STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

వేకువ వెలుగు

వేకువ వెలుగు

4 mins
15

****************************************** ఉదయం ఎనిమిది గంటలు. వంటింట్లో పనిచేసుకుంటోంది భాను. ఫోన్ మోగింది. రమ్య.
 "ఇంత పొద్దున్నే ఏమిటా!"అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది భాను.

 "అమ్మకు బాగా లేదాంటీ!హాస్పిటల్ లో చేర్పించాము!"

 "ఏమైంది? "కంగారుగా అడిగింది భాను.

 "బీపీ పెరిగింది.. రెండు రోజులు హాస్పిటల్ లో ఉంచమన్నారు.."

 " మీ అంకుల్ ని ఆఫీసుకు పంపించి నేను ఒక గంటలో వస్తాను!"

 "మీరు మెల్లగానే రండి ఆంటీ!కంగారు ఏం లేదు!ఈ మధ్య ఒకటే ఆలోచించడం.. దిగులుపడటం అమ్మకు ఎక్కువైపోయింది.. ఏం చేస్తాము?తీరి కూర్చొని ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటే!"

 "సరే సరే!వర్రీ అవ్వకు!మెల్లగా సర్దుకుంటుందిలే!"అంటూ ఫోన్ పెట్టేసి పనిలో పడింది భాను.
 మూర్తి ఆఫీసుకు తయారవుతున్నాడు. మిగిలిన పనులు పూర్తి చేసుకొని మూర్తికి బాక్స్ ఇచ్చింది. పనిమనిషిని సాయంత్రంగా రమ్మని ఫోన్ చేసి,ఆటోలో హాస్పిటల్ కి బయలుదేరింది భాను. స్పెషల్ రూములో పడుకొని ఉంది మంజుల.పక్కనే రమ్య. భానుని చూడంగానే కాస్త రిలీఫ్ గా అనిపించింది రమ్యకు.

 " పొద్దున్నే కళ్ళు తిరుగుతున్నాయి అంటే తీసుకు వచ్చాను. రెండు రోజులు అబ్జర్వేషన్ అన్నారు డాక్టర్.

" "సరే సరే!నేను ఉంటానులే నువ్వు ఇంటికి వెళ్ళు!అన్ని చూసుకొని రా! మీ అంకుల్ కు అన్ని చేసి పెట్టాను. బెంగఏమీ లేదు!"

 "ఎక్కడిపని అక్కడ వదిలేసి వచ్చాను!పిల్లల్ని స్కూలుకు కూడా పంపలేదు."

 "సరే సరే నువ్వు వెళ్ళు!పిల్లలు కంగారు పడతారేమో!" కాసేపటికి రమ్య ఇంటికి వెళ్ళింది.
అక్కడున్న సోఫాలో కూర్చొని వెంట తెచ్చుకున్న పత్రిక తీసింది భాను.

 మంజుల,భాను చిన్నప్పటి నుండి స్నేహితురాళ్లు.ఒకే ఊర్లో ఉండటం వల్ల ఒకరికొకరు పలుకు తోడుగా ఉంటారు. ఈమధ్య మంజులకు ఏదో ఒక అనారోగ్యం చుట్టపెడుతోంది. కాసేపటికి కాసేపటికి కళ్ళు తెరిచింది మంజుల.

 "ఎలా ఉంది?"అంటూ చెయ్యి పట్టుకుంది భాను.

 " నువ్వు వచ్చావా!రమ్య ఇంటికి వెళ్ళిందా? " అడిగింది మంజుల.

 "వెళ్ళింది వెళ్ళింది!" " పిల్లల్ని,అల్లుడిని ఇబ్బంది పెడుతున్నాను.వాళ్లతో పాటుగా కూడా నిన్ను, మూర్తిని కూడా!" బలహీనంగా ఉంది మంజుల గొంతు.

 "అదేమీ లేదు!నువ్వు ఎక్కువగా ఆలోచించకు! పడుకో! బీపీ కదా తగ్గిపోతుంది!"మంజుల చెయ్యి మీద చెయ్యి వేసి నిమురుతూ కూర్చుంది భాను. కళ్ళు మూసుకొంది మంజుల. ఆమె కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. రెండు రోజులకు మంజులకు బీపీ తగ్గింది. బిల్లు కట్టి తల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చింది రమ్య.

 "మా ఇంటికి తీసుకెళ్తాను రమ్యా!కాస్త నేను మాట్లాడుతూ ఉంటే అమ్మ త్వరగా కోలుకుంటుంది. "

 "వద్దులెండి ఆంటీ!ఈ రెండు రోజులు మీరు ఇక్కడే ఉన్నారు.. తగ్గిపోయింది కదా!మా ఇంటికే తీసుకెళ్తాను! "

 "కాదు రమ్యా!ఒక వారం నా దగ్గర ఉంచుకుంటాను! ఈసారి కాదనకు!"

 మొహమాటంగా ఉంది రమ్యకు.'మరీ ఆంటీ చేత చేస్తుంది కదా అని ఆంటీని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు 'అని ఆమె ఉద్దేశ్యం. "

నేను ఇంటికే వెళ్తాను భానూ!"అంది మంజుల.

 "కాదు కాదు నాకేమీ ఇబ్బంది లేదు! నువ్వు నా దగ్గర ఉంటే కాస్త సంతోషంగా ఉంటుంది." అంటూ మంజులను, రమ్యను ఒప్పించి మంజులను తీసుకొని ఇంటికి వచ్చింది భాను.

 ఇంకా కూడా నీరసంగా ఉంది మంజులకు. రాగానే మంచం మీద వాలిపోయింది.

 "నువ్వు పడుకో!నేను కాస్త పని చేసుకుని వస్తా!"అంటూ వంటింట్లోకి వచ్చింది భాను.

 గిల్టీగా ఉంది మంజులకు. 'తనకు అనారోగ్యం మాటిమాటికి వస్తుంది.కూతురుకు అల్లుడికే కాదు భానుకు కూడా ఇబ్బంది కలుగుతోంది..ఒకేసారి ప్రాణం పోతే హాయి..బ్రతికి ఉండి తీసుకుంటూ తీసుకుంటూ అందరికీ భారంగా ఎంత కాలం భగవంతుడా!పరీక్షకు తట్టుకోలేని తండ్రీ!'అనుకుంటూ దుఃఖిస్తోంది మంజుల హృదయం. హార్లిక్స్ గ్లాస్ తీసుకుని గదిలోకి వచ్చిందిభాను.

"కాస్త హార్లిక్స్ తాగు! అంటూ మంజులను లేపింది. "నిన్ను పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను కదూ!"బేలగా అడిగింది మంజుల.

 "అదేమీ లేదు! నువ్వు ఏమీ ఆలోచించకు ముందు రెస్ట్ తీసుకో!"నవ్వుతూ మంజుల జుట్టు సవరించింది భాను.

 రెండు రోజులకు కాస్త లేచి తిరుగుతోంది మంజుల. ఇంక కూతురు ఇంటికి వెళ్తానంది మంజుల.

 "వెళ్దువుగాని!మనిద్దరం ఒక స్కూల్ కి వెళ్ళి వద్దాం! ఆ తర్వాత రమ్యను పిలుస్తాను!నిన్ను తీసుకెళ్తుంది!"

 " స్కూల్ ఏమిటి? "

 "అదే నేను ఈ మధ్య వెళ్లి పాఠాలు చెప్తున్నాను!ఆ స్కూలు.."

 "ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయడం ఎందుకే!"మంజుల గొంతులో కొంచెం ఆశ్చర్యం ధ్వనించింది.

 "డబ్బుల కోసం కాదులే!సేవా కార్యక్రమాంగా!నువ్వు వస్తావా చూడటానికి!"

 "ఏ స్కూల్ అది?చిన్న పిల్లలదా?"

 "చూద్దువు గాని!"అంటూ నవ్వింది భాను.

 "సరే!"అంటూ తయారైంది మంజుల..

 ఇద్దరూ కలిసి ఆటోలో స్కూలుకు వెళ్లారు. కాలనీకి దగ్గర్లోనే ఉందా స్కూలు.విశాలమైన భవనం.గేటు లోపల రకరకాల చెట్లు. పిల్లల కోసం ఆట స్థలం కూడా ఉంది. మూగ చెవిటి వారి స్కూలు అది. ఒక స్వచ్ఛందసంస్థ వాళ్ళు నడుపుతున్నారు. లోపల చిన్న చిన్న పిల్లల దగ్గర్నుంచి కొంచెం పెద్దపిల్లల వరకు ఉన్నారు. దాదాపు వంద మంది దాకా పిల్లలు ఉన్నారు.చిన్న పిల్లలకు అర్థమయ్యేట్టు చిత్రాలు చూపించి పాఠాలు చెబుతున్నారు టీచర్లు.స్కూల్ అంతా త్రిప్పి చూపించింది భాను.

 "చూసావు కదా!ఈ పిల్లలకు మాట రాదు.వీళ్లకు చదువుచెబుతున్నాము.వీళ్ళ ప్రాబ్లమ్స్ ముందు మన సమస్యలు చాలా చిన్నవి మంజూ!నీ కొడుకు వేరే మతానికి చెందిన అమ్మాయిని చేసుకున్నాడు.కొడుకు, కోడలు నీతో మాట్లాడటం లేదు. నీకు భర్త లేడు. నిన్ను చూసుకుంటాడు అనుకున్న కన్న కొడుకు పెళ్లి చేసుకుని వేరే వెళ్లిపోయాడు.నీ కూతురు దగ్గర వచ్చి ఉంటున్నావు.ఇదే సమస్య!నీకు దిగులుగా ఉంది.. ఆ దిగులు నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది!ఆలోచించు!ఈ పిల్లల్ని చూసావా!ఈ పిల్లల భవిష్యత్తు ఏమిటి? మనకు రేపటి గురించి వెతుక్కోనవసరం లేదు. రెండు సొంత ఇళ్ళు.. బ్యాంకు బ్యాలెన్స్... లక్షల్లో ఖర్చు పెట్టైనా కార్పొరేట్ హాస్పిటలులో చేర్పించి వైద్యం చేయించే కూతురు, అల్లుడూ,సంఘంలో పరువూ,మర్యాద అన్ని ఉన్నాయి. ఒక్కసారి ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? వీళ్ళ కంటే ఇంకా అధ్వాన్నం మైండ్ సరిగ్గా లేని పిల్లలు...మన చుట్టూ ఎంతోమంది జీవిస్తున్నారు..వాళ్లలో మనకంటే ఉన్నతంగా జీవించే వాళ్ళు,,మన లాంటి వాళ్ళు, మనకన్నా హీనంగా బ్రతుకుతున్న వాళ్ళు ఇలా రకరకాల మంది జీవిస్తున్నారు. సమస్యలు లేనిదేవరికి? మనుషుల గురించి వదిలెయ్!పశుపక్ష్యాదుల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? మరీ ఘోరం!పశువులు, పక్షులు రోజురోజుకు చచ్చిపోతున్నాయి.కొన్ని జాతులు మిగలకుండా నశించిపోతున్నాయికూడా!... ఇలా ఆలోచిస్తే మనమే చాలా హాయిగా బతుకుతున్నట్టు.. నిరంతరం యుద్ధాలతో కొట్టుకునే దేశంలో లేము..ఏ టెర్రరిస్టుల దగ్గరో భయంతో బ్రతకటం లేదు. ఆలోచించు మంజూ!మన ఆలోచనాస్థాయి ఎలా ఉందో? ఏ రకంగా మనల్ని మనం మనకున్న వివేకంతో దిద్దుకోవచ్చోఆలోచించు!... " ఆగింది భాను.

 చుట్టూ పరికించి చూస్తోంది మంజుల.చెట్ల మధ్యనుండి నీరెండ పడుతోంది. సూర్యుని వెలుగు పరిసరాలను ముంచెత్తుతోంది. ఆ వెలుగు మనసులోకి ప్రవహిస్తోంది. జడత్వాన్ని రూపుమాపే చైతన్యం వేకువతో పాటు వెల్లువలా పొంగుతోంది. మనసు పొరల్లో పేర్కొన్న సంకుచితత్వం కరిగిపోతోంది. విశ్వజనీయమైన మానవత్వపు ప్రకాశం అంతటా వ్యాపిస్తోంది.

 "నేను క్లాసులో చెప్పి వస్తాను! ఇంటికి వెళ్దాము!"అంది భాను.

 "నువ్వు క్లాసులో పాఠాలు చెప్పిరా!అంతదాకా ఇక్కడే కూర్చుంటాను!"అంది మంజుల.

 ఇప్పుడామెకు క్రొత్త బలం వచ్చినట్లుగా ఉంది. భాను వచ్చేదాకా అక్కడే చెట్లక్రింద మెల్లగా నడుస్తూ గడిపింది. హాయిగా... తేలిగ్గా ఉంది. కూతురు ఇంటికి వచ్చింది మంజుల. రాత్రికి కొడుకుకు ఫోన్ చేసింది. కోడలికి ఫోన్ ఇవ్వమని చెప్పి పలకరించి యోగక్షేమాలు కనుక్కొంది. వచ్చేవారం ఇంటికి వస్తామన్నారు కొడుకు కోడలు. మంజుల మనసు తేలికబడింది. సాయంత్రం రమ్య పిల్లలతోసరదాగా ఆడుకుంది. రాత్రి పడుకోబోయేముందు భానుకు ఫోన్ చేసింది మంజుల.

 "నేను కూడా ఆ స్కూలుకు వచ్చి పాఠాలు చెప్పనా?"

"గుడ్ గుడ్!మంచి నిర్ణయం!తప్పకుండా చెప్పొచ్చు!అయితే డబ్బులివ్వరు. సేవలాగా చెయ్యాలి!"

 నవ్వింది మంజుల. ఆ రోజు రాత్రి ఆమెకు సుఖంగా నిద్రపట్టింది. ఆ తర్వాత ఆమెకు బి. పీ. సమస్య రాలేదు. ***************************************** (సమాప్తం)


Rate this content
Log in

Similar telugu story from Inspirational