Varanasi Ramabrahmam

Classics

5  

Varanasi Ramabrahmam

Classics

శ్రీ రమణ మహర్షి జీవితం

శ్రీ రమణ మహర్షి జీవితం

3 mins
34.6Kరమణ మహర్షికి ఆత్మానుభవం ఆయన ప్రయత్నం, ప్రమేయం ఇసుమంతైనా లేకుండా కలిగింది. ఆత్మానుభవం కలిగే సమయానికి మహర్షి ఆత్మ, బ్రహ్మము, జీవాత్మ, పరమాత్మ, అద్వైతం, ద్వైతం వగైరా తత్త్వశాస్త్ర పారిభాషిక పదాలను విననే లేదు. ఆయనకు సహజంగా బ్రహ్మానుభవం కలిగింది. 


ఆ కలిగినది ఆత్మానుభవం అని ఆయనకు తర్వాత్తర్వాత గ్రంథం పరిచితితో తెలిసింది.

ఆ గ్రంథాలలో తనకు కలిగిన అనుభవాన్ని ఎంతో విశదంగా వివరించి ఉండడం ఆయనను అబ్బుర పరిచింది. ఆయనకు తత్త్వశాస్త్ర పారిభాషిక పదాల జ్ఞానం కలిగించింది. 


ఇలా వ్యక్తి ప్రయత్నం, ప్రమేయం లేక భగవదనుభవం కలగడానికి భగవదనుగ్రహం కారణం. ఇలా జరిగినప్పుడు దానిని మార్జాల కిశోర న్యాయము అంటారు. తల్లి పిల్లి తన పిల్లలను తానే నోటితో కరుచుకొని చోట్లు మారుస్తూ ఉంటుంది. పిల్లి పిల్లల ప్రయత్నం, ప్రమేయం ఇందులో అణు మాత్రమూ ఉండదు. అంతా తల్లి పిల్లే చూసుకుంటుంది.


మరొక న్యాయం ఉంది. దానిని కపి కిశోర న్యాయము అంటారు. ఇందులో తల్లి కోతి పిల్ల కోతి పట్ల పూర్తియైన నిర్లక్ష్యం చూపిస్తుంది. ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి, కొమ్మల మీద గెంతుతున్నప్పుడు, పిల్లకోతే తల్లికోతిని గట్టిగా కరుచుకుని ఉంటుంది. 


ఇలా ఈ రెండు రకాల భక్తులుంటారని సాంప్రదాయం చెబుతుంది. భగవంతుని లీలలు, అనుగ్రహాలు అలా వివిధములు, విచిత్రములు, దురవగాహ్యములు. 


కొందరిపై భగవదనుగ్రహం తనంత తాను పన్నీరుగా కురుస్తుంది. కొందరిపై శరన్మేఘంలా చుక్కైనా రాల్చదు.


శ్రీ రమణ మహర్షికి సహజంగా, అప్రయత్నంగా ఆత్మానుభవం అవడం అలా మార్జాల కిశోర న్యాయము. మదురైలో మొట్టమొదటి సారిగా కలిగిన అనుభవం, తిరువణ్ణామలైకి రావడం, అప్పటినుంచి వారాలుగా నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండడం, ఆలయం పాతాళ గుహలో,

ఆ పై జీవితాంతం తిరువణ్ణామలైలో సవికల్ఫ సమాధిలో ఉండి భక్తులకు, ముముక్షువులకు ఆధ్యాత్మిక, తత్త్వ మార్గ నిర్దేశనం చేయడం అంతా ఆయన ప్రమేయం లేకుండా జరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఆయన తిరువణ్ణామలై వచ్చాక తన జీవితం ఎలా తీసికెళ్ళితే అలా ఏవిధమైన ప్రతిఘటన లేకుండా జీవించారు. భగవత్ సంకల్పానికి ఎదురు ఈదలేదు. కలిగిన ప్రారబ్ధాన్ని తామరాకు మీద నీటి బొట్టులా అనుభవించారు.


ఆశ్రమం ఆయన ఏర్పరచుకున్నది కాదు. తన చుట్టూ ఏర్పడుతోంటే అడ్డుకోవడం చేయలేదు. తల్లి బాధ్యత తీరిపోయాక ఆయనకు ఒంటరిగా జీవించాలని ఉండేది. 

కాని ఆశ్రమం ఏర్పాటుని భగదాదేశంగా భావించి మిన్నకున్నారు. 


ఆశ్రమం ఏర్పడి ఆయన ప్రమేయం లేకుండా ఒక పెద్ద సంసారమనే ఆయన ఈదాల్సి వచ్చింది. తన చుట్టూ ఉన్న భక్తుల ప్రకోపాలను, ఆశ్రమ నిర్వాహకుల చర్యలను ఎంతో నిర్లిప్తతతో గమనించారు. ఆశ్రమంలో ఆయన కూరగాయలు తరిగేవారు. "గృహస్థు" లాగానే జీవించారు. కాని ఎన్నడూ ఆ లంపటంలో చిక్కుకోలేదు.


ఆయన పూర్ణ జ్ఞాని కనుక తన ఇష్టాయిష్టాలను పరిగణించుకోలేదు. నిజానికి ఆయనకు ప్రస్ఫుటమైన ఇష్టాయిష్టాలు లేవు. 

తల్లి తనతో జీవించడానికి వస్తే అంత నిర్లిప్తంగానూ తన బాధ్యత నెరవేరుస్తున్నట్టు తెలియకుండా, తెలియనీయకుండా నెరవేర్చారు. జ్ఞానికి బంధాలు వారిని బంధించవు, కాని అంత నిస్సగంగానూ విధ్యుక ధర్మములను నెరవేరుస్తారు. జ్ఞాని బంధాలను అంటించుకోకుండానే బాధ్యతలను నెరవేరుస్తారు, నెరవేర్చవచ్చు అని శ్రీ రమణ మహర్షి జీవితం మనకి తెలియజేస్తుంది.


సన్యాసము అంటే మానసిక సంన్యాసమనీ,

బాహిరంగా సంగం, అంతరంగంలో నిస్సంగం అని ఉదాహరణ పూర్వకంగా జీవించి, మనకు ఆదర్శప్రాయులయ్యారు. గృహస్థ జీవితమూ అలా గడపవచ్చు అని తెలియజేశారు. 


జ్ఞాని ఎప్పుడూ విధ్యుక్త ధర్మములను నిర్లక్ష్యం చేయడు. కుహనా జ్ఞానులే రికామీగా తిరుగుతూ శిష్యగణములను సమీకరించుకుని, ఆస్తిపాస్తులు సంపాదించుకుని సాధారణ గృహస్థు కన్నా ఎక్కువ లంపటాలలో ఉంటారు. డబ్బు, కీర్తి ప్రతిష్టలు, శిష్యురాళ్ళ సామీప్యము వారిని వివశులను చేస్తాయి. వారి సన్యాసము ఉదరపోషణార్ధం తప్ప మోక్ష పిపాసులై తరించడానికి కాదు. 


భగవంతుడు మనలను ఆయన సంకల్పానికి అనుగుణంగా నడుపుతాడు. దీనిని ప్రారబ్ధం అంటారు. గత జన్మ నుంచి వచ్చినది సంచితమనీ, మరు జన్మకు సంబంధించిన కర్మను ఆగామి అని అంటారు. జన్మ, పునర్జన్మల అసలు స్వభావం తెలిస్తే మన జీవితంపై మన అవగాహన పెరుగుతుంది. 


మెళుకువ మానసిక దశలో కలిగే అహంకార జననాన్ని, ప్రాదుర్భావాన్ని జన్మ అనీ, రాత్రి గాఢనిద్రలో ఈ అహంకారం, అహంభావం, మమకారాలు సమసిపోవడాన్ని మరణం అనీ అంటారు. మెళుకువ, కల మానసిక దశలలో మనకు జన్మ కలుగుతుంది. గాఢనిద్రలో మరణం సంభవిస్తుంది. 


జ్ఞానుల స్థితిని మెళకువతో కూడిన నిద్ర - జాగ్రత్ సుషుప్తి అంటారు. శాంతము అన్నా, ఆనందము, మౌనములన్నా, మోక్ష ప్రాప్తి అన్నా ఇదే. ఈ జాగ్రత్ సుషుప్తి దశ వారికి జీవితాంతం మాయకుండా, మారకుండా, ఉంటుంది. వారిని జీవన్ ముక్తులు అంటారు.


జీవించి ఉండగానే వ్యక్తిత్వం నాశనమై, శుధ్ధాహం కలిగి, వారికి "నేను" ఆ శుద్ధాహంతో

అన్వయింపబడి ఉంటుంది. ఇదే అహం బ్రహ్మాస్మి, తత్త్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, రసోవై సః, 

సర్వమ్ ఇదమ్ ఖలు బ్రహ్మ - ఉపనిషత్ వాక్యముల తాత్పర్యానుభవమై, విధ్యుక్త ధర్మ నిర్వహణలో విలసిల్లుతూ ఉంటారు.


సంసారి అయినా, సన్యాసి అయినా జ్ఞాని పరమాత్మ సదృశుడు.


ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు!


Rate this content
Log in

Similar telugu story from Classics