STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

ప్రేమంటే ఇదేనా..

ప్రేమంటే ఇదేనా..

4 mins
3


(కథ)
***********************

సాయంత్రం నాలుగవుతోంది.

"ఈ రోజు నేను త్వరగా వెళ్ళాలి!"అంది మహిమ తన కొలిగ్ సాధనతో.

"ఊ.. ఊ..ఉడ్ బి గారు ఎదురుచూస్తూ ఉంటారనా!"నవ్వుతూ సాధన అడుగుతుంటే సిగ్గుపడింది మహిమ.

"ఎంగేజ్ మెంట్ దగ్గర పడింది కదా!కాస్త షాపింగ్ చెయ్యాలి!"అంది నవ్వుతూ.

"చెయ్యి!చెయ్యి!ఇంకా పెళ్ళికి బోలెడు పని... ఎప్పట్నించి లీవ్ పెడుతున్నావు?"

"పెళ్ళికి ఒక వారం ముందు పెడతాను. పెళ్లయ్యాక అక్కడ మూడు నిద్రలు. ఆ తర్వాత హనీమూన్. ఎంత లేదన్నా రెండు వారాలనుకో!"

"బెస్ట్ ఆఫ్ లక్!"అంది సాధన.

సాయంత్రం ఆఫీసు నుండి వస్తుంటే టపటపా ఎడమ కన్ను అదిరింది మహిమకు.
' ఆడపిల్లలకు ఎడమ కన్ను అదిరితే శుభం జరుగుతుందని చెప్పింది బామ్మ 'అనుకుంది మహిమ.

దాదాపు రెండేళ్లుగా సంబంధాలు చూస్తుంటే చివరకు ఈ సంబంధం కుదిరింది. వరుడు యశ్వంత్. అతడి తండ్రి శ్రీనివాస్.మంచి పేరున్న చార్టెడ్ అకౌటెంట్.యశ్వంత్ కూడా సి. యె. చదివి తండ్రి దగ్గరే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడి తమ్ముడు జయంత్ ఇంజనీరింగ్ చదివి చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి గిరిజ గృహిణి.

ఆఫీసు నుండి బయటికి వచ్చింది మహిమ.
రోడ్డు ప్రక్కన నిల్చుని ఉన్నాడు యశ్వంత్.
పరుగులాంటి నడకతో అతడిని చేరుకుందామె.
"వెళ్దామా!"అంటూ బైక్ స్టార్ట్ చేశాడతడు.
ఎక్కి కూర్చుందామె.
మళ్ళీ ఎడమ కన్ను అదురుతోంది.
ఇద్దరూ కలిసి బట్టల షాపుకు వచ్చింది.
సరదాగా మాట్లాడుకొంటూ ఎంగేజ్ మెంట్ కు కావాల్సిన బట్టలు కొనుక్కొనే సరికి ఎనిమిది దాటింది.

అబిడ్స్ తాజ్ కు వెళ్ళారిద్దరు.
ఒక పదిరోజుల క్రితం పరిచయమైనా ఇద్దరిలో ఆత్మీయానురాగాలు వేగంగా పెనవేసుకొంటున్నాయి. ఎడతెగని కబుర్లు ఇద్దరి మధ్య ప్రవాహంలో సాగుతున్నాయి.
టైమ్ చూసుకొంది మహిమ.

"ఆమ్మో!లేటవుతోంది!ఇంట్లో వాళ్ళేమనుకొంటారో?" 
అంది కంగారుగా.

"మన పెళ్లయ్యేదాకానే!ఆ తర్వాత వాళ్ళు అనుకోవటాలు మనం కంగారు పడటాలు ఉండవు!"అంటూ నవ్వాడతడు.

మహిమను ఇంటి దగ్గర దింపేసి వెళ్ళాడు యశ్వంత్.
ఆ రాత్రి ఎడమ కన్ను అదురుతూనే ఉంది మహిమకు.మధ్య రాత్రిలో తలనొప్పిగా అనిపించింది.కాసేపటికి లేచి తలనొప్పి మాత్ర వేసుకొని పడుకుంది.

శనివారం ఎంగేజ్ మెంట్. ముందురోజు రాత్రి మళ్ళీ తలనొప్పి మొదలైంది.

"సైట్ వచ్చిందేమో!కంప్యూటర్ తో అస్తమానం పని చెయ్యటం.ఎంగేజ్ మెంట్ అయ్యాక డాక్టర్ కు చూపించుకో!"అంది బామ్మ అనసూయ.

"వెళ్తానులే బామ్మా!అదే అయ్యుంటుంది."
బామ్మకు బదులిచ్చి పనిలో పడింది మహిమ.

ఎంగేజ్ మెంట్ కు దగ్గరి బంధువులు మాత్రం వచ్చారు.
ఆ రోజు కూడా పొద్దున్నుంచి మహిమకు ఎడమ కన్ను లాగుతూ ఉంది.
తలపోటు...కళ్ళు కొంచెం మసగ మసగగా కనిపించటం మొదలయ్యాయి.
యశ్వంత్ సమక్షంలో కాసేపు నొప్పి మర్చిపోయింది.
మొత్తానికి ప్రదానం వేడుక చక్కగా జరిగింది.
అందరూ వెళ్లారు.

"తలనొప్పి తగ్గటం లేదమ్మా! మసగ్గా కనిపిస్తోంది." అంది మహిమ తల్లి రాధతో.
కంగారు పడింది రాధ.

తండ్రి రామకృష్ణ గదిలోకి వచ్చాడు.

"పద!డాక్టర్ దగ్గరికి వెళ్దాం!"అంటూ కూతుర్ని లేవదీసి కంటి ఆస్పత్రికి తీసికొని వచ్చాడతడు.
ఒక గంట సేపు రకరకాల టెస్టులు చేశాడు దాక్టర్.

 "దీన్ని 'Transient ischeamic attacks' ( ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్స్) అంటారు.మెదడు నుండి కంటికి జరిగే రక్త సరఫరాకు తాత్కాలికంగా అవరోధం ఏర్పడుతుంది. అందువల్ల చూపు మందగిస్తుంది. తలనొప్పి తగ్గటానికి వారం రోజులు పడుతుంది. చూపు రావటానికి నెల పైన పడుతుంది. రెగ్యులర్ గా మందులు వాడితే మళ్ళీ చూపు మామూలుకు వస్తుంది." వివరించాడు డాక్టర్.

"ఈ ప్రాబ్లమ్ ఎప్పటికీ ఉంటుందా డాక్టర్?" భయంగా అడిగింది మహిమ.

"లేదు లేదు!అంత ప్రాబ్లెమ్ రాదు!ఈ నెలరోజులు మందులు వాడండి!తగ్గక పోతే న్యూరాలజిస్ట్ ను సంప్రదిద్దాము!డోంట్ వర్రీ!అనవసరంగా ఎక్కువగా ఆలోచించ వద్దు!" అంటూ ధైర్యం చెప్పాడు డాక్టర్.

ఇంటి కొచ్చారిద్దరు.

'పెళ్లి వాళ్లకేం చెప్పాలి? కన్ను మసగ్గా కనిపిస్తుందంటే వాళ్ళేమనుకుంటారు? అసలు పెళ్లినే కాన్సిల్ చేసుకుంటారా? " రామకృష్ణ పరిపరివిధాలుగా ఆందోళన పడుతున్నాడు.

"ఏం చేద్దాం?" భర్తని అడిగింది రాధ.

"రేపు వాళ్లకు చెప్తాను!ఏదయితే అదవుతుంది..." రామకృష్ణ గొంతు వణుకుతోంది.

వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంది అనసూయ. అందరి మనస్సులో దిగులు.. భయం.

మందు వేసుకుని పడుకొంది మహిమ.
' ఇప్పుడెలాగా? ఇప్పుడెలాగా?' మనసులో భయం.

ఫోన్ మోగింది. యశ్వంత్.

'ఏమని చెబుతుంది? ఎవరైనా ఏ లోపము లేని వధువు కావాలనుకొంటారు. కంటి చూపు రావటానికి నెల పడుతుందో లేక తగ్గకుండా ఇలాగే చూపు పోతే...' ఊహ మరీ భయంకరంగా ఉంది.ఒళ్ళు జలదరించింది మహిమకు.

మళ్ళీ ఫోన్ మోగింది. లిఫ్ట్ చెయ్యకుండా ఆలాగే పడుకుందామె. కాసేపుటికి ఫోన్ స్విచ్చిడాఫ్ చేసింది.

రెండోరోజు పదింటికి శ్రీనివాస్ కు ఫోన్ చేసి ఇంటి కెళ్లాడు రామకృష్ణ.

ఆ సమయానికి యశ్వంత్ ఇంట్లో లేడు.
కుశల ప్రశ్నలు వేశాడు శ్రీనివాస్. కాఫీ తెచ్చి ఇచ్చింది గిరిజ.

"ఇప్పుడేమీ వద్దమ్మా!"అంటూ మెల్లగా విషయాన్ని వాళ్ళతో చెప్పాడు రామకృష్ణ.
"ఒక నెల రోజుల్లో చూపు సరిగ్గా వస్తుందన్నారు డాక్టర్. ఇంతకు ముందెప్పుడు ఇలా రాలేదు. ఏదో పని ఎక్కువగా ఉన్నప్పుడు తలనొప్పి అనేది అంతే!..." శ్రీనివాస్ ముఖం వైపు చూశాడు రామకృష్ణ.

ఆలోచిస్తున్నానాడు శ్రీనివాస్.
గిరిజ కూడా మాట్లాడకుండా కూర్చుంది.
వాళ్ళు మాత్రం ఏమని చెప్తారు? యశ్వంత్ ఏమంటాడు? ఒకవేళ ప్రాబ్లెమ్ తగ్గక పోతే!... కళ్ళు రెండూ కనిపించక పోతే!.. చూస్తూ చూస్తూ గుడ్డి పిల్లని కొడుకుకు చేసుకొని వాడి భవిష్యత్తు నాశనం చేయటం... అన్యాయంగా...' 
శ్రీనివాస్ దంపతులు ఆలోచిస్తున్నారని అర్ధం అయింది రామకృష్ణకు
.
మహిమ మెడికల్ రిపోర్స్ కవర్ని టీపాయ్ మీద పెట్టాడు.

"వస్తాను బావగారూ!"అంటూ లేచాడతడు.
మౌనంగా అతడికి వీడ్కోలు పలికారు శ్రీనివాస్ దంపతులు.

"నెల రోజులకు తగ్గుతుందో లేదో!ఇంకా నయం!ఆ మూడు ముళ్ళు పడలేదు. మనవాడికి వేరే పిల్లను చూద్దాం!లేకపోతే లక్షణమైన పిల్లవాడికి అన్యాయం చేసిన వాళ్లమవుతాం!ఏమంటారు?" నిక్కచ్చిగా చెప్పింది గిరిజ.
ఏమంటాడు? మాట్లాడకుండా ఉన్నాడు శ్రీనివాస్.
కాసేపటికి యశ్వంత్ వచ్చాడు.
తల్లిదండ్రులు చెప్పిన విషయం విన్నాడు. టీపాయ్ మీద ఉన్న మెడికల్ రిపోర్ట్సును చూశాడు. వెంటనే బయటికి వచ్చాడతడు.

బైక్ స్టార్ట్ చేయబోతున్న కొడుకు దగ్గరికి వచ్చింది గిరిజ.

"ఇప్పుడు నువ్వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడేదేముంది? అన్నీ ఆలోచించుకొని చెబుతున్నాము... ఇది జీవితకాలపు సమస్య అయిందనుకో!ఎవరికి నష్టం? కోరి కోరి తద్దినాన్ని నెత్తి మీద పెట్టుకున్నట్లు... అర్థం అవుతోందా?" 
అంది గిరిజ కంగారుగా.

"ఆ ప్రాబ్లమ్ నాకే వచ్చుంటే! ఆలోచించు!"అంటూ ఇంకో మాటకు ఆస్కారమివ్వకుండా వెళ్లిపోయాడు యశ్వంత్.

నోటమాటరాక ఆలాగే చూస్తూ ఉంది గిరిజ.

బెల్లు మోగితే తలుపు తీసింది రాధ.

"మహిమకెలా ఉందత్తయ్యా!"అంటూ లోపలికి వచ్చాడు యశ్వంత్.
అయోమయంగా చూసింది రాధ.
అసలు అతడు వస్తాడని ఊహించలేదామె.
తనే మహిమ గదిలోకి వెళ్ళాడు.
తల మీద చెయ్యి పట్టుకొని పడుకొని ఉంది మహిమ.

"ఎలా ఉందిప్పుడు?" మృదువుగా యశ్వంత్ కంఠం వినిపించింది.

చటుక్కున తల తిప్పింది. మసక మసకగా యశ్వంత్ కనిపిస్తున్నాడు.

"నొప్పి తగ్గలేదా!"అంటూ ఆమె ప్రక్కన కూర్చున్నాడు.

ఏమీ మాట్లాడలేదు మహిమ.

"నిన్న రాత్రే నాకెందుకు చెప్పలేదు? నేను కూడా డాక్టర్ దగ్గరికి వచ్చేవాడిని కదా!"

"నాకీ ప్రాబ్లమ్ నెలరోజులు పడుతుందట... అప్పటి దాకా.."
మాటల కోసం తడుముకొంటోంది మహిమ.

"వర్రీ పడకు!నేను డాక్టర్ తో మాట్లాడుతాను!నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ న్యూరాలజిస్ట్. కాంటాక్ట్ చేస్తాను. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. చాలా వాటికి మందులతో తగ్గిపోతుంది."అంటూ అతడు ధైర్యం చెబుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మహిమకు.

తలుపు దగ్గర నిలబడి వింటున్నారు రామకృష్ణ రాధలు.

"పెళ్లి ముహూర్తానికి ఇంకా నెలా పదిహేను రోజులుంది. నువ్వేమీ టెన్షన్ పడకు!నీ షాపింగ్ కూడా నేనే చేస్తాను! డోంట్ వర్రీ! అసలేమీ ఆలోచించకు!టేక్ రెస్ట్!"అంటూ చెబుతున్న యశ్వంత్ దగ్గరికి వచ్చాడు రామకృష్ణ.
అతడి కళ్ళల్లో నీళ్లు.
"మీరు కూడా ఏమిటి మామయ్యగారూ! దిగులు పడితే ఎలా? చిన్న ప్రాబ్లమ్.. తగ్గి పోతుంది!"అంటున్న యశ్వంత్ తలమీద చెయ్యి వేశాడు రామకృష్ణ.

'తమ పరిచయం ఎంతని? పట్టుమని పదిహేను రోజులు. ఇంతలో ఎంత దగ్గరితనం!ఇదేనా వివాహానికి అర్ధం. నీకు నేను.. నాకు నీవు.. ఇదేనా ప్రేమంటే!' అనుకుంటూ యశ్వంత్ చేతిని గట్టిగా పట్టుకొని తన హృదయం మీద పెట్టుకొంది మహిమ.//

(సమాప్తం )


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Classics