చదువు - సంస్కారం
చదువు - సంస్కారం
తన్మయి ఆరోతరగతి చదువుతోంది. బాగా తెలివైన పిల్ల. తండ్రి కళ్యాణ్. తల్లి మహతి.తల్లిదండ్రులు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు.ఇద్దరూ ఐ.ఐ.టి. ల్లో చదివి వచ్చిన వాళ్ళే. ఇద్దరికీ చదువంటే ప్రాణం. పిల్లకు చిన్నప్పటి నుండి ఎలాంటి కోచింగ్ ఇవ్వాలి? ఏ ఇన్స్టిట్యూషన్ అయితే మంచి ర్యాంక్ వస్తుంది? అనుకుంటూ ఆలోచిస్తుంటారు భార్యాభర్తలు. కళ్యాణ్ తల్లి సుమిత్ర ఇంట్లో ఉండి పాపను చూసుకుంటూ ఉంటుంది. పాపకు కూడా చదువుపట్ల చాలా శ్రద్ధ ఎక్కువ.
తన్మయి స్కూల్లో ఎవరి ప్రక్కన కూర్చోవాలి? ఎవరితో మాట్లాడాలి? అన్న విషయం కూడా మహతి కూతురుకి ఫీడ్ చేస్తూ ఉంటుంది.
"కాస్త తక్కువ ర్యాంక్ వచ్చే వాళ్ళతో స్నేహం చెయ్యకూడదు!మొద్దుమొహాలతో కనుక ఆటలాడుతూ ఉంటే క్రమక్రమంగా వాళ్ళలాగే మనం కూడా పనికిమాలిన వాళ్ళలాగా అయిపోతాము!నీతో మాట్లాడే పిల్లలు చదువులో ఎలా ఉన్నారో గమనించుకో! నీ కంటే తెలివైనవాళ్ళతో స్నేహం వల్ల నీకు బోలెడు విషయాలు తెలుస్తాయి!టైమ్ వృధా చేసుకోకుండా ఎలా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలో ఆలోచించు!"అంటూ బోధ చేస్తూ ఉంటుంది.
చిన్నపిల్ల తన్మయి తల్లి చెప్పినట్లే వింటూ మంచి ర్యాంక్ తెచ్చుకోవటానికి ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉండేది.
సుమిత్రకు ఇదంతా కాస్త చిత్రంగా ఉండేది. తమ పిల్లలకు భర్త కానీ తను కానీ ఇలా చెప్పినట్లు గుర్తు లేదు. దురలవాట్లు చేసుకోవద్దని, జాగ్రత్తగా ఉండమనీ, క్యారెక్టర్ ముఖ్యమనీ చెప్పినట్లు గుర్తు. ఈ తరం వాళ్లకు ఇంకా విపరీతపు భయాలు ఎక్కువగా ఉన్నాయనుకునేది సుమిత్ర.
ఆ మాట కోడలితో ఒక్కోసారి చెప్పేది కూడా!
"నిజమే అత్తయ్యా!డ్రగ్స్ రాజ్యమేలుతున్న ఈ కాలంలో పిల్లలకు తగుమాత్రం జాగ్రత్తలు చెప్పకపోతే ఎలాగా!పైగా కాంపిటీటివ్ యుగం!ర్యాంక్ తక్కువ వస్తే ఉద్యోగాలు రావటం చాలా కష్టం!ఇప్పటినుండి పునాది గట్టిగా వేసుకుంటూ పోవాలి!"
అని మహతి చెప్పినా కూడా సుమిత్రకు అసంతృప్తిగా ఉండేది.
'అచ్చుల్లో లక్క పోసి లక్క బొమ్మలు చేసేవాళ్ళు చిన్నప్పుడు. అలా పిల్లల్ని తాము అనుకున్న లక్కబొమ్మల్లాగా పెంచితే పిల్లలకు సహజంగా ఉండవలసిన హృదయస్పందన ఉంటుందా? వాళ్ళు షో కేసుల్లో బొమ్మల్లాగా తయారవరూ!వాళ్ళల్లో బుద్ధివికాసం ఎలా ఉంటుంది? కేవలం చదువులు, ర్యాంకులు చూసుకుంటూ, తర్వాత భుక్తి కోసం మంచి ఉద్యోగం సంపాదించటం అయితే వస్తుంది కానీ జీవితానికి ముఖ్యమైన విలువల సంగతేమిటి? సంఘమర్యాదలు ఎలా తెలుస్తాయి? 'అలా ఆలోచిస్తూ సుమిత్ర తనలో తాను మథనపడసాగింది.
ఆ రోజు తన్మయి స్కూలు నుండి ఇంటికి వచ్చింది. స్కూల్లో జరిగిన విషయాలన్నీ బామ్మతో పూసగుచ్చినట్లు చెప్పటం తన్మయికి అలవాటు. సుమిత్ర కూడా పాప పక్కన కూర్చుని ఉత్సాహంగా వింటూ ఉంటుంది.
"ఈ రోజు మా క్లాసుమేట్ ఆర్య ఆడుకుంటూ గ్రౌండ్ లో పడిపోయాడు బామ్మా!"అంది తన్మయి.
"అయ్యో!ఎవరైనా వెళ్లి లేపారా మరి!"
"ఊహు!వాడే లేచాడు!కానీ వాడి కాలికి దెబ్బతగిలింది.వాడి వాటర్ బాటిల్ లో నీళ్లు అయిపోయాయి..మా దగ్గరికి వచ్చి మంచినీళ్లు అడిగాడు..."
"నీ బాటిల్ లో నీళ్లు ఇచ్చావా మరి?"అడిగింది సుమిత్ర.
తల అడ్డంగా ఊపింది తన్మయి.
"ఎందుకని? నీ బాటిల్ లో నీళ్లు అయిపోయాయా?"
"లేదు బామ్మా!వాడు సరిగ్గా చదవడు.. వాడితో మేము మాట్లాడము. వాడు మా ఫ్రెండ్ కాదు కదా!ఎలా వాటర్ ఇస్తాను?"
నిర్ఘాంతపోయింది సుమిత్ర.
'ఇదేమిటీ వివక్ష? తన చిన్నప్పుడు గ్రామాల్లో అస్పృశ్యత ఉండేది. తర్వాత తర్వాత ఆ దురాచారం పోయింది. కానీ ఈ చదువు దురాచారం ఏమిటి? పిల్లకు ఇప్పుడే చెప్పాలి!లేకపోతే ఇలాగే పెరిగితే తన్మయి చాలా నష్టపోతుంది.'
పాపను పక్కన కూర్చోబెట్టుకుంది సుమిత్ర.
"నువ్వు చేసింది ఎంత తప్పో తెలుసా బంగారూ!చదువు, డబ్బు, పెద్ద ఉద్యోగం ఇవన్నీ ఉన్న వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అనుకోవటం చాలా తప్పు!నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఒక ఇల్లు కట్టాలనుకున్నావనుకో!నువ్వే కట్టుకోగలవా? చెప్పు!"
తల అడ్డంగా ఊపింది తన్మయి.
"ఇల్లు కట్టాలంటే ఎవరెవరు కావాలి?"
ఆలోచించింది తన్మయి.
"కార్పెంటర్.... తాపీమేస్త్రి... ఇంకా.. కూలీవాళ్ళు... ఇటుకలు మోసేవాళ్ళు... ఇంకా.."
"ఆర్కిటెక్టర్.. ఐరన్ పని చేసేవాళ్ళు.. చాలా మంది కావాలి అవునా!"
"అవును బామ్మా!"
"నీకు గౌన్లు కావాలంటే ఎవరు కావాలి?"
"టైలర్ కావాలి"
చటుక్కున చెప్పింది తన్మయి.
"టైలర్ మాత్రమేనా? నీది కాటన్ గౌను అయితే పత్తి పండించే వాళ్ళ దగ్గర్నుండి లెక్క వెయ్యి!"
తన్మయి ఆలోచించింది.
"ఆమ్మో!చాలా మంది కావాలి బామ్మా!"
నవ్వింది సుమిత్ర.
"వీళ్ళందరూ బాగా చదువుకొన్న వాళ్లేనా? ఎవరేజ్ గా చదివిన వాళ్ళున్నారా? అసలు వీళ్ళు ఏమి చదివి ఇన్ని పనులు చేస్తున్నారు? "
బామ్మ ప్రశ్నకు జవాబు ఏమిటో తెలియలేదు తన్మయికి. మౌనంగా ఉంది.
"మన చుట్టుపక్కల మనకు సహాయం చేసేవాళ్ళుఎంతో మంది ఉన్నారు. ఒకరికొకరం అంటూ ఈ సొసైటీలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నాము కదా! నువ్వు పెద్దయ్యాక మంచి ఉద్యోగం చేసి, నీ ప్రతిభతో దేశానికి ఉపయోగపడతావు. అలాగే నీ క్లాసుమేటు ఆర్య కూడా ఏదో ఒక పని చేసి సంఘానికి ఉపయోగపడతాడు. ఇందులో నువ్వు ఎక్కువా అతడు తక్కువ అనుకోవటానికి ఏముంది చెప్పు! "
తన్మయి బామ్మ చెప్పింది శ్రద్దగా విన్నది.
ఆరోజంతా ఆలోచిస్తూనే ఉంది.అయినా చిన్నపిల్ల మనసులో ఇంకా సందేహాలు మిగిలి ఉన్నాయి.
సుమిత్ర రోజూ పాపతో మాట్లాడుతూ పాపకు వివేకానందుడి జీవితచరిత్రతో మొదలుపెట్టి కొంతమంది సంఘసంస్కర్తల గురించి కథలు కథలుగా చెప్పటం మొదలు పెట్టింది.
అయితే తన్మయికి ఒక కష్టం వచ్చిపడింది. తల్లి చెప్పే బోధలు వినాలా? లేకపోతే బామ్మ చెప్పింది వినాలా? అని సందేహం! ఎవరు తీరుస్తారు?
సెలవరోజు వచ్చింది.
సుమిత్ర పూజ చేసుకొంటోంది. మహతి వంట చేసుకొంటోంది.
తన్మయి తండ్రి దగ్గరికి వచ్చింది.
"చెప్పు నాన్నా!నేను తక్కువ ర్యాంక్ వచ్చేవాళ్ళతో స్నేహంగా ఉండాలా? వద్దా? నాకేమీ తోచటం లేదు!"
"విషయం ఏమిటి?" అడిగాడు కళ్యాణ్.
బామ్మ చెప్పే కథల గురించి చెప్పింది. అమ్మ చెప్పే జాగ్రత్తల గురించి కూడా చెప్పింది.
"నేను ఎలా ఉండాలి నాన్నా!నాకు అర్థం కావటంలేదు?"
కళ్యాణ్ కూతురు వైపు చూశాడు.
ఆలోచించాడు.
పాప చదువుకోవటంతో పాటు సంఘంలో ఎలా మెలగాలో కూడా తెలుసుకోవాలి. మహతి చెప్పే జాగ్రత్తలు తన్మయిని అయోమయానికి గురిచేస్తున్నాయి. అలాగే అమ్మ చెప్పే కథలు ఆచరించాటానికి సాధ్యం కావేమోనని సందేహం వస్తూ ఉంది. చిన్నపిల్లకు ఎలా అర్థం అవుతుంది? అందరిలో ఉంటూనే, అందరితో స్నేహం చేస్తూనే పాప తన లక్ష్యాన్ని అందుకోవటానికి తగిన ప్రయత్నాలు చెయ్యాలి.
"నీకు రామాయణం తెలుసుకదా!"అడిగాడు కళ్యాణ్.
"కార్టూన్ రామాయణం చూశాను కదా నాన్నా!"
"అందులో రాముడి ఫ్రెండ్స్ ఎవరెవరు? చెప్పు!"
తన్మయి ఒక నిమిషం ఆలోచించింది.
"సుగ్రీవుడు.."
"ఇంకా ఆలోచించు!"
"విభీషణుడు.."
"ఇంకా!"
"ఇంకెవ్వరూ లేరు నాన్నా!"
" ఉన్నాడు.
నువ్వు మర్చిపోయావు!"
తన్మయి ఆలోచిస్తూ ఉంది.
"ఇంకెవ్వరూ లేరుకదా నాన్నా!"
"గుహుడు ఉన్నాడు కదా!" అందించాడు కళ్యాణ్.
"అవును!అవును!నేను మర్చిపోయాను!..."ఒక్క ఎగురు ఎగిరింది తన్మయి.
"రాముడు బాగా చదువుకొన్నాడు. మంచి వీరుడు. పైగా రాజకుమారుడు. మరి అటువంటి గొప్పవాడి స్నేహితులు ఎలాటి వాళ్ళు? గుహుడు అస్సలు చదువు సంధ్య లేనివాడు. సుగ్రీవుడు వానరజాతికి చెందిన వాడు. విభీషణుడు సరే సరి! శత్రువుకే తమ్ముడు. వీళ్ళతో స్నేహం చేయటం వలన రాముడి చదువు కానీ, వీరత్వం కానీ తగ్గిపోయాయా? చెప్పు!"
"లేదు!లేదు! రాముడు ఎప్పటికీ వీరుడేకదా!"
పాపను దగ్గరికి తీసికొన్నాడు కళ్యాణ్.
"అలాగే మనం కూడా అందరితో స్నేహంగా ఉండాలి!ఎవరినీ కించపరచకూడదు!ఎవరికైనా అవసరం వస్తే సహాయం చెయ్యాలి!అయితే స్నేహం చేస్తున్నాము కదా అని మన క్యారెక్టరుని మార్చుకోకూడదు!వాళ్ళలాగా బద్ధకంగా అయిపోకూడదు!మన చదువు మనం చదువుకుంటూ ఉండాలి!"
కాసేపయ్యాక తన్మయికి తను స్కూల్లో ఎలా మసలుకోవాలో అర్థం అయింది.
తన్మయికున్న సందేహాలు పటాపంచలయిపోయాయి. ఆ చిన్నపిల్ల మనసుకు సంతోషం వేసింది. తను మంచిగా చదువుకుంటూ కూడా ఎలా స్నేహితులతో మెలగాలో తెలిసింది. ఒకవేళ సమస్య ఏమన్నా వస్తే చూసుకోవటానికి తల్లి, తండ్రి, బామ్మ ఉన్నారు.
ఓ పదిరోజుల తర్వాత.
ఆర్ట్ క్లాసు.
బ్యాగ్ లో వెదుక్కుంటూ "అయ్యో!అయ్యో!"అంటూ అరిచాడు వినీత్ అనే పిల్లవాడు.
"ఏమైందిరా!"ప్రక్కనున్న ధ్రువ అడిగాడు.
"నా కలర్ పెన్సిల్ బాక్స్... ఇంట్లో మర్చిపోయా!"అంటూ బిక్కమొహం వేశాడు వినీత
"మనమేమన్న సరిగ్గా గీస్తామా పెడతామా? లైట్ తీసికో!" ఆర్య తేలిగ్గా చెప్పాడు.
"టీచర్ తిడుతుంది కదరా!" ఇంకా దిగులుగానే ఉంది వినీత్ గొంతు.
ఆర్య, వినీత్, ధ్రువ అందరూ వెనుకబెంచి స్టూడెంట్లే.తక్కువ ర్యాంక్ తెచ్చుకొనేవాళ్ళే!
తన సీట్ లోంచి లేచింది తన్మయి. తన్మయి దగ్గర ఎప్పుడూ రెండు కలర్ పెన్సిల్ బాక్సులు ఉంటాయి. ఒకటి తీసి వినీత్ కు ఇచ్చింది.
"క్లాసు అయ్యాక ఇద్దువుకానీ!"
స్నేహంగా నవ్వాడు వినీత్.
(సమాప్తం)
