Varanasi Ramabrahmam

Classics

5  

Varanasi Ramabrahmam

Classics

ప్రపంచం-జగత్తు

ప్రపంచం-జగత్తు

3 mins
34.9K


ప్రపంచం అనే పదాన్ని తత్త్వం పూర్తి అవగాహనతో నిర్వచించింది.


వేదాంత పంచదశి


శ్లోll అస్తి భాతి ప్రియం నామం రూపంచ ఇతి అంశ పంచకం

ఆంద్ర త్రయం బ్రహ్మరూపం తతో ద్వయం జగద్రూపం 


ప్రపంచంలో ఐదు అంశాలుంటాయి. అవి అస్తి, భాతి, ప్రియం, నామం, రూపం. ఇందులో మొదటి మూడూ బ్రహ్మమునకు సంబంధించినవి. మిగతా రెండు జగత్తుకు సంబంధించినవి. 


అస్తి-భాతి-ప్రియం, సత్-చిత్-ఆనందములకు సదృశం. అన్ని మానసిక, శారీరక కార్యకలాపాలు సచ్చిదానంద రూపమైన ఆత్మ లేక బ్రహ్మము వల్ల జరుగుతున్నాయని ఉపనిషత్తులు చెప్పాయి. 


దీని అర్థం, మన మానసిక, తత్సంబంధ శారీరక కలాపాలు చిత్ శక్తి వల్ల జరుగుతున్నాయని తాత్పర్యం. ఎటొచ్చీ చిత్ శక్తి మేధలో చిదాభాసగా మారి, తాను పరిణామములు చెంది మానసిక విభూతులైన అంతఃకరణముల రూపము పొంది సకల కార్యకలాపాలను నిర్వహిస్తుంది. మాయ, ప్రణవం, స్ఫోట ఈ చిదాభాసకు మారు పేర్లు.


మనం ప్రపంచం, జగత్తు పదాలను ఒకే అర్థంలో ఉపయోగిస్తాము. ఆ రెండింటికి తత్త్వ శాస్త్ర రీత్యా అల్పమైన, కాని ప్రస్ఫుటమైన తేడా ఉంది. 


అస్సలు ముందు గమనించ వలసింది, ఎప్పుడూ మర్చిపోకూడనిది ఏమిటంటే, ప్రపంచం, జగత్తు పదాలను వేదాంతం ప్రత్యేక పారిభాషిక పదాలుగా వాడింది. ఉపనిషత్తులు, వేదాంతం, ఇతర తత్త్వ శాస్త్ర గ్రంథాలు ఈ ప్రపంచం, జగత్తు పదాలను మన అంతర ప్రపంచం అర్థంలో వాడింది. బయటి భౌతిక ప్రపంచం ఉద్దేశంతో కాదు. ఇది రూఢముగా మన మనస్సులలో నాటుకోవాలి. 


అప్పుడు తత్త్వం, వేదాంతం మనకు ఉపయోగకరంగా మారతాయి. ఉపనిషత్ స్రష్టల అనుభవములు, వాటి నుంచి వెలువడిన వాక్కులు మనకు స్పష్టమౌతాయి.


ఇంక, ప్రపంచం మనలో మనసు జ్ఞానేంద్రియాల సంఘటిత కృషి వల్ల ఏర్పడుతుంది. ఈ ప్రపంచం నామ, రూపాత్మకము. గ్రహించిబడే బయటి భౌతిక ప్రపంచంలో వస్తువులన్నిటికీ జ్ఞానేంద్రియాల ద్వారా వాటి వాటి శక్తి రూపముల ఆధారంగా భాషనుపయోగించి వాటికి పేర్లు పెట్టుకున్నాము. మనసు మాధ్యమంలో, కన్ను దృశ్యములను, రూపములను; చెవి ధ్వనులను; ముక్కు వాసనలను; నాలుక రుచులను; చర్మము స్పర్శలను, వేడిమి, చల్లదనములను గ్రహిస్తాయి. ఇప్పటి మానసిక దృష్టిని బహిర్ముఖ దృష్టి అంటారు.


ఇలా వివిధ శక్తి రూపములలో గ్రహించబడిన విషయములు మనసుతో మన మస్తిష్కంలో ప్రపంచంగా జడ రూపంలో భద్రపరచ బడతాయి. ఈ విషయములు అదే సమయంలో కలిగించే అనుభవములను చిత్తం వాసనలుగా స్మృతిలో జడ రూపంలో భద్రపరుస్తుంది. 


మన శరీరము, మన సాంఘిక స్థితి, మనస్తత్వం, అహంకారం, అహంభావం రూపంలో మనలో మనసుచే భద్రపరచడానికి

ఉంటాయి. ఇవి కూడా మన ప్రపంచంలోని భాగాలు. వీటితో కలిసేది మన మమకారములు, ద్వేష, విద్వేషములు, అరిషడ్వర్గాలు. ఇవన్నీ మన వ్యక్తిత్వం రూపంలో ప్రపంచంలోనే భద్రపరచబడి ఉంటాయి. 


నేను ని శరీరం, మనస్తత్వంములతో అన్వయించుకోవడం వల్ల మన "నేను" ఇదిగా చెలామణీ అవుతుంది. దాని వల్ల కలిగే సుఖదుఃఖాలు, ఇతర హాయిలు, వ్యాదులు, వేదనలు ఈ ప్రపంచంలో భాగం.


ఈ ఆంతర ప్రపంచంలో జడ రూపంలో ఉన్న విషయములు మనసుచే వెలికి తీయబడతాయి. ఇప్పటి మానసిక దృష్టిని అంతర్ముఖ దృష్టి అంటారు. ఇలా కలిసిన మనసు విషయములే మన తలపులు. ఈ తలపులనే జగత్ అంటారు. ప్రపంచం జడం. జగత్ చేతనామయం. భావరూపం. 


జాగ్రత్ మానసిక దశలో బహిర్ముఖ దృష్టి, అంతర్ముఖ దృష్టి ఉంటాయి. బహిర్ముఖ దృష్టితో జ్ఞానేంద్రియాల ద్వారా బయటి భౌతిక ప్రపంచానికి, అంతర్ముఖ దృష్టి ద్వారా - స్వప్న మానసిక దశలో - లోని అంతర్ ప్రపంచానికి మనము ఒకే సారి అనుసంధానించబడి ఉంటాము. అంతఃకరణములు - మనో బుద్ధ్య హంకార చిత్తములు - పని చేస్తూ అన్ని శారీరక, మానసిక కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ఈ రెండు మానసిక దశలలోనూ ఈ కలాపాలు నిర్వహణను గమనిస్తూ అసలు నేను అయిన ఆత్మ లేక బ్రహ్మము ఉంటుంది. 


మనకు మరొక రెండు మానసిక దశలు ఉన్నాయి. అవి సుషుప్తి, జాగ్రత్ సుషుప్తి.

సుషుప్తి మానసిక దశయే గాఢనిద్ర స్థితి. 

ఈ దశలో మానసిక కార్యకలాపాలన్నీ ఆగిపోతాయి. దీనిని విశ్రాంత దృష్టి అంటారు. 

మానసిక కార్యకలాపాలు జరగకపోవడం వల్ల

మన సహజ స్థితి యైన శాంత స్థితి అనుభవానికి వస్తుంది. మనం ఎంతో నిరాకులంగా ఉంటాము. ప్రపంచంగాని, జగత్తు గాని దృష్టిలో ఉండవు. అందుకే గాఢ నిద్రలో అంత హాయి కలుగుతుంది. మానసిక కార్యకలాపాల శూన్యతే సుషుప్తి.


ఇదే స్థితిని మెళకువగా గమనించ గలిగితే

దానిని జాగ్రత్ సుషుప్తి దశ అంటారు. ప్రపంచం - బయటి భౌతిక, అంతర విషయ - 

ప్రపంచం తెలుస్తూ ఉంటుంది, కానీ నిరాకులత అనుభవింపబడుతూ ఉంటుంది. కావలిస్తే మానసిక కార్యకలాపాలు జరుగుతాయి. ఎటొచ్చీ నేను అన్వయం వ్యక్తిత్వంతో జరగదు కనుక ఆ కార్యకలాపాల వల్ల ఏ అనుభవములూ కలుగవు. వ్యక్తిత్వ స్పృహ కల జగత్ దృష్టిలోనికి రాదు. తలపులు కలుగవు. తలపులు కలుగవు కనుక అరిషడ్వర్గాలు విజృంభించవు. సంయమనము, శాంతులతో శారీరక, మానసిక కలాపాలు జరుగుతాయి.


ఈ చేతనాత్మకమైన జగత్ తలపుల రూపంలో కలిగి, మాయమౌతూ ఉంటుంది కనుక ఆది శంకరాచార్యులు:


బ్రహ్మ సత్ జగత్ మిథ్యా 

జీవో బ్రహ్మ ఏవ న అపరః 


అన్నారు. ఇక్కడ జగన్మిథ్యాత్వము బయటి భౌతిక ప్రపంచానికి కాదు. అంతర విషయ ప్రపంచానికి.


మిథ్యకి రెండు అర్థాలు ఉన్నాయి.


ఒకసారి ఉండి మరుక్షణం మాయమౌతుంది కనుక అది మిథ్యా.


అద్దంలోని ప్రతిబింబం ఎలా మిథ్యయో - భౌతిక రూపం లేనిది, మరొక వస్తువు యొక్క ప్రతిఫలనము మాత్రమే అయినది - అలా జగత్ కూడా ప్రతిఫలనము మాత్రమే. దానంతట దానికి ఉనికి లేదు.


ఇలా భావ రూపమైన ఆంతర ప్రపంచాన్ని శంకరులు మిథ్యా అన్నారు తప్ప, బయటి భౌతిక ప్రపంచాన్ని కాదు.


అలా విషయముల జడ రూపము ప్రపంచం. చేతనా రూపం - తలపుల రూపంలో - జగత్ లేదా జగత్తు.


ఇలా కనిపిస్తున్న జగత్తును గణించక దాన్ని ఉపేక్షించి, అది కలిగించే సుఖదుఃఖాలు, అరిషడ్వర్గ ప్రకోపనములు సంయమనముతో భరిస్తూ శాంతిని చెదరనీయక, విధ్యుక్త ధర్మములను నిర్వహిస్తూ జీవించడమే, జీవించగలగడమే ఆధ్యాత్మికతను మనం సరిగా అర్థం చేసుకున్నట్టు, ఆచరించినట్టు.


మిగతా పటాటోపాలు,ఆడంబరాలు, ఆశ్రమాలు, గురువులు, శిష్యరికాలు, అన్నీ ఏదో కాలక్షేపం బఠానీలు.


Rate this content
Log in

Similar telugu story from Classics