డ్రిల్ మాస్టర్
డ్రిల్ మాస్టర్
ప్రతి పాఠశాలలో మంచి చదువులు చెప్తున్నారా? వాళ్ళకి చిన్న వయసులోనే మంచి ర్యాంకులు తెప్పించే దిశ గా నడుపుతున్నారా? ఫీజు ఎంతైనా ఫర్వాలేదు వాళ్ళకి చదువు తప్ప వేరే లోకం తెలియొద్దు అనే విధంగా ప్రస్తుత చదువుల విధానం తయారయ్యింది. ప్రైవేట్ పాఠశాలల తాకిడి తట్టుకోలేక ప్రభుత్వ పాఠశాలలు కూడా అదే విధంగా పిల్లలకి చదవాలి, ర్యాంకులు కొట్టాలి అని వాళ్లపైన లేని పోనీ ఒత్తిడ్లు తీసుకు వస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా మందస గ్రామం. ఆ ఊర్లో కొత్తగా ఒక ప్రైవేట్ స్కూల్ మొదలయ్యింది. పాత బడిన ఒక భవనానికి హంగులు, రంగులు దిద్ది సరికొత్తగా దానిని తయారు చేశారు. ఊర్లో బాగా వున్నోల దృష్టి ఆ స్కూల్ పైన పడింది. అప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివించిన వాళ్ళ బిడ్డలని ప్రైవేట్ స్కూల్ పైన మోజు తో చేర్పించడం మొదలుపెట్టారు. ఇది చూసిన మధ్య తరగతి కుటుంబాలు కూడా అప్పో సోప్పో చేసి పిల్లలకు మంచి చదువు ఇప్పించాలని నిర్ణయించుకున్నారు. ఇలా సగానికిపైగా పిల్లలు ప్రైవేట్ పాఠశాలల వైపు పరిగెత్తారు.
ప్రభుత్వ పాఠశాలలో ఒత్తిడి ఎక్కువయ్యింది. ఇంటిఇంటికి వెళ్లి పిల్లలకి ఉచిత విద్య, ఉచిత భోజన పథకాలు గురించి వివరించారు. కొంత మేరకు పిల్లలు బానే వచ్చారు. హెడ్ మాస్టర్ నుంచి ఆదేశం అందరి ఉపాధ్యాయులకి కూడా, ఈ సంవత్సరం పిల్లలకి వంద శాతం పాస్ పెర్సెంటేజీ కావాలి అని. దాంతో ఇటు ఉపాధ్యాయులకి విద్యార్థులు కి కూడా తీవ్ర ఒత్తిడి మొదలయ్యింది.
అదే ఏడాది రామకృష్ణ అని డ్రిల్ మాస్టర్ ట్రాన్సఫర్ అయ్యి ఈ ఊరుకి వచ్చారు. అతనిని చాలా బాగా ఆహ్వానించారు విద్యార్థులు మరియు ఉపాద్యాయులు. అతను ప్రసంగం ఇస్తూ- "దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మీ ఆటలు కేవలం మైదానంకే పరిమితం చెయ్యకుండా ప్రపంచ స్థాయి లో మన దేశం పరువు నిలబెట్టాలి" అని ఆయన ప్రసంగం ముగించారు. అది విన్న కుర్రకారు ఈలలు వేసినా, మిగతా టీచర్లు మాత్రం కొంచెం బిన్నంగానే స్పందించారు.
తరువాత స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఒకరొకరుగా మాట్లాడటం మొదలుపెట్టారు.
ముందు హెడ్ మాస్టర్ శాస్త్రి గారు..
"చూడండి రామకృష్ణ గారు, ఈ ఏడాది మనకి చాలా గట్టి పోటీ వుంది కొత్తగా వచ్చిన ప్రైవేట్ పాఠశాల వల్ల. మనం మన పిల్లలని ఈ ఏడాది కాస్త గట్టిగా సానబడితే వాళ్ళ కన్నా ఎక్కువ మార్కులతో పాస్ అవుతారు. వాళ్ళకి ఆటలు, పాటలు అని చెప్తే వాళ్ళ ఏకాగ్రత దెబ్బ తింటుంది. మీరు ఈ ఒక్క ఏడాది సేద తీరండి, ఖాళీగా కూర్చోండి స్టాఫ్ రూమ్ లో. విద్యార్థులని కాస్త క్రమశిక్షణ లో పెట్టండి. మీరు బోధించే పాఠాలు కూడా ఏమి లేవు పిల్లలకి. అందుచేత ఈ ఏడాది మొత్తం మీకు వేసవి సెలవులే" అని కాస్త తన వృత్తి ని తక్కువ చేసే మాట్లాడారు శాస్త్రి గారు.
అందరూ తలో మాట డ్రిల్ మాస్టర్ని, ఆటలని కించపరిచినట్టే మాట్లాడారు. కానీ రామకృష్ణ గారు మాత్రం "ఆటలతోనే పిల్లల మెదడు చురుకు అవుతుంది, ఆటలతోనే పిల్లల శరీరం దృఢం అవుతుంది, డ్రిల్ మాస్టర్ గా నా కర్తవ్యం పిల్లలని క్రమశిక్షణ లో పెట్టడమే కాదు. పిల్లలతో కలిసిపోవడం, వాళ్ళ ప్రతిభ ని గుర్తించడం. మీరు అన్నట్టు నేను స్టాఫ్ రూమ్ లో ఖాళీగా కూర్చోలేను. మీరు కూడా ఖాళీగా వుంటే మైదానం లో అడుగుపెట్టండి పిల్లలకే కాదు మీకు కూడా ఆటలు నేర్పిస్తాను" అని చెప్పి అక్కడ నుంచి లేచాడు.
అందరికి అతని తీరు నచ్చలేదు. కానీ రామకృష్ణ గారు అదేమీ పట్టించుకోలేదు. మరుసటి రోజు సాయంత్రం విద్యార్థులందరిని కూడా పిలిచి మైదానం లో సమావేశం పెట్టారు. అందరికి ఇష్టమైన ఆటలు ఏంటని ఆరాతీసి ఉదయం ఆరు గంటలకే మైదానం లో కనపడమని తను ఎంచుకున్న విద్యార్థులకి హెచ్చరించాడు.
ఇంకోపక్క మిగతా టీచర్లు విద్యార్థులకి ఖాళీ సమయం అనేదే లేకుండా చదివిస్తున్నారు. ఇన్నాళ్లు ఆటలతో పాటు చదువుకునే పిల్లలు ఒక్కసారి పుస్తకాలు చదువులు అనేసరికి కొందరికి చిన్న వయసులోనే కళ్ళజోడు కూడా వచ్చేసింది.
ఈ ఏడాది మనకి జోనల్ మీట్ ఉంది. పిల్లలు మీరు సిద్దం కావాలి. మీలో ఒక సచిన్ టెండూల్కర్ ఉన్నాడో, ఒక పి టి ఉషా వుందో, ఒక ఉస్సేన్ బోల్ట్ ఉన్నాడో తెలు
సుకునే సమయం వచ్చింది. ఈరోజు నుంచి మీరు చదువుకు ఎంత శ్రద్ద వహిస్తున్నారో అంతే శ్రద్ధ ఆటలలో కూడా పెట్టాలి. ఇలా అందరిని ఈసారి జోనల్ మీట్ కి సిద్ధం చెయ్యడం మొదలుపెట్టారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాయంత్రం బడి పూర్తవ్వగానే మైదానం లో ఆటలతో అలసిపోయేవారు. ఇంకో పక్క ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు రోజంతా పుస్తకాలతో కుస్తీలు పట్టేవారు. మిగతా టీచర్లకి భయం పిల్లలు ఆటలలో పడి చదువుని అశ్రద్ధ చేస్తారని.
జోనల్ మీట్ రానే వచ్చింది. మొత్తం చుట్టుపక్కల ఉన్న అన్ని స్కూల్ పిల్లలు కూడా పాల్గొన్నారు. హెడ్ మాస్టర్ కి ఇష్టం లేకుండా రామకృష్ణ గారు ఇదంతా చెయ్యడం అతనికి నచ్చేది కాదు. దాంతో జోనల్ మీట్ ఖర్చులకు కూడా నయా పైసా పెట్టలేదు ఈ ఏడాది. మొత్తం పిల్లల కోసం డ్రిల్ మాస్టర్ తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి మరి ఆటల పోటీలకు తీసుకుని వెళ్ళాడు. పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి నిత్యం పాలు, గుడ్లు, గ్లూకోస్ ఇలా అన్ని వస్తువులకు తానే స్వయంగా ఖర్చుపెట్టేవాడు.
మొదటి రోజు ఆటల పోటీలో మొత్తం ఐదు విభాగాల్లో మందస గ్రామం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే బహుమతులు సొంతం చేసుకున్నారు. ఈ విషయం హెడ్ మాస్టర్ చెవిన పడింది. మొదటి రోజు విన్నా విననట్టు వున్నాడు. రెండో రోజు కూడా మిగతా విభాగాల్లో ఫైనల్స్ కి చేరుకున్నారు మందస గ్రామం విద్యార్థులు. ఈసారి హెడ్ మాస్టర్ తానే స్వయంగా మొత్తం పాఠశాల విద్యార్థులని, మిగతా టీచర్లని తీసుకుని ఆటల పోటీ జరుగుతున్న పలాస గ్రామం కి బయల్దేరాడు.
ఆఖరి రోజు ఆటల పోటీలు. మొత్తం మైదానం చుట్టూ మందస గ్రామం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే. కరచాల ధ్వనులు, ఈలలు తో తమ స్నేహితులని ప్రోత్సహిస్తున్నారు. హెడ్ మాస్టర్ రామకృష్ణ ని కలిసి తనని క్షమించమని కోరాడు. పిల్లలకి పుస్తకాలే చదువు కాదు ఆటలు కూడా చదువులో భాగమే అన్న విషయం మర్చిపోయాను అని తన తప్పు తెలుసుకున్నాడు.
సాయంత్రం ఆటలు ముగిసేసరికి మొత్తం ఈ సంవత్సరం అన్ని బహుమతులు మందస ప్రభుత్వ పాఠశాల వారే కైవసం చేసుకున్నారు. దాంతో కొంతమందికి ఉచితంగా విద్య ని నేర్పిస్తూ ఆటల స్కూల్ లో చేర్చుకోడానికి పిలుపు వచ్చింది. ఇంకొంత మందికి మంచి అవకాశాలు వచ్చాయి. చాలా మందిలో ఆత్మస్థైర్యం వచ్చింది. గెలుపు రుచి ని చూసారు.
ఇప్పుడు పరీక్షలకు ఇంకా రెండు నెలలే ఉంది. రామకృష్ణ గారు అందరి విధ్యర్డులను కూడా పగలు రాత్రి కష్టపడి చదివేలా చూసుకున్నారు. తన కర్తవ్యం మర్చిపోలేదు. హెడ్ మాస్టర్ చెప్పిన మాటలు తనకి ఇంకా గుర్తున్నాయి అన్న విషయం అర్ధమయ్యింది అందరికి.
పరీక్షలలో అందరూ పాస్ అయ్యారు. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కన్నా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యారు. ఇటు ఆటల్లో అటు చదువుల్లో కూడా రాణించారు.
డ్రిల్ మాస్టర్ ని దగ్గరగా పిలిచి గుండెలకు హత్తుకున్నారు హెడ్ మాస్టర్ శాస్త్రి గారు. మీరు పిల్లలనే కాదు మమ్మల్ని కూడా చాలా మార్చివేశారు. మీ అనుభవం, మీ ఆలోచన విధానాలు ఈ పాఠశాల కి బాగా ఉపయోగపడ్డాయి. ప్రతి టీచర్ కూడా వచ్చి తనకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
నన్ను పొగడ్తలతో ముంచెత్తడం కాదు. మైదానంలో దిగి మీ శరీరాలకి పని చెప్పండి అని అందరిని మైదానం లోకి ఆహ్వానించాడు. టీచర్లు ఆటలు ఆడటం చూసి విద్యార్థులు అందరూ చుట్టూ చేరారు.
కాసేపటికి పూర్వ విద్యార్థులు కూడా ఎవరైతే ప్రైవేట్ స్కూల్ మోజులో పరిగెత్తుకు వెళ్లారో అందరూ మళ్ళీ ఇక్కడికే చేరుకున్నారు. అంతా రామకృష్ణ గారు వల్లే ఇదంతా జరిగింది అని హెడ్ మాస్టర్ తన వంక చూసి ఒక చిన్న నవ్వు విసిరాడు….
*************************
నేను ప్రైవేట్ ప్రభుత్వం అని వాడినప్పట్టికి ఎవరిని ఉద్దేశించినది కాదు. ఇక్కడ ఎటువంటి పాఠశాల ఐనా విద్యార్థులకి స్వేచ్చనివ్వాలి. అప్పుడే వారి నుంచి మంచి ఫలితాలు వస్తాయి. అంతే గాని కేవలం పుస్తకాలే జీవితం అని నేర్పిస్తే పిల్లల నైపుణ్యం దెబ్బతింటుంది అనేది నా అభిప్రాయం.