ప్రహ్లాదుని జైత్రయాత్ర
ప్రహ్లాదుని జైత్రయాత్ర
************************
హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు.పరమ భాగవతోత్తముడని,విష్ణు భక్తుడని మనకందరకు తెలిసిన విషయమే!అటువంటిప్రహ్లాదునికి ఒకసారి నరనారాయణులతో యుద్ధం వచ్చింది. ఆ విషయాలను మనకు శ్రీ వామన పురాణం తెలుపుతోంది.
ఇక కథలోకి వెళదామా!
బ్రహ్మమానస పుత్రుడు ధర్ముడు. అతడు గొప్ప తపశ్శాలి. ఆయన భార్య పేరు దాక్షాయణి. (పరమ శివుని భార్య సతీ దేవిని కూడా దాక్షాయణి అంటారు. ఇక్కడ మాత్రం ఆమె కాదు) ఆయనకు విష్ణ్వాంశ సంభూతులైన నలుగురు కుమారులు కలిగారు.
వారు వరుసగా హరి, కృష్ణుడు, నారాయణుడు, నరుడు అనే వాళ్ళు.
వారిలో హరి కృష్ణలిరువురు యోగాభ్యాసం చేసుకుంటూ మునులకు, యోగులకు యోగాభ్యాసం నేర్పిస్తూ లోక సంచారం చేస్తూ ఉండే వారు. ఇక నర నారాయణు లిరువురు జగత్కళ్యాణం కోసం బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు. వాళ్లిద్దరూ గొప్ప విలువిద్యా నైపుణ్యం కలవారు. ధనుర్బాణాలను ప్రక్కనే పెట్టుకొని తపస్సులను చేసుకుంటూ ఉండేవారు.
ఆ కాలంలో ప్రహ్లాదుడు యావత్భూభాగాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడి చిన్నాన్న యైన హిరణ్యాక్షుని కుమారుడైన అంధకాసురుని సహాయంతో రాజ్యపాలన చేస్తూ మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించాడు. ఒకసారి అతడికి జైత్రయాత్ర చెయ్యాలని బుద్ధి పుట్టింది.
తమ్ముడైన అంధకాసురునికి రాజ్యభారాన్ని ఒప్పచెప్పి, జైత్రయాత్రకు బయలుదేరి భూలోకంలోని రాజులలో చాలా మందిని గెలిచాడు.
అలా వెళ్తూ గంగానదీ తీరంలోని బదరికాశ్రమానికి వచ్చాడు. అక్కడి రమణీయమైన ప్రకృతి అందాలను చూస్తూ అక్కడే సైన్యంతో సహా విడిది చేశాడు.
అక్కడంతా తిరుగుతూ ఒక మహావృక్షం క్రింద తపస్సు చేసుకుంటున్న నరనారాయణులను చూశాడు. వాళ్ళు మునులలాగా జటాధారులై కనులు మూసుకొని ఉన్నారు.బక్క పలుచని శరీరాలు. చిన్న కౌపీనాలు మాత్రం ధరించి ఉన్నారు.అంతా బాగానే ఉంది!కానీ ప్రక్కనే ధనుర్బాణాలు ఎందుకున్నాయి?అదేమిటో తెలుసుకుందామని ప్రహ్లాదుడు తన శంఖాన్ని గట్టిగా పూరించాడు. ఆ ధ్వనికి కళ్ళు తెరిచి చూశారు నరనారాయణులు. వాళ్ళను సమీపించాడు ప్రహ్లాదుడు.
"మీరెవరు?ఇక్కడ దేని కోసం తపస్సు చేసుకుంటున్నారు? మీరు ఏ దేశానికైనా రాజులా? మీ ప్రక్కన ధనుర్బాణాలు ఉన్నాయేమిటి?" అని కుతూహలంగా ప్రశ్నించాడు.
"మా సంగతి సరే!నువ్వు ఎవరో చెప్పు ముందు!"అడిగాడు నరుడు.
అవమానంగా అనిపించింది ప్రహ్లాదునికి. 'భూలోకాన్నేలే చక్రవర్తి తను. ఈ బక్కపలుచటి మునులకు తన గురించి తెలియదు పాపం!'అనుకొని రాజసంగా
"నేను హిరణ్యకశిప చక్రవర్తి కుమారుడిని. ప్రహ్లాదుడను. విష్ణుమూర్తి ద్వారా వరములను పొందిన వాడను. ఇప్పుడు చెప్పండి మీరెవరో?" అని అడిగాడు.
"మేము నరనారాయణులం. మహా తపోనిధి యైన ధర్ముని కుమారులం. ఇంక తెలిసిందిగా! నీ దారిన నువ్వు వెళ్ళు!"అన్నాడు నరుడు.
కదల్లేదు ప్రహ్లాదుడు.
"మీ దగ్గర ధనుర్బాణాలు ఎందుకున్నాయి? తాపసులకు ఆయుధాలెందుకు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొని వెళ్తాను!"అన్నాడు. అతడికి ఈ మునుల వ్యవహారం చూస్తే పరిహాసంగా అనిపిస్తోంది.
"ఈ ఆశ్రమ ప్రాంతంలో మేమే కాదు!వేల మంది మునులు, ఋషులు, యోగులు ప్రశాంతంగా తపస్సులు చేసుకుంటున్నారు.వాళ్ళను రక్షించటం మా బాధ్యత. అందుకని ఆయుధాలను దగ్గర పెట్టుకున్నాం!కారణం తెలిసిందిగా!మా తపస్సుకు విఘ్నం కలిగించకుండా ఇంక నువ్వు వెళ్ళు!"
అన్నాడు నరుడు.
"ఏమిటి? మిమ్మల్ని మీరు రక్షించుకొని ఈ ఆశ్రమాన్ని కూడా రక్షిస్తారా? మిమ్మల్ని చూస్తే భలే తమాషాగా ఉంది. అసలు మీకు ఆయుధాలు పట్టుకోవటమన్నా తెలుసా?"
అన్నాడు సరదాగా ప్రహ్లాదుడు.
అతడి అహంకారం ఏ స్థాయిలో ఉందో మరి!
"మమ్మల్ని విసిగించకు! నీ వయసు చూస్తే చిన్న వాడిలాగా ఉన్నావు!నీకు మా గురించి తెలియదులా ఉంది. నీతో వాదన అనవసరం!నీ సమయాన్ని వృధా చేసుకోకు! వెళ్ళు!"అన్నాడు అసహనంగా నరుడు.
"అలా ఎలా వెళ్తాను? మీరేదో వీరులమంటూ ప్రగల్బగాలు పలుకుతుంటే తలవంచుకొని పోవటానికి నేనేమన్నా సామాన్యుడినా? భూలోకాన్నేలే చక్రవర్తిని. నేనేదో అహంకారంగా మాట్లాడుతున్నాననుకోవద్దు! నాకు తాపసులంటే భక్తిగౌరవాలున్నాయి. అటువంటి వాళ్ళను పూజిస్తాను కూడా!మిమ్మల్ని చూస్తే తాపసుల్లా కనిపిస్తూ వీరులలాగా బీరాలు పలుకుతున్నారు. ఏదీ? నాతో యుద్ధం చేస్తారా?మీ వీరత్వాన్ని పరీక్షస్తాను!.... కంగారు పడకండి!మీకెలాటి బాధా కలిగించను!మీ ప్రజ్ఞాపాటవాలు చూడటానికే! ఊరికే సరదాగా మాత్రమే సుమా!"అన్నాడు ప్రహ్లాదుడు నవ్వుతూ.
అతడి వైపు తీక్షణంగా చూశాడు నరుడు.
"మాతో నువ్వు సరదాగా యుద్ధం చేస్తావా? నువ్వు చేస్తానన్నామాకు తీరిక లేదు!నీతో మాటలేమిటి? వెళ్ళు వెళ్ళు!"
అన్నాడు విసుగ్గా.
కోపం వచ్చింది ప్రహ్లాదుడికి.
"మీరు పిరికితనంతో భయపడుతున్నారు. అలాంటప్పుడు ఈ ఆయుధాలెందుకు? ఏదో మునుల వేషంలో ఉన్న మాయవులా?మీ రెలాంటి వాళ్ళో తెలుసుకోవాలి!చేవ ఉంటే యుద్ధానికి రండి!లేదంటే మీ ఆయుధాలను నాకివ్వండి... పట్టుకుపోతాను!"అంటూ రెచ్చగొట్టాడతడు.
'ఇంక ఊరుకొనేది లేదను'కుంటూ నరనారాయణులు ఆయుధాలు పట్టుకొని లేచారు.
"పద! ఆశ్రమానికి దూరంగా వెళదాం!ఇక్కడ యుద్ధమంటే మిగిలిన తాపసులకు ఇబ్బందిగా ఉంటుంది."అన్నాడు నారాయణుడు.
అందరూ కలిసి అక్కడికి దూరంగా ఉన్న మైదానప్రాంతానికి చేరుకున్నారు.
ప్రహ్లాదుడు భయంకరంగా తన శంఖాన్ని పూరించాడు.
అతడి వెనుక ఉన్న కోట్ల మంది సైన్యాన్ని నరుడు ఎదుర్కొంటున్నాడు.
నారాయణుడు ధనుష్టంకారాన్ని చేసి ప్రహ్లాదునితో యుద్ధం చేయటం ప్రారంభించాడు.
అలా ప్రహ్లాదుడు సరదాగా మొదలు పెట్టిన యుద్ధం ఆగకుండా సాగుతోంది.వారాలు, నెలలు గడుస్తున్నాయి. ప్రహ్లాదుని సైన్యమంతా నాశనమయింది.ఒక్కడు కూడా మిగలలేదు. ప్రహ్లాదుడొక్కడే నిలబడి యుద్ధం చేస్తున్నాడు.
ఒక్క యోధుడితో ఇద్దరు తలపడటం ధర్మం కాదని నరుడు దూరంగా కూర్చుని తపస్సు చేసుకోవటం ప్రారంభించాడు.
ఎవరూ తగ్గటం లేదు.
నారాయణుడితో ప్రహ్లాదుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అలా వెయ్యి సంవత్సరాలు గడిచాయి. ప్రహ్లాదుడికి తన శక్తి తగ్గుతున్నట్లు అనిపించింది. కాసేపు యుద్ధాన్ని ఆపేశాడు. అతడికి చాలా అవమానంగా ఉంది. ఇదేమిటి? ఇలా జరిగింది?
దుఃఖంతో తన దైవమైన శ్రీహరిని ఆర్తిగా ప్రార్థించాడు.
శ్రీహరి అతని కనుల ముందు గోచరించాడు.
"స్వామీ!నేను నీ భక్తుడిని. నీ దాసుడను. నీ దాసులకు ఓటమి అన్నది ఉండదు కదా! ఏమిటీ మాయ తండ్రి? ఈ తాపసుల చేతిలో ఓడిపోయాను!నువ్వే నన్ను రక్షించు!"అని అతి దీనంగా వేడుకొన్నాడు.
దానికి పరమాత్మ నవ్వుతూ
"నాయనా ప్రహ్లాదా!అహంకారం అన్నది ఎవరికైనా పనికిరాదు. నా భక్తులెవరైనా సరే అహంకారంతో వ్యవహరిస్తే వాళ్లను శిక్షించి పాఠం నేర్పుతాను! నరణారాయణులను నువ్వు జయించలేవు. వాళ్ళు నా అంశతో జన్మించిన వాళ్ళు. నిర్మొహులు. విరాగులు. అటువంటి వాళ్ళ ముందు నీ అహంకారమేపాటిది? ఇప్పటికైనా వెళ్లి వాళ్ళను శరణువేడు!నీకు జ్ఞానబోధ చేస్తారు!"అని చెప్పాడు.
కళ్ళు తెరుచుకొన్నాయి ప్రహ్లాదునికి.
భక్తిగా శ్రీహరిని ఎన్నో విధాలుగా స్తోత్రం చేశాడు.
పరుగెత్తుకుంటూ వెళ్లి నరనారాయణుల పాదాలపై బడి క్షమాపణ వేడుకొన్నాడు.
ప్రహ్లాదుడిని లేవనెత్తి ఆశ్రమానికి తీసుకొని పోయారు నరనారాయణులు.
మరణించిన అతడి సైన్యాన్ని తిరిగి బ్రతికించారు.
ఆశ్రమంలో అతడికి నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని గురించి బోధించారు. ఎంతో కాలం వాళ్లకు శుశ్రూష చేస్తూ ఎన్నో విషయాలు తెలుసుకొన్నాడు ప్రహ్లాదుడు.
తర్వాత తన రాజ్యానికి వచ్చాడు ప్రహ్లాదుడు.
అంధకాసురుడు అన్నను చూచి కౌగలించుకొని రాజ్యన్ని తిరిగి పాలించమని కోరాడు.
ప్రహ్లాదుడు తమ్ముడి మాటను సున్నితంగా తిరస్కరించాడు.
"ఈ రాజ్యాలు, భోగాలు నా కెందుకు తమ్ముడూ!నువ్వు నా వారసులను కాపాడి వాళ్ళతో పాటు కలిసి పరిపాలన చెయ్యి!"అంటూ అన్నీ వదలి సర్వసంగపరిత్యాగుడై అరణ్యాలకు వెళ్లి, అక్కడ ఉన్న సాధకులకు జ్ఞానబోధ చేస్తూ శేష జీవితాన్ని గడపి చివరకు ఆ పరమాత్మ సన్నిధానానికి చేరుకున్నాడు.
స్వస్తి.
