STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

చిగురంత ఆశ

చిగురంత ఆశ

3 mins
267

చిగురంత ఆశ.  ******************************* భీకరంగా యుద్ధం జరుగుతోంది. పాకిస్తాన్ వైపునుంచి మిస్సయిల్ దాడులు జరుగుతున్నాయి.అయితే మన సుదర్శన చక్రాలు వాటిని ఆకాశంలోనే నిర్వీర్యం చేస్తున్నాయి..బోర్డరులో అంతటా భయానక వాతావరణం.జమ్మూ దగ్గర యారి సెక్టరులో చిన్న ఊరు అది. భీభత్సంగా ఉంది. అంత ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితుల్లో కూడా కెమెరా పట్టుకొని ఎలాగోలా యుద్ధాన్ని వీడియోలో బంధిస్తున్నాడు సురేష్. అతడి వెంట గోపి కూడా ఉన్నాడు. ఇద్దరూ దూరం నుండే వీడియోలు తీస్తున్నారు. అప్పటికే ప్రజలను బంకర్లలోకి పంపించేశారు సైనికులు. సైనికులు నిద్రాహారాలు మాని తిరుగుతున్నారు. అక్కడక్కడా తమలాంటి వాళ్ళు వీడియోలు తీస్తున్నారు.
 "కాస్త టీ దొరికితే బాగుండు!''అన్నాడు గోపి.
 "ఇప్పుడా?" నవ్వాడు సురేష్.

 అక్కడినుండి కాస్త దూరంగా వచ్చారిద్దరూ. దాదాపు ఒక నాలుగు కిలోమీటర్లు వచ్చారు. ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. వీళ్ళను చూశారు సైనికులు.

 "ఎందుకు సార్!మాతో పాటు మీరు కూడా రాత్రంతా ఇక్కడే ఉన్నారు. ఇలాగే చల్తా హై!రెస్ట్ తీసికొని మళ్ళీ రండి!"అన్నాడొక జవాను.

 అతడి మాటలను విని ఇంకొంచెం దూరం వచ్చారు. అక్కడ ఒక పదిమంది బంకర్లలోకి వెళ్తూ ఉన్నారు.
 వీళ్ళను చూసి

 "రండి! మాతోబాటు!"అంటూ పిలిచారు.

 బైకును వదిలి వాళ్ళ వెంట బంకర్లోకి వెళ్ళారిద్దరు. అక్కడ పిల్లలు, పెద్దవాళ్ళు ఇరుకు ఇరుకుగా కూర్చుని ఉన్నారు. ఒక అమ్మాయి అందరికీ టీ తెచ్చి ఇస్తోంది. ప్రాణంలేచొచ్చింది సురేషుకు గోపీకి. తాగుతూ వాళ్ళతో మాటలను కలిపారు.

 "యుద్ధం ఎప్పుడు తగ్గుతుందో ఏమన్నా ఖబర్ ఉందా?" ఒక వృద్ధుడు ప్రశ్నించాడు.

 "ఇప్పుడే మొదలయింది కదా!ఇంకా టైమ్ పట్టొచ్చు!"చెప్పాడు సురేష్.

 "ఎన్ని రోజులయినా ఫర్వాలేదు. ఉగ్రవాదం లేకుండా చెయ్యాలి!"అన్నాడా వృద్ధుడు.

 "ఎక్కువ రోజులు యుద్ధం కొనసాగితే అందరికీ ప్రాబ్లమ్ కదా!" సురేష్
 మాటకు నవ్వాడా వృద్ధుడు

 "మాకు ఇక్కడ నిరంతరం యుద్ధమే ఉంటుంది.ఉగ్రవాదులతోఎప్పుడూ కష్టాలు పడుతూ ఉంటాము. ఈ రెండు రోజులనుంచి మిస్సయిల్సు పడుతున్నాయి. అంతకు ముందు మనశ్శాంతి ఎక్కడుంది? ఉగ్రవాదానికి ముగింపు వస్తుందేమోనని ఆశ అంతే!"

 "కానీ ఇక్కడి వాళ్ళే కొందరు ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారు. దాని ఫలితమే ఈ యుద్ధం..."

 "మా వాళ్ళు ఇష్టముండి చేయటం లేదు సాబ్!మా వాళ్ళ నిస్సహాయత చేయిస్తోంది. మంచిరోజులు రావాలని, మా జీవితాలు బాగుపడాలని, మా పిల్లాపాపలు పూటకింత ముద్ద తినాలని మాకు కూడా ఉంటుంది సాబ్!"

పెద్దాయన కళ్లల్లో నీళ్లు. ఒక పదహారేళ్ళ కుర్రవాడు పెద్దాయన చెయ్యి పట్టుకున్నాడు. అక్కడి వాళ్ళ మొహాల్లో దిగులు ఉంది. భవిష్యత్తు పట్ల ఆశ ఉంది. నిశ్చింతగా బ్రతకాలనే కోరిక ఉంది.

 "మాకు ప్రాణాలు పోతాయనే భయం లేదు సాబ్!ఎన్నో ఏళ్లుగా అన్నీ పోగొట్టుకుంటూ ఉన్న వాళ్ళం!... ఇటు చూడండి!ఆ పిల్ల గర్భవతి. నొప్పులంటోంది. ఆస్పత్రికి తీసికెళ్లే వీలులేదు. ఈ పరిస్థితిలో ఎవరం ఏం చేస్తాం!..."

 "ఏమీకాదు!...ఏమీ కాదు!..." అస్పష్టంగా పలికాడు సురేష్.గోపి నిరామయంగా చూస్తున్నాడు.

 "పద!"అంటూ గోపీని తీసికొని బయటకు వచ్చాడు.

 బైక్ మీద సైనికుల దగ్గరికి వచ్చారు.

 "ఏమిటి?" అడిగాడొక జవాను.

 "బంకరులో ఒక అమ్మాయి గర్భవతి. సహాయం కావాలి. కనీసం ఒక నర్సు దొరుకుతుందా?"

 "పంపిస్తాను!"అంటూ మెరుపు వేగంతో కదిలాడు జవాను.
 ఒక గంటకు ఒక నర్సును పట్టుకొని వచ్చాడు.
 అందరూ కలిసి బంకరులోకి వెళ్లారు.

 సురేష్, గోపీ మళ్ళీ తమ పనిలో తాము పడ్డారు. మళ్ళీ సాయంత్రం అవుతుంటే బంకరులోకి వచ్చారు. అక్కడ జనం మధ్య ఒళ్ళో పసిగుడ్డుతో బాలింతరాలు కూర్చుని ఉంది.

 "అంతా క్షేమమే కదా!"అన్నాడు సురేష్ అక్కడి వాళ్ళను చూస్తూ.

 పిల్లలు ఆ చిన్న బాబును చూస్తూ ఉన్నారు. ఒక అమ్మాయి ఇద్దరికీ కొంచెం కొంచెం పంచదార పెట్టింది.

 "బాబు పుట్టిన ఖుషీనా!" గోపి అడిగితే నవ్వారు అక్కడివాళ్ళు.

 వెళ్లి బాబును చూశాడు సురేష్ తువ్వాలులో చుట్టి ఉన్న ఎర్రటి బిడ్డ. కనులు మూసికొని ఉన్నాడు.

 "ఇంతకీ పేరేమిటి?"అడిగాడు.

 "మంగళ్ నాయక్ అనుకుంటున్నాము."చెప్పాడు బిడ్డ తండ్రి.

 విస్మయంగా చూశాడు సురేష్.

 ఎందుకంటే వాళ్ళు ముస్లింలు.

 "అతడు ఈ పరిస్థితుల్లో పరుగెత్తుకుంటూ వెళ్లి నర్సును తీసికొని వచ్చాడు. అందుకని. నా బిడ్డను నేను సైన్యంలో చేర్పిస్తా!అందరికీ వీడిని చూస్తే ధైర్యం వస్తుంది..!" చెప్పాడు బిడ్డ తండ్రి.

 కెమెరా పట్టుకొని బయలుదేరుతూ అక్కడి వాళ్ళను చూశాడు సురేష్. వాళ్ళకళ్ళల్లో కొద్దిగా సంతోషం కనిపిస్తోంది. అప్పుడే పుట్టిన బిడ్డ వాళ్ళ ఆశలకు ప్రతిరూపం. రేప్పొద్దున ఆ ప్రాంతంలో శాంతి నెలకొంటుంది. పిల్లలు హాయిగా చదువుకుంటారు. ఆ కాశ్మీరసీమలో జనం సుఖంగా జీవిస్తారు. అందుకు సాక్ష్యం అదిగో అప్పుడే పుట్టిన ఒక చిన్న బిడ్డ. రేపు అనేది ఆశతోనే మొదలవుతుంది. ఆ ఆశను చూచిన ఆనందంలో అక్కడి నుండి కదిలారు సురేష్, గోపిలనబడే వీడియో గ్రాఫర్లు.

 (సమాప్తం)


Rate this content
Log in

Similar telugu story from Inspirational