దగ్గరైన దైవత్వం
దగ్గరైన దైవత్వం
స్వీయరచన అని హామీ ఇస్తున్నాను.
దగ్గరైన దైవత్వం
(కథ )
టి. వి. యెల్. గాయత్రి.
******************
సాయంత్రం నాలుగింటికి విజయవాడ చేరింది ట్రైను.
కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాడు బిల్డర్ గోపాల్.
" బాగున్నావా గోపాల్!"అంటూ పలకరించాను.
"సార్! సార్!" అంటూ నా చేతిలో బ్యాగు తీసుకున్నాడు గోపాల్.
"మీరు కాసేపు రెస్ట్ తీసుకున్నాక వెళదామా సార్!" అన్నాడు గోపాల్.
" లేదు!లేదు!ముందు సైట్ చూసి వద్దాం! అక్కడికే పోనీ!" అన్నాను.
" సరే సార్!"అంటూ కార్ స్టార్ట్ చేశాడు గోపాల్.
రామవరప్పాడు వైపు వెళుతోంది కారు.
" పదేళ్లుగా ఆ సైట్ కొనడానికి ఎవరూ సాహసం చేయటం లేదు సార్!ముసలాయన దయ్యమై ఉంటాడని అందరూ అనుకుంటున్నారు!.. ఆ గేట్లోకి అడుగు పెట్టాలంటేనే మనుషులు భయపడుతున్నారు సార్!...అందుకని ఆ ఇంటికి అందరూ వదిలేశారు!... "
" ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు అనే నమ్మకాలు ఉన్నాయా?... అదేదో అపోహ!....అంతే!... ఆ సైట్ గురించి విన్నాను!..అందుకే ఇంట్రెస్ట్ అనిపించింది!.. "
నవ్వుతూ గోపాల్ వైపు చూశాను.
గోపాల్ చేతికి రెండు మూడు రంగుల దారాలు కట్టి ఉన్నాయి. మెడలో సన్నటి రుద్రాక్షల దండ.దానికి ఏదో దేవుడి బిళ్ల.కారులో వేలాడుతున్న ఆంజనేయస్వామి బొమ్మ.
"సార్! మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఉన్నట్టే దయ్యాలు కూడా ఉంటాయి సార్!... ఎందుకొచ్చింది?..మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోద్ది!.."
నాకు నవ్వొచ్చింది. చాలామంది దేవుడిని భయం వల్ల నమ్ముతారు. పూజ చేయకపోతే ఏమన్నా చెడు జరుగుతుందేమోనని భయం.
నేను హేతువాదిని.చాలా కాలం నుంచి ఈ మూఢవిశ్వాసాల మీద పోరాటం చేస్తూనే ఉన్నాను. దేవుడనీ,మతమనీ,దుష్ట గ్రహాలనీ ప్రజలను పనిగట్టుకొని తప్పుదోవ పట్టించే వాళ్ళను దుయ్యబడుతూ,సంఘంలో చైతన్యం తేవడానికి నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను.ఆ విషయం గోపాలుకు కూడా తెలుసు.
ఈ మధ్య పేపర్లో ఒక వార్త వచ్చింది.'దయ్యాలకొంప 'అని హెడ్డింగ్.
'ఏమిటా!' అని చదివాను.
విజయవాడ రామవరప్పాడులో ఉన్న వెయ్యి గజాల స్థలంలో ఇల్లు ఒకటి ఉంది. దాని యజమాని చింతపిక్కల నీలకంఠం. చనిపోయి పదేళ్లయింది. ఆ ఇంటిని అమ్ముదామని ఆయన వారసులు పదేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఆ ఇంటిని కొనటానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు.భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అందులో వెయ్యి గజాలు అంటే మాటలా!.. ఎవ్వరూ వదిలిపెట్టరు!..అయితే చింత పిక్కల నీలయ్యే దయ్యమై తిరుగుతున్నాడని,ఆ ఇంట్లోకి ఎవరిని రానివ్వడని ప్రచారం బాగా జరుగుతోంది.
ఆ ఇంటిని కొనుక్కుందామని వెళ్లిన వాళ్లని దయ్యం భయపెడుతుందట!చెట్ల మీద చెయ్యి వేసిన వాళ్లకి చెయ్యి పడిపోయిందట!ఒక వ్యాపారవేత్త ధైర్యం చేసి కొని ఆ తర్వాత అంతులేని జబ్బుతో మంచంలో పడ్డాడట!ఇవన్నీ ఆ ఇంటి గురించిన కథలు.
విజయవాడలో నేను కొంతకాలం ఉద్యోగం చేశాను. నాకు మిత్రులు కొందరు అక్కడే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇంటి గురించి, చింతపిక్కల నీలయ్య గురించి వాకబు చేశాను.
చిన్న వయసులోనే ప్రకాశం జిల్లా కనిగిరి నుండి వచ్చిన నీలకంఠం విజయవాడలో స్టీలు గిన్నెల హోల్ సేల్ వ్యాపారం చేశాడు. ఆయనకు ఊళ్ళో నాలుగు ఇళ్లు ఉన్నాయి. మూడిళ్ళు వన్ టౌన్ లో ఉన్నాయి. మూడూ కూడా ఇరుకు గదుల ఇండ్లు. విజయవాడ వ్యాపార కూడలి.ఇరుకుగా ఉండే వన్ టౌన్ వీధుల్లో ఇల్లు మీద ఇల్లు ఉంటుంది.అన్నీ అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు ! డబ్బు బాగా సంపాదించిన నీలకంఠం వయసు పెరిగి 'నీలయ్య 'అయ్యాడు.తన అరవయ్యో ఏట నీలయ్య రామవరప్పాడులో స్థలంకొని, మంచి ఇల్లు, చుట్టూ తోట పెంచుకున్నాడు. తొంభైనాలుగేళ్లకు ఆ ఇంట్లోనే చనిపోయాడు. వారసులు ఆస్తులు పంచుకొన్నారు. ఇప్పుడు ఆయన కొడుకులు కూడా పెద్దవాళ్ళయ్యారు. మనవళ్ల రాజ్యం. ఇల్లు అమ్ముదామంటే వాళ్ళవల్ల కావటం లేదు. ఇదీ ఆ ఇంటి కథ.
అది విన్న తర్వాత నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఏమైనా ఈ ఇల్లు కొనాలి. అందులో దయ్యం లేదని నిరూపించాలి.
నేను విజయవాడలో ఉన్నప్పటి నుండి గోపాల్ నాకు పరిచయస్తుడు . అప్పట్లో తాపీ మేస్త్రి గా ఉండి,మా ఇంటికి వచ్చి చిన్న చిన్న రిపేర్లు చేసి వెళ్లేవాడు ఇప్పుడు బిల్డర్ గా మంచి పేరు తెచ్చుకొని స్థిరపడ్డాడు.
రామవరప్పాడు చేరింది కారు.పాత కాలం నాటి ఇల్లు.కాంపౌండ్ వాల్ గట్టిగానే ఉంది. ఎదురింట్లో నుండి వాచ్ మాన్ వచ్చి గేటు తీశాడు.
లోపలికి వెళ్ళాం. వరుసగా పెద్ద పెద్ద చెట్లు.నాలుగు ఐదు పెద్ద మామిడి చెట్లు.రెండు వేప చెట్లు,...పనస చెట్టు.. పెద్ద సపోటా చెట్టు.. గుల్ మొహరం.. పారిజాతం...అబ్బో!చాలానే ఉన్నాయి!..ఈశాన్యంలో బావి ఒకటి ఉంది.. వాననీళ్లు బావిలోకి మళ్ళించే సౌకర్యం ఉంది.
వీటన్నింటి మధ్య గంభీరంగా ఉందా ఇల్లు.
బయట అంతా తిరిగాం.దాదాపు నాలుగు ఇంకుడు గుంతలు ఉన్నాయి. బావిలో సగానికి నీళ్లు ఉన్నాయి.
చుట్టూ చెట్లు...సాయంత్రం కావడంతో పక్షులు చెట్ల మీద గోలగోలగా అరుస్తున్నాయి.. ఇంటి లోపలికి వెళ్ళాం.. పెద్ద హాలు,నాలుగు బెడ్ రూములు, వంటగది, పూజగది... గదులన్నీ విశాలంగా ఉన్నాయి. పైన రెండు గదులు., హాలు, వంటగది, పైన కూడా
ఖాళీ స్థలం చాలానే ఉంది. వరండాలో చెక్క ఉయ్యాల. ఖాళీ స్థలంలో చాలా మొక్కలు పెంచారనటానికి సాక్ష్యంగా కుండీలు కొన్ని పడి ఉన్నాయి.తీగ మొక్కల్ని అల్లించే ఇనుప కడ్డీలు ఆర్చీ లాగా ఉన్నాయి.గతకాలపు వైభవానికి చిహ్నంగా ఉందా ఇల్లు.
ఇంటికి కరెంటు లేదు ఎవరూ లేకపోవడంతో కనెక్షన్ తీసేశారు.
"వెళదామా సార్!"అన్నాడు గోపాల్.
అతడికి భయం వేస్తున్నట్లుంది.చుట్టూ భయం భయంగా చూస్తున్నాడు.
"నేను రాత్రికి ఇక్కడే ఉంటాను!నువ్వు వెళ్ళు!"
అన్నాను.
"వద్దు సార్!....రాత్రిపూట ఇక్కడ ఎందుకు?..శుభ్రంగా కూడా లేదు!.. కరెంటు లేదు!.. ఎలా పడుకుంటారు?.. అయినా ఇల్లు చూసేసాం కదా!కావాలంటే రేపు మళ్ళీ వద్దాం!.."
"వాచ్ మాన్ ని పిలు!..కాస్త శుభ్రం చేయించు!" అన్నాను స్థిరంగా.
గోపాల్ వెళ్లాడు.
వాచ్ మాన్ ఇంకా ఇద్దరు మనుషులను తీసుకొని వచ్చాడు.
నాకోసం ఒక గది శుభ్రం చేసి పెట్టారు. ఒక ప్లాస్టిక్ కుర్చీ,టేబుల్ కూడా తెచ్చారు. లాంతరుతో సహా కావలసిన సామాను వచ్చింది. భోజనం తెచ్చిపెట్టి గోపాల్ వెళ్ళిపోయాడు. అంతా బాగానే ఉంది.
పక్షికూతలు వింటూ బయటికి వచ్చాను.ఎండుటాకుల మీద నా అడుగుల చప్పుడు తప్ప ఇంకో చప్పుడు లేదు....చెట్ల మధ్య నడుస్తున్నాను... గంభీరమైన వాతావరణం ... చెట్లమీద పక్షులు కూడా నిశ్శబ్దంగా ఉన్నాయి..... ఆలోచిస్తూ ఒక చెట్టు మీద చెయ్యి వేసాను... కరెంట్ షాకు కొట్టినట్టు అయింది!... జివ్వుమంది చెయ్యి!....చెయ్యి కాలినట్లు మంట పెడుతోంది... ఒక్కసారి వెన్నులోంచి వణుకు...నా వెనుక ఎండుటాకుల మీద అడుగుల సవ్వడి....వెనక్కి తిరిగాను... ఎవరూ లేరు... నేల మీద ఆకులు గలగలా ఎగిరాయి ..భయం వేస్తోంది.. ఆలోచిస్తున్నాను.. కొద్దికొద్దిగా అర్థం అవుతోంది. సందేహం లేదు. దయ్యం ఉంది.
ఇంటిలోపలికి వస్తున్నాను... నా వెనుక ఎవరో వస్తున్న ఫీలింగ్!....మళ్లీ చూశాను!.... ఎవరూ లేరు!.....ధైర్యంగా ఉండాలి!...నేను చాలా ధైర్యవంతుడిని.. అయినా కూడా మనసులో ఏదో శంక....బింకంగా మనసుకు సర్ది చెప్పుకున్నాను.
గదిలోకి వచ్చాను. లాంతరు టేబుల్ మీద పెట్టాను.నన్ను దయ్యం గమనిస్తోందని తెలుసు... దయ్యాన్ని ప్రసన్నం చేసుకోవాలి!... అంతకంటే మార్గం లేదు..బ్యాగులో నుంచి డైరీ తీసి వ్రాయడం మొదలుపెట్టాను.
'ఇల్లు బాగుంది..చెట్లు ఇంకా బాగున్నాయి!కొనుక్కుందామని అనుకుంటున్నాను!'
నా వెనుక ఎవరో ఉన్నట్లు అనిపించింది..తిరిగి చూశాను..
ఊహు!.. గదిలో నేను మాత్రమే..కిటికీ తలుపు తెరుచుకుంది.వెళ్ళి తలుపు మూసి గడియ పెట్టాను.
బల్ల కొంచెం ఊగింది. మంచం మీద ఉన్న నా బట్టల బ్యాగ్ కదిలింది.
నీలయ్య దయ్యం స్పందిస్తోంది.
ఆలోచించాను..
'వాన నీళ్ళని బావిలోకి మళ్లించటం చాలా మంచి ఆలోచన! అభినందనలు!.అని వ్రాశాను.
ఎవరో నా వెనకాల సున్నితంగా నవ్వినట్లు అనిపించింది.
'ఇంట్లో ఉన్న చెట్లను చాలా శ్రద్దగా పెంచారు!"
మళ్ళీ డైరీలో వ్రాసాను.
లాంతరు వెలుగు కాస్త ఎక్కువయింది.
నా చెయ్యి మంట కాస్త తగ్గినట్లు అనిపించింది.
నాకు తెలీకుండానే మెల్లగా ధైర్యం వస్తోంది. దయ్యం అంత ప్రమాదకారి కాదు.
"నాక్కూడా చెట్లు అంటే ఇష్టం!.. నేను 'మియావాకి ' అడవుల పెంపకం మీద ప్రచారం చేస్తుంటాను!"అని వ్రాశాను.
ఈసారి నన్ను ఎవరో స్పృశించినట్లు అనిపించింది.
నాకు ఒక విషయం అర్థమైంది. నీలయ్య అనే ఈ ఇంటి యజమాని చాలా ప్రేమగా చెట్లు పెంచి ఇల్లు కట్టాడు.అతడు ఆ ఇంటిని,చెట్లను ప్రాణంగా ప్రేమించాడు. ఆ ఇల్లు ఎవరైనా కొనుక్కుంటే ముందు చెట్లు కొట్టేస్తారు..ఆ స్థలంలో నచ్చినట్లుగా బిల్డింగు కట్టేస్తారు.నీలయ్య ప్రాణం చెట్ల మీద ఉంది!... ఆ పచ్చని చెట్లు కొట్టేస్తే ఆ చెట్ల మీద ఉన్న పక్షులన్నీ గూడు చెదిరి నిరాశ్రయమై తలో దిక్కుకూ వెళ్లిపోతాయి.
ఒక రకంగా చెప్పాలంటే నీలయ్య దయ్యమై తిరుగుతూ ఆ చెట్లను కాపాడుకుంటున్నాడు. చెట్లను ప్రేమించే వాళ్ళని మాత్రం నీలయ్య ఏమీ చేయడు.
ఇప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది.
నేను లాంతరు తీసుకొని మేడ మీదకి వచ్చాను.
ఉయ్యాల మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నాను. నేను ఊపకుండానే ఉయ్యాల కదిలి ఊగసాగింది.
అంటే నీలయ్య నాతో స్నేహం కోసం ప్రయత్నిస్తున్నాడు...
"నాకు చెట్లను కొట్టేసే ఉద్దేశం లేదు!"అన్నాను మెల్లగా.
నా గొంతు నాకే బొంగురుగా వినిపించింది.
సమాధానంగా ఉయ్యాల ఇంకొంచెం వేగంగా తిరిగింది.
" ఇల్లు కొని నేను ఛారిటీకి ఇస్తాను!ఇంటి స్వరూపం ఏమీ మార్చను!సరేనా!.. "
అన్నాను.
ఈసారి ఉయ్యాల గొలుసులను పట్టుకొని ఎవరో ఊపినట్లుగా గలగలమన్నాయి.
నా హేతువాద సిద్ధాంతం ఎక్కడికి పోయిందో తెలియదు..
నేను' మియావాకి 'అడవుల పెంపకం గురించి చెప్పడం మొదలుపెట్టాను.
నా పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్లుగా అనిపించింది.' దయ్యం నన్నేమీ చేయదు!'అన్న ధైర్యం పూర్తిగా నాలో ప్రవేశించింది.
కాసేపటికి నేను ఉయ్యాల మీదే పడుకున్నాను. మెల్లగా ఉయ్యాల ఓకే స్థాయిలో తిరుగుతోంది.నాకు కొద్దిగా నిశ్చింత అనిపించింది.నాకు మెల్లగా నిద్ర పట్టింది.
పొద్దున్నే గోపాలు, వాచ్ మాన్ కలిసి వచ్చారు.
నన్ను చూడంగానే "ఎలా ఉన్నారు సారూ!"అంటూ ఒక అంగలో దగ్గరికి వచ్చాడు గోపాల్.
"దయ్యం దెబ్బకు పోతాననుకున్నావా?"అంటూ నవ్వాను.
నిన్న రాత్రి అనుభవంతో నా కళ్ళు తెరుచుకున్నాయి.
మంచి ఎక్కడ ఉంటే అదే దేవుడు.
సత్యం ధర్మం ఏదైతే అదే దేవుడు.
ఏ ప్రాణికైనా హాని చెయ్యకుండా జీవనం గడుపుతాడో అతడే దేవుడు.
దాని పేరు ఏదైనా కావచ్చు... ఆ శక్తి తరంగాలు ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి! దయ్యమైనా..... దేవుడైనా...
మంచి హృదయం ఉన్న మనుషులే దేవుళ్లు. వాళ్ళ విల్ పవర్ అపారమైంది.
నా దృష్టిలో నీలయ్య ఆత్మే దేవుడు.
చెట్లకు హాని కలగకూడదని అతని కోరికే శక్తితరంగమై ఆ ప్రాంతాన్ని కాపాడుతూ ఉంది.
రెండు నెలల తర్వాత ఇల్లు నా చేతికి వచ్చింది.ఇంటిని పునరుద్ధరించటం మొదలు పెట్టాను.మేడమీద అంతా ఒక క్రమపద్దతిలో చెట్లు పెరగటానికి ఏర్పాట్లు చేశాను..కింద ఇంకా కొత్త క్రీపర్స్, మొక్కలు కూడా వేయించాను.నా ఛారిటీ వాళ్ళతో మాట్లాడాను. విరాళాలు సేకరించి కొంత, నా సొంత డబ్బు కొంత పెట్టుకొని,మూగ చెవిటి వాళ్ల కోసం స్కూలు ఓపెన్ చేసి ఛారిటీకి బిల్డింగ్ ఇచ్చాను.
ఇప్పుడు ఆ చెట్ల మధ్య పిల్లలు కేరింతల కొడుతూ ఆడుకుంటున్నారు. ఇక్కడికి నేను వచ్చి నెల రోజులు దాటిపోయింది.అన్ని పనులు చేసేసరికి టైం పట్టింది.
రేపు రాజమండ్రి వెళ్ళిపోవాలి!..
నా భార్య వైశాలికి నా మీద కోపంగాఉంది.
"విజయవాడలోనే ఉండిపోతారా ఏమిటి?"అంటూ విసుక్కుంటూ రోజూ ఫోన్ చేస్తోంది.
రేపే ప్రయాణం.
ఆ రాత్రి భోజనం చేసి గదిలోకి వచ్చాను.
కంప్యూటర్లో డబ్బుల లెక్కలు చూసుకున్నాను.అంతా టాలీ చేశాను.కాస్త అలసటగా ఉంది.బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాను.కిటికీ తలుపు తీశాను.
మంచి పారిజాత పూవుల పరిమళం. చల్లటి గాలి.
నాకు పరిచితమయిన అలికిడి... ట్యూబ్ లైట్ వెలుగు ఒక్కసారి పెరిగింది. కిటికీ రెక్క చిన్నగా ఊగింది..ఒక స్నేహపూరితమైన సవ్వడి..గదిలోకి వచ్చిన అనుభూతి.
నా ఆత్మీయుడు నీలయ్య నా వెనుక నిల్చున్నట్లు,నా భుజం మీద ప్రేమగా తడుతున్నట్లు అనుభూతి....నా జీవితంలో అపురూపమైన క్షణాలవి....దైవత్వాన్ని అనుభూతి పొందుతూ ఆ తన్మయత్వంలో మునిగిపోయాను.//
(సమాప్తం )
