Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

మట్టితల్లి

మట్టితల్లి

2 mins
402


మట్టితల్లి (చిన్న కథ )


రంగడి ఊరు రామాపురం.

అతడు పెద్దగా చదువుకోలేదు. తండ్రి ఇచ్చిన రెండెకరాల పొలము, రెండు ఎద్దులు, రెండు ఆవులు, భార్య, ఇద్దరు పిల్లలు ఇదీ సంసారం.

రంగడికి మొక్కలంటే పిచ్చిప్రేమ.

ఒకసారి వానాకాలంలో తన ఊరికి, ప్రక్క ఊరికి మధ్య చెట్లు పెంచుదామనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా గునపం తీసికొని రహదారి వెంట గుంతలు తవ్వి వరుసగా మొక్కలు నాటి వచ్చాడు. రెండో రోజు వెళ్ళే సరికి మొక్కలని మేకలు తినేసాయి.

' ఇలా కాదు!'అనుకొని కొంచెం ముళ్ల కంపలు కొట్టుకొచ్చి మొక్కలకు అడ్డం పెట్టాడు. ఎద్దుల బండిలో నీటి బుంగలు పెట్టుకొని నీళ్లు పోసి వచ్చేవాడు.


"ఎందుకు మావా!నీకీ కష్టం!ఇప్పుడు దారి పొడుగునా చెట్లు పెంచక పొతే ఏమవుద్ది? ఇంట్లో ఉండరాదా!నీకు పొలంలో పని తక్కువగా ఉందా?"అంది భార్య మహాలక్ష్మి.


"అందరం అలా అనుకుంటే మట్టి తల్లికి వేడి పెరిగిపోదే!మొక్క నాటితే తల్లికి వేడి తగ్గుతుంది. రేడియోలో చెప్పారే!"అన్నాడు.


ఊళ్ళో వాళ్ళు రంగడిని చూసి హేళన చేసేవారు.


"పిచ్చి మొక్కల రంగయ్య "అని పేరు కూడా తగిలించారు.


పదేళ్లు గడిచాయి. రంగడు ఒక్కడే దాదాపు ముఫ్పై కిలోమీటర్ల మేర రహదారికి ఇరువైపులా మొక్కలు పెంచాడు. పెద్ద పెద్ద చెట్లు పెరిగి ప్రయాణీకులకు నీడనిస్తున్నాయి.


రంగడు చేసే పని ఆనోటా ఈనోటా పాకి ఆ జిల్లా కలెక్టరుకు తెలిసింది. కారు వేసుకొని కలెక్టరు ఆ ప్రాంతానికి వచ్చాడు. చెట్లను చూడంగానే అతడికి చాలా ఆహ్లాదం కలిగింది.

రంగడిని పిలిచి కలెక్టరు సన్మానం చేసాడు. ఆ సన్మానం చూడటానికి దాదాపు పది ఊళ్ళ జనం ఎగబడి వచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ 

'రామాపురానికి దగ్గర్లో ఉన్న మూడొందల ఎకరాల రాళ్ల భూమిని అడవి చెయ్యటానికి రంగడిని నియమిస్తున్నట్లు 'చెప్పాడు.

అందరూ చప్పట్లు కొట్టారు. మహాలక్ష్మి తన భర్తకు ఇంత గొప్ప సత్కారం జరిగినందుకు పొంగిపోయింది.

రెండో రోజు బండిలో విత్తనాలు, నీళ్ల బుంగలు, గడ్డపార, గునపం తీసికొని రంగడు రాళ్ల భూమికి చేరుకున్నాడు.


ఆశ్చర్యం!


అప్పటికే గ్రామస్తులు చాలా మంది రాళ్లను తొలిగిస్తూ, గుంతలు తీస్తూ కనిపించారు.


"రా!రా!రంగయ్యా!ఇప్పుడునీ వెంటే మేముకూడా చెట్లు పెంచటానికి వచ్చాము. మట్టి తల్లికి వేడి తగ్గించటానికి అందరం కలిసి పనిచేద్దాము "అంటూ సర్పంచ్ రాఘవయ్య రంగడి భుజంమీద చెయ్యి వేసాడు.


రంగడి ఆనందానికి హద్దులేదు. అతడి కనుల నుండి జలజలా ఆనందబాష్పాలు జారాయి. పుడమి తల్లి పులకరించింది.


---------------------------------


Rate this content
Log in

Similar telugu story from Classics