భగవద్గీత పలుకుల సారాంశం
భగవద్గీత పలుకుల సారాంశం
నేను చేస్తున్నాను అనే భావన కాని, స్పృహ కానీ లేకుండా తన విధ్యుక్త ధర్మములను నిర్వహించాలి.
ప్రతి మనిషి పుట్టుక ఒక ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది. తాను చేస్తున్నాను అనుకోక పోయినా తనచే ఆ పనులు నిర్వర్తించబడి తీరతాయి.
నేను చేస్తున్నాను అనుకోవడం వల్ల ఆ అనుభవాలు జ్ఞాపకాలుగా మారడం - వీటినే వాసనలు అంటారు - మరల జ్ఞప్తికి రావడం, తత్సంబంధిత సుఖదుఃఖాలు మరల కలగడం జరుగుతుంది. దీనిని ఆపడానికే కర్తృత్వ స్పృహా రహిత కర్మాచరణం ఉపదేశించబడింది.
పనిముట్టు ఏ భావనా లేకుండా నిర్ణీత పనిని చేస్తుంది. అట్లే మనిషి మనః శరీరాలు తమ నిర్ణీత పనులను చేస్తాయి. మధ్యలో నేను చేస్తున్నాను అనుకోవడం అనవసరం. అనుకున్నా, అనుకోక పోయినా పని జరిగిపోతుంది.
నేను చేస్తున్నాను అనుకుంటే పైన చెప్పినట్లుగా అనుభవములు స్మృతిగా మారి మరల తలపులు కలిగిస్తూ ఉంటాయి. అదే కాకుండా ఫలితంపై ఆందోళనతో చేసే పని నాణ్యత కూడా తగ్గుతుంది.
కర్తృ భావన లేకుండా కర్మని చేయడమే భగవద్గీత ఉపదేశ సారం. దీనినే కర్మయోగం
అనీ అంటారు.
భక్తి యోగంలో వ్యక్తి శరణాగతి చెందడం వల్ల సర్వమూ భగవత్ సంకల్పం అనుకుని భగవంతుని సాధనంగా కర్మలను ఆచరిస్తాడు. నేను చేస్తున్నాను అనుకోడు.
జ్ఞాన మార్గంలో నేను ని ఆత్మకు అన్వయించడం వల్ల మనః శరీరాలు చేసే (వల్ల జరిగే) పనుల్లో నేను చేస్తున్నాను అనే భావనకు తావు లేదు.
అన్ని మార్గాలలోను కర్తృత్వ భావన లేని కర్మ జరుగుతుంది. అది అన్ని శుభాలను, శ్రేయస్సును, సుఖశాంతులను కలిగిస్తుంది.
ఓం తత్ సత్!