బుజ్జమ్మ మొగుడు
బుజ్జమ్మ మొగుడు
బంగారు బుజ్జమ్మ పుట్టింది. అందరి కళ్ళలో ఆనందం. ఆడపిల్ల పుట్టడం తో అందరి కళ్ళు ఆమె పైనే. ఎప్పుడూ లేని కొత్త ప్రేమలు, కొత్త పలకరింపులు, కొత్త బంధుత్వాలు అన్ని ఒక్కసారి పుట్టుకొచ్చాయి. కారణం రాజు గారు ఊరికే రారాజు.. నాన్న సంపాదించిపెట్టిన అస్థిని ఏడింతలు చేసాడు. ఇద్దరు కొడుకులు పుట్టడంతో ఇప్పటివరకు వచ్చేదే కానీ పోయేది ఏమి లేదు రాజు గారికి అన్న వాళ్లంతా ఇప్పుడు ఎవడు చేసుకుంటాడో బుజ్జమ్మ ని అదృష్టం బంగారు పళ్లెం లో చేకూరుతుంది అనుకున్నారు....
బుజ్జమ్మకి పదేళ్ల వయసు లో మొగుడు గురించి తెలుసుకోవాలని ఆశ పుట్టింది.. నాన్నమ్మ, పిన్ని చెప్పిన మాటలు బుజ్జమ్మ కి పెళ్లి, మొగుడు అంటే తెలిపే కథ ఇది...
***********************************
ఇక కథలోకి వెళ్తే....
పదేళ్ల వయసు తనది. నాన్నమ్మ ఒళ్ళో కూర్చుని తన చేతి గోరుముద్దలు తింటూ తను చెప్పే కథలు వింటే గాని నిద్ర రాదు బుజ్జమ్మ కి...
గోరింటాకు పెడుతూ నాన్నమ్మ- "బాగా ఎర్రగా పండితే అందమైన మొగుడు వస్తాడు" అని చెప్పేది. అమ్మ, అత్త, నాన్న, మావయ్య, బాబాయి అందరి ముందు తన పరువు పోయేది. సిగ్గుతో గదిలోకి పరిగెత్తేది బుజ్జమ్మ..
ఎర్రగా పండిన చేతులని చూసి మురిసిపోయేది. అంధమైన మొగుడు వస్తాడని కలలు కనేది బంగారు బుజ్జమ్మ.
ఒకరోజు పిన్నికి బాబాయ్ కి గొడవ. బాబాయి తాగొచ్చి పిన్ని తో గొడవ పెట్టుకున్నాడు.. భయం వేసింది బుజ్జమ్మ కి...
మొగుడు వస్తే కొడతాడా???
అందంగా వుంటే సరిపోతుందా???
మంచోడు కూడా అయ్యుండాలి.. వెళ్లి నాన్నమ్మ ని అడుగుదాం మనకి సమాధానం దొరుకుతుంది అని చెప్పి నాన్నమ్మ దగ్గరకి పరిగెత్తింది..
నాన్నమ్మ! నాన్నమ్మ! అంటూ ఇళ్లంతా జల్లెడ వేసింది. అరుగు బయట ఆడళ్లతో ముచ్చట్లు పెట్టుకుంటున్న అన్నపూర్ణ (నాన్నమ్మ పేరు) ని లాక్కుని వచ్చింది..
ఏమిటే నీ గోల. ప్రశాంతంగా కాసేపు మాట్లాడుకొనివవ్వా!!!లాక్కుని వచ్చేసావ్. "నీ దుంప తెగ ఎంత గట్టిగా లాగావే, నడుము పట్టేసింది" అని నడుముని రుద్దుకుని, ఏంటి విషయం??? చెప్పమంది....
ఒసేయ్ నాన్నమ్మ! అందగాడు వస్తాడన్నావు నా మొగుడు.. వాడు మంచ్చోడు కాకపోతే అప్పుడు ఏంటే నా పరిస్థితి అని తలపట్టుకుంది బుజ్జమ్మ...
నీ సిగతరగా!!! మీ తాతే నన్ను ఏరోజు ఒసేయ్ అనలేదు. నువ్వు అంటావా?? అని ఒక మొట్టికాయ వేసింది...
సరేలే అనను కానీ.. మా బుజ్జి నాన్నమ్మ వి కదా.. చెప్పవే.... మంచోడు రాకపోతే నా మొగుడు అప్పుడు ఏంటి నా పరిస్థితి అని మళ్ళీ అడిగింది.
ఏముంది!!నీ వీపు విరుస్తాడు రోజు అని పకాలున నవ్వింది..
చెప్పవే బాబు!!! నాకు భయం వేస్తుంది అని అంత చిన్న వయసులోనే మొగుడు గురించి బెంగ మొదలయ్యింది బుజ్జమ్మకి...
ఇటు వినవే బుజ్జమ్మ....
మీ తాత పెద్ద అందగాడు కాదు. పెద్ద పొడవు లేడు. చాలా వరకు పిల్లనే ఇవ్వలేదు మీ తాత కి.. అప్పట్లో పెళ్ళిచూపులు అంటే ఇప్పటిలా అమ్మాయికి అబ్బాయిని చూపించి నచ్చాడా??? నచ్చలేదా??? తెలుసుకునే పద్ధతులు లేవు. రెండు జళ్ళు వేసుకుని అరుగు బయట తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్న నేను.
అమ్మ లాక్కొచ్చి ముస్తాబు చేసింది. పెద్ద పందిరి లేదు, వంద మంది జనాలు లేరు.. మీ తాత వచ్చి తాళి కట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ నన్ను వెళ్లి ఆడుకోమని చెప్పింది మీ తాతమ్మ....
ఇప్పట్లో పెళ్లిళ్లు అంటే ఎన్ని తతంగాల్లో..
పెళ్ళిచూవులు అని, నిశ్చితార్థం అని, ఐదు రోజులు పెళ్లిళ్లు అని, అదేదో గాల్లో ఎగురుకుంటూ తాళి కడతారు.. అదేదో "దిష్టి నేషన్" పెళ్ళంటా.. వాళ్ళ మొఖం తగలెయ్య అంటుంది అన్నపూర్ణ..
అది "దిష్టి నేషన్" కాదే అమ్మమ్మ..."డెస్టినేషన్ పెళ్లి" అంటారు దాన్నీ..
"ఏదో లే వాడి పిండాకూడు".. వాళ్ళు వాళ్ళ పైత్యపు పెళ్లిళ్లు అని తిడుతుంది..
అలా ఇన్ని విధాలు ఇప్పట్లో.. ఇవే కాక పెళ్లి కి ముందు ఆడమగా కలిసి సహజీవనం చేస్తారు అంట. విడ్డురాం కాకపోతేను... పెళ్లి ఐతే అవతాది లేకుంటే లేదు.. ఏదో "డైటింగ్" అంట దాని పేరు..
నాన్నమ్మ!! నువ్వు ఇంగ్లీష్ ని కూని చెయ్యకు.. దాన్ని "డేటింగ్" అంటారు..
"రెండూ ఒకటే లే... ఒళ్ళు కొవ్వెక్కితేనే చేస్తారు" డేటింగ్ ఐనా డైటింగ్ ఐనా అంటుంది అన్నపూర్ణా...
నీ వయసులో నాకు పెళ్లి చేసేసారు.. ఏం జరుగుతుందో కూడా తెలియని వయసు నాది..
పదేళ్ల కే పెళ్లా!!! అని నోరెళ్ళబెట్టింది బుజ్జమ్మ... మరి తాత ని అరెస్ట్ చేయలేదా??? మైనర్ ని పెళ్లి చేసుకున్నందుకు అని అమాయకంగా అడిగింది బుజ్జమ్మ...
దానికి గట్టిగా నవ్వి అన్నపూర్ణ- ఇప్పుడు వున్నట్టు అప్పట్లో లేదే పిచ్చి మొద్దు.. మనకి తెలియకుండానే మన పెళ్లిళ్లు అయిపోతాయి.. ఆడపిల్ల అంటే బరువు అనుకునే వాళ్లు అప్పట్లో..... ఎంత త్వరగా దించేస్తే అంత మంచిది అనుకునేవాళ్ళు..
సరే!!! పెళ్లి జరిగింది పదేళ్లకే... తరువాత ఏం జరిగింది చెప్పు నాన్నమ్మ...
ఏముంది!!! మళ్ళీ వెళ్లి తొక్కుడు బిళ్ళ ఆడుకున్న. వయసొచ్చాకా నన్ను తీసుకువెళ్లడానికి వచ్చాడు మీ తాత. ఇద్దరికి వయసులో 10 ఏళ్ల వ్యత్యాసం ఉంది.. అప్పటి పెళ్లిళ్లు అలా ఉండేవి మరి..
నా అమ్మ, నా నాన్న, నా అక్క, నా అన్న, నా చెల్లి ఎలానో ఆరోజు నుంచి "నా మొగుడు" నా సొంతమే.. ఇక జీవితం తనతోనే అనుకున్నాను.. తెలీదు పెళ్ళయాక ప్రతి ఆడదానికి మొగుడే ప్రధమ స్థానం లో ఉంటాడు. అది ఏం మాయో అర్ధం కాదు. అమ్మ గుర్తుకు రాదు, నాన్న గుర్తుకు రాడు ఎవరూ గుర్తుకు రారు.. అందరూ మొగుడులోనే కనిపిస్తారు... అందుకే "పతి ఏ ప్రత్యక్ష దైవం" అంటారు..
మీ తాత చాలా మంచ్చోడు.. చెడు వ్యసనాలు లేవు, జూదం ఆడడు, తెచ్చిన డబ్బుని నా చేతిలో పెట్టి దాచమనేవాడు... ఒక్కొక్క అస్థిని పెంచుకుంటూ ఈరోజు ఊరికే రారాజు అయ్యాడు. మీ తాత అందగాడు కాకపోయినా చాలా మంచ్చోడు, మనసు వెన్న....
ఆడదాని మనసు ముక్కలయ్యేది ఎప్పుడో తెలుసా??? మగాడి మాటలతోనే.. మీ తాత చనిపోయే వరకు నన్ను ఏరోజు ఒక్క మాట అనలేదు.. కోపంతో అలిగి తిండిమానేసేవాడు... నా బిడ్డలు ఆకలితో వుంటే నా కడుపు ఎలా నిండుతుంది. నా భర్త కూడా నాకు బిడ్డ తో సమానం. నా చేత్తో తనకి అన్నం తినిపించి కోపం చల్లార్చేదాన్ని...
అంతా శ్రద్దగా వింటుంది బుజ్జమ్మ...
నాన్నమ్మ! ఐతే బాబాయ్ ఎప్పుడు పిన్ని తో గొడవ పడుతుంటాడు కదా!! మంచోడు కాదు కదా!! అలాంటప్పుడు పిన్ని బాబాయిని ఎందుకు భరిస్తుంది...వదిలేయొచ్చు కదా?? అని అడిగింది బుజ్జమ్మ..
అప్పుడు పిన్ని జత చేరింది వీళ్ళతో పాటు..
ఏమ్మా!! ఈరోజు ఇన్ని సందేహాలు పుట్టుకొచ్చాయి నీకు అని..
అయ్యో!! పిన్ని నువ్వు ఇక్కడ లేవు అనుకున్నా.. క్షమించు పిన్ని.. అని బుజ్జమ్మ కాస్
త ఇబ్బంది పడింది పిన్ని రాకతో..
నిజమే!! మీ బాబాయి తిడతాడు. తాగుడు మానమని చాలా సార్లు చెప్పాను. కోపిష్ఠి , ఎవడు మాట వినడు. కానీ ఇన్నేళ్లలో తనని ఎంతో మంది పెళ్లి చేసుకోమని అడిగారు. నన్ను వదిలేయమని చెప్పారు.. కానీ మీ బాబాయి నన్ను తప్ప ఎవరూ వద్దు అన్నాడు.. తనకి నేనంటే ఎంతో ఇష్టం..
వ్యాపారం లో నష్టాలు వచ్చాయి.. చాలా కృంగిపోయాడు.. ఆ కోపం లో మందు కి బానిసయ్యాడు. కానీ తను "నా మొగుడు".. తప్పు చేస్తే పిల్లల్ని ఎలా సరిద్దిద్దుకుంటామో భర్త ని కూడా సరిదిద్దుకోవాలి. మనసుబాలేకపోతే కారణం తెలుసుకుని ఓదార్చాలి.. ఇంటికొచ్చిన భర్త కి వెంటనే ఒక గ్లాసు మంచినీళ్లు ఇవ్వాలి. బయట ఎన్నో టెన్షన్ లతో వస్తారు. కాస్త చల్లబడతారు అప్పుడే ఒక గ్లాసు మంచినీళ్లతో...
ఇక గొడవ విషయానికి వస్తే ఆలుమగలు అన్నాక ఆమాత్రం గొడవలు జరగాలి. అప్పుడే బంధం ఇంకా గట్టి పడుతుంది. ఇద్దరికి ఇద్దరు అర్ధం అవుతారు.
తప్పు చేస్తున్నాడు అనుకో౼ సరిదిద్దుకోవాలి
బాధ పడుతున్నాడు అనుకో౼ధైర్యం చెప్పాలి
కోపం లో వున్నాడు అంటే౼మనం మౌనంగా వుండాలి..
కష్టాల్లో వున్నాడు అనుకో౼ తోడుగా ఉండాలి..
ఇలా నాన్నమ్మ, పిన్ని బుజ్జమ్మ కి చాలా విషయాలే చెప్పారు...పెళ్లి గురించి రాబోయే మొగుడు గురించి ఇప్పుడు పూర్తిగా ఒక క్లారిటీ కి వచ్చింది బుజ్జమ్మ.
******************************
ఈరోజు బుజ్జమ్మ పెళ్లి :
బుజ్జమ్మ కలలు కన్న మొగుడు రాబోతున్నాడు. ఇంటిల్లిపాది బుజ్జమ్మ పెళ్లికి చెయ్యాల్సిన హడావిడి అంతా చేస్తున్నారు.. మండపం అంతా కలకళలాడుతుంది. మైక్ సెట్లోని కొత్త కొత్త పాటలకు పిల్లలు డాన్సులు చేస్తున్నారు..
వచ్చిపోయె చుట్టాలని, సన్నిహితుల్ని, పెద్దలూ, పలుకుబడి ఉన్న ముఖ్య అతిధులని ఆహ్వానిస్తూ తండ్రి, బాబాయి లీనమయిపోయారు..
ఇక పోతే మావయ్య.. పెళ్లిలో చెప్పుకునేవే భోజనాలు.. తేడా జరగకుండా, బుజ్జమ్మ పెళ్లి గురించి ఈ ఊర్లోనే కాదు చుట్టుపక్కల ఊర్లన్ని చెప్పుకోవాలి.. భోజనాలు సంతృప్తి గా చేసి నా బిడ్డని చల్లగా దీవించాలి అంటూ వంటల దగ్గర హత్తుక్కుపోయాడు..
అత్త, పిన్ని బుజ్జమ్మ ని ముస్తాబు చెయ్యడం లో మునిగిపోయారు ఇద్దరు...చెల్లి పెళ్లి కానుకగా ఇంతలో పెద్దన్నయ్య రవ్వల నెక్లెస్ తీసుకొచ్చాడు...
"బుట్టబొమ్మ నా చెల్లి అంటూ మురిసిపోయాడు" అది మెడలో వేసి.. చిన్నన్నయ్య చేతికి ఉంగరం పెట్టాడు. ఇద్దరి ప్రేమ ని చూసి దుఃఖం తట్టుకోలేక ఇద్దర్ని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది బుజ్జమ్మ..
అక్కడ ఉనవాళ్ళందరికి దుఃఖం కలిగింది.. అన్నయ్యలు ఇద్దరికి కన్నీళ్లు ఆగలేదు.. కానీ చెల్లికి ధైర్యం చెప్పాలని కన్నీళ్లు తుడుచుకుని....
పెళ్ళయి నువ్వేమైనా పట్నం పోతున్నావా??? పక్కనే పది కిలోమీటర్లు నీకు మాకు దూరం..ప్రతి వారం మేము వస్తూనే ఉంటాం నిన్ను చూడడానికి.. ఏడవకమ్మ!!! మా బుజ్జి వి కదూ అంటూ గారాబం చేశారు ఇద్దరు అన్నయ్యలు..
అన్నీ గమనిస్తూనే ఉన్న అమ్మ.. అందరికన్నా ఎక్కువ దుఃఖం ఆవిడకే... ఎప్పుడూ గల గల మాట్లాడి, అల్లరి చేస్తూ, ఆటపట్టిస్తూ వుండే అమ్మాయి అత్తగారింట్లో ఎలా ఉంటుందో??? ఎలా బ్రతుకుతుందో?? అన్న ఆలోచలనే ఆమెకి...
ఐనా సరే దుఃఖం మింగి బయటకి నవ్వుతూ...
"అక్కడ ముహూర్తానికి టైం అవుతుంటే ఇక్కడ ఏంటి మాటలు" అని వీళ్ళ అనురాగాలు మధ్యలో కలగజేసుకుంది.. ఏడుస్తున్న బుజ్జమ్మ ని చూసి... ఆయ్యో!!! మేకప్ అంతా పోయిందే, ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడెలా అంటూ ఆటపట్టించింది...
అక్కడున్న వారంతా నవ్వేశారు...బుజ్జమ్మ కూడా నవ్వేసింది...
మండపం లో పెళ్ళికొడుకుని తీసుకొచ్చారు...పంతులు గారు మంత్రాలు చదవడం ఆరంభించారు..
అమ్మా!!! పెళ్లికూతుర్ని తీసుకురండి అంటూ సందేశం పంపించాడు తోడికోడలు చేత...
రానే వచ్చింది సమయం.. బుజ్జమ్మ కలలు కన్న ప్రపంచం.. ఇంకొన్ని నిమిషాల్లో పెళ్లయిపోతుంది..
నానమ్మ ఒక ఏడాది ముందే చనిపోయింది. ఆమె ఫోటో కి దండం పెడుతూ ఇలా అనుకుంది-
" నాన్నమ్మ! నువ్వు అన్నట్టే అందమైన మంచి మొగుడు వచ్చాడు.. నా చేతి గోరింటాకు చూసావా ఎంత ఎర్రగా పండిందో.. ఇదంతా నువ్వు చూసుంటే బాగుండేది.. చూడకుండా మీ ఆయన దగ్గరకి వెళ్లిపోయావ్.. అవునులే!! నీ మొగుడు కన్నా మేము తక్కువే కదా ఎంతైనా" అంటుంటే అక్కడ ఉన్నవాళ్ళందరికి కన్నీళ్లు ఆగలేదు..
టైం అవుతుంది బుజ్జమ్మ!!! పద అంటూ అమ్మ తనని ముందుకు నడిపింది...
విషయం చెప్పలేదు కదా!!! బుజ్జమ్మ ఆశించిన దానికన్నా మంచి మొగుడు వచ్చాడు... కట్నం ఇస్తాం అన్నా వద్దన్నాడు... పెళ్ళిచూపులు రోజు కూడా అందరూ బుజ్జమ్మ ని కంగారు పెడుతుంటే తనతో విడి గా మాట్లాడాలి అని పక్కకి తీసుకువెళ్లాడు...
అందరూ అంటున్నారని కాదు.. మీకు ఏం అనిపిస్తే అది చెప్పండి.. నేను తీసుకుంటాను, నాకు మీరు చాలా నచ్చారు.. అని తను అంటుంటే తన కళ్ళలో బుజ్జమ్మ పైన ప్రేమ కనిపించింది.. అప్పటివరకు ఊర్లో వాళ్ళు, తన ఇంట్లో వాళ్ళు, స్నేహితులు చెప్తే వినడం తప్ప బుజ్జమ్మ ఇదే ప్రత్యేకంగా చూడడం తనని....ఎక్కువ ఆలోచించను లేదు, ఇష్టమే అని లోపల నుంచి కబురు పంపించింది పిన్ని తో..
అన్నీ గుర్తు చేసుకుంది మండపం లో కూర్చుని.. నాన్న అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేసాడు. అమ్మ దగ్గరుండి కూతురు పెళ్లిని ఆనందంగా చూస్తుంది.. అన్నయ్యలు ఇద్దరు అక్షింతలు వేసి దీవించారు. ఎదురుగా పిన్ని బాబాయి నవ్వుతూ దీవిస్తుంటే ఆలుమగలు అన్నాక గొడవలు, కలుసుకోవడాలు ఉంటాయి అన్న విషయం అర్ధం చేసుకుంది బుజ్జమ్మ.
పెళ్లి జరిగిపోయింది.. అప్పగింతలు సమయం ఇది...అప్పటి వరకు రాయి లా ఉన్న నాన్న ఒక్కసారి కంటతడి పెట్టుకున్నాడు.. బాబాయి ఓదారుస్తున్నాడు.. నాన్నని గట్టిగా హత్తుకుని ఏడవడం మొదలుపెట్టింది బుజ్జమ్మ..
మనం ఏడుస్తుంటే తను ఇంకా బాధ పడుతుంది అని భర్త కి నచ్చజెప్పింది..చూడు మీ ఆయన అక్కడ ఎదురుచూస్తున్నాడు.. మేము తరచు అప్పుడప్పుడు వస్తుంటాం.. ఏడవకూడదు వెళ్లే ముందు.. నవ్వుతూ వెళ్ళాలి అంటూ సర్ది చెప్పింది..
కన్నీళ్లు తోనే కార్ లో ఎక్కి కూర్చుంది...పుట్టినిల్లు వదిలి వెళ్ళాలి అంటే ఏ ఆడపిల్లకైనా కొంచెం ఇబ్బందే.. నాలుగేళ్లు చదివిన కాలేజ్ వదిలి వచ్చేటప్పుడే కన్నీళ్లు పెట్టుకుంటాం.. అలాంటిది అన్నేళ్ళ రక్త సంబంధం వదిలి రావాలి అంటే ఏ ఆడపిల్లకైనా కష్టంగానే ఉంటుంది అనుకున్నాడు తన భర్త...
అలా బుజ్జమ్మ పెళ్లి జరిగి నాన్నమ్మ దీవెనలతో తనకి నచ్చిన మంచి మొగుడ్ని సొంతం చేసుకుంది.
బుజ్జమ్మ అసలు పేరు చెప్పలేదు కదా!!!
సీత మన బుజ్జమ్మ పేరు.. వాళ్ళ జంట సీతారాముల ల కొనసాగాలి అని కోరుకుందాం..
౼కిషోర్ శమళ్ల