దేవుడు ఎవరు?
దేవుడు ఎవరు?
రోజు నిద్రలేచి దేవుడికి దండం పెడుతున్నవా?
దేవుడు ఏదో చేస్తాడని ఆశ పడుతున్నావా? ఐతే మోసపోతున్నావ్.
తనమీద తనకు నమ్మకం లేనివాడికే దేవుడు మీద భక్తి ఎక్కువ ఉంటుంది. దేవుడు లేడని చెప్పట్లేదు. కానీ దేవుడు మీద భారం వేసి బాధ్యత మర్చిపోకూడదు.
దేవుడు అంటే ఎవరు?
నువ్వు చేస్తున్న పని నీకు దేవుడు
నిన్ను కన్న నీ తల్లిదండ్రులు నీకు దేవుళ్ళు
చదువు నేర్పించిన గురువులు నీకు దేవుళ్ళు
అవసరానికి సాయం చేసే స్నేహితుడు నీకు దేవుడు
దేవుళ్ళు అనేక విధాలుగా కనిపిస్తారు. కానీ మనమే గుర్తించట్లేదు.
మీరు ఐతే వేరే పేర్లు పెట్టుకుంటారు. ఊరికో గుడి కట్టిస్తారు. సరైన ఆసుపత్రులు ఉండవు, సరైన పాఠశాలలు ఉండవు. కానీ దేవుడికి మాత్రం కానుకలు ఎప్పుడు కురిపిస్తూనే వుంటారు. గుడి మాత్రం అంగరంగ వైభవంగా మెరుస్తూ ఉంటుంది.
ఇక్కడ దేవుడు ఎప్పుడు ఏ రూపంలో కనిపిస్తాడో ఎవడికి తెలియదు.
ఎగ్జామ్ హాల్ లో చూసి రాసుకోమని చెప్పి పాస్ చేయించే స్నేహితుడు వాడి కంటికి దేవుడిలానే కనిపిస్తాడు.
బాగా ఆకలిగా వుండి ఏం దొరకని స్థితిలో ఐస్క్రీమ్ బండి వాడు కూడా దేవుడిలానే కనిపిస్తాడు.
బిచ్చగాడికి రూపాయి దానం చేసే ప్రతి ఒక్కడు వాడికి దేవుడే.
ఇక్కడ దేవుడు అని పిలిచేవాడికి గుళ్ళు, గోపురాలు, పూజలు, నైవేద్యాలు, హారతులు, అలంకారాలు.
రాయిలో దేవుడ్ని చూసే మనకి మనిషిలో దేవుడు కనిపించట్లేదు.
సాయపడిన వాడికి రుణం తీర్చుకోవాలి కానీ, సాయిబాబు కి మొక్కు చెల్లించడం కాదు.
కష్టపడి పెంచి పెద్దచేసి, మనల్ని ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులకి పూజలు చెయ్యాలి కానీ, కాలినడకన వెళ్లి తిరుపతిలో పూజలు జరిపించడం కాదు.
నేను ఇప్పటికీ దేవుడు ఉన్నాడని నమ్ముతాను, కానీ అది రాయి రూపంలో కంటికి కనిపించకుండా వరాలు ప్రసాదిస్తాడన్న అపోహలో ఉన్న దేవుడు కాదు.
అవసరం లో ఆదుకునేవాడు, సాయం చెయ్యడానికి వెనుకాడని వాడు, నా వృత్తి, బ్రతకడానికి నేను నేర్చుకున్న నా విద్య, నా ఆత్మవిశ్వాసం, నా నమ్మకం, నా కల, నా మిత్రులు, నిస్వార్ధ మనసు గల నా కుటుంబం, దేశానికి వెన్నుముక్క లా కాపలా కాస్తున్న నా జవానులు, ఆకలి తీరుస్తున్న రైతులు, నా గురువులు వీల్లే నాకు దేవుళ్ళు.
మోడెర్న్ దేవుడు అంటారు కదా అలా నాకు కనిపించిన దేవుడు సోనూసూద్. మనసులో కోరిక కోరుకుంటే తీర్చేస్తున్నాడు. ఇలా అప్పుడప్పుడు దేవుళ్ళు పుట్టుకొస్తారు. వీళ్ళనే దేవుళ్లుగా నమ్ముతాను నేను.
ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతియ్యడానికి నేను ఇలా రాయలేదు. ఇది నా అభిప్రాయం. నమ్మేవాళ్ళకి నా కృతజ్ఞతలు. మీరు నాలానే ఆలోచిస్తున్నారని ఆశిస్తున్నాను.