Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Srinivas Manthripragada

Classics Inspirational


4.7  

Srinivas Manthripragada

Classics Inspirational


పంచ పరమేశ్వరులు

పంచ పరమేశ్వరులు

13 mins 339 13 mins 339

(మున్షి ప్రేమ్ చాంద్ గారి హిందీ కథకు అనువాదం)


అదో కుగ్రామం... పేరు అనవసరం...  ముళ్ళపూడి వారన్నట్టు పేరు చెప్పడం వల్ల ఆ గ్రామానికి అవమానం జరగడం కన్నా మిగిలిన వాటిని వదిలేసామే అనే బాధే ఎక్కువగా ఉంటుంది...

భారత దేశంలోని ఎన్నో గ్రామాల లాగానే ఇది కూడా పొలాలూ, చెట్లు చేమలూ, చిన్న చిన్న కొండలూ, చక్కటి సెలయేరు మధ్య ప్రకృతిలో లీనమై పోయినట్టుంటుంది.

అక్కడి స్వచ్ఛమైన వాతావరణాన్నీ, అమాయకమైన ప్రజలను చూస్తుంటే…తర తరాలుగా పాటిస్తున్న పద్ధతులే ఆ ఊరిని నడిపిస్తున్నాయి అనీ, పెరుగుతున్న నాగరికత దాన్నిఇంకా కలుషితం చెయ్యలేదని అర్ధం అవుతుంది…

ఆ గ్రామం లో ఇద్దరు ప్రాణ స్నేహితులు...జుమ్మన్ షేక్ - అళగు చౌదరి....ఇద్దరికీ ఏమీ కలవ్వు ఒక్క మనసు తప్ప...వాళ్ళ తిండీ తిప్పలనుంచి వాళ్ళు పూజించే దేవుళ్లవరకు అన్నీ వేరైనా కలిసిన మనసులు వాళ్ళను కట్టి ఉంచుతున్నాయి...బలమైన స్నేహానికి ఇంతకంటే కావల్సినది ఏముంది?

జుమ్మన్ తాను మక్కా వెళ్ళేటప్పుడు తన ఇల్లు అళగు కి అప్పగించి వెళ్లే వాడు...అళగు కూడా ఎప్పుడైనా ఊరు విడిచి వెళ్ళ వలసి వస్తే తన ఇల్లు జుమ్మన్ మీద వదిలి వెళ్లే వాడు...

వాళ్ళిద్దరి మధ్య స్నేహం బాల్యంలో వారిద్దరూ జుమ్మన్ తండ్రిగారైన జుమ్మెరాతి గారి దగ్గర శిష్యరికం చేసేటప్పుడు మొదలయ్యింది.

అళగు తండ్రి గారికి చదువు మీద పెద్దగా నమ్మకం ఏమీ లేదు. శ్రద్ధగా గురు శుశ్రూష చేస్తే విద్య అదే వస్తుంది అనీ నమ్మేవాడు. ఆ తండ్రి బిడ్డగా అళగు ఎంతో శ్రద్ధగా గురు సేవ చేసేవాడు....గిన్నెలు పళ్ళాలు కడగడం దగ్గరనుంచి గురువుగారు గుప్పు గుప్పు మని పొగలు గుప్పించడానికి అయన హుక్కా చిలుము ని ప్రతీ అరగంటకి నింపడం వరకు అన్నీ చేసేవాడు. 

దాని కోసం అతడు పుస్తకాలు లాంటి చిన్న విషయాలు పట్టించుకునే వాడు కాదు. ఈ కారణాల వల్లనో లేక తండ్రి ఉదాసీనత వల్లనో గాని అళగు కి చదువు బాగా రాలేదు.

దాని పైన

అళగు త్రండిగారు మనం నిజాయితీగా గురు సేవ చేసాం...అయినా చదువు రాకపోతే మానక భాగ్యం లేనట్టే అంటూ మెట్ట వేదాంతం చెప్పడం తో అళగు కూడా చదువు కోసం ఎక్కువ పరిశ్రమ చెయ్యలేదు. 

ఈ గురు శుశ్రూషలు, సేవల మీద గురువుగారైన జుమ్మెరాతి షేక్ గారికి ఏమి నమ్మకం లేదు. ఆయనకు తన శిక్షణ మీదే నమ్మకం. అయన కుమారుడిగా జుమ్మన్ కు మంచి గౌరవం దొరికేది. అతనకి మంచి చదువు అబ్బడం వల్లా, తండ్రినుంచి వచ్చిన చురుకుతనం వల్లాఅతను చెప్పిన మాటలైనా, తయారు చేసిన పత్రాలైనా వేలెత్తి చూపించడానికి లేకుండా ఉండేవి.

ఊళ్లోని గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా...పోస్ట్ మాన్, కానిస్టేబుల్, తాలూకా ఆఫీస్ ప్యూను లాంటి వాళ్ళు అందరూ అయన సహాయ సహకారాల కోసం చూసేవారు.

ఇద్దరు స్నేహితులూ పెరిగి పెద్దయి ....అళగు తన వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్థి వల్లా, జుమ్మన్ తన అమూల్యమైన జ్ఞానం వల్లా ఊళ్ళో మంచి గౌరవం సంపాదించుకున్నారు  

అయితే వాళ్ళ అన్యోన్య మైత్రికి ఈ బేధాలేవీ అడ్డు రాలేదు.

జుమ్మన్ షేక్ కు ఒక ముసలి పిన్నమ్మ ఉండేది. చిన్నతనం లోనే వితంతువైన ఆవిడ కి ఊళ్ళో కొంచం పొలమూ బంధువు గా జుమ్మన్ తప్ప ఏమీ లేవు.

జుమ్మను అతని భార్యా పిన్నమ్మను జాగర్తగా చూస్తూ ఆవిడ పొలం తమ పేర రాయించుకుని ప్రయత్నం చేసేవారు...

ఒక సందర్భంలో జుమ్మన్ పిన్నమ్మకు అరచేతిలో స్వర్గం చూపించి మాయచేసి ఆస్తి తన పేరు మీద రాయడానికి ఒప్పించాడు.

అక్కడ నుంచి పిన్నమ్మకు జీవితం ఎంతో అందం గాను సుఖంగానూ కనిపించేలా చేసారు జుమ్మను అతని భార్యా. రోజు పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం పెట్టడం, శుభ్రమైన నిద్ర పోయే ఏర్పాట్లు చేసి ఎంతో బాగా చూసుకునేవాళ్ళు.

అమాయకురాలైన పిన్నమ్మ ఆ సేవలకు కరిగిపోయి ఆస్తంతా జుమ్మన్ పేరు మీద రాసేసింది.

ఆస్తి పత్రాలు జుమ్మన్ పేరు మీదకు రాగానే జుమ్మన్ భార్య తన అసలు రంగు బయట పెట్టింది. పిన్నమ్మను నానా మాటలూ అనేది. ఆవిడకు కడుపునిండా భోజనం కూడా పెట్టేది కాదు.

ఆ శాపనార్ధాలూ ఆవిడ పెట్టే బాధలూ అన్నీ చూసి కూడా జుమ్మన్ ఆస్తి మీద ఆశ తోనూ, భార్య అంటే భయం తోనూ గుండె రాయి చేసుకుని మాట్లాడ కుండా ఉండేవాడు.

పిన్నమ్మ ఈ వ్యహారం కొంతకాలం భరించింది...ఇక భరించలేని పరిస్థితిలో ఒకరోజు జుమ్మన్ దగ్గరకు వెళ్లి మొర పెట్టుకుంది. ఆడవారి వ్యహారంలో తల దూర్చడమెందుకని జుమ్మన్ మౌనం గా ఉండిపోయాడు. దాంతో జుమ్మన్ భార్య మరింత రెచ్చిపోసాగింది.

ఆమె నోరు రోజు రోజుకు వాడి పెరగనారంభించింది...పిన్నమ్మకు భరించే శక్తి తగ్గి పోతూ వచ్చింది.

ఒకరోజు ఉండబట్టలేక జుమ్మన్ దగ్గరకు వెళ్లి "నాయనా, ఈ జీవితం నాకు బరువైపోతోంది... ఇంక నేను భరించలేను. నాకు నెల నెలా కొంచం డబ్బిస్తే నా బతుకు నేను బతుకుతాను" అంది

కొంచం గుండె కరిగినా గట్టి చేసుకుని "మా ఇంట్లో డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయనుకున్నావా?" అనడిగాడు

కొంచెం చిన్నబుచ్చుకున్న పిన్నమ్మ "అయ్యో నాయనా నా ముసలి ప్రాణానికెంత కావాలి? నా పొలం మీదనుంచి వచ్చే అయవేజు అంతా నువ్వే తీసుకుంటున్నావు కదా" అంది

జుమ్మన్ కు కోపం పొంగుకొచ్చింది "నీ పొలంలో బంగారం పండుతుందా? నీకివ్వాల్సిన డబ్బు నేనే సద్దాలి...నువ్విప్పుడప్పుడే చావవు కూడా కదా" అన్నాడు కఠినంగా 

పిన్నమ్మకు మనసు గాయపడింది. మౌనంగా కొంత సేపు బాధపడి, తేరుకుని మనసు చిక్కపట్టుకుని "నాయనా ఇది నీ వల్ల కాకపోతే నేను పంచాయితీ లో ఫిర్యాదు చెయ్యాల్సి ఉంటుంది" అంది

జుమ్మన్ విసురుగా "మరీ మంచిది, ఈ వ్యవహారం పంచాయితీ లో పెట్టి తేల్చేసుకుందాం... రోజూ నీ సొద వినడం నావల్ల కావటం లేదు " అన్నాడు

పైకి కోపం చూపించినా జుమ్మన్ కు ఈ పంచాయితి మాట చాల నచ్చింది. ఊళ్ళో అందరికీ ఇంతో అంతో సాయం చేసేడతాడు. ఇక ముందు కూడా ఎన్నో వ్యహారాల్లో అతని సాయం అవసరం. అందు వల్ల పంచాయితీ పెడితే ఎవ్వరూ తనకు ఎదురు చెప్పరు....

ఈ జనమే కదా పంచాయితీ లో కూర్చునేది...దాని కోసం దేవుళ్ళు దిగిరారు కదా...తీర్పు తనకు కావాల్సి నట్టుగా వస్తుంది. అందుకనే జుమ్మన్ పంచాయితీ కి ఒప్పుకున్నాడు.

తరువాత కొన్ని రోజులు బద్దల్లే ఒంగిపోయిన పిన్నమ్మ నీరసంగా కర్ర ఊతం తో ఇల్లిల్లూ తిరిగింది.

ఈ వయసులో తాను చేయవలసిన పని కాదది...కానీ తేల్చుకోవాల్సిన విషయమొకటి ఉంది కదా...

అప్పడి నుంచి ఆ చుట్టుపక్కల ఆవిడ దీన గాధ వినని మానవ మాత్రుడెవడు లేరంటే అతిశయోక్తి కాదు...

మొహమాటానికి పై పై మాటల తో ఓదార్చారు కొందరు, ఈ ప్రపంచం తీరే అంత, నువ్వేమీ బాధపడకు అంటూ వేదాంతం చెప్పారు కొందరు, కాటికి కళ్ళు చాపు కున్న ముసలిదానికి ఈ వయసులో ఎంత ఆశో అంటూ నోళ్లు నొక్కుకున్నారు కొందరు...ఆవిడ మొహమ్మీద అన్నవాళ్ళు కూడా ఉన్నారు...కొందరు ఆవిడ కధ విని నిజంగానే కదిలి పోయి కన్నీళ్లు పెట్టారు..

చివరగా పిన్నమ్మ అళగు ఇంటికి వచ్చింది. చేతి కర్ర నేలమీద పడేసి...నీరసంగా కూలబడింది ...అళగు ని చూసి "నాయనా, నువ్వు కూడా పంచాయతీ కి రావాలి" అంది

ఆశ్చర్యపోయిన అళగు "నేనెందుకమ్మా, ఊళ్ళో ఎంతోమంది పెద్దలు , మంచివాళ్ళు ఉన్నారు కదా?" అన్నాడు

తలాడించింది పిన్నమ్మ "అవున్నయనా, నాగోడు అందరికి దగ్గర వెళ్లబోసుకున్నాను...ఇక పంచాయితీకి రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం. నాకు మాత్రం నువ్వు రావాలని కోరిక " అంది

అళగు కొంచం కరిగాడు "సరేనమ్మా నేనొస్తాను...కానీ నేను మాత్రం నోరు విప్పను" అన్నాడు 

గతుక్కు మంది పిన్నమ్మ" ఏం నాయనా?" అనడిగింది

"నా ఇష్టం" అని ఒక్క క్షణం ఆలోచించి "అందరికీ తెలుసు జుమ్మన్ నా ప్రాణస్నేహితుడు ...అతనికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేను" అన్నాడు అళగు

నిట్టూర్చింది పిన్నమ్మ "నాయనా నీ స్నేహం కోసం న్యాయం పక్కన నిలబడడానికి జంకుతున్నావా " అనడిగి నెమ్మదిగా అక్కడినుంచి వెళ్ళిపోయింది

ఏమీ మాట్లాడకుండా మౌనం గా ఉండిపోయాడు అళగు...పిన్నమ్మ మాటలు అతని గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి

పంచాయితీ పెట్టడానికి ముహూర్తం కుదిరింది...

పంచాయితీ అనుకున్న రోజున సాయంత్రం ఊరి మధ్య ఉన్న పెద్ద చెట్టు కిందకు ఒక్కరొక్కరే వస్తున్నారు...తన విజయం తధ్యమని తెలిసిన జుమ్మన్ అందరికంటే ముందే వచ్చి చాప పరచుకుని తాంబూలం, ఏలక్కాయలు, హుక్కా, పొగాకు లాంటి సరంజామా అంతా పరచుకుని వస్తున్నవాళ్ళ దగ్గర నుంచి సలాములందుకుంటూ హుక్కా పీలుస్తూ కూర్చున్నాడు. అతనికి కాస్త దూరంలో అతని స్నేహితుడు అళగు కూర్చున్నాడు.

గుసగుసలాడుతున్న జనం, మధ్య మధ్యలో పిల్ల అరుపులు ఏడుపులూ, పెద్దవాళ్ళ దగ్గులతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. ఆ హడావుడి చూసి అక్కడేమైనా తినడానికి దొరుకుతుందేమో అనీ ఊళ్లోని కుక్కలు తోకలుపుకుంటూ అక్కడ చేరి ఆ సందడి ని పెంచే ప్రయత్నం చేస్తున్నాయి...

ఆ ప్రాంతమంతా జనం తో కిక్కిరిసి పోయింది. అయితే వాళ్లలో ఈ సమస్య ను పరిష్కరించడం కన్నా అక్కడేమి జరుగుతుందో అనీ చూడడానికి వచ్చిన ఔత్సాహికులే ఎక్కువ.

పిన్నమ్మ పిలిచిన పెద్దల్లో జుమ్మన్ అంటే పడని వాళ్ళు మాత్రమే వచ్చారు..

నెమ్మదిగా చీకటయ్యింది...పెద్ద చెట్టు మీద పక్షులు నెమ్మదిగా గుళ్ళలో సద్దుకుంటూ కింద జరుగుతున్న ఈ జాతరను విచిత్రంగాను, భయంగాను చూస్తున్నాయి...

ఒక మూలగా మంట పెట్టారు వెలుగు కోసం... ఆ మంట నుంచీ అక్కడ కూర్చుని గుప్పు గుప్పు మని హుక్కా ల నుంచి వస్తున్నపోగలతోను ఆ ప్రాంతం అంతా భీభత్సం గా ఉంది..ఏ పొగ ఎక్కువో ఎవ్వరూ చెప్పలేరు..

పెద్దలంతా కూర్చున్నారు...పంచాయితీ ప్రారంభమైంది..

 పిన్నమ్మ తాను కూర్చున్న చోటు నుంచే "అయ్యలారా...పంచాయితీ పెద్దలారా..మూడేళ్ళ క్రితం నేను నా ఆస్తినంతా నాకున్న ఆఖరి ఆధారమైన మా జుమ్మన్ పేరున రాసేసాను. అప్పుడు వాడు నాకు కూడు , గూడు , గుడ్డ ఇచ్చి జాగర్తగా చూసుకుంటాని ప్రమాణం చేసాడు . అయితే నాకెప్పుడూ కడుపు నిండా తిండి పెట్టలేదు...కట్టుకోవడానికి గుడ్డలు ఇవ్వలేదు...దాని పైన సూటి పోటు మాటలు అంటున్నారు...ఈ కష్టాలు భరించడం నావల్ల కాదు...నేను ఏ ఆధారమూ లేని అనాధ వితంతువుని...నా గోడు ఎవరు వింటారు? అందుకనే మీ దగ్గరకొచ్చాను...ఈ వ్యహారంలో నా తప్పేమైన ఉంటె నన్ను దండించండి...జుమ్మన్ తప్పుంటే వాడిని మందలించి బుద్ధి చెప్పండి...నాలాంటి ముసలి ప్రాణాన్ని ఉసురు పెట్టి వాడేం బావుకుంటాడో అర్ధం కావటలేదు. ..పంచాయితీ పెద్దలు చెప్పిన మాటలు సాక్షాత్తు అల్లా మాటలే...నేను పూర్తిగా అంగీకరిస్తాను" అంది

పంచాయితీ పెద్ద రామ్ ధన్ మిశ్ర లేచి జుమ్మన్ వైపుకి తిరిగి "జుమ్మన్ మియా మన సంప్రదాయం ప్రకారం ఈ సమస్యకు తీర్పు చెప్పాల్సిన పంచాయితీను నువ్వే ఎన్నుకోవాలి...చెప్పు ఎవ్వర్నీ పంచాయితీకి అధ్యక్షత వహించమంటావు" అన్నాడు

చుట్టూ చూసాడు జుమ్మన్ రామ్ ధన్ మిశ్ర తో సహా అక్కడున్న పెద్దలందరికి జుమ్మన్ అంటే ఏదొక కారణం వల్ల కోపం ఉంది...ఆలోచించాడు....నెమ్మదిగా "అయ్యా ఈ పంచాయితీ మాట అల్లా మాటే...తీర్పు ఏదైనా నేను అంగీకరిస్తాను....ఈ పంచాయితీ కి ఎవరు అధ్యక్షత వహించాలో మా పిన్నమ్మనే చెప్పమనండి" అన్నాడు

దానికి పిన్నమ్మ "అయ్యో అల్లా! ఈ సమస్య నామీదకి తెచ్చావా...నువ్వెందుకు ఎన్నుకోవు జుమ్మన్?" అనడిగింది 

జుమ్మన్ కు కోపం వచ్చింది "అమ్మ నా నోరు తెరిపించకు...నువ్వే పంచాయితీ పెట్టించావు కాబట్టి నువ్వే ఎన్నుకో " అన్నాడు విసురుగా

పిన్నమ్మకు జుమ్మన్ సమస్య అర్ధం అయ్యింది "అల్లా మొహం చూడు నాయనా...పంచాయితీ పెద్దలకు పక్షపాతాలు ఉండవు...అయినా నువ్వెరినీ నమ్మలేక పోతున్నావు...సరేలే...నా తరపున నీ నమ్మకస్తుడైన అళగు చౌదరిని ఈ పంచాయితీకి అధ్యక్షత వహించమని అడుగుతున్నాను" అంది

ఈ ఊహించని అదృష్టానికి పొంగిపోయాడు జుమ్మన్...అళగు తన ప్రాణ స్నేహితుడు. ..తనకెదుర్రాడు...

కొద్దిగా తమాయించుకుని "సరే నీకు అళగు కావాలంటే నాకేమి అభ్యంతరం లేదు...రామ్ ధన్ మిశ్ర గారైనా, అళగు చౌదరి గారైనా నాకొకటే" అన్నాడు మృదువుగా

అళగు కి అనవసర సమస్యలో ఇరుక్కున్నటైంది..."అమ్మా, నన్నెదుకు ఎన్నుకున్నావు? నేను జుమ్మన్ ప్రాణ స్నేహితుడిని " అన్నాడు బాధగా

"లేదు నాయనా...పంచాయితీ బాధ్యత ఉన్నవాళ్ళెవరూ స్నేహం కోసం తన ధర్మాన్ని ఫణంగా పెట్టరు అనీ నా నమ్మకం. ఈ పంచాయితీ సభ్యుల గుండెల్లో అల్లా ఉండి వాళ్ళ చేత పలికిస్తాడు ...అది సాక్షాత్తు అల్లా వాక్కే" అంది పిన్నమ్మ

అళగు చౌదరిని పంచాయితీ పెద్దగా నియమించారు..రామ్ ధన్ మిశ్ర కు మరికొందఱకు ఆ ఎన్నిక నచ్చలేదు..వాళ్ళు జుమ్మన్ మీద పగ తీర్చుకునే అవకాశం పోయిందని కొంచం నిరాశ పడ్డారు.

పంచాయితీ పెద్దగా అళగు మాట్లాడడం మొదలు పెట్టాడు..."జుమ్మన్ షేక్ ...మనిద్దరం మంచి మిత్రులం...గతంలో ఒకళ్ళనొకళ్ళు ఎన్నో సహాయాలు చేసుకున్నాం...అయితే ఇప్పుడు నేను నీ స్నేహితుడిని కాదు...పంచాయితీ పెద్దగా నువ్వూ పిన్నమ్మ ఒక్కటే నాకు" అన్నాడు గంభీరంగా

జుమ్మన్ కు తాను నెగ్గడం ఖాయమని తెలుసు....ఈ అళగు అందరికోసం ఆలా మాట్లాడుతున్నాడు గాని వాడు నా ప్రాణ స్నేహితుడు అనుకున్నాడు.

"పంచాయితీ పెద్దలారా, మూడేళ్ళ క్రితం మా పిన్నమ్మ తన ఆస్తి నా పేరున రాసింది ...అప్పట్నుంచి ఆవిడ భారమంతా మాదే...ఆవిడను జాగర్తగా చేసుకుంటున్నాం...దీనికి అల్లాయే సాక్షి...మేము ఆవిడని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అయినా ఆవిడ నెల నెలా భరణం ఇవ్వ మంటోంది...ఆవిడ ఆస్తి విలువ ఎంతో మీకు తెలుసు...దానిమీద ఆదాయం ఆవిడకు భరణం ఇచ్చేంతగా రావట్లేదు ...అదీగాక ఈ భరణం విషయం అప్పుడు మా పత్రాల్లో ఎక్కడా రాసుకోలేదు. ఇంతకన్నా నేను చెప్పుకోగలిగేదేమి లేదు. పంచాయితీ ఏం చెప్పినా నాకు శిరోధార్యమే" అన్నాడు గొంతులో ఏ భావమూ ధ్వనించ కుండా

రకరకాల పనుల మీద మాటి మాటికీ పట్నంలోని న్యాయస్దానికి వెళ్లడం వల్ల అళగు చౌదరికి కొంత పద్ధతులు తెలుసు. అతను జుమ్మన్ షేక్ ను ప్రశ్నించాడు. అతను ఎంత సూటిగా మాట్లాడంటే, అతని ప్రశ్నలు జుమ్మన్ గుండెల్ని రాళ్ల లాగా తాకాయి. రామ్ ధన్ మిశ్ర ఇతరులు ఈ వ్యవహారాన్ని సంతోషంగా చూస్తున్నారు.

ఈ అళగు కేమైంది? ఏవైనా నాకు తెలియని పాత కక్షలు పెట్టుకుని తనని సాధిస్తున్నాడా? ఇప్పటివరకు ప్రాణ స్నేహితుడిలా మాటాడాడు... అకస్మాత్తుగా మారిపోయాడు అనుకున్నాడు జుమ్మన్ మనసులో మధనపడుతూ. అళగు ప్రశ్నలకు అన్య మనస్కంగానే జవాబులిచ్చి మౌనంగా నిలబడ్డాడు.

అతని మనసులో ఆందోళన కొనసుగుతుండగానే అళగు పంచాయితీ నిర్ణయాన్ని తెలియజేసాడు.

"జుమ్మన్ షేక్, పంచాయితీ పెద్దలందరము ఈ విషయమై చర్చించాం. పిన్నమ్మకు నెల నెలా భరణం ఇవ్వడమే న్యాయం. ఆవిడ నుంచి నీకు సంక్రమించిన ఆస్తి నుంచి నీకు ఆ మాత్రం డబ్బు వస్తుందని మా అభిప్రాయం. ఇది ఈ పంచాయితీ తీర్పు. నీకిది నచ్చని పక్షంలో పిన్నమ్మ ఆస్తి నీ పేరున రాసిన పత్రం రద్దయిపోతుంది" అన్నాడు

తెల్ల బోయాడు జుమ్మన్ ఈ తీర్పు విని. నా ప్రాణ స్నేహితుడే నా మెడను చీల్చేసాడు అనుకున్నాడు. కాలం కలిసిరాకపోవడమంటే ఇదేనేమో. నేనెంతో నమ్మిన నా ప్రాణ స్నేహితుడే సాయం చెయ్యాల్సిన సమయం లో వెన్ను పోటు పొడిచాడు. ఈ కాలం లో ఏ బంధమూ శాశ్వతం కాదు. ఈ ఘోర కలి లో కష్టాలన్నీ ఇలాంటి స్నేహితుల వల్లనే అనుకున్నాడు బాధగా.

రామ్ ధన్ మిశ్ర ఇతరులకి ఈ తీర్పు బాగా నచ్చింది. "ఇదే నిజమైన పంచాయితీ తీర్పు . అళగు నీతీ న్యాయానికి విలువిచ్చి పాలు నీళ్లు విడదీసి చుపించాడు. ధర్మం కోసం తన స్నేహానికి ఎదురు వెళ్ళాడు. ఇలాంటి ధర్మాత్ముల వల్లనే భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి" అన్నారు ముక్త కంఠంతో

ఈ పంచాయితీ వ్యవహారం ఇద్దరు ప్రాణ స్నేహితుల బంధాన్ని సమూలంగా కుదిపేసింది.

పాత రోజులు పోయాయి. ఇద్దరు స్నేహితులూ అంటీ ముట్ట నట్టు ఉంటున్నారు...ఎదురు పడితే ముభావం గా పలకరించుకోవడమే గాని కలవడం మానేశారు.

అళగు చేసిన ద్రోహం జుమ్మన్ ను నిలువునా కాల్చివేయసాగింది. తన కక్ష తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. 

ఎవరికైనా మంచి చెయ్యాలంటే కుదరడమేమో గాని చెడ్డ చెయ్యాలని చూసే వాళ్ళకి అవకాశాలు తొందరగానే వస్తాయి. జుమ్మన్ షేక్ కి కూడా అలంటి అవకాశమే వచ్చింది.

గత సంవత్సరంలో అళగు బస్తర్ నుంచి ఒక అద్భుతమైన జాతి ఎడ్ల జతను కొన్నాడు. ఎంతో ఠీవి గా బలిష్టంగా పెద్ద పెద్ద కొమ్ములతో అందంగా ఉన్న వాటిని చూడడానికి ఊరి వాళ్లే కాక పక్క ఊళ్ళ నుంచి కూడా జనం వచ్చే వారు.

అనుకోకుండా పంచాయితీ జరిగిన ఒక నెల లోపునే ఆ జతలోని ఒక ఎద్దు అకస్మాత్తుగా మరణించింది. 

అళగు విచారం లో ములిగి ఉండగా, జుమ్మన్ మాత్రం సంతోషించాడు. " వాడు నాకు చేసిన ద్రోహానికి ఫలితమే ఇది, నేను సరి పెట్టుకుని ఊరుకున్నా దేముడే న్యాయం చేసాడు " అంటూ అందరి దగ్గర తన సంతోషాన్ని బయట పెట్టుకున్నాడు

ఆనోటా ఈనోటా ఆ మాటలు విన్న అళగును తన ఎద్దు మీద జుమ్మనేమైనా విష ప్రయోగం చేసి చంపాడా అని అనుమానం పీడించసాగింది.

అళగు లోలోపలే మధన పడుతుంటే అతని భార్య మాత్రం ఈ మాటలు బాహాటంగానే అనసాగింది. ఈ విషయమై అళగు భార్యకు జుమ్మన్ భార్యకు మధ్య భీకరమైన మాటల యుద్ధం జరింగింది కూడా. అందరికి తెలిసిన తిట్లు, ఎత్తిపొడుపులు అయిపోయాయి కానీ వాళ్ళ యుద్ధం ఆగేలా లేదు.

ఈ వ్యవహారం చేయిదాటి పోతోందని జుమ్మన్ తన భార్యను శాంతింపచేసి యుద్ధం నుంచి విరమించుకునేలా చేసాడు. అటు అళగు కూడా బలవంతంగా తన భార్య నోరు మూసాడు.

మిగిలిన ఒక్క ఎద్దుని ఏం చేసుకోవాలో అర్ధం కాక అళగు దానికొక జత కోసం వెతికాడు. ఎంత కష్టపడినా తగిన జత ఎద్దు దొరకక పోవడంతో దాన్ని అమ్మకానికి పెట్టాడు.

అదే ఊరికి చెందిన సంజూ షావుకారు దాన్ని కొనడానికి ముందుకు వచ్చాడు.

షావుకారు తన ఊరి నుంచి బెల్లం, నెయ్యి లాంటి వస్తువులు మార్కెట్కు తీసుకెళ్లి అమ్మి అక్కడనుంచి ఉప్పు, నూనె లాంటి వస్తువులు తెచ్చి ఊళ్ళో అమ్ముతుండేవాడు.

ఆ రవాణాకు షావుకారు దగ్గర ఒంటెద్దు బండి ఉంది. ఇప్పుడున్న ఎద్దు ముసలిదైపోవడం తో ఒక్కసారి మార్కెట్ కి వెళ్లి రావడమే కష్టమై పోతోంది.

అళగు ఎద్దు బలమైనది అందుకనే దాన్ని బేరం చేసాడు. తన బండికి కట్టుకుని చూసాడు, ఎద్దు శరీరమంతా తడిమి చూసి అది ఆరోగ్యంగా ఉందని, తనకి పనికివస్తుంది అని నిర్ణయించుకున్న తరువాత ఆ ఎద్దుని కొనేందుకు ఒప్పుకున్నాడు.

బేరం అయ్యింది..డబ్బు ఒక నెల లోగ చెల్లించే ఒప్పందం మీద ఎద్దుని కొనుక్కున్నాడు షావుకారు.

కొత్త ఎద్దుని తెచ్చుకున్న ఉత్సాహంతో షావుకారు రోజుకి మూడు నాలుగు సార్లు మార్కెట్కు తిరగడం ప్రారంభించాడు. 

ఈ ధనసంపాదన వ్యామోహంలో పడి ఎద్దుని సవ్యంగా చూసుకునేవాడు కాదు. సమయానికి దానికి తిండి నీరు కూడా ఇచ్చేవాడు కాదు. ఎద్దు ఎంతో శ్రమ చేసి కాస్త గాలి పీల్చుకునే లోపునే మళ్ళీ బండి కట్టి తోలేవాడు షావుకారు.

అళగు ఇంటిలో ఎంతో గారాబంగా చక్కటి తిండి, శుభ్రమైన నీరు అప్పడప్పుడు నేతి మిఠాయిలు సేవించి పెరిగిన ఆ ఎద్దుకి ఈ పరిస్థితులని భరించడం చాల కష్టంగా ఉండేది. బండి కాడి చూడగానే నోరెండిపోయేది. ఒక్క నెల లోనే ఎముకల గూడు లా తయారైంది.

 అయినా ఎంతో అభిమానవంతమైన ఆ మూగ జీవి మాట్లాడకుండా ఆ హింస భరిస్తూ వచ్చింది.

ఒకరోజు నాలుగవ సారి మార్కెట్ కి వెళ్లి వస్తుండగా ఎద్దు బాగా డస్సిపోయి కాస్త గాలి పీల్చుకోవడానికి నిలబడిపోయింది. మాములు కంటే రెట్టింపు బరువు వేసాడు షావుకారు...విపరీతమైన అలసటతో అడుగు తీసి అడుగు వెయ్యలేక పోయింది ఎద్దు...షావుకారు మాత్రం దాని పై కొరడా ఝుళిపిస్తూనే ఉన్నాడు. బలవంతం గా పరుగెత్తి బోయి కూలబడి పోయింది ఎద్దు ..మళ్ళీ లేవలేదు

కింద పడిపోయిన ఎద్దుని లేపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాడు షావుకారు....కొరడాతో కొట్టాడు, ముక్కు లో కర్ర తో పొడిచాడు, తోక లాగాడు...ఎన్ని చేసినా చనిపోయిన జీవి ఎలా లేస్తుంది?

కాసేపటికి ఎద్దు చనిపోయిందని అర్ధమైన షావుకారు కంగారు పడ్డాడు. ఇప్పుడు ఇల్లు చేరేదెలా?

ఎద్దుని శాపనార్ధాలు పెట్టాడు, ఆ చచ్చేదేదో ఇంటికి చేరాక చావొచ్చు కదా అనుకున్నాడు.

ఏం చెయ్యాలో పాలుపోక రోడ్డుమీద పిచ్చివాడిలాగా పచారలు చేసాడు, ఎవరైనా సాయం చేస్తారేమో అని కేకలు పెట్టాడు. బండి ఆగిపోయిన ప్రాంతం అడవి మధ్యలో అవడం వలన ఎవరూ పలకలేదు.

సమయం గడుస్తున్నగొద్దీ షావుకారు భయం పెరగసాగింది. మార్కెట్ లో బెల్లం, నెయ్యి బాగా అమ్ముడవడం వల్ల అతని దగ్గర చాల డబ్బు చేరింది, బండిలో ఉప్పు బస్తాలు, నూనె డబ్బాలు ఉన్నాయి...వాటిని వదిలి పోలేడు.

చేసేదేమి లేక రాత్రి అక్కడే గడపడానికి నిశ్చయించుకున్నాడు.

కాసేపు చిల్లుమ్ పీల్చాడు, ఏవో పిచ్చ పాటలు పాడాడు...అలాగే సగం రాత్రి గడిపేశాడు ....రోజంతా పని చేసి, ఎద్దు చనిపోవడంతో కలిగిన మానసిక వేదన తో అలసి పోయిన షావుకారు నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. మెలకువ వచ్చేసరికి తెల్లారింది.

తడిమి చూసుకున్నాడు...తన బొడ్లో ఉండాల్సిన డబ్బు సంచి లేదు...చాల నూనె డబ్బాలు కూడా లేవు...రాత్రి దొంగలు దోచుకు పోయారు.

లబోదిబో మంటూ ఇల్లు చేరాడు. అతని ద్వారా విషయం తెలుసుకున్న అతని భార్య ఘొల్లు మనడమే కాకుండా అళగు చౌదరి ని అతని భార్యని శాపనార్ధాలు పెట్టింది. వాళ్ళ జీవిత కాలం సంపాదన పోయినట్టు ఇద్దరు శోకాలు పెట్టారు.

రోజులు గడిచే కొద్దీ తమ దుఃఖాన్ని మరిచి పనిలో పడ్డారు షావుకారు అతని భార్య...అళగు కి ఇవ్వవలసిన ఎద్దు వెల గురించి మాత్రం మాట్లాడే వాళ్ళు కాదు. 

దాన్ని గురించి మాట్లాడ దానికి వచ్చిన అళగు మీద కాట్ల కుక్కల్లా విరుచుకు పడే వారు.

ఎందుకు పనికిరాని జంతువుని అంటగట్టి మా జీవిత కాలపు సంపాదనని పోయేలా చేసావు...సిగ్గులేకుండా ఇంకా ఆ జంతువు వెల అడుగుతున్నావు అంటూ అతని మీద దుర్భాషలాడేవారు.

వాళ్ళకి సహాయంగా అళగు అంటే ఇష్టం లేని కొందరు గ్రామస్తులు కూడా చేరే వాళ్ళు.

చూస్తూ చూస్తూ అళగు నూట యాభై రూపాయలు వదులు కోలేక షావుకారు తో వాదించే వాడు.

ఒక రోజు అతని ఓపిక నశించి ఒక పెద్ద కర్ర తీసుకుని షావుకారింటి మీదకు వెళ్ళాడు. అతన్ని చూసి షావుకారు భార్య భయంతో ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. చుట్టు పక్కల వాళ్ళు అళగు ని షావుకారుని విడదీసి మీ సమస్య పరిష్కారానికి పంచాయితీకి వెళ్ళాలి అని సూచించారు. దానికి ఒప్పుకున్నారు అళగు, షావుకారు.

పంచాయితీ పిలవ బడింది....మళ్ళీ సాయంత్రం, ఊళ్లోని పెద్ద చెట్టు కింద అందరు సమావేశమయ్యారు....

పొలాల్లో కాకులు తమ పంచాయితీ పెట్టుకుని పొలాలలో పంటల మీద వాళ్ళ హక్కుల గురించి మాట్లాడు కుంటున్నాయి...చెట్టు మీద చిలకలు ఒకరి నొకరు మోసం చేసుకుంటూ తగాదాలు పెట్టుకునే ఈ మనుషులకు తమను అదిలించే హక్కుందా అని చర్చిస్తున్నాయి

పంచాయితీ మొదలయ్యింది...రామ్ ధన్ మిశ్ర లేచి "ఇంకా సమయం ఎందుకు వ్యర్థం చెయ్యడం...అళగు చౌదరి, ఈ సమస్యను పరిష్కరించేందుకు పంచాయితీ పెద్దలను ఎన్నుకో" అన్నాడు

అళగు నెమ్మదిగా కొంచం వినయంతో "షావుకారు గారినే ఎన్నుకో మనండి" అన్నాడు

ఆ అవకాశానికి పొంగి పోతూ షావుకారు"నేను జుమ్మన్ షేక్ ను ఎన్నుకుంటాను" అన్నాడు

ఆ మాట వినగానే అళగు గుండె ఎవరో చరిచి నట్టుగా వేగం గా కొట్టుకో సాగింది...అతని మోహంలో మారుతున్న రంగులు చూసిన అళగు స్నేహితుడైన రామ్ ధన్ మిశ్ర కు విషయం అర్ధమై " అళగు నీకు ఇష్టమేనా?" అనడిగాడు

"నాకెందుకు అభ్యంతరం ఉంటుంది? అలాగే కానివ్వండి" అన్నాడు అళగు సన్నని గొంతుకతో

మనుష్యుల సంకుచితమైన మనస్తత్వాన్ని అతని మీద పెట్టిన బాధ్యత తాలూకా అవగాహన మారుస్తుంది...ఎవరైనా దారి తప్పినప్పుడు ఆ అవగాహనే దారి చూపిస్తుంది

ఒక పేపర్ ఎడిటర్ గారు తన ఆఫీసు లో కూర్చుని రాజకీయ నాయకుల గురించి, మంత్రుల గురించి తోచిన ఆరోపణల్ని చేస్తూ దుమ్మెత్తి పోయొచ్చు...కానీ అదే మనిషి మంత్రి అయితే అతని మాటల్లో బలం, నీతి న్యాయం తొంగి చూస్తాయి. అది తన మీద పెట్టిన బాధ్యత వల్ల జరుగుతుంది.

ఒక బాధ్యతలేని విశృంఖలమైన కుర్రవాడు తన ప్రవర్తన వల్ల కుటుంబానికి అప్రతిష్ట తెచ్చి పెడతాడేమో అని పెద్దలంతా భయ పడుతుంటారు. సంసారం బాధ్యతలు మీద పడితే అదే కుర్రవాడు ఏంటో బాధ్యతాయుతం గా తన కుటుంబాన్ని సంరక్షించు కుంటాడు...అతని మీద పడిన బాధ్యత ప్రభావం అది.

పంచాయితీ నాయకుడి గా నియమించబడిన జుమ్మన్ కూడా అలంటి బాధ్యత గురించి ఎరుకపడ్డాడు. ఆ క్షణం లో తానూ సాధారణ జుమ్మన్ షేక్ ని కాదని, నీతికి న్యాయానికి ప్రతినిధిని అని భావించాడు..తన మీద పెట్టిన ఈ బృహత్ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలనుకున్నాడు.

ఈ పదవిలో ఉండగా తాను అనే ప్రతి మాట భగవంతుని మాట గా భావిస్తారు గ్రామస్తుంలందరూ అందువల్ల తన స్వంత పక్షపాతాలేవి అసలైన నిజానికి అడ్డు రాకూడదు అనుకున్నాడు.

పంచాయితీ పెద్దలు అళగు ని షావుకారు ని విడివిడి గా ప్రశ్నించారు...వారి మాటలను విన్నారు.

ఈ విషయమై పంచాయితీ పెద్దలందరూ చర్చించారు....అందరు కూడా షావుకారు తాను ఒప్పుకున్నా ఎద్దు ధర అళగు కి చెల్లించడమే న్యాయమన్నారు...కానీ అందులో ఇద్దరు మాత్రం ...ఎద్దు చనిపోయింది కాబట్టి అళగు దాని కోసం కొంచం నష్ట పరిహారం ఇస్తే బాగుంటుంది అన్నారు. మరి ఇద్దరు షావుకారు చేత ధర ఇప్పించడమే కాకుండా ఒక మూగ జీవిని హింస పెట్టి నందుకు తగిన శిక్ష విధించాలని..దాని వల్ల ఇంకెవరు ఆలా ప్రవర్తించరని అన్నారు .

చివరలో జుమ్మన్ తన నిర్ణయాన్ని తెలియజేసాడు "అళగు చౌదరి, షావుకారు, ఈ పంచాయితీ మీరు చెప్పుకున్న మాటలను శ్రద్ధగా విని నిర్ణయించినదేంటంటే - షావుకారు ఎద్దు ధరను అళగు కి ఇవ్వడమే న్యాయం... అతను కొనుక్కున్నప్పుడు ఆ ఎద్దు సంపూర్ణం గా ఆరోగ్యంతో ఉంది....అప్పుడే డబ్బు ఇచ్చి ఉంటె ఇప్పుడు మళ్ళీ అడగ గలిగేవాడా? ఎద్దు మరణానికి కారణం షావుకారు మాత్రమే...దాన్ని హింస పెట్టి సరిగా తిండి నీరు పెట్ట కుండా పీడించాడు" అన్నాడు

రామ్ ధన్ మిశ్ర కలగ జేసుకుని "షావుకారి వల్లనే ఎద్దు మరణించింది కనుక అతడిని శిక్షించాలి" అన్నాడు

దానికి జుమ్మన్" అది వేరే విషయం...దానికి సంబంధించి ఈ పంచాయితీకి ఏమి సంబంధం లేదు " అన్నాడు

పంచులలో ఒకడైన సాహు "ఎద్దు మరణించింది కాబట్టి షావుకారికి కొంత నష్ట పరిహారం ఇప్పించాలి " అన్నాడు

దానికి జుమ్మన్ "అది అళగు మంచి మనసుతో చేస్తే చెయ్య వచ్చు...పంచాయితీ దాని గురించి ఏమి చెప్పదు" అన్నాడు

 అళగు చౌదరి సంతోషానికి పట్ట పగ్గాలు లేవు...లేచి నిలబడి "పంచ పరమేశ్వరులకు జై" అనరిచాడు

అక్కడున్న ప్రజలంతా కూడా "పంచ పరమేశ్వరులకు జై" అంటూ హర్షద్వానాలు చేసారు

జుమ్మన్ చూపించిన న్యాయ పటిమను అందరు మెచ్చుకున్నారు

"ఇదీ న్యాయమంటే. ..ఇటువంటి న్యాయం చెయ్యడం మానవమాత్రుల వల్ల కాదు..సాక్షాత్తు భగవంతుడే ఈ పంచ పరమేశ్వరుల లో ఉంది న్యాయం చేసాడు...పంచాయతి ని మోసం చెయ్యడం ఎవరి వల్ల కాదు" అన్నారు

జుమ్మన్ లేచి అళగు దగ్గరకి వచ్చి అతన్ని కౌగలించుకుని "నువ్వు నాకు వ్యతిరేకంగా తీర్పు చెప్పినప్పడి నుంచి నేను నిన్ను బద్ద శత్రువు గా భావించాను...కానీ ఇవాళ ఈ న్యాయ పీఠం మీద కూర్చున్న వాళ్లకు స్నేహితులు శత్రువులు ఉండరని...ఆ స్థానం లో నువ్వు న్యాయం తప్ప ఇంకేమి ఆలోచించలేవని అర్ధం చేసుకున్నాను. ఈ పవిత్రమైన పంచాయితీ కి భగవంతుడే మార్గ దర్శనం చేస్తాడని తెలిసింది" అన్నాడు

అళగు కన్నీరు పెట్టాడు...ఆ కన్నీటి లో వారి మనస్సులో పేరుకున్న చేదు ఆలోచనలు కరిగి పోయాయి...ముడుచుకు పోయిన వారి స్నేహం తిరిగి పచ్చని చిగుళ్లు తొడిగింది. Rate this content
Log in

More telugu story from Srinivas Manthripragada

Similar telugu story from Classics