STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

సబల

సబల

5 mins
254

సబల (కథ )
 వంగినడు!" ఉలిక్కిపడింది వింధ్య.
భర్త వైపు చూసింది. అతడు సిగరెట్ తాగుతూ వింధ్యను చూస్తున్నాడు.
 విజయవాడలో అప్సర థియేటర్లో ఉన్నారు ఇద్దరూ. పెళ్లయ్యాక మొదటిసారి భార్యను సినిమాకు తీసుకొచ్చాడు మణికంఠ.

 " నువ్వు నిటారుగా నడిస్తే నాకంటే పొడుగ్గా కనిపిస్తావు!.. కొంచెం వంగినడు!" మళ్లీ చెప్పాడు.
 అతడి గొంతులో కాఠిన్యం.అయోమయంగా చూసింది. తల దించేసుకుంది వింధ్య.
అతని కళ్ళల్లో సంతృప్తి కనిపిస్తోంది.

 ఎలా వంగిపోవడం? గూనిదాని లాగా ఇంకా కొంచెం దేహాన్ని వంచిది. తలని ఇంకా కిందకి వంచింది. నేల తప్ప ఏమీ కనిపించడం లేదు. సిగరెట్ కాలి కింద వేసి నలిపి సినిమా హాల్లోకి నడిచాడు మణికంఠ. అతడి వెనకాలే తలవంచుకొని థియేటర్ లోకి వెళ్ళింది వింధ్య.

 నాలుగు రోజులు గడిచాయి. ఆ రోజు ఒకటో తారీఖు. ఇంట్లో ఖర్చులకని వింధ్యకు డబ్బులు ఇచ్చాడు మణికంఠ. జాగ్రత్తగా బీరువాలో పెట్టింది. అతడు ప్రసన్నంగా ఉన్నాడారోజు.

"రేపు మీరు త్వరగా వస్తారా!"గారాబంగా అడిగింది వింధ్య.

 "ఎందుకూ?"

 పుస్తకాల షాపుకు వెళ్లివద్దాం!పుస్తకాలేమన్నా కొనుక్కుంటా!"

 మణికంఠ మొహం మారిపోయింది.

 "అవి చదివి తెచ్చుకునే జ్ఞానం ఏమీ ఉండదు!..డబ్బులు దండగ!.ఇంట్లో టీవీ ఉందిగా చూసుకో! "

 మాట్లాడలేదు వింధ్య.
 ఆ తర్వాత పుస్తకాల ఊసెత్తలేదు.
 ఓ పదిరోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం. భోజనం చేసి సరదాగా టి. వి. చూస్తున్నాడు మణికంఠ. ఏదో హిందీసినిమా వస్తోంది.వంటిల్లు సర్దుతోంది వింధ్య.

 "నువ్వుకూడా రా వింధ్యా!!మంచి సినిమా!" నవ్వుతూ పిలిచాడు మణికంఠ.

 'ఈ పూట మూడ్ కాస్త బాగుంది!'అనుకొంది వింధ్య.
 వచ్చి అతడి ప్రక్కన కూర్చుంది. భార్య భుజంచుట్టూ చెయ్యివేసి దగ్గరికి తీసికొన్నాడు.

 "మీతో ఒక విషయం చెప్పనా!" అంది వింధ్య గోముగా.
 'ఏమిటన్నట్లు 'భార్యవైపు చూశాడతడు.

 "రేడియో స్టేషన్ లో పాట పాడాలని ఉంది నాకు!...కాలేజీ ప్రోగ్రామ్సులో నాకు సింగింగ్ లో చాలా ప్రైజులు వచ్చాయి!..రేడియో స్టేషన్ కి వెళ్లి నాకు అవకాశం ఇస్తారేమో కనుక్కోనా!"

మెల్లగా అడిగింది వింధ్య. మణికంఠ మొహం జేవురించింది.వింధ్యను పక్కకు నెట్టాడు.

 "నీకు దిక్కుమాలిన ఆలోచనలు ఎందుకు వస్తాయో నాకు అర్థం కావటం లేదు!. కాలేజీలో ఉన్నట్లు పెళ్లయ్యాక ఎవ్వరూ ఉండరు! పెళ్లయ్యాక మొగుడికి అనుగుణంగా నడుచుకోమని మీ అమ్మా నాన్నా చెప్పలేదా నీకు?" మౌనంగా ఉంది వింధ్య.

ఆ రోజంతా రుసరుసలాడుతున్నాడు మణికంఠ. వింధ్యకు భర్త మనస్తత్వం కొద్దికొద్దిగా అర్థమవుతోంది.

 సంక్రాంతి పండగ వచ్చింది. పెళ్లయ్యాక మొదటి పండగ. అల్లుడిని కూతురుని పండక్కు రమ్మని ఫోన్ చేశాడు వింధ్య తండ్రి శ్రీనివాసరావు.

 "నాకు కుదరదు!నువ్వెళ్లు!"అన్నాడు మణికంఠ.

 'ఇంకా కోపం తగ్గలేదు 'అనుకుంటూ నెల్లూరుకు వచ్చింది వింధ్య.

 వింధ్య తండ్రి శ్రీనివాస రావు,తల్లి రజిని. వాళ్లకు ఇద్దరు ఆడపిల్లలు.ఆర్య, వింధ్య. ఆర్య ఇంజనీరింగ్ చదివి వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకొంది. వింధ్య బి. ఎ. చదువుతూ ఉంది. బి.ఎ ఆఖరి సంవత్సరం పెళ్లి సంబంధాలు వెదకటం మొదలు పెడితే ఎమ్. ఎ.పూర్తి అయ్యేసరికి ఈ సంబంధం కుదిరింది. మణికంఠ తల్లి తండ్రులు మోపిదేవిలో ఉంటారు.అక్కడ వాళ్లకు ఓ పది ఎకరాల పొలం పొలం ఉంది.మణికంఠ అన్నయ్య అక్కడే ఉండి వ్యవసాయం చేస్తున్నాడు.మణికంఠ విజయవాడ ఎలక్ట్రిసిటీ ఆఫీసులో క్లర్కు ఉద్యోగం.పోరూ, పొచ్చెం లేని సంబంధం అనీ, కట్నం కాస్త తక్కువ అడిగారని ఈ సంబంధం వైపు మొగ్గు చూపారు శ్రీనివాసరావు దంపతులు. తీరా మాటల్లోకి వచ్చాక కట్నం తక్కువ అంటూనే పెళ్లి బాగా చేయాలని, లాంఛనాలంటూ సాగదీశారు మణికంఠవైపు వాళ్ళు.ఈ కాలంలో అందరూ ఇంజనీరింగ్ చదివిన అమ్మాయిలే కావాలంటున్నారు.వింధ్యకు లిటరేచర్ అంటే ఇష్టం.అమ్మాయి ఎమ్మే చదువుతోంది అంటే అంతగా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించటం లేదు. కారణం ఇంజనీరు అయితే భర్తతో పాటు ఎక్కడికి వెళ్లినా చిన్నదో పెద్దదో సాఫ్ట్ వేర్ జాబ్ వస్తుంది. ఎమ్మే చదివితే ఇప్పుడు ఏం ఉద్యోగాలు వస్తున్నాయి?.. గవర్నమెంట్ ఉద్యోగాలకు పోటీ ఎక్కువ!..అన్ని చోట్లా వేకెన్సీలు ఉండవు!మన దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకూ ఎక్కువవుతోందే తప్ప తగ్గటం లేదు. పోనీ విదేశాల్లో ఆర్ట్స్ చదివిన వాళ్లకు జాబ్స్ వస్తున్నాయా అంటే అదీ లేదు.. ఉత్సాహం లేదు యువతలో. ఆశనిరాశల మధ్య కొట్టుకులాడుతోంది వింధ్య మనసు. అలాంటప్పుడు ఈ సంబంధం వచ్చింది. పిల్ల కంటే పెళ్లి కొడుకు పిసరంత పొడుగు.. దూరం నుండి చూస్తే అతడే పొట్టివాడిగా కనిపిస్తాడు.అది పెద్ద లెక్కపెట్టుకోవలసిన విషయం కాదు అనుకున్నారు శ్రీనివాస్ దంపతులు.
 'అక్క పెళ్లి విషయంలో అమ్మా నాన్న కొంత బాధ అనుభవించారు.. తన పెళ్లయినా అమ్మా నాన్నల ఇష్టప్రకారం చేసుకుందా' మనుకొంది వింధ్య.

 చిన్నప్పటి నుండి వింధ్య కొంత భయస్తురాలు. అమ్మ చాటుపిల్ల. గట్టిగా మాట్లాడే పిల్లకాదు. చప్పున స్వంత నిర్ణయాలు తీసికోవాలంటే భయం. అలాంటి వింధ్యకు భయపెట్టి, దాష్టికం చేసే మొగుడు దొరికాడు. పెళ్లయిన రెండురోజుల్లోనే వింధ్య మెత్తటి, మేకపిల్లలాంటి పిల్ల అని మణికంఠకు అర్థం అయింది. ఇంక అతడిలో దాక్కుని ఉన్న మృగం మెల్లగా లేచి ఒళ్ళువిరుచుకోసాగింది. పైగా అతడికి ఉన్న స్నేహబృందం సంసారపక్షమైన వాళ్ళు కాకపోవటం... "ఒరేయ్!జాగ్రత్తరా!ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకున్నావనుకో నిన్ను ఆడించిపారేస్తుంది!.. పెళ్లయ్యాక భార్యని కాస్త అదుపాజ్ఞల్లో పెట్టుకో!కొత్త మోజులో కాస్త చనువిచ్చామనుకో మన బతుకుల్ని నాశనం చేస్తార్రా ఈ ఆడవాళ్లు!.. కొంచెం జాగ్రత్త!"అంటూ పదే పదే స్నేహబృందం హెచ్చరించటంతో మణికంఠ భార్యపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడు.

వింధ్య అసలే బెదురుగొడ్డు. అతడు కోపంగా ఉంటే భయపడిపోతోంది. 'పెళ్లయిన రెండు నెలలకే మొగుడుతో పడలేదని వస్తే అమ్మానాన్న ఎంతో బాధపడతారు...తను అతడితో ఎంతవరకు సర్దుకుపోగలదు?...'అనుకుంటూ స్నేహితురాలు సుకన్య ఇంటికి వెళ్ళింది వింధ్య. సుకన్య ఎమ్మేలో వింధ్య క్లాసుమేటు.ఇప్పుడు లెక్చరర్ గా జాబ్ చేస్తోంది. ఆమెకు కూడా పెద్దవాళ్ళు ఇప్పుడిప్పుడే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

 "ప్రతి దానికి ఆంక్షలు పెడతాడు!... కోపమూ,సాధింపూ..ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదు!.. విడిపోదామంటే అదికూడా భయంగానే ఉంది!..ఏం చేయను?"అంటూ సుకన్యతో మణికంఠ ప్రవర్తన అంతా చెప్పి బాధపడింది వింధ్య.

 "మొదట నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోవే!మరీ గొర్రెపిల్ల లాగా ఉంటే వాడు అలాగే చేస్తాడు! విజయవాడలో వేకెన్సీలు ఉన్నాయని నోటిఫికేషన్ వచ్చింది. ఉద్యోగం కోసం వెంటనే అప్లయి చెయ్!అతడి సలహా అడగకు!..ముందు ఉద్యోగం సంపాదించుకో! అవతలివాడు మనల్ని డామినేట్ చేస్తున్నాడంటే వాడిలో ఉండే దుష్టత్వం కంటే మనలో ఉండే వ్యక్తిత్వ లోపం అనుకోవాలి!..మన వ్యక్తిత్వాన్ని మనం నిలబెట్టుకుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు!పద!మా రాధా ఆంటీ దగ్గరకు వెళదాం!ఆవిడ పెళ్లయిన జంటలకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది. సంసారం చెడగొట్టుకునే దాకా నీ మొగుడు వస్తే అప్పుడు విడాకులు, విడిపోవటాలు ఉండనే ఉన్నాయి!నువ్వు ఏమీ బేంబేలు పడకు!"అంటూ ధైర్యం చెప్పింది సుకన్య.

 ఇద్దరూ కలిసి సుకన్య ఆంటీ రాధ దగ్గరికి వెళ్లారు. రాధ వింధ్యకు ధైర్యం నూరిపోసింది. ఉన్న పదిరోజుల్లో రాధ కౌన్సిలింగ్ వలన వింధ్యకు కొంత ధైర్యం వచ్చింది.వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవటం, అలాంటి వీడియోలు చూడటం చేస్తూ తనలో తాను ధైర్యాన్ని నింపుకొంటోంది వింధ్య. లెక్చరర్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టింది.విజయవాడలో ఇంటర్వ్యూ. విజయవాడకు వచ్చింది వింధ్య. మణికంఠ ఆఫీసుకు వెళ్ళాడు. ఇంటర్వ్యూ కి వెళ్ళింది వింధ్య.వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరంగా జవాబులు చెప్పింది. వస్తూ వస్తూ రేడియో స్టేషన్ కి వెళ్లి పాట పాడడానికి తనకు ఏమన్నా అవకాశం ఇస్తారేమో అని కనుక్కొంది. 'పాట పాడాలంటే ఆడిషన్ ఉంటుందని, దానికి పిలుస్తా'మని వింధ్య పేరును రిజిస్టర్ చేసుకొన్నాడు రేడియో స్టేషన్ మేనేజర్. అక్కడినుండి ఏలూరు రోడ్డు లోని పుస్తకాల షాపులకు వెళ్లి కావలసిన పుస్తకాలు కొని తెచ్చుకుంది. వింధ్యకు ఆనందంగా ఉంది. ధైర్యంగా కూడా ఉంది. నెలరోజులు గడిచాయి. రేడియో స్టేషన్ వాళ్ళు పెట్టిన ఆడిషన్ లో సెలెక్ట్ అయింది వింధ్య. ఆమెకు శారదా కాలేజీలో లెక్చరర్ గా జాబ్ వచ్చింది. ఉత్సాహంగా ఉంది.వెంటనే ఫోన్ చేసి సుకన్యకు, రాధకు, అమ్మా నాన్నకు చెప్పింది. సాయంత్రం భర్తతో చెబుదామనుకుంది.
 ఈ లోపల మణికంఠ ఫోన్ చేశాడు. " త్వరగా వస్తున్నా!ఊర్వశిలో పిక్చర్ కు వెళ్దాం!"అన్నాడు.

తయారైంది వింధ్య. మణికంఠ వచ్చాడు. బైక్ దిగి తన పక్కన నడుస్తున్న భార్యను చూశాడు. మొహం చిట్లించాడు.

 "ఆ హైహిల్స్ ఏమిటి? నీకు చెప్పాను కదా!నాకంటే పొడుగ్గా కనిపించొద్దని!.. చెప్పులు తీసేసి నడు!"అతని కంఠంలో కోపం.. అసహనం.

 తాపీగా మొగుడి వైపు చూసింది వింధ్య.

 "చెప్పారు!వంగివంగి నడవమనేగా!నేను నడవను!నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను! హై హీల్స్ వేసుకుంటాను!..రేడియో స్టేషన్ లో పాట పాడతాను! శారదా కాలేజీలో జూబ్ కూడా చేస్తాను!తెలుగు ఇంగ్లీషు పుస్తకాలు కూడా చదువుతాను!మీకు ఇష్టం లేదా?... చెప్పండి! ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను!...మీరు మీలాగా ఎలా ఉండాలనుకుంటారో!నాకు నాలాగా ఉండడం ఇష్టం!సంసారం అన్నాక ఇద్దరూ కలిసి అన్యోన్యంగా గడపటం!...నేను ఏమీ తప్పు చేయట్లేదు!.. మీరు నాకు విలువ ఇవ్వనప్పుడు నేను మీకెలా విలువ ఇస్తాను?..ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు.. హాయిగా సంసారాలు చేసుకుంటున్నారు....నేను కూడా అలాగే ఉంటాను!" స్థిరంగా చెప్పింది వింధ్య.

 ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాడు మణికంఠ. పొట్టివాడు ఇంకా పొట్టిగా మరుగుజ్జులాగా అయిపోయాడు.

 " మీరు నాతో సవ్యంగా ఉంటే నేను కూడా బాగానే ఉంటాను! మీ సాధింపులు, బెదిరింపులు పడుతూ ఉండడం ఇంక నావల్ల కాదు!.. చెప్పండి!నేను ఇంటికి వెళ్ళిపోతాను!ఆ తర్వాత ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోతాను! నేను పోతే ఇంకో భార్య వస్తుంది అనుకోవద్దు!..కాలం మారింది!దాష్టికాలు పడడానికి నేనే కాదు ఏ ఆడపిల్ల సిద్ధంగా లేదు!. అది తెలుసుకోండి ముందు!"

 కుంచించుకుపోయి వింటున్నాడు మణికంఠ.అతడినే చూస్తోంది వింధ్య.

 ఒకటి.....రెండు.....మూడు....నిమిషాలు గడుస్తున్నాయి. "పద!"అన్నాడు మణికంఠ. అతని గొంతు బొంగురుగా బలహీనంగా ఉంది. 'సర్దుకుపోతాను!' అన్నట్లుగా ఉంది. ఇంకేమీ రెట్టించకుండా భర్త చేయి పట్టుకొని సినిమాహాలు లోపలికి నడిచింది వింధ్య. (సమాప్తం.)


Rate this content
Log in

Similar telugu story from Inspirational