకి సోకలేదనీ తలుతుకుంటూంటూనే గుండె బ్రద్దలయ్యిపోతోంది. నా మనసు ఎంతో ఖిన్నమై పోయింది. మనసు ఉద్విగ్నంగా ఉంది” అంది మందాకిని.

నిండు చందమామ లాంటి ఆమె ముఖం గ్రహణం పట్టిన చంద్రునిలా ఉంది. పున్నమి అమావాస్య అయింది. ఇంకా ఇలా అంది మందాకిని. “ తమ తమ జీవితాలలో అందుకోవలసిన ఎత్తులను అందుకోవాలని, స్వంత అభిరుచులకు, ఊహలకు అనుగుణంగా జీవించాలని ఉవ్విళ్ళూరే నేటి మహిళలు సంతానాన్ని ఉపేక్షిస్తున్నారు. తాము అందలాలు అందుకోవడమే ప్రథమమని, మహత్వపూర్ణమనీ భావిస్తున్నారు.

అనురాగాన్ని అందించక, అనురాగాన్ని పొందడానికి తమని తాము అనర్హులని చేసికుంటున్నారు. తల్లి జీవితంలో పిల్లలు ఉపేక్షింపబడుతున్నారు. ఈ తలపు వస్తే ఊహలోనే భరించలేక పోతున్నాను. జీవితాల్లో పరస్పరం అనురాగం పంచుకొని, ఆనందం నింపుకుంటూ జీవించాలి. జీవితంలో తన గురించి మాత్రమే ఆలోచిస్తే పరస్పర సంబంధాలు శిథిలమైపోతాయి. అటువంటి జీవితాలు సార్ధకాలు అవుతాయా? ఇటువంటి విపరీతమైన జీవన విధానం నాలో ఆశ్చర్యాన్ని, విచారాన్నీ కలిగిస్తోంది.”

అది పౌర్ణమి. నా ప్రణయిని ప్రక్కనే ఉంది. ఆహ్లాదకరమైన వెన్నెల అంతటా పరుచుకొని ఉంది.  కాని మనసు ఉదాసీనంగా ఉంది. నా ప్రియురాలి విచారం నన్ను కలవరపరచింది. ఆమె ఆవేదన నన్ను కరుణాభరితుణ్ణి చేసింది. కాసేపు మౌనం వహించి ఇలా అన్నాను.

“మందాకినీ! ఈ యంత్రయుగంలో స్త్రీలు, పురుషులు తమ తమ ప్రకృతులను మరచి స్భావ విరుధ్ధంగా జీవిస్తున్నారు. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు వంటి సంబంధం తెలిపే మాటలు తమ అర్థాలను కోల్పోయాయు. మనుషులు ఇటువంటి ముఖ్య బంధాలను కూడా అనుబంధాలతో పెనవేసుకోవడం లేదు. అలా చేయడం ఆధునికుల లక్షణంలా కనిపించడం లేదు.

“మాతృత్వం మధురమైనది” వంటి వాక్యాలు పుస్తకాలకే పరిమితమౌతున్నాయి. ఒకరి కోసం ఒకరు జీవించడం లేదు. తల్లి పెంపకం కరువైన బాలల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. మాతృ వాత్సల్యం చవి చూడని వారి ఆక్రోశం అరణ్య రోదనం అవుతుంది. సమాజంలో ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకోవడం శోచనీయమైన విషయం.”

అలా ఆ మాటా, ఈ మాటా చెప్పి మందాకినికి ఉపశమనం కలిగించి ఇంటికి వచ్చాను. అప్పటికి అర్ధరాత్రి దాటింది. అమ్మ భోజనం చేయకుండా నా గురించి కాచుకుని ఉంది. ఇద్దరం కలిసి భోజనం చేశాము. ముఖం చూడగానే నా మన:స్థితిని గ్రహించిన అమ్మ వాత్సల్యపూరితమైన మాటలతో నన్ను సేదదీర్చింది.


Rate this content
Log in

Similar telugu story from Tragedy