Varanasi Ramabrahmam

Classics

5  

Varanasi Ramabrahmam

Classics

ఆత్మజ్ఞానము

ఆత్మజ్ఞానము

7 mins
34.9K


ఆత్మజ్ఞానము సూర్యకాంతి వంటిది. ద్రష్టలైన ఉపనిషత్ స్రష్టలు ఆత్మజ్ఞానమునకు ఆద్యులు. దివ్యక్షణములలో ఆ ఋషుల నిర్మల మానసం నుంచి ఆవిర్భవించిన శాంతరసస్ఫురణము బ్రహ్మజ్ఞానము. ఆత్మ, బ్రహ్మము ఒకటే. అయమ్ ఆత్మా బ్రహ్మా.

 

అట్టి ఆత్మజ్ఞానమనే సూర్యకాంతి, అంతే నిర్మలులైన మహర్షుల, యోగుల, జ్ఞానుల, ఆచార్యుల నిండు జాబిలి వంటి మనస్సులనందు ప్రతిఫలించి ఆహ్లాదకరమైన పున్నమి వెన్నెలలుగా రూపుదిద్దుకుంటుంది. తత్త్వజ్ఞులు, వేదాంతులు, శంకర, రామానుజ, మధ్వ ప్రభృత ఆచార్యులు, ఇతర బ్రహ్మజ్ఞానులు, ఆ బ్రహ్మతత్త్వాన్ని కాచి వడబోసి ఆ సారాన్ని మనకి అందించారు. ఆత్మజ్ఞానము ఒక సింధువు. సముద్రపు నీటిబిందువులో సముద్రమంతా ఇమిడి ఉన్నట్టు, మనలో ఈ ఆత్మతత్త్వమంతా ఇమిడి ఉన్నది. 

 

మనసు ప్రశాంతంగా ఉండాలని మనందరి ఇచ్ఛ. మనసు ప్రశాంతత నేర్వడానికి, ప్రశాంతతనొందడానికి ఆత్మ లేక బ్రహ్మ తత్త్వవిచారము తోడుపడుతుంది. దానికి తోడు జిజ్ఞాస మనిషికి సహజం. ముముక్షువులలో రకరకాల చిత్తపరిపక్వతలు కలవారుగా ఉంటారు. ఆ పరిపక్వతకు అనుగుణంగా వారు భక్తి, జ్ఞాన, కర్మ మార్గములవైపు ఆకర్షితులవుతారు. తమ పరిపక్వత, బుధ్ధి కుశలతను అనుసరించి తమకు అనుకూలమైన పధ్ధతిని ఎన్నుకుంటారు. దానిని తమ ఆధ్యాత్మిక మార్గంగా మలుచుకుంటారు.

 

ఆత్మజ్ఞానము; దానిని వినడము, విన్నదానిని మననము చేయడము, మననము చేసినదానిని అనుభవముగా మార్చుకొనడము జిజ్ఞాసువుల లక్షణము, బాధ్యత, విధి కూడాను. ఇలా విని, మననము చేసి, అనుభవముగా మార్చుకోవడాన్ని విచార మార్గము అంటారు. అలా విచారమార్గం ఆత్మతత్త్వ, మనస్తత్త్వ చింతనాయుత బ్రహ్మానుష్ఠానము. పరిశ్రమతో కూడిన విధానము. నారికేళపాక సదృశమై, నిష్ఠా, దీక్షాపరులకు, మనఃపరిపాకము నొందినవారికి గాని అనుసరింప అలవి కానిది.

 

కాని ఆత్మతత్త్వమును అనుభవించి, అవగాహన చేసికొని వంటబట్టించుకున్న జ్ఞాని, ఆచార్యులు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు తత్త్వమును ప్రౌఢత తగ్గించి మనకు అందిస్తారు. ఆ సారళ్యత వల్ల బ్రహ్మతత్త్వము మనకు అవగాహన అవుతుంది. అటువంటి సారళ్యత అందించే ప్రయత్నం ఇక్కడ జరిగింది.


ఉపనిషత్తులు, బౌద్ధం, జైనం, షడ్దర్శనములు, వీటన్నిటి అనేక వ్హాఖ్యానాలు, తదుపరి వచ్చిన వచ్చిన జ్ఞానులు, వారి చింతనా సారాంశము, అన్నీ, అందరూ; ఆత్మానాత్మ వివేకాన్ని కూలంకషం గా చర్చించారు. దాని సారాంశం ఏంటంటే,


నామరూప వినిర్ముక్తం యస్మిన్ సంతిష్ఠతే  జగత్ తమ్ 

ఆహుహు ప్రకృతిమ్  కేచిన్ మాయామ్ అన్యే పరేత్వ చ అణూన్ ll 


తాత్పర్యం: నామ రూప రహితమైన దేని యందు "జగత్" ప్రతిష్టితమై ఉంటుందో ఆ వస్తువును కొందరు "ప్రకృతి " అమ్తారు. కొందరు "మాయ" అన్తారు. మరికొందరు "అణువులు" అంటారు.


ఈ వస్తువే అన్ని మానసిక కార్యకలాపములకు మూలము, ముడి వస్తువు (ముడి శక్తి) కూడాా. 


ఆత్మజ్ఞానము ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడినది. దానిని ఆధారం చేసికొని, అనుసరించి, సవరించి, విభేదించి, బౌద్ధ, జైన, తత్త్వజ్ఞానములు ప్రభవించాయి. పరిణమించాయి. పరిఢవిల్లాయి. ఆ పరంపరలో, పరిణామంలో, షడ్ దర్శనములు ఉద్భవించి తమదైన శైలిలో ఆత్మ విచారాన్ని సలిపాయి. ఈ సందర్భముగా షడ్ దర్శనములూ తమదైన తరహాని ప్రారంభించాయి. 


* న్యాయ వైశేషికములు అణు సిద్దాంతాన్ని ప్రతిపాదించి, బలపరచి, పరిణమించాయి.


* సాంఖ్య యోగములు ప్రకృతి-పురుష సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, బలపరచి, పరిణమించాయి.


* పూర్వ, ఉత్తర మీమాంసలు, ముఖ్యముగా వేదాంతమని పిలువబడే ఉత్తర మీమాంస‌ మాయా సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, బలపరచి, పరిణమించాయి. 


ఈ షడ్దర్శనముల లోని మాటల గారడీ వల్ల పైకి ఇవన్నీ సామరస్యంగా లేక తేడాగా ఉన్నట్టు అనిపించినా, ఇవన్నీ ప్రతిపాదించేది, చర్చించేది, సారాంశాన్ని అందించేది ఆత్మతత్త్వం గురించే.


సత్-చిత్-ఆనందం, అస్తి-భాతి-ప్రియం, నిత్య-శుద్ధ-బుద్ధ-ముక్తము అయిన ఆత్మ సత్య-జ్ఞాన-సుఖాకారాన్నీ పొందుతుంది. 


ఉపనిషత్ పరిభాషలో ఆత్మజ్ఞానాన్ని "విద్య" అనీ, తదితర పరిజ్ఞాన, విజ్ఞానములను "అవిద్య" అనీ అంటారు. అలాగే విద్యను జ్ఞానమనీ, అవిద్యను అజ్ఞానమనీ అంటారు. ఇటువంటి, తత్సదృశ వేదాంత సాంకేతిక పదములను ఉపనిత్ వాక్యార్థములందు అన్వయించుకొనిన బ్రహ్మజ్ఞానావగాహన కలుగును. ఈ అన్వయము వేదాంత వాక్యార్థ శ్రవణ, మనన, నిదిధ్యాసల ద్వారా పట్టుబడుతుంది. మన మానసిక పరిణితి, పరిపక్వతల వల్ల మనకు ఇలా ఆత్మదృష్టి‌, ఆత్మానుభవము ఏర్పడతాయి. 


అన్ని దర్శనములందు ప్రతిపాదింపబడిన సిద్దాంతములను సమీక్షించి అవగాహన చేసికొని, ఉపయోగించే విషయముల పరిగ్రహించి, తర్క కర్కశయుతమైన ఉపయోగపడని విషయముల పరిహరించి వాటి పరిధిని అవగాహన చేసికొని ఆత్మజ్ఞాన సారాంశామైన అద్వైతాన్ని ద్వైతముతో అనుసంధానించి మానసిక కార్యకలాపములను నిర్వహించే మాయా పరిణామములను దర్శించి అహం శబ్ద తాత్పర్య దర్శనము చేసి ఆత్మజ్ఞానమును అనుభవముగా చేసికొనడమే ఉపనిత్ సారాంశ దర్శన భాగ్యము. 


మన లౌకిక - కళా - శాస్త్ర - తత్త్వ జ్ఞానములన్నీ, ఆత్మ జనితమైన మాయా విభూతులు. మాయా వివర్తన పరిణామములు. అంతఃకరణ చోదిత జ్ఞాన, కర్మేంద్రియ వ్యాపార జనితములు; వాటి అన్నిటి

పరస్పర సహాయ సంయోగము అని ఆత్మ జ్ఞానము చెబుతుంది. వీటన్నిటిలో ఆత్మ పాల్గొనక అతీతముగా గమనికగా ఉండి వీటన్నిటిని వీక్షిస్తూంటుంది. మనసు మాధ్యమములో జ్ఞానేంద్రియముల ద్వారా బయటి వస్తు ప్రపంచ గ్రహణము జరిగాక (బహిర్ముఖ దృష్టి ద్వారా), మన మస్తిష్కములో ఈ బహిర్ జగత్ ముద్రలుగా అంతర్ జగత్ ఏర్పడ్డాక; విషయములు, విషయానుభవముల రూపములో ఉన్న, ఈ అంతర జగత్ తోనే మన మానసిక వ్యహారమంతా. ఆ తర్వాత బయట విషయము ఉన్నా మనసుతో ఈ లోని విషయ ముద్రలతోనే మనము ఎక్కువగా వ్యవహరిస్తాము. లోని ఈ వస్తు ముద్రలను మనసుతో మనము గ్రహించినపుడు, మన దృష్టిలోకి వచ్చినపుడు కలిగే భావ పరంపరనే "జగత్" అంటారు. ఈ గ్రహణము అంతర్ముఖ దృష్టి జనితము, భరితము.


బ్రహ్మా సత్ జగత్ మిథ్యా

జీవో బ్రహ్మా ఏవ న అపరః


అనే ప్రసిద్ధమైన అద్వైత వేదాంత సారాంశా వాక్యము లోని "జగత్" అంటే ఇదే. ఈ "జగత్" మాత్రమే మిథ్య అని అద్వైతులు, శంకరులు అన్నారు. బయటి వస్తు ప్రపంచము మిథ్య అని వీరెవరూఅనలేదు. ఆది శంకరులు బయటి ప్రపంచము అంతా మిథ్య అన్నారనేది అపార్థ జనిత వ్యాఖ్యానము. అన్వయదోష భరిత తప్పుడు ప్రచారము.


"జగత్" కి నిమిత్త (instrumental) మరియు ఉపాదాన (material) కారణము బ్రహ్మమే ఆత్మయే.  "జగత్" నిర్మాణము బ్రహ్మ పదార్ధ జనిత మాయతో జరుగుతుంది. మాయను చిదభాస అనీ అంటారు. చిదాభాసా "చిత్ శక్తి" యొక్క మేధా ప్రతిఫలనము - - మాయతో జరుగుతుంది - (మాయా మయమ్ ఇదం జగత్).


ఈ చిత్ శక్తి యొక్క జనన స్థానమైన బ్రహ్మము లేక ఆత్మయే మన అసలు ఉనికి. ఎఱుక లేక గమనిక ఆత్మ యొక్క అసలు స్వరూపము.


అద్వైత శాంత రస స్థితిలో నున్నవారు ఈ "మిథ్య" యైన "జగత్", సర్వ కాల, సర్వావస్థల యందు ఉండే బ్రహ్మమును కప్పే తెర (ముసదా సుగు లేక ఆనింపు) అని గ్రహించి, గుర్తుంచుకుని; "జగత్" దృష్టిలోనికి రావడం వల్ల కలిగే తదనుగుణ సుఖ దుఃఖములను మనసుకు అంటనీయక, దృష్టిని ఆత్మానుభవం నుంచి మళ్ళనీయక సదా చిదానందులై సహజమైన సుఖస్వరూపులై శాంత భరిత మనస్కులై మౌనులై ఉంటారు.


బ్రహ్మ స్థితి నిర్గుణ స్థితి. జాగ్రత్ సుషుప్తి స్థితి. అద్వైత స్థితి. దీని విశ్రాంత దృష్టి స్థితి అనీ అంటారు. జాగ్రత్, స్వప్న, మానసిక దశలలో / అవస్థలలో కలిగే త్రిపుటీ, త్రిగుణాత్మక విభాగాన్ని ద్వైత దృష్టి / స్థితి అంటారు. ఇది జాగ్రత్ లో బహిర్ముఖ  దృష్టి గాను, స్వప్న స్థితిలో అంతర్ముఖ దృష్టి గాను పిలవబడుతుంది.


ద్వైత స్థితిలో జ్ఞాత, జ్ఞెయము కూడా జ్ఞానములో నున్న స్పృహ కలుగుతుంది. సత్త్వ గుణం ఎఱుక లేక గమనికనిస్తుంది. రజో గుణం, మాయ అంతఃకరణములుగా పరిణమించిన స్థితి. అట్టి అంతఃకరణములు విషయ లేక విషయానుభవ యుతమైతే తమో గుణం ఏర్పడుతుంది. సత్త్వ. రజో గుణాలు విషయ / విషయానుభవ గ్రహణకు ఆలంబనగా ఉంటాయి. గుణం అంటే ముడి. విషయముతో కాని లేదా విషయానుభవముతో కాని అంతఃకరణము ముడివడని స్థితి నిర్గుణ స్థితియైన బ్రహ్మ / ఆత్మ స్థితి. శాంత, ఆనంద, మౌన స్థితి అన్నా ఇదే. జాగ్రత్ సుషుప్తి, సుషుప్తి దశలలో విరాజిల్లే మానసిక కార్యకలాపముల విరమణ / విరామ స్థితి ఇదే. రామ / నిష్కామ స్థితి ఇదే.


అలా ఆత్మ ఉనికి వల్ల మనకు ఎఱుక లేక గమనిక కలుగుతుంది. ఎఱుక అసలు స్వరూపము సచ్చిదానందము. (సత్-చిత్-ఆనందము) పరమ సుఖము.


అంతర్ముఖ దృష్టి ద్వారా దృశ్యమైన (కంటికి రూపము, దృశ్యము ; చెవికి శబ్దము / మాట / ధ్వని; నాలుకకు రుచులు; ముక్కుకు వాసనలు; చర్మమునకు స్పర్శ, వేడిమి చల్లదనములు - మస్తిష్కముపై వీటి లోని ముద్రలు - దృశ్యములు ) "జగత్", ఆత్మ (సత్) పై పొరలా ఏర్పడి, ఆత్మా దృష్టిని భంగపరచి, జగత్ దృష్టిని కలిగిస్తుంది. ఈ జగత్ "మిథ్య" (కల / స్వప్న మానసిక స్థితి ఏర్పడిన సమయము / అంతర్ముఖ దృష్టి సమయము; ఒక సారి ఉండి ఒకసారి ఉండనిది / ఆభాసా అయినది). ఈ మిథ్యా గ్రహణము ఆత్మ గ్రహణము పై ఆని, దృష్టిని మారుస్తుంది (విశ్రాంత దృష్టిని లేక బహిర్ముఖ దృష్టిని, అంతర్ముఖ దృష్టిగా మారుస్తుంది).


ఇలా మారిన దృష్టి ఎదురుగా ఉన్న రజ్జువు (తాడు) ను గ్రహించక, అంతర జగత్తులో తత్సమాన రూపములోనున్న సర్పము (పాము) గా గ్రహిస్తుంది. అప్పుడు తాడు కనిపించక పాము "కనిపిస్తుంది". అలా ఆత్మ కనిపించక, దానిపై ఆనింపు అయిన జగత్ కనిపిస్తింది. సత్ దృష్టి పోయి జగత్ భ్రమ కలుగుతుంది. ఆత్మ కనిపించక (అనుభవములొనికి రాక), ఈ కల్పిత జగత్తు కలిగించే సుఖ దుఃఖములు అనుభవములోనికి వస్తాయి. సహజమైన ఆత్మానుభవము చెదరి; కల్పితము, మిథ్య అయిన జగత్ (విషయ గ్రహణల, తలపుల, విషయానుభవ గ్రహణల రూపు అయిన జగత్ - అది కలిగించే మిథ్యా భావ పరంపర, తదనుగుణ సుఖ దుఃఖములు "నిజమై", వాటికి లొంగి మనము పొంగి, క్రుంగి పోతాము. మన నిజ స్థితి అయిన శాంతానంద స్థితి విస్మరింపబడి, మరుగున పడుతుంది; దృష్టి నుంచి తొలగి పోతుంది. జగత్ భ్రమ, భ్రాంతులకు లోనవుతాము. సంయమనము, స్థిమితము కోల్పోతాము.


ఈ దృష్టి మార్పు లేక భేదము తొలగి సమ్యక్ దృష్టి ఏర్పడగానే తాడు, తాడు గానే కనపడుతుంది. దృష్టి మార్పు వల్ల తాడుపై పాము ఆభాస ఏర్పడి తాడు కనిపింపక, పాము కనపడి తదనుగుణ భయోత్పాతము కలుగుతుంది. ఈ ఆభాస (ఆనింపు) పోయి తాడు కనిపింప గానే భయమూ పోతుంది. అలా సర్ప దృష్టి భంగ పడి నిజ వస్తువైన రజ్జు దృష్టి కలగగానే, సర్ప దృష్టి కలిగించిన భయ, మోహములూమాయమవుతాయి.


ఈ విధముగా జగత్ ని చూస్తున్నంత సేపూ / దృష్టిలో ఉన్నంత సేపూ ఆత్మ, ఆత్మానుభవము విస్మరణలో ఉంటాయి. "జగత్" అనే పొర తొలగగానే, మనకు సహజము, మన అసలు స్వభావము / స్వరూపము అయిన, నిత్య-శుద్ధ -బుద్ధ-ముక్తమైన బ్రహ్మానుభవము / ఆత్మానుభవము దృష్టిగా / దృష్టిలో ఉంటుంది. ఆత్మను చూస్తున్నంత సేపూ, ఆత్మానుభవము కలుగుచున్నంత సేపూ జగత్ కనపడదు. జగత్ బ్రహ్మ మయమే అనే అవగాహన నిరూఢము కాగానే, జగత్ ని చూస్తున్నా తదనుగుణ వికారములు కలగవు. నిమిత్త మాత్రముగా విధిని నిర్వర్తిస్తాము. ఇలా జగత్ ని చూస్తూనే విడిగా, సాక్షిగా మనము నిలిస్తే ఆ అధ్యాత్మిక అనుభవమే జీవన్ ముక్త స్థితి. అనీ తెలుస్తూనీ ఉంటాయి. మనము విధి మాత్రముగా, అహంకార, మమకార రహితముగా అ కార్యకలాపములలో చరిస్తూనే, వర్తిస్తూనే ఉంటాము, కాని మనసకు ఏమీఅంటవు . వాసనలుగా మారవు. అప్పటికప్పుడు జరిగి నీటిపై రాతల్లా కనుమరుగై పోతాయి. ఉనికిని కోల్పోతాయి. వర్తమానములో ఉండి, మరుక్షణము నిండుకుంటాయి.


ఆత్మ జగత్ నకు అధిష్ఠానము. అంతఃకరణములు - మనోబుద్ధ్యహంకారచిత్తములు - పరిణమించి జగత్ ని కలిగిస్తాయి. దృష్టి లోకి తెస్తాయి. గాఢ నిద్రలో, జాగ్రత్ సుషుప్తి దశలో, అంతఃకరణములు అణిగిపోగానే "జగత్" అంతర్ధానము అవుతుంది. ఈ స్థితినే ప్రళయ స్థితి అంటారు. దృష్టి, మనసు, జ్ఞానేంద్రియముల ద్వారా బయటి భౌతిక ప్రపంచము వైపు మళ్ళితే దాన్ని బహిర్ముఖ దృష్టి అంటారు. అప్పుడు బయటి ప్రపంచ విషయ గ్రహణ జరుగుతుంది. ఇదే మానసిక దృష్టి లోని విషయ, విషయానుభవ (అంతర ప్రపంచము) ముద్రలపై ఉంటె దానిని అంతర్ముఖ దృష్టి అంటారు.


దృష్టిలో ఆత్మానుభవము మాత్రమే ఉంటే దానిని విశ్రాంత దృష్టి అంటారు.


మనసు, ఇతర అంతఃకరణములు ఆత్మను గూర్చి విచారించినప్పుడు, ఆత్మమయమై, వ్యతిరేక దిశలో పరిణమించి, చివరకు ఆత్మగా అయిపోవును. ఇలా నిర్మలమైన మనసే, అంతఃకరణములే బ్రహ్మము. యదార్ధముగా ఎల్లప్పుడూ (సర్వ కాల, సర్వావస్థల యండు) ఉండునది ఆత్మ స్వరూపము ఒక్కటే. అందు జగత్-జీవ-ఈశ్వరులు, ముత్తెపు చిప్ప యందు వెండి వలె ఆభాసులు (ప్రతిఫలించువారు), కల్పనా మాత్రులు. జగత్ (తమోగుణ)-జీవ (రజో గుణ) - ఈశ్వరులు (సత్త్వ గుణ - ఎఱుక, గమనిక) లకు ప్రతినిధులు. ఈ మూడూ త్రిపుటిగా ఒకే మారు తోచి, ఒకే మారు అదృశ్యమవుతాయి.


అసలు నేను ని తెలుసుకొనుటయే, జేవన్ ముక్తునిగా అందు నిలిచి ఉండుటయే; వైరాగ్య, అభ్యాసములతో చేయు ఆత్మజ్ఞాన శ్రవణ, మనన, నిదిధ్యాసలకు, మథనమునకు ఫలము. 


ఆత్మ, వ్యక్తిత్వ అహంకార, మమకారములు కించిత్తును లేని అసలు నేను.

అహం బ్రహాస్మి, తత్ త్వం అసి, సర్వం ఖలు ఇదం బ్రహ్మా - మొదలైన ఉపనిషత్ మహా వాక్యములలో జగత్తే బ్రహ్మమని, బ్రహ్మమే అసలు నేను అని తెలుపబడింది.


మనసు నిర్మలమై మౌనముగా ఉండుటయే జ్ఞాన దృష్టి. జ్ఞానము, వైరాగ్యము ఒకటే. ఇతరాన్ని ఆపేక్షించకుండుట వైరాగ్యము. తన్ను వదలకుండుట జ్ఞానము. మనస్సును తనయందే (ఆత్మనందే)


ఉంచుకొనుట విచారము.


బంధములోనున్న "నేను" స్వరూపమును జీవునిగా/వ్యక్తిగా ఎఱిగి, నేను అసలు స్వరూపమును విచారించి, నేను యదార్ధ స్వరూపమునుతెలుసుకొను ఆధ్యాత్మికముక్తి మార్గమే; వ్యక్తియే బ్రహ్మము, "జేవో బ్రహ్మా ఏవ న అపరః" అని జీవుని ఆత్మ స్వరూపముగా తెలిసికొని ఆత్మగా, బ్రహ్మముగా నిలుచటయే తరించడము.


"దృష్టిం జ్ఞానమయీమ్ కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్" అనే నానుడి అనుభవమునకు వచ్చి, ముముక్షువు "బ్రహ్మ విత్ బ్రహ్మా ఏవ భవతి" అనే శ్రుతి వాక్యమునకు ప్రతినిధి అవుతాడు / అవుతుంది.


ఓం తత్ సత్ !Rate this content
Log in

Similar telugu story from Classics