Kishore Semalla

Children Stories Drama Inspirational

4  

Kishore Semalla

Children Stories Drama Inspirational

సత్య' హరిశ్చంద్రప్రసాద్'

సత్య' హరిశ్చంద్రప్రసాద్'

9 mins
351


గాంధీ తో కలిసి స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్లలో హరిశ్చంద్ర ప్రసాద్ గారు కూడా ఒకరు..నిత్యం గాంధీ చెప్పిన మాటలే నెమరు వేసుకుంటూ తన అడుగుజాడల్లోనే నడుస్తూ తన పిల్లల్ని కూడా అదే బాటలో నడిపించాడు...

సత్యం, అహింస అనే ఈ రెండు పదాల ప్రాముఖ్యత తన పిల్లలకి బోధించాడు..ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పకూడదు..మద్యపానం, ధూమపానం లాంటి చెడు అలవాట్లకు దగ్గరవ్వకూడదు, ఎలాంటి సందర్భంలో కూడా అహింస కి పాల్పడవద్దు అని నిత్యం నామస్మరణ చేయించేవాడు వాళ్ళ చేత..

హరిశ్చంద్ర ప్రసాద్ పెద్ద కొడుక్కి గాంధీ పేరే పెట్టుకున్నాడు.. గాంధీ చిన్నప్పటి నుంచి కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.. తండ్రి మాటని జవదాటడం ఎన్నడూ చెయ్యలేదు.. తన మాటలు, నడవడిక, చేష్టలు అన్ని కూడా గాంధీని స్మరింపజేస్తున్నాయి...

గాంధీ పెరిగి పెద్దవాడై నాన్న పరువు మర్యాదలని రెట్టింపు చేసాడు. సీతాదేవి వంటి చక్కనైన యువతిని మనువాడాడు.

అక్టోబర్2.

ఆరోజు గాంధీ జయంతి. గాంధీకి మొదటి సంతానం కలిగింది. మగ బిడ్డ పుట్టాడని ఊరంతటిని పిలిచి భోజనాలు పెట్టాడు.. తన అడుగుజాడల్లో నడుచుకోవాలని.. తరతరాలుగా పేరుని నిలబెట్టుకున్న వంశం ఖ్యాతి మరింత పెంచాలని తన బిడ్డ కి సత్యం అని నామకరణం చేసాడు..

తాతగారైన హరిశ్చంద్రప్రసాద్ మనవడిని చూసి మురిసిపోయాడు.. తనని మంచి అనే బాటలో నడపాలని తానే స్వయంగా పాఠాలు బోధించేవాడు. ఇంత చరిత్ర కలిగిన కుటుంబం లో అబద్ధం ఆడటం అనేది ఎంత పెద్ద నేరమో సత్యం కి తెలియనిది కాదు. కానీ నిజం చెప్పి జరిగే పరిణామం ఎదురుకొనే కన్నా అబద్ధం చెప్పి శిక్ష నుంచి తప్పించుకోవడం అలవాటు చేసుకున్నాడు సత్యం..

చదువు సరిగ్గా అబ్బట్లేదు సత్యం కి..కానీ సత్యం ని అధికృత గణకుడ్ని (చార్టర్డ్ అకౌంటెంట్) చెయ్యాలనేది వాళ్ళ తాతగారి కల. ఇప్పటిలోనే కాదు అప్పట్లో కూడా ఆ చదువుకు ప్రాముఖ్యత ఎక్కువ. బాగా కష్టపడి చదవాలి. రాసేవాళ్ళ సంఖ్య తో పాటు పాస్ అయ్యేవాళ్ళ సంఖ్య కూడా తక్కువ గానే వుండేది.

సత్యం కి తరగతి గదిలో గంటలు గంటలు కుదురుగా కూర్చుని చదవాలంటే నచ్చేది కాదు. తన దృష్టి అంతా ఎక్కడో ఉండేది. కానీ తను పుట్టిన వంశం ఖ్యాతి ఎక్కడ తనవల్ల దెబ్బ తింటుందోనన్న భయం మాత్రం వుండేది. ఆ భయమే తన చేత అబద్ధం చెప్పించింది. నిజాన్ని దాచాలని అనుకున్నాడు కానీ అబద్ధం ఏరోజుకైనా తనని కాటేస్తుందని గుర్తించలేకపోయాడు.

సత్యం తన డిగ్రీ పరీక్షలు పూర్తి చేసుకున్నాడు. తాతగారు తనని పిలిపించి దగ్గర కూర్చోబెట్టుకున్నారు.

చూడు సత్యం! ఇప్పుడు నువ్వు పెద్దవాడివి. చాలా నేర్పు తో వ్యవహరించాల్సిన సమయం ఇది. ఈ వయసు అన్ని అలవాట్లకు, అబద్ధాలకు అవకాశం ఇస్తుంది. కానీ నీ లక్ష్యం, నీ గమ్యం రెండు కూడా నిన్ను అటువైపు వెళ్లకుండా ఆపగలవు. అందుకే నువ్వు నీ లక్ష్యం మీద దృష్టి పెట్టు. అప్పుడు ఎటువంటి చెడు ఆలోచన నీ బుర్రలోకి ఎక్కదు.

"నిన్ను అధీకృత గణకుడు గా చూడటం నా కోరిక, నాకు అది బహుమతి గా ఇవ్వు'' అని చెప్పి ఆరోజు సత్యం కి పెద్ద భారాన్ని బాధ్యత గా అప్పగించాడు.

సత్యం చదువు కోసం మొదటిసారి మద్రాసు వెళ్ళవలసి వచ్చింది. మద్రాసు నుంగంబుక్కమ్ మొత్తం CA విద్యార్థులతో ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. అప్పుడే బస్ దిగాడు సత్యం అక్కడ. తనని పలకరించడానికి ఎవరు లేరు. విద్యార్థులు అందరి చేతుల్లో పుస్తకాలు, ఉరుకులు పరుగులు. ఎవరి మొఖాల్లో కూడా నవ్వు లేదు. తను కూడా ఇలా వీళ్ళలా మారిపోతాడేమో అన్న భయం మొదలయ్యింది. దగ్గర్లో హాస్టల్ చూసుకున్నాడు.

రెండో రోజు ఉదయం ప్రధాన కార్యాలయంకి వెళ్లి CA కోసం నమోదు చేసుకున్నాడు. మరుసటి రోజు నుంచి తరగతులు మొదలయ్యాయి. రాత్రులు పగలు చదివేవాడు. ఇంటి దగ్గర తాతకి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చేది. కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపించేది. ఇంట్లో ఇదే విషయం చెప్పాలని అనుకునే వాడు. కానీ ధైర్యం చాలక తనలో తానే బాధపడేవాడు.

మొత్తానికి పరీక్షలు రానే వచ్చాయి. చాలా కష్టపడ్డాడు. బానే రాసాను అన్న సంతృప్తి తో ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నాడు. ఫలితాలు వచ్చే రోజు అది. మద్రాసు వదిలిపోయే రోజు అనుకున్నాడు. CA పట్టా తో ఇంటికి వెళ్తున్నా అని చాలా సంబరపడ్డాడు.

ఫలితాలు ప్రధాన కార్యాలయం లో నోటీస్ బోర్డ్ లో అతికించారు. అందరూ పరుగులు తీశారు ప్రధాన కార్యాలయం వైపు ఒక్క సత్యం తప్ప. తన హాల్ టికెట్ నెంబర్ కూడా ఎవరితో పంచుకోలేదు. తన స్నేహితులు ఇద్దరు డీలా పడి వచ్చారు గదిలోకి. ఇది వాళ్ళకి పన్నెండో సారి రాసి పాస్ అవ్వకపోవడం. భయం పెరిగిపోయింది సత్యం కి.

హాల్ టికెట్ తీసుకుని ప్రధాన కార్యాలయం కి బయల్దేరాడు. కళ్ళుమూసుకుని తన ఇష్ట దైవం వెంకన్న స్వామి ని మనసులో దండం పెట్టుకుని నోటీస్ బోర్డ్ లో తన పేరుకోసం వెతకడం మొదలుపెట్టాడు.

పేరు లేదు. సరిగ్గా చూడలేదేమో అని మళ్ళీ వెతికాడు. తన హాల్ టికెట్ నెంబర్ కానీ, తన పేరు కానీ కనిపించడం లేదు. ఇంక ఎంత వెతికినా ఉపయోగం లేదని అర్ధం చేసుకున్నాడు.

ఇప్పుడు తనకి బుర్రలో వచ్చే ఆలోచనలు రెండే రెండు. ఒకటి నిజం ఒప్పుకుని మళ్ళీ ప్రయత్నించడం. రెండు అబద్ధం చెప్పి ఇంట్లో వాళ్ళని సంతోష పెట్టడం. బాగా ఆలోచించాడు. రెండో దారే సరైనది అని నిర్ణయించుకున్నాడు. కానీ రెండు తరాలు కాపాడుకుంటూ వస్తున్న ఖ్యాతి దెబ్బ తింటుంది అన్న విషయం మర్చిపోయాడు సత్యం.

ఉత్తరం రాసి పంపించాడు ఇంటికి.

ఉత్తరం చదివిన హరిశ్చంద్ర ప్రసాద్, తన కుటుంబం చాలా సంతోషపడ్డారు. ఊరికి రమ్మని కబురు పెట్టారు. ఊరంతా పెద్ద జాతరే జరిగింది సత్యం విజయం చూసి. కానీ ఎక్కడ నిజం తెలిస్తే తన వాళ్ళ ముందు తల ఎత్తుకోలేడేమో అన్న భయం తనకు అణువణువునా వుంది. కొద్దిరోజులకి తమ వ్యాపార లావాదేవీలని చూసుకోమని తన నాన్నగారైన గాంధీ గారు కొత్త బాధ్యతల్ని అప్పగించారు.

ఇప్పుడు బరువు పడుతుంది సత్యం పైన. నిజం ఎప్పుడు తేలికగా ఉంటుంది. కానీ అబద్ధం అంటే బరువు, ఎంత దాచితే అంత భారం పడుతుంది మన పైన.

పెద్ద గుమస్తా అన్ని లెక్కలు చూసుకునే వాడు. సత్యం కూడా తన దగ్గర నుంచి మెల్ల మెల్లగా విషయాలని అర్ధం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇలా తను ఒక అబద్ధం తోనే కొనసాగించాడు కొన్నాళ్ళు.

సత్యం కి పెళ్లి చేయాలన్న ఆశ కలిగింది తన కుటుంబానికి. జిల్లా మొత్తానికి ఒక్కడే అధీకృత గణకుడు పైగా అందగాడు, పెద్దింట్లో పుట్టాడు, మంచి కుటుంబం ఇంతకన్నా ఇంకేం కావాలి పిల్లని ఇవ్వడానికి.

హరిశ్చంద్ర ప్రసాద్ తన మనవడికి పక్క ఊరు జమీందారు బిడ్డ ఐన సౌందర్య కి ఇచ్చి పెళ్లి చేశారు. పేరు కు తగ్గట్టే తనకి అందంతో పాటు వివేకం కూడా కాస్త ఎక్కువ. ఇద్దరికి పెళ్లయి రెండు నెలలు కావొచ్చింది.

సౌందర్య తన నాన్నగారి లావాదేవీలు పెళ్లికాక ముందు చూసుకునేది. తనకి అంతో కొంతో లెక్కలు బానే వచ్చు. అకౌంట్స్ సరి చూసుకునేది. తప్పులు వుంటే కనిపెట్టేసేది.

ఒకరోజు సత్యం కోసం భోజనం తీసుకుని ఫ్యాక్టరీ కి వెళ్ళింది. సత్యం అప్పుడే అకౌంట్స్ పుస్తకాలని తీసుకుని కార్ లో ఎక్కడికో వెళ్లడం గమనించింది. అకౌంట్స్ పుస్తకాలతో తనకి ఏం పని బయట ఉంటుంది అన్న సందేహం మొదలయ్యింది. అక్కడ పని చేస్తున్న గుమస్తాని అడిగితే తన స్నేహితుడు దగ్గరకి తీసుకుని వెళ్తున్నారు అకౌంట్స్ పుస్తకాలు అని చెప్పాడు. తన భర్త అధీకృత గణకుడు, తానే స్వయంగా లెక్కలన్ని సరి చూసుకోవచ్చు. కానీ వేరే వ్యక్తి దగ్గరకి ఎందుకు తీసుకుని వెళ్తున్నారు అన్న అనుమానం కలిగింది. ఆ అనుమానంతోనే ఇంటికి తిరిగి వచ్చింది.

రాత్రి ఎనిమిది అవుతుంది. సత్యం ఇంటికి వచ్చాడు. తనకోసం ఎదురు చూస్తూ కూర్చుంది సౌందర్య అప్పటిదాకా. ఎలా మొదలుపెట్టాలో అర్ధం కావట్లేదు తనకి.

భోజనం వడ్డించమని కూర్చున్నాడు. ఒకవైపు వడ్డిస్తుంది మరోవైపు ఆలోచిస్తుంది. 'ఏంటి సౌందర్య? నీ ధ్యాస ఎక్కడో ఉంది''. ఏం ఆలోచిస్తున్నావ్? ఏదన్నా కోరిక తీర్చాల చెప్పు, సందేహం వద్దు తప్పకుండా తీర్చిపెడతాను అని మాట ఇచ్చాడు.

ఈరోజు మీకోసం భోజనం తీసుకుని ఫ్యాక్టరీ కి వచ్చాను. కానీ మీరు అప్పటికే ఎక్కడికో వెళ్లడం గమనించాను. అకౌంట్స్ పుస్తకాలు అలా వేరే వ్యక్తులకు ఎందుకు చూపిస్తున్నారు. మన లెక్కలన్నీ వాళ్ళకి ఎందుకు తెలియాలి. మీరు ఎందుకు చూడట్లేదు అని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేయడం మొదలుపెట్టింది సౌందర్య. వెంటనే సత్యం నీళ్లు మింగాడు తన ప్రశ్నలకి. ఏం జవాబు ఇవ్వాలో అర్ధం కాలేదు. తన అనుమానం పోగొట్టాలని ఇలా జవాబు ఇచ్చాడు.

" ఈ లెక్కలన్నీ ఒంటరిగా కూర్చుని చేయాలి అంటే నాకు చాలా సమయం పడుతుంది. నాకు సాయం కావాలి. దానికి నా స్నేహితుడు శంకర్ అవసరం పడింది. అందుకే తన దగ్గరకి వెళ్ళాను. ఈ మాత్రం దానికి ఎందుకు అంత ఆలోచన అడగడానికి '' అని మాట మార్చాడు.

అప్పటికి అర్ధం చేసుకున్నట్టు నటించినా సౌందర్య మనసులో ఇంకా ఏదో అనుమానం మిగిలిపోయి ఉంది.

సత్యం ఏ విషయం ఐతే ఇన్నాళ్లు ఎవరికి తెలియకుండా కప్పిపుచ్చాడో ఆ విషయం సౌందర్యకి అర్ధం కావొద్దని లోపల అనుకున్నాడు.

మరుసటి రోజు సత్యం ఇంటికి రాగానే సౌందర్య కావాలనే తన నాన్నగారి చిట్టాపద్దులు, అవర్జలు తెప్పించి లెక్కలు చూస్తోంది. "ఏమిటి సౌందర్య ఎప్పుడు లేనిది ఈరోజు పుస్తకాలతో కూర్చున్నావ్? అంతలా ఆలోచిస్తున్నావ్?'' అని అడిగాడు.

ఈ లెక్క ఏమిటో తెలియట్లేదు. కాస్త సాయం చేద్దురు అని అడిగింది సౌందర్య.

సత్యం ఒప్పుకుని లెక్కని సరిచేస్తే ఇక్కడ చిక్కు లేదు. తప్పు చేస్తే తన అబద్ధం తెలిసిపోతుంది. కూర్చున్నాడు తన పక్కన. అవర్జ్ ని చేతిలోకి తీసుకుని లెక్కలన్ని చూసాడు. అంతా సవ్యంగా వుంది కానీ తప్పు ఎక్కడో పసిగట్టలేకపోయాడు.

జమా ఖర్చుల పట్టీని సరిచేయడం తెలియదు. మీరు అధీకృత గణకుడు ఎలా అయ్యారని సూటిగా ప్రశ్నించింది.

'ఏం మాట్లాడుతున్నావ్? రోజంతా బయట పనులు, ఫ్యాక్టరీ పనుల్లో ఎన్నో ఒత్తిడులు నాకు. అందువల్ల కనిపెట్టలేకపోవచ్చు. అందుకు నువ్వు అంత పెద్ద మాట విసురుతావా" అని ఘాటుగా స్పందించాడు భార్య మాటకి.

అవునా! మరి దీనిని ఏమంటారు అని తన పరీక్ష ఫలితాలను తీసి ముందు పెట్టింది. సత్యం కి మాటలు లేవు. తల కొట్టేసినంత పని జరిగింది. భార్య కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాడు.

తాను మోసపోయాను అన్న భావన కలిగింది సౌందర్య మనసులో. పెద్దగా మాట్లాడటం మొదలుపెట్టింది. తన మాటలకి తల ఎత్తుకోలేకపోతున్నాడు సత్యం. ఇంటిల్లిపాది నిద్ర లేచారు ఏం జరిగిందోనని.


సత్యం దాచిన అబద్ధం ఈరోజు తనకి అవమానం చేస్తుంది.

"నాకు అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. పెద్ద కుటుంబం, నిజాయితీ అన్న మాటకి ప్రతిరూపం అని నన్ను మోసం చెసి ఒక అబద్ధాల కోరుకి నన్ను ఇచ్చి పెళ్లి చేసారు" అని అందరి ముందు తన భర్త మర్యాదని తీసి పడేసింది.

సత్యం ఈ అవమాన భారం తట్టుకోలేక పోయాడు. కుటుంబం మొత్తం సత్యం చేసిన పనికి తల దించుకున్నారు. ఏ పరిస్థితుల్లో తను అబద్ధం చెప్పాల్సి వచ్చిందో అర్ధం చేసుకోలేకపోయింది సౌందర్య. అబద్ధం కదా పెద్దగా వినిపిస్తుంది. తన కంఠ ధ్వని అందులో వినిపించదు అని తనకు అర్ధం అయ్యింది. మౌనం తో పోరాడాడు ఆ క్షణం. 

సౌందర్య అన్న మాటలకి ఎలా జవాబు ఇవ్వాలో అర్ధంకాలేదు హరిశ్చంద్ర ప్రసాద్ కి. నా మనువడు చేసింది తప్పే, క్షమించరాని తప్పు. ఇలాంటి వాడితో నువ్వు ఇంక కాపురం చెయ్యాల్సిన అవసరం లేదు. నేను మీ నాన్నగారితో మాట్లాడతాను.

గాంధీ మధ్యలో కలగజేసుకుని నాన్నగారు అని పిలుస్తాడు. సత్యం చేసింది తప్పే నేను కదనను. కానీ ఎందుకు చేసాడో అడగకుండా మనం నిర్ణయం తోసుకోవడం సరికాదు. అమ్మ సౌందర్య తాను తప్పు చేసుండొచ్చు కానీ మోసగాడు కాదు నా బిడ్డ. తనని క్షమించేసి మీరు మళ్ళీ ఎప్పటిలా కలిసి వుండండి అని చెప్తాడు.

గాంధీ! అని పిలిచి, నువ్వు నీ బిడ్డని వెనకేసుకుని వచ్చి నన్ను అవమానిస్తున్నావ్. అంతగా వాడికి పరువు కాపాడలనుకుంటే, తనకి ఈ కుటుంబం మళ్ళీ కావాలంటే వెళ్లి తను చెప్పిన అబాధాన్ని నిజం చేసుకుని రమ్మను. అప్పుడే ఈ హరిశ్చంద్రప్రసాద్ శాంతిస్తాడు. వాడ్ని మళ్ళీ మనువడిగా స్వీకరిస్తాడు అని చెప్పి అక్కడ నుంచి బయల్దేరుతాడు.

ఇప్పటివరకు అబద్ధం తో బ్రతికాను. రోజూ బరువును మోస్తూ బలహీనమయిపోయాను. ఇప్పుడు విముక్తి కలిగింది. అబాధాన్ని నిజం చేసే సమయం వచ్చింది. ఇక ఆలస్యం చెయ్యక తన పుస్తకాలని బట్టల్ని సర్దుకుని మద్రాసు బయల్దేరుతాడు. సౌందర్య కనీసం సాయం కూడా పట్టదు. కానీ తను ఏమాత్రం చలించడు. అవమానం నుంచి పుట్టుకొచ్చిన కసి అగ్ని లాంటిది. చల్లారాక ముందే సాదించేయాలి.

మళ్ళీ నుంగంబుక్కమ్ లో అడుగుపెట్టాడు. తన వయసు వాళ్ళు ఎంతో మంది అక్కడ వున్నారు. అంతకు మించిన వాళ్ళు కూడా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు..

జరిగిన అవమానం నుంచి చాలా నేర్చుకున్నాడు. అబద్ధం నిజం చేయాలన్న కసితో పరుగు మొదలుపెట్టాడు. తన లక్ష్యం తప్ప వేరే ఇంకేం తనకి గుర్తుకు రాలేదు.

ఇక్కడ భార్య సౌందర్య తన పుట్టింట్లో

సౌందర్య దిగులుగా మంచం పైన కూర్చుని ఆలోచిస్తుంది. తన నాన్నగారు తన దగ్గర కి వచ్చి

ఏంటి తల్లి ఆలోచిస్తున్నావ్ అల్లుడు గారి గురించేనా?? అని సందేహంగా అడుగుతాడు.

దానికి సమాధానంగా సౌందర్య,

నాన్న! నా భర్త అబద్ధం చెప్పి వుండొచ్చు. నేను కారణం అడగకుండా తనని అవమానించడం తప్పు అనిపిస్తుంది. నాకు తన ఆలోచనలతో నిద్ర పట్టడం లేదు. తప్పు చేశానా? అని అడుగుతుంది.

నిజం చెప్పాలంటే తను అబద్ధం చెప్పింది నిన్ను పెళ్లి చేసుకోడానికి కాదు. తన తాతగారు పరువు కాపాడాలని అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధం తో నీకు సంబంధం లేదు. కానీ నువ్వు మోసపోయానని భావించావ్. నువ్వే కాదు నీలా ప్రతి అమ్మాయి అబదాన్ని సహించలేదు. కానీ ప్రతీ అబద్ధం మోసం కాదు. అల్లుడు నిన్ను క్షమిస్తాడు, నువ్వేం ఆలోచించకు. వెళ్లి తనని కలిసి రా. తనకి మరింత ప్రోత్సాహం ఇచ్చినదానివి అవుతావ్ అని చెప్పి తనకి మంచి చెడులు చెప్పాడు.

మరునాడు మద్రాసు బయల్దేరి నుంగుమబాక్కం చేరుకుంది సౌందర్య. తన భర్త ని కలవడానికి హాస్టల్ బయట ఎదురుచూస్తుంది. ఎటు చూసినా విద్యార్థులు, పుస్తకాలు, హడావిడి. ఇంత కష్టపడాల CA అవ్వాలంటే అని అనిపించింది సౌందర్య కి అప్పుడు. ఆలోచిస్తే తను చేసిన పని చాలా తప్పు అనిపించింది ఒక్కసారి తనకి.

అప్పుడే బయటకి వచ్చాడు సత్యం. తనని చూసి ఒక్కసారి చెప్పలేనంత ఆనందపడ్డాడు. తను కూడా భర్త ని చూసిన ఆనందం మాటల్లో చెప్పలేకపోయింది. కాసేపు ఇద్దరు ఏకాంతంలో కూర్చుని మాట్లాడుకున్నారు. మీరు తప్పకుండా అధీకృత గణకుడు గా మళ్ళీ మన సంస్థానం లో అడుగుపెడతారు. నాకు తెలుసు. నా వల్ల మీరు బాధపడి వుంటే నన్ను క్షమించండి. మీరు ఎంత కుమిలిపోతున్నారో నాకు తెలుసు. నేనే అర్ధం చేసుకుని ఉండాల్సింది. పాపిష్టి దాన్ని నేను, మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. మావయ్య గారి దగ్గర, తాత గారి దగ్గర మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాను అని కన్నీరు పెట్టుకుంటుంటే తన చేతిని అందుకున్నాడు సత్యం ఒక్కసారి.

సౌందర్య ఇందులో నీ తప్పేమీ లేదు. అబద్ధం తో ఇన్ని రోజులు నా మెదడు లో చాలా బరువు మోసాను. ఇప్పుడు చాలా తేలికగా ఉంది. నువ్వు అంతగా ఏం ఆలోచించకు, తాతగారిని బాగా చూస్కో. నేను పాస్ అయ్యి వస్తాను. ఆయన మళ్ళీ తలెత్తుకునేలా చేస్తాను. నువ్వు జాగ్రత్త అని చెప్పి కాసేపు తనతో సమయాన్ని గడిపాడు. సాయంత్రం ట్రైన్ ఎక్కించి మళ్ళీ ఊరికి పంపించాడు.

పరీక్షలు సమయం రానే వచ్చింది.

ఎప్పటిలానే పరీక్షల ఒత్తిడి మొదలయ్యింది. చెమటలు పడుతున్నాయి పరీక్ష కేంద్రం లో. ఇంకా పరీక్ష మొదలవ్వడానికి పావుగంట ఉంది. ఒక్కసారి తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు ఆ పది నిమిషాలు.

విజయవంతంగా పరీక్షలు పూర్తి చేసుకున్నాడు. ఫలితాలు వచ్చే వరకు ఊరికి వెళ్ళలేదు.

ఆరోజు ఉదయం పరీక్ష ఫలితాలు వస్తాయన్న కబురు తెలిసింది. కొన్నేళ్ల క్రితం ఎలా వుందో రోజు ఈరోజు అలానే ఉంది. అందరూ ప్రధాన కార్యాలయం వైపు పరుగులు తీస్తున్నారు ఫలితాలు తెలుసుకోడానికి. సత్యం తన గదిలోనే కూర్చుని ఆలోచిస్తున్నాడు వెళ్లాలా వద్దా అనుకుంటూ.

అప్పుడే తలుపు తట్టిన శబ్దం వినిపించింది.

ఎవరయుంటారని తీసాడు. హరిశ్చంద్రప్రసాద్ ఎదురుగా కనపడేసరికి నోటమ్మట మాట రాలేదు సత్యం కి..

తాతగారు మీరు ఇలా వచ్చారేంటి? అని సందేహంగా అడిగాడు.

లోనికైనా రావొచ్చా?? ఇక్కడ నుంచే విషయాలు అన్నీ మాట్లాడుకుందామా?? అని అడుగుతారు తన తాతగారు.

అయ్యో! నిలబెట్టే మాట్లాడుతున్నా.. రండి తాతగారు, ఇదే నేను ఉంటున్న హాస్టల్. ఇంకో ఇద్దరు స్నేహితులు ఫలితాలు చూడటానికి ప్రధాన కార్యాలయం దగ్గరకి వెళ్లారు.

మరి నువ్వు వెళ్లలేదే?? ఎందుకని అని అడుగుతాడు.

కాస్త భయం, కాస్త బెంగ ఈ రెండు కూడా నన్ను కాలు కదపనివ్వలేదు.

సత్యం! అధీకృత గణకుడు అవ్వడం కష్టమే. నాకు తెలియనిది కాదు. కానీ మా పట్ల గౌరవం నీ చేత అబదాన్ని చెప్పించింది. నువ్వు అబద్ధం చెప్పాక నేను చాలా సార్లు ఆలోచించా, అబద్ధం అనేది తప్పా? తప్పు కాదా? అని..

అబద్ధం మన వాళ్ళ కోసం వాళ్ళ సంతోషం కోసం ఆడటం తప్పు కాదనిపించింది. పరిస్థితులు ఆడించే అబద్ధాలు వెనుక ఒక బాధ ఉంటుంది. అది ఆడిన వాడికే తెలుస్తుంది. నీ తరుపున నేను ఆలోచించాల్సింది ఆరోజు. నీ భార్యతో పాటు నేను ఆ క్షణం క్షణికావేశం లో మాట్లాడాను.

నీ అబద్ధం మా పైన ఉన్న గౌరవం కన్నా పెద్దది కాదు రా. నువ్వు ఇప్పుడు పాస్ అయినా అవ్వకపోయినా మేము అంతా అక్కడ నీకోసం ఎదురుచూస్తున్నాం. మాతో వచ్చేయ్ అని తలుపు వైపు చూపిస్తాడు. అక్కడ సత్యం నాన్న, అమ్మ, తన భార్య గుమ్మం దగ్గరే ఎదురుచూస్తూ వుంటారు.

సత్యం కి కల్లెమ్మట నీరు తిరుగుతున్నాయి ఇంతమంది ప్రేమని చూసాక..

అంతలోనే తన స్నేహితులు ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు విషయం చెప్పాలని..

ఏం జరిగింది? అని అడుగుతాడు సత్యం వాళ్ళని.

వాళ్లిద్దరూ ఇంతమందిని చూసి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ వుంటారు..

ఏం మాట్లాడకుండా అలానే నిల్చున్నారేంటి.. ఏమన్నా మాట్లాడండి రా అని అడుగుతాడు..

సత్యం నువ్వు ఇప్పటి నుంచి నీ పేరు మార్చుకోవాలి అని చెప్తారు..

అర్ధం కాలేదు.. ఏం జరిగింది అని అడుగుతాడు మళ్ళీ సందేహంగా..

వాళ్లిద్దరూ ఒకరి మొఖం ఒకరు చూసుకుని నవ్వి..

సత్యం నువ్వు CA అయిపోయావ్.. ఇక నుంచి నువ్వు ఉత్త సత్యం కాదు.. CA సత్యం అని వచ్చి పైకి లేపి చుట్టూ తిప్పుతారు..

అందరూ చాలా సంతోషిస్తారు. సత్యం హరిస్చంద్రప్రసాద్ కాళ్ళని మొక్కుతాడు. సత్యాన్ని దీవించి చాలా గర్వపడతాడు హరిస్చంద్రప్రసాద్..

సంతోషాన్ని పంచుకోడానికి మొత్తం కుటుంబం ఒక చోటుకి చేరింది.

నవ్వుకున్నారు, సంతోషాన్ని పంచుకున్నారు..

ఎప్పుడు ఐనా సరే మన కుటుంబంలో కానీ, మనకి ఇష్టమైన వాళ్ళు కానీ మనకి అబద్ధం చెప్పారు అని తెలిస్తే కారణం అడగండి. కారణం లేకుండా మన దగ్గర నిజాన్ని దాచి అబదాన్ని చెప్పరు. అబద్ధం చెప్పిన రోజు నుంచి నిద్ర కూడా సరిగ్గా పోడు. మీకు నిజం తెలిస్తేనే బాధ పడతారు, కానీ నిజం దాచిన వాడు రోజు బాధ పడుతూనే ఉంటాడు.

                                              ౼ కిషోర్ శమళ్లRate this content
Log in